ఒకప్పుటి 'చందమామ'లో పూర్తి పేజీ సైజు బొమ్మలు నాకెంతో ఇష్టం.
వీటి సంగతి ఆన్‌లైన్ చందమామలో నిన్న వచ్చిన ఆర్టికిల్ లోప్రస్తావించాను. చందమామ చరిత్ర బ్లాగులో ఆన్ లైన్ చందమామ అసోసియేట్ ఎడిటర్ కె. రాజశేఖరరాజు గారి పరిచయ వాక్యాలతో దీన్ని ప్రచురించారు.
సరే, సందర్భం వచ్చింది కదా అని ‘విచిత్ర కవలలు’ సీరియల్ లో నాకెంతో ఇష్టమైన రెండు వర్ణచిత్రాల గురించి ఇప్పుడిలా రాస్తున్నాను.
‘చందమామ’లో పాఠకాదరణ పొందిన తొలి ధారావాహిక ‘విచిత్ర కవలలు’.
రచయిత పేరు తెలీదు.
(తాజా చేర్పు: ఈ పోస్టు రాసినపుడు తెలియదు కానీ, తర్వాత కాలంలో ఈ నవలా రచయిత పేరు రాజారావు గారని తెలిసింది...) .
దీని ప్రచురణ (1950 జులై- 1951 డిసెంబరు) తర్వాతే దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘తోక చుక్క’కు అంకురార్పణ జరిగింది.
చందమామలో రెండోసారి ప్రచురించినపుడే (1974 జులై- 1975 డిసెంబరు) ఈ ‘విచిత్ర కవలలు’ ధారావాహికను చదివాను.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత, 2009 జనవరిలో చదివితే బాల్యం రోజుల్లో అనుభవించినంత స్థాయిలో ఉత్కంఠ కలగలేదు. కానీ, నాటి అపురూప అనుభూతులు స్ఫురణకు వచ్చాయి.
ఈ ధారావాహికలో ముగ్గురు కవల సోదరులు కథానాయకులు.
ఉదయనుడూ,
సంధ్యా,
నిశీధుడూ.
వీరు తప్పిపోయిన కథానాయికల (సుహాసిని, సుభాషిణి, సుకేశిని) అన్వేషణకు వెళ్తారు. గుర్రాల మీద వెళ్తుండగా ఉదయనుడు కందకంలో పడి, హఠాత్తుగా కనపడకుండా పోతాడు.
మిగిలిన ఇద్దరిలో సంధ్య దప్పిక వేసి, కొలనులో నీళ్ళు కొంచెం తాగగానే శిలాప్రతిమగా మారిపోతాడు.
నిశీధుడు దాహం సంగతి వాయిదా వేసి, ఓ తోటలో మామిడి పండు కొరగ్గానే కోతి రూపం వచ్చేస్తుంది.
ఆ కోతిరూపంతోనే నిశీధుడు, సంధ్య శిలారూపం దాల్చిన కొలను దగ్గరకొచ్చి చుట్టుచుట్టూ తిరగటం మొదలుపెడతాడు.
అప్పుడే కొలనులోంచి ఓ హంస బయటకు వచ్చి, ఉదయనుడిగా మారిపోతాడు.
సంధ్య శిలాప్రతిమ కంటబడి కొయ్యబారిపోతాడు. ఇంతలో కోతి రూపంలో ఉన్న నిశీధుడు ఉదయనుడి దుస్తులను పట్టుకు లాగుతూ కాళ్ళు చుట్టేసుకుంటాడు.
ఇదీ సందర్భం!
దీనికి 'చిత్రా' వేసిన ‘పేజీ సైజు బొమ్మ’ పైన టైటిల్ కిందనే పెట్టాను, చూడండి. ఎంత బావుంటుందో!
నీళ్ళు తాగుతూ శిలగా మారిన సంధ్యా కుమారుడూ,
అతణ్ణి చూస్తూ ఉదయనుడు నిశ్చేష్టుడైవున్న భంగిమా,
మర్కట రూపంలో నిశీధుడి విచారం...
ఇవన్నీ ‘చిత్రా’ చాలా అద్భుతంగా వేశారు.
నా చిన్నప్పటి స్మృతిలో ఇప్పటికీ చెదరని చిత్రమిది.
మరో బొమ్మ-
కొలనులో దూకుతూ హంసలుగా మారిపోతున్న నాయికా నాయకులు!
ఇద్దరి చేతులూ హంసల మెడలుగా మారిపోతూండటం, కొలనులోకి దూకుతున్న యాక్షన్ భంగిమా .... వీటిని భలే ఊహించి చిత్రించారు కదూ?
కథలో ఉత్కంఠ కూడా కలిసి, ఈ వర్ణ చిత్రం అప్పట్లో నన్నెంతగా సంభ్రమంలో ముంచెత్తిందో, సమ్మోహితం చేసిందో చెప్పలేను!
( ఈ డిజిటల్ బొమ్మలో క్వాలిటీ లేక అంత స్పష్టంగా కనపడటం లేదు).
ఈ ధారావాహికలో మరెన్నో కనువిందు చేసే వర్ణచిత్రాలున్నాయి.
‘విచిత్ర కవలలు’ను ‘ బ్లాగాగ్ని’ బ్లాగులోకి వెళ్ళి ఎంచక్కా మీ సిస్టమ్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి!
ఆకాశంలో చందమామను ఆహ్లాదించని బాల్యం ఎంత నిస్సారమో...
'చందమామ' పత్రికలో బొమ్మలను చూసి, ఆనందించని బాల్యమూ అంతే అనిపిస్తుంది !
( ‘చిత్రా’ గురించి నేను రాస్తానన్న టపా ఇది కాదు.:)
దాని గురించి మరోసారి!)
9 కామెంట్‌లు:
venu garu meeru mee comments to balyanni gurthu chestunnaru . mee efforts good
వేణుగారూ నా 'చందమామ చరిత్ర'బ్లాగులో కొత్త పోస్టుకు సంబంధించి మీ బ్లాగు లింకు ఇవ్వాలని ప్రయత్నిస్తూ మీ కొత్త రచనను చూశాను. విచిత్ర కవలలు గురించి మీరు వెలిబుచ్చిన సందేహాలను సరైన సమాధానం దొరికింది. కింద ఇస్తున్నా చూడండి.
చందమామ ప్రింట్ ఎడిషన్ అసోసియేట్ ఎడిటర్ ఎ.బాలసుబ్రహ్మణ్యం గారని అడిగితే ఆయన ఈ విషయాలు చెప్పారు.
విచిత్ర కవలలు ధారావాహిక చందమామలో మొట్టమొదటి సీరియల్ రచన. దీని రచయిత రాజారావుగారు. ఈయన చక్రపాణి గారి బంధువు. కుటుంబరావు గారు చందమామలో చేరకముందే, ప్రారంభం నుంచే -1947-52- ఈయన చందమామ ఇన్‌ఛార్జ్ ఎడిటర్‌గా పనిచేశారు. ముద్దా విశ్వనాధం, చివర్లో దాసరి సుబ్రహ్మణ్యం గార్లు ఈయనకు సహాయకులుగా సంపాదక బృందంలో ఉండేవారు.
'విచిత్ర కవలలు' సీరియల్ అప్పట్లో పుస్తక రూపంలో కూడా వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిందట. చిత్రాగారి బొమ్మలు ఈ సీరియల్‌కే హైలెట్. తర్వాత 'తోకచుక్క' సీరియల్ కూడా రాజారావు గారే రాస్తారని చందమామలో ప్రకటన కూడా అప్పట్లో వేశారట. అయితే విషాదకర పరిస్థితుల్లో రాజారావు ఆకస్మికంగా పోవడంతో ఆ అవకాశం దాసరి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు.
తోకచుక్క ధారావాహికతో చందమామలో సుబ్రహ్మణ్యం గారి విజయయాత్ర మొదలైంది. తర్వాత పాతికేళ్లు తెలుగు కధాసాహిత్యం దాసరి గారి కాల్పనిక ప్రపంచపు మంత్ర నగరి సరిహద్దుల్లో తడిసి ముద్దయింది. 1970ల మధ్యలో విచిత్ర కవలలు తిరిగి చందమామలో తిరిగి ముద్రించారు. చందమామలో పాత రచనల రిపిటీషన్ -పునర్ముద్రణ- దీంతోటే మొదలయ్యిందని వినికిడి. రాజారావుగారి ఏకైక సీరియల్ 'విచిత్ర కవలలు'.
మీరు చందమామ చరిత్రకు సంబంధించిన ఏ విషయంపైనా రాసేటపుడు సందేహమున్న అంశాలపై మాతో సంప్రదించగలకు. చందమామ పాత చరిత్రకు సంబంధించి ఇద్దరు అమూల్యమైన వనరులు ఇక్కడ ఉన్నారు. ఒకరు చందమామ చిత్రకారులు శంకర్ గారు, మరొకరు ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారు.
విచిత్ర కవలలుపై మీ అమూల్య రచనకు అభినందనలు.
మీ ఒరిజనల్ వ్యాసంలోనే ఈ మార్పులను చేర్చగలరు.
వేణూ గారూ,
చాలా బాగుందండి మీ ధారావాహిక సమీక్ష. విచిత్రకవలలు ఒక్కటే అనుకుంటాను పుస్తకరూపంలో వచ్చిన చందమామ ధారావాహిక.
మీరు వ్రాసిన చందమామ జ్ఞాపకాలు కూడ చక్కగా ఉన్నాయి. చాలా విషయాలు వ్రాశారు.
చిత్రా గారి గురించి నేను కొంత నా బ్లాగులో వ్రాశాను. మీకున్న సోర్సెస్ తో మరిన్ని వివరాలు సంపాయించి, విపులంగా ఒక మంచి వ్యాసం చిత్రా గారి మీద వ్రాస్తారని ఆశిస్తున్నాను. శంకర్ గారి గురించి త్వరలో వ్రాసే అవకాశాం వచ్చేట్టుగా ఉన్నది.
మంచి సమీక్ష/జ్ఞాపకం వ్రాసినందుకు అభినందనలు
@ సుజాత: చందమామ మీద నాతో పాటు ఎంతోమందిలో కనిపిస్తున్న ప్రేమ, తరగని నిధిలా అన్పిస్తుంది. మరి ‘జ్ఞాపకాల తవ్వకాలు’ ప్రారంభమవటం శుభ సూచకమే కదా! మీకు ధన్యవాదాలు!
@ kodali Bhavani : మీ స్పందన సంతోషం కలిగిస్తోంది. థాంక్యూ సర్!
@ Chandamama: రాజు గారూ! ‘విచిత్ర కవలలు’ రచయిత పేరు రాజారావు గారు అని తెలిపినందుకు ధన్యవాదాలు. ఆయన వివరాలు ఇన్నాళ్ళకు తెలిశాయి. ఆయన ఫొటోను సేకరించగలరా?
చందమామ చరిత్రకు సంబంధించి అమూల్యమైన వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీపై, మాపై ఉంది.
టపాలో మార్పులు చేయటం కంటే మీరు చెప్పిన సమాచారాన్ని యథాతథంగా ఇవ్వటం బావుంటుందని... ఇలాగే ఇస్తున్నాను. థాంక్యూ!
@ Siva: చందమామ జ్ఞాపకాల గురించి ఎంత రాసినా తృప్తిగా ఉండదండీ. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
Venu Garu,
Mee prayatnam chala bagundi.mee ishtalu koda bagunnayi.boldanni thanksulu.
Sree గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు!
hi sir,
can you upload chandamama PDFs you downloaded from "saahitya-abhimani"? I want rupadharudi yatralu and bhuvanasundari
thanx in advance
-Karthik
కామెంట్‌ను పోస్ట్ చేయండి