ఇంట్లో పెళ్ళి సందడి.
ఎవరి హడావుడిలో వారున్నారు.
బాగా అలిసిపోయి టేప్ రికార్డర్ దగ్గరకు వచ్చి కూర్చున్నా.
ఓపిక లేకపోయినా అప్రయత్నంగా బటన్ నొక్కాను.
మొదలైంది బాలూ స్వరధుని!
మొదట మెల్లగా చల్లగాలిలా మనసును తాకింది. ఆపై అంతులేని మాధుర్యం సుగంధంలా చుట్టుముట్టింది.
ఆ గంధర్వ గానం ఆస్వాదిస్తున్న నాకు గమ్మత్తుగా అలసట ఎప్పుడు మాయమయిందో కూడా తెలియలేదు.
ఎంత అబ్బురంగా... ఆహ్లాదంగా అన్పించిందో చెప్పలేను!
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానిది గంధర్వ గానమంటే ఆమోదించనివారు ఎవరూ ఉండరనుకుంటాను.
ఇవ్వాళ (గురువారం ) బాలూ బర్త్ డే !
ఆయన పాటల్లో అత్యద్భుతమైనవి మాత్రమే ఎంచుదామని ప్రయత్నిస్తే.. ఆ జాబితా చాలా పెద్దదే అవుతుంది. బాలూ ఆణిముత్యాలసరాల సరాగాల సంగతులను కనీసంగా వివరించటానికైనా ఎన్ని పేజీలూ చాలవు.
ఘంటసాల కాలంలో లేత కోయిల్లాగా అమాయకత్వం నిండిన గొంతు.. ఆ తర్వాత పరిణతిని సంతరించుకుంటూ ఎన్నెన్ని పోకడలు పోయింది !
ఆ అపురూప స్వరం ఇళయరాజా యుగానికి ముందే సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది. తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసింది.
వైవిధ్యమైన భావాలనెన్నో అలవోకగా తన గళంలో పలికించే బాలూ శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. స్వరాలో, మూర్ఛనలో సాధికారికంగా పలికించలేకపోవచ్చు.
కానీ అపురూపమైన ఆ గొంతు నుంచి అమృతోపమానంగా జాలువారిన సోలోలూ, యుగళ గీతాలూ, బహు గళ బహుళ గీతాలూ వెల కట్టలేనివి కదా?
పాటల పోటీల్లో ‘మామా ... చంద మామా...’ అంటూ బాలూని అనుకరిస్తూ, చరణం దాకా రాకుండానే పల్లవి ఆలాపనతోనే న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకొని, ప్రైజులు కొట్టేసినవారెందరో.
బాలూ పాడిన పాటల్లో విభిన్నంగా అన్పించిన కొన్ని మంచి పాటలను గుర్తు చేస్తాను.
‘ఆలాపన’ సినిమాలో ‘ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో... ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాలా...’ పాట ఎంతో బావుంటుంది. ఈ పాట చిత్రీకరణ ప్రత్యేకతను ఇక్కడ చెప్పటం లేదు. బాలూ గొంతు కాస్త జలుబు చేసినట్టుగా వైవిధ్యంగా తోస్తుంది. కానీ మాధుర్యం తగ్గదు.
ఈ పాట... ఆ తర్వాత వచ్చిన ‘గీతాంజలి’లోని ‘ఆమనీ పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళా…’ కు మాతృకలా ఉంటుంది. ఈ రెండో పాటే బాగా పాప్యులర్ అయింది. కానీ - ‘ఆవేశమంతా ...’ పాటకే ఎక్కువ మార్కులు వేస్తాను. రెంటికీ ఇళయరాజాయే స్వరకర్త.
‘పరిమళించు వెన్నెల నీవే...’ పాట తెలుసా? ఈ 'సాకీ' తర్వాత వచ్చే పల్లవే అందరూ గుర్తు పడతారు. అది - ‘కనుల ముందు నీవుంటే కవిత పొంగిపారదా? ’ . చెల్లెలి కాపురం సినిమాలో పాట. నాకు బాగా ఇష్టం. కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటలో బాలు గొంతు ప్రత్యేకంగా విన్పిస్తుంది.
‘నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా...’ (ముద్దమందారం- రమేష్ నాయుడు ) పాటలో బాలూ స్వరాన్ని స్మరించుకోండి. ఎలా ఉంటుందో గుర్తొచ్చిందా?
అదే సినిమాలో ‘అలివేణీ... ఆణిముత్యమా..’ పాటలో టీనేజ్ యువకుడి గొంతు ఛాయలు కథానుగుణంగా విన్పించటం ఆశ్చర్యంగా అన్పిస్తుంది.
‘మధు మాస వేళలో... మరుమల్లె తోటలో ’ (అందమె ఆనందం - సత్యం ) ప్రస్తావించకుండా ఉండటం కష్టం. ఎంతో హాయిగా... స్వేచ్ఛగా... శ్రావ్యంగా సాగే పాట ఇది.
‘బలిపీఠం’లో దేవులపల్లి గీతం ‘కుశలమా..... కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేకా ఎదో ఎదో రాశానూ అంతే అంతే అంతే . ... ’ వింటే తెలియని ఆనందం నిలువెల్లా ఆవరిస్తుంది. చక్రవర్తి స్వరకల్పన. పల్లవిలోని భావానికి తన గళంతో భాష్యం చెప్పే బాలూ స్వరం, అంతే... అనే పదం దగ్గర క్లుప్తంగా పలకరించి, పులకరింపజేసే వేణు గానం ఈ పాటకు అమూల్య అలంకారాలు.
‘మాయా మశ్చీంద్ర’ సినిమాలో ‘ప్రణయ రాగ వాహినీ... చెలీ వసంత మోహినీ... మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామినీ’ పాట ఎంత బావుంటుందో కదా? ఈ యుగళ గీతంలో ‘మలయ పవన మాలికలు... ’అనే చరణంలో 'పదునారు కళలా పరువాల సిరులా పసిడి బొమ్మవు నీవనీ' అంటూ సాగే బాలూ గానం సూదంటు రాయిలా ఆకర్షించదూ?
‘పడమటి సంధ్యారాగం ’ సినిమాకి బాలూయే మ్యూజిక్ ఇచ్చింది. ‘పిబరే రామరసం’ కీర్తనను బాలూ ఎంత హృద్యంగా ఆలపిస్తాడో గుర్తు చేసుకోండి.
ఎన్ని పాటలు... ఎన్ని ఆపాత మధురాలు... ఎన్ని శ్రవణ సుభగాలు....
ఇక ఈ పాటల తోటలో స్వరాలతో చెట్టాపట్టాలేసుకొని నడుస్తూ ఉంటే మళ్ళీ బాలూ బర్త్ డే వచ్చేసినా రావొచ్చు. అందుకని-
‘పల్లవించవా నా గొంతులో... పల్లవి కావా నా పాటలో...’ (కోకిలమ్మ) అంటూ బాలూనే కోరుకుంటూ ముగిస్తాను!