సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, జులై 2009, శనివారం

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు!
‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున ఏం గుర్తుకొస్తాయి? నాకైతే... శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు.


వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని మే నెల మొదటివారంలో విజయవాడలో కలిశాను. (ఆయన్ను మొదటిసారి 2008అక్టోబర్లో కలిశాను). ఈసారి అభిమాన పాఠకునిగా మాత్రమే కాకుండా జర్నలిస్టుగా కలిశాను. ఎనిమిది దశాబ్దాల కాలం నాటి జ్ఞాపకాల్లోకి ఆయన్ను తీసుకువెళ్ళాను. ఆ అనుభవాలు తలపోసుకునేటప్పుడు ఆయన ముఖంలో ఎంత సంతోషమో! ‘కరుడు కట్టుకుపోయిన ఆ నాటి జ్ఞాపకాలు’ కరిగి, కదిలి అక్షర రూపంలోకి ప్రవహించాయి.

ఆ కథనం ఇవాళ- ‘ఈనాడు ఆదివారం’ 19జులై 2009సంచికలో వచ్చింది.


జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారి పేరు- చందమామ అభిమానుల్లోనే చాలామందికి తెలీదు. దీనికి కారణం- ధారావాహికల రచయిత పేరును ప్రచురించకుండా ‘చందమామ’ అని మాత్రమే ప్రచురించే ఆ పత్రిక సంప్రదాయమే. 1952లో చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా చేరారు సుబ్రహ్మణ్యం. అలా.. 2006వరకూ 54 సుదీర్ఘ సంవత్సరాలు చందమామ పత్రిక సేవలో తన జీవితాన్ని వెచ్చించారు.

పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు ఆయన! తోకచుక్కతో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో భల్లూక మాంత్రికుడు వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది.సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!
తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట - 1958

జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం - 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978


ఈనాడు ఆదివారంసంచికలో ప్రస్తావించని ఇంటర్వ్యూ భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను.


తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, 'I am over stay here!' అని సున్నితంగా జోక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. తన దశాబ్దాల స్మృతులను దశాబ్దాల నేస్తం సిగరెట్ ను వెలిగించి, ఆ పొగ రింగుల్లో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి నెమరువేసుకున్నారు. నా విజిటింగ్ కార్డు తీసుకుని, దాని వెనక ఆ రోజు తేదీని నోట్ చేసుకున్నారు. ‘మీరు ఎప్పుడు వచ్చారో దీన్ని చూస్తే తెలుస్తుంది’ అంటుంటే... ఆ శ్రద్ధకు ఆశ్చర్యమనిపించింది.

12 సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైనది?
 

   ఈ ప్రశ్న కాస్త ‘జటిల’మైనది. చంద   మామలో రాసిన ఆ పన్నెండు సీరియల్స్  24సంవత్సరాలపాటు వరసగా రాసినవి.  వాటిల్లో కొన్నిటి పేర్లు నాకు గుర్తు కూడా  లేవు. కొంచెం ఆలోచించి చూస్తే-  అన్నిటికన్నీ నాకు ఇష్టమైనవే  అనవలసివస్తుంది. చిత్రగుప్త, తెలుగు  స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, అభిసారిక... ఇలా కొన్ని పత్రికల్లో సాంఘిక కథలు రాశాను. అవీ, ఈ చందమామ సీరియల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే. ప్రత్యేకంగా బాగా ఇష్టమైనవంటూ ఏమీ లేవు.

కొ.కు. గారితో మీ అనుబంధం గురించి....

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారిది తెనాలి. శ్రీ చక్రపాణి గారిదీ తెనాలే. కొ.కు. గారితో నా అనుబంధం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇద్దరం అభ్యుదయ వాదులం. అనేక రాజకీయ, సామాజిక సమస్యల గురించి ఏకాభిప్రాయం కలవాళ్లం. ఆయన రాసిన చదువు, కాలభైరవుడు లాంటి రచనలు చదవడమే గాక, ఆయన గురించి లోగడ విన్నవాణ్ణి. కానీ ఆయనతో ముఖాముఖి పరిచయం 1955లో. చందమామ సంపాదకత్వం పనిని అప్పట్లోనే శ్రీ చక్రపాణి గారు కుటుంబరావు గార్కి ఒప్పగించారు. మొదటిసారి ఆఫీసులో ఆయనను కలిసినపుడు , ఆయనతోపాటు నేనున్న ఆఫీసు గదిలోకి ఎవరు వచ్చారో గుర్తులేదు. పరిచయ వాక్యాలు అయాక, కొ.కు. గారు ‘‘స్వతంత్ర, ఇతర పత్రికల్లో మీరు రాసిన కథలు చదివాను. అవి రాసింది తెనాలిలో మా కుటుంబాన్నెరిగిన దాసరి సుబ్రహ్మణ్యం ఏమో అనుకున్నాను. అయితే వ్యక్తిగా ఆయన్ని నేను చూడలేదు. ఏనాడో ఊరొదిలి పోయాడు’’, అన్నారు.

* * *

సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం విజయవాడలో తన అన్నయ్య కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు. ఆయనను సంప్రదించటానికి అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను.
దాసరి సుబ్రహ్మణ్యంc/o శ్రీమతి ఝాన్సీ
G-7వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్
దాసరి లింగయ్య వీధి
మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్- 0866 6536677

* * *


ఇంతకీ... కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన సుబ్రహ్మణ్యం గారు- హేతువాదీ, నాస్తికుడూ!

ఆయన పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు హేతువాదిగా చాలా ప్రసిద్ధుడే. ‘‘మా పెద్దన్నయ్య శ్రీ ఈశ్వరప్రభు దగ్గిర చాలా పురాతన సాహిత్యం ఉండేది. ఆ గ్రంథాలు పనిగట్టుకొని చదివాను. నేను అన్నలూ, అక్కయ్యలూ గల కుటుంబంలో అందరికన్నా చిన్నవాణ్ణి; ఆఖరివాణ్ణి. పది సంవత్సరాల వయసులోపలే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాణ్ణి గనక పెద్దన్నయ్యా, వదినెల దగ్గిర పెరిగాను, వాళ్ళు నాకు చిన్నమెత్తు పని చెప్పకపోగా, చదువుకో, స్కూలుకు పో అని బలవంతపెట్టేవాళ్ళు కాదు. అలా పెరిగాను’’ అని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్యం గారు- తన అన్నగారి గురించీ, బాల్యం గురించీ!


ఈ జానపద ధారావాహికల గురించి చెప్పేటప్పుడు అపురూపమైన ఆ కథల్లోని వాతావరణాన్ని కళ్లముందుంచే అద్భుత వర్ణ ‘చిత్రా’లను తల్చుకోకుంటే అది అన్యాయమే!

ఆ విశేషాలు... మరో టపా రాసేంత ఉన్నాయి మరి!

13 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

ఎన్నో చిన్నప్పటి జ్ఞాపకాలను తట్టి లేపేలా ఉంది మీ టపా! అటువంటి మహా రచయితలను అప్పుడప్పుడూ ఇలా గుర్తు చేసుకోవడం మన బాధ్యత గా భావించాలి.

neelaanchala చెప్పారు...

నాకు ఇంత పాత సీరియల్స్ చదివిన అనుభవాలు లేవు. కానీ బ్లాగాగ్ని గారి బ్లాగులో చూశాక,. అవన్నీ డౌన్ లోడ్ చేసి చదివే పనిలో ఉన్నాను. ఆ సీరియల్స్ చదువుతుంటే ఈ హారీ పాటరు వగైరాలు అంతా ఏ పాటి అనిపిస్తోందండి! ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

ఉదయాన్నే ఈనాడు ఆదివారం లో చదివానండి.. ఆయన పాఠకుల్లో నేనూ ఒకడిని.. అన్నట్టు 'చిత్రా'ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ జాబితాలో నన్నూ చేర్చుకోండి...

Surya చెప్పారు...

It was very refreshing to read this blog. Good posts, which offer a peep into the literary vastness and greatness of Telugu. I will make time to read the posts, particularly those related to music, since I am a music aficionado.
Great going. Keep it up.

SIVA చెప్పారు...

వేణూ గారూ!

అద్భుతం అండీ. చాలా చక్కగా వ్రాశారు. నిజానికి మీరు ఈనాడు ఆదివారం అనుబంధంలో వ్రాసిన వ్యాసం , ముఖచిత్ర వ్యాసంగా వెయ్యవలసింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యంగారు దదాపు మూడు తరాల వారికి మంచి ఆసక్తికరమైన ధారావాహికలను, మంచి తెలుగులో అందించి, వాళ్ళకి తెలియకుండానే సొగసైన తెలుగు నేర్చుకునేట్లు చెసారు. వ్యాసాణ్ణి మరిన్ని వివరాలు, వారితో ఇంటర్వ్యూ కలిపి ఈనాడు ప్రధాన వ్యాసంగా వెయ్యవలసింది.

నాదొక కోరిక. మీరు ఇదేవిధంగా చిత్రాగారి గురించి, శంకర్ (వీరు మద్రాసులో ఉన్నారుట) గారి గురించి కూడ ఇటువంటి వ్యాసాలు వ్రాయాలని. దయచేసి అలోచించండి. ఈ కోరిక అఖిలభారత తెలుగు చందమామల అభిమాన సంఘం వాళ్ళు మీ చెవిన వెయ్యమన్నారు.

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు,భారత్

వేణు చెప్పారు...

సుజాత, మురళి, శివరామప్రసాద్ గార్లు : చందమామ ప్రధాన చిత్రకారుడు ‘చిత్రా’ గురించి వీలైనంత త్వరలోనే ఓ టపా రాస్తానండీ. మీ స్పందనకు ధన్యవాదాలు.

అజ్ఞాత, neelaanchala : ధన్యవాదాలు.

Surya : Thank You.

Chandamama చెప్పారు...

వేణుగారూ, మళ్లీ ఇలా కలుసుకుంటున్నాం. దాసరి సుబ్రహ్మణ్యంగారితో జూలై నెలలో చందమామ తరపున నేరుగా భేటీ కావాలని బాలసుబ్రహ్మణ్యం గారు (ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్), నేనూ అనుకున్నాము కానీ కుదరలేదు. చందమామ కథల మాంత్రికుడి వ్యక్తిగత పని మీద జూలై మొదట్లో బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే విజయవాడ వెళ్లి కలిసి వచ్చారు. ఆన్‌‍లైన్ చందమామకు ఆయనతో ముఖాముఖిని పరిచయం చేస్తే బాగుంటుందని అనుకున్నాం కాని ఈసారికి కుదరలేదు.

ఈ లోపలే గత ఆదివారం మలయమారుతంలా ఈనాడు అనుబంధంలో చందమామ కథల మాంత్రికుడితో మీ పరిచయం వచ్చేసింది. పని ఒత్తిడిలో ఉండి మీ బ్లాగు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నా. శివరామప్రసాదు గారన్నట్లు ఈనాడులో ఇది ప్రధాన వ్యాసంగా వచ్చి ఉంటే మరింత బాగుండేది.

చందమామ 60 ఏళ్ల సందర్భంగా ఈనాడులో చందమామపై, శంకర్‌గారిపై వచ్చిన వ్యాసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభ్యమవుతుంటే చెప్పగలరు. త్రివిక్రమ్ గారు వికీపీడియా వ్యాసం చివర ఇచ్చిన ఈనాడు వ్యాసం లింకు నా సిస్టమ్‌లో ఓపెన్ కాలేదు. చందమామ ఆఫీసులోని సిస్టమ్‌లలో కూడా అంతే. ఏమైందో తెలీదు. ఇది పెద్ద కొరవగా మారిపోయింది నాకు.

దాసరి సుబ్రహ్మణ్యం గారి కథా రచనానుభవాలను ఆయన స్వంత గొంతుకతోటే పలికించి రికార్డు చేయించే అవకాశం ఇక ఎవరికీ దక్కదేమో. ప్రశ్నను కాగితంలో రాసి ఇస్తే చదువుకుని ఆయన సమాధానం ఇస్తున్నారనేది నిజమే అయితే ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు కథకుడి స్వంత గొంతుక కూడా రేపటి తరాలకు అందే అవకాశం ఇక లేనట్లే కదా.

రచయితల ప్రత్యక్ష కథనాలను రికార్డు చేయడం జరగకపోతే, మరో 50 ఏళ్ల తర్వాత చందమామ కథల మాంత్రికుడి ఆనవాళ్లను కూడా తెలుగు జాతి మర్చిపోతుందేమో అని ఓ సందర్భంలో ఇటీవలే కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ గారి వద్ద (ప్రజాకళ.ఆర్గ్‌ లోని తన వ్యాసంపై) వ్యాఖ్యానిస్తే ఆయన నా అభిప్రాయంతో ఏకీభవించారు.

దాసరి సుబ్రహ్మణ్యం గారితో మీరు జరిపిన ఇంటర్వ్యూ వివరాలను ఒకవేళ రికార్డు చేసి ఉంటే నెట్‌లో ఆడియో రూపంలో పోస్ట్ చేయగలరు. లేదంటే నిజంగా 'దురదృష్టవంతులమే..'. పదాలు దొరక్క ఇలా అంటున్నాము కాని దురదృష్టం అనే కాన్సెప్ట్‌ను ఆయన అంగీకరించక పోవచ్చు కాబోలు.

ఏదైమైనా కాస్త ఆలస్యమైనా మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు. చందమామపై త్రివిక్రమ్, రోహిణీ ప్రసాద్, వేణు (మీరే) వంటి వారు రాసిన రచనలను, అనుభవాలను ఆన్‌లైన్ చందమామలో 'చందమామ చరిత్ర' విభాగంలో పోస్ట్ చేయాలని తలపెట్టిన మా ప్రయత్నం కొంత వాయిదా పడింది. బహుశా త్వరలోనే ఇది పరిష్కారం కావచ్చు.

చందమామ అభిమానులు, 'చంపి'లు తదితర పాఠకులు చందమామతో తమ అనుబంధం, జ్ఞాపకాలు వంటి వాటిని పంచుకోవడానికి వీలు కల్పిస్తూ ఇప్పటికే ఆన్‌లైన్ చందమామలో 'మా చందమామ జ్ఞాపకాలు' అనే కొత్త విభాగం తెరిచాము. చందమామతో మీ జ్ఞాపకాలను ఆన్‌లైన్ చందమామకు తప్పక పంపించగలరు. చందమామ అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

ఈలోపల నేను "బ్లాగు.కామ్/చందమామలు" పేరిట ఓ కొత్త బ్లాగును (చందమామ చరిత్ర) ఓపెన్ చేసుకుని త్రివిక్రమ్ ‌గారి చందమామ రచనలను టోకున కొల్లగొట్టి చిన్న చిన్న వ్యాసాలుగా పోస్ట్ చేసి ఉంచాను చూడండి. చందమామపై ఇంతవరకు వచ్చిన, వస్తున్న అన్ని అభిప్రాయాలను వీలయితే ఒకే చోట పేర్చి చందమామ పిచ్చోళ్లు అందరికీ అందివ్వాలనే ఆశ ఇలా నడిపించింది.

ఇంకా త్రివిక్రమ్ గారికి ఈ విషయం తెలుపలేదు. రేపే ఆయనతో మాట్ల్డాడాలి దీనికి కూడలి.ఆర్గ్‌ లో లింక్ ఇవ్వడంతో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది కూడా. చందమామపై రచనలు, అనుభవాలు పోస్ట్ చేసిన బ్లాగర్లందరూ ఇందుకు సమ్మతిస్తారనే ఆశిస్తున్నాను.

ఎంతమంది బ్లాగర్లు, అభిమానులు చందమామను ఇప్పటికీ హత్తుకుంటున్నారో మా యాజమాన్యానికి అర్థమైతే ఇక్కడ పొందుపర్చే రచనలు అన్నింటినీ నేరుగా ఆన్‌లైన్ చందమామలోనే ప్రచురించే అవకాశం వస్తుందని నా ఆశ.

చందమామ అభిమానులందరి ఈ మెయిల్ ఐడీలను పనిగట్టుకుని ఎవరైనా సేకరిస్తే బాగుంటుందేమో కదూ.

మళ్లీ పెద్దదయినట్లుంది.

అభినందనలతో..

రాజశేఖర రాజు.

వేణు చెప్పారు...

రాజశేఖర రాజు గారూ,
మీ స్పందనకు ధన్యవాదాలు!
చందమామ 60 ఏళ్ల సందర్భంగా ‘ఈనాడు’లో చందమామపై, శంకర్‌గారిపై వచ్చిన వ్యాసం ఆన్‌లైన్‌లో ఇప్పుడు దొరకటం కష్టం. దాన్ని స్కాన్ చేసి, మీకు మెయిల్ చేస్తాను.
‘ప్రజాసాహితి’ పత్రిక వారు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలను వివరంగా సేకరించటానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయటం వేరు.

దాసరి సుబ్రహ్మణ్యం గారితో జరిపిన ఇంటర్వ్యూ ను నేను ఆడియో గా రికార్డు చేయలేదు. ఆయన లిఖిత రూపంలోనే సమాధానాలు ఇచ్చారు కదా!

ఏ టీవీ ఛానల్ వారైనా సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేస్తే బావుంటుంది. ప్రశ్నను రాసి ఇస్తే... దాని చూసి, సమాధానం చెపుతారు కాబట్టి చక్కగా విజువల్, ఆడియో రూపంలో ఆయన అనుభవాలు రికార్డవుతాయి. టీవీ వాళ్ళకు అసలీ విషయం
ఏమైనా బోధపడుతుందా అని నా సందేహం!

Anwar చెప్పారు...

వొక రెండు సం క్రితం డిసెంబర్ చివర్లొ శ్రీ శంకర్ గారిని హైద్రాబాద్ తొడ్కొని వచ్చి ఆయన తొ 31 న గడిపి, తరువాతి రెండు రొజులు సైట్ సీయింగ్ లాంటిది ఏదైనా చేస్తే బావుంటుందని మా సీనియర్ లతొ సహ చిత్రకారులతొ మాట్ల్లడాను, అదొక్కటే కాదూ, అంతకు ముందు కూడా ఇల్లాంటి చాలా ఆలొచనలు చేసి వుంటిని. తప్పు ఎవరిదైనా కాని మా చిత్రకారుల వల్ల కానిది చందమామ అభిమానులు ఐనా పూనుకుని వారిని హైద్రాబాద్ రప్పించి పండుగ జరిపితే?

Chandamama చెప్పారు...

వేణు గారూ.
ధన్యవాదాలు.

మీ ప్రత్యుత్తరంలోని ప్రధాన విషయం గురించి కొంత... ఎలాగూ మీరు ఈనాడులోనే పనిచేస్తున్నారు కనుక.. ఈ టీవీ యాజమాన్యం వారి వద్దకు ఈ విషయం ఎలాగోలా తీసుకెళ్లి దాసరి సుబ్రహ్మణ్యం గారిపై వీలైనంత త్వరగా ఇంటర్వూ చేయిస్తే బాగుంటుందేమో.. 87 ఏళ్లు బతికి ఉన్నందుకు 'I am over stay here' అని సంజాయిషీ ఇచ్చుకున్నంత నమ్రతా మూర్తి ఆయన. ఆయనకేమీ జరగకముందే (?) ఈ టీవీ ఈ 'పుణ్యం' మూట కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదూ. పనికిమాలిన చెత్తలను ప్రసారం చెయ్యడానికి కోట్లు కోట్లు ఖర్చుపెడుతున్న ప్రసార వ్యవస్థ కనీసం ఇలాంటి అపరూప వ్యక్తుల చివరి జ్ఞాపకాలనయినా చరిత్రకు శాశ్వతంగా అందిస్తే ఎంత బాగుంటుందో.. సాహిత్యానికి కూడా ప్రాధాన్యమిచ్చి తెలుగు వెలుగు పేరిట ప్రసారాలు నిర్వహిస్తున్న ఈ టీవీకి దాసరి సుబ్రహ్మణ్యం గారి విలువ అర్థమయితే ఆయన ఇంటర్వ్యూని వదిలిపెట్టదనే నా ఉద్దేశం. ఇప్పటికే మీరు ఆయనతో టచ్‌లో ఉన్నారు కనుక ఈ టీవీ పూనుకుంటే మీరే ఆయనను టీవీ ప్రసారాలకు కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు.

మీకు సాధ్యపడినట్లయితే, మీ పరిధిలో ఈ అంశం ఇమడగలిగితే ప్రయత్నించి చూడండి. 'గుళ్లో పూజారిని వేడుకోవడం కంటే దేవుడికే నేరుగా విన్నపాలు చేసుకోవడం ఉత్తమంగా ఉంటుందటగా'. రామోజీరావుగారికి నేరుగా ఈ విషయం చెబితే ఫలితముంటుందా.. ఏమో..

అయినా.. జానా బెత్తెడు దుస్తుల ప్రదర్శనలే మార్కెట్‌కు పరమావధిగా మారుతున్న చోట ఇలాంటి మంచి కార్యక్రమాలను ఎవరు పట్టించుకుంటారు?

అందుకే..అనిపిస్తూంటూంది. కలలు కలల్లోనే అందంగా కనిపిస్తుంటాయి.

‘ప్రజాసాహితి’ పత్రిక వారు సుబ్రహ్మణ్యం గారి అనుభవాలను వివరంగా సేకరించటానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. చల్లటి విషయం చెప్పారు. ఈ మధ్యే ప్రజాసాహితికి చందా కట్టాను. ఈ పత్రికపై నాకున్న మంచి అభిప్రాయం మరింతగా పెరిగింది మీరు చెప్పింతర్వాత.

త్రివిక్రమ్ Trivikram చెప్పారు...

వేణు గారూ,

మీరు చంపి లందర్నీ ఆనందపరవశుల్ని చేశారు. రాజశేఖరరాజు గారి సూచన అవశ్యం పాటించదగ్గది.

వేణు చెప్పారు...

* అన్వర్ గారూ, శంకర్ గారిని హైదరాబాద్ పిలిపిస్తే బాగానే ఉంటుంది. చందమామ అభిమానులు ఆర్గనైజ్డ్ గా లేరు, మీ ఆర్టిస్టుల్లాగా. ‘మా చిత్రకారుల వల్ల కానిది’ అంటూ మీరు నిరాశపడకుండా మరోసారి ప్రయత్నించండి... కానీ దానికి డిసెంబర్ 31 లాంటి ముహూర్తాల కోసం అనవసరంగా ఎదురుచూడవద్దని నా సూచన.

* రాజశేఖర రాజు గారూ, ప్రింట్ మీడియా తీరు వేరు. టీవీ మీడియం Priorities వేరు. ఆ వీక్షకుల రేంజ్ వేరు. తీవ్రమైన పోటీ తత్వం. ప్రతి ప్రోగ్రాం భవితనూ రేటింగ్సూ, వాణిజ్య ప్రకటనలూ నిర్ణయించేస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం గారి గురించి ప్రోగ్రాం చేసి, తమ‘విలువైన’ సమయం ఏ టీవీ ఛానల్ వెచ్చించగలదో మరి... అయినా మీ సూచన మర్చిపోను. ధన్యవాదాలు!

* త్రివిక్రమ్ గారూ, మీ వ్యాఖ్య సంతోషకరం. ధన్యవాదాలు!