సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, నవంబర్ 2010, మంగళవారం

తీయని స్వరాల ‘తెనాలి’ పాట!

  పదేళ్ళక్రితం విడుదలైన ‘తెనాలి’  నాకు చాలా అంశాల్లో నచ్చింది.

    సూర్యాపేటలో  ఉన్నపుడు మా అమ్మాయి నీహారికతో కలిసి  ఈ సినిమా చూశాం.  అప్పుడు మా పాపకు మూడేళ్ళు.

థియేటర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు  ‘ఇప్పుడు మనం చూసిన సినిమా పేరేంటి?’ అని అడిగాను సరదాగా. 

అన్నం  తింటున్నట్టు నోటి దగ్గర వేళ్ళను ముడిచిపెట్టి  ‘తినాలి!’  అని చెప్పింది! :)

  
      సినిమాలోని  ఓ పాట  విశేషాలను మీతో పంచుకునే ప్రయత్నమిది.  ‘ప్రాణమా’ అనే ఈ యుగళగీతం  హాంటింగ్ మెలడీ!  వెన్నెలకంటి రాశారు ఈ పాటను.


ఇక్కడ  వినండి.  (ఇది ఇక్కడున్న జాబితాలో నాలుగో పాట)
 అసలీ పాటను రెహమాన్  స్వరపరిచాడని నేను మొన్నమొన్నటిదాకా గమనించలేదు. పాట బాణీ, నేపథ్య వాద్య సంగీతం  అన్నీ శ్రావ్యంగా మనసుకు హత్తుకుంటాయి.

తమిళంలో బాలుతో పాటు సాధనా సర్గమ్ ;  తెలుగులో బాలుతో పాటు  చిత్ర  పాడారు.
తమిళ గీతం ‘శ్వాసమా..’  ఇక్కడ వినండి.

పల్లవి తర్వాత... ‘ఎదలే ఎదురించవా  ఎదురై మురిపించవా’ కు ముందు  రిదమిక్ గా  వచ్చే బీట్ గమ్మత్తుగా ఉంటుంది. ఇది పాటంతా వినిపిస్తుంటుంది.

‘ప్రాణమా  ప్రాణమా’ అనే మాటలను చిత్ర ఆర్తిగా  పాడిన విధానం ఎంత బాగుంటుందో... అంతే కాదు;  అదే వరసలో బాలూ   ‘ప్రాయమా’ అనే మాటను చాలా సుతారంగా  పలుకుతాడు.

రెండో చరణానికి ముందు వచ్చే వాద్య సంగీతం మనోహరం.


చిత్రీకరణ కూడా కనువిందుగా  ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి. పాట పూర్తి పాఠం నెట్ లో ఎక్కడా లేదు. అందుకే దాన్ని ఇస్తున్నాను.

దను దోచి  ఏదో చేసి  కళ్ళ నిండ కలలే దాచి
 ఎదను దోచి ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచి
చెంతకీ  చేరకా  ఊరింతువేలా
ప్రాణమా   ప్రాణమా


ఎదలే ఎదురించవా  ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై పులకించవా 
ఎదలే ఎదురించవా
ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై  పులకించవా 


ప్రాణమా  ప్రాణమా...   ప్రాణమా ప్రాణమా


ఎదను దోచి  ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచీ
 ఎదను దోచి ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచీ
చెంతకీ  చేరకా  ఊరింతువేలా


 ప్రాయమా ప్రాయమా ....  ప్రాయమా ప్రాయమా
 
నన్ను చూసి నన్నే చూసీ  కళ్ళ తోటి కలలే దోచి
తీయని ఊహల మరిగింతువేలా


ఎదనే నిదురించవా  ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై పులకించవా


1. కలిసిన కళ్ళే   కలలకు ఇళ్ళై
    వయసును గిల్లే మన్మథ విల్లై
    కలిసిన కళ్ళే   కలలకు ఇళ్ళై
   వయసును గిల్లే మన్మథ విల్లై


    హాయిగా ఊగే  ఊయలలూగే  అందం  ఎరవేసీ   సర్వమేదో సాగి
    ఆశల గోదారి ఎగిసినదంటా   తారల పూలని తీసుకుందుమంట
    నిదురించు ప్రేమయె ఉదయించె నేడే   నిదురించు ప్రేమయు ఉదయించె నేడే
     ప్రాణమా  ప్రాణమా


2.  హృదయాన ఊగే ఈ రాగహేల
       మధురం కదా ఇక మన రాసలీల
       రెక్కలు తొడిగీ తలపులు చాలా
        దిక్కులు దాటి ఎద యీ వేళ
        ఎద వీణ దాచీ మౌనగీతం నీది
      పున్నాగ విరుల సన్నాయి నీవే
       జత  నీవని నిన్నే  వలచి వచ్చానే...


     ప్రా...ణమా  ప్రాణమా
     ఎదను దోచి... (నవ్వు ఎదను దోచి ఏదో చేసి...
     కళ్ళ నిండ కలలే దాచి  ...
      ఎదనే నిదురించవా  ఎదురై మురిపించవా
     పాటే  పలికించవా  తోడై పులకించవా 
     ఎదనే నిదురించవా
      ఎదురై మురిపించవా
       పాటే  పలికించవా  తోడై  పులకించవా 


        ప్రాణమా...  ప్రాణమా..

8 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట వేణు గారు. మళ్ళీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. సినిమా పెద్ద హిట్ అవకపోవడంతో పాట కూడా వెలుగు చూడలేకపోయింది అనుకుంటాను.

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

ఇవాళ (నవంబర్‌ 30) రచయిత వెన్నెలకంటి పుట్టినరోజట. ఈ సంగతి ఇప్పుడే తెలిసింది. ఆయన ‘తెనాలి’ కోసం రాసిన పాట గురించి ఇవాళే నా బ్లాగులో టపా రాయటం కాకతాళీయమైనప్పటికీ విశేషంగా అనిపిస్తోంది!

ఈ పాటలో ఆయన రాసిన ‘ కలిసిన కళ్ళే కలలకు ఇళ్ళై .. వయసును గిల్లే మన్మథ విల్తై’ అనే ప్రయోగం విలక్షణం.

కమల్ అనువాద చిత్రాలకు ఆయన రాసిన మాటలు చాలా బాగుంటాయి. అనువాద చిత్రాలని కాకుండా ఒరిజినల్ ఏమో అనే భ్రమని కలిగిస్తాయి. ముఖ్యంగా ‘భామనే సత్యభామనే’ లో ఆయన కలం కదం తొక్కింది!

వేణు చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ! మీరన్నట్టు- సినిమా హిట్ కాకపోవటం వల్ల అంతగా ప్రాచుర్యం పొందని పాటల్లో ఇదీ ఒకటి. ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

సుజాత గారూ, థాంక్యూ!

సినిమా చూసినపుడు నేను కూడా ఈ పాటను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తర్వాత ఈ శ్రావ్యత మనసుకు పట్టేసింది.

‘తెనాలి’ సినిమా గురించి ‘నువ్వేమన్నావో ఇక్కడ రాశా’నంటూ నీహాకి ఈ టపా చూపించాను. ‘నాకేమీ గుర్తులేదు’ అనేసింది!

ఇందు చెప్పారు...

మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను.చాలా బాగా వ్రాస్తున్నారు.మీరు ఇలాగే మరిన్ని టపాలు వ్రాయాలని ఆశిస్తున్నా

తెలుగు అభిమాని చెప్పారు...

పాట చాలా బాగుంది వేణు గారు. నేను ఇప్పుడే పూర్తిగా వింటున్నాను. రహమాన్ tuneలు ఒక fixed format లో ఉండవు. అతనిది ఒక విలక్షణ శైలి. ఈ పాట లో melody బాగుంది. thank you. వెన్నెలకంటి వ్రాసిన ఒక పాట గురించి టపా వ్రాయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ, ఈ పాటలోని మెలడీ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.