సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, అక్టోబర్ 2010, ఆదివారం

అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!


ఎంటీవీ ఆచార్య! ...

ఈ చిత్రకారుడి పేరు 2006 ఆగస్టులో తొలిసారి నాకు  తెలిసింది. (మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడి బొమ్మలు మాత్రం అప్పటికే తెలుసు. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం పాఠశాల పాఠ్యపుస్తకాలకు చక్కటి బొమ్మలు వేశారు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈ మాట’లో  ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసంలో ఆచార్య గారి గురించి చాలా గొప్పగా రాశారు. ఇలా...

‘‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు మేకప్‌ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’


చందమామలో ‘మహా భారతం’ అంటే నాకు శంకర్ బొమ్మలే తెలుసు. ఆచార్య గారు అంతకుముందే మహాభారతానికి ఇంత సుదీర్ఘ కాలం అద్భుతమైన బొమ్మలు వేశారనే సంగతి అప్పుడే తెలిసింది. విపరీతమైన ఆసక్తి ఏర్పడి, ఆయన వివరాల కోసం నెట్ లో అన్వేషించాను. కొన్ని వివరాలే తెలిశాయి. తర్వాత నాగమురళి బ్లాగు ద్వారా www.ulib.org లో పాత చందమామల ఆచూకీ తెలిశాకే ఆచార్య గారి వర్ణచిత్రాలను చూసే అవకాశం కలిగింది.

కానీ ఆయన ఫొటో దొరకనే లేదు!


తాజాగా అక్టోబరు నెల చందమామ ముఖచిత్రంగా ఆచార్య గారి బొమ్మనే ప్రచురించారు. ఈ సందర్భంగా   టపా రాద్దామనుకునేలోపే రాజశేఖరరాజు గారు చందమామ చరిత్ర.లో రాసేశారు.:)


పైన ‘కీచక వధ’ ఘట్టాన్ని ఎంత  బాగా చిత్రించారో చూడండి. అస్పష్టమైన చీకటి నేపథ్యంలో భీమ, కీచకుల పోరాటం, ద్రౌపది హావభావాలు గమనించండి!అంతకుముందు భీముడితో  మొరపెట్టుకుంటున్నద్రౌపదిఆచార్య గారి చిత్ర కళా వైభవం ‘చందమామ కలెక్టర్స్ ఎడిషన్లో’ ఇచ్చిన ఈ రెండు బొమ్మల్లో చూడవచ్చు. మరికొన్ని బొమ్మలు చూడండి....

ఉత్తర గోగ్రహణంఉత్తర కుమారుడి ప్రగల్భాలు 
ఉత్తరకుమారుడి యుద్ధ భీతి

                కంకుభట్టు రక్తం చిందకుండా సైరంధ్రి ప్రయత్నం

యమధర్మరాజుతో సావిత్రీ సత్యవంతులు

నర్తన శాలలో బృహన్నలా, ఉత్తరా
పార్థుడూ,  సారథీ
‘బావా!  ఎప్పుడు వచ్చితీవు’ కి ముందు
బాలకృష్ణుడి దగ్గరకు వస్తున్న పూతన

అజ్ఞాతవాసంలో ద్రౌపదీ, పాండవులూ

16 వ్యాఖ్యలు:

Chandamama చెప్పారు...

వేణు గారూ,
రాత కంటే బొమ్మలకు ప్రాధాన్యమిచ్చి మంచి పోస్ట్ ప్రచురించారు. ఇటీవలే ప్రచురించిన చందమామ ఆర్ట్‌బుక్‌లో వపాగారివి 80, ఎంటీవీ గారివి 25, చిత్రాగారివి 30, శంకర్ గారివి 40 పైగా ఒరిజనల్ చిత్రాలు ప్రచురించారు. చందమామ యాజమాన్యం తన యాన్యువల్ రిపోర్ట్‌లో పొందుపర్చిన వివరాలను ఇక్కడ ఇస్తున్నాను. మరి మీ బ్లాగులో ఇంగ్లీషు మేటర్ ప్రచురించబడుతుందో లేదో తెలియదు.

"During the year, Chandamama has launched the much coveted Art Book aptly titled' CHANDAMAMA ART BOOK'. The art book is a compilation of various paintings typifying Chandamama Art, which has overtime become an art form in itself.

The Art Book is a carefully selected collection from our priceless treasure of masterpieces drawn by various world-class artists like Sankar, MTV Acharya, Chitra and Vaapa, who earned their fame as original water color artists since 1947. These renowned artists, whose works are presented in the book, have been associated with Chandamama in its journey that spans over 6 decades. The Book comprising of two volumes, collates over 175 paintings and have mostly been the cover pages of Chandamama. The paintings cover a variety of topics ranging from nature to human emotions and mythology. The interesting comparison of artstyles used by these masters, their interpretation and expression on similar topics, makes this collection a must have for all art lovers."

ఈ ఇంగ్లీష్ సమాచారం చందమామ అభిమానులకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను.
అభినందనలతో

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

’ఎంటీవీ ఆచార్య’ గురించి వినడం ఇదే తొలిసారి. అయితే ’మడిపడగ బలరామాచార్య’ మాత్రం మహా చిత్రకారులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలకు ఆయన అనేక సంవత్సరాలు ప్రధాన చిత్రకారులుగా వ్యవహరించారు. అంతకు ముందు తెలంగాణ ప్రముఖ కవులందరి ( దాశరథి, సినారె మొ||న వారి ) గ్రంథాలకు ఆయనే ముఖచిత్రాలను గీసేవారు. ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు( 1975) ఆయనే ’ఎంబ్లమ్’ గీసారు. నా అదృష్టమేమిటంటే నేను దాదాపు 15 సంవత్సరాలు ఆయన ఇంటి ప్రక్కనే ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో నేను వ్రాసే పద్యాలు, నాటికలను మెచ్చుకొని నన్ను ప్రోత్సహించేవారు. ఇప్పటికీ వారి సంతానం సికింద్రాబాదు, వెస్ట్ మారెడుపల్లిలో అశ్వినీనగర్ కాలనీలో ఉంటారు. ఆయన కుమారుడు ఆనంద్ మంచి చిత్రకారుడు.

కొత్త పాళీ చెప్పారు...

beautiful
thank you for sharing

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగున్నాయండి ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

చందమామ రాజు గారూ!
ధన్యవాదాలు. చిత్రకారుల గురించి చందమామ వార్షిక నివేదికలో ఇచ్చిన సమాచారం బాగుంది.

వేణు చెప్పారు...

ఆచార్య ఫణీంద్ర గారూ!
ఎంటీవీ ఆచార్య గారి గురించి తెలిసినవారు తక్కువే. నాలుగేళ్ళ క్రితం నాక్కూడా తెలీదు. అంత గొప్ప చిత్రకారుణ్ణి స్మరించుకోవాలనే ఆశతోనే ఈ టపా.

మడిపడగ బలరామాచార్య గారు ఒకప్పటి హైస్కూలు పాఠ్యపుస్తకాలకు వేసిన బొమ్మల్లో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి. పద్మవ్యూహంలో అభిమన్యుడి తుది సమరం అందులో ఒకటి. మీకు ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

కొత్త పాళీ గారూ!
ధన్యవాదాలండీ.

వేణూ శ్రీకాంత్!
ఎంటీవీ గారి బొమ్మలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. అవి మహా భారతం చిత్రాలయితే చెప్పేదేముంది? థాంక్యూ!

ఆ.సౌమ్య చెప్పారు...

ఆచార్య గారి గురించి నేను కూడా ఎప్పుడూ వినలేదండీ. చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదములు. బొమ్మలు అద్భుతంగా ఉన్నాయి.

వేణు చెప్పారు...

సౌమ్య గారూ!
ఆచార్య గారి బొమ్మలు మీకు అంతగా నచ్చినందుకు సంతోషంగా ఉంది.
మన తెలుగు చందమామ
బ్లాగులో ఆచార్య గారి మరిన్ని చిత్రాలతో శివ గారు స్లైడ్ షో ఫెట్టారు, చూడండి!

వేణు చెప్పారు...

సౌమ్య గారూ! స్లైడ్ షో చూసి, అక్కడ వ్యాఖ్య కూడా రాసేశారుగా, లేటుగా చూశాను!

Sandeep చెప్పారు...

మీ బ్లాగులో ఎన్నో చక్కని విషయాలను చెప్తున్నారండి. ఇంత అద్భుతమైన చిత్రాలను గీసిన వ్యక్తి జీవితం సార్థకమైనట్టే. చందమామ - ఎంత చక్కని పేరు, ఎంత చక్కని కథలు - ఆ రోజులని నేను మరిచిపోలేను. అవి నాకు గుర్తుచేసినందుకు మీకు నా హృదయపూర్వకధన్యవాదములు.

వేణు చెప్పారు...

Sandeep గారూ! మీ ప్రశంసకు ధన్యవాదాలండీ. చందమామతో, ఆ అనుపమాన చిత్రాలతో తరతరాల పాఠకుల స్మృతులు పెనవేసుకునివున్నాయి కదా! అందుకే మీలాంటివారికి వాటిని గుర్తు చేస్తే ఇంత ఆనందం.

తెలుగు అభిమాని చెప్పారు...

గొప్ప చిత్రకారుడి గురించి చక్కటి టపా వ్రాశారు. మీరు వ్రాసే టపాలు సమగ్రంగా , సవివరంగా ఉంటాయి. thank you sir.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ, నేను రాసే టపాలపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

Muralidhara Rao Elchuri చెప్పారు...

మిత్రులు శ్రీ వేణు గారికి,

అప్రతర్కితంగా ఈ రోజు మీరు మడిపడగ బలరామాచార్య గారిని అధికరించి వ్రాసిన చక్కటి వ్యాసాన్ని చదివాను.

మీరు, మీ మిత్రమండలి కేవలం ఆయన చిత్రకళాప్రావీణ్యాన్ని మాత్రమే నెమరు వేసికొన్నట్లు కనిపించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది.

శ్రీ బలరామాచార్య గారు సంప్రదాయసాహిత్యాన్ని మథించిన మంచి పండితులు. సంగీతశాస్త్రకోవిదులు. శాస్త్రీయరాగాలలో, ఆధునిక బాణీలలో చక్కటి కృతులను, లలితగీతాలను రచించారు. అజంతా ముద్రణాలయాధిపతులు, శతావధానులు శ్రీ శ్రీనివాస సోదరకవులకు సన్నిహితులు కావటం వల్ల ముద్రణకళలో ఆరితేరి, టైపోగ్రఫీ నేర్చుకొని పేజ్ ఎలైన్మెంటులో నిష్ణాతృతను గడించారు. వారు రూపొందించిన లితోగ్రాఫులు, రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు, దారుశిల్పాలు ఇప్పటికీ కుటుంబసభ్యుల వద్ద ఉన్నాయో? లేవో? తమ మిత్రులైన చిత్రకారు లిచ్చిన వెలలేని పెయింటింగుల కాంవాసులు కూడా వారి వద్ద ఉండేవి.

శ్రీ వేంకటేశ్వర భక్తిగీతాలు, శ్రీపాదరేణువులు మొదలైన వారి గ్రంథాలు ఒకప్పుడు ప్రసిద్ధమైనవి. ఆనాటి కవిపండితులు వారి గుఱించి వ్రాసిన అభిప్రాయాల మాలిక కూడా ఒకటి అచ్చయింది.

అడవి బాపిరాజు, ఆచంట జానకిరామ్ గారల వంటి బహుముఖప్రతిభాశాలుల కోవలోని కవీ చిత్రకారులూ ఆయన.

మా నాన్నగారికి ఆప్తమిత్రులు కనుక కొన్ని కొన్ని వివరాలు గుర్తున్నాయి.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు

వేణు చెప్పారు...

మురళీధరరావు గారూ!
మడిపడగ బలరామాచార్య గారి చిత్రాలు ఎప్పటివో పాఠ్యపుస్తకాల్లో చూడటం తప్ప, ఆయన గురించి ఇతర వివరాలేమీ తెలియవు. ఆయన చిత్రకళా ప్రావీణ్యం గురించి కూడా చాలామందికి తెలిసింది స్వల్పమే. లితోగ్రాఫులు, దారుశిల్పాలు సృజించిన సంగతి నాకు తెలియనే తెలియదు!

మీ వ్యాఖ్య ద్వారా ఆయనలోని బహుముఖ ప్రతిభావిశేషాలు ఇప్పుడిలా మాలాంటివారు గ్రహించగలిగాము. ఆయన సంగీత శాస్త్ర ప్రవీణులనే విషయం కూడా ఆసక్తికరంగా ఉంది. బలరామాచార్య గారి రచనల వివరాలు కూడా మీ ద్వారా తెలిశాయి. మన: పూర్వక కృతజ్ఞతలు.

ఇలాంటి కళామూర్తుల పరిచయాలతో ఒక వ్యాస పరంపర మీరు రాయాల్సిన చారిత్రక అవసరం కనపడుతోంది!