సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, అక్టోబర్ 2012, బుధవారం

రచయితలూ Vs పాఠకాభిమానులూ!


మర్షియల్ రచనలకూ, నాన్ కమర్షియల్ రచనలకూ తేడా- పాఠకుల అభిమానం నిలిచే  తీరులో తెలిసిపోతుంది. తొలి దశలో కమర్షియల్ రచనలను అభిమానించే పాఠకులు తమ ‘స్థాయి’ పెరగగానే వాటిని  పట్టించుకోవటం  మానేస్తుంటారు.   .

కానీ  నాన్ కమర్షియల్ రచనలపై పాఠకులకు ఉండే అభిమానం ఎప్పటికీ తగ్గిపోదు!

రంగనాయకమ్మ గారి రచనలను ఇష్టంగా చదివే పాఠకులకు   ‘శ్రామిక కోణం’  పుస్తకం ఓ రకంగా   ప్రత్యేకమైనది.  (ఈ మధ్యనే ఇది మార్కెట్లోకి వచ్చింది.  ఈ పుస్తకం లింకు-    http://kinige.com/kbook.php?id=1306&name=Sramika+Konam ).
 
 కారణం ‘నవ్య’ వారపత్రికలో ‘నేనూ- నా పాఠకులూ’ అనే పేరుతో వచ్చిన సీరియల్ ని  చేర్చింది  ఈ  పుస్తకంలోనే!

అయితే  శీర్షికను  ‘కొందరు పాఠకులతో,  నా పరిచయాలు’ గా మార్చారు. (‘అభిమానులు ’ అనే మాటను రంగనాయకమ్మ గారు ఉపయోగించరు.  ‘పాఠకులు’ అంటారంతే!)

పాఠకులకూ,  రచయితలకూ  మధ్య  తరచూ  ఉత్తర ప్రత్యుత్తరాలు  జరుగుతూనే ఉంటాయి.  రచయితల మీద అభిమానం చూపే పాఠకుల్లో రకరకాల స్థాయులవాళ్ళుంటారు.  అభిమానాన్ని సాధారణ స్థాయిలో ఉంచుకునేవారు కొందరైతే ... దాన్ని ప్రగాఢంగా పెంచుకునేవారు  కొందరు!

 ఏదైనా సందర్భంలో అభిమాని ప్రవర్తన గడుసుగానో, అపసవ్యంగానే ఉందనే అభిప్రాయం రచయితకు ఏర్పడవచ్చు.  ‘నేనింత అభిమానిస్తున్నాను కదా.. నా పట్ల కూడా  ఇంత నిర్మొహమాటంగా ఉండాలా?’అని అభిమాని అనుకోవచ్చు.  ఇలా  వారి సంబంధాల్లో ఎక్కడైనా అపశ్రుతి మొదలై,  అంతరం ఏర్పడి, అది పెద్దదయే అవకాశముంది.  

అభిమానించే  పాఠకులతో తన  సంబంధ బాంధవ్యాల  తీరును సవిమర్శకంగా ఒక తెలుగు రచయిత  అక్షరరూపంలో పెట్టటం ఇదే మొదటిసారి అనుకుంటాను. దీనిలో రకరకాల పాఠకులతో తనకెదురైన వింత,  ఆహ్లాదకర  అనుభవాలను రంగనాయకమ్మ గారు వివరిస్తారు. 

తనను ఇష్టపడే  పాఠకులైనా సరే, తనతో  సవ్యంగా ప్రవర్తించలేదని భావిస్తే...  వారిని  దూరం పెట్టటానికి సంశయించననీ, వారికి ఎలాంటి మినహాయింపులూ ఉండవనీ  ఆచరణ పూర్వకంగా  రుజువు చేస్తారు  రంగనాయకమ్మగారు. 

ముఖ్యంగా   ఓ పాఠకురాలి ఉదంతం  చెప్పుకోవాలి. 
ఆమెతో  రచయిత్రికి   కొన్ని సంఘటనల ఫలితంగా గ్యాప్ ఏర్పడుతుంది.  తనను క్షమించి,  పూర్వంలాగే ఫోన్లూ, లేఖలూ కొనసాగించాలంటూ  తన అభిమాన రచయిత్రితో ఆమె హొరాహోరీగా ఈ-మెయిల్స్ తో సంఘర్షించిన ఘట్టం అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.  చివరకు మారుపేరుతో  రంగనాయకమ్మ గారితో  లేఖా  సంబంధం పునరుద్ధరించుకోవడానికి కూడా ఆ పాఠకురాలు  ప్రయత్నిస్తారు.

(ఇదంతా తన ధారావాహికలో  రచయిత్రి  వివరంగా రాశారు)

అభిమానం అనేది డిమాండ్ చేయకుండా దానికదే  సహజసిద్ధంగా  ఏర్పడాలి  కానీ;   పోట్లాడీ,  బెదిరించీ ఎవరమూ దాన్ని తిరిగి  సాధించలేం  కదా?   ఈ సంగతి  ఆ  పాఠకురాలికి  అర్థం కాకపోవటం విచిత్రంగా  అనిపిస్తుంది. ఆ మొండి పట్టుదలకు విసుగూ, నివ్వెరపాటు కలుగుతూనే ఆమె పరిస్థితికి  జాలి కూడా వేస్తుంది.  ఇదంతా జరిగాక,  చివరిలో  ఆమె ( నిష్ఠూరాలతోనే )  ఆ విషయం  గ్రహించారనిపిస్తుంది.

‘అభిమానాలూ, గౌరవాలూ, స్నేహాలూ,  ప్రేమలూ,  ఆరాధనలూ- అంతంత మంచి మాటలుగా వినపడేవీ, కనపడేవీ , ప్రతీచోటా నటనలూ  కపటాలూ కాకపోయినా, చాలాచోట్ల అవి అంతంత నిజాలు కావు. వాటి నిండా ఆ మాటలు చెప్పే వాళ్ళకే అర్థం కాని మర్మాలూ, అజ్ఞానాలూ ఉంటాయి. కేవలం అజ్ఞానమే అయినది, నేరం కాదు. కానీ ఆ అజ్ఞానం , అనేక కపటత్వాలతో ఏకమైపోయి, దాన్ని వదిలించుకోవడం వాళ్ళకి కూడా సాధ్యం కానంత కలుషితమైపోయివుంటుంది’ 
అంటారు రంగనాయకమ్మ  ఈ వ్యాస పరంపరకు ముందు.

ఇవన్నీ ఆమె స్వానుభవాలు మరి!

భావాల్లో ఐక్యం, వ్యక్తిగత సంబంధాల్లో అంతరం/ఘర్షణ ఉన్న ఈ  పరిస్థితిని  చూస్తే-  స్థూలంగా ఇవన్నీ మిత్ర వైరుధ్యాలుగానే నాకు కనిపిస్తున్నాయి.
 
ఆమెను  చూడటానికి వచ్చి  ఆమె  తర్కానికి   కన్విన్స్ అయి...  ఆ క్షణంలోనే   తన  చేతికున్నదేవుడి  ఉంగరాన్ని తీసి బయటికి  గిరాటేసిన రైతు పాఠకుడు...

ఆమె  చెప్పారన్న  ఒక్క కారణంతో  క్షయరోగి  అయిన మరో పాఠకురాలిని  ఇంట్లో పెట్టుకుని ప్రేమగా  ఆదరించిన  శాంతకుమారి అనే పాఠకురాలు ....

వీళ్ళంతా మనకు ఈ రచనలో తారసపడతారు.

* *  *

పుస్తకం మొదట్లోనే  రెండు పెద్ద కథలున్నాయి.   ‘శోష! శోష!’ ,   ‘ఇంటర్నెట్ పెళ్ళిచూపులు’.

మొదటిది నవ్య  దీపావళి సంచికలోనూ,  రెండోది రచన మాసపత్రికలోనూ  వచ్చాయి.  కవి పుంగవుని  కీర్తి కాంక్ష ;   అత్యాధునిక పెళ్ళిచూపుల బండారం  వీటికి ఇతివృత్తాలు.   సహజంగానే  వీటిలో వ్యంగ్య హాస్యాల మేళవింపు  కనపడుతుంది.

* *  *

 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘జాహ్నవి’  మేధోమధన వ్యాసాలపై రంగనాయకమ్మ గారు విమర్శా వ్యాసాలు రాశారు.  వాటిని  పత్రికలో వచ్చినప్పటికంటే  ఎక్కువ వివరాలతో ఈ పుస్తకంలో  చదవొచ్చు. మార్క్సిజం మీద విమర్శలు కురిపించిన జాహ్నవి ప్రశ్నలకు సవివరంగా వీటిలో సమాధానాలిస్తూ ప్రతి విమర్శలు చేశారు.

తన వ్యాసాలపై సుదీర్ఘంగా వచ్చిన ఆ  విమర్శలకు స్పందించకుండా జాహ్నవి  ‘వ్యూహాత్మక మౌనం’ పాటించారు! .

వ్యాస పరంపరలో ఒక చోట-  కార్మిక జనాభా ఒక పూట సమ్మె చేస్తే సమస్త శ్రమలూ ఆగిపోయి  ఏమవుతుందో ఆమె చక్కగా వర్ణిస్తారు ఇలా-

‘యంత్రాలన్నీ   ఆగిపోతాయి. ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. రోడ్ల మీద, రైలు లైన్ల మీద, సముద్రాల మీద, మేఘాల మీద, నేల మీద, నింగి మీద, బస్సులూ- లారీలూ- రైళ్ళూ- ఓడలూ- విమానాలూః- రాకెట్లూ- సమస్త రవాణా సాధనాలూ, స్తంభించిపోతాయి.
 

అవి మళ్ళీ కదలాలంటే,
 

అది పారిశ్రామిక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  అది వర్తక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  బ్యాంకు పెట్టుబడిదారుల వల్ల జరగదు. భూస్వాముల వల్ల జరగదు. 

గవర్నర్ల వల్లా, ప్రెసిడెంట్ల వల్లా జరగదు.  ఒబామాల వల్లా, మన్ మోహన్ల వల్లా జరగదు. రాముళ్ళ వల్లా, కృష్ణుళ్ళ వల్లా, జరగదు. యజ్ఞాల వల్లా, యాగాల వల్లా జరగదు.

మళ్ళీ శ్రామిక ప్రజలు కదలాలి. డ్రైవర్లూ, క్లీనర్లూ, టెక్నీషియన్లూ, ఇంజనీర్లూ, ఆ కార్మిక జనాభా అంతా మళ్ళీ పనుల్లోకి దిగాలి.
 

అప్పుడే మళ్లీ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి. యంత్రాలు నడుస్తాయి. బస్సులూ, రైళ్ళూ కదులుతాయి. ఉత్పత్తులు తయారవుతాయి. రవాణాలు సాగుతాయి.

మనుషులు బతకడానికి పనులు చేసేవాళ్ళ అవసరం ఏమిటో, యజమానుల అనవసరం ఏమిటో, ఉత్పత్తులకు కారణం ఏమిటో, అప్పుడు తెలుస్తుంది.’పుస్తకంలో దళిత సమస్య, తెలంగాణా, విప్లవ కార్యాచరణల మీద కూడా  చర్చా వ్యాసాలున్నాయి. పత్రికలకు వివిధ సామాజిక అంశాల మీద రాసిన ఉత్తరాలున్నాయి.

చలం సమాధి ని రక్షించాలనే చర్చ జరిగినపుడు  రాసిన వ్యాసంలోని భాగం -  

 ‘సమాధులు వ్యక్తిపూజకు పరాకాష్ఠలు. అది మార్క్స్ సమాధి అయినా,  మార్క్సుని గుర్తించవలసింది, మార్క్స్ రచనల ద్వారానే గానీ, సమాధి ద్వారా కాదు.
 ....
 

జనాలు ఎగబడి చూసే తాజ్ మహల్ వంటి సమాధిని తీసిపారేసిన చలాన్ని, సమాధి కట్టి గౌరవిస్తారా?
....
 

రచయితను గౌరవించడం అంటే , ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆయనకి మూర్ఖత్వంగా కనపడే పనితో ఆయన్ని గౌరవించాలని చూస్తే, అది ఆయనకు అవమానమా, సన్మానమా? ఆ మనిషి లేచి రావడమే సాధ్యమైతే , ఆ సమాధిని కూలగొట్టడూ?’   

ఆ చివరి వాక్యం ఎంత పదునుగా,  శక్తిమంతంగా ఉందో గమనించారా?

9 వ్యాఖ్యలు:

Praveen Mandangi చెప్పారు...

"జాహ్నవి" అనే పేరుతో మార్క్సిజంపై విషం చిమ్ముతూ వ్యాసాలు వ్రాసినది ఎ.బి.వెంకటేశ్వరరావు అనే పోలీస్ అధికారి. పత్రిక ఎడిటర్‌లు అతని పేరు బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు కానీ జర్నలిస్ట్‌లలో కొందరు మార్క్సిస్ట్‌లు ఉండడం వల్ల అతని పేరు బయటపడింది.

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

ఈ పుస్తకం లోని రచనలు పత్రికల్లో వచ్చినప్పుడు చదివాను. ఏవైనా కొత్తవి వుంటే, చదవ లేదు ఇంకా వాటిని.
ఈ పుస్తకం నా చేతుల్లో పడే భాగ్యం ఇంకా కలగలేదు నాకు. ముంబాయి నించి ఒక స్నేహితుడు ఇక్కడకి వస్తూ వుంటే, ఆ స్నేహితుడికి హైదరాబాదు నించీ ఈ పుస్తకం పంపే ఏర్పాటు చేశాను.

"పుస్తకం అందింది. తప్ప కుండా తీసుకు వస్తాను" అని ఒట్టేసి చెప్పాడా మిత్రుడు.

ఎంతో సంతోషించాను. కవిత్వాల్లో రాసినట్టు, "చకోర పక్షి" లాగా ఎదురు చూశాను.

ఎయిర్‌పోర్టు నించీ డైరెక్టుగా సామానుతో, తన అపార్టుమెంటుకి వెళ్ళకుండా, మా ఇంటికే వచ్చేశాడు.

"ఎంత బాధ్యత గల మనిషో కదా?" అని మురిసిపోతూ, సంబరంగా తలుపు తీశాను, డ్రైవు వే మీద అతన్ని తీసుకు వచ్చిన కారు ఆగగానే.

లోపలకి మొహం ఇంత చేసుకుని వచ్చాడు.

"సారీ, సారీ, సారీ! ఆ పుస్తకం తీసుకు రావడం మర్చిపోయాను. మిగిలినవి తెచ్చాను. సారీ, సారీ. డిశంబరులో మా ఆవిడ వస్తుంది. ఆవిడ చేత తెప్పిస్తాను. లేదా, మా వాళ్ళని పోస్టులో పంపమంటాను. ఖర్చు ఎంతైనా నేను పెట్టుకుంటాను. సారీ, సారీ" అంటూ బతిమాలాడు.

హతాశుడినయ్యాను. ఎంత ఆశతో ఎదురు చూస్తున్నానో! నా మొహం కూడా నయా పైసా అంత అయింది. అంతగా అవసరం లేని పట్ట కారా (వంటిట్లో గిన్నెలు పట్టుకునే పట్ట కార - మాది విరిగి పోయింది. కాగితం ముక్కలతో గిన్నెలు పట్టుకుంటే, అప్పుడప్పుడు వేళ్ళు చురుక్కు మంటున్నాయి. నేనే తెమ్మన్నాను.), అప్పడాల్లాంటి "కాకరా", ఇదేదో నార్త్ ఇండియన్ తిండి, (నా కస్సలు నచ్చదు), ఇంకేవో స్వీట్లూ, గట్రా. ప్రాణం వుసూరుమంది పుస్తకం రానందుకు.

"తొలి దశలో కమర్షియల్ రచనలను అభిమానించే పాఠకులు తమ ‘స్థాయి’ పెరగగానే వాటిని పట్టించుకోవటం మానేస్తుంటారు." అని ఎంత చక్కగా రాశారో! చిన్నప్పుడు యద్ధనపూడి రచనలూ, యండమూరి రచనలూ, కె. విశ్వనాథ్ సినిమాలూ అలాగే తెగ ఇష్ట పడిపోయేవాడిని. కొత్త జ్ఞానం వచ్చే కొద్దీ, అవన్నీ (వాటిలో ఎక్కువ శాతం) ఎంత అల్పంగా కనబడతాయో!

రచయిత(త్రు)లు తాము రాసే విషయాలని ఆచరణలో పెట్టినప్పుడే, కొంత మంది పాఠకులకి ఆ రచయిత(త్రు)లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆచరణకి ఆమడ దూరంలో వుండే రచయిత(త్రు)లతో పాఠకులకుండే సంబంధాలు వేరుగా వుంటాయి.

ఇతరులను విమర్శిస్తే చాలా ఇష్టంగా చదివే పాఠకులు, తమని విమర్శిస్తే భరించ లేరు. బండగా, మొండిగా వాదిస్తారు. ఆ విమర్శలకి దూరం అయిపోతారు. వాటి నించీ ఏమన్నా నేర్చుకుందామన్న జ్ఞానం వారికుండదు.

మొత్తానికి మీరు రాసింది నా చేత ఇంత పెద్ద కామెంటు రాయించింది. :-)

ప్రసాద్

వేణు చెప్పారు...

@ Praveen: ‘జాహ్నవి’ కలం పేరు ఓ పోలీసు అధికారిదని తెలుసు కానీ, పేరు మీ వ్యాఖ్య ద్వారానే తెలిసింది.

@ సుజాత: ఔను, రాజకీయ నాయకుడిగా మారిన RN అభిమాని జగన్ ను people's saviour గా భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నిజమే. కథలూ, పాఠకులతో పరిచయాలూ ఒక తరహా అయితే; విమర్శలూ, విశ్లేషణలూ, చర్చలూ, వాదనలూ మరో తరహా. రెండు పుస్తకాలుగా వేసివుంటే బాగుండేది.

అయితే- ఒకే పుస్తకం వేయటం పాఠకులకే కాకుండా, ప్రతి ప్రచురణకూ పాతిక వేలు నష్టపోయే రంగనాయకమ్మ గారికి కూడా ఆర్థికంగా ఆదా అవుతుంది!

ఈ పుస్తకం మీ షికాగో రావాలంటే- నాలాంటివాళ్ళెవరైనా మీకు పోస్టు చేయటం ఒక్కటే మార్గం.:)

వేణు చెప్పారు...

ప్రసాద్ గారూ! ‘శ్రామిక కోణం’ పుస్తకం మీకింకా అందనే లేదన్నమాట.

పుస్తకం మర్చిపోయిన మీ మిత్రుడు కనీసం సారీలు చెప్పినందుకు సంతోషించాలి; ‘పనికొచ్చే పట్టకారా, కాకరాలు తెచ్చాశా కదా? ఇక ఆ పుస్తకం మర్చిపోతే ఏం లే’ అని తేలిగ్గా తీసిపారెయ్యలేదు కదా మరి! :)


వేణు చెప్పారు...

‘శ్రామిక కోణం’ పుస్తకం గురించి రాశావు, సరే. కానీ ఆ పుస్తకంలో పేజీలెన్ని? వెల ఎంత? ఎక్కడ దొరుతుందీ.. అనే వివరాలేవీ అని ఓ మిత్రుడు అడిగాడు.

‘ఈనాడు సండే మ్యాగజీన్’లో రాసిన చిరు సమీక్షలో ఆ వివరాలున్నాయి. అందుకే ఆ క్లిపింగ్ ని ఈ టపాలో చేరుస్తున్నాను!

రామ్ చెప్పారు...

వేణు గారు - పుస్తక పరిచయానికి ధన్యవాదాలు . చాలా బాగుంది .

"రచయితను గౌరవించడం అంటే , ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆయనకి మూర్ఖత్వంగా కనపడే పనితో ఆయన్ని గౌరవించాలని చూస్తే, అది ఆయనకు అవమానమా, సన్మానమా? "

చాలా ఆలోచించవలసిన విషయం .

అలాగే మరొకటి కూడా . ఒక రచయిత భావాలు మనకి నచ్చకపోతే ( నేను చెప్పేది కమర్షియల్ రచయితల గురించి కాదు) - వాళ్ళని తిట్టేస్తాం .

కాని సాధారణం గా ఈ రెండూ చేయకుండా ఉండటం కష్టమేమో !!

వేణు చెప్పారు...

రామ్ గారూ, మీ ప్పందనకు కృతజ్ఞతలు.

భావాలు నచ్చని రచయితను పాఠకులు (కొందరైనా) తిట్టిపోయటంలో అసహజం ఉండకపోవచ్చు.

కానీ భావాలు నచ్చి అభిమానించిన రచయిత ఏం చెప్పారో అభిమాన పాఠకులు దానికి వ్యతిరేకంగా చేశారనుకోండి. అలా చేశారంటే- వారికి ఆ భావాలపై ఏమంత శ్రద్ధ లేనట్టూ; ఆ రచయితపై గౌరవం కూడా ఏమీ లేనట్టు!

Unknown చెప్పారు...

"అలాగే మరొకటి కూడా . ఒక రచయిత భావాలు మనకి నచ్చకపోతే ( నేను చెప్పేది కమర్షియల్ రచయితల గురించి కాదు) - వాళ్ళని తిట్టేస్తాం ."

పై వాక్యం చూశాక, నాకు కొన్ని ప్రశ్నలు స్ఫురించాయి.

1. "మనం" అంటే ఎవరం? ఎవరా మనం? ఎటువైపున వున్నాం మనం? శ్రమ చేసే వారి వైపునా? ఆ శ్రమ చేసే వారి పైన ఆధార పడిన వారి వైపునా?
2. ఈ "మనం" అనే దాని లోని స్పష్టత తేలక పోతే, ఒక రచయిత భావాలు నచ్చక పోవడం, వాళ్ళని తిట్టడం అన్న విషయాల్లోని సంక్లిష్టత ఎలా అర్థం అవుతుందీ?

వేణూ గారు అన్నట్టు, నచ్చని రచయిత భావాలని తిట్టడం వేరూ, నచ్చిన రచయిత భావాలని పట్టించు కోకుండా, ఆ రచయితని అవమానం చెయ్యడం వేరూ. రెండూ ఒకటి కావు.

ప్రసాద్