సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

2, జనవరి 2011, ఆదివారం

ఆమె విమర్శ అనితర సాధ్యం!


దరంగ క్రీడలో ఏ ఎత్తు వేసినా మరింత దిగజారే పరిస్థితి ఒకటి ఉంటుంది.  విమర్శకు గురయ్యేవారికి అలాంటి స్థితినే కల్పిస్తారు రంగనాయకమ్మ గారు. తన అక్షర శరాలతో అవతలివారిని ఊపిరాడకుండా అష్ట దిగ్బంధనం చేసేసి, నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తారు ! 

కొత్తగా విడుదలైన రంగనాయకమ్మ గారి వ్యాసాల సంకలనంలో  దీనికి కొన్ని తార్కాణాలు కనపడతాయి. 

ఈ పుస్తకంపై ఇవాళ ‘ఈనాడు ఆదివారం’లో  క్లుప్త సమీక్ష వచ్చింది. 

ఇక్కడ చూడండి.

ఈ పుస్తకం  ఈ-బుక్ గా కినిగెలో ఇక్కడ లభిస్తుంది....
http://kinige.com/kbook.php?id=1021&name=Marxisme+Teliyakapote

రంగనాయకమ్మ గారి భావాలను వ్యతిరేకించేవారు కూడా ఆమె తేటతెల్లంగా, సరళంగా, స్పష్టంగా రాస్తారని ఒప్పుకుంటారు.  ముఖ్యంగా విమర్శల్లో ఆమె శైలి  పదునుగా, శక్తిమంతంగా కదం తొక్కుతుంది. అవి సాహితీపరమైనవి కావొచ్చు; సాహిత్యకారులపై చేసినవి కావొచ్చు- తిరుగులేని తర్కం, సమయోచితమైన ఎత్తి పొడుపు,  వ్యంగ్యం,  హాస్యం,  చురకలూ,  సూటిగా నాటుకునే వ్యాఖ్యలూ... ఆమె విమర్శల్లో మిళితమైవుంటాయి.  చెప్పదల్చుకున్నదాన్ని మినహాయింపులేమీ ఇవ్వకుండా... కుండబద్దలు కొట్టేలా చెప్పే సాహసం ఆమె రాతలకు విలువనిస్తుంది. 

పకడ్బందీగా వాటిని రాసే ‘స్కీమ్’ నాకు అబ్బురంగా కనిపిస్తుంది.   శ్రీశ్రీ, కొడవటిగంటిలపై గతంలో ఆమె చేసిన విమర్శలు చదివి తీరాల్సినవి! ఆమె విమర్శల్లో అంత నైశిత్యం ఎలా సాధ్యమయింది? భాషా నైపుణ్యం ఒక్కటే కాదు కారణం. ప్రధానమైనది భావ తీవ్రతే!  అరటి పండు ఒల్చినంత తేలిగ్గా... పూర్తిగా చదవాలనిపించేంత ఆసక్తిగా... చెరగని ముద్ర వేసేంత బలవత్తరంగా...  రాయగలిగే ఆ శైలి ఆమె భావాల తీవ్రతకు వన్నెలద్దుతుంది!

కొన్ని సందర్భాల్లో  ఆ విమర్శలు ‘చారిత్రక అవసరం’గా నాకు తోస్తాయి.  ఎందుకంటే... మిగిలిన రచయితలందరూ మర్యాదల కోసమో,  మొహమాటాలతోనో,  ‘మనకెందుకులే !’అనో తప్పుకునే సందర్భాల్లో కూడా ఆమె అలా చేయలేదు!  వాల్మీకి  కావ్యమయినా, వీరేంద్రనాథ్  నవలయినా అంతే!   ‘తులసిదళం’పై విమర్శల్లాంటి కేసుల్లో ఏళ్ళ తరబడి కోర్టుల కేసుల చికాకులెదురైనా ఆమె వెనుదీయలేదు; రాజీ పడలేదు.  నానీలపై చురకలు వేసినా, నక్సలైట్లను దుయ్యబట్టినా, అంబేద్కర్ ‘చాలడ’ని ప్రకటించినా ..  ఆమె విమర్శ అనితర సాధ్యం! 

తాజా వ్యాసాల సంకలనం ‘మార్క్సిజమే తెలియకపోతే పుట్టినవాళ్ళం పుట్టినట్టే ఉంటాం!’  ముఖచిత్రం మీదే  - ‘మానవ సమాజానికి మార్క్సిజమే జ్ఞానోదయం! సూర్యోదయం!’  అని ఉంటుంది.  సహజంగానే  సోషలిజం, కమ్యూనిజం, ‘శ్రమ దోపిడీ’లకు సంబంధించిన విషయాల్ని వివరంగా చర్చించే  వ్యాసాలు దీనిలో కనిపిస్తాయి. 

ఇతర వ్యాసాల సంగతికొస్తే...  రామాయణాన్నీ, రామాయణ విషవృక్షాన్నీ కూడా సమానంగా ఇష్టపడే రచయిత్రి  పవని నిర్మల ప్రభావతి గారితో రంగనాయకమ్మ గారి సంభాషణలు హృద్యంగా ఉంటాయి.  

‘ప్రగతి పట్టని ప్రగతి వాదులు’ అనే వ్యాసంలో  ఇప్పుడొస్తున్న సినిమాలపై  తన వ్యతిరేకతనంతా మాటల్లో గుప్పించి ఎలా రాశారో చూడండి- 
‘‘వెకిలి గంతుల డాన్సులూ, చవకబారు వెకిలి సంభాషణలూ, సెక్సూ- క్రైమూ నిండిన దుర్భర దృశ్యాలూ, అసహజమైన మసాలా కథలూ, కుత్రిమమైన సన్నివేశాలూ, తప్పుడు సందేశాలూ, పనికిమాలిన పరిష్కారాలూ- ఈ అస్తవ్యస్తపు సినిమా మత్తులో మునిగే తలకాయలకు , సినిమా నటులే దేవుళ్ళూ, దేవతలూ! జులాయి పాత్రల్లో గంతులేసేవాళ్ళు మరింత ఆకర్షణీయులు!’

న్. వేణుగోపాల్ గారిపై 2009 సెప్టెంబరులో చేసిన విమర్శ పాఠకుల్లో  చాలా చర్చనీయాంశమైంది.  వై.ఎస్.కు వేణుగోపాల్ గారు  సమర్పించిన నివాళిలోని కొన్ని మాటలను తన విమర్శలో శక్తిమంతంగా ఉపయోగించుకున్న విధానం గమనించదగింది. 
‘ఈ విప్లవ రచయిత..’- ‘ఆ ముఠా నాయకుడు..’ ;  ‘ఆ నాయకుడు...’, ‘ఈ విప్లవకారుడు..’ అంటూ వ్యాసం పొడవునా ఎత్తిపొడుస్తూ వాక్య విన్యాసం  చేస్తారు. 
 ‘‘...అయినా, ఆయన ‘‘దరహాసం’’, ‘‘వెచ్చని కరస్పర్శా’’, ఈ విప్లవకారుడికి ‘‘ఎప్పటికీ మరపురావు’’!  అని రాశాక,  ఆ వెంటనే  దూసుకొచ్చిన వ్యాఖ్య - ‘‘మరుపు వచ్చేసినది - విప్లవమే.’’

నామిని గారిని ‘బడాయి తగ్గించుకో’మంటూ  2010 ఫిబ్రవరిలో  విమర్శించిన  వ్యాసం  నేరుగా ఆయన్నే ఉద్దేశిస్తూ రాసిన లేఖలా ఉంటుంది.  ఇది కల్పనా రెంటాల గారికి ‘సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా’ రాసినట్టనిపించింది.  నాకు  మాత్రం  కొంచెం మెత్తగానే కాదు;  చాలా కరుకుగానూ రాసినట్టనిపించింది. 
‘‘మంచి రసాల్ని ఊరించే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు? ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా?’’ అనే ప్రశ్న అమోఘం!  ‘‘సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు’’ అనీ,  ‘‘బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు’’ అనీ జాలి చూపిస్తారు. అంతలోనే  ‘‘నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్నమాటే కదా?’’ అనే ముక్తాయింపు... పరాకాష్ఠ  అనిపించింది నాకు!  

‘పొద్దు’ వెబ్ పత్రికలో నిడదవోలు మాలతి గారు  తన ఇంటర్వ్యూలో  చేసిన  వ్యాఖ్యలపై రంగనాయకమ్మ గారు ఇచ్చిన  జవాబును కూడా  ఈ పుస్తకంలో చేర్చారు. బాలగోపాల్, వరవరరావు, శివారెడ్డిలపై రాసినవి కూడా ఉన్నాయి. 

వినుకొండ నాగరాజు గారి  ‘ఊబిలో దున్న’ నవలపైనా, ఆయన సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన తీరుపైనా ఆమె వ్యాఖ్యానాలు  ఆసక్తికరం.
‘‘వీరెప్పుడూ, మగ పళ్ళెంలో మగ అన్నం తింటారు. మగ గ్లాసుతో  మగ నీళ్ళు తాగుతారు!’’ అనీ,  ‘‘ఈ మొగ రచయిత, మొగ జలగ లాగ, వార్ని వదలలేదు’’ అని రాయటం చూస్తే భలే నవ్వొస్తుంది.
ఈ విమర్శను 36 సంవత్సరాల క్రితమే రాసినా, అదెక్కడో ఉండిపోయి ఇప్పటివరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు. ఈ మధ్యనే  పాత కాయితాలు సర్దుతూ వుంటే ఇది బైటపడిందట!  ‘‘దీన్ని రాసినప్పుడు అంత ఆసక్తిగా రాసి, ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని ఎలా మరిచిపోయానో  ఆశ్చర్యం!’’ అంటారామె.

ఈ బ్లాగులో ఇచ్చిన  నా ప్రొఫైల్ చూశారా? 
నాకు నచ్చిన రచయితలుగా రంగనాయకమ్మగారితో పాటు మరో ఇద్దరి పేర్లుంటాయి.


కొడవటిగంటి  కుటుంబరావు గారు,  వినుకొండ నాగరాజు  గారు (‘కమెండో’ ఎడిటర్)


రంగనాయకమ్మగారు  కొడవటిగంటి గారిపై  చేసిన విమర్శలు  ఎప్పటినుంచో తెలుసు. ఎటొచ్చీ వినుకొండ నాగరాజు గారే  ఆమె విమర్శల బారి నుంచి తప్పించుకున్నారని అనుకునేవాణ్ణి.

... కానీ ఇప్పుడా లోటు కూడా తీరిపోయింది! :)

16 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

రంగనాయకమ్మ గారి రచనలలో నేను చదివిన మొట్టమొదటై పుస్తకం "దళిత సమస్య పరిష్కారానికి". ఆ తరువాత సీక్వెన్స్‌లో మిగిలినవి చదివాను. ఆమె రచనలు నాకు బాగా నచ్చాయి. కానీ చారిత్రక భౌతికవాదాన్ని అర్థం చేసుకోవడానికి రంగనాయకమ్మ గారి సాహిత్యం సరిపోదు. రంగనాయకమ్మ గారి రచనలతో పాటు ఇతరుల రచనలు చదవాల్సి ఉంటుంది. ఉదాహరణకి బానిస వ్యవస్థ ఉన్న రోజుల్లో కూడా కొన్ని పనులు డబ్బులు ఇచ్చి చెయ్యించేవాళ్లు అని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ వ్రాసిన ఒరిజినల్ రచనలు చదివిన తరువాత తెలిసింది. గొడ్డలి లాంటి వస్తువులు తయారు చెయ్యాలంటే కొలిమిలో లోహం కరిగించి జాగ్రత్తగా తయారు చెయ్యాలి. అవి బానిసల చేత తయారు చెయ్యించడానికి అవ్వదు. పూర్తిగా చదవకుండా వదిలేసినది బలిపీఠం నవల. అది జెయుబివి సలహా ఇస్తే కొన్నాను కానీ అందులో కొన్ని ముక్కలు చదివిన తరువాత ఆ నవల మార్క్సిజంకి చాలా దూరంగా ఉందనిపించింది. ఎవరైనా జీవితానికి తోడు కోసం పెళ్లి చేసుకుంటారు. భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్లి చేసుకున్నా జీవితానికి తోడు కోసమే చేసుకుంటారు. కానీ ఆ నవలలో ఒక స్త్రీ కేవలం సుమంగళిగా చనిపోవాలనే కోరికతో పెళ్లి చేసుకుంటున్నట్టు వ్రాసారు. అందుకే ఆ నవల నాకు అర్థం కాలేదు. బలిపీఠం నవల తప్ప మిగితా రచనలన్నీ నన్ను ఆకర్షించాయి. నీడతో యుద్ధం పుస్తకం దొరక్కపోతే విజయవాడ వెళ్లి ఒరిజినల్ పబ్లిషర్ దగ్గర కొన్నాను.

వేణు చెప్పారు...

@ ప్రవీణ్ శర్మ: ‘బలిపీఠం’నవల మార్క్సిజాన్ని కాకుండా సంస్కరణ వాదాన్ని ప్రబోధించేది కాబట్టే... దానికి ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని రచయిత్రి ఆ నవల ముందుమాటలో చెప్పారు. కాబట్టి ‘ఆ నవల మార్క్సిజంకి చాలా దూరంగా ఉందనిపించింది’ అనే మీ ఫిర్యాదులో న్యాయం లేదు!

Praveen Mandangi చెప్పారు...

సంస్కరణ విషయానికే వద్దాం. ఎవరైనా జీవితానికి తోడు కోసం పెళ్లి చేసుకుంటారు. భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్లి చేసుకున్నా జీవితానికి తోడు కోసమే చేసుకుంటారు. కానీ సుమంగళిగా చనిపోవడానికి పెళ్లి చేసుకుంది అని వ్రాస్తే సాధారణ సంస్కరణవాదులకైనా అర్థం కాదు. ఆ నవల పూర్తిగా చదవలేదు. కొన్ని ముక్కలు చదివి అర్థం కాక ఆపేశాను అని ఇందాక చెప్పాను.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

@ ప్రవీణ్ శర్మ: బలిపీఠం నవలను ‘పూర్తిగా చదవలేదు. కొన్ని ముక్కలు చదివి అర్థం కాక ఆపేశాను’ అన్నారు. అలాంటపుడు దాని గురించి మీరు చర్చించేదేముంటుంది? అయినా ‘సుమంగళిగా చనిపోవటం’ చుట్టూ అల్లుకునివున్న సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!

Praveen Mandangi చెప్పారు...

రంగనాయకమ్మ గారి కుటుంబరావు గారిని విమర్శిస్తూ వ్రాసినవు "మానవ సమాజం" పుస్తకంలో చదివాను. కానీ కొన్ని విషయాలలో కుటుంబరావు గారి రచనలు నాకు నచ్చాయి. ఉదాహరణకి "కులం మిథ్య, మతం మిథ్య, ధనం ఒకటే నిజం" అనే కుటుంబరావు గారి కోట్ నాకు ఎంతో నచ్చింది. మనిషి నిజ జీవితంలో కులం, మతం లాంటి వాటి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని రంగనాయకమ్మ గారు కూడా చెప్పారు కానీ ఆ విషయాలు డైరెక్ట్‌గా చెప్పిఉంటే సులభంగా అర్థమయ్యేది.

Praveen Mandangi చెప్పారు...

ఈ రోజు ఆదివారం కదా. పుస్తకాల షాపులు తెరిచి ఉండవు. రేపు విశాలాంధ్రకి వెళ్లి చూస్తాను.

తృష్ణ చెప్పారు...

బాగా రాసారు. Happy new year అండీ.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Praveen Mandangi చెప్పారు...

సుజాత గారు. రంగనాయకమ్మ గారు వేణుగోపాల్ గారిని విమర్శిస్తూ వ్యాసం వ్రాసిన తరువాత రాజశేఖరరెడ్డిని పొగడడం తప్పేనని వేణుగోపాల్ గారు ఒప్పుకున్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తూ రాబందు నీడ లాంటి పుస్తకాలు వ్రాసిన వేణుగోపాల్ గారు ఆ సామ్రాజ్యవాదుల క్రింద దళారీ అయిన రాజశేఖరరెడ్డిని ఎలా పొగిడారు అని ఆశ్చర్యం కలిగింది.

వేణు చెప్పారు...

@ ప్రవీణ్ శర్మ: ‘రాజశేఖరరెడ్డిని పొగడడం తప్పేనని వేణుగోపాల్ గారు ఒప్పుకున్నారు’ అని మీరు వ్యాఖ్యానించారు గానీ ఆయన అంత స్పష్టంగా ఆ విషయం చెప్పలేదు. ‘గాయపరిచాను, క్షమించండి’ అంటూ విప్లవాభిమానులనూ, మిత్రులనూ ఉద్దేశించి ఇచ్చిన వివరణలో ‘వ్యాసరచనలో కొన్ని అనవసరమైన, అభ్యంతరకరమైన, అపార్థానికి దారితీసే మాటలు దొర్లాయి. అవి నేను నమ్మే భావజాలానికి తగనివి’ అని రాశారు. ఈ ‘వివరణ’పై రంగనాయకమ్మ గారి స్పందన ఆంధ్రప్రభలో 2009 సెప్టెంబరు 11న వచ్చింది. దీన్ని కూడా కొత్తగా వచ్చిన పుస్తకంలో చూడొచ్చు!

కొత్త పాళీ చెప్పారు...

Very interesting.

వేణు చెప్పారు...

@ సుజాత: మీ సూచన అర్థవంతం. ప్రస్తావించిన సందర్భాల నేపథ్యాలను కూడా టపాలో రాసివుండాల్సింది. ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

@ తృష్ణ , @ కొత్తపాళీ : మీ అభిప్రాయాలకు కృతజ్ఞతలండీ.

Praveen Mandangi చెప్పారు...

వేణుగోపాల్ గారు కూడా రంగనాయకమ్మ గారి అభిమానే. రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం, జానకి విముక్తి వంటి పుస్తకాలు ఆయన చదివారు. హత్యా రాజకీయాలు నడిపిన రాజశేఖరరెడ్డిని ఆయన పొగడడం ఆశ్చర్యం కలిగించింది.

Praveen Mandangi చెప్పారు...

ఇప్పుడే ఈ పుస్తకం కొన్నాను. చదివిన తరువాత చెపుతాను.