
శాస్త్రీయ సంగీతం ప్రధానాంశంగా ‘శంకరాభరణం’ (1979) తీసిన ఏడిద నాగేశ్వరరావు, పూర్ణోదయా పతాకంపై దాదాపు అదే స్థాయిలో నిర్మించిన నృత్య ప్రధాన చిత్రమిది.
విడుదలై పాతిక సంవత్సరాలు గడిచి పోయినా ఈ సినిమాలోని సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోమంది స్మృతుల్లో పదిలంగా ఉన్నాయి.
దర్శకుడు విశ్వనాథ్ అసమాన ప్రతిభకు సాంకేతిక నిపుణుల, నటీనటుల సామర్థ్యం తోడై, ఈ చిత్రం కళాత్మకంగా రూపుదిద్దుకుంది.
ఇళయరాజా వినసొంపైన పాటలూ, సందర్భాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం; నివాస్ కనువిందైన ఛాయాగ్రహణం, జంధ్యాల పదునైన సంభాషణలూ, వేటూరి సుందర గీతాలూ అద్భుతంగా అమరాయి.
టైటిల్స్ నేపథ్య దృశ్యాలూ, నేపథ్య సంగీతం- ఒక సంగీత నృత్య ప్రధాన చిత్రం చూడబోతున్న మూడ్ ని ఏర్పరుస్తాయి.
రెండు గంటల నలబై నిమిషాల ఈ సినిమాలో మనసు ఆర్ద్రమయ్యే, ఉద్వేగం కలిగే రసవద్ఘట్టాలు అర డజను పైగానే ఉన్నాయి.
బాలకృష్ణ (కమల్ హాసన్) అనే నృత్య కళాకారుడి గతి తప్పిన విషాద జీవితం ఈ చలన చిత్రం.
అనామకంగా పడివున్న తన ప్రతిభను మొదట్లోనే గుర్తించి ఎంతో ప్రోత్సహించిన మాధవి (జయప్రద) పై అతనికి ప్రేమ అంకురిస్తుంది.
కానీ ఆమెకు అంతకుముందే పెళ్ళయిందని తెలుస్తుంది. మామ గారి ఆస్తి కోసం పట్టుబట్టి వివాహాన్ని కాదనుకున్న ఆమె భర్త తిరిగి వస్తే, వారిద్దరినీ కలుపుతాడు.
తల్లికీ, ప్రేమించిన వ్యక్తికీ దూరమై నిరాశ - అతడి ‘బతుకు’లో ‘ నిత్య నృత్యం’ చేసింది.
‘జీవితమే చిర నర్తనం’ కావాలన్న తన ఆకాంక్షలను విస్మరిస్తాడు.
తన ‘పంచ ప్రాణాల’నూ ‘నాట్య వినోదం’గా సంభావించిన సంగతి మరచిపోతాడు. కళకు అంకితం కావాల్సింది, మద్యానికి బానిసైపోతాడు; ఆరోగ్యాన్నీ, ఆత్మ అయిన కళనూ నిర్లక్ష్యం చేస్తాడు.
చివరకు జయప్రద పునరాగమనంతో తప్పు తెలుసుకుంటాడు.
ఆమె కూతురు శైలజకు తన కళను నేర్పటం ద్వారా తన కృతజ్ఞత చూపిస్తాడు. శిష్యురాలి ద్వారా నాట్య కళను బతికించుకోవాలని ఆరాటపడతాడు.
‘వేదం అణువణువున నాదం’ పాట చిత్రీకరణ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆస్పత్రి బెడ్ మీద నుంచే కమల్ శైలజకు నాట్యంలో శిక్షణ ఇవ్వడం, వేదికపై ఆమె ప్రదర్శన... ఇదంతా క్లైమాక్స్ లోకి వేగంగా దూసుకెళ్తుంది.
శైలజ ప్రదర్శన చూసిన సంతృప్తితో తుది శ్వాస విడుస్తాడు. అతన్ని వీల్ చైర్ లో తీసుకెళుతుంటే వర్షం పడుతుంది. అప్పుడు అతడి స్నేహితుడు (శరత్ బాబు) తన శరీరంతో కమల్ ని కప్పే దృశ్యం కదిలిస్తుంది.
మసిబారిపోయిన తన బతుకు కొడిగట్టకముందే... దానికో అర్థం కల్పించుకోవటానికి పరితపించిన వ్యక్తిగా కమల్ హాసన్ నటన శిఖర స్థాయిని అందుకుంది. తల్లి చనిపోయే ఘట్టంలో అతడి నటన పరాకాష్ఠకు చేరినట్టు అనిపిస్తుంది.
మొదట్లో ‘‘అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయటానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమైనా భరతమునివా?’’ అని శైలజ ఫియాన్సీ తనను దూషించినపుడు కమల్ ముఖకవళికల్లో పలికించే భావం అనితర సాధ్యం! అప్పుడు కమల్ చేసి చూపించే భరతనాట్యం, కథక్, కథాకళి రీతుల నాట్యం ఎంత అలవోకగా, వేగంగా, ‘స్టైల్’గా ఉంటుందంటే- కన్నార్పకుండా చూడటం తప్ప మరేం చేయలేం!
ఆ సీన్ చివర్లో కమల్ కాలు పైకి లేచి టీ ట్రే కి తగులుతుంది. గ్లాసులన్నీ పైకి ఎగరటం, కింద పడ్డ ఓ గ్లాసు శైలజ కాలిదగ్గరే గుండ్రంగా దొర్లిపోవటం... ఆ ఘట్టంలోని గాంభీర్యతను రెట్టింపు చేస్తుంది!
‘‘నీ దృష్టి- ప్రేక్షకుల మీద; మనసు- వాళ్ళు కొట్టే చప్పట్ల మీద; ధ్యాస- అందుకోబోయే బిరుదుల మీద’’ అంటూ శైలజను ‘‘నాట్యమయూరి’’ అని హేళనగా సంబోధిస్తాడు. తనను దూషించిన శైలజ ఫియాన్సీని ‘‘ఏమన్నావ్? బాస్టర్డా?’’ అంటూ లాగి చెంపమీద కొట్టి తన ఆత్మగౌరవం ప్రదర్శిస్తాడు.
వెళ్ళిపోతున్న కమల్ కి గేటుకీపర్ ‘‘నమస్తే సార్’’ అంటూ కొత్తగా మర్యాద ఇవ్వటం ఈ మొత్తం సన్నివేశానికంతటికీ మరపురాని కొసమెరుపు!
విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా... ఈ ముగ్గురు ప్రతిభావంతుల త్రివేణీ సంగమం- ఈ సాగర సంగమం.
విశ్వనాథ్, కమల్ లకే కాదు; విశ్వనాథ్, ఇళయరాజాలకు కూడా ఇది తొలి సమ్మేళనమే.
ఈ సినిమా లోని ఎన్నో సన్నివేశాలు ‘స్పాంటేనిటీ’తో రూపుదిద్దుకున్నాయనీ, అప్పటికప్పుడే ఇంప్రొవైజ్ అయ్యాయనీ కమల్ చాలా సార్లు చెప్పాడు. అందుకే ‘‘వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్’’ అని ఈ చిత్రాన్ని ఆయన అభివర్ణించారు.
ఆ నోస్టాల్జియా ప్రేరేపించే కావొచ్చు- తన ‘దశావతారం’లో సాగర సంగమం నాయిక జయప్రదకూ, భంగిమ కుర్రాడు చక్రికీ స్థానం కల్పించాడు.
‘‘కమల్ కోసం ‘టైలర్ మేడ్’గా తయారుచేసిన కథ ఇది’’ అంటారు విశ్వనాథ్.
ఆయన ఇంకా ఏం చెప్పారో చదవండి-
‘‘Subtleties లో కమల్ తర్వాతే ఎవరైనా! అతని స్పాంటేనిటీ, టైమింగ్ అన్ బిలీవబుల్. ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో ఒక్కొక్క పెర్ఫార్మర్ గురించి జయప్రదతో డిస్కస్ చేస్తూ ఇన్విటేషన్ తిరగేస్తున్న కమల్, ఒక్కసారిగా దానిలో తన పేరు చూసుకుని షాకవుతాడు! నిజ జీవితంలో అలాంటి సందర్భాల్లో ఏడ్చేస్తారు, ఎక్స్జైట్ అవ్వరు. అలానే ఈ సినిమాలో కూడా కమల్, జయప్రద చెయ్యి పట్టుకుని ఏడుస్తాడని ప్లాన్ చేశాం.
కెమెరా రోల్ అయింది, యాక్ట్ చేయడం మొదలెట్టాడు.
ఎందుకో నాకు సడన్ గా అనిపించింది- చివరిలో నవ్వితే బాగుంటుందని. వెంటనే ‘కమల్, లాఫ్’ అని అరిచాను.
నా ఇన్ స్ట్రక్షన్ ని తను క్షణంలో రిసీవ్ చేసుకోవడం, కరెక్ట్ టైమింగ్ తో దాన్ని ఫాలో అయిపోవడం... క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడనిపించింది- అతని పొజిషన్ లో వేరే ఏ ఆర్టిస్టున్నా ‘ఏంటి సార్?’ అని షాట్ ఆపి అడిగుండేవారని!’’
కమల్ ఈ సీన్ లో మనసారా తృప్తిగా నవ్వుతుంటే... వెంటనే కనిపించే ఎగిరే పక్షుల దృశ్యం చక్కని సాదృశ్యంలా భాసిస్తుంది.
మరో ఘట్టం గురించి విశ్వనాథ్ మాటల్లోనే...
‘‘కృష్ణాష్టమి రోజు తాగొచ్చాననే గిల్టీ ఫీలింగ్ తో లోపలికి రానంటాడు కమల్... అప్పుడు శరత్ బాబు భార్య కమల్ కి ఫలహారం పెట్టడానికి తనే బయటికొస్తుంది.
అప్పుడతను ‘నేనెక్కువేం తాగలేదు’ అంటాడు.
వెంటనే ఆమె ‘నేనేం అడగలేదే!’ అంటుంది.
ఆ అనే తీరుకి... మన కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి’’.
‘తకిట తథిమి’పాట చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశం అత్యద్భుతం. వాన నీటకి జయప్రద బొట్టు కరిగిపోకుండా కమల్ తన చేతిని నుదిటికి అడ్డు పెట్టడం- మాటలకందని భావానికి మచ్చుతునక!
మానవ స్వభావం...
ఈ సినిమాలో మానవ మనస్తత్వాన్ని అనితర సాధ్యంగా ఆవిష్కరించిన రెండు సన్నివేశాలున్నాయి.
శైలజ నాట్య ప్రదర్శనలో చేసిన పొరపాట్లను ఎత్తిచూపి, ‘నాట్య శాస్త్రానికి తీరని కళంకం’గా ‘నటరాజుకు శిరోభారం’గా పత్రికలో రాస్తాడు కమల్. ఆమె నృత్యాన్ని ‘కుప్పిగంతులూ, కప్ప గెంతులూ’గా అపహాస్యం చేస్తాడు.
అలాంటివాడు చివర్లో శైలజ జయప్రద కూతురని తెలిశాక...
‘‘చిన్న పిల్ల! ఎలా నేర్పుతారో అలా చేస్తుంది’’ అని సమర్థిస్తాడు. పైగా ‘‘చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది’’ అంటూ ‘ఆ ముద్రా- అదీ- పర్ఫెక్ట్, పర్ఫెక్ట్!’’ అని పొగిడేస్తాడు. ‘‘ఏదో ఎక్కడో చిన్న తప్పు చేస్తే ... ఫూల్ ని, ఛండాలంగా రాయాలా?’’ అని తనపై తాను కోపం తెచ్చుకుంటాడు!
ఈ సన్నివేశం ఎంత సహజంగా ఉందో కదా?

మరో ఘట్టం-
కార్లో కమల్, జయప్రదా వెళ్తుంటారు. తనను సెక్రటరీగా వేసుకోమని జయప్రద అంటే- ‘‘మీరెప్పుడూ నా పక్కనే ఉంటారా?’’ అనడుగుతాడు కమల్. ‘‘ఓ ష్యూర్! వై నాట్? ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ’’ అంటుంది జయప్రద. ‘‘నిజంగా?’’ అంటే ‘‘ప్రామిస్’’ అంటుందామె.
అప్పుడు కారు ఆపమనీ, చిన్న పనుందనీ అక్కడికక్కడే దిగిపోతాడు, కమల్. రోడ్డు పక్కనే ఉన్న చిన్న కొండ అంచున ఏకాంతంగా కూర్చుని తనలో పొంగిపొరలే సంతోషాన్ని ఆస్వాదిస్తాడు.
ఇక్కడ అతడికి ఆనందం జయప్రద వల్లనే. కానీ దాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందటానికి మాత్రం ఆమె ఉనికీ, సామీప్యమూ అవరోధమవటమే వైచిత్రి!
ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం...! ఇలాంటి కథానాయకుడు మరే సినిమాలోనైనా మీకు తారసపడ్డారా?
మనిషి స్వభావంలోని లోతును అద్భుతంగా ప్రదర్శించిన ఈ ఘట్టం అజరామరమనిపిస్తుంది.
జయప్రద ఇంటికి వెళ్ళగానే పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి, మరోసారి అదే ప్రశ్నను అడిగి, అదే జవాబు చెప్పించుకుని, ‘‘థాంక్యూ , థాంక్యూ వెరీమచ్’’ చెప్తాడు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ‘‘ఐ లవ్ యూ’’ చెప్తాడు.
నచ్చనివీ ఉన్నాయి!
ఆస్తి కారణంగా దూరమైన జయప్రద భర్త చివరకు తిరిగి వచ్చి, కమల్- జయప్రదలను ‘ముచ్చటైన జంట’ అవుతారని ప్రకటిస్తాడు. తను ‘శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నా’నని మామగారికి చెప్తాడు. అయినా కమల్ వారిద్దరినీ కలిపి, సాగనంపుతాడు.
ఇక్కడ హీరోయిన్ మనోభావాలేమిటో తెలుసుకోవాలనే కనీస బాధ్యత కూడా హీరో ఫీలవ్వకపోవటం విచిత్రంగా అనిపిస్తుంది.
ఆమె కూడా కమల్ మాటలకు తలూపి, భర్తతో వెళ్ళిపోతుంది.
అతి మంచివారైన భర్తా, ప్రేమికుడూ తమ ఆదర్శ నిర్ణయాలు ప్రకటించి, ఆమెకు వ్యక్తిత్వం ఉందనే సంగతి మరిచారనిపిస్తుంది.
పోనీ, కమల్ ఆ జంటను కలిపాక, నాట్య కళకే జీవితాన్ని అంకితం చేయవచ్చు కదా? ‘‘ఒంటరి తనాన్ని దూరం చేసుకోవటానికి తాగుడుకు దగ్గరవ్వటం’’ ఎందుకూ?
చివర్లో- జయప్రదనుద్దేశించి ‘‘ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అనే మాటలు ‘విని’ శైలజ పశ్చాత్తాపపడి, మారిపోతుంది. ఆమె ఈ మాటలు ఒకవేళ వినకపోతే ఏమయ్యేది? అసలు కమల్ జయప్రదను ‘‘ఆ మహాతల్లి’’ అని సంబోధించకపోతే వారి అనుబంధం పవిత్రం అయ్యేది కాదా? ఇవన్నీ సందేహాలే!
కమల్ ఆశయం- వివిధ ప్రాంతాల నృత్యరీతుల సమ్మేళనంతో ‘భారతీయ నృత్యం’ రూపొందించటం. ఇది శైలజ ద్వారా నెరవేరినట్టు చూపించివుంటే అర్థవంతంగా ఉండేది.
శ్రావ్యమైన, తీయని పాట- ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’. దీని స్థాయికి తగ్గట్టుగా చిత్రీకరణ ఉండదు; చాలా నిరాశపరుస్తుంది.
మరికొన్ని విశేషాలు ...

ఆమె అపురూప సమ్మోహన రూపాన్ని క్లోజప్ షాట్స్ లో అద్భుతంగా ఒడిసి పట్టాడు ఛాయాగ్రాహకుడు.
ముఖ్యంగా- భంగిమ కుర్రాడి పాలబడ్డ కమల్ ని చాటుగా ఫొటోలు తీసే సన్నివేశంలో జయప్రద సౌందర్యం కనువిందు చేస్తుంది.
* శైలజ ఫియాన్సీకి డబ్బింగ్ చెప్పింది నేటి హీరో రాజేంద్రప్రసాద్. మరో విశేషం- కమల్ అనువాద చిత్రం ‘తెనాలి’(2000) లో జయరామ్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా రాజేంద్రప్రసాదే. జయరామ్ భార్య దేవయానికి డబ్బింగ్ చెప్పింది ఎస్పీ శైలజ!
* ఎస్పీ శైలజకు నటిగా ఇదే తొలి చిత్రం. చివరి చిత్రం కూడా!
* జయప్రద భర్త పాత్రధారికి డబ్బింగ్ అందించినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
* భంగిమ కుర్రాడిగా కమల్ ని అదరగొట్టిన చక్రి ఈ మధ్యే విడుదలైన ‘ఈనాడు’కు దర్శకుడిగా ఎదిగాడు.
* ‘బాలా కనకమయ చేల సుజన పరిపాల’ పాటలో వేదికపై మంజుభార్గవికి బదులుగా కమల్ ని తల్లి ఊహించుకుంటుంది. చివర్లో ‘వేదం అణువణువున నాదం’ పాటలో జయప్రద తన కూతురు నర్తిస్తుంటే కమల్ నాట్యం చేస్తున్నట్టు భావిస్తుంది. (నడి వయసులో ఉన్న కమల్ ని కాకుండా యువకుడైన కమల్ ని ఊహించుకోవటంలో ఎంతో ఔచిత్యం కనిపిస్తుంది).
‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’ పాటలో మంజుభార్గవి... తులసి పాడుతుంటే హఠాత్తుగా జేవీ సోమయాజులే కళ్ళముందు పాడుతున్నట్టు స్ఫురించి, పులకించిపోయిన ఘట్టం ఈ సన్నివేశాలకు మాతృక అయివుండాలి.
* ‘తకిట తథిమి తకిట తథిమి’ పాటలో... ‘గుండియలను అందియలుగ చేసీ..’ అనే ప్రయోగం చేశారు వేటూరి. ‘వేదం అణువణువున నాదం’ పాటలో కూడా ఇదే కొంచెం మార్పుతో విన్పిస్తుంది- ‘గుండియలే అందియలై మ్రోగా’- అని. అంతే కాదు; ఇదే పాటలో ‘ఎదలాయె మంజీర నాదం’ అని ఇదే వ్యక్తీకరణ చూడొచ్చు.
మరో ఐదేళ్ళ తర్వాత వచ్చిన స్వర్ణ కమలం (1988)లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇదే ఛాయల్లో ‘అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా?’ అని రాశారు!