సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

6, ఆగస్టు 2009, గురువారం

మధుర స్వరాల ‘మధువొలకబోసిన’ వి. కుమార్!

‘చిత్ర తరంగిణి’ మొదలైతే చాలు... ఆకాశవాణి తరంగాల్లో తేలి వచ్చే ఆ పాట కోసం అప్రయత్నంగానే రోజూ ఎదురుచూసేవాణ్ణి. విజయవాడ రేడియో కేంద్రం వాళ్ళు నన్ను నిరాశపరిచేవారు కాదు.
తరచూ ఆ పాట ప్రసారం చేసి, నా నిరీక్షణ సార్థకం చేసేవాళ్ళు. అది కన్నవారి కలలు సినిమా లోని ‘మధువొలకబోసే... ఈ చిలిపి కళ్ళు...’ పాట!

పన్నెండేళ్ళ వయసులో .. నాటి నా బాల్యంతో పెనవేసుకునివున్న మధుర గీతమది.

మా ఇంటికి చాలాదూరంగా ఉండే మా ‘తోట’ లో పనిచేయటానికి ఉదయాన్నేవెళ్ళినపుడు పని మీద కంటే పక్కింట్లోంచి వినిపించే రేడియో పాటల మీదే ధ్యాస ఉండేది నాకు. దాదాపు ప్రతిరోజూ ఈ పాట హాయిగా పలకరిస్తూ ‘మధువొలికిస్తుంటే ’ నా చెవులప్పగించేసి తోట పని వదిలేసి, పాట పని పట్టించుకునేవాణ్ణి. మా అన్నయ్యల చీవాట్లు... పాట పూర్తయ్యేదాకా చెవులకెక్కేవే కాదు!


ఈ పాట చాలామందికి ఇష్టం. కానీ దీన్ని స్వరపరిచిందెవరంటే చెప్పగలిగేవాళ్ళు తక్కువమందే! ఎవరిదాకో ఎందుకూ? ఇంతగా ఈ పాటను ఇష్టపడ్డ నేను కూడా బాణీ కట్టిందెవరో సీరియస్ గా నిన్న మొన్నటి దాకా పట్టించుకోలేదు. ఆ సంగీత కర్త... వి.కుమార్ గారు.

కన్నవారి కలలు
(1974) పాటలన్నీ బావుంటాయి. ‘మధువొలకబోసే’ తో పాటు ‘ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు’, ‘సారీ.. సో సారీ- నా మాట వినుంకొకసారి..’ , ‘ అందాలు కనువిందు చేస్తుంటే... ఎదలోన పులకింత రాదా’ ఇవి. బాలు ఈ సినిమాలో పాడిన ఏకైక పాట ‘చెలి చూపులోన’ కూడా మరోటి.

మరి ఈ సంగీత దర్శకుడు ఇంకా ఏమేం తెలుగు సినిమాలకు పనిచేశారని వెతికితే... మరో అద్భుతమైన పాట కూడా కుమార్ సుస్వరాలఖాతాలో ఉన్నట్టు తెలిసింది. ఆనందాశ్చర్యాలు కలిగాయి.

‘మామా చందమామా’ పాట అది. సంబరాల రాంబాబు (1970) సినిమాలోది.

సుశీల గారు పాడిన అరుదైన కామెడీ సాంగ్ ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ..’ దీనిలోదే. ఇంకా ‘జీవితమంటే
అంతులేని
ఒక పోరాటం..’ పాట కూడా.

ఇక నా ఆసక్తి మంద్ర స్థాయిని దాటింది. మధ్యమాన్నీ.. ఆపై తార స్థాయినీ చేరుకుంది.

నెట్
లో అన్వేషించాను. వికీపీడియాలోనూ పొడిపొడిగానే వివరాలు కనిపించాయి.తెలుగు ఫాంట్ సాయంతో వెతికాక, ఇక ఇంగ్లిష్ ఫాంట్ తో !

కుమార్ సంగీతం సమకూర్చిన మరో సినిమా అందరూ మంచివారే (1975) కనిపించింది. దానిలో ‘కట్టింది ఎర్రకోక..పొయ్యేది యాడదాక’ అనే పాట ఉంది.

వి.కుమార్ చాలా తమిళ సినిమాలకు సంగీతం సమకూర్చారనీ, ఆయనకు 'మెలడీ కింగ్’ అనే పేరుందనీ, ఆయన వివరాలు కొన్ని తెలిశాయి. కుమార్ ... కె.బాలచందర్ డిస్కవరీ. తనను తమిళ సినిమా రంగానికి పరిచయం చేసింది బాలచందరే. ‘కవితాలయ’ ‘జెమినీ’ సంస్థలకు ఎక్కువ పనిచేశారు. 16తమిళ సినిమాలకు స్వరాలు కూర్చారు. వీటిలో కమల్ హాసన్ సినిమా ‘అరంగేట్రం’ (1973 ) కూడా ఉంది.
1934 జులై 28న కేరళలో జన్మించారట. మే7 1996 లో చనిపోయారని తెలిసి ‘అయ్యో’ అనిపించింది.

అప్పుడొచ్చింది అసలైన సందేహం....ఈ తెలుగు, తమిళ కుమార్ లు ఇద్దరూ .. ఒకరేనా అని!

వెంటనే సినీ సంగీతంపై అథారిటీ ‘రాజా’ గారు గుర్తొచ్చారు. (వార్తలో కాలమ్ ఆ పాత మధురాలు తెలిసిందే కదా?) ఆయన సంగీత విశేషాలను తెలిపే బ్లాగు. కూడా నడుపుతున్నారు.
రాజా గారికి మెయిల్ చేస్తే వెంటనే స్పందించారు. ఇద్దరూ ఒకరేనని తేల్చారు.

అంతే
కాదు, వి.కుమార్ 'కలెక్టర్ జానకి ' అనే మరో తెలుగు సినిమాకి కూడా సంగీతాన్ని అందించిన సంగతీ గుర్తు చేశారు. ఆ సినిమాకి మూలం తమిళం లో బాలచందర్ తీసిన ' ఇరు కోడుగళ్ ' అనీ, ఆ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించినది వి. కుమార్ గారేనని చెప్పారు.

కలెక్టర్ జానకి (1972)లోకూడా మంచి పాటలున్నాయి. ‘పాట ఆగిందా... ఒక సీటు గోవిందా’ అంటూ బాలు పాడే హుషారైన సరదా పాట దీంట్లోదే !

వి. కుమార్ పాటలు మృదుత్వానికీ, శ్రావ్యతకూ పేరు. భారతీయ, పాశ్యాత్య వాద్యాలను మాధుర్యం ఒలికేలా సమ్మిళితం చేసి, శ్రోతలకు గొప్ప రసానుభూతిని కలిగిస్తారాయన. సినీ సంగీత శిఖరాలైన ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్ ల శైలికి భిన్నమైన స్వతంత్ర శైలి కుమార్ ది.

ఇంతా చేసి, కుమార్ గారి ఫొటో ఒక్కటి కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు. ఎంత బాధాకరమో కదూ?

‘మధువొలకబోసే... ’ ఉన్న ‘కన్నవారి కలలు’ సినిమా 1974లో విడుదలైంది. ... 35 సంవత్సరాల క్రితం! అంటే కనీసం 32 సంవత్సరాల క్రితం నేనీ పాటను తొలిసారిగా వినివుండాలి. వినగానే ఆకట్టుకునే ఈ పాట సాహిత్యం గురించి నేను మొన్నటిదాకా పట్టించుకోలేదు. (అసలు నచ్చిన పాట అంటే- చాలా సందర్భాల్లో నా ఉద్దేశం అది బాణీ పరంగానే! పాట అంటే ట్యూనే. పాడుకోవాలంటే ‘ఆధారం’ కావాలి కాబట్టి ‘లిరిక్’ అవసరమనిపిస్తుంది.)

ఇదో ప్రేమ గీతం. ఈ పాటలో సాహితీ విలువలు గొప్పగా ఉన్నాయని కాదు. కానీ పల్లవిలో తొలి పదమే ‘మధువొలకబోసే’ వినగానే ఆకట్టుకుంటుంది. ‘మూగ భాషలో బాస చేయనీ’ అనే చమత్కారాలు లేకపోలేదు. ‘ఈనాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ’ అనటం మాత్రం వింతగా తోచింది. సాధారణంగా నూరేళ్ళు అనాలి కదా, వెయ్యేళ్ళు అనెందుకు అనాల్సివచ్చింది? బహుశా హాయి- వెయ్యి... ఈ పదాల సామరస్యం కోసం అలా రాసివుండాలని తోస్తోంది.


ఈ యుగళగీతం పాడింది రామకృష్ణ, సుశీల గార్లు . గీత రచయిత ఎవరనేది కచ్చితంగా తెలియటం లేదు. చాలాచోట్ల రాజశ్రీ అనీ, కొన్నిచోట్ల సినారె అనీ కనిపిస్తోంది. ఆ పాట పూర్తి పాఠం కింద ఇస్తున్నాను.


మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ

తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ

బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ


మనసు మనసుతో ఊసులాడనీ

మూగభాషలో బాస చేయనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ


గగనముతో .... ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ

జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ


కలలు తీరగా కలిసిపొమ్మనీ

కౌగిలింతలో కరిగిపొమ్మనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ


మధువొలకబోసే .. హా ..
ఈ చిలిపి కళ్ళూ ఆ ఆఆ ఆ ...

అవి నాకు వేసే .. హా ఆఆ...
బంగారు సంకెళ్ళూపాట ఎత్తుగడలోనే... ‘మధువొలకబోసే’ లో ‘బోసే’ దగ్గర కట్ చేయటంలో అందం కనిపిస్తుంది. ‘కళ్ళు’- ‘సంకెళ్ళు’ అనే పదాలను కొంచెం ఎక్కువ వ్యవధి తీసుకునేలా ట్యూన్ చేయటం మధుర తరంగా తోస్తుంది.

పల్లవి తర్వాత ఇంటర్లూడ్ లో వీణావాదన హాయిగా సాగి, తొలి చరణానికి సొగసైన దారి కల్పిస్తుంది.

మొదటి చరణంలో రెండో భాగం ‘మనసు మనసుతో..’ దగ్గర స్వరకల్పన మెట్టుమెట్టుగా మాధుర్య సోపానాలను అధిరోహిస్తుంది. వెంటనే ‘ఊసులాడనీ’ తర్వాత సితార బిట్ చటుక్కున పలకరించి, తేనెని చిలకరించేస్తుంది.

‘మూగభాషలో’ దగ్గర కూడా ‘లో’ అనే చోట స్వర సోపానాలను గమనించొచ్చు.

రెండు చరణాల మధ్య ఇంటర్లూడ్ లో వేణువూ, వీణా స్వర మైత్రీ యాత్ర చేస్తూ వరసగా విచ్చేస్తాయి. వీనుల విందు చేస్తాయి. తొలి చరణంలాగానే స్వరాల పూలు గుబాళిస్తాయి.

‘ఈ నాటి హాయి’ దగ్గర ‘హాయి’ ని (రెండో చరణం చివర్లో) సుశీల గారు తన గళంలో అనుపమానంగా , పాట భావం వ్యక్తమయ్యేలా ఎంత బాగా పలికించారో విని తీరాల్సిందే!

ముగింపులో పల్లవి మళ్ళీ వస్తుంది కదా? రామకృష్ణ గళం నుంచి జాలువారే పల్లవీ, దానికి జతగా సుశీల అద్భుత ఆలాపనలూ పాట మాధుర్యానికీ, భావానికీ పరాకాష్ఠ గా అనిపిస్తాయి.

తీయని పాట విన్న అనుభూతి మాత్రం మనకు మిగులుతుంది!

ఈ పాటను వినండి.ఇంతకీ... ఈ సినిమాను ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను చూడటం కుదర్లేదు.

ఈ టపా రాద్దామనే ఆలోచన వచ్చాక ‘దిశాంత్ సైట్’లో 'మధువొలకబోసే..’ పాట వీడియో కనిపించి, చూశాను. చిత్రీకరణ నాకేమీ నచ్చలేదు!


15 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

ఉదయాన్నే 'సిరివెన్నెల' సినిమా డీవీడీ చూస్తుంటే ఆ సినిమా గురించి మీరు రాసిన టపా, ఆ వెంటే మీ బ్లాగూ గుర్తొచ్చాయి.. ఇప్పుడు సిస్టం ఓపెన్ చేయగానే టపా!! నేను 'పాట ఆగిందా..' పాట కోసం ఎదురు చూసేవాడిని, ముఖ్యంగా అనుడ్లో 'బాబ్డ్ హెయిరు..బ్రౌను గవును..' లైన్ కోసం!!! బాగుందండి టపా...

శ్రీ చెప్పారు...

కోర కాగజ్ హాయ్ మాన్ మేరా గీతం స్థానం లో వచ్చింది ... ఒక నాటి మాట కాదు పాట., గుంగునారహి హాయ్ పాట స్థానం లో వచ్చింది మధువోలక బోసి ఈ చిలిపి కళ్ళు పాటా. బాహో మే సవర హాయ్ .. తుమ్జో కో ముజ్ సే ప్యార్ హాయ్ పాట. ..సారీ సో సారీ పాట... తెలుగు లో ఫరీదా జలాల్ పాత్ర ని లతా చేసింది... సినిమా పెద్ద హిట్ లెండి... కుమార్ గారు ఒక్క పాట కూడా హిందీ మూలం నుంచి తెసుకోకుండా బాగా మ్యూజిక్ చేసారు ...

వేణు చెప్పారు...

* సుజాత గారూ, ధన్యవాదాలు. ‘ఒకనాటి మాట కాదు’ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. కుమార్ గారు స్వరపరిచిన మిగతా పాటలు సోసో..యే కానీ, ‘మామా చందమామా’ లో మెలడీ ఉందనే అనుకుంటున్నాను. హిందీ ‘ఆరాధన’కు దీటుగా ఉండాలన్న కుమార్ గారి ప్రయత్నం సఫలమైందని చెప్పొచ్చు.

* మురళి గారూ, అయితే- మీ నుంచి ‘సిరివెన్నెల’ టపా రాబోతోందన్నమాట! ధన్యవాదాలు.

* శ్రీ గారూ, హిందీ మూలం ప్రభావం లేకుండా ఈ పాటలన్నీ స్వరపరచటం, శ్రోతలను ఒప్పించటం
కుమార్ గారి క్రియేటివిటీని తెలుపుతోంది. మీ స్పందనకు ధన్యవాదాలు.

Raja చెప్పారు...

వేణు గారూ , నా బ్లాగు లోని 'నిన్ను చూడనీ' పాట మీద మీ రెస్పాన్స్ తో పాటు మీ బ్లాగు లోని 'మధువొలకబోసే ' పాట మీద మీ అనుభూతి చూశాను. చూశాక మరో రెండు విషయాలు రాయాలనిపించింది. ' మధువొలకబోసే ' పాటను రాసింది నారాయణరెడ్డి గారు కాదు. శైలి తెలిసిపోతూనే వుంటుంది.ఆయినా ఎందుకైనా మంచిదని సినారె గారి పెద్దమ్మాయి గంగ గారితో మాట్లాడి,నిర్ధారించుకుని మరీ చెబుతున్నాను. సో,' మధువొలకబోసే ' పాటను రాసింది రాజశ్రీ గారు అని మనం నమ్మవచ్చు. ఇక 'సంబరాల రాంబాబు ' లో 'పొరుగింటి మీనాక్షమ్మ ను చూశారా ' పాటలో సుశీల గారి గురించి ... 'సంబరాల రాంబాబు ' కి తమిళ మూలం ' ఎదిర్ నీచ్చెల్ ' లో ' పొరుగింటి మీనాక్షమ్మను చూశారా' పాట ఒరిజినల్ ను సుశీల గారు పాడిన పద్ధతి ఇంకా అధ్భుతం . ఆ తమిళ గీతాన్ని మీ ఈ మెయిల్ కి పంపుతున్నాను. మీ అభిప్రాయాన్ని రాసి మీ పాఠకులకు అందజేయండి. ఎంతోమంది పాడిన గొప్ప గొప్ప పాటల ఒరిజినల్స్ నావద్ద చాలా వున్నాయి. కావాలనుకున్నప్పుడు అడగండి. పంపిస్తాను - రాజా

వేణు చెప్పారు...

రాజా గారూ!
మీ స్పందనకు చాలా సంతోషం.
‘మధువొలకబోసే...’ పాటను రాజశ్రీ గారు రాశారని నిర్థారించినందుకు ధన్యవాదాలు.
కానీ ప్రాచుర్యం పొందిన పాటల రచయితల పేర్లు కూడా వెతుక్కోవలసి రావటం బాధాకరమే. తెలుగు సినీరంగ చరిత్రను ప్రామాణికంగా రాసే ప్రయత్నాలు ఇప్పటికైనా జరగకపోతే... కొన్నేళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే భయమేస్తోంది.

మీరు మెయిల్లో పంపిన 'ఎదిర్ నీచ్చెల్' లో ' పొరుగింటి మీనాక్షమ్మను చూశారా' పాట ఒరిజినల్ చాలా బావుంది. థాంక్స్!

Surya చెప్పారు...

I opened your blog after quite a few days and was very much impressed with your latest post. An ardent music-lover, that too of film music, I was surprised to know that there was a music director by this name. And that he composed such wonderful tunes for the Telugu remake of Aaradhana.
I think Ramakrishna sung the song Madhuvolakabose in base voice to give it the feel. I too have lot of childhood memories of the AIR Chitra Tarangini and other film music programmes. Now I frankly don't remember those names.
By the way, I would like you to research something about C Narayana Reddy's film lyrics. There were many many classics he penned for Telugu films, particularly for the legendary N T Rama Rao, his mentor.
Anuvu anuvuna velasina deva.... from Maanavudu-Daanavudu is one such great song.
Keep writing such posts. Very very interesting, indeed.

వేణు చెప్పారు...

సూర్యా!
ఈ పోస్టు నిన్ను బాగా ‘ఇంప్రెస్’ చేసినందుకు సంతోషం. మరి నీలాంటి సినీ సంగీత ప్రియులకు కూడా వి.కుమార్ పేరు తెలియకపోవటమే ఈ పోస్టు రాయటానికి అసలైన కారణం.

సినారె సినీ సాహిత్యం గురించి పుస్తకాలు వచ్చాయిగా. ఆయనే ఒక పుస్తకం రాశారు, తన పాటల నేపథ్యం, విశేషాలు వివరిస్తూ.
‘అణువూ అణువున వెలసిన దేవా’ చాలా బావుంటుంది. బాలు మంచి ఫీల్ తో పాడిన పాట ఇది.

Surya చెప్పారు...

Tell me the name of the book, I will try to buy it.

వేణు చెప్పారు...

సూర్యా!

సినారె తన సినిమా పాటల నేపథ్య విశేషాల గురించి ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఓ సీరియల్ రాశారు, కొన్నేళ్ళ క్రితం. ‘పాటలో ఏముంది... నా మాటలో ఏముంది’ - ఇదీ శీర్షిక. ఇది పుస్తక రూపంలో కూడా వచ్చింది.

ఇక ‘సినారె సినీ హిట్స్’ అనే మరో పుస్తకం కూడా మార్కెట్లో ఉంది.

ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ‘యువభారతి’ సినారె రాసిన కొన్ని సినిమా పాటలతో ఓ పుస్తకం ప్రచురించింది. ఇది ఇప్పుడు దొరకదు కానీ పాత పుస్తకాల షాపుల్లో వెతికితే దొరకొచ్చు. అసలు ఆబిడ్స్ విశాలాంధ్రకు వెళ్తే ... నేను మొదట ప్రస్తావించిన పుస్తకం దొరకొచ్చు!

jagadeeshwar reddy చెప్పారు...

వేణూ,
సంగీత దర్శకుడు కుమార్‌ మీద వ్యాసం అద్భుతం. దానిపై వచ్చిన అభిప్రాయాలూ బాగున్నాయి. ఆ మధ్య కుమార్‌గారి భార్యతో అనుకుంటాను జి.తెలుగు ఛానల్‌లో 'స్వరాభిషేకం'లో మాట్లాడించారు.
కుమార్‌గారి సంగీతంలో వచ్చిన పాటల్ని ఆ బాలగంధర్వులు ఆలపించారు.
నీవన్నది నిజమే. పాట ఎంత బాగున్నా కొన్ని పాటలు చిత్రీకరణలో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతారు దర్శకులు. ఉదాహరణకి : బి.ఎన్‌.రెడ్డిగారి రంగులరాట్నంలో ఫట్‌దీప్‌ రాగంలోని 'కన్నులదాగిన అనురాగం'(ఎస్‌. రాజేశ్వరరావు స్వరపరచారు) పాటంటే నాకు పంచ ప్రాణాలు. కానీ ఆ పాట చిత్రీకరణ ఎంత పేలవంగా ఉంటుందో! ఇద్దరు స్త్రీపురుషులు (విజయనిర్మల+ఒక హీరో : ఆయన ఎస్‌.జానకి మరిదని విన్నాను) చేయీచేయీ పట్టుకుని ఊపుతూ వెళ్తారు పాటంతానూ. అంతే!
అబ్బో! చూస్తుంటే నీవు సంగీత ఖనిలా ఉన్నావే!
నాకు బాగా ఇష్టమైన మరో 2 పాటలు చెప్పనా?
1. ఎంత మధుర సీమ ప్రియతమా : దేవాంతకుడు - ఆరుద్ర (అనుకుంటాను) - పి.బి.శ్రీనివాస్‌, జానకి - అశ్వత్థామ)
2. కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై : గులేబకావళికథ- సినారె - ఘంటసాల, జానకి - విజయా కృష్ణమూర్తి)
- గొరుసు

వేణు చెప్పారు...

జగదీశ్వర్, థాంక్యూ!

కొన్ని సార్లు- పాట ‘లైఫ్’ సంగతి ఊహించక... దర్శకులు దాన్ని మామూలుగా చిత్రీకరించివుంటారు. అయితే, ఆ పాట సినిమాని మించిపోయి, సూపర్ హిట్ అయిపోయి పాపం ఆ దర్శకులకు సంగీతాభిమాన ప్రేక్షకుల నుంచి చీవాట్లు తెచ్చిపెడుతుంటుంది :)

మీకు నచ్చిన పాటలు చూస్తుంటే... ‘అమ్మో!’ అనిపిస్తోందండీ!

సుజాత చెప్పారు...

కన్నుల దాగిన అనురాగం పాటంటే నాకూ పంచప్రాణాలే! సినిమా టీవీలో వచ్చినపుడు ఆ పాట చూసి తెల్లబోయాను ..అంత రసహీనంగా ఉంది.

కలల అలలపై తేలెను పాట ఇంకా సంగీతాభిమానులు మర్చిపోలేదన్నమాట!చాలా సంతోషం!

ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం.రెండో చరణం చాలా హై పిచ్ లో మొదలు కావడం అబ్బురపరుస్తుంది ఆ పాటలో.ఘంటసాల మాత్రం చాలా యాంత్రికంగా పాడినట్లు అనిపిస్తుంది.

వేణు చెప్పారు...

@ సుజాత:
@ జగదీశ్వర్:
‘కన్నుల దాగిన అనురాగం’ పాట విని సంవత్సరాలు దాటింది. మళ్ళీ ఈ సందర్భంగా దాన్ని విన్నపుడు.. తలపుల్లోంచి కరిగిపోతూ అదృశ్యమైపోతున్న మాధుర్యాన్ని నిలుపుకున్నట్టు... మంచి అనుభూతి! ఇలాంటి అద్భుతమైన పాటను గుర్తు చేసినందుకు థాంక్యూలు!

kamala చెప్పారు...

వేణు గారూ,
మీరు సాగర సంగమం గురించిన రాసిన వాఖ్యానంలో జల్లెడకి ఎన్ని చిల్లులు వుంటాయో, అన్ని చిల్లులు వున్నాయి. దర్శకుడు ఎటువంటి ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారో, అటువంటి ప్రేక్షకులు చిన్న చిన్న విమర్శలతో వాటిని అంగీకరించి, అభ్యుదయం గలవారిగా నిలుస్తారు. అన్ని చిల్లుల గురించీ చర్చించే వుద్దేశ్యం లేదు కాబట్టి, ఒకే ఒక చిల్లు గురించి నా అభిప్రాయం రాస్తాను.
చలం, రంగనాయకమ్మల సాహిత్యం చదువుతానని చెప్పుకుంటూ, జయప్రద అందాల గురించి బ్లాగులో చర్చించడం ఏ విధంగా సమంజసం? స్త్రీల అందాల గురించి పురుషులు పబ్లిక్‌లో మురిసిపోవడం ఫ్యూడల్‌ విలువ కాదా? స్త్రీల అందాల్ని విక్రయించడానికి సినిమా ఫీల్డు వుంటే, దాన్ని కొనుక్కుని ఆస్వాదించడానికి మీలాంటి పురుషులు వున్నారు. స్త్రీలని ఏ దృష్టితో చూడాలీ అన్న సంగతి తెలియనప్పుడు, ఎవరి సాహిత్యం చదివితే మాత్రం ఏం ప్రయోజనం? అవును, నా విమర్శ ఘాటుగానే వుంటుంది. విషయం కూడా అంత ఘాటు కాబట్టి.

Syamala Madduri చెప్పారు...

వేణు!నీ తోట పనిని మాధుర్యాల వనిగా మార్చిన నీకిష్టమైన పాటను గురించీ తెలుసుకోవడం బాగుంది!ఒక పాటలోని సంగీత సాహిత్యాలలో ఏదెక్కువయిష్టం?అంటే చెప్పడం కష్టమైనా ముందుసంగీతమే ఆకర్షిస్తుందనే నీమాాటే నామాట కూడా! మధువొలకబోసిన పాటను నువ్వు పరిచయం చేసినతీరు చాలా బాగుంది!ముఖ్యంగా మనసు మనసుతో . . . .దగ్గర మాధుర్య సోపానాలెక్కడంగా పాటలోని గమకాలను పేర్కొనడం బాగుంది! కుమార్ గారి మరొక పాట మామా చందమామా!కూడా నాకు చాలా యిష్టం! ఔను ఈ పాటలో భ్రమరం గగనం చెలిమి చిత్రంగా వుందికదూ!కవి ఊహ ఏమిటో!