సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, మే 2013, ఆదివారం

ఎన్టీఆర్- గురజాడ ... గోపీచంద్- గంగాధర్!



న్టీఆర్ అంటే జూనియర్ కాదనీ;  గోపీచంద్-  హీరో కాదూ- రచయిత అనీ; గంగాధర్ అంటే గాయకుడు కాదూ- చిత్రకారుడనీ ముందే చెప్పేస్తున్నాను. 
  
అయినా,  ఇదేదో పొంతన లేని టైటిల్ లాగా కనపడితే ఆశ్చర్యమేమీ లేదు. 

గురజాడ కన్యాశుల్కంలో ఎన్టీఆర్ నటించాడు. ఇక ఎన్టీఆర్ సొంత సినిమాల పబ్లిసిటీకి  ఆస్థాన ఆర్టిస్టు గంగాధర్. మరి దర్శకుడు కూడా అయిన రచయిత గోపీచంద్ కూ, ఎన్టీఆర్ కూ సంబంధమేమైనా ఉందా అనే  సందేహం వస్తోందా? 

ఎన్టీఆర్ కు మిగతావారితో ఉన్న సంబంధం గురించి  ఇక్కడ చెప్పబోవటం లేదు. ఈ నలుగురినీ కలిపే ప్రత్యేక అంశం ఒకటుంది.

అదే ఈ టపా కథ!

ఇంకా చెప్పాలంటే ఈ జాబితాలో చాసో, శ్రీశ్రీ, బాపులను కూడా కలిపేసుకోవచ్చు!

* * *

భీమసేనుడి భీకర శపథం

‘పాండవ వనవాసము’ చూశారా? 1965 లో వచ్చిన సినిమా. ఇందులో ‘ధారుణి రాజ్యసంపద..’పద్యం పాడుతూ భీముడి పాత్రధారి ఎన్.టి. రామారావు చూపే రౌద్ర, వీర రసాలు గగుర్పాటు కలిగించేలా ఉంటాయి.

మాయాజూదంలో పరాజితుడవుతాడు  ధర్మరాజు. తననూ, సోదరులనూ, ద్రౌపదినీ కూడా పణంగా ఒడ్డి ఓడిపోతాడు. అప్పుడు నిండు సభకు ద్రౌపదిని రప్పిస్తాడు దుర్యోధనుడు.  దుశ్శాసనుడి హేళనాపూర్వకమైన మాటలకు వంతపాడుతూ, తన తొడ చూపి ఆమెను దానిమీద కూర్చోమన్నట్టుగా దుర్యోధనుడు సైగ చేసినపుడు... ద్రౌపది అవమానాగ్నితో  దహించుకుపోతూ తల్లడిల్లిపోతున్నపుడు... 

తోకతొక్కిన తాచుపాములా లేస్తాడు భీముడు, క్రోధంతో. దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాననీ, దుశ్శాసనుణ్ణి భీకరంగా సంహరిస్తాననీ శపథం చేస్తాడు.

ఈ సందర్భంగా నన్నయ రాసిన  ‘ధారుణి రాజ్య సంపద మదంబున..’ , ‘కురువృద్ధుల్ గురువృద్ధ  భాంధవులనేకుల్ జూచుచుండన్ ...’ అనే రెండు పద్యాలను ‘పాండవ వనవాసము’ సినిమాలో ఉపయోగించారు. 

రౌద్రాన్నీ, వీరాన్నీ ఘంటసాల అనుపమానంగా తన గళంలో పలికిస్తాడు. దీటుగా ఎన్.టి.ఆర్. హావభావాలు శిఖరాగ్రస్థాయిలో ప్రదర్శిస్తాడు.

చూడండి... ఈ చిన్న వీడియో. దీని నిడివి రెండు నిమిషాల కంటే కూడా తక్కువే.  



‘ధారుణి రాజ్య సంపద..’ పద్యం ప్రారంభమయ్యేటపుడు గమనించండి- తలపైకి ఎత్తి చూస్తూ...  కోపంతో మండిపడుతూ లేచిన భీముడి మొహం సైడ్ వ్యూలో కనపడుతుంది.




 ఇదో గొప్ప షాట్!

సన్నివేశం అంతగా పండటానికి ఆ షాట్ చక్కటి ప్రాతిపదిక ఏర్పరిచింది.

ఇది ఛాయాగ్రాహకుడు సి. నాగేశ్వరరావు ఆలోచనో, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఆలోచనో గానీ... (సహాయకుల ఆలోచన కూడా కావొచ్చనుకోండీ..) ఈ ఘట్టం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

అంతకుముందు నాలుగేళ్ళ క్రితమే (1961) ‘సీతారామ కల్యాణం’ వచ్చింది. ఈ సినిమాలో
దాదాపు అలాంటి posture తో రావణ పాత్రధారిగా ఎన్టీఆర్ కనపడతాడు.



ఆ సినిమా దర్శకుడు ఎన్టీ రామారావే. ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్.

* * *

న్.టి. ఆర్  దేహ సౌష్ఠవం ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో దేనికైనా అతికినట్టు సరిపోతుంది. (ఒక్క నారదుడు తప్ప దాదాపు అన్ని ప్రముఖ పౌరాణిక పాత్రలూ ఆయన పోషించాడు).

సైడ్ వ్యూలో ఆయన మొహం  ఎక్కువ ఆకట్టుకునేలా కనపడుతుందని నాదో థియరీ! ముఖ్యంగా వీరరసం ఉప్పొంగే ఘట్టాల్లో!

ఈ వర్ణచిత్రాలు గమనించండి- 

శ్రీకృష్ణుడు,   అర్జునుడు

అడవిరాముడు

                     (ఈ మూడూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ చిత్రించినవి).



* * *
  
క్కకు తిరిగిన ముఖం (side face view) తో ఉన్న మనుషుల బొమ్మలు చూసినపుడు ఒక కన్ను మాత్రమే  కనపడి ఆశ్చర్యం వేసేది... నా చిన్నవయసులో. 

ఆర్టిస్టు రెండో కన్ను వెయ్యలేదేమిటనే అమాయకపు  సందేహం వచ్చేది! తల్చుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంటుంది.

స్కూలు రోజుల్నుంచీ గురజాడ అప్పారావు బొమ్మ ఎక్కడ చూసినా ఎడం పక్కకు తిరిగే కనపడేది. దీంతో ఆయన మొహం ఎలా ఉంటుందో అంతుపట్టేది కాదు.
 


ఈ మధ్యకాలంలోనే గురజాడ  చిత్రాలు వేరే కోణంలో ఉన్నవి చూడగలిగాను.

    
రచయిత గోపీచంద్ బొమ్మ కూడా అంతే. 
 
   
 

 కుడిపక్కకు తిరిగి ఉన్న బొమ్మనే ఏళ్ళ తరబడిగా చూస్తూ వచ్చాను. తర్వాతికాలంలో ఆయన మనవైపు చూస్తున్న భంగిమలో ఉన్న ఫొటో చూసి, ‘ఈయన గోపీచందేనా?’ అని సందేహించేంత ఆశ్చర్యం కలిగింది.


 చుట్టా... సిగరెట్.. పైపు



కథా రచయిత చాసో  ఫొటో/ చిత్రం ఎడం పక్కకు తిరిగివుండే భంగిమలోనే ఉంటుంది, ఎక్కడ చూసినా!

కర్ణుడి సహజ కవచకుండలాల్లాగా చుట్ట ఒకటి ఆయన నోటికి కనపడుతుంటుంది.

చుట్ట లేని బొమ్మ కూడా ఉండటం కొంత ఆశ్చర్యకరమే.



ఇప్పుడు కాదు గానీ, చాలాకాలం క్రితమైతే... సిగరెట్ దమ్ము బిగించిన శ్రీశ్రీ ఫొటో,  పైపు కాల్చే బాపు బొమ్మా (సెల్ఫ్ కారికేచర్) తరచూ పత్రికల్లో కనపడేవి. 

ఇవి ఉన్నది  సైడ్ వ్యూలోనే!  


మద్యం సీసాలతో స్టైల్ గా  పోజులిచ్చే రచయితల, కవుల ఫొటోలు మనకు లేనందుకు సంతోషించాలేమో!


* * *

రేఖాచిత్ర రస గంగాధరం

సైడ్ ఫేస్ బొమ్మల గురించి చెప్పుకునేటపుడు తప్పనిసరిగా గుర్తొచ్చే చిత్రకారుడు గంగాధర్.

ఆయన కొన్ని దశాబ్దాల క్రితం తెలుగు మ్యాగజీన్స్ లో  కథలకు విరివిగా ఇలస్ట్రేషన్స్ వేశారు. అవి లలితమైన రేఖలతో భలే ఉండేవి.



ఆయన తన బొమ్మల్లో వ్యక్తులను తరచూ  సైడ్ వ్యూలోనే వేసేవారు. ఆ కోణం గంగాధర్ బాగా ఇష్టమేమో.

లేకపోతే బొమ్మలు అలా వేయటంలో ఏదో సౌలభ్యం ఆయనకు ఉండివుండాలి.



సౌలభ్యం అంటే గుర్తొచ్చింది.

ఎవరిదైనా రూప చిత్రం (పోర్ట్రెయిట్ ) వేగంగా  వేయాలంటే  చిత్రకారులకు  సైడ్ వ్యూ చాలా అనుకూలం.

కొన్నేళ్ళ క్రితం ... ఓసారి  మా ఆఫీసులో ఆర్టిస్టుల సెక్షన్ కు ఇలస్ట్రేటర్ బాబు అతిథిగా వచ్చారు. ( బాలజ్యోతిలో, ఇంకా ముందు రోజుల్లో విజయ మంత్లీలో బొమ్మలు వేసిన ఆర్టిస్టు.)

సరదాగా అక్కడున్నవాళ్ళ  పోర్ట్రెయిట్లను వేయటం మొదలుపెట్టారు.

ఎదుటి వ్యక్తిని  మొహం పక్కకు తిప్పమని చెప్పి, తాను నిలబడి సైడ్ యాంగిల్లో అలవోకగా రూపచిత్రాలను చకచకా గీసేశారు.


ఆయన అప్పటికప్పుడు రెండు నిమిషాల్లోనే గీసిన ఓ చిత్రం ఇది. 

గీసిన బొమ్మకూ, ఒరిజినల్ మనిషికీ పోలికలు బాగా కనపడాలంటే ముక్కుకు ప్రధానపాత్ర ఉందని అప్పుడే అర్థమైంది.

సైడ్ యాంగిల్లోనే ముక్కు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కదా?    


13 కామెంట్‌లు:

రామ్ చెప్పారు...

చాలా ముక్కుయమయిన థీరీ ... ఇంత వరకూ ఊహించనిదీను !!

"పోర్ట్రెయిట్ వేగంగా వేయాలంటే చిత్రకారులకు సైడ్ వ్యూ చాలా అనుకూలం ..... "

నిజమేనండోయ్ మీరు అంటా అంటా ఉంటే గుర్తుకొస్తా ... కొస్తా ఉంది

రామ రాజ్యం కాలం లో .. ఈనాడు శ్రీధర్ కార్టూన్ లో ఎన్ టీ వోడి బొమ్మ కూడా అంతే .. ఎక్కువ సైడ్ వ్యూ నే . చూసి ముచ్చటపడి మనం కూడా వేసేద్దామని తెగిస్తే .. ఓ ముక్కూ... పైన విబూది రేకా వేస్తే ఎన్ టీ వోడు వచ్చేసేవోడు . మిగిల్న బొమ్మలు రాలేదనుకోండి అది మనం ఇక్కడ చెప్పుకోకూడదు.

"‘ధారుణి రాజ్య సంపద..’ పద్యం ప్రారంభమయ్యేటపుడు గమనించండి- తలపైకి ఎత్తి చూస్తూ... కోపంతో మండిపడుతూ లేచిన భీముడి మొహం సైడ్ వ్యూలో కనపడుతుంది."

అంటే ఇప్పటి భాష లో ఒక వైపే చూడు .. రెండో వైపు చూడలనుకోకు అనా?

S చెప్పారు...

Interesting. Thanks for sharing.

y.v.ramana చెప్పారు...

మంచి పరిశీలన. ఆసక్తికరంగా రాశారు. అభినందనలు.

తృష్ణ చెప్పారు...

interesting article !

బాలు చెప్పారు...

వేణుగారు.. టపా బాగుంది. ‘బాబు’ వేసిన మీ సైడ్ వ్యూ పోర్ట్రెయిట్ ఇంకా బాగుంది.

naveenrjy చెప్పారు...

తలషేపు, మొహం షేపులతో కలిపి ఎలా చూసినా అందంగా కనిపించడమే ఫొటోజెనిక్ అని ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ పట్నాయక్ వల్ల ఈ మధ్యే తెలిసింది. ఈ ప్రకారం ఎన్ టి ఆర్ , మహేష్ బాబు 9 ఏంగిల్స్ లోనూ, నాగార్జున , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్ టి ఆర్ 8 ఏంగిల్స్ లోనూ ఎ ఎన్ ఆర్ 6 ఏంగిల్స్ లోనూ ....బాగుంటారు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ లగురించి మాట్లాడటంలేదు. వాళ్ళు మొహాలకు సర్జరీలు చేయించుకుసన్నారు కనుక.
బండముక్కు కారణంగా సైడ్ ఏంగిల్ లో ఫోటోలు అస్సలు తీయకూడని వారిలో కెసిఆర్ ఫస్ట్ అయితే నేను సెకెండ్..:)))))

ఇదంతా సరేగాని, ఈ బ్లాగు చూస్తూంటేనే బాగుంది. మనసుకి హాయి అనిపించే అభిరుచులను ఆస్వాదిస్తున్న వేణుకీ, ఆ ఆనందాన్ని అక్షరాలా మనకి పంచుతున్నందుకు కూడా అభినందనలు.

ఆయన సునిశితమైన పరిశీలన,తపస్సు లాంటి ఈ బ్లాగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి రెండు లైన్ల డిస్ క్లయిమర్ లో చమత్కారం ఓ చిరునవ్వుని మొలిపిస్తుంది.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

నా సైడ్ ఫోజ్ కూడా ఎంటీవోడిలానే ఉంటాదని ఆళ్ళూ ఈళ్ళు చెప్తుంటే నాకు అనిపించిందండీ(కానీ ఎసాల కోసం సినిమాల్లోకి పరిగెత్తలేదండోయ్)

వ్యాసం అద్భుత:,మీ పరిశీలనా శక్తికి జోహార్ల:

వేణు చెప్పారు...

రామ్ గారూ, ‘ముక్కుయమయిన థీరీ’- ప్రయోగం బాగుంది. ఎన్టీఆర్ కార్టూన్ ని శ్రీధర్ ఏమో గానీ, కార్టూనిస్టు అమర్ సైడ్ వ్యూలో ఎక్కువగా వేసేవాడు. చాలా సింపుల్ గా ఉండేది. మీ వర్ణనలాగే ప్రాక్టీస్ చేశాను. సెకన్లలోనే దాన్ని అనుకరించేవాణ్ణి.

S గారూ, థాంక్యూ.

Y.V.Ramana గారూ, మీ అభినందనకు కృతజ్ఞతలు.

వేణు చెప్పారు...

తృష్ణ గారూ, థాంక్యూ.

బాలు గారూ, ‘ఆ’ సైడ్ వ్యూ పోర్ట్రెయిట్ గుట్టు కనిపెట్టేశారే! థాంక్యూ.

వేణు చెప్పారు...

నవీన్ గారూ, ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ పట్నాయక్ వ్యాఖ్య బాగుంది. (ఫొటోగ్రఫీ అవార్డులు అందుకోవటానికి తను ఏడాదికోసారైనా హైదరాబాద్ వస్తూనే ఉంటాడు.)

హీరోలు అందంగా కనిపించే కోణాలు ఇన్ని, ఇలా ఉంటాయనే విషయం కొత్తగా తెలిసింది, మీ వ్యాఖ్య ద్వారా. ఫలానా హీరోల ‘సర్జరీల’ సంగతి కూడా నాకు కొత్తే. మీ అభినందనలకూ, వాత్సల్యానికీ కృతజ్ఞతలు.

శ్రీనివాస్ పప్పు గారూ, థాంక్యూ.

vijay చెప్పారు...

ఒక సినిమాను, అందులోని ప్రతి సీన్ నీ ఇంత పరిశీలనగా చూడొచ్చన్నమాట! ఓపిక, ఆసక్తి ఉండాలే గాని ఒక్క సినిమాను ఎన్ని రోజులైనా చూడొచ్చని మీ ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది.

ఇంతకీ నిన్నో, మొన్నో ఒక వ్యాఖ్య ఇక్కడే పోస్ట్ చేసాను. అది మిస్ అయిందేం? లేక నేనే సరిగా నొక్కవలసిన చోట నొక్కలేదేమో.

ముక్కును బట్టి నిక్ నేమ్స్ పెట్టడం మనందరికీ అలవాటే. కాని ముఖాకృతిలో ముక్కు ప్రాముఖ్యత ఇదమిద్ధంగా గుర్తించం. ఎన్టీవోడు అందగాడని చదువుతుంటాం. ఆ అందం ముక్కు వల్లనే వచ్చిందని మీ ధియరీని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నమాట.

డిగ్రీలో ఉండగా ఈ 'ధారుణి' పద్యంలో ఎన్టీయార్, ఎస్వీయార్ ల పోటాపోటీ నటన గురించి తెగ చర్చించుకునేవాళ్లం. ఎన్టీయార్ కష్టపడి పాడి (నటనే అనుకొండి) చేసిన పద్య హావభావాలను ఎస్వీయార్ 'బానిస!' అని కొట్టిపారేయడం ఆ ఘటనకు హైలెట్ అనుకునేవాళ్లం.

ఆ రెండో పద్యంలో వెనక్కి వెళ్లి సింగిల్ గా తెరపైన కనపడ్డప్పుడు కూడా, పద్యంలోని పదాల ఉచ్ఛారణకు తగ్గట్లు సాగిన ఆయన శరీర కదలికలు కూడా అద్భుతం. అటువంటి కదలికలు ఎన్టీయార్ ట్రేడ్ మార్క్. ఇంకెవరికీ రావు. జామాత పాల పడకపోయి ఉంటే ఆయనింకా ఉండేవారేనేమో.

అయితే చిరంజీవి వారసులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా!? కూటి కోసం కాదు, కోట్ల కోసం కోటి తిప్పలు అనాలా?

పోర్ట్రయిట్ అంటే తెలువులో రూప చిత్రం అని నాకు ఈ టపా చదివాక తెలిసింది.

వేణు చెప్పారు...

విజయ్ గారూ, నిజమే. ఎస్.వి. రంగారావు, ఎన్.టి.ఆర్. సావిత్రి మొదలైన నటదిగ్గజాలు తమ కెరియర్లో అత్యున్నత దశలో ఉన్నపుడు ప్రతిభావంతులైన దర్శక సాంకేతిక నిపుణులు రూపొందించిన ఇలాంటి ఇలాంటి క్లాసిక్స్ ను ఎన్నిరోజులైనా చూస్తూ విశ్లేషించొచ్చు.

ఈ సన్నివేశంలో ఎస్.వి.రంగారావు(దుర్యోధన పాత్ర కాదు) డామినేషన్ సంగతి బాగా ప్రచారంలోకి వచ్చిన విషయం. ఆయన ఏ పౌరాణిక పాత్ర వేసినా సంభాషణల్లో ఆ డామినేషన్ పంచ్ కామన్. దాన్ని వెంటనే తగ్గించగలిగింది నారద పాత్రధారి ఒక్క కాంతారావు మాత్రమే.

మొహంలో ఫోకల్ పాయింటుగా ముక్కుకు ప్రాధాన్యం ఎంతో ఉంది మరి.

M b d syamala చెప్పారు...

వేణు! నీ blogకోసం selct చేసుకునే అంశాలు అనూహ్యంగాఉంటాయని మరోసారి నిరూపించావు!
ఈ టపా చదివి చాలా ఆనందించాను! పాండవ వనవాసాన్ని లెక్కపెట్టలేదుగానీ చాలాసార్లు చూశాను।!నువ్వన్నట్లు ధారుణి పద్య సమయంలోని ఆangle ఆసందర్భానికి వన్నె తెచ్చింది నువ్వు చెప్పే వరకు ఆ దృష్టి కోణంతో చూడలేదు!ఇంతకీ అసలు విషయం !నీముక్కు చిత్ర కారుల కళాప్రయోగానికి అనుకూలమని తేలింది!నీ photo చాలా బాగుంది thanks toబాబుగారు!సరదాగా నవ్వులు పూయిస్తూనే ఔరా అని ఆశ్చర్యపరుస్తాయి నీ టపాలు !