సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

13, జూన్ 2012, బుధవారం

మాయాబజార్ చిత్రం ... మహాప్రస్థానం ముఖచిత్రం!

1950 లో ప్రచురితమైన  మహాప్రస్థానం, 1957 లో విడుదలైన మాయాబజార్ ... ఈ రెంటితో  సంబంధమున్న  కళాకారుడు మా.గోఖలే !

మొదటిది  తెలుగు కవిత్వ పటుత్వానికి  చిరునామా, సాహిత్య  శిఖరం!  రెండోది  తెలుగు సినిమా  స్థాయికి  పరాకాష్ఠ,  వెండితెర కావ్యం!

ఈ రెండిటి గురించి  ఇక  చెప్పాల్సిందేమీ లేనంతగా  విస్తారంగా  చర్చలు  జరిగాయి. అయినా... తరచూ ఉటంకింపులతో ప్రశంసలూ,   సమాలోచనలూ,  తలపోతలూ సాగుతూనే ఉన్నాయి. 


ఇక  మా.గోఖలే! (1917-1981). మాధవపెద్ది  గోపాల కృష్ణ గోఖలే. ఇంటి పేరు చూడకపోతే పేరును బట్టి  తెలుగువాడు కాదనిపిస్తుంది. ( స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి గుర్తుగా మనలో ఝాన్సీలక్ష్మీబాయిలూ ,  బాలగంగాధర తిలక్ లూ, గాంధీలూ చాలామందే ఉన్నారనుకోండీ.) 

ఆయన  రాసిన  కథలతో  ఓ సంకలనం  వచ్చింది. అయితే   చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా ఆయన  కృషిని   తెలిపే  సమాచారం అంతగా  అందుబాటులో  లేదు.

1949 ఆగస్టు 1న కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో ప్రజలను దిగంబరులుగా మార్చి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించారు పోలీసులు. దీనిపై గోఖలే గీసిన రేఖా చిత్రం అప్పట్లో చర్చనీయాంశమయిందట.  (చలసాని ప్రసాదరావు ‘ఇలా మిగిలేం’లో కూడా ఈ సంఘటన ప్రస్తావన ఉంటుంది).


గోఖలే చిత్రించిన  పలనాటి ‘బ్రహ్మన్న’కు  బాగా ప్రసిద్ధి వచ్చింది. ‘చాపకూడు’తో సమత కోసం ప్రయత్నించిన బ్రహ్మనాయడు చాప మీద  ఆలోచనా ముద్రలో  కూర్చుండగా ఎదురుగా ఖడ్గం.  సాంప్రదాయిక శైలిలో గీసిన  ఈ బొమ్మను చూస్తుంటే పల్లెటూళ్ళలోని  వ్యవసాయకుటుంబాల్లో ఆజానుబాహులైన రైతులు గుర్తొస్తారు. నీటి రంగుల్లో చిత్రించిన ఈ బొమ్మను ఏ పుస్తకంలో చూశానో గుర్తు లేదు కానీ ఆ వర్ణచిత్రం లభ్యం కాలేదు.

ప్రస్తుతానికి నలుపు తెలుపు చిత్రాన్నే చూద్దాం.



గోఖలే  మరో ప్రసిద్ధ చిత్రం  ‘పావురాళ్ళు’. నేనింతవరకూ  చూసినట్టు గుర్తులేదు. ఇది కూడా ఎక్కడా  దొరకలేదు.  

కళా దర్శకుడు
మాయాబజార్  సినిమాకు  కళా దర్శకుడిగా మా. గోఖలే  పనిచేశారు. ఘటోత్కచుడూ, శ్రీకృష్ణుడూ  .. ఈ   పాత్రల ఆహార్యం , పౌరాణిక వాతావరణం కళ్ళముందుకు తెచ్చిన  సెట్ల వెనక కృషి మా. గోఖలేదే.


ఈ సారి  ఆ సినిమా చూసేటపుడు... సెట్ల అందాలనూ,  పాత్రధారుల అలంకరణలనూ గమనించి  మా.గోఖలేను  కూడా  తల్చుకోండి ఓసారి! 

గోఖలే కళాదర్శకుడిగా పనిచేసిన చిత్రాలు పదకొండో, పన్నెండో ఉన్నాయి. షావుకారు  (1950)తో కెరియర్  ప్రారంభించి,  పాతాళభైరవి  (1951), మిస్సమ్మ (1955) ... అలా ఎదుగుతూ జగదేకవీరుని కథ (1961), ఆపై శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)  వరకూ విజయవంతంగా కొనసాగారు.

టైటిల్ డిజైనర్
 గత అరవయ్యేళ్ళలో  30కు పైగా  ముద్రణలు పొందిన విశేష  ప్రాచుర్యం  మహాప్రస్థానానిది.  దీనికి  ముఖచిత్రం  వేసింది మా.గోఖలేనే !

‘మహాప్రస్థానం’అనే అక్షరాలు  ఏటవాలుగా వంగి ఒక కదలికను స్ఫురింపజేస్తుంటాయి.  గుండ్రంగా, ఒద్దికగా ఒదిగివుండే సాంప్రదాయిక  తెలుగు అక్షరాలు కావివి.  కొత్త బాటలో  తిరుగుబాటును తలపించేలా , పుస్తక స్వభావం  వ్యక్తమయేలా  ఉంటాయవి. ‘భారతీయుడి’ గొలుసుకొట్టు రాతను పోలి అక్షరాలు విభిన్నంగా  కనపడతాయి. తలకట్టు గీయటంలో,  నిలువుగా నిలిచిన  అక్షర నిర్మాణంలో  అదో  ప్రత్యేకత.  ‘శ్రీశ్రీ’ చేతిరాత ఇలాగే ఉంటుంది!

తర్వాతి కాలంలో  మాదాల రంగారావు ‘మహాప్రస్థానం’ పేరుతో  సినిమా తీసినపుడు  ఇదే  టైటిల్ ని లోగో గా వాడుకున్నారు.



ముఖచిత్రంలో వివరాలు  అంత స్పష్టంగా ఉండవు. కానీ ఒక రకమైన impact కలగజేసేలా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన దృశ్యాలు ఇందులో చిత్రించారు.

 ఓ పక్క.  ఉరికొయ్యలకు వేలాడే  శిరస్సులు, కుంగిపోయి, వంగిపోయి కూలబడిపోయిన  వృద్ధులూ, పిల్లలూ. ‘అనేకులింకా అభాగ్యులంతా అనాధులంతా అశాంతులంతా ’!  మరోపక్క- విముక్తి కోసం ప్రతిఘటనకు సిద్ధమైన జనం!

ఇదంతా  నేపథ్యం.  

‘మీ కోసం కలం పట్టా’నని  భరోసా ఇస్తూ -

‘నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి’..


సమర్పణం చేస్తున్నానన్నట్టు  ఒక పక్కకు  తలపైకెత్తి స్థిరంగా,  ధీమాగా చూసే  శ్రీశ్రీ (అలనాటి) రూపం !

‘మహాప్రస్థానం’  టైటిల్ డిజైన్ రూపకల్పన అనుభవం  గురించి  మా. గోఖలే  ఎక్కడైనా చెప్పారో, రాశారో లేదో తెలీదు.

చలం రాసిన  ‘యోగ్యతా పత్రం’ శక్తిమంతమైన అక్షర నివాళి! 
గోఖలే గీసిన ముఖపత్రం- ఆ పుస్తక సారాన్ని చాటి చెప్పే చిత్రకళా కాహళి!!      

14 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

good info

కమనీయం చెప్పారు...

మా.గోఖలే చిత్రించిన బ్రహ్మనాయుడి వర్ణ చిత్రం ఆంధ్రపత్రిక ప్రత్యేకసంచికలో ప్రచురితమైనది.ఇదే కాదు ,ఆరోజుల్లో(1950-1970)గోఖలే,అడవి బాపిరాజు,గుర్రం మల్లయ్య వంటి ప్రసిద్ధచిత్రకారుల చిత్రాలు భారతి,ఆంధ్రపత్రిక ప్రత్యేకసంచికల్లో ప్రచురించేవారు.కాని మన తెలుగువారి నిర్లక్ష్యం వలన అవి ఇప్పుడు దొరికే అవకాశాలు మృగ్యం.ఏయూనివర్సిటీ లైబ్రరీలోనో ఉంటాయేమో.భారతి,ఆంధ్రపత్రిక ,ప్రచురణ ఆగిపోయి చాలా కాలమైంది కదా.
మరొక సంగతి; గోఖలే గుంటూరు పల్లెటూరి యాసలో కొన్ని కథలు కూడా రాసారు.

వేణు చెప్పారు...

@ మనోహర్ చెనికల: థాంక్యూ.

@ కమనీయం: బ్రహ్మనాయుడి వర్ణచిత్రం గురించి సమాచారం అందించినందుకు కృతజ్ఞతలండీ. మా.గోఖలే కథల సంకలనాన్ని విశాలాంధ్రవారే ప్రచురించారు. పూర్తిస్థాయి మాండలికంలో రాసిన తొలి రచయిత ఈయనేనని చెప్తారు.

మనోహర్ చెనికల చెప్పారు...

good one

Avinash Vellampally చెప్పారు...

వేణు గారూ,

మహాప్రస్థానం పుస్తకం తెరవకముందే, ముందుమాటో వెనకమాటో చదవకముందే, అసలు పుస్తకం చూడగానే లోపల ఏముందో స్ఫురణకు తేగల స్థాయిలో ఉంటుంది మహాప్రస్థానం కవర్ పేజీ!!

ఆ పేజీని design చేసింది మా.గోఖలే అన్న సంగతి తెలియజేసినందుకు దన్యవాదాలు!!

వేణు చెప్పారు...

@ Avinash Vellampally: మహాప్రస్థానం కవర్ పేజీ పోస్టుపై మీ స్పందనకు థాంక్యూ.

రామ్ చెప్పారు...

"‘మహాప్రస్థానం’అనే అక్షరాలు ఏటవాలుగా వంగి ఒక కదలికను స్ఫురింపజేస్తుంటాయి. గుండ్రంగా, ఒద్దికగా ఒదిగివుండే సాంప్రదాయిక తెలుగు అక్షరాలు కావివి. కొత్త బాటలో తిరుగుబాటును తలపించేలా , పుస్తక స్వభావం వ్యక్తమయేలా ఉంటాయవి. "

.....ఇంత వరకూ తట్టలేదు మాస్టారూ. కవరు కవరను వారు కలరో లేరో అనిపించేలా ఉండే కవర్ పేజీల కన్నా ఎంత గొప్ప ఈ డిజైను.

వేణు చెప్పారు...

రామ్ గారూ, అంతే కదా! మా.గోఖలే ముఖచిత్రం లేకుండా ‘మహాప్రస్థానం’ ఊహించుకోండి! అసంపూర్తిగా అనిపించదూ? కవర్ పేజీ చిత్రించే ముందు ఆయన ఏం ఆలోచించారో, ఎన్ని వర్షన్లు గీశారో తెలిస్తే బాగుణ్ణు.

Meraj Fathima చెప్పారు...

sir, mahaa prastaanam naa daggara undi kaanee aa akshraalu lo unnaa yetavaaluki antha ardamundaa

వేణు చెప్పారు...

@ meraj fathima: అవునండీ. అక్షరాల తీరు ‘భావాన్ని’ కూడా సూచిస్తుంది. ఆర్టిస్టు మోహన్ అక్షరాలు చూడండి- అవి పోరాటం సూచించేలా కనపడతాయి. అయితే మనం చూసే దృష్టిని బట్టే ఏ అర్థమైనా ఉంటుందనుకోండీ :)

భాస్కర్ కె చెప్పారు...

చాలా చక్కగా రాశారండి,అభినందనలు.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ టపా నేను చూశాను గానీ కామెంట్ రాయలేదని ఇప్పుడే అర్థమైంది. బహుశా నిర్లక్ష్యమే కారణం అయి ఉండాలి.

మహా ప్రస్థానం కవర్ పేజీ నాకెంతో ఇష్టం. అలాగే ఈ మాయా బజార్ చిత్రం కూడా. మా గోఖలే పేరు వినడమే తప్ప ఆయన గురించి తెలీదు.

మంచి విషయాలు పంచుకున్నారు వేణూ, థాంక్యూ!

వేణు చెప్పారు...

the tree : థాంక్యూ.

సుజాతా! థాంక్యూ. ఈ టపా రాశాక- మా.గోఖలే గురించి మరికొన్ని విశేషాలు తెలిశాయి. ఆ విశేషాలు త్వరలో!:)

M b d syamala చెప్పారు...

వేణూ!కళాదర్శకుడి ప్రతిభకు నీ పోస్ట్ అద్దం పట్టింది!మాగోఖలే గారు రచయిత కూడా!అనే విషయం నీ పోస్ట్ వల్ల తెలిసింది!మహాప్రస్థానం అట్టపై ఓవైపుపీడిత జనత మరోవైపు పిడికిలిబిగించిన నవ యువత మధ్య ఆలోచనాలోచనాలతో కవికవితా వివశత కనిపించాయేకానీ ఒద్దికైన గుండ్రని తెలుగక్షరాలు ఎక్కుపెట్టబడ్డ కవితాస్త్రాలుగా తీర్చి దిద్దబడ్డాయని గమనించలేదు!నీ పరిశీలన అపూర్వం!మాయాబజార్ మళ్ళీ చూసినప్పుడు సెట్టింగ్స్ ఆహార్యాలు గమనించి మాగోఖలేని గుర్తు చేసుకోమన్న నీ మాట వారిపై నీ గౌరవాభిమానాలను తెలియజేసింది మంచి పోస్ట్ కు ధన్యవాదాలు