సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మే 2012, గురువారం

స్టీఫెన్ హాకింగ్ కాలజ్ఞానం... నిజమవుతుందా?

‘కాలం కథ’తో పాఠకులను విశ్వవిహారం చేయించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ .  ఆయన మరో రచన ‘కాల బిలాలూ పిల్ల విశ్వాలూ’ కూడా తెలుగు పాఠకులకు పరిచితమే.

 ఆధునిక కాలంలో్ ఐన్ స్టయిన్ స్థాయి శాస్త్రవేత్తగా పేరుపొందిన హాకింగ్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో విలువ ఉంటుంది. వాటిపై  భిన్న కోణాల్లో చర్చలు జరగటం చాలా సహజం.

ఈ టపా ఆ రకమైనదే!  

వచ్చే వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుంది కాబట్టి, మనుషులు ఇతర గ్రహాలకు వలస వెళ్ళక తప్పదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం.

ఈ భూమ్మీద బానిస వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలు  కొనసాగింది.  భూస్వామ్య వ్యవస్థ  వైభవం మాత్రం వందల సంవత్సరాలకే పరిమితమైంది. మరి ఇప్పటి  పెట్టుబడిదారీ వ్యవస్థ ? దీనికింకా వెయ్యేళ్ళ ఆయుర్దాయం వుంటుందా? అంతకాలం అది మనలేకపోతే ఈ వ్యవస్థ తాలూకు  చెడుగులు మాత్రం ఎందుకు నిలిచివుంటాయి?

హాకింగ్  వ్యాఖ్యలపై ఓ మార్క్సిస్టు రాసిన  స్పందన ఇది...


అసలు విషయం తెలియని హాకింగ్!

సైన్సుకి సంబంధించిన ఏ విషయాలయినా ప్రకృతి ధర్మాలకి లోబడే  పనిచేస్తూ వుంటాయి. ప్రకృతి సూత్రాలకి అతీతమైన సైన్సు సూత్రాలు ప్రకృతిలో- అంటే ఈ విశ్వంలో ఎక్కడా  వుండవు. గతకాలంలో ప్రారంభమైన మానవజాతి మనుగడ వర్తమానం గుండా భవిష్యత్కాలంలోకి కొనసాగుతుంది. తన మనుగడ కొనసాగింపు క్రమంలోనే మానవుడు కొత్త కొత్త సైన్సు సూత్రాల్ని ఆవిష్కరిస్తూ దాని ద్వారా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వున్నాడు.

కానీ మనిషికి ముఖ్యంగా ‘ఈస్తటిక్ ఎంజాయ్ మెంటు’, ‘ఎస్ట్రానమీ’లోనే వుంటుందనిపిస్తోంది. ‘కాళ్ళ కింద నరకం’ గురించి తెలుసుకోలేకపోయినా ‘నెత్తిమీద నరకం’ గురించి బాగానే అధ్యయనం చేస్తున్నాడు. భూగర్భంలోకి ప్రయాణం గట్టడం కన్నా అంతరిక్షంలోకి ప్రయాణం గట్టడమే సులువు కదా మరి!

గతకాలం నుంచీ ఇప్పటివరకూ కూడా జ్యోతిశ్శాస్త్ర  పండితులు యుగాంతాల గురించి హెచ్చరిస్తూనే వున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ... జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని మించిపోయిన పాండిత్యంతో మానవాళి భవిష్యత్తూ, భూమి భవిష్యత్తూ అంటూ శాస్త్రవేత్తలు రకరకాల కాలజ్ఞానాలు చెప్తూ వుండడం...

 
 ‘వందేళ్ళ తర్వాత మార్స్ మీదే కాలనీలు’ అనీ, ‘అంగారకుడే గతి’ అనీ (ఆంధ్రజ్యోతి దినపత్రిక 9-1-12)లో ప్రఖ్యాత అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్ తన 70వ పుట్టిన రోజు సందర్భంగా బీబీసీ రేడియో చేసిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు కావచ్చు, చేజేతులారా తెచ్చిపెట్టుకునే అణుయుద్ధం వల్లనైనా కావచ్చు. మరో వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుందని, కాబట్టి  మన పాలపుంతలోని ఇతర గ్రహాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుందని  హాకింగ్ అభిప్రాయం.

‘‘అంతరిక్షంలో కాలనీలు ఏర్పరచుకోవడం అత్యవసరం. ఎప్పటికైనా మనం అంగారకుడి పైనా, సౌరవ్యవస్థలోని ఇతర గ్రహాల పైనా కాలనీలు ఏర్పరుచుకుని స్వయం స్వావలంబన సాధిస్తామని నాకు గట్టి నమ్మకం. అయితే వచ్చే వందేళ్ళ లోపు ఇది జరిగే అవకాశం లేదు.’’ - ఇవీ హాకింగ్ అభిప్రాయాలు.

అయితే హాకింగ్ గానీ, హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఎవరైనా గానీ ఈ రకమైన అభిప్రాయాలు చెప్తే, ఈ రకమైన సూత్రీకరణలు చేస్తే  అవి తప్పు అభిప్రాయాలే; తప్పు సూత్రీకరణలే!

హిరోషిమా, నాగసాకిలపై వేసిన యురేనియం బాంబులు ఎంత విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. ఈనాడు  ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఆయుధాగారాల్లో  కొన్ని వందల టన్నుల యురేనియం బాంబులూ, హైడ్రొజన్ బాంబులూ పెట్టుక్కూచున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సయిల్స్ ... వార్ హెడ్స్ మోసుకుపోయి ఏ ఖండంలో అయితే ఆ ఖండంలో వేసెయ్యడమే. మనిషి గనక ఈ ఆయుధాల్ని వుపయోగిస్తే  మహా విధ్వంసం సంభవిస్తుంది. భూగోళం  తునాతునకలైపోతుంది. ఇంక ఈ ఆయుధాలు అన్నిటినీ గనక ప్రయోగిస్తే భూగోళం అనేకసార్లు ముక్కులు చెక్కలైపోతుంది.

హాకింగ్ జోస్యం చెప్పినట్టు మరో వెయ్యేళ్ళ వరకూ ఆగాల్సిన పనిలేదు. మరో ప్రపంచ యుద్ధం గనక మొదలైపోతే రేపే ప్రపంచానికి ఆఖరి ఘడియలు రావచ్చు. అణు విధ్వంసంతో భూగోళం అంతమైపోవచ్చు.

అయితే ఈ విషయాలు హాకింగ్ కి తెలియవా అంటే ఎందుకు తెలియవు? అంత మహా శాస్త్రవేత్త కి చక్కగానే తెలుస్తాయి. అవన్నీ తెలిసే హాకింగ్ ఈ రకమైన అంచనాలకి వచ్చారు. అవకాశాలంటే  వున్నాయి గానీ రేపంటే రేపే యుద్ధాలు ప్రారంభమైపోవు గదా!

ఇప్పుడున్న టెక్నాలజీని ఆధారం చేసుకుని దానివల్ల భౌగోళిక పరిస్థితుల్లోని మార్పులు గమనించుకుంటూ వెళితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ప్రమాదం రావచ్చు. లేకపోతే వెయ్యేళ్ళనాటికి మానవుడు తెలివైనవాడు కావచ్చు.

(మానవుడు ఇంకా తెలివైన వాడు కాదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. తెలివైన జాతులు తమని తామే పేల్చేసుకుంటాయని సైన్సులో ఓ లోకోక్తి ఉంది).

అందుకనే ఏ మార్స్  మీదో,  లేకపోతే వేరే నక్షత్ర కుటుంబంలోని గ్రహాల మీదో మానవులు వలసలు ఏర్పరచుకుంటే భూగోళానికి ఎలాంటి విధ్వంసం సంభవించినా మానవజాతి మనుగడ మరో లోకాల్లో కొనసాగుతుందని హాకింగ్ అభిప్రాయపడ్డారు.

హాకింగ్ మాటలు చదవకుండానే ఒక మిత్రుడు ఇలా అన్నాడు- ‘‘ఆఁ ! ఏముందీ. మనిషి భూమి మీద లేనప్పుడు భూమి చక్కగానే వుంది. మనిషి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతే భూమి చక్కగానే వుంటుంది. సమస్యల్లా మనిషి వల్లే! ’’

హాకింగ్ మాటలకీ, హాస్యంగా అన్న మిత్రుడి మాటలకీ పెద్దగా తేడా లేదనే చెప్పాలి.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం...

ఆ అసలు విషయం మానవ సమాజ పరిణామ క్రమం.. మోర్గన్ సమాజ పరిణామ క్రమాన్ని కొన్ని దశలుగా విభజించాడు.  ఆటవిక దశలో ప్రారంభమైన మానవ సమాజం అనాగరిక దశల గుండా ప్రయాణించి నాగరిక దశలోకి చేరుకుంది. మోర్గన్ నిర్దేశించిన సూత్రాలు మార్క్సిస్టు మౌలిక సూత్రాలకి అనుగుణంగానే వున్నాయి.

మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రకారం మానవ సమాజం నిమ్న దశల్లో ప్రారంభమై అంతకంతకూ అభివృద్ధి చెందుతూ వున్నత దశల వేపుగా ప్రయాణం చేస్తోంది. సమాజ పరిణామ  క్రమం ఈ రకంగా వుంది-

ఆటవిక సమాజం నుండి జీవితాన్ని ప్రారంభించిన మానవజాతి బానిస సమాజంలోకి,
దాన్నుండి భూస్వామ్య (ఫ్యూడల్)  సమాజంలోకి,
దాన్నుండి బూర్జువా ( పెట్టుబడిదారీ)  సమాజంలోకి ..  మార్పు చెందుతూ వస్తోంది.

ఒక సమాజం నుండి ఇంకో  సమాజంలోకి  మానవజాతి మార్పు చెందడానికి మహా విప్లవాలు జరిగినయ్. ఇప్పుడున్నది పెట్టుబడిదారీ సమాజం. ప్రపంచమంతా ఈ పెట్టుబడిదారీ ప్రభువుల గుప్పిట్లోనే వుంది. (ఇంతకంటే ఎక్కువ వివరించడానికి ఇక్కడ అవకాశం లేదు).

మానవజాతి అంతా రెండు మహా శిబిరాలుగా చీలిపోయి వుంది. ఆ రెండూ ఒకదానికొకటి శత్రు వర్గాలు. ప్రతీ సమాజంలోనూ దోపిడీ పీడనలకి గురైన వర్గం - దాని శత్రువర్గం మీద చేసే యుద్ధాల ద్వారా ఒక సమాజం నుంచి ఇంకో సమాజం ఆవిర్భవిస్తూ వచ్చింది. అలా మారడానికి వందల వేల సంవత్సరాల కాల పరిమితి బట్టింది. గత సమాజాల ఆయుర్దాయం కంటే ఈ పెట్టుబడిదారీ సమాజ ఆయుర్దాయం చాలా తక్కువ.

‘‘పెట్టుబడిదారీ వర్గ పతనమూ అనివార్యమే. కార్మిక వర్గ విజయమూ అనివార్యమే’’ అని కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో మార్క్స్ , ఎంగెల్సులు చెప్పారు. పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సో్షలిస్టు సమాజం,  దాని తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజం కూడా మానవాళికి తెలుసు.

ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజం పతనావస్థలో వుంది. తన గూట్లో తనే చిక్కుకున్న సాలీడులా మరణ సదృశమైన సంక్షోభాల్లో తనే చిక్కుకుపోతోంది.... పెట్టుబడిదారీ సమాజ స్థానాన్ని అనివార్యంగా సోషలిస్టు సమాజం ఆక్రమిస్తుంది.

గత సమాజాల పరిణామ క్రమాన్ని అంచనా వేస్తే రాబోయే వెయ్యేళ్ళ కాల పరిమితి అవసరం లేదనే తోస్తోంది. తక్కువ కాల వ్యవధిలోనే కమ్యూనిస్టు సమాజం ఆవిర్భవిస్తుందని ఊహించడం సంభవంగా తోస్తోంది.

కమ్యూనిస్టు సమాజం వుపయోగపు విలువ అనే కోణంలోనే వుత్పత్తులన్నిటినీ వుత్పత్తి చేస్తుంది. పనికిరాని చెత్తంతా అది ఈడ్చిపారేస్తుంది. ఆటంబాంబులేంటి, హైడ్రొజన్ బాంబులేంటి-   అలాంటి వాటినన్నటినీ పనికిరాకుండా నాశనం చేసేసి డస్ట్ బిన్ లో పడేస్తారు!

టెక్నాలజీ సమాజాన్ని ఇన్ ఫ్లుయెన్స్ చెయ్యదు. సమాజమే టెక్నాలజీని ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. అమల్లో వున్న సమాజ ప్రభావాన్ని బట్టే టెక్నాలజీ దాని పని అది చేస్తుంది.

గత కాలపు ప్రభువులంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఏరీ వాళ్ళిప్పుడు? ఈ పెట్టుబడిదారీ ప్రభువులేనా శాశ్వతం! పెట్టుబడిదారీ సమాజ చర్యల ఫలితంగానే భూగోళాన్ని సకల రుగ్మతలూ పట్టుకున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ లేంటి, ఏ వార్మింగులైనా రావచ్చు.

అల్పాయుష్కురాలైన ఈ పెట్టుబడిదారీ సమాజం రాబోయే వెయ్యేళ్ళ కాలం మనగలుగుతుందా అని ఇక్కడి  ప్రశ్న. అలా మనగలిగితేనే హాకింగ్ జోస్యం ఫలిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల గానీ, అణు విధ్వంసంవల్లగానీ భూగోళం నాశనమవుతుంది. మానవాళికి మరణం సంభవిస్తుంది!

అయితే మార్క్సిస్టు మహోపాధ్యాయుల్లో ఒకరైన ఎంగెల్సు ఏమన్నాడో ఇక్కడొకసారి చూద్దాం...  ‘‘మానవ కార్యకలాపాల పరిణామం మొత్తంగా భూమండలం లుప్తమైపోయినప్పుడు తప్ప లుప్తం కాదు’’. పై మాటలు ఏం చెప్తున్నాయి? పెట్టుబడిదారీ సమాజం శాశ్వతం కాదని చెప్పడమే, దాని చర్య ఫలితంగా జరిగే సకల విధ్వంసాలూ శాశ్వతం కాదని చెప్పడమే!

పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సోషలిస్టు సమాజం, ఆ తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజాల్లో మానవాళి సకల రుగ్మతలూ పోగొట్టుకుని సుఖశాంతులతో జీవిస్తుంది!

అందుచేత మన భూగ్రహానికొచ్చిన ఢోకా ఏమీ లేదు. వేరే గ్రహాలకి పలాయనం చిత్తగించాల్సిన పని అంతకన్నా లేదు.

గ్రహాల లెక్కలూ రాశుల లెక్కలూ వేసే జ్యోతిశ్శాస్త్ర పండితులు సైన్సు సూత్రాల కచ్చితత్వాన్ని ఏ రకంగా అయితే అర్థం చేసుకోకుండా వదిలేస్తారో, భూమి భవిష్యత్తూ మానవజాతి భవిష్యత్తూ అంటూ జ్యోతిషుల్ని తలదన్నే పాండిత్యంతో మాటలాడుతున్న శాస్త్రవేత్తలు కూడా సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూవున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే- విశ్వాంతరాళంలోకి తొంగిచూసిన హాకింగ్ మేధస్సుకి... ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ మేధస్సుకి ... అసలు విషయం తెలియకుండా పోయింది!

- కోటిలింక  త్రిమూర్తులు  (తుని)
 
 

18 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వెయ్యేళ్ళ దాకా ప్రస్తుత విధానం కంటిన్యూ అవుతుందా అన్న మార్క్సిస్తుల నిస్పృహతో కూడిన విశ్లేషణ తమాషాగా వుంది. 1000 ఏళ్ళదాకా తాము విస్తరించే అవకాశమేలేదని ఎందుకంత అంత ధీమాతో వున్నారో ఆలోచించాల్సిన విషయం. :)

వేణు చెప్పారు...

SNKR, మీకు అలా అర్థమైందన్నమాట! :)

అజ్ఞాత చెప్పారు...

మరంతే కదండి. :)

/ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ మేధస్సుకి ... అసలు విషయం తెలియకుండా పోయింది! /
నిజమే! మార్కిస్టు దృక్పథం లేని సైంటిస్టూ ఓ సైంటిస్టేనా? మార్కిస్టు నవలా రచయిత్రులెవరైనా హైకింగ్ విషకాలజ్ఞానం అనే నవల రాస్తారేమో చూద్దాం. :) :P

Gopal చెప్పారు...

మరి ఆల్రెడీ రష్యా, చైనా మొదలయిన దేశాల్లో మొదలయిన మార్క్సిజమ్ ఎందుకు ౬౦ ఏళ్ళకే కుప్పకూలిపోయింది. చైనా కమ్యూనిష్టే కదా మరి వాళ్లు అణ్వాయిధాలు ఎందుకు ఉంచుకున్నారు? చైనాలో మరి చెత్తని ఎందుకు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు (చైనా నాసిరకం వస్తువులు తయారు చేసి ప్రపంచం అంతా ఎగుమతి చేస్తోంది కదా).

కమ్యూనిజం వచ్చిన దేశాల్లో తమ సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేశారు. సంస్కృతిని పట్టుకు వేళ్ళాడుతున్నారని పెద్దలను ఊచకోత కోశారు. చైనాలో సంస్కృతిక విప్లవం పేరిట ఎంతమందిని చంపేశారో తెలుసా? వియత్నాంలో కమ్యూనిష్టులు వచ్చి ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారిని, మేథావులను పొలాల్లో పనిచేయించి తిండిపెట్టకుండా చంపేశారు. ఆసంగతి ఎంతమందికి తెలుసు?

అజ్ఞాత చెప్పారు...

జ్యోతిష్యం అప్రోచ్ పూర్తిగా వేఱు. అది case-to-case and tentative approach. మార్క్సిజం లాగా యావన్మావజాతికీ లేదా యావత్ కాలచక్రానికీ సంబంధించిన సూత్రీకరణల్ని అది చేయదు. మార్క్సిజమ్ లాంటి భావజాలాల కున్నట్లుగా జ్యోతిష్యానికి వర్గీయ పక్షపాతాలు గానీ అజెండాలు గానీ లేవు. అది ప్రకృతిసూత్రాల పరిధిలోనే జోస్యాలు చెబుతుంది. అసాధారణ జోస్యాలేవీ అందులో ఉండవు. అయితే ప్రకృతిసూత్రాలే అంతిమ/ పరమ హేతువులని జ్యోతిశ్శాస్త్రం విశ్వసించదు. అవి వాటి పైన/ వాటికి అతీతంగా ఉన్నాయని అది చెబుతుంది.

Praveen Mandangi చెప్పారు...

జ్యోతిష్యం గురించి నేను ఈ లింక్‌లో వ్రాసాను: http://hegelian.mlmedia.net.in/2012/05/blog-post_27.html

అజ్ఞాత చెప్పారు...

వామపక్ష భావజాలం మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇది సరైన తీరు కాదనుకుంటా..

వేణు చెప్పారు...

puranapandaphani! >> వామపక్ష భావజాలం మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇది సరైన తీరు కాదనుకుంటా..>> మీ వ్యాఖ్యలోని భావం అర్థం కాలేదండీ. ‘ఇది’ అంటే ఏదని మీ అభిప్రాయం?

రామమొహన్ చెప్పారు...

రష్యా, చైనా కమ్మునిజాన్ని వదిలి చాలా యెళ్ళు అయిందని అవి ఇప్పుడు అసలు సిసలైన పెట్టుబడిదారీ దేశాలని ఈ బ్లాగులలొనే చాలామంది చెప్పినారు అయినా వాటిని మళ్ళి కమ్యునిస్టు దేశాలని అదే పాట మొదలుపెట్టినారు. సాంసౄక్ తిక విప్లవంలొ చంపివేశారా? యవరిని యవరు చంపివేశారు. ఆ వివరాలు ఇవ్వండి

జ్యొతిష్యం , మతం లాంటివి సమాజంలొ అసమానతలు వున్నంత కాలం వుంటాయి. మీలాంటి వాళ్ళు దాన్ని ఒక వ్యాపారంలాగ మలసుకొని జీవించవచ్చు. ఉంగరాల గురించి తాయత్తులగురించి టి. వి. లలలొ రొండు యెళ్ళపాటు వ్యాపార ప్రకటనలు ఇచ్చి కొట్లలలొ దొచుకున్నారు.
సైన్స్ తెలిసిన వాళ్ళకు దాని నీయమాలు మాత్రమే తెలుస్తాయి సామాజిక నీయమాలు తెలియాలని నియమం ఏమీ లేదు. సామాజిక నియమాలు కుడా ఒక సైన్సే కాని పెట్టుబడిదారీ ప్రభుత్వం తన భావజాలం ద్వారా అనగతొక్కుతొంది దాని విద్యద్వారానూ, కలళ ద్వారానూ సమాజంలొని అప్పటికేవున్న అసమానతలు వాటికి భలం చేకూరుస్తాయి. సమాజం రొండు వర్గాలుగా వున్నప్పుడు దేని ప్రయొజనాలు దానివి.

అజ్ఞాత చెప్పారు...

మీకు అర్ధం కాలేదనే అనుకోమంటారా.... :) హాకింగ్ వైజ్ఞానికంగా అంచనా వేసిన విషయాన్ని కమ్యూనిస్టు దృక్పథంతో వర్గీకరించడం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకో ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో పోగానే వచ్చే సోషలిస్టు వ్యవస్థ వల్ల గ్లోబల్ వార్మింగ్, అణ్వాయుధాల ముప్పూ తొలగిపోయి భూగోళం ఓ ఉటోపియా కాగలదని చెప్పడమూనూ...!

వేణు చెప్పారు...

వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు. ఇతరత్రా బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నాను.

@ SNKR! మార్క్సిస్టు దృక్పథం లేని సైంటిస్టులు సైంటిస్టులు కాకుండా పోరు కానీ, అలాంటి వాళ్ళ అంచనాలు ఇలాగే.. హాకింగ్ తరహాలోనే ఉండకతప్పదు !

ఇక ‘హాకింగ్ విషకాలజ్ఞానం’అంటూ మీర్రాసిన స్మైలీ వ్యాఖ్య గురించి మరో స్మైలీ సంధించటం తప్ప స్పందించేదేముంటుంది!:)

@ D.Venu Gopal! మార్క్సిజం ఆచరణలో లోపాలను ఆ సిద్ధాంతానికి వర్తింపజేయకూడదు. 1792లో ‘పారిస్ కమ్యూన్’ విఫలయ్యాక కూడా తర్వాతి కాలంలో రష్యా, చైనాల్లో కమ్యూనిజం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఆ దేశాల్లో పెట్టుబడిదారీ పంథా పైచేయి సాధించాక, వాటి అవలక్షణాలే కదా కొనసాగుతాయి?


@ LBS తాడేపల్లి: మీరు చెప్పిన విధంగా చూసినా మార్క్సిజానికీ జ్యోతిషానికీ చుక్కెదురు. మార్క్సిజం చెప్పే సామాజిక నియమాలు పట్టించుకోకుండా శాస్త్రవేత్తలు చేసే అంచనాలు జ్యోతిషానికి దగ్గరగా ఉంటాయేమో:)

@ puranapandaphani: మా దృష్టిలో ఇది సరైన ‘తీరే’:)

హాకింగ్ ‘వైజ్ఞానికంగా’చేసిన అంచనాలోనే లోపముంది! ఇదే వ్యవస్థ వెయ్యేళ్ళపాటు నిలిచివుంటుందనీ, ఇవే చెడుగులు అప్పటిదాకా ఉంటాయనీ ఆయన భావిస్తున్నారు కాబట్టే ఆ అంచనా వేయగలిగారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మీరన్నట్టు- ‘ఇంకో ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో’ అంతరించిపోదు గానీ, అది కుప్పకూలిపోయినపుడు- గ్లోబల్ వార్మింగ్, అణ్వాయుధాల ముప్పు తొలగిపోతాయనే ‘వామపక్ష భావజాలం’అభిమానించేవారి ఉద్దేశం.

నిరాశావాదంలో లోపముంది కానీ,‘ఉటోపియా’ కోసం కలలు కనటంలో తప్పేమీ లేదు!

@ ప్రవీణ్, రామమోహన్ : థాంక్యూ!

అజ్ఞాత చెప్పారు...

/అలాంటి వాళ్ళ అంచనాలు ఇలాగే.. హాకింగ్ తరహాలోనే ఉండకతప్పదు ! /

తప్పదా?!

మార్క్స్‌కు ముందు పుట్టిన సైంటిస్టుల ఆలోచనలు, హేకింగ్ తరహాలోనే వుండటం తప్పనిసరి అని తేల్చి పారేసిన మీ సిద్ధాంతానికి నా లాల్‌సలాం అంటాను. నిజమే మార్క్స్‌కు ముందు ప్రజలెంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుండేవారో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది! హీ హీ హీ

వేణు చెప్పారు...

SNKR, తన రంగంలో నిష్ణాతుడైన ఓ శాస్త్రవేత్త సామాజిక రంగ భవిత గురించి అంచనా వేసిన సందర్భంలో చర్చ ఇది.

ఆ పరిధిలో చూడాల్సిన నా వ్యాఖ్యను స్థల కాలాలకు సంబంధం లేకుండా యాంత్రికంగా వర్తింపజేసి- నవ్వుకుంటానంటే.. సరే, అలాగే కానివ్వండి!

భాస్కర్ కె చెప్పారు...

mothammeda comunistlu aanandinche vishayam chepparu,
haaking kanna mere melantara?
saradake lendi, bhagundi mee vysam.

వేణు చెప్పారు...

@ the tree, ఒకరి కంటే ఒకరు మేలా కాదా అనేది చెప్పటం కాదు, ఈ వ్యాస రచయిత (త్రిమూర్తులు) ఉద్దేశం. హాకింగ్ చెప్పిన ఒకానొక అంశాన్ని విమర్శించినంత మాత్రానే ఆ శాస్త్రవేత్త కంటే కమ్యూనిస్టులు మేలని తేల్చేసినట్టు అవ్వదు కదా?

అయినా, ఇంత చిన్న విషయం మీకు మాత్రం తెలియదంటారా?:)

Unknown చెప్పారు...

మహానుభావులు.. స్టీఫెన్ హాకింగే పెద్ద కామెడీ అనుకుంటే, అంతకన్నా పెద్ద కామెడీ మీరు చెప్పిన డొంక తిరుగుడు సిద్ధాంతం. దారుణమైన విషయం ఏమిటంటే ఇంకా కమ్యూనిజం రావడం ఏమిటి? విస్తరించడం ఏమిటి? దారుణం కాకుంటే? క్రీస్ట్ తర్వాత పేదవాడికి ఆకలిదప్పులుండవని చెప్పింది కమ్యూనిజమే. అదొచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా పేదరికం పొయిందీ లేదు కదా.. మరింత పెద్దదైంది. ఇక క్రిస్ట్ కమ్యూనిజం తర్వాత వచ్చింది కంప్యూటరిజం. ఇది కూడా సమస్త మానవాళి కష్టాలు పోగొట్టడానికి వస్తానంది. పుస్తకాల స్థానే సిస్టమ్స్ వచ్చి జాగా కలిసొచ్చిందేగానీ కడుపుమంట, ఆకలి కేకలు అలానే వున్నాయి. ఇవన్నీ సీతో స్టార్ట్ అయ్యే అంశాలు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. హాకింగ్ మహాశయుడు కాలం కథ రాసి, మృత్యువును జయించి గొప్పవాడిగా నిలిచాడని చెప్పి ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ నిజమనడానికి లేదు. అలాగని చెప్పి ఇలాంటి వాళ్ళు వుండరాదన్న మాట కూడా లేదు. ఆయన్ను ఆయన్లా ఆలోచింపనివ్వాలి. అంతే కానీ దానికీ కమ్యూనిజానికి ముడి పెట్టి చెప్పడం వింత వుంది.

Unknown చెప్పారు...

త్రిమూర్తులు గారూ! మీ విశ్లేషణ సూపరండీ బాబా.. అసలు ఎక్కడ అంతరిక్షం..? ఎక్కడ కమ్యూనిజం..? దీనమ్మా జీవితం.. మోకాలికీ బోడిగుండుకూ సూపర్ లింకు. అయినాగానీండీ కమ్యూనిజం ఇంకా రావడమేంటండీ బాబా. ఇప్పటికది పుట్టి ఎన్నో ఏళ్లయ్యాయి. క్రీస్ట్ తర్వాత పేదలనుద్దరిద్దామని పుట్టిన ఈ భావజాలం ఎన్నో చోట్ల తడాఖా చూపి.. ఇక చాల్లే అనిపించేసుకుంది కూడా. తిరిగి గత్యంతరం లేని పరిస్థితి ఒకటొస్తుందనీ, దాని ద్వారా మళ్లీ కమ్యూనిజం పొంగి పొర్లుతుందని మీరు రాయడం.. ‘‘హశ్యర్యంగా’’ వుంది. కమ్యూనిజం తర్వాత దీనజనోద్ధరణ చేద్దారని చెప్పి కంప్యూటరిజం కూడా వచ్చేసింది. కంప్యూటరొచ్చి బిల్డింగులూ గట్రాల్లో స్పేస్ మిగిల్చిందేమోగానీ పేదవాడిక కడుపులోని స్పేస్ ఫిలప్ చేయడంలో ఇంకా ఒక నిర్ధుష్టమైన ఐడియా ఇచ్చిందే లేదు. మూడు సీల్లో ‘‘రెండో సీ’’ అయిన కమ్యూనిజం ఇంకా వస్తుందని మీరు రాసిన పొంతన లేని సిద్ధాంతం చూస్తుంటే కమ్యూనిజంలో ఆశావాదానిది ఎంత ప్రధాన పాత్ర ? అన్న అభిప్రాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది చూస్తుంటే. హాకింగ్ తన సిద్ధాంతాలకన్నా మించిన ధీరుడు. ఆయన మృత్యువును జయించడంతో హీరో అయిన మాట కొట్టి పారేయలేం. ఆయన ఆలోచనలు క్రేజీగా వుంటాయి. వాటినీ కాదనలేం. అలాంటి మాటలు, ఆలోచనలూ లేకుండా వుండాలని కూడా చెప్పలేం. అలాంటి స్టేట్ మెంట్లిచ్చే వారిని అలానే వుండనివ్వాలి తప్పితే.. ఇలా సంబంధం లేని కమ్యూనిజానికి లింకేసుకుని ఇష్టమొచ్చినట్టు రాసుకోడం అబ్బో అనెస్పెక్టెడ్ అండీ బాబా. ఎంతైనా మీ ‘‘తుత్తికి’’ నా జోహార్లు.కమ్యూనిజం మీద మీకున్న నమ్మకాన్ని చూస్తుంటే.. ముముముచ్చటేస్తోందండీ బాబా.

వేణు చెప్పారు...

Adi narayana గారూ! ఈ వ్యాసం చెప్పే సారాంశంతో మీరు విభేదిస్తున్నారని మీ వ్యాఖ్యల ద్వారా అర్థమైంది. కానీ వ్యంగ్యాలకు దిగటం వల్ల మీరు చెప్పే విషయం మసకబారి అస్పష్టమైపోయింది!

కమ్యూనిజం ఇప్పటికే ఎప్పుడో వచ్చేసిందని మీరు భావిస్తున్నారన్నమాట. ‘ అదొచ్చి (కమ్యూనిజం) ఇన్నేళ్లు గడుస్తున్నా...’- ఎప్పుడొచ్చింది? ఎక్కడ ఏ దేశంలో వచ్చింది? చైనా, రష్యాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అమలు చేసింది కమ్యూనిజం అని మీరనుకుంటున్నారల్లే ఉంది. అందుకే ‘ఇక చాల్లే అనిపించేసుకుంది కూడా’ అనగలిగారు.

సామాజిక మార్పులు కొద్ది పదుల, వందల సంవత్సరాల్లో జరిగేవి కాదు. వాటిని గమనించటానికి కొన్ని తరాల జీవితకాలాలు పడతాయి. కమ్యూనిస్టులకైతే ‘ఇన్నేళ్ళు గడుస్తున్నా..’ అనే నిరాశావాదానికి తావుండదు. వారిది వాస్తవికత పునాదిపై ఆధారపడిన ఆశావాదం! దాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చట వేయాల్సిందే:)