సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

16, జూన్ 2009, మంగళవారం

‘బ్రతుకంతా... ప్రతి నిమిషం...’

‘కళాత్మకంగా జీవించటం ఎలా ?’ అనే సందేహం ఎలా ప్రవేశించిందో కానీ ఇది ఈ మధ్య నా ఆలోచనల్లో భాగమైపోయింది.

‘‘బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి’’ అనీ, ‘‘బ్రతుకంత సాగాలి పూలబాట’’ అనీ ఎవరైనా ఆశిస్తుంటారు. ‘‘బ్రతుకంత బాధగా... కలలోని గాథగా ’’ ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?

సంతోషంగా కాలం గడిపేస్తుంటే అది కళాత్మక జీవితం అయిపోతుందా? ఈ సంతోషం విషయంలో కూడా మనిషి మనిషికీ తేడాలుంటాయి కదా!


ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ వచ్చిన వార్త ఎందరికో పండగలా ఉంటే ... నాకు ఆ రెహమాన్ ను చాలా చిన్నపుడే రమేష్ నాయుడు గుర్తించి తన టీమ్ లో అవకాశం ఇచ్చాడనే విషయం సంతోషాన్నిస్తుంది. నాకు ‘చిత్రా’ బొమ్మలూ, చిత్త ప్రసాద్ బొమ్మలూ చాలా ఇష్టమైతే మీకు ‘శంకర్’ గీసే రేఖలూ, రవివర్మ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలూ ప్రాణం అయివుండొచ్చు. నాకు చదరంగమే ప్రపంచమయితే...మీకు క్రికెట్టే లోకమై ఉండొచ్చు.


ఇష్టమైన పుస్తకాన్ని చదవటం లో ‘కిక్’ నాకు మరెందులోనూ కన్పించదు. శ్రావ్యమైన పాటను ఆస్వాదిస్తుంటే అలసట మటుమాయమై ‘‘ఆనందం అర్ణవ’’మవుతుంది. సూక్ష్మాంశాలు లిఖించిన చిత్రకళను వీక్షించినపుడు నా సంబరం అంబరానికి ఎగసిపోతుంది.


అంటే... ఇష్టమైన కళలు సంతోషాన్ని ఇస్తాయనే కదా? వీటిని ఆస్వాదించటంలోనే కాదు; వాటి గురించి కళాభిరుచి ఉన్న స్నేహితులతో ఆలోచనలు పంచుకోవటంలో కూడా ఆనందం ఉంది.


కళారాధనకు... నేపథ్యం చాలా ముఖ్యమనిపిస్తుంది. రణగొణ ధ్వనుల్లో, గందరగోళంలో ఏ కళనూ ఆహ్లాదించలేము. ప్రశాంతత ముఖ్యం. బాహ్యంగానే కాదు.... మన అంతరంగం కూడా కళాస్వాదనకు అనుకూలంగా ఉండాలి. ఆందో్ళనలు చుట్టుముట్టినప్పుడో, అర్జెంటు పనులు హడావుడి పెడుతున్నపుడో కళకు స్థానం ఇవ్వటం కష్టమే.


సరే, పరిసరాలు ప్రశాంతం. మనసూ శాంతంగానే ఉంది. ఇప్పుడు ఏదైనా సంగీతం హాయిగా వీనులకు విందు చేస్తుందా? కానీ... కళ సున్నితమైంది కదా? మీరు మిట్టమధ్యాహ్నం మండుటెండలో కళను అనుభూతి చెందుదామంటే... మీ అంత భావుకత లేని కళ ... కళవెళ పడే ప్రమాదముంది. అందుకే తొలి సంధ్యకు ముందో, మలి సంధ్యకు తర్వాతో బెటర్.


ఇంతకీ కళాత్మక జీవితమంటే... ‘‘గానం ధ్యానం హాసం లాసం’’ మాత్రమేనా? లలిత కళలను తలపోసుకుంటూ మైమరిచిపోవటమేనా? కళామయ జగత్తులో స్వైర విహారం చేయటమేనా?


కళాత్మక జీవితమంటే అందంగా, ఆహ్లాదంగా జీవించటమని నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అర్థవంతంగా జీవనాన్ని కొనసాగించటం.

* * *

‘‘ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ విరివిగా ఉన్న’’ ఈ లోకంలో ‘‘లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యలు’’!

వీటికి మూలం ఏమిటో గ్రహించటం ప్రధానమైన విషయమే.

అసలీ అసమానతల సమాజంలో కళాత్మకంగా జీవించటం కేవలం ఆదర్శమనీ, ఒకరకంగా ఇది హాస్యాస్పద విషయమనీ అనిపిస్తుంది.

కానీ... కళలను ప్రేమించేవారు వీలున్నంతవరకైనా వాటిని తమ దైనందిన జీవితంలో నిలుపుకోవటం కష్టమేమీ కాదు.

మీకు ఇంకా సందేహంగానే ఉంది కదూ?

చెత్త చలన చిత్రాలు చూడ్డానికి లేటెస్ట్ ఫ్యాషన్ల డ్రెస్సులతో ముస్తాబై వెళ్తుంటాం కదా... (వెళ్ళి, తిట్టుకుంటూనే, విమర్శిస్తూనే అదే పని పదే పదే చేస్తుంటాం ).
దానికి బదులు చక్కని సంగీతం వింటే బావుండదా? మనసుకు నచ్చిన పాటలను ప్రాక్టీసు చేసుకోకూడదా? పోనీ, ఇష్టమైన పనికి ఆ సమయం మిగుల్చుకోవచ్చేమో !

గాసిప్స్ తో ‘టైమ్ పాస్’ చేసేబదులు ‘‘మౌనానికీ, ధ్యానానికీ, కార్యాలకీ , విజయాలకీ’’ ఆ వ్యవధిని కేటాయించవచ్చునే !

ఇంటిల్లపాదీ గంటల తరబడి టీవీకి అతుక్కుపోయి దుర్భర నృత్య విన్యాసాలు చూస్తూ కళానురక్తిని సంతృప్తి పరుచుకుంటున్నవేళ....

అదే ఇంటి డాబా మీదకు పాకిన సన్నజాజి తీగలపై, అర విరిసిన పూలపై జలజల కురిసే వెన్నెల ఎలా వ్యర్థమవుతోందో ఎంతమందికి అర్థమవుతుంది?

కానీ... జీవితాన్ని రసభరితం చేసుకునే కళ అప్రయత్నంగానే సిద్ధించి, సహజంగానే దాన్ని ఆచరించేవారు మనచుట్టూ లేకపోలేదు.

ఓ దృశ్యం ఊహించుకోండి.

కొబ్బరాకుల నీడల వెనక... నింగి నుంచి చందమామ తొంగి చూస్తూ ఉండే నిశీధి వేళ !

ఆ వెన్నెల్లో ఇద్దరమ్మాయిలు.
వారిలో ఒకరు హిందో్ళంలో ‘సామజ వర గమనా’ పాడుతుంటారు. రెండో ఆమె ఆ గాన మాధుర్యానికి చెవులప్పగించి ఆ పాట రాగచ్ఛాయల్లో స్వరకల్పన చేసిన పాటలేమున్నాయో స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటుంది. విసురుగా విచ్చేసిన చల్లగాలి ఆ స్వరాభిషేకానికి అంతరాయం కలిగించలేనట్టుగా మెల్లగా వీచి, అక్కణ్నుంచి వదల్లేక వదల్లేక సాగిపోతుంటుంది. కురిసే మెరిసే వెన్నెల... ఆ వేళ... తాదాత్మ్యతతో పరవశించిపోతుంటుంది. ఆ కళాస్వాదన ఎంత సేపు సాగినా ప్రతి క్షణమూ అపురూపమే కదా?

ఇలాంటి కళాత్మక జీవన దృశ్యాలు ఎదురయితే సృజన వెల్లివిరియకుండా వుంటుందా?
చిత్రకారులైతే పంచవర్ణాల్లో కుంచె ముంచి అలాంటి ఘట్టాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయటానికీ, సాహితీ స్రష్టలైతే ‘అక్షరాలా’ చిరస్మరణీయం చేయటానికీ ఉత్సాహం చూపకుండా ఉండగలరా?

కళలు పరస్పరానురాగ బంధితాలు. అవి మనిషిని సున్నితంగా చేస్తాయి. మృదువుగా మలుస్తాయి.
వాటిని ‘ సృష్టించటమే కాదు, అందంగా ఆస్వాదించటమూ వరమే’ మరి.

ఇంతకీ... కళల ప్రమేయమేమీ లేకుండా కళాత్మక జీవితం ఉండదా?
అలాంటి జీవితానికి కళా సాధన, కళాస్వాదన అత్యవసరం కాదు కానీ, అవి కూడా ముఖ్యమేనని నా నమ్మకం.

సాటి మనిషి కష్టానికి చలించిపోవటం, నిరాశోపహతులకు బతుకుపై ఆశ పెంచగలగటం, చేయగలిగినంత సాయం చేయటం... కళాత్మకంగా జీవిస్తున్నట్టు కాదా?

బాల్యంలోని ‘స్నిగ్థత’నూ, స్వచ్ఛతనూ కోల్పోకుండా నాటి అమాయకత్వాన్ని పలవరించి, పరవశించగలిగే లక్షణం కళాత్మక జీవన పార్శ్వమే!

మన కారణంగా ఎవరూ సంతోషపడకపోయినా బాధ పడకూడదనే మనస్తత్వం, మనకు మేలు చేసినవారిని కలలో కూడా మర్చిపోకుండా కృతజ్ఞతతో స్మరించుకోవటం, ఇతరుల కష్టాలపై సహానుభూతి... ఇవి ఉన్నవారు ఎవరైనా
కళాత్మకంగానే జీవిస్తున్నట్టు !

మీరేం చెపుతారు మరి?




13 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ఎక్కడైనా ఆగి వేసుకోవలసిన ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకీ మీరెప్పుడైనా వేసుకున్నారా ఈ ప్రశ్న.."కళాత్మకంగా జీవిస్తున్నానా లేదా"అని?

మేధ చెప్పారు...

Very nice post...

>>వీటిని ఆస్వాదించటంలోనే కాదు; వాటి గురించి కళాభిరుచి ఉన్న స్నేహితులతో ఆలోచనలు పంచుకోవటంలో కూడా ఆనందం ఉంది.
Thats true..

మురళి చెప్పారు...

వేణు గారూ.. మంచి టపా.. అసందర్భం అనుకోక పొతే ఒక చిన్న ప్రశ్న.. వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ చదివారా? (చదివే ఉంటారని నమ్మకం) ..ఆ కథ గుర్తొచ్చింది మీ టపా చదువుతుంటే...

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగా రాశారు. మనిషి జీవితానికో అర్ధాన్నిస్తుంది కళ.

Kathi Mahesh Kumar చెప్పారు...

చాలా "లోతుగా" ఉంది.

వేణు చెప్పారు...

@ సుజాత గారు: మీ స్పందన చాలా సంతోషాన్నిస్తోంది. ధన్యవాదాలు.
@ neelaanchala గారు: ఈ ప్రశ్నను నేను వేసుకోవటం మొదలుపెట్టాకే ఈ టపా రాయాలనే ఆలోచన వచ్చిందండీ! ధన్యవాదాలు.

@ మేధ గారు: థాంక్యూ.
@ మురళి గారు: వంశీ కథ గుర్తొచ్చిందంటే... చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
@ కొత్త పాళీ గారు: మీ స్పందనకు ధన్యవాదాలు.
@ మహేష్ కుమార్ గారు: థాంక్యూలండీ.

భావన చెప్పారు...

ఏమంటాము మాటకు మించిన మౌనం తో అభివందనలు తెలపటం తప్ప. కొబ్బరాకు కొనలు సృష్టించే వేణు గానం, ఆ రాగానికి తలవూపే చిన్ని హృదయం కళ్ళముంది రమ్యం గా ఆవిష్కరించారు...

అజ్ఞాత చెప్పారు...

ముందుగా అభినందనలు చెబుతాం. ఇంత బాగా టపా వ్రాసినందుకు.
మీరు మల్లాది గారి అందమైన జీవితం చదివారా?
కొంతవరకు ఫాలో అవ్వవచ్చు.
నా దృష్టిలో కళాత్మక జీవితం అంటే మన మనసుకు నచ్చినట్టు జీవించడం.


మరొ సంగతి మీ బ్లాగు IE8 లో ఓపెన్ అవ్వటం లేదు.
అలాగే మరికొన్ని బ్లాగులు కూడా. ఎవరైనా పరిష్కారం చెప్తారా?

వేణు చెప్పారు...

@ భావన గారు: ధన్యవాదాలు.

@ bonagiri గారు: థాంక్యూ. నేను మల్లాది నవల చదవలేదండీ. బ్లాగు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో అప్పుడప్పడూ ఓపెనవ్వటం లేదని కొందరు మిత్రులు చెప్పారు. దీనికి పరిష్కారం ఏమిటో...

వేణు చెప్పారు...

బి.ఆర్.బాపూజీ గారి వ్యాఖ్య ఇది:(వ్యాఖ్య పోస్ట్ చేయటంలో సమస్య వచ్చి మెయిల్లో దీన్ని పంపారు)

Sorry for writing in Engish.
Did you intend to write this article like a Musing?
Chalam had discussed the same topic in one of his Musings: 'kaLakii jiivitaanikii sambandham eemiTani eppaTnicoo prasna...' He cites somepoet, 'To live artistically is the greatest art'

మీ స్పందన నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. నేను రాసింది- ఒక రకంగా మ్యూజింగ్ తరహాలోనే. నన్ను ప్రశ్నించుకోవటం, వచ్చిన ఆలోచన్లను రాయటం చేశాను. టపాలో శ్రీశ్రీ, తిలక్, చలం గార్ల వాక్యాలను ఎక్కువే ఉపయోగించుకున్నాను. (కొటేషన్లలో పెట్టాననుకోండీ).

చలం గారు ఈ టాపిక్ ను తన మ్యూజింగ్స్ లో చర్చించారని మీరు చెపితేనే తెలిసింది. ‘కళకీ జీవితానికీ సంబంధం ఏమిటని ఎప్పటినుంచో ప్రశ్న’ అంటూ రాశారన్నమాట.

మ్యూజింగ్స్ ను అసలు చదవకపోలేదు కానీ, మరీ చిన్నపుడే చదవటం వల్లనేమో సరిగా గుర్తు లేదు. అయితే మ్యూజింగ్స్ ను శ్రద్ధగా చదవాలి మరి!

Bolloju Baba చెప్పారు...

thought provoking
bollojubaba

sree చెప్పారు...

"TV badha bharinchekanna medameda padukovadam" .. polika chala bagundi.prati aksharam nijjamga nijam.
asalu living room lo TV manushula batukulni marchestondemo anipistund.TV dooram ga pettukuni music player living oom lo pettukunte kasta merugani svanubhavam.
manake kadu manintiki vachinavallaki kooda..mana intlo manam kanipstamu chandrababo rosayyo kakunda..