సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, డిసెంబర్ 2010, ఆదివారం

నాస్తిక భర్త ... మరికొన్ని కథలు!



‘‘ఈ నాస్తికులు మంచివాళ్ళు. వాళ్ళు మనల్ని మారమనరు. వాళ్ళే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా ఉంటారు.’’

సునంద అనే పాత్ర తన తన ‘నాస్తిక భర్త’ గురించి స్నేహితురాలికి చెప్పే మాటలివి.  ఈ కథలో సునంద నోము నోచుకుంటూ  పూజ మంత్రాలను తప్పుతప్పుగా చదువుతుంటే   భర్త మోహన్ వాటిని వినలేక,  ఆమె అభ్యర్థనకు కరిగిపోయి మంత్రాలన్నీ  తనే చదివి, పూజ చక్కగా జరిగేలా  సహకరిస్తాడు.

నాస్తిక భర్తలకు సంస్కృతం కూడా కాస్త తెలిసుంటే,  లేకపోతే తెలుగు లిపిలో ఉన్నశ్లోకాలను కచ్చితంగా  చదవటం తెలిసుంటే...  ఇలాగే జరుగుతుంది! 

నా విషయమే చూడండి...  ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మా ఇంట్లో  ‘వ్రతకల్పం’ శ్లోక పఠనంలో అక్కడక్కడా దోషాలు చెవులబడినప్పుడు అవి కర్ణ కఠోరంగా తోస్తుంటాయి.  పక్క గదిలో పుస్తకమో, పేపరో చదువుకుంటూ,  శ్లోకాలకు వచ్చిన పాట్లను గమనించి నవ్వుకొని,  వదిలేస్తుంటాను. కానీ ‘కాస్త ఈ శ్లోకాలు మా కోసం చదువ్’  అనే అభ్యర్థన వచ్చివుంటే నేనేం చేసుండేవాణ్ణి?  బహుశా మోహన్ లాగే చదివిపెట్టేవాణ్ణే అనిపిస్తోంది. :)  

నాస్తిక  భర్తలందరూ ఒకేలా మూసపోసినట్టుండరు.  నిజమే! కానీ  మెజారిటీకి వర్తించేదైనా, మైనారిటీకి వర్తించేదైనా -  ఒక వాస్తవికత  కథలో ప్రతిఫలిస్తే మంచి కథ  అనిపిస్తుంది. ఈ ‘నాస్తిక భర్త’ కథ అలాంటిదే !  (మన తెలుగు భక్తి సినిమాల్లో అయితే నాస్తిక భర్తలు  చెడ్డవాళ్ళే.  ‘చివరికి’  భక్తులుగా  మారి మంచివాళ్ళైపోతారు. :))   

ఈ కథా రచయిత  జె.యు.బి.వి. ప్రసాద్.  ఈ కథతో కలిపి ఆయన రాసిన  20 కథలు ఈ మధ్యనే ‘ఆ కుటుంబంతో ఒక రోజు’  పుస్తకంగా వచ్చాయి.  వీటిలో కొన్ని కథలనైనా కౌముది, ఈ మాట లాంటి  వెబ్ పత్రికల్లో  ఆన్ లైన్  పాఠకులు చదివేవుంటారు.

ఈ సంకలనం గురించిన క్లుప్త సమీక్షను  ఇవాళ్టి  ‘ఈనాడు’ సండే మ్యాగజీన్లో  చూడండి.


‘ఆ కుటుంబంతో ఒక రోజు’  ఈ- బుక్ గా  కినిగెలో లభిస్తోంది. లింకు ఇక్కడ- 
http://kinige.com/kbook.php?id=126&name=aa+kutumbamto+oka+roju

రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళొస్తే..?
ఈ పుస్తకంలో కొన్ని కథలు చదువుతుంటే  వాటిని ‘రంగనాయకమ్మ గారు రాశారా?’ అనే సందేహం వచ్చేస్తుంది.  భావాల్లో సారూప్యతతో పాటు  అదే పదజాలం... అవే వ్యక్తీకరణలు...!  రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళి అక్కడి కుటుంబ వ్యవస్థను స్వయంగా గమనించి ఓ కథ రాస్తే? అది ‘ఆ కుటుంబంతో ఒక రోజు’ కథలాగా ఉంటుందేమో!

ఈ సంకలనంలో కొన్ని కథలు నాకు బాగా నచ్చాయి.  సాదాసీదాగా అనిపించినవీ  లేకపోలేదు.  మూఢ నమ్మకాలనూ,  కృత్రిమ విలువలనూ, అర్థం లేని ఆడంబరాలనూ, ఆచారాలనూ,  హిపోక్రసీనీ  విమర్శించే ధోరణి  కథల్లో కనిపిస్తుంది. ఇంటిపనులూ, వంట పనులూ ఆడవాళ్ళ డ్యూటీ అనుకోకుండా  ఆ పనులు ఇష్టపడి  చేసే  మగవాళ్ళు  కొన్ని కథల్లో తారసపడి, అబ్బురంగా అనిపిస్తుంది.  చిన్నచిన్న మాటలతోనే కథనం సాగే ఈ కథల్లో పదాడంబరం ఎక్కడా కనపడదు.

 ‘‘నీతో చెప్పాలంటే అందరికీ భయమే. ప్రతిదానికీ భయమే. .... అస్తమానూ అమ్మ, ‘ఇంటి యజమానీ’, ‘ఇంటి మగాడూ’ అంటుందేమిటీ నిన్నూ? నువ్వు యజమానివా! మా నాన్నవే కదా? ....  నాన్నంటే భయం ఎందుకుండాలి నాన్నా?...’’ ‘భయం! భయం!’ అనే కథ ముగింపులో కొడుకు తండ్రిని నిలదీసే ఈ  rhetorical questions  ఆలోచింపజేస్తాయి;  కదిలిస్తాయి!

‘ప్రశ్న’ అనే కథలో మధు అనే పిల్లాడు తల్లిపై తండ్రి చేసే దౌర్జన్యం అడ్డుకోవటం కోసం బలం తెచ్చేసుకోవాలని తపనపడతాడు. తల్లి వాడి ప్రేమకు పొంగిపోతుంది.  ‘పెద్దయ్యాక నువ్వూ మగాడివైపోయి పెత్తనం చేస్తావు’ అంటుంది. వెంటనే  ఆ పిల్లాడు   - ‘‘పెద్దయ్యాక మగాడిలా అవకుండా ఉండాలంటే, ఏం చెయ్యాలమ్మా?’’ అనడిగి వాళ్ళమ్మనీ,  ఈ కథ చదివేవారినీ నివ్వెరపోయేలా చేస్తాడు.   

చక్కగా హార్డ్ బైండుతో 1/8 డెమ్మీ సైజులో  చాలా తక్కువ ధరకే  దొరుకుతోంది ఈ కథల పుస్తకం!  

21 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

సుజాత గారూ, ప్రసాద్ గారి ఇనిషియల్ నాక్కూడా కాస్త తికమకేనండీ!
ఒక కళాకారుని శైలి యథాతథంగా మరొక కళాకారునిలో కనిపించటం.. అనేది గాయకుడు డి.వి. మోహనకృష్ణ గారి విషయంలో చూశాను. (ఆయన మాటా, పాటా అచ్చుగుద్దినట్టు మంగళంపల్లి బాలమురళి గారి లాగే ఉంటాయి కదా?) ప్రసాద్ గారు ఆ కోవలో రంగనాయకమ్మగారి శైలిని తన రచనల్లో ప్రతిఫలిస్తున్నారు.
‘నాస్తిక భర్త’ చర్చలాగా ఉందన్న మీరే, మళ్ళీ ఈ కథ నచ్చిందన్నారు. రెండూ కరెక్టేనా?
ఈ పుస్తకంపై శ్రద్ధగా మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ.

Unknown చెప్పారు...

పుస్తకాల సమీక్షల విషయంలో గానీ, దాని మీద జరిగే చర్చల విషయంలో గానీ, సాధారణంగా రచయితలు కలగజేసుకోరు. అయితే, కధలను అర్థం చేసుకుని, ఇష్టపడ్డ పాఠకులు ఎక్కడన్నా, ఏదన్నా కొంచెం వేరేగా అర్థం చేసుకుంటే, దానికి రచయిత చిన్న వివరణ ఇవ్వడం అవసరమనే అనుకుంటున్నాను.
1. సుజాత గారు, "చాదస్తం కథలో పెళ్ళి కి వృధాగా ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకించి కథకుడు జన్మదిన రాహిత్యం కథలో మాత్రం ఏదైనా "అచీవ్" చేసినప్పుడు బాగ ఖర్చుపెట్టుకోవచ్చిని మినహాయింపు ఇవ్వడం ఎందుకో నాకర్థం కాలా!" అని రాశారు.
"చాదస్తం" కధలో ముఖ్య విషయం, అప్పు చేసి ఆడంబరం జరుపుకోవడం. ఈ కధ లోని ముఖ్యపాత్ర, "సాంప్రదాయ పద్ధతిలో జరిగే పెళ్ళిళ్ళకి వెళ్ళను" అని అంటుంది. "జన్మదిన రాహిత్యం" కధలో, ".... అది అఛీవ్మెంట్గా మీ స్నేహితులని పిలిచి పార్టీ చేసుకోండి. అదీ మంచిది కాదు గానీ, కనీసం అందులో కొంతన్నా అర్థం ఉంది" అని అంటుంది ఆ పాత్ర. ఆ పాత్ర అన్న మాటలు అన్నీ కలిపి చూడాలి గానీ, మధ్యలో ఉన్న కొన్ని వాక్యాలని మాత్రమే కాదు కదా? "అదీ మంచిది కాదు గానీ,.." అని ఆ పాత్ర అన్న మాటలు చాలా ముఖ్యం. ఆ మాటలకి వేరే వాళ్ళు, "పిల్లల అఛీవ్మెంట్ గురించి పార్టీ చేస్తే, అందరూ మేము గొప్ప పోతున్నామని మా వెనకాల చెవులు కొరుక్కుంటారు." అని అంటే, ముఖ్య పాత్ర దాన్ని వ్యతిరేకించదు. దీన్ని బట్టి ఆ పాత్ర అలా మినహాయింపు ఇవ్వడం లేదని గమనించాలి.
2. సుజాత గారు, "దీపావళి జరుపుకోనే కూడదని నిర్ణయం కాబట్టి రచయిత చివర్లో చిన్న యాక్సిడెంట్ చేసి వాదనకు న్యాయం చేకూర్చారు.:-))" అని రాశారు.
దీపావళి టపాసులతో ఆక్సిడెంటు అవడం ఎంతో సహజం అయిన విషయం అయితే, అలా ఎలా అనగలరూ? ఇలా అనడంలో న్యాయం లేదు. ‘ఏదో కధ కోసం అసహజంగా ఆక్సిడెంటు చేసినట్టు వుంది’ అని అంటున్నటు ఉంది. అది సరి కాదు కదా? దీపావళి టపాసుల వల్ల జరిగే ఆక్సిడెంట్లని చాలా చూడొచ్చు. అది అసహజం కానే కాదు. మళ్ళీ సజాత గారు, "నిజానికి యాక్సిడెంట్లు జరిగినా పిల్లలు ప్రతి యేటా దీపావళి అనగానే తయారైపోతారు పోయినేడాదివన్నీ సుబ్బరంగా మర్చిపోయి." అని కూడా అన్నారు. నిజమే. పిల్లలే కాదు, పెద్ద వాళ్ళు కూడా, తమ పిల్లలకి జరిగిన యాక్సిడెంట్లు మర్చిపోయి, మళ్ళీ దీపావళి అనగానే తయారై పోతారు. ఇక పిల్లల విషయంలో అలా అవడం ఆశ్చర్యం ఏమీ కానే లేదు. పెద్ద వాళ్ళకి లేని జ్ఞానం పిల్లలకి ఎక్కణ్ణించీ వస్తుంది? ఈ కధ లోనే, టపాసులు తయారు చేసే ఇళ్ళల్లో జరిగే ప్రమాదాల గురించీ, వేరే చోట్ల జరిగే ప్రమాదాల గురించీ కూడా ప్రస్తావనలు ఉన్నాయి. చాలా టపాసుల ఫాక్టరీల్లో పని చేయించేది చిన్న చిన్న పిల్లల తోనే. ఆ చోట్లలో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూ వుంటాయి. వృధా ఖర్చుని వ్యతిరేకించే వాళ్ళు, ఈ టపాసుల విషయంలో ఇంకా వ్యతిరేకంగా వుండాలి. చాలా చెడ్డ రకాల విషయాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పిల్లలకి. దానికి ఎటువంటి రకమైన వత్తాసూ ఇవ్వకూడదు పిల్లలకి.
3. ఆఖరుగా నా శైలి గురించి. ముఖ్యంగా రంగనాయకమ్మ గారి రచనలు చదివి, అర్థం చేసుకునే వారు, రంగనాయకమ్మ గారి లాగా ఎవరూ రాయలేరని అర్థం చేసుకోవాలి. నా రచనల మీద రంగనాయకమ్మ గారి పుస్తకాల ప్రభావం వుంటుందని అంటూ వుంటారు. అది నాకు సంతోషమైన విషయమే. కానీ, అచ్చు రంగనాయకమ్మ గారి లాగానే రాశాను అని అనడం సరి అయినది కాదు. నేనే కాదు, ఎవరైనా ఒకరి లాగా ఒకరు రాయడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ జ్ఞానమూ, ఆ చెప్పే విధానమూ, అందులో వున్న సరళతా, అందులో వున్న తర్కమూ, ఎవరన్నా ఎక్కడన్నా కొంత వరకూ తమ రచనల్లో ప్రభావిత మవగలరేమో గానీ, పూర్తిగా అచ్చు అలాగే రాయలేరు. ఇంతకన్నా వివరణ అవసరం లేదనుకుంటాను.
చివరగా, సరదాగా, నా ఇనిషియల్సు గురించి అంత కన్ఫ్యూజన్ ఎందుకూ? నా ప్రతీ రచన మీదా నా పేరు కరెక్టు గానే వుంటుంది కదా? పోనీలెండి. ఎవరు ఎలా పిలిచినా, అంటే ఇనిషియల్సు తారుమారు చేసి, నాకు ఇబ్బంది లేదు. :-) నా చాంతాడంతటి పేరు మీద నాకు ఆశక్తి ఎప్పుడూ లేదు. ఎన్నో ఏళ్ళ కిందటే పేరు సరిగ్గా మార్చుకోలేదని, నా మీదే నాకు ఓ విమర్శ. కనీసం మా పిల్లల పేర్లు సరిగ్గా పెట్టాం అని ఒక చిన్న సంతృప్తి (అంటే, తల్లిదండ్రుల పేర్లను ఇంటి పేరుగా పెట్టడం).
ప్రసాద్

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆ.సౌమ్య చెప్పారు...

ఈ కథలు ఇంకా నేను చదవలేదుగానీ అస్త్రం వ్యాసాలు చదివి ప్రసాద్ గారికి నేను పెద్ద ఫేన్ ని కాదు కాదు ఏసి ని అదీ కాదూ అంతకంటే పెద్దది ఇంకెదో అయిపోయాను. ఆవ్యాసాలు చదివి ఆయనకి మైల్ చేద్దామనుకుంటూనే అలా అయిపోయింది, అంటే చెయ్యలేదన్నమాట. :)

ప్రసాద్ గారు చాలాచోట్ల రంగనాయకమ్మగారిలా అనిపిస్తారన్నది మాత్రం నేనూ ఒప్పుకుంటాను. ఆయన శైలి ఆయనకుందిగానీ అప్పుడప్పుడూ అది RN శైలిలా మారిపోతూ ఉంటుంది. బహుసా భావాలు, వ్యక్తీకరణ ఒకేరకంగా ఉండడవలన అలా అనిపిస్తుందేమో మరి.

సుజాతగారు...
మీరు RN పుస్తకాలు మూడోతరగతిలో చదివారా...మిమ్మల్ని చూసి నేను కుళ్లుకుంటున్నాను, నేను అంత తొందరగా మొదలెట్టనందుకు. :( నేను మాత్రం తొమ్మిదవ తరగతిలోనే మొదలెట్టాను. అయితే అప్పటినుండీ ఇప్పటిదాకా వదల్లేదనుకోండి. అదేదో దాన్నేమంటారో...అభిమానం, ఆరాధన ఇలాంటివన్నీ చిన్న పదాలు....అలాంటి అదేదో "ఇది" ఉంది నాకు ఆవిడ పట్ల.

వేణు చెప్పారు...

జేయూబీవీ (కరెక్టే కదా? :) ప్రసాద్ గారు రాసిన ఓ రచన చదివి, వాళ్ళూ వీళ్ళూ కాదు, సాక్షాత్తూ రంగనాయకమ్మ గారే ‘నేనే రాశానా అనే సందేహం కలిగింది’ అన్నారట ఓసారి! ఆ రచన పేరు ఏమిటో ప్రసాద్ గారే చెప్పాలి.

ఇక రంగనాయకమ్మ గారి రచనలను సుజాత గారు మరీ మూడో తరగతిలోనే, సౌమ్య గారు తొమ్మిదో తరగతిలో చదివినందుకు నాకు ఉక్రోషంగా ఉంది. నేను చాలా ఆలస్యంగా , ఇంటర్మీడియట్ లో ఆమె పుస్తకాలను చదవటం మొదలుపెట్టాను మరి!

సుజాత వేల్పూరి చెప్పారు...

హమ్మయ్య, సౌమ్యా, వచ్చావా? రా రా!

ప్రసాద్ గారు రాసిన ఓ రచన చదివి, వాళ్ళూ వీళ్ళూ కాదు, సాక్షాత్తూ రంగనాయకమ్మ గారే ‘నేనే రాశానా అనే సందేహం కలిగింది’ అన్నారట ఓసారి!...హవునా! ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటారో చూడాలి!

సౌమ్యా, మా ఇంట్లో అందరూ RN ఫాన్సోయ్!అందువల్ల మా అక్కలు కాలేజీ రోజుల్లో చదువుతూ ఉంటే నేను ఇదే సందని అప్పుడే చదివేశా!

వేణు గారు మనిద్దరి కంటే అన్యాయం!

హరి చెప్పారు...

"ఉన్నశ్లోకాలను కచ్చితంగా చదవటం తెలిసుంటే... ఇలాగే జరుగుతుంది! "

నా విషయంలో ఆల్రడీ జరిగిందండీ. దేవున్ని నమ్మకపోయినా సరే, ప్రతీ వినాయక చవితికీ వ్రతకల్పం నేను చదవాల్సిందే.

వేణు చెప్పారు...

హరి గారూ! భలే. ‘నాస్తిక భర్త’ కథలో రచయిత చెప్పిన పాయింటును ఆచరణలో మీరు కూడా నిరూపించేశారన్నమాట.:)

Praveen Mandangi చెప్పారు...

స్త్రీవాదం గురించి రంగనాయకమ్మ గారు బాగానే వ్రాస్తారు కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి స్త్రీవాదం ఎందుకు ఓడిపోతుందో రంగనాయకమ్మ గారు అంత స్పష్టంగా చెప్పలేదు. స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా తాము రంగనాయకమ్మ గారి అభిమానులమని చెప్పుకోవడం చూశాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నాస్తిక కవి శ్రీశ్రీ గారి శిష్యుడు విభూతి నామాలు పెట్టుకుని తిరగడం చూశాను. రచయితల రచనలు చదువుతారు కానీ చదివినవాటిని వ్యక్తిగత జీవితంలో ఆచరించరు. నేను అలా కాదు. మా నాన్న గారు చనిపోయినప్పుడు రాజమండ్రి వెళ్లి గోదావరిలో బూడిద కలపమంటే నేను వెళ్లలేదు. మా తమ్ముడిని రాజమండ్రి పంపించారు.

వేణు చెప్పారు...

ప్రవీణ్ శర్మ గారూ, ‘స్త్రీవాదం ఎందుకు ఓడిపోతుందో రంగనాయకమ్మ గారు అంత స్పష్టంగా చెప్పలేదు’ అన్నారు గానీ అసలు మీ వ్యాఖ్యే స్పష్టంగా అర్థం కావటం లేదు. స్త్రీ వాదం ప్రసక్తి ఇక్కడ ఎందుకొచ్చిందబ్బా..?

Praveen Mandangi చెప్పారు...

నాస్తికత్వమైనా, స్త్రీవాదమైనా వాటి గురించి కబుర్లు చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు కానీ ఆచరణ విషయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేసేవాళ్లే ఎక్కువ. అర్థం కాలేదా? అడవి బాపిరాజు వ్రాసిన "జగన్మోహనుని పెళ్లి" కథ చదవండి. అర్థమవుతుంది. కొంత మంది నాస్తిక రచయితలు ఉన్నారు కాబట్టే నాస్తికత్వం గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటున్నాము కానీ ఆచరించడం లేదు కదా. ఆచరించేవాళ్లు ఒకరిద్దరు ఉన్నారు. మనం ఏ నాస్తిక రచయితల రచనలు చదివామో, ఆ నాస్తిక రచయితలు చనిపోయారనుకోండి. వాళ్ల శిష్యులలో ఒకరిద్దరైనా ఆచరణలో నాస్తికత్వాన్ని ఆచరిస్తారా? వీరేశలింగం గారు బతికి ఉన్నప్పుడు విధవా వివాహాలకి జయజయలు పలికి ఆయన చనిపోయిన తరువాత విధవా వివాహాల విషయంలో ముఖం చాటేసినవాళ్ల గురించి అడవి బాపిరాజు ఓ కథ వ్రాసాడు. నాస్తికత్వం అయినా ఇంతే. కొన్నేళ్ల క్రితం భారత నాస్తిక సమాజం అనే నాస్తిక బృందంతో కలిసి తిరిగేవాడిని. దళితులు, స్త్రీలు మత కట్టుబాట్లతో ఎలా వివక్షకి గురవుతున్నారో భారత నాస్తిక సమాజంవాళ్లు స్టేజిల మీద లెక్చర్లు ఇచ్చేవాళ్లు. కానీ వాళ్లలో ఎంత మంది తమ నిజ జీవితంలో ఆచరించారో తెలియదు. వీరేశలింగం గారు చనిపోయిన తరువాత బ్రహ్మ సమాజం ఎలా కార్యక్రమాలు లేకుండా పోయిందో, ఆ నాస్తిక బృందం కూడా అలాగే కార్యక్రమాలు లేకుండా పోయింది. భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు జయగోపాల్ గారు నడిపిన నాస్తిక యుగం పత్రిక చదివేవాడిని. ఆ పత్రిక ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. "నీడతో యుద్ధం" పుస్తకంలో నాస్తిక యుగం పత్రిక పైన విమర్శలు చదివిన తరువాత మళ్లీ నేను ఆ పత్రిక చదవలేదు. నాస్తికత్వం గురించి పెద్ద స్టోరీయే ఉంది. అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు.

Praveen Mandangi చెప్పారు...

మీరు కూడా ఒక నాస్తిక సంఘంతో కలిసి కొంత కాలం తిరగండి. నాస్తికత్వం ప్రస్తావన వచ్చినప్పుడు స్త్రీవాదం ప్రస్తావన ఎందుకు వస్తుందో తెలుస్తుంది.

Praveen Mandangi చెప్పారు...

వేణు గారు. ఈ విషయాలు మీకు వెంటనే అర్థం కావు. కొందరు "దేవుడినీ, దెయ్యాలనీ నమ్మకు కానీ పెళ్లి విషయంలో వయసు, ఎత్తు లాంటి పట్టింపులకి పోవడం లాంటి సంకుచిత నమ్మకాలని నమ్ము" అనే వారు ఉంటారు. ఇదంతా అర్థం కావాలంటే అనుభవం ఉండాలి. నేనేమీ రంగనాయకమ్మ గారిని ఉద్దేశించి ఇలా అనలేదు. రంగనాయకమ్మ గారు ఎన్నడూ అలా అనలేదు కానీ ఆవిడ శిష్యులలోనే కొందరు ఆ రకంవాళ్లు ఉన్నారు. పెళ్లి విషయంలో వయసు, ఎత్తు లాంటి పట్టింపులకి పోకూడదు అని చెపితే జె.యు.బి.వి.యే అర్థం చేసుకోలేకపోయాడు. నేను వయసు, ఎత్తు విషయాలని ప్రధానం చేసి మాట్లాడుతున్నానని నన్ను విమర్శించాడు. ఇదంతా కొన్నేళ్ల క్రితం జరిగింది. ఇది అతనికి గుర్తు లేకపోవచ్చు.

సుజాత వేల్పూరి చెప్పారు...

ప్రవీణ్,వేణుగారికే కాదు, మీ వ్యాఖ్యలూ మాటలూ ఎవరికీ అర్థం కావు. అంత బాగా రాస్తారు మీరు. మీరు ప్రస్తావించిన విషయాలకీ, ఇక్కడ ప్రసాద్ గారి పుస్తకానికీ,ఈ టపాకీ ఏ రకంగానూ సంబంధం లేదు. ఇది మాత్రం నాకర్థమైంది.

మీరు పుస్తకం చదివారా లేదా? చదివి వచ్చి ఇక్కడ వ్యాఖ్య రాయండి!

ప్రసాద్ గారికీ మీకూ ఏకవంచనంలో పిల్చుకునే చనువు ఉందేమో తెలీదు. ఒకవేళ ఉన్నా...ఇలా బహిరంగ వేదిక మీద మాట్లాడేటపుడు బహువచనంలో సంబోధించడం మీకు కూడా గౌరవం. ఇవన్నీ మీకెవ్వరూ చెప్పరు. మీరే తెలుసుకోవాలి.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఏక వచనం అని ఉండాలి పై వ్యాఖ్యలో! అచ్చుతప్పు!

vainika చెప్పారు...

JUBV gaaru,
Mee rachanalante naaku kuda istame, mee kathalu konni chadivaanu nenu, naaku kuda RN laane anipinchaayi!! Idi naa thappu kaademo mari...
sujatha, sowmya, venu gaaru, meerantha atleast ok, nenithe job lo cheraka(in 2008) chadivanu RN gaari rachanalu, appatininchi aavidaki pedda fan ipoyi, anni books chadivesa.
Inthaki ee book bangalore lo ekkada dorukunthundo chepthara, evarikina thelisthe, please...

వేణు చెప్పారు...

శారద గారు ఇంగ్లిష్ లిపిలో రాసిన పై వ్యాఖ్యను తెలుగు లిపి లోకి మార్చేస్తే ఇలా ఉంటుంది...
----------------------------------

జేయూబీవీ గారూ,
మీ రచనలంటే నాకు కూడా ఇష్టమే, మీ కథలు కొన్ని చదివాను నేను. నాకు కూడా RN లానే అనిపించాయి!! ఇది నా తప్పు కాదేమో మరి...

సుజాత, సౌమ్య, వేణు గారూ, మీరంతా అట్ లీస్ట్ ok, నేనైతే జాబ్ లో చేరాక (2008లో) చదివాను, RN గారి రచనలు. అప్పటినుంచి ఆవిడకి పెద్ద ఫాన్ ఐపోయి, అన్ని బుక్సూ చదివేశా.

ఇంతకీ ఈ బుక్ బెంగుళూర్ లో ఎక్కడ దొరుకుతుందో చెప్తారా, ఎవరికైనా తెలిస్తే, ప్లీజ్....

-------------------------------

శారద గారూ! మీరు రాసిన మ్యాటర్ తెలుగులో కనపడటానికి http://lekhini.org/ సైట్ ఉపయోగించవచ్చండీ. ఇంగ్లిష్ లిపిలో పైన మ్యాటర్ రాస్తే కింద తెలుగులోకి మారిపోతుంది. దాన్ని ఎంచక్కా కాపీ, చేసి అవసరమైనచోట పేస్ట్ చేసుకుంటే సరి!

vainika చెప్పారు...

వేణు గారు,
థాంక్స్ అండి, నాకు తెలుగులో రాయడం తెలిపినందుకు.
ఇంతకీ ఆ పుస్తకం బెంగళూర్లో ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు?

వేణు చెప్పారు...

శారద గారూ, తెలుగులో రాసినందుకు అభినందనలు!
‘ఆ కుటుంబంతో ఒక రోజు’ పుస్తకం బెంగుళూర్ లో దొరకటం కష్టమేనండీ. మీరు పబ్లిషర్లయిన హైదరాబాద్ నవోదయా వారికి ఉత్తరం రాసి తెప్పించుకోవచ్చు. లేదంటే కంప్యూటర్లో ఆన్‌లైన్‌ కూడా కొనుక్కోవచ్చు. అభోవిభో వారు ఈ పుస్తకాన్ని వాళ్ల వెబ్ సైట్లో చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు. లింకు: http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=3826

oremuna చెప్పారు...

This book is now available for sale as e-book for Rs. 40/- only @ http://kinige.com/kbook.php?id=126