సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, సెప్టెంబర్ 2009, సోమవారం

నృత్య ప్రధాన దృశ్య కావ్యం ’సాగర సంగమం’!

సున్నితమైన మానవ సంబంధాలను మనసుకు హత్తుకునేలా వెండితెరపై మలిచిన దృశ్య కావ్యం- ‘సాగర సంగమం’(1983)

శాస్త్రీయ సంగీతం ప్రధానాంశంగా ‘శంకరాభరణం’ (1979) తీసిన ఏడిద నాగేశ్వరరావు, పూర్ణోదయా పతాకంపై దాదాపు అదే స్థాయిలో నిర్మించిన నృత్య ప్రధాన చిత్రమిది.

విడుదలై పాతిక సంవత్సరాలు గడిచి పోయినా ఈ సినిమాలోని సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోమంది స్మృతుల్లో పదిలంగా ఉన్నాయి.

దర్శకుడు విశ్వనాథ్ అసమాన ప్రతిభకు సాంకేతిక నిపుణుల, నటీనటుల సామర్థ్యం తోడై, ఈ చిత్రం కళాత్మకంగా రూపుదిద్దుకుంది.

ఇళయరాజా వినసొంపైన పాటలూ, సందర్భాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం; నివాస్ కనువిందైన ఛాయాగ్రహణం, జంధ్యాల పదునైన సంభాషణలూ, వేటూరి సుందర గీతాలూ అద్భుతంగా అమరాయి.

టైటిల్స్ నేపథ్య దృశ్యాలూ, నేపథ్య సంగీతం- ఒక సంగీత నృత్య ప్రధాన చిత్రం చూడబోతున్న మూడ్ ని ఏర్పరుస్తాయి.

రెండు గంటల నలబై నిమిషాల ఈ సినిమాలో మనసు ఆర్ద్రమయ్యే, ఉద్వేగం కలిగే రసవద్ఘట్టాలు అర డజను పైగానే ఉన్నాయి.

బాలకృష్ణ (కమల్ హాసన్) అనే నృత్య కళాకారుడి గతి తప్పిన విషాద జీవితం ఈ చలన చిత్రం.
అనామకంగా పడివున్న తన ప్రతిభను మొదట్లోనే గుర్తించి ఎంతో ప్రోత్సహించిన మాధవి (జయప్రద) పై అతనికి ప్రేమ అంకురిస్తుంది.

కానీ ఆమెకు అంతకుముందే పెళ్ళయిందని తెలుస్తుంది. మామ గారి ఆస్తి కోసం పట్టుబట్టి వివాహాన్ని కాదనుకున్న ఆమె భర్త తిరిగి వస్తే, వారిద్దరినీ కలుపుతాడు.

తల్లికీ, ప్రేమించిన వ్యక్తికీ దూరమై నిరాశ - అతడి ‘బతుకు’లో ‘ నిత్య నృత్యం’ చేసింది.
‘జీవితమే చిర నర్తనం’ కావాలన్న తన ఆకాంక్షలను విస్మరిస్తాడు.

తన ‘పంచ ప్రాణాల’నూ ‘నాట్య వినోదం’గా సంభావించిన సంగతి మరచిపోతాడు. కళకు అంకితం కావాల్సింది, మద్యానికి బానిసైపోతాడు; ఆరోగ్యాన్నీ, ఆత్మ అయిన కళనూ నిర్లక్ష్యం చేస్తాడు.

చివరకు జయప్రద పునరాగమనంతో తప్పు తెలుసుకుంటాడు.

ఆమె కూతురు శైలజకు తన కళను నేర్పటం ద్వారా తన కృతజ్ఞత చూపిస్తాడు. శిష్యురాలి ద్వారా నాట్య కళను బతికించుకోవాలని ఆరాటపడతాడు.

‘వేదం అణువణువున నాదం’ పాట చిత్రీకరణ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆస్పత్రి బెడ్ మీద నుంచే కమల్ శైలజకు నాట్యంలో శిక్షణ ఇవ్వడం, వేదికపై ఆమె ప్రదర్శన... ఇదంతా క్లైమాక్స్ లోకి వేగంగా దూసుకెళ్తుంది.

శైలజ ప్రదర్శన చూసిన సంతృప్తితో తుది శ్వాస విడుస్తాడు. అతన్ని వీల్ చైర్ లో తీసుకెళుతుంటే వర్షం పడుతుంది. అప్పుడు అతడి స్నేహితుడు (శరత్ బాబు) తన శరీరంతో కమల్ ని కప్పే దృశ్యం కదిలిస్తుంది.


మసిబారిపోయిన తన బతుకు కొడిగట్టకముందే... దానికో అర్థం కల్పించుకోవటానికి పరితపించిన వ్యక్తిగా కమల్ హాసన్ నటన శిఖర స్థాయిని అందుకుంది. తల్లి చనిపోయే ఘట్టంలో అతడి నటన పరాకాష్ఠకు చేరినట్టు అనిపిస్తుంది.

మొదట్లో ‘‘అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయటానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమైనా భరతమునివా?’’ అని శైలజ ఫియాన్సీ తనను దూషించినపుడు కమల్ ముఖకవళికల్లో పలికించే భావం అనితర సాధ్యం! అప్పుడు కమల్ చేసి చూపించే భరతనాట్యం, కథక్, కథాకళి రీతుల నాట్యం ఎంత అలవోకగా, వేగంగా, ‘స్టైల్’గా ఉంటుందంటే- కన్నార్పకుండా చూడటం తప్ప మరేం చేయలేం!

ఆ సీన్ చివర్లో కమల్ కాలు పైకి లేచి టీ ట్రే కి తగులుతుంది. గ్లాసులన్నీ పైకి ఎగరటం, కింద పడ్డ ఓ గ్లాసు శైలజ కాలిదగ్గరే గుండ్రంగా దొర్లిపోవటం... ఆ ఘట్టంలోని గాంభీర్యతను రెట్టింపు చేస్తుంది!

‘‘నీ దృష్టి- ప్రేక్షకుల మీద; మనసు- వాళ్ళు కొట్టే చప్పట్ల మీద; ధ్యాస- అందుకోబోయే బిరుదుల మీద’’ అంటూ శైలజను ‘‘నాట్యమయూరి’’ అని హేళనగా సంబోధిస్తాడు. తనను దూషించిన శైలజ ఫియాన్సీని ‘‘ఏమన్నావ్? బాస్టర్డా?’’ అంటూ లాగి చెంపమీద కొట్టి తన ఆత్మగౌరవం ప్రదర్శిస్తాడు.

వెళ్ళిపోతున్న కమల్ కి గేటుకీపర్ ‘‘నమస్తే సార్’’ అంటూ కొత్తగా మర్యాద ఇవ్వటం ఈ మొత్తం సన్నివేశానికంతటికీ మరపురాని కొసమెరుపు!

విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా... ఈ ముగ్గురు ప్రతిభావంతుల త్రివేణీ సంగమం- ఈ సాగర సంగమం. 

విశ్వనాథ్, కమల్ లకే కాదు; విశ్వనాథ్, ఇళయరాజాలకు కూడా ఇది తొలి సమ్మేళనమే.

ఈ సినిమా లోని ఎన్నో సన్నివేశాలు ‘స్పాంటేనిటీ’తో రూపుదిద్దుకున్నాయనీ, అప్పటికప్పుడే ఇంప్రొవైజ్ అయ్యాయనీ కమల్ చాలా సార్లు చెప్పాడు. అందుకే ‘‘వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్’’ అని ఈ చిత్రాన్ని ఆయన అభివర్ణించారు.

ఆ నోస్టాల్జియా ప్రేరేపించే కావొచ్చు- తన ‘దశావతారం’లో సాగర సంగమం నాయిక జయప్రదకూ, భంగిమ కుర్రాడు చక్రికీ స్థానం కల్పించాడు.

‘‘కమల్ కోసం ‘టైలర్ మేడ్’గా తయారుచేసిన కథ ఇది’’ అంటారు విశ్వనాథ్.

ఆయన ఇంకా ఏం చెప్పారో చదవండి-

‘‘Subtleties లో కమల్ తర్వాతే ఎవరైనా! అతని స్పాంటేనిటీ, టైమింగ్ అన్ బిలీవబుల్. ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో ఒక్కొక్క పెర్ఫార్మర్ గురించి జయప్రదతో డిస్కస్ చేస్తూ ఇన్విటేషన్ తిరగేస్తున్న కమల్, ఒక్కసారిగా దానిలో తన పేరు చూసుకుని షాకవుతాడు! నిజ జీవితంలో అలాంటి సందర్భాల్లో ఏడ్చేస్తారు, ఎక్స్జైట్ అవ్వరు. అలానే ఈ సినిమాలో కూడా కమల్, జయప్రద చెయ్యి పట్టుకుని ఏడుస్తాడని ప్లాన్ చేశాం. 

కెమెరా రోల్ అయింది, యాక్ట్ చేయడం మొదలెట్టాడు. 

ఎందుకో నాకు సడన్ గా అనిపించింది- చివరిలో నవ్వితే బాగుంటుందని. వెంటనే ‘కమల్, లాఫ్’ అని అరిచాను. 

నా ఇన్ స్ట్రక్షన్ ని తను క్షణంలో రిసీవ్ చేసుకోవడం, కరెక్ట్ టైమింగ్ తో దాన్ని ఫాలో అయిపోవడం... క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడనిపించింది- అతని పొజిషన్ లో వేరే ఏ ఆర్టిస్టున్నా ‘ఏంటి సార్?’ అని షాట్ ఆపి అడిగుండేవారని!’’

కమల్ ఈ సీన్ లో మనసారా తృప్తిగా నవ్వుతుంటే... వెంటనే కనిపించే ఎగిరే పక్షుల దృశ్యం చక్కని సాదృశ్యంలా భాసిస్తుంది.

మరో ఘట్టం గురించి విశ్వనాథ్ మాటల్లోనే...


‘‘కృష్ణాష్టమి రోజు తాగొచ్చాననే గిల్టీ ఫీలింగ్ తో లోపలికి రానంటాడు కమల్... అప్పుడు శరత్ బాబు భార్య కమల్ కి ఫలహారం పెట్టడానికి తనే బయటికొస్తుంది. 

అప్పుడతను ‘నేనెక్కువేం తాగలేదు’ అంటాడు. 
వెంటనే ఆమె ‘నేనేం అడగలేదే!’ అంటుంది. 

ఆ అనే తీరుకి... మన కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి’’.


‘తకిట తథిమి’పాట చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశం అత్యద్భుతం. వాన నీటకి జయప్రద బొట్టు కరిగిపోకుండా కమల్ తన చేతిని నుదిటికి అడ్డు పెట్టడం- మాటలకందని భావానికి మచ్చుతునక!

మానవ స్వభావం...
ఈ సినిమాలో మానవ మనస్తత్వాన్ని అనితర సాధ్యంగా ఆవిష్కరించిన రెండు సన్నివేశాలున్నాయి.

శైలజ నాట్య ప్రదర్శనలో చేసిన పొరపాట్లను ఎత్తిచూపి, ‘నాట్య శాస్త్రానికి తీరని కళంకం’గా ‘నటరాజుకు శిరోభారం’గా పత్రికలో రాస్తాడు కమల్. ఆమె నృత్యాన్ని ‘కుప్పిగంతులూ, కప్ప గెంతులూ’గా అపహాస్యం చేస్తాడు.

అలాంటివాడు చివర్లో శైలజ జయప్రద కూతురని తెలిశాక...

‘‘చిన్న పిల్ల! ఎలా నేర్పుతారో అలా చేస్తుంది’’ అని సమర్థిస్తాడు. పైగా ‘‘చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది’’ అంటూ ‘ఆ ముద్రా- అదీ- పర్ఫెక్ట్, పర్ఫెక్ట్!’’ అని పొగిడేస్తాడు. ‘‘ఏదో ఎక్కడో చిన్న తప్పు చేస్తే ... ఫూల్ ని, ఛండాలంగా రాయాలా?’’ అని తనపై తాను కోపం తెచ్చుకుంటాడు!

ఈ సన్నివేశం ఎంత సహజంగా ఉందో కదా?


మరో ఘట్టం-

కార్లో కమల్, జయప్రదా వెళ్తుంటారు. తనను సెక్రటరీగా వేసుకోమని జయప్రద అంటే- ‘‘మీరెప్పుడూ నా పక్కనే ఉంటారా?’’ అనడుగుతాడు కమల్. ‘‘ఓ ష్యూర్! వై నాట్? ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ’’ అంటుంది జయప్రద. ‘‘నిజంగా?’’ అంటే ‘‘ప్రామిస్’’ అంటుందామె.

అప్పుడు కారు ఆపమనీ, చిన్న పనుందనీ అక్కడికక్కడే దిగిపోతాడు, కమల్. రోడ్డు పక్కనే ఉన్న చిన్న కొండ అంచున ఏకాంతంగా కూర్చుని తనలో పొంగిపొరలే సంతోషాన్ని ఆస్వాదిస్తాడు.

ఇక్కడ అతడికి ఆనందం జయప్రద వల్లనే. కానీ దాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందటానికి మాత్రం ఆమె ఉనికీ, సామీప్యమూ అవరోధమవటమే వైచిత్రి!

ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం...! ఇలాంటి కథానాయకుడు మరే సినిమాలోనైనా మీకు తారసపడ్డారా?

మనిషి స్వభావంలోని లోతును అద్భుతంగా ప్రదర్శించిన ఈ ఘట్టం అజరామరమనిపిస్తుంది.

జయప్రద ఇంటికి వెళ్ళగానే పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి, మరోసారి అదే ప్రశ్నను అడిగి, అదే జవాబు చెప్పించుకుని, ‘‘థాంక్యూ , థాంక్యూ వెరీమచ్’’ చెప్తాడు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ‘‘ఐ లవ్ యూ’’ చెప్తాడు.

నచ్చనివీ ఉన్నాయి!
ఆస్తి కారణంగా దూరమైన జయప్రద భర్త చివరకు తిరిగి వచ్చి, కమల్- జయప్రదలను ‘ముచ్చటైన జంట’ అవుతారని ప్రకటిస్తాడు. తను ‘శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నా’నని మామగారికి చెప్తాడు. అయినా కమల్ వారిద్దరినీ కలిపి, సాగనంపుతాడు.

ఇక్కడ హీరోయిన్ మనోభావాలేమిటో తెలుసుకోవాలనే కనీస బాధ్యత కూడా హీరో ఫీలవ్వకపోవటం విచిత్రంగా అనిపిస్తుంది.

ఆమె కూడా కమల్ మాటలకు తలూపి, భర్తతో వెళ్ళిపోతుంది.

అతి మంచివారైన భర్తా, ప్రేమికుడూ తమ ఆదర్శ నిర్ణయాలు ప్రకటించి, ఆమెకు వ్యక్తిత్వం ఉందనే సంగతి మరిచారనిపిస్తుంది.

పోనీ, కమల్ ఆ జంటను కలిపాక, నాట్య కళకే జీవితాన్ని అంకితం చేయవచ్చు కదా? ‘‘ఒంటరి తనాన్ని దూరం చేసుకోవటానికి తాగుడుకు దగ్గరవ్వటం’’ ఎందుకూ?

చివర్లో- జయప్రదనుద్దేశించి ‘‘ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అనే మాటలు ‘విని’ శైలజ పశ్చాత్తాపపడి, మారిపోతుంది. ఆమె ఈ మాటలు ఒకవేళ వినకపోతే ఏమయ్యేది? అసలు కమల్ జయప్రదను ‘‘ఆ మహాతల్లి’’ అని సంబోధించకపోతే వారి అనుబంధం పవిత్రం అయ్యేది కాదా? ఇవన్నీ సందేహాలే!

కమల్ ఆశయం- వివిధ ప్రాంతాల నృత్యరీతుల సమ్మేళనంతో ‘భారతీయ నృత్యం’ రూపొందించటం. ఇది శైలజ ద్వారా నెరవేరినట్టు చూపించివుంటే అర్థవంతంగా ఉండేది.

శ్రావ్యమైన, తీయని పాట- ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’. దీని స్థాయికి తగ్గట్టుగా చిత్రీకరణ ఉండదు; చాలా నిరాశపరుస్తుంది.

మరికొన్ని విశేషాలు ...
జయప్రద ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఆమె అపురూప సమ్మోహన రూపాన్ని క్లోజప్ షాట్స్ లో అద్భుతంగా ఒడిసి పట్టాడు ఛాయాగ్రాహకుడు.
ముఖ్యంగా- భంగిమ కుర్రాడి పాలబడ్డ కమల్ ని చాటుగా ఫొటోలు తీసే సన్నివేశంలో జయప్రద సౌందర్యం కనువిందు చేస్తుంది.

*
శైలజ ఫియాన్సీకి డబ్బింగ్ చెప్పింది నేటి హీరో రాజేంద్రప్రసాద్. మరో విశేషం- కమల్ అనువాద చిత్రం ‘తెనాలి’(2000) లో జయరామ్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా రాజేంద్రప్రసాదే. జయరామ్ భార్య దేవయానికి డబ్బింగ్ చెప్పింది ఎస్పీ శైలజ!

* ఎస్పీ శైలజకు నటిగా ఇదే తొలి చిత్రం. చివరి చిత్రం కూడా!

జయప్రద భర్త పాత్రధారికి డబ్బింగ్ అందించినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

భంగిమ కుర్రాడిగా కమల్ ని అదరగొట్టిన చక్రి ఈ మధ్యే విడుదలైన ‘ఈనాడు’కు దర్శకుడిగా ఎదిగాడు.

‘బాలా కనకమయ చేల సుజన పరిపాల’ పాటలో వేదికపై మంజుభార్గవికి బదులుగా కమల్ ని తల్లి ఊహించుకుంటుంది. చివర్లో ‘వేదం అణువణువున నాదం’ పాటలో జయప్రద తన కూతురు నర్తిస్తుంటే కమల్ నాట్యం చేస్తున్నట్టు భావిస్తుంది. (నడి వయసులో ఉన్న కమల్ ని కాకుండా యువకుడైన కమల్ ని ఊహించుకోవటంలో ఎంతో ఔచిత్యం కనిపిస్తుంది).

‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’ పాటలో మంజుభార్గవి... తులసి పాడుతుంటే హఠాత్తుగా జేవీ సోమయాజులే కళ్ళముందు పాడుతున్నట్టు స్ఫురించి, పులకించిపోయిన ఘట్టం ఈ సన్నివేశాలకు మాతృక అయివుండాలి.

‘తకిట తథిమి తకిట తథిమి’ పాటలో... ‘గుండియలను అందియలుగ చేసీ..’ అనే ప్రయోగం చేశారు వేటూరి. ‘వేదం అణువణువున నాదం’ పాటలో కూడా ఇదే కొంచెం మార్పుతో విన్పిస్తుంది- ‘గుండియలే అందియలై మ్రోగా’- అని. అంతే కాదు; ఇదే పాటలో ‘ఎదలాయె మంజీర నాదం’ అని ఇదే వ్యక్తీకరణ చూడొచ్చు.

మరో ఐదేళ్ళ తర్వాత వచ్చిన స్వర్ణ కమలం (1988)లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇదే ఛాయల్లో ‘అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా?’ అని రాశారు!

32 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

"కానీ ఆమెకు అంతకుముందే పెళ్ళవుతుందని తెలుస్తుంది." ..పెళ్ళయిందని కదండీ??
"అప్పుడు అతడి స్నేహితుడు (శరత్ బాబు) తన శరీరంతో కమల్ ని కప్పే దృశ్యం కదిలిస్తుంది." ..ఇప్పటికీ చూసిన ప్రతిసారీ ఈ సన్నివేశం దగ్గర నా కళ్ళు చెమ్మగిల్లుతాయి..
"వెంటనే ‘కమల్, లాఫ్’ అని అరిచాను. నా ఇన్ స్ట్రక్షన్ ని తను క్షణంలో రిసీవ్ చేసుకోవడం, కరెక్ట్ టైమింగ్ తో దాన్ని ఫాలో అయిపోవడం... క్షణాల్లో జరిగిపోయింది." ..'శుభసంకల్పం' లో ఆమని చనిపోయే సీన్ గురించి విశ్వనాధ్ ఇవే మాటలు చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో..
"అతి మంచివారైన భర్తా, ప్రేమికుడూ తమ ఆదర్శ నిర్ణయాలు ప్రకటించి, ఆమెకు వ్యక్తిత్వం ఉందనే సంగతి మరిచారనిపిస్తుంది." ..నిజం..
"జయప్రద ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తుంది." ..ఒక టపా రాస్తానండి, వీలు చూసుకుని.
...మొత్తంగా చాలా బాగుంది.. అప్పుడే అయిపోయిందా అనిపించిందండి...

వేణు చెప్పారు...

థాంక్యూ మురళీ! సవరించినందుకూ, వ్యాఖ్యానించినందుకూ. (టపాలో మీరు చెప్పినట్టే మార్చాను) అయితే- జయప్రద అందం గురించి మీ నుంచి టపా వస్తుందన్నమాట! గుడ్!

రవి చెప్పారు...

వేణు గారు,

పళ్ళున్న చెట్టుకే రాళ్ళన్నట్టు, ఇది విశ్వనాథ్ సినిమా, అందునా కళాఖండం కాబట్టి, ఈ సినిమాలో అసంబద్ధాల గురించి చర్చించటం అవసరమేమో అని నా అభిప్రాయం.

ఈ సినిమాలో అసంబద్ధాలు కొన్ని మీరే చెప్పారు.

మానవ స్వభావం : మొదట శైలజ నాట్యాన్ని, ఓ నాట్యకారుడిగా విమర్శించి, తిరిగి పొగడ్డం మానవ స్వభావ రీత్యా సహజమేమో కానీ, ఈ సినిమాలో కమల్ ను ఓ మానవమాత్రుడు గా చూపలేదు. Above an average human being గా చూపెట్టారు. (చివర్లో జయంతితే సుకృతినో ..అన్న శ్లోకం కమల్ ను ఉద్దేశించింది కదా!). కళ గొప్పది, కళలో తాదాత్మ్యత చెందే కళాకారుడు (ప్రేమికుడి కంటే) గొప్పవాడు అని సరిగ్గా చెప్పలేకపోవడం ఈ సినిమాలో ఓ లోపం. లేదూ ప్రేమికుడే గొప్పవాడు అని చెప్పదల్చుకుంటే - చివర్లో ఆ శ్లోకం తో సహా అనేక సన్నివేశాలు అసంబద్ధం అవుతాయి.

కాబట్టి మనవ స్వభావం అన్న చోట మీరు చెప్పింది అసహజం.

"పోనీ, కమల్ ఆ జంటను కలిపాక, నాట్య కళకే జీవితాన్ని అంకితం చేయవచ్చు కదా? ‘‘ఒంటరి తనాన్ని దూరం చేసుకోవటానికి తాగుడుకు దగ్గరవ్వటం’’ ఎందుకూ?"

ఇది పొరబాటు కాదు. ఇది సినిమా థీం లో ఉన్న ప్రధాన లోపం.

"ఇతను కూడా మంచి డాన్సరే" అన్నప్పుడు కమల్ ఏడుపు, నవ్వులతో చేసిన నటన ఆ కాలానికి బావుంది, కానీ అది చాలా అసహజంగా ఉంది. ఇలాంటి సన్నివేశాలలో క్లుప్తత ఇచ్చే effect, ఇలాంటి భావావేశ నటన ఇవ్వదు. వీలు దొరికితే మోహన్ లాల్ నటించిన "భరతం", శోభన కు నేషనల్ అవార్డ్ వచ్చిన "మణిచిత్ర తాళు" చూడండి.

ఇలాంటివి నాకు మరికొన్ని కనబడ్డాయి. అయితే ముందు చెప్పినట్టు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు! ఇది విశ్వనాథ్ ముద్ర ఉన్న గొప్ప సినిమా. అందులో సందేహం లేదు.

వేణు చెప్పారు...

@ సుజాత: థాంక్యూ! విశ్వనాథ్ సినిమాల్లో పాత్రలు మీరన్నట్టు- సహజంగా ప్రవర్తిస్తాయి. పాత్రల స్వభావం, స్పందన-ప్రతిస్పందనలను అంకితభావంతో చిత్రీకరించటం వల్ల సంవత్సరాలు గడిచినా ‘సాగర సంగమం’ ఎవర్ గ్రీన్ గానే అనిపిస్తోంది.

ఈ సినిమాలో హీరో తన సంతోషాన్ని ‘ఏకాంతం’గా ఆస్వాదించిన ఘట్టం చాలా ప్రత్యేకం. దీన్ని మీ వ్యాఖ్యలో ప్రస్తావించినందుకు అభినందనలు!


@ రవి: ధన్యవాదాలు! విశ్వనాథ్ ముద్ర ఉన్న గొప్ప సినిమా’ కాబట్టే ‘సాగర సంగమం’లోని సూక్ష్మ అంశాల గురించి పట్టించుకోవాల్సివస్తోంది. మీరన్నట్టు- పళ్ళున్న చెట్టుకే రాళ్ళు!

ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ ఇన్విటేషన్ చూసినప్పుడు- ‘కమల్ ఏడుపు, నవ్వులతో చేసిన నటన ఆ కాలానికి బావుంది, కానీ అది చాలా అసహజంగా ఉంది’ అన్న మీ అభిప్రాయం మాత్రం చాలా అరుదైనదేనని అనిపిస్తోంది.

భావన చెప్పారు...

వేణు గారు, మనసును ఒక్క సారి పాతికేళ్ళ వెనక్కి తీసుకెళ్ళేరు.. ఫ్రేము,ఫ్రేము గుర్తు చేసేరు... గొప్ప విషయాలన్నిటిని మీరు, మురళి, సుజాత, రవి గారు అందరు చెప్పేసేరు.. ఇంక చెప్పటానికేమి మిగలలేదు...ఐనా ప్రయత్నిస్తా.. మౌనమేలనోయి పాటకు ముఖ్యం గా జయప్రద అందాన్ని ఎలివేట్ చెయ్యటమేమో ముఖ్యోద్దేశం అనుకుంటా. ఆఖరి బిట్ లొ ఆమె అలా కూర్చుని వుంటే అబ్బ కళ్ళు చెదిరే అందం అంటే ఇదేనేమో అనిపిస్తుంది, ఆ పాట మొదటిలో కూడా ఆమె నీడ ఆమె ను గుడిలో నడుస్తున్నప్పుడు, ఆ తరువాత తల నిండా అన్ని మల్లెపూలతో, కమల హసన్ ఆ పాటలో ఇంక నేను వెళ్ళనా బై అనే పూర్తి వాక్యాన్ని ఒక్క కంటి సైగ తో చెపుతాడు అబ్బ అధ్బుతమండి. ఇంక మీరు చెప్పిన లోటు పాట్ల గురించి నేను చాలా సవత్సరాలు ఆలోచించాను, అవును మీరు నవ్వుతారేమో కాని నేను ఆలోచించాను, మొదటిలో నేను అది ఒక లోపమే అనుకునే దాన్ని, ఇప్పుడు అనిపిస్తుంది, సినిమా మొత్తం విశ్వనాధ్ గారు అతనిని అతి సున్నితమైన మనసు గల వ్యక్తి గా చిత్రీకరించారు... చూడండి వాళ్ళ బాబాయి తిట్టేడని డబ్బులు అమ్మ చేతి లో పెట్టీ నేనే డబ్బు పంపిస్తా అని చెపుతూ రైలు వెంబడి పరిగెత్తినట్లు. సున్నితమైన మనస్సు,అందులో కళాకారుడు వెంట వెంటనే వైఫల్యాలను తట్టూకోవటానికి అతను ఆశ్రయించిన విధానం తాగుడు. ఏదో సాధించాలి అనే పట్టుదల, అత్యంత ప్రియమైన వారిని కోల్పోవటం తో సం యమనం కోల్పోయినట్లు చూపించటమేమో అనిపిస్తుంది మరి నాకు.

జయప్రద అలా భర్త వెంబడి వ్యక్తిత్వమే లేనట్లు వెళ్ళి పోవటం అవును కొంచం చిరాకును తెప్పిస్తుంది కాని అక్కడ ఇంకా కధ సాగ దీసినట్లు అవుతుందని ఎక్కువ వివరణ ఇవ్వలేదేమో అనుకుంటా.. సుజాత గారన్నట్లు ఇది పూర్తి గా కమలా హసన్ సినిమా..

బొల్లోజు బాబా చెప్పారు...

one more interesting fact in this film is that, kamal never gives a stage performance at any time in the film. yet the director convinces that he is a great artist.

sunita చెప్పారు...

కొత్తగా చెప్పేటందుకు ఏమీ లేదు అందరూ చెప్పారు, కానీ జయప్రద అందం, కమల్ హాసన్ ఏకాంతం, మరలా ఫోను చేసి అడగడం, ఇప్పటికీ ఒక గమ్మత్తైన ఫీలింగ్. అంతే!

వేణు చెప్పారు...

@ భావన : ధన్యవాదాలండీ! కమల్ కంటి సైగతో చెప్పిన సంగతి బాగా గుర్తు చేశారు. ‘వైఫల్యాలను తట్టుకోవటానికి అతను ఆశ్రయించిన విధానం తాగుడు’ నిజమే కానీ, ఎంత సున్నిత మనస్కుడైనా ఆ మార్గం అనుసరించటమే జీర్ణించుకోలేని విషయం.

మొత్తానికి ఈ సినిమాలో జయప్రద మారుమాట లేకుండా భర్త వెంట నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం చాలామందికి నచ్చలేదన్నమాట!

వేణు చెప్పారు...

బొల్లోజు బాబా గారూ! ‘సాగర సంగమం’లో ఎవరికీ తోచని మంచి పాయింట్ పట్టుకున్నారు.

శైలజ డాన్స్ లో తప్పును సరిదిద్దటానికి కమల్ మూడు నృత్య రీతులు అద్భుతంగా చేసి చూపించటం ప్రేక్షకుల మదిలో బాగా ముద్రపడిపోయింది. దాంతో కమల్ గొప్ప డాన్సర్ అని కన్విన్స్ అవటం సాధ్యమయిందనుకుంటాను. మీకు ధన్యవాదాలు!@ Sunita : థాంక్యూ! 'కమల్ హాసన్ ఏకాంతం, మరలా ఫోను చేసి అడగడం, ఇప్పటికీ ఒక గమ్మత్తైన ఫీలింగ్'... బాగా చెప్పారండీ.

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

"గుండియలను అందియలుగ చేసీ" - "గుండియలే అందియలై మ్రోగ"

భలే! ఎన్నో సార్లీ పాటలు విన్నా యిప్పటి దాకా గుర్తించనే లేదీ పోలికని!

సాగరసంగమం మంచి టెక్నికల్ వేల్యూస్ ఉన్న సినిమా అయినా, మీరు చెప్పిన కారణాలవల్లనే నాకీ సినిమా నచ్చలేదు. కథానాయకుడి మీద చిరాకే తప్పిస్తే జాలి కలగ లేదు. విశ్వనాథ మిగతా సినిమాల్లా దీన్ని మళ్ళీ మళ్ళీ చూడ్డం నావల్ల కాదు. (ఈ లిస్టులో మరో రెండు మూడు సినిమాలున్నాయనుకోండి!)

ఇంతకీ ఈ సినిమాకి "సాగరసంగమం" అన్న పేరెందుకు పెట్టినట్టు?

వేణు చెప్పారు...

కామేశ్వరరావు గారూ! ధన్యవాదాలు. ‘సాగర సంగమం’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటో నాకు కూడా అర్థం కాలేదండీ. పతాక సన్నివేశంలో వచ్చే ‘వేదం అణువణువున నాదం’ పాటలో ‘సాగర సంగమమే ఒక యోగం, క్షార జలధులే క్షీరములాయె..’ అని ఉంటుంది. అంతకుమించి ఎక్కడా ‘క్లూ’ లేదు.

ఈ టైటిల్ ఆ సినిమాకు ఎలా సరిపోతుందో ఎవరైనా చెప్పగలరా?

"గుండియలను అందియలుగ చేసీ" - "గుండియలే అందియలై మ్రోగ"... ఈ పోలికను ఎన్నోసార్లు విన్నా మీరు గుర్తించలేదా? ఆశ్చర్యంగా ఉందండీ:)

వేణు చెప్పారు...

Sree గారూ! ‘వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే..’ సాటను మీరు అపార్థం చేసుకున్నారండీ. ఆ పాట ‘అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నలు దోచాడే..’ అని ఉంటుంది. మీరు సరిగా వినలేదు.
‘మంచి సాహిత్యం...’ అంటూ కమల్ ఇంత చక్కని పాటను కమర్షియల్ భంగిమల్లోకి మార్చి దిగజార్చటంపై బాధపడతాడు. గుర్తుంది కదా?
అచ్చ తెలుగులో రాసిన ఈ మాటలు మీకు సంస్కృతంలో రాసినట్టు అనిపించాయా?:)

ఈ సినిమాలో కమల్ తాగుడికి బానిసవడానికి సరైన రీజన్ ఎస్టాబ్లిష్ కాలేదు. అందుకే మీలాంటి ఎందరికో ఈ మలుపు నచ్చలేదు. ‘తను పొందిన ఆలంబన, స్ట్రెంత్ లలో కొంతైనా మిత్రుడికి గానీ, ప్రేమించిన అమ్మాయికి గానీ ఇచ్చినట్లు నాకు అన్పించలేదు’ అని మీరు రాసింది బావుంది.

‘కమల్ ఏకాంత ఆనందా’న్ని అప్రిషియేట్ చేసినందుకు అభినందనలు. శ్రద్ధగా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలండీ!

sree చెప్పారు...

venu garu,

ee bhayankara bhasha lo rasina chadivi javabichinanduku santosahm.telugu lo rase avakasam ledu.mee ku ee himsa tappadu.
aa pata sahityam tappuga ardham chesukunnanduku kshamapanalu.chakkati telugu lo manchi comments rastunnavallandarikii boldanta krutagyatalu.

వేణు చెప్పారు...

Sree గారూ, వ్యాఖ్యలో ‘కొంత భాగం’ తీసెయ్యటానికి అవకాశం ఉండదు, మొత్తం తీసెయ్యొచ్చు గానీ! ‘పాట’ సంగతి మినహాయించి, మిగతా వ్యాఖ్య మళ్ళీ పంపగలరా?

SIVA చెప్పారు...

Dear Venu,

Excellent review of a classic movy. Now a days there is no space for real Movy reviews. You are filling up that most essential of all literary activity-REVIEW.

Please continue the excellent work and review many more classics.

SIVA చెప్పారు...

Dear Venu,

Once Readers Diregest Editor expressed that editing RD is most difficult task, for even simple mistake of punctuation gets angry responses from readers.

Likewise, Viswanath set very high standards for his movies and nobody else so far even tried to come near to those standards.

Having experienced through his movies those exalted standards, now we think that we find some incongruous scenes.

I hope and wish that all Viswanath movies right from his black and white cinemas, would be published as collector's DVDs with Viswanath and his team members Interviews and commentary. That would be a great tribute to the versatile Director, entire Telugu race should be proud of.

Am I expecting too much?? I think so!!

వేణు చెప్పారు...

శివ గారూ, ‘సాగర సంగమం’ సమీక్ష మీకు నచ్చినందుకు సంతోషం. కె. విశ్వనాథ్ సినిమాల ప్రమాణాలను‘రీడర్స్ డైజెస్ట్’తో పోలిక తేవడం బావుంది.

విశ్వనాథ్ సినిమాలన్నిటినీ ఇంటర్వ్యూలతో, కామెంటరీతో కలెక్టర్స్ డీవీడీలుగా తేవాలన్న మీ సూచన చాలా బావుంది. ఇందులో ఆచరణకు సాధ్యం కానిదేమీ లేదు! ‘కమర్షియల్’గా ఆలోచించినా ఈ డీవీడీలకు ఆదరణ ఉంటుంది కదా!

తృష్ణ చెప్పారు...

చాలా నిస్పక్షపాతంగా రాసారండి.బాగుంది విశ్లేషణ.

* ‘నేనెక్కువేం తాగలేదు" అంటాడు. వెంటనే ఆమె ‘నేనేం అడగలేదే!’ అంటుంది. ఆ అనే తీరుకి... మన కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి"
* "జయప్రద బొట్టు కరిగిపోకుండా కమల్ తన చేతిని నుదిటికి అడ్డు పెట్టడం- మాటలకందని భావానికి మచ్చుతునక!"
*"ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం...!"
*"అతి మంచివారైన భర్తా, ప్రేమికుడూ తమ ఆదర్శ నిర్ణయాలు ప్రకటించి, ఆమెకు వ్యక్తిత్వం ఉందనే సంగతి మరిచారనిపిస్తుంది."
హీరోయిన్లకు సొంత తెలివితేటలు ఎందుకనో చాలా తెలుగు సినిమాల్లో ఉండవు మరి..అలా చేస్తే హీరోగారి గొప్పతనం అనగారిపోతుందనో,ఇమేజ్ తక్కువైపోతుందనో దర్శకులకు భయమేమో...!!
ఈ నాలుగు పాయింట్లకు వందకు నూటేభై మార్కులు..!!
ఆలస్యంగానైనా మంచి టపా చూసాను..!!

వేణు చెప్పారు...

@ తృష్ణ: 'సాగర సంగమం' రివ్యూ పై మీ స్పందనకు థాంక్యూ!

Surya చెప్పారు...

I already have a collection of most of Kalatapasvi Sri K Viswanath's movies like Sagara Sangamam, Sankarabharanam, Srutilayalu, Swarna Kamalam, Sirisiri Muvva, Swarabhishekam, etc. Each one is a classic in its own right.
Mr Siva, most of Sri Viswanath's movies are readily available in the market in the form of video compact discs and digital versatile discs. In fact, the prices have fallen so much now. I purchased Sankarabharanam for Rs 500 but now it is available for Rs 50 or Rs 60.
Cine-goers remember Sri Viswanath only for his movies like Sankarabharanam, Sagar Sangamam and the like but there is yet another classic that he directed in the black & white days. Neramu-Siksha, starring Krishna, M Balaiah and others is a wonderfully-made film and carries a message. Watching the film even now reveals its relevance.
Hats-off to a great director like Sri Viswanath.

వేణు చెప్పారు...

kamala గారికి... సాగర సంగమం రివ్యూ గురించి మీ అభిప్రాయం పంపినందుకు ధన్యవాదాలు. జయప్రద అందాల గురించి నా బ్లాగు పోస్టులో ఎక్కడ చర్చించాను?

'జయప్రద ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఆమె అపురూప సమ్మోహన రూపాన్ని క్లోజప్ షాట్స్ లో అద్భుతంగా ఒడిసి పట్టాడు ఛాయాగ్రాహకుడు.
ముఖ్యంగా- భంగిమ కుర్రాడి పాలబడ్డ కమల్ ని చాటుగా ఫొటోలు తీసే సన్నివేశంలో జయప్రద సౌందర్యం కనువిందు చేస్తుంది.'... ఇదీ నేను రాసింది. దీనిలో 'కనువిందు ' అనేది పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా అని నా భావం.

రంగనాయకమ్మ గారి అభిమానులకు సౌందర్య దృష్టి ఉండకూడదా?

'స్త్రీల అందాల్ని విక్రయించడానికి సినిమా ఫీల్డు వుంటే, దాన్ని కొనుక్కుని ఆస్వాదించడానికి మీలాంటి పురుషులు వున్నారు'అని రాశారు.

కనీసం ఈ సినిమాకు మీ వ్యాఖ్య వర్తించదండీ. అలాగే నాకు కూడా మీ కామెంట్ వర్తించదు. నా రాతల్లో ఎక్కడ మీకా అభిప్రాయం కలిగిందో చెప్పాల్సింది మీరే.

'స్త్రీలని ఏ దృష్టితో చూడాలీ అన్న సంగతి తెలియనప్పుడు...'- ఇంత తీవ్రమైన అభిప్రాయం ఏ ఆధారంతో మీరు ప్రకటించారు?

^^^^^^^^^

(kamala గారూ, October 11, 2009న రాసిన మీ కామెంట్ నా వేరే పోస్టులో వచ్చింది. దాన్ని ఇక్కడ.. కాపీ చేస్తున్నాను.)

'' వేణు గారూ,

మీరు సాగర సంగమం గురించిన రాసిన వాఖ్యానంలో జల్లెడకి ఎన్ని చిల్లులు వుంటాయో, అన్ని చిల్లులు వున్నాయి. దర్శకుడు ఎటువంటి ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారో, అటువంటి ప్రేక్షకులు చిన్న చిన్న విమర్శలతో వాటిని అంగీకరించి, అభ్యుదయం గలవారిగా నిలుస్తారు. అన్ని చిల్లుల గురించీ చర్చించే వుద్దేశ్యం లేదు కాబట్టి, ఒకే ఒక చిల్లు గురించి నా అభిప్రాయం రాస్తాను.

చలం, రంగనాయకమ్మల సాహిత్యం చదువుతానని చెప్పుకుంటూ, జయప్రద అందాల గురించి బ్లాగులో చర్చించడం ఏ విధంగా సమంజసం? స్త్రీల అందాల గురించి పురుషులు పబ్లిక్‌లో మురిసిపోవడం ఫ్యూడల్‌ విలువ కాదా? స్త్రీల అందాల్ని విక్రయించడానికి సినిమా ఫీల్డు వుంటే, దాన్ని కొనుక్కుని ఆస్వాదించడానికి మీలాంటి పురుషులు వున్నారు. స్త్రీలని ఏ దృష్టితో చూడాలీ అన్న సంగతి తెలియనప్పుడు, ఎవరి సాహిత్యం చదివితే మాత్రం ఏం ప్రయోజనం? అవును, నా విమర్శ ఘాటుగానే వుంటుంది. విషయం కూడా అంత ఘాటు కాబట్టి.''

SIVA చెప్పారు...

Surya garu,

What I ment by DVDs not the VCD just copied on DVD that is available in the market. Please see a real DVD for English Movies. How wonderfully they bring out a DVD with lots of extras like

1. Original Trailor
2. Original Still pictures
3. Pictures of original posters
4. Pictures of locations where the picture was shot
5. Interviews with the major actors who acted in the movy
6. Interviews with Director, Music Director etc.
7. Option for Audio commentary all through the movy by an eminent personality giving us his insight as the movy is going on and dialogues also coming in the background.

This is what I call Collector's DVDs not what the trash thats available in the market for Rs.50/-which was earlier sold for Rs.500-.

No telugu movy has come in real DVD so far. Original DVD contains such a superb quality picture that you can enjoy the viewing in any TV or PC.

Telugu people are yet to see the taste of such DVDs. May be the sellers or publishers of the DVDs feel that we do not deserve or cannot afford such items. Thats why they are allowing our classic movies to rot in VCDs and copied on DVD disc with the same quality.

kamala చెప్పారు...

ఆడవాళ్ళని శరీర అందాల దృష్టితో చూడ్డమే తప్పు పద్ధతి. "కనువిందు" అనేది శరీర అందాల విషయంలో చాలా తప్పు మాట. ఇది పురుషులకే కాదు, స్త్రీలకి కూడా వర్తిస్తుంది. ఒక స్త్రీ ఇంకొక స్త్రీ శరీర అందాల గురించి మాట్టాడితే, అది కరెక్టయి పోదు. ఆ స్త్రీ దృష్టి కూడా తప్పుగా వుందని మాత్రమే అర్థం. అయినా జయప్రద అందాల గురించి మీరు రాసిందానికి ఎంత మంది స్త్రీలు స్పందించారో చూశారుగా. అయినా సంఖ్యా బలం అన్ని వేళలా సరైన విషయాలని చూపించదు. నేను చెప్పిన మాటలు మీరు సరైన పద్ధతిలో తీసుకోలేదు.

నా వాఖ్యానాలకి ఆధారం మీరు రాసిన వాక్యాలు, ముఖ్యంగా, "కనువిందు" అనే మాట, ఆడవారి శారీరక అందాలకి సంబంధించి, మాత్రమే కాకుండా, ఇంకొకరి టపాకి, మీరు రాసిన, "జయప్రద అందం గురించి మీ నించి టపా వస్తుందన్న మాట! గుడ్‌!" అన్న జవాబు కూడా.

ఆ మధ్య కాలంలో ఆంధ్రభూమి వాళ్ళు శృంగార కార్టూన్లు అనే పోటీ పెట్టారు. ఎటువంటి కార్టూన్లు కొంత మంది పంపారో చెబుతూ, కొన్ని పచ్చి బూతు కార్టూన్లు ప్రచురించి, అటువంటి బూతు కార్టూన్లు పోటీకి అనర్హం అని ప్రకటించారు. అలాగే, సినిమాల్లో స్త్రీని కొన్ని పాటల్లో ఎలా ఘోరంగా చూపిస్తారో అని వివరిస్తూ, గీత అనే నటిని అలాగే మొత్తం ఒక పాట నిండా చూపిస్తారు, మీ సాగర సంగమం సినిమాలో. ఇదీ వ్యాపార పంథా అంటే! అమాయకులైన ప్రేక్షకులు, పాటలో హీరోయిన్‌ని ఇలా చూపించకూడదుట అంటూ, మొత్తం ఆ అమ్మాయిని అలాగే "కనువిందు"గా చూసేస్తారు. అందుకని నా వాఖ్యలు ఆ సినిమాకి తప్పకుండా వర్తిస్తాయి. అది అర్థం చేసుకోని మీకు కూడా వర్తిస్తాయి.

ఒక మనిషి అందాల గురించి మాట్టాడ్డమే ఫ్యూడల్‌ పద్ధతి. అందుకే విజ్నులందరూ, "అందాల పోటీ"కి వ్యతిరేకంగా వుంటారు. సౌందర్య దృష్టి అనేది మనుషుల శరీరాల విషయంలో కాదు వుండాల్సింది. ప్రకృతి విషయంలో, లేదా భావనల విషయల్లో. స్త్రీల శారీరక అందాల్ని చాలా యేళ్ళ కిందట్నించే గమనిస్తూ, దానికి సౌందర్య దృష్టి అని కూడా పేరు పెట్టేసుకున్నారు గడుసుగా.

ఇంతకు మించి వివరణలు అనవసరం. ఈ విషయం ఇంతటితో వదిలేస్తున్నాను.

వేణు చెప్పారు...

kamala గారూ, మీరు రాసినట్టు- ఆడవాళ్ళను శరీర అందాల దృష్టితో చూడ్డం తప్పు పద్ధతే. నేను అలా చూడలేదనే చెపుతున్నాను.

నేను 'అందం' అంటే మీరు 'అందాలు ' అని అపార్థం చేసుకున్నారు.

'సాగర సంగమం' లో జయప్రద చాలా అందంగా కనిపిస్తుం' దని నేను రాసిన మాటలను ఒక ప్రశంస గా, ఒక వాస్తవంగా సామాన్య అర్థంలోనే తీసుకోవాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 'ముఖ సౌందర్యం' గురించే నేను ప్రస్తావించాను. 'కనువిందు ' అనే నా మాటకు కూడా నా ఉద్దేశంలో అదే అర్థం.

అదే భావంతో మరొకరు రాయబోయే టపా గురించి 'గుడ్' అన్నాను. 'అందాల పోటీల ' పై నాదీ మీ అభిప్రాయమే.

'సాగర సంగమం' సగటు వ్యాపార సినిమాలకంటే చాలా మెరుగు. ఇలాంటివి కూడా ఇప్పుడు రావటంలేదుగా! అందుకే ఆ సినిమా గురించి రాశాను.

మీ స్పందనకు చాలా ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

Don't waste your time reacting to useless and senseless comments. You wrote your views, that's it. Whether people like or not is immaterial, as every individual has his\her opinion about each and every thing. You need not react to the likes of Kamala who, I feel, is myopic.

Surya చెప్పారు...

I agree with Mr Siva that the quality of DVDs produced by our Telugu industry is pathetic. Yes, I know how these people simply convert VHF cassettes into VCDs and then into DVDs. But we are left with no other option since our industry hasn't matured to the Hollywood or even Bollywood level. It will take a few more years for that to possibly happen. Till then we have to be content with what we get.

Ruth చెప్పారు...

hmm.... was atchin TV by accident today n saw a program about this movie. your exact same words are repeated by the anchor. i guess you are the guy who wrote those line? or is it that the TV ppl just picked those from your blog? it is hmtv i guess.

వేణు చెప్పారు...

@ Ruth: ఆ టీవీ ప్రోగ్రాం సంగతి తెలీదండీ. ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. మీరన్నట్టు బహుశా ఆ టీవీ వాళ్ళు నా 'సాగర సంగమం' బ్లాగు పోస్టు చూశారేమో!

Ruth చెప్పారు...

sorry for writing in english.. but no time to compose in telugu.

are you really serious that you don't know anything about that program? because the lady spoke the things "word to word " about kamal hassan laughing at the time of programsheet, he wanting to be alone when she says she'll be beside hin all his life. and about her beauty while shooting him with the bhangima boy.... and many many more.... i followd the program for almost 15 mins(but not from the start) and it just struck me that i read those lines before and continued it....it's just as if she's reading from your blog. strange! probably you should file a copyrights case on them !!!
donno, but if you want more info, the name of the program is- nandivardhanaalu.

వేణు చెప్పారు...

Ruth గారూ,'సాగర సంగమం’ టపాలో నేను రాసిన విషయాలను యథాతథంగా ఆ టీవీ వాళ్ళు ఉపయోగించుకోవటం కాపీ రైట్ ఉల్లంఘన కిందికి వస్తుందనుకుంటా. అయితే ఇది మరో రకంగా అది నా టపాకు అప్రిసియేషనే కదా! ఎనీవీ, థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫమేషన్ అండ్ కన్సర్న్.

రాం చెరువు చెప్పారు...

విశ్వనాథ్ గారి చిత్ర విశేషాలతో ఆయన అభిమానులందరం కలిసి ఒక టీవీ కార్యక్రమం "విశ్వనాదామృతం" రూపొందిస్తున్నాం. విశ్వనాథ్ గరు తన చిత్రాలను గురించి, పాటల గురించి, సాంకెతిక నిపుణుల గురించి, నటీ నటు ల గురించి వివరంగ మాట్లదుతారు. మరిన్ని వివరాలకు మా ఫేసెబుక్ పేగి చూడండి.

Kalyani S J చెప్పారు...

"ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం...!" ఔనా కాదా అన్న భావ సంచలనాన్ని అదుపు చేసుకోలేక, దిగి, తర్వాత కాసేపటికి తేరుకుని మళ్ళీ అడిగి ఔననిపించుకున్నాడు అని అనుకున్నాను ఇన్నాళ్ళూ, మీరు చూపించిన కోణం మరింత హృద్యం గా ఉంది లెండి.
నదులన్నీ సాగరం లో సంగమించినట్టు, కళ లన్నిటి పరమావదీ,కళాకారుణ్ణి విశ్వంలో(rest of the world) విలీనం చెయ్యడమే అని దర్శకుడు భావించారేమో. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుని తనివితీరా విని సంతృప్తి చెందుతాడు కదా! అలా అతని కళ శిష్యురాలిలో నింపడం ద్వారా తన గమ్యానికి తాను చేరాడు బాలకృష్ణ అనుకుందామా?