సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

బ్లాగులంటే పడని మా అమ్మాయి!


దమూడేళ్ళ క్రితం  పసిపాపగా పారాడుతూ ఉన్న నీహారిక,  మా పాప- తర్వాత కాస్త ఎదిగి నర్సరీలూ, కేజీలూ దాటేసి, స్కూల్లో చేరి ఏదో సాధించేసినట్టు- ఇలా... కాలు మీద కాలేసుక్కూర్చుంది!

ఇంటర్నెట్ ని తను చాలా సులువుగా, తడబాటేమీ లేకుండా ఉపయోగిస్తుంది.  దీంట్లో విశేషమేమీ లేదు గానీ, తనకు బ్లాగింగ్ అంటే ఇష్టముండదట.

‘ఎందుకూ?’ అనడిగాను.
‘ఎందుకో చెప్పటం కూడా ఇష్టం లేనంత అయిష్టం’ అంది!  (‘అనిష్టం’ అనాలంటూ ‘తాడేపల్లి’ గారు క్లాసు తీసుకుంటారు :)).

కారణాలు తెలీనపుడు ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా కష్టమే కదా!
మరేం చేయాలి?  

                                  *  *  *

ఇంతకీ,  నెట్ ను నీహా ఎలా ఉపయోగిస్తుందంటే...

*  ఫొటోషాప్ ని ఉపయోగించి రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది.
    అడవిలో పూల చెట్ల కింద ఉయ్యాల మీద కూర్చున్నట్టూ, ఉద్యానవనంలో వంతెనపై నిలబడినట్టూ,  పచ్చని చెట్ల   కింద ప్రభాతవేళ చిద్విలాసంతో పోజిచ్చినట్టూ...  ఛాయాచిత్రాలను మార్చేస్తుంది. 



గుర్రం బొమ్మను అలంకరించి, దాని మెడలో ‘Hi Niha!' అని టాగ్ ని కట్టేస్తుంది! పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో తన మొహం కనపడేలా క్రియేట్ చేస్తుంది. 


*  హీరోయిన్లు హాసిని, మిత్రవిందలంటే- అదేనండీ... జెనీలియా, కాజల్ లు తనకు బాగా ఇష్టం.  ‘ సినిమా పేజీ’లో వాళ్ళ ఫొటోలు ఉన్నాయా అని రోజూ ‘ఈనాడు’ తిరగేస్తుంది. గూగుల్ సెర్చింజన్లో ఇమేజెస్ ను ఎప్పటికప్పుడు  శోధిస్తూ ఆ హీరోయిన్ల ఫొటోలతో  డెస్కుటాప్ ని నింపేస్తుంటుంది.

(దీంతో నెట్ బిల్లు ఓ నెల మరీ ఎక్కువొచ్చేసింది. తన కారణంగా అంటే అస్సలు ఒప్పుకోదు-
‘నువ్వు చందమామలు డౌన్ లోడ్ చేస్తుంటావు కదా, అందుకనే బిల్లెక్కువొచ్చింద’ని వాదిస్తుంది. చందమామల డౌన్లోడ్ ఎప్పుడోనే పూర్తి చేశానని చెప్పినా వినదు.

సరే, ఏమైతేనేం-  బ్రాడ్ బ్యాండ్ అన్ లిమిటెడ్ ప్యాకేజిలోకి  మారాల్సివచ్చింది. ) 

జీ-మెయిల్ అకౌంట్ తో అప్పుడప్పుడూ స్నేహితురాలితో చాట్ చేస్తుంది.  

మినీ క్లిప్, గేమ్ డాట్ కో డాట్ ఇన్ లాంటి కొన్ని వెబ్ సైట్లకు వెళ్లి ఏవేవో విచిత్రమైన గేమ్స్ ఆడేస్తుంటుంది.

ఓ పాపకు తల దువ్వటం ఓ ఆట.

మరో ఆట- బుల్లి పిట్టను కర్సర్ తో ఎగరేస్తూ తల్లి పిట్ట  దగ్గరకు చేర్చటం.

ఇక పప్పీని ముస్తాబు చేసే ఆట మరొకటుంది.  కుక్కపిల్లకు షాంపూతో తలారా స్నానం చేయించటం, తుడవటం, డ్రైయర్ తో ఆరబెట్టటం, మెడకూ, తలకూ కుచ్చులు కట్టి, బట్టలు తొడగటం... ఇలా అన్నమాట.

ఈ పనులన్నీ తక్కువ సమయంలోనే చకచకా పూర్తిచేసెయ్యాలట!


 సరే, ఇన్ని చేస్తున్నా క్లాసులో సెకండ్ ర్యాంక్ కాబట్టి- కనీసం ఆ కోణంలోనూ- తనను ఏమీ అనడానికి వీల్లేకుండా ఉంది! (ఒకవేళ  ర్యాంకులు  రాకపోతే మాత్రం ఏమైనా అంటానా ఏమిటి?...)  

                                       * * *

నేను  బ్లాగులు చూడటం, టపాలు రాయటం తనకసలు ఇష్టముండదని నీహా అంటుంది కదా?  తనలాంటి వాళ్ళకు తెలుగు బ్లాగులపై మంచి అభిప్రాయం కల్గించటానికి ఏం చేయాలో రకరకాలుగా ఆలోచించాను.

హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో నెలనెలా జరిగే బ్లాగర్ల సమావేశానికి ఇంతవరకూ నేనెప్పుడూ వెళ్ళలేదు కానీ, ఇప్పుడు నీహాను  తీసుకు వెళ్ళటం ఓ మార్గంగా కనిపించింది.  ( ఇంతకీ  ఈ ఐడియా ఫలిస్తుందా? వికటిస్తుందా? :))

ఈలోపు ఏం చేయొచ్చు...?

‘తన గురించే నా బ్లాగులో ఓ టపా రాసేస్తే?’  అనిపించింది.

‘స్వీట్ హోమ్’ నవలా నాయకుడు బుచ్చిబాబు తనను మగవాళ్ళ ప్రతినిధిగా ఊహించుకుని, స్వగతంలో సంకల్పం చెప్పుకుంటూ విమలతో హోరాహోరీగా వాదించాడు కదా? అలాగే నేనూ మన తెలుగు బ్లాగర్ల తరఫున చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు గుర్తించి, హర్షించాలి మరి! :)

 ‘నీ గురించి నా బ్లాగులో టపా రాస్తున్నా’నని చెప్తే... ‘సానుకూలంగా స్పందించింది’.


గాయని సునీత తమ గాన బృందానికి బహుమతినిస్తున్నప్పటి ఫొటోను నా బ్లాగులో పెట్టమని అడిగింది.  పైగా ఆ ఫొటోను నేను లేనప్పుడు నా ఫోల్డర్ లో కూడా పెట్టేసింది!

నా ప్రయత్నం  ఫలిస్తున్నట్టే ఉంది కదూ?

‘అట్నుంచి నరుక్కు రావటం’ అంటే ఇదేగా?! 

27 కామెంట్‌లు:

భాను చెప్పారు...

baagundandi mee atununchi narukku raavadam ,maa papa to (9th class lendi) blag raayadam alavatu chesaa kaneesam ala anna mana telugu bhasha telugu nu marichiporani maa papa rishi ane peruto rasutundi mee papa ku chuyinchandi

భాను చెప్పారు...

సుజాత గారు,

మీరు అన్నది కూడా వాస్తవమే. కాని మనం వెనక ఉంది నడిపిస్తే తప్పు లేదనుకుంట మన తెలుగు, తెలుగు బాష మీద ఇలా అయిన అభిమానం పెరుగుతుందని స్వంతంగా రాయడం అలవాటుందని ఒక ఆశ

వేణు చెప్పారు...

సుజాత గారూ, మీ అభిప్రాయానికీ, సూచనలకూ థాంక్యూలు. పిల్లలకు ఉపయోగపడే మంచి గేమ్స్ వెబ్సైట్లు మీకు తెలిసివుంటే వాటి గురించి కాస్త చెప్పండి!

వేణు చెప్పారు...

భాను గారూ, మీ పాప బ్లాగు http://rishi97.blogspot.com/ చూశాను. మా నీహారిక కూడా చూసింది. బ్లాగు పోస్టులు సరదాగా ఉన్నాయి.

అయితే - హైస్కూలు దశలోనే పిల్లలు బ్లాగులు చూడటం, రాయటం ఎంతవరకూ సబబు అన్నది- నిజంగా చర్చనీయాంశమే! తెలుగుపై అభిమానం పెంచటం అనే కారణం బాగున్నా, పిల్లలు బ్లాగింగ్ కి ఎడిక్ట్ అవకుండా, చదువుపై అశ్రద్ధ పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఆ బ్లాగులో కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయాలు కూడా దీన్నే సూచిస్తున్నాయి కదా!

భావన చెప్పారు...

పిల్లలు తలచుకుంటే చేయలేని పనేమి వుందండీ. చాలా టెక్కీ గాల్ ఐతే నీహారిక..మరి సాఅధించలేదేమిటీ అమ్మను....నాన్న నుఇంకా అందరిని మరి కూర్చోని తీరాల్సిందే కాలు మీద కాలేసుకుని. ఫొటో షాప్ లో తన ప్రతిభ చాలా బాగుంది.. మనకు కూడా మంచి యానిమేషన్ వీడియో లు చేసి ఇమ్మనండి. బ్లాగు లలో పెట్టుకుందాము. :-) గుడ్ లక్ చెప్పండి పాపకు. బ్లాగు లు ఇప్పుడే టూ ఎర్లీ ఏమో, మా అబ్బాయి కూడా బ్లాగ్ లు ఎందుకమ్మాయాహూ న్యూస్ చదవరాదా అంటాడు. :-)

నాగప్రసాద్ చెప్పారు...

మీ పాపకు ఇష్టమైన పోటోషాప్‌లో చేసే చిత్రాలను బ్లాగులో పెట్టమనండి. తద్వార, పది మంది అభిప్రాయం తెలుసుకొని ఇంకా మెరుగుపర్చుకోవచ్చు అని చెప్పండి. అలాగే మన తెలుగు బ్లాగుల్లో ఫోటోషాప్ ట్యుటోరియల్స్ రాసే బ్లాగులను పరిచయం చెయ్యండి.

మీ పాపకు తెలుగు ఒక మాదిరిగా వస్తే, మా సైన్సు బ్లాగును కూడా పరిచయం చేసి, సైన్సుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని చెప్పండి.

వేణు చెప్పారు...

భావన గారూ,
థాంక్యూ- నా తరఫునా, నీహా తరఫునా!

నాగప్రసాద్ గారూ,
మీ సూచనలకు ధన్యవాదాలండీ. నీహాకి తెలుగు ఒక మాదిరిగా కాదు, బాగానే వచ్చు. తనకు మీ సైన్స్ బ్లాగుని చూపించాను!

swapna@kalalaprapancham చెప్పారు...

ipude em tondara, inka chinna pillane kada, chinnaga blogging chestundilendi, do not worry.

మాలా కుమార్ చెప్పారు...

మీ పాప ఫొటోషాప్ విన్యాసాలు బాగున్నాయి . మంచి హాబి .

కొత్త పాళీ చెప్పారు...

నీహారికకు బ్లాగులంటే ఎందుకిష్టంలేదో నాకు తెలుసోచ్!

వేణు చెప్పారు...

స్వప్న@ కళల ప్రపంచం గారూ,
థాంక్యూ. నీహా బ్లాగింగ్ చేయటం లేదని నాకేమీ వర్రీ లేదండీ. నా కన్సర్న్ వేరే కదా!


మాలాకుమార్ గారూ, మా పాప తరఫున ధన్యవాదాలండీ.

వేణు చెప్పారు...

కొత్తపాళీ గారూ,
నీహాకి బ్లాగులంటే ఎందుకిష్టం లేదో
మీకు తెలుసా? భలే! నాకు చెప్పండి... చెప్పండి ప్లీజ్!

రాధిక(నాని ) చెప్పారు...

మీ పాప ఫోటో షాప్ లో ప్రతిభకు నా అభినందనలు

వేణు చెప్పారు...

రాధిక (నాని)గారూ, థాంక్యూలండీ!

Sujata M చెప్పారు...

Honestly, I think, perhaps, for the next gen kids, Blogging is an old fashioned stuff. Is it Niharika ?

వేణు చెప్పారు...

Sujata గారూ,
అంతేనంటారా? కొత్త తరం పిల్లలకు బ్లాగింగ్ అప్పుడే ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోతోందనేది వెంటనే నమ్మశక్యం కావటం లేదు!

Saahitya Abhimaani చెప్పారు...

వేణూగారూ నమస్తే. మనం ఇంటర్‌నెట్ మీదపడి చేసుకుంతున్న కాలహరణం చాలదా, మీ అమ్మాయికి కూడా ఎందుకు నేర్పటం, పైగా ఇంకా చదువుకోవాల్సింది ఎంతో ఉన్నది. బ్లాగులు ఇప్పుడే అలవాటు చెయ్యకండి. ఇదొక వ్యసనం అని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నాను.

lalithag చెప్పారు...

ఇక్కడ చూడమనండి ఇంకొన్ని ఆటల కోసం.
నాకు నచ్చినవి Geographyకి సంబంధించినవి.
http://www.sheppardsoftware.com/Geography.htm
నచ్చిందో లేదో చెప్పి మీ అమ్మాయి ఎలాంటివి ఇష్టపడుతుందో ఓ టపా రాయమనండి.
లేదూ ఈ కథకి ఒక ముగింపు ఆలోచించి చెప్పమనండి.
http://balasahityam.blogspot.com/2010/05/blog-post_10.html

లేదూ ఈ బొమ్మకి కథ రాయమనండి.
http://kottapalli.in/2010/09/టీ

వేణు చెప్పారు...

శివ గారూ,
బ్లాగులు ‘చాలావరకూ’ కాలహరణం అనే నా అభిప్రాయం కూడా. బ్లాగులపై మా అమ్మాయికి అంత మంచి అభిప్రాయం లేదని మాత్రమే రాశానీ టపాలో. తనకు బ్లాగుల్ని అలవాటు చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు.

lalithag గారూ, మంచి లింకులిచ్చినందుకు థాంక్యూ.

జ్యోతి చెప్పారు...

మీ పాప బ్లాగులు చూడకపోతే నష్టమేమి లేదు. అంతర్జాలంలో తను నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తన సబ్జెక్ట్ పాఠాలు కూడా. అలాగే పెయింటింగ్, యానిమేషన్,క్రాఫ్ట్, డిజైనింగ్.. ఇలా ఎన్నో.. అవి చూపించండి.

కొత్త పాళీ చెప్పారు...

వేణు, ఏముందీ? అసలే జర్నలిస్టు మీరు. ఇంట్లో ఉండేది తక్కువ. ఉన్న కాసేపూ కంప్యూటరు మీద కూచుని ఏదో గిలుకుతుంటే నీహారిక మిమ్మల్ని ఏం చేస్తున్నావని అడిగింది. బ్లాగు రాస్తున్నాననో, చదువుతున్నాననో చెప్పి ఉంటారు. తనతో గడపవలసిన అమూల్యమైన సమయాన్ని బ్లాగులు లాగేసుకుంటున్నాయని నీహారికకి బ్లాగులంటే అస్సలు ఇష్టం లేకుండా పోయింది.

వేణు చెప్పారు...

జ్యోతి గారూ,
మా పాప బ్లాగులు చూడాలని నా అభిలాష కాదు. బ్లాగులపై తన అభిప్రాయం గురించే ఈ టపాలో రాశాను. మీరన్నట్టు- అంతర్జాలంలో తను నేర్చుకోవటానికి చాలానే ఉన్నాయి. థాంక్యూ!

వేణు చెప్పారు...

కొత్త పాళీ గారూ,
మీరు ఊహించినదాంట్లో వాస్తవం లేకపోలేదండీ! బ్లాగుల వల్ల కాలహరణం, పిల్లలతో గడిపే సమయం తగ్గిపోవటం గురించి సీరియస్ గానే ఆలోచించాలి మరి!

దాసరి వెంకటరమణ చెప్పారు...

వేణు గారు నమస్కారం
మీ పాపకు బ్లాగులంటే ఇష్టమో అయిష్టమో ఒదిలెయ్యండి. కాని మీ పాప ఆర్ట్ వర్క్(కళా నిపుణత) చాలా బాగుంది ప్రోత్సహించండి.

SURYA చెప్పారు...

Nice reading this piece. My 9-yr-old son does everything on computer, except blogging. He hasn't explored it yet, otherwise he would have done that too.

వేణు చెప్పారు...

వెంకట రమణ గారూ,
నమస్తే. మీకు ధన్యవాదాలండీ.

సూర్యా!
థాంక్యూ. అయితే మీ అబ్బాయి టెక్నో శావీ అన్నమాట. గుడ్! తన బ్లాగింగ్ కు ఇంకా చాలా టైముందిగా.

M b d syamala చెప్పారు...

వేణు!నీహా గురించి నువ్వు రాసిన బ్లాగు ముద్దుగా వుంది!photo shoppy లో తన ప్రతిభ ముచ్చటేస్తోంది!ఇప్పుడు కొంత పెద్దదైనాక తన అభిరుచులలో కొన్ని మార్పులు వచ్చి ఉంటాయి బహుశ!నువ్వు వ్రాసే బ్లాగులను అనేకమంది చూసి అభినందించేటప్పుడు నీ కన్న కూతురు నీసర్వస్వం అయిన నీ బిడ్డ చూడాలనుకోవడం సహజమే!తను ఇష్టంగా చూడాలని తనమీద బ్లాగు రాయడం చాలా wise decition కొంత పెద్దయ్యాక నాన్న వ్రాసే బ్లాగ్స్ ఎలా ఉంటాయో!అనే క్యూరియాసిటీ కలగచ్చు!లేదా నీహా ప్రతిభ చూపించే అంశాన్ని నువ్వే ఇష్టపడి తనను ప్రోత్స హించు!ఒక రకంగా నువ్వు సంతోషపడాలి!తనకంటూ కొన్ని అభిరుచులతో కూడిన individuality ఉంది!అది ఖచ్చితంగా నీ పోలికే!చిన్నప్పటినుండీ నువ్వూవూ అంతేగా!
ఏ నాటికైనా నీహా అసామాన్యఅయిన ధీర వనితగా తను కోరుకున్న రంగంలో మంచి పేరుతెచ్చుకోవాలని నా ఆకాంక్ష!