సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, నవంబర్ 2012, బుధవారం

‘వనితాజ్యోతి’ని వెలిగించిన బాపు బొమ్మ ... ఆ తొలి సంచిక ఆచూకీ తెలుసా?


చూశారా ఈ ముఖచిత్రం ? 

ఒక వారపత్రికకూ, ఒక మాసపత్రికకూ  ముఖచిత్రంగా అమరిన బొమ్మ ఇది. 

అంతే కాదు;

ఇద్దరు ప్రముఖ రచయితల  అక్షరాలకు  ప్రేరణ కలిగించిన బొమ్మ కూడా  ఇదే!

దీని వయసు  53 సంవత్సరాలు.

కానీ  బొమ్మల్లోని  మనుషులకు  వయసు పెరగదు కదా?

అందుకే ఈ చిత్ర కథానాయిక ఇప్పటికీ... ఎప్పటికీ  నవ వధువే. 

తొలి ప్రేమలేఖ  చదువుకుంటున్న  ఆమె ముఖంలో విచ్చుకుంటున్న  మందహాసం నిత్య నూతనమే!

ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో ‘ముఖపత్ర చిత్రం’ గురించి నండూరి రామ్మోహనరావు గారు ఎలా  రాశారో కొంచెం (మాత్రమే)  రుచి చూద్దాం!

------------------------- 
‘‘మెయిలు తొమ్మిదింటికి వస్తుందిట మన వూరికి. టపా బంట్రోతు లవ్ లెటర్సూ అవీ పట్టుకు బయల్దేరేసరికి- ’’

‘‘ఛప్ ఏమిటీ ఆ పోకిరీ మాటలూ నువ్వూను, నాన్నతో చెబుతా’’ అంది భానుమతి.

‘‘మిగతాది కూడా వినేసి అంతా ఒకసారే చెప్పెయ్యి- ఏం. వాడు బయల్దేరేసరికి పదిన్నరట. తరవాత దారిలో ఓ కప్పు కాఫీ తాగి రోడ్డెక్కేసరికి పదిమ్ముప్పావు. అంచేత బావ నిన్ను కాలేజీకి సెలవు పెట్టి- అబ్బ- నోరు నొక్కెస్తావేం- సెలవుపెట్టి గుమ్మంలో కూచోమన్నాడు- ఈ సావిట్లో నేట- వరండాలో అయితే నీ మీద ఎండపడి అతని బుగ్గలు కందిపోతాయట- అమ్మో! అమ్మా! ఇటు చూడు ఇది నన్ను రక్కి-
పుటింరోజు కానుక పంపిస్తున్నాట్ట. నువ్వు తప్పుకుండా టపా వేళకి ఇంటి దగ్గర ఉండాలని చెప్పమన్నాడు నాకేం’’ అంది ఇందిర.

పావుగంట తరవాత ఇల్లంతా రాజకీయవాదుల లోపాయకారి మీటింగులా గంద్రగోళం అయిపోయింది. అందరూ తలో రకంగా ఊహాగానసభలు చేసేస్తున్నారు- కానుక ఏమైవుంటుందీ అని.

‘‘కొంపదీసి తనే రైలు దిగి రాడు గదా-’’ అన్నాడు గృహ యజమాని ఇల్లాలి కేసి ఓరకంగా ఓరకంట చూసి.

భానుమతి, సందడి ఇవతలకు జరిగి మెల్లిగా అవతలకు జారుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుని పసిపిల్లలా ఏడ్చేసింది. ఇంట్లో జనం సభ చాలించారు.
 .
* ** **

ఇదీ ఆరంభం.  ఇక  అర్జెంటుగా క్లయిమాక్స్ కి వెళ్ళి చివర్లో ఏం జరిగిందో  ఆ దృశ్యం కూడా  చూసేద్దాం!  నండూరి రామ్మోహనరావు  గారి అక్షరాల్లోనే ...

* ** **

పోస్టుమన్ నోరెత్తి పిలవబోయేలోగానే ‘‘నేనే’’ అంటూ అతని చేతులో ఉన్నది లాక్కుని పరుగెత్తింది భానుమతి.

తలుపు వేసి, స్థిమితపడి ఆయాసం తీర్చుకుని నెమ్మదిగా శాస్త్రోక్తంగా కవరు చింపుతూ ఉండగా తల్లిమాట వినబడింది సావిట్లోంచి ‘‘నయమే ఇంకా, చిన్నది కాలేజీకి పోబట్టి బతికాం’’ అని.

కవరు చింపి ఉత్తరం తీసి మడతవిప్పిన తరవాత భానుమతి ఒళ్ళు ఝల్లుమంది. పుట్టినరోజు కానుకకి బంగీలేవీ రాలేదనీ, వచ్చినది ఉత్తరమనీ అప్పుడే గ్రహించింది సూక్ష్మబుద్ధి కాబట్టి.

అది ఆమెకు లేకలేక వచ్చిన మొదటి లేఖ. అంతకుమునుపు మాటాడ్డమే గాని ఆయన ఉత్తరాలు ఎన్నడూ రాయలేదు- పెళ్ళయి ఏడాది కావచ్చినా.

చదవబోయేముందు చుట్టూ ఓసారి చూసుకొని, నెమ్మదిగా భయంగా చూపులు మొదటివాక్యం మీద నిలిపింది... ఆమె చూపులు రెండో వాక్యం మీదికి సాగి మూడో పంక్తిలోకి జారిన తరువాత ఆమె చెంపలలో వెలగబోయే కెంపుల కాంతి రంగులలో ఇమడకపోవచ్చు; వాక్యాలలో అమరకపోవచ్చు. మనం ఒప్పుకున్నా మానినా భానుమతి భర్త నమ్మకం అదే.

అందుకే చిత్రకారుడు ‘బాపు’ ఓ క్షణం ముందరే, తొలి వాక్యం చూడగానే తొలి మందహాసం వెలిగే క్షణాన్నే బొమ్మ వేయడానికి శుభముహూర్తంగా నిర్ణయించుకున్నాడు.

----------------------------------------

ఎంత బాగా ఉందో కదా ఈ  వ్యాఖ్యానం!


ఇది చదివాక  బాపు బొమ్మను మరోసారి చూడండి! 


‘చెంపలలో వెలగబోయే కెంపుల కాంతి’ని చిత్రించకుండా బాపు తొలి మందహాసం వెలిగే క్షణాన్ని ఎంచుకుంటే; 

ఆ  లేఖలో ఏముందో  చెప్పకుండా ‘వాక్యాలలో అమరకపోవచ్చు’ అంటూ రామ్మోహనరావు గారు  కూడా తెలివిగా  తప్పించుకున్నారు.

మరో  పదిహేడేళ్ళు గడిచాయి.

ఇదే బొమ్మ ‘వనితాజ్యోతి’ ప్రథమ సంచికను ముఖచిత్రంగా మరోసారి అలంకరించింది.  ఈసారి  శ్రీరమణ గారు ఈ ముఖపత్ర చిత్రం గురించి  రాశారు.

ఏమని?  

1976 లో వచ్చిన ఆ సంచిక దొరికితే కదా చెప్పటానికి !

శ్రీరమణ గారి దగ్గర కూడా ఆ వ్యాసం లేదిప్పుడు!  చాలా చోట్ల ప్రయత్నించినా ఇంకా  దొరకలేదు.


ఆ సంచిక ఆచూకీ మీకు  తెలిస్తే తప్పకుండా  తెలియజేయండి.


త్వరలో ‘రచన’ శాయి గారు  బాపు బొమ్మలు వేసిన వివిధ రచయితల కథలను (1957-1968) ఓ బృహత్ సంకలనంగా తీసుకురాబోతున్నారు. 100కు పైగా  ఆహ్లాదకరమైన  కథలుంటాయి దీనిలో.

ఈ పుస్తకంలో  శ్రీరమణ  వ్యాసం కూడా  చేర్చాలని  శాయి గారి  ఆకాంక్ష. 

‘వనితాజ్యోతి’  మొదటి  సంచిక మీ దగ్గర గానీ, మీ సాహితీ మిత్రులెవరి దగ్గరైనా గానీ ఉంటే  దానిలోని   శ్రీ రమణ వ్యాసం జిరాక్స్ తీసి, పంపినా చాలు.

శాయి గారి మెయిల్ ఐడీ: rachanapatrika@gmail.com.
ఫోన్ నంబరు: 99485 77517మరో విశేషం ఏమిటంటే...  ఇదే థీమ్ తో వనితాజ్యోతికే  జూన్ 1978 లో బాపు  ముఖచిత్రం  వేశారు.


  1. (ఈ బొమ్మను సేకరించిన V3 రమణ గారి సౌజన్యంతో).  
 

12 వ్యాఖ్యలు:

Chowdary చెప్పారు...

ఆ మొదటి బొమ్మలో ఉన్నది బాపుగారి సతీమణి, భాగ్యలక్ష్మి గారు. ఆ బొమ్మ వెనుక కథని ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి మొదటిభాగంలో చదువవచ్చు.

ఈ బొమ్మని మొదటిసారి ఆంధ్రజ్యోతి వారి రజతోత్సవ ప్రత్యేక ప్రచురణ మా తెలుగుతల్లికి మల్లెపూదండలో చూశాను. తర్వాత నండూరివారితో మాటల్లో కొన్ని విషయాలు తెలిశాయి. బొమ్మ చాలాకాలం నండూరివారిదగ్గరే ఉండేదని, తర్వాత ఏమయ్యిందో తెలీలేదని చెప్పారు.

ఈ బొమ్మను రంగుల్లో 1995 తానా సమావేశాల ప్రత్యేక సంచికలో పునర్ముద్రించాము. తర్వాత చాలాచోట్ల ప్రచురించబడింది.

రెండవ బొమ్మను ఒకసారి తెలుగునాడి ముఖచిత్రంగా ప్రచురించాము. -- జంపాల చౌదరి

వేణు చెప్పారు...

@ సుజాత : మీ స్పందనకు మెనీ మెనీ థాంక్స్..! ఫేస్ బుక్ లో షేర్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞత.

వేణు చెప్పారు...

@ చౌదరి: థాంక్యూ. ఈ ముఖచిత్రానికి నమూనా బాపు గారు అర్థాంగేనని అస్ఫష్టంగా తెలుసు. (శాయి గారు జనాంతికంగా చెప్పారు.:) కానీ మీ వ్యాఖ్య చూస్తేనే రూఢిగా తెలిసింది! ఈ చిత్ర ప్రచురణ వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.

రవి చెప్పారు...

చివరి బొమ్మ పొద్దు కవిసమ్మేళనంలో వర్ణనకు ఉపయోగించుకోబడినది.

http://podduparty.com/poddu.net/2011/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b0%e0%b0%a6%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b0%ae%e0%b1%81-1/4/

వేణు చెప్పారు...

రవి గారూ! మీరిచ్చిన లింకు ద్వారా నాటి కవి సమ్మేళనం విశేషాలు చదివాను. పద్యాలు బాగున్నాయి.

ఈ బాపు బొమ్మ వచనానికే కాకుండా, కవనానికి కూడా స్ఫూర్తినిచ్చిందన్నమాట!

ఆ.సౌమ్య చెప్పారు...

భలే ఉంది నండూరిగారి కథనం. కానీ మీరిచ్చిన ఆ పేజీ లో అక్షరాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. మొత్తం చదవడం కుదరట్లేదు. నాకు ఆ పేజి మైల్ చెయ్యగలరా?? ప్లీజ్!
కోతికొమ్మచ్చిలో ఈ బొమ్మ గురించి రమణ గారు రాసారు. బాపుగారికి పెళ్ళి కుదిరాక ఒక ఉత్తరం రాసారుట ఆమెకి. ఆ తరువాతి రోజు ఆమెని కలుద్దామని వాళ్ళింటికి వెళితే తలుపు జారవేసి ఉంది. లోపల ఆ ముద్దరాలు ఇలా కూర్చుని ఉత్తరం చదువుకుంటున్న దృశ్యం కనిపించిందిట. అంతే ఆమెను disturb చెయ్యకుండా స్నేహితులిద్దరూ వెనక్కి వచ్చేసారు. వెనువెంటనే బాపు కుంచె కదిలింది అంతే వయ్యారంగా.

ధాత్రి చెప్పారు...

స్వయానా ఆయన భర్యామణి తను రాసిన ఉత్తరం చదువుకుంటుండగ చుసినా బాపూ గారు మిక్కిలి పరవశించి గీసుకున్న బొమ్మ..ఎంత బాగుంటుందో..:)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ముఖ చిత్రం వెనక ఇంత కధ ఉందా?
ధన్యవాదాలు. మాతో పంచుకున్నందుకు.

వేణు చెప్పారు...

@ ఆ.సౌమ్య: నండూరి గారి వ్యాసం ఇప్పుడు సైజు పెంచాను. చూడండి! ‘కోతి కొమ్మచ్చి’లోని ప్రస్తావనను సందర్భోచితంగా కోట్ చేశారు. థాంక్యూ.

@ ధాత్రి : బాపు గారి వ్యక్తిగత కోణం నుంచి వెలువడింది కాబట్టే బొమ్మలో అంతటి మెరుపు కనిపిస్తోందనుకుంటాను.

@ బులుసు సుబ్రహ్మణ్యం: థాంక్యూ సర్, మీ స్పందనకు.

రామ్ చెప్పారు...

వేణు గారూ !!

కధ కి బాపు బొమ్మ - బాపు బొమ్మ కి కధ - ఇవి తెలిసిన ప్రక్రియలే !!

మీరు చెప్పిన - బాపు బొమ్మ వెనక కధ - ఇది కొత్త ప్రక్రియ !!

తొలి సంచిక ఆచూకీ తో పాటు - ఈ హడావిడి యుగం లో - ఉత్తరాలూ ముద్దరాలూ వీటి ఆచూకీ కూడా పట్టుకొమ్మని అడిగితే పోలా

వేణు చెప్పారు...

రామ్ గారూ, >> ఉత్తరాలూ ముద్దరాలూ వీటి ఆచూకీ కూడా పట్టుకొమ్మని అడిగితే పోలా >> భలే వ్యాఖ్యానించారుగా!:)

Chowdary చెప్పారు...

నా నవంబరు 2012లో బాపుగారి భార్య పఏరు తప్పుగా వ్రాశాను. ఆమె పేరు భాగ్యవతి.

ఈమధ్యే తెలిసిన ఇంకో విషయం. వనితాజ్యోతి ముఖచిత్రానికి మోడల్ బాపుగారి కుమార్తె భానుమతి అట.