సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, జనవరి 2011, సోమవారం

‘చందమామ’ను దాటి ‘బొమ్మరిల్లు’ను మీటి...!

‘ఇండియా టుడే’ పత్రిక ఆయన్ని ‘జానపద కథా వైశంపాయను’డని కీర్తించింది!

అపూర్వమూ, మౌలికమూ అయిన జానపద కథల స్వర్గాన్ని సృష్టించినందుకు ‘విశ్వామిత్రు’డితోనూ పోల్చొచ్చు. జానపద కథా సరిత్సాగరాన్ని ‘అగస్త్యు’డిలా ఆపోశన పట్టాడంటూ అభివర్ణించవచ్చేమో కానీ, అద్భుతమైన రచనలు చేసి కూడా ఆయన తెరమరుగునే ఉండిపోయారు ... ‘అగస్త్య భ్రాత’లా!

బతికుండగా ఆ పేరు పాఠకులకు పెద్దగా తెలియలేదు. చనిపోయాకే ఆయన రచనల విస్తృతి పాఠక లోకానికి వెల్లడవుతోంది...

ఔను... ఇదంతా ‘జానపద నవలా సమ్రాట్’ దాసరి సుబ్రహ్మణ్యం గారి సంగతే!
అన్వర్, చంద్రల గీతల్లో దా.సు.గారు

ఆ అక్షరాల వెలుగులు ‘చందమామ’ పత్రికకు మాత్రమే పరిమితం కాలేదు.  ఆ కలం ఇంద్రజాలం ఇతర పత్రికల పాఠకులనూ విశేషంగా సమ్మోహనపరిచింది. బొమ్మరిల్లు, ప్రమోద, జాబిల్లి, స్నేహబాల, మిలియన్ జోక్స్... ఈ పత్రికల్లో వెలువడిన జానపద ధారావాహికల స్రష్ట కూడా ఆయనే!

‘చందమామ’లో దా.సు. సృష్టించిన ‘తోకచుక్క’ నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ పన్నెండు సీరియల్స్ గురించి ఇప్పుడు చాలామందికి తెలుసు.

తెలియనిదల్లా పేరు లేకుండా ఇతర పత్రికల్లో ఆయన రాసిన వాటి గురించే!

అసలే అజ్ఞాత రచయిత... పైగా ప్రచ్ఛన్న రచనలు! ఒక్కో రహస్యమే బయటపడుతూ ఆ రచనా విశ్వరూపం... ఇప్పుడు - క్రమంగా గోచరమవుతోంది!

ఇదంతా ఇప్పటికైనా వెల్లడవుతున్నందుకు సంతోషం. కానీ... జీవించివుండగా ఆయన కృషి సంపూర్ణంగా పాఠకులందరికీ తెలియకుండా పోయిందే అనే బాధ!


*******

‘దాచేసిన’ దాగని సత్యం!

అసలు జనవరి 2011 ‘రచన’ విడుదలయ్యేవరకూ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల విస్తృతి (నాతో సహా) పాఠకులకెవరికీ తెలీదు.

దా.సు. గారు ఏళ్ళ తరబడి గుండెల్లో దాచేసుకున్న తన రచనల రహస్యాలన్నీ దాసరి వెంకటరమణ గారికి స్వయంగా చెప్పారు. ఆయన ఇన్నాళ్ళూ వాటిని గుట్టుగానే ఉంచి, చివరకు ‘రచన’ జనవరి సంచికలో ‘ఈయన సామాన్యుడు కాదు!’ వ్యాసం ద్వారా పాఠకలోకం ముందు పెట్టారు.

( ఆ వ్యాసంలో కొంత భాగం ఇది...)

దా.సు. గారి రచనలను ఓసారి చూడండి-

బొమ్మరిల్లులో-   మృత్యులోయ (1971-74); శిథిల నగరం (74-75); మంత్రాల దీవి (76-80); గంధర్వ నగరం; సర్ప కన్య (80)


‘స్నేహబాల’లో-  మాయా గంధర్వుడు (1977)

‘ప్రమోద’లో-  కపాల దుర్గం (1978)

‘మిలియన్ జోక్స్’లో-  మాయా ద్వీపం (1980)

వీటిలో ఏమైనా నవలలు మీరు చదివారా?

... జాబితా ఇంకా అయిపోలేదు!

జంతువుల పాత్రలతో కథల సీరియల్స్ కూడా దాసరి సృష్టే.


చందమామలో... నక్క సవారీ, రాజప్రతినిధులు;

బొమ్మరిల్లులో.... కుందేలల్లుడు కథలు, ఖరభ శరభ కథలు;

ప్రమోదలో... అదురూ బెదురూ కథలు;

జాబిల్లిలో... రుద్రాభద్రుల కథలు;

మిలియన్ జోక్స్ లో... కేతక చాతకుల కథలు...

ఇవన్నీ!

ఇవే కాదు...

బొమ్మరిల్లు పాకెట్ సైజు పుస్తకాల్లో ‘రచయిత పేరు’ లేకపోతే అవి దాసరి సుబ్రహ్మణ్యం గారివే అయివుండటానికి ఆస్కారం ఉంది. ఆ పుస్తకాలు దొరికితే (పాత పుస్తకాల షాపులే శరణ్యం!) రచనా శైలిని బట్టి నిగ్గు తేల్చే ప్రయత్నం చేయవచ్చు. ఆ పుస్తకాల కోసం సాగుతున్న అన్వేషణలో మీరూ ఓ చేయి వేయవచ్చు.


అంటే... తెలుగులో బాలల పత్రికల ద్వారా జానపద కథా సాహిత్య సృష్టినంతా దాదాపు ఆయనొక్కరే... ‘ఏక వ్యక్తి సేన’లాగా నిర్వహించారన్నమాట... అనుపమానంగా, అనితర సాధ్యంగా!

అయినా...

ఏ పటాటోపమూ లేకుండా...


కీర్తి ప్రతిష్ఠలేమీ ఆశించకుండా ... నిష్కామంగా...


అనామకంగా...!


*******

‘పొరపాటు’న సరైన వ్యక్తినే అడిగా!

‘బొమ్మరిల్లు’లో వచ్చిన ‘మృత్యులోయ’ను దాసరి గారే రాశారని హైదరాబాద్ లో జరిగిన ఆయన సంస్మరణ సభలో తెలిసింది. ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాను!


నాకెంతో ఇష్టమైన నవల అది. అసలు ‘మృత్యులోయ’ అన్నపేరులోనే ఏదో వణికించే భీతి! ఆ లోయలో పడిపోయిన కథానాయకుల గురించి నా బాల్యంలో ఎంతో బెంగపడ్డాను. ఉత్కంఠభరితంగా ఆ సీరియల్ చదువుతూ వాళ్ళు మళ్ళీ ఎలా ఆ లోయ నుంచి బయటపడతారోనని చిన్నప్పుడు తెగ ఆలోచించేవాణ్ణి. అయితే ఆ నవలను ఎవరు రాశారనేది మాత్రం అసలెప్పుడూ ఆలోచించనే లేదు! :-)

బొమ్మరిల్లు సంచికలు అక్కడక్కడా మిస్ అయి, ఆ కథ ఎలా ముగిసిందో చాలాకాలం వరకూ తెలియనేలేదు. తర్వాత... చాలా సంవత్సరాలకు ఆ నవల బొమ్మరిల్లు రెండు పాకెట్ పుస్తకాలుగా విజయవాడ బస్ స్టాండ్ బుక్ స్టాల్లో దొరికినపుడు ఎంత సంబరపడిపోయానో! ఏకబిగిన చకచకా కథ మొత్తం చదివేశాను. ఇప్పటికీ ఉన్నాయి, ఆ పుస్తకాలు భద్రంగా!

కిందటి సంవత్సరం మే నెలలో అభిమానిగానే కాకుండా జర్నలిస్టుగా కూడా  విజయవాడలో దాసరి గారిని కలుసుకున్నా కదా? ఆయన కథానాయకుల గురించి వివరాలు అడుగుతున్నపుడు ‘యశపాల జయకేతులు’ అనే మాటే అప్రయత్నంగా నా నోటివెంట వచ్చింది. అయితే వీళ్ళు ‘మృత్యులోయ’ హీరోలు కదా అని వెంటనే స్ఫురించింది. నా ‘పొరపాటు’ను చప్పున సర్దుకుని, ‘రాతిరథం- యక్ష పర్వతం ’లోని ఖడ్గవర్మ, జీవదత్తుల ఆహార్యం గురించి అడిగేశాను.

అయితే ‘పొరపాటు’న సరైన వ్యక్తినే అలా అడిగాననీ, నా ఎదురుగా ఉన్న వృద్ధమూర్తే ఆ ‘మృత్యులోయ’ కర్త అనీ అప్పుడు తెలీదు నాకు! అసలు ఆయనకు వినికిడిశక్తి సరిగా ఉండివుంటే నా మాటలు విని, సగర్వంగా మెరుస్తున్న కళ్ళతో ‘మృత్యులోయ’ రాసింది నేనే’ అని చెప్పివుండేవారేమో!

ఇక ఆ సంభాషణ అంతటితో ఆగుతుందా? మిగిలిన ప్రచ్ఛన్న రచనల ప్రసక్తి తప్పనిసరిగా వచ్చివుండేది.

సాంఘిక కథలూ, డిటెక్టివ్ నవలలూ కూడా రాసిన సుబ్రహ్మణ్యం గారు దాసు , డి.భవానీ ప్రసాద్, టి. శంభుదాస్, సుజాతల పేర్లతో 1950ల నుంచి 80ల వరకూ రచనా వ్యాసంగం సాగించారు.


*******

మూడు పుస్తకాలూ కలిపి రూ.360కే !

‘యువ’ మాసపత్రికలో వచ్చిన ‘అగ్నిమాల’(1975) సీరియల్ లో మాత్రమే దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరు ప్రచురించారు. ఆ ‘యువ’ సంచికలు దొరుకుతాయేమోనని దా.సు.గారు తన జీవితకాలంలో చాలా ఎదురుచూశారు. అది సాధ్యం కాలేదు.

వాటిని ఈ మధ్యనే ‘రచన’ శాయి గారు పట్టేశారు. (ఇదొక్కటే కాదులెండి, దా.సు. గారి సినీతార దుర్మరణం (ఆంధ్రప్రభ సీరియల్- 1953), ఇంకా చాలా సాంఘిక కథలను శాయిగారు అన్వేషించి, సాధించారనుకోండీ).

‘అగ్నిమాల’,

‘మృత్యులోయ’ నవలలనూ,

దాసరి గారి 39 సాంఘిక కథలనూ

మూడు పుస్తకాలుగా ‘వాహినీ బుక్ ట్రస్ట్’ తరఫున శాయి గారు ప్రచురిస్తున్నారు.


ఈ సాంఘిక కథల, జానపద నవలల ఆవిష్కరణ 2011 జనవరి 27న జరగబోతోంది.   సాయంత్రం 6 గంటలకు.

హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో బాలసాహిత్య పరిషత్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.

ఇదిగోండి... ఆహ్వాన పత్రిక!


రూ.360 ఎం.ఒ./ డి.డి. ద్వారా ఇక్కడ ఇస్తున్న అడ్రసుకు పంపితే  ఈ  మూడు పుస్తకాలనూ రిజిస్టర్డ్ పోస్టులో అందుకోవచ్చు.

వాహినీ బుక్ ట్రస్ట్, 1-9-286/2/పి
విద్యానగర్, హైదరాబాద్- 500 044

ఫోన్ నంబర్ : 040-27071500.7 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

సుజాత గారూ! మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. దాసరి గారి రెండు నవలలూ, కథలూ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ పుస్తకరూపంలో రావటం ఆయన అభిమానులకు సంబరమే. పేరు ప్రఖ్యాతులు పట్టని ఒక గొప్ప రచయితకు ఆయన అభిమానులు ఇచ్చే చక్కని నివాళి!

వేణు చెప్పారు...

దాసరి గారిని ‘జానపద కథా వైశంపాయనుడు’ అని అభివర్ణించిన ‘ఇండియా టుడే’ సంచిక వివరాల గురించి కొందరు సాహిత్యాభిమానులు అడిగారు.

జనవరి 11, 2011 సంచిక- 46వ పేజీలో ‘ఇక చరిత్ర స్మృతులు’ అనే శీర్షికలో దాసరి గారి ఫొటోతో ప్రచురించిన రైటప్ లో ఈ సమాచారం ఉంది!

రవి చెప్పారు...

దాసరి గారు నిజమైన సాహిత్యవేత్త. మన ప్రాచీన కవులు రచన కు తప్ప పేరుకు ఆశపడింది లేదు. అంచేతనే ఇప్పటికీ సంస్కృత, తెలుగు కవుల కవికాలాదులు సరిగ్గా తెలియట్లేదు. ఈయన ’రచన’ లను వెలికితీసి శేషతల్పసాయి గారు గొప్ప శారదాసేవ చేస్తున్నారు.

బొమ్మరిల్లు చిట్టినవలలు నా వద్ద ఓ ముప్పై దాకా ఉన్నాయి. అందులో రచయితలు లేని పుస్తకాల జాబితా తయారుచేసి ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటాను.

వేణు చెప్పారు...

రవి గారూ! థాంక్యూ. బొమ్మరిల్లు చిట్టి నవలల గురించి మీరు గతంలో టపా రాసిన విషయం గుర్తుంది. ఈ రకంగా మీరు ఈ నవలల విషయంలో మంచి సోర్సు. ‘రచయిత పేరు లేని పుస్తకాల జాబితా’ తయారు చేస్తానన్నారుగా? సంతోషం. ఈ విషయం ఇవాళే శాయి గారికీ, దాసరి వెంకటరమణ గారికీ చెప్తాను!

ఉష చెప్పారు...

ఈ సమాచారానికి థాంక్స్. దాసరివారి మూడు పుస్తకాలు కొనే ప్రయత్నం లో పడ్డాను. అలాగే మీరు రాసిన మరి కొన్నిపోస్ట్లు కూడా బావున్నాయి. తెనాలి లో ప్రాణమా పాట లిరిక్స్ కూ కృతజ్ఞతలు.

వేణు చెప్పారు...

ఉష గారూ, మీ స్పందనకు కృతజ్ఞతలు!