సినీ నటి నందితాదాస్ ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తోందని చదివేవుంటారు.
‘90 శాతం మంది నలుపు రంగులో ఉండే దేశంలో పుట్టి - తెల్లగా లేనందుకు ఆత్మన్యూనతతో బాధపడటం విచారకరం’ అనేది ఈ ప్రచార కార్యక్రమం!
నలుపులోనూ అందం ఉందని ప్రచారం చేయటం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. కానీ అందం ( నలుపు రంగు అయితేనేం... ) అందరూ పట్టించుకోవాల్సిన విషయమేనని ఈ కార్యక్రమం పరోక్షంగా చెపుతున్నట్టే !
అందంగా లేననే భావన- ఆత్మన్యూనతను అమితంగా పెంచివేసే ధోరణి గత రెండు దశాబ్దాల నుంచీ బాగా పెరిగిపోతోంది.
చూడచక్కగా కనపడేలా చేయటానికి సాయం చేస్తానని హామీలిచ్చే సౌందర్య సాధనాల, ఉత్పత్తుల మాయాజాలమే ఎక్కడ చూసినా... పత్రిక తెరిచినా, టీవీ పెట్టినా, నెట్ చూసినా!
ఆయుధాలూ... సాధనాలూ
మారణాయుధాలు తయారుచేసే కంపెనీలు వాటి వినియోగం పెరగటం కోసం దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహిస్తాయి. యుద్ధం చేసే రెండు దేశాలకూ ఆయుధాలను సరఫరా చేస్తాయి. ప్రపంచ శాంతి ఆ కంపెనీలకు మనశ్శాంతిని ఇవ్వదు!
అలాగే -
సౌందర్య సాధనాలు తయారుచేసే సంస్థలకు అందం గురించి జనం ఉదాసీనంగా ఉంటేనో, ఒక మాదిరిగా మాత్రమే పట్టించుకుంటేనో నచ్చదు గాక నచ్చదు. తమ సరుకు వినియోగం పెరగటం కోసం అవి ప్రజల్లో అందం పట్ల మోజును ప్రోత్సహిస్తాయి.
వ్యూహాత్మకంగా కొన్ని దేశాల యువతులకే అందాల కిరీటాలు కట్టబెడతాయి. ‘మిస్ యూనివర్స్ మీ దేశం అమ్మాయికే దక్కింది’, ‘ మిస్ వర్ ల్డ్ మీ దేశం యువతే’ అంటూ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు ఎరలు వేస్తాయి. ఆ రకంగా తమ ఉత్పత్తులను భారీగా అమ్ముకుంటుంటాయి.
(అందాల కిరీటాలు దక్కాక మనదేశంలో సౌందర్య ఉత్పత్తులు ఎంత శాతం అమాంతం పెరిగిపోయాయో గూగిలించి చూడండి).
ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేసయినా సరే, అందం గురించిన మితిమీరిన వ్యామోహాన్ని పెంచిపోషించటం ఈ సంస్కృతి ముఖ్య లక్షణం. జీరో సైజ్ మోజుతో అమ్మాయిలెందరో అనొరెక్సియా వ్యాధిబారిన పడ్డారు. సినీ తారలను యువత గుడ్డిగా అనుకరించటాన్ని ప్రశంసిస్తూ, హైలైట్ చేస్తూ ‘నయా ట్రెండ్’ అంటూ వ్యాపార పత్రికలు ఇలాంటివాటికి వంతపాడుతూ ఆ సంస్కృతిలోనే ఐచ్ఛికంగా భాగమైపోతుంటాయి.
మగవాళ్ళను కూడా ఈ వలలోకి లాగటంలో ఈ సంస్కృతి ఇప్పటికే ఎంతో కొంత విజయం సాధించింది!
* * *
చిరస్మరణీయ కవిత
విమల గారి ‘సౌందర్యాత్మక హింస’ కవిత 20 సంవత్సరాల కిందట మొదటిసారి చదివివుంటాను. అందాల పోటీల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ గుర్తొచ్చే కవిత ఇది.
కవయిత్రి వర్ణించే ఈ హింస ప్రత్యేకత ఏమిటంటే- ఇది బయటకి తెలియదు. దాన్ని అనుభవించేవారిలో కూడా చాలామందికి స్పష్టం కాని హింస ఇది.
స్త్రీల అందాల ప్రదర్శన పోటీలు వారి ఆత్మగౌరవానికి వ్యతిరేకం కాబట్టి వాటిని వ్యతిరేకించాలని ప్రబోధించే కవిత కాదిది. పోటీల్లో నెగ్గటం కోసం చేసే ఆ సౌందర్య సాధన వెనక ఆ స్త్రీలు తెలిసీ- తెలియకా అనుభవించే దు:ఖాన్నీ, నిస్సహాయతనూ సహానుభూతితో పంచుకుని రాసిన కవిత ఇది.
ఆలోచనలు రేపే శక్తిమంతమైన వ్యక్తీకరణలు ఈ కవితను చిరస్మరణీయం చేశాయి.
మొదటి పాదమే సూటిగా విషయాన్ని చెప్పేస్తుంది.
‘మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టురాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట’-
ఆలోచనల్లో, మాటల్లో, నడకలో, నవ్వులో అసహజంగా సౌందర్య స్పృహ తప్ప మరేదీ మిగలని అవస్థ ఎంతటి హింసాపూరితమో కదా!
‘‘అంకెల మధ్య కుదించుకుని, కుదించుకుని
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యం కై వెంపర్లాడుతూ…
మూసలోకి వొదిగి, వొదిగి…
ఈ ‘స్వచ్ఛంద’ సౌందర్య హింస
మన సహజాతమని నమ్ముతూ…’’
అలంకారం చేసుకున్న స్త్రీని చూస్తే... కవయిత్రికి ‘పంటచేలో నిలబెట్టిన దిష్టిబొమ్మ’, ‘ఈజిప్షియన్ మమ్మీ’ గుర్తొచ్చాయి. కొత్తగా చదివేవారికి ఈ పోలికలు విభ్రాంతిని కలిగిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
‘అందం పోటీయైన చోట
అందం ‘సరుకైన’చోట
అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం!
మన మనుగడకు అందం అనివార్యమైన చోట
ఈ జీవితాన్నే ద్వేషిద్దాం! ’
మనుగడకు అందం తప్పనిసరి అయిన దుర్భర స్థితిలో ‘ఈ జీవితాన్నే ద్వేషిద్దాం’ అనటంలో నిస్సహాయత పరాకాష్టకు చేరి వ్యక్తీకరణ కూడా పదునెక్కింది.
అక్కడితో కవిత ముగిసివుంటే చాలా బాగుండేది.
కానీ తర్వాత రాసింది ప్రబోధాత్మకమై (దానిలో మంచి లేదని కాదు) కాసింత ‘కళ’ తప్పినట్టు నాకు అనిపించింది .
‘నిరంతర శ్రమలో పెదవులు పగిలి, చేతులు కాయలు కాచి,
రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో
అందాన్ని ‘ఖరీదు చేయలేని’ కోట్లాది మంది స్త్రీల
‘అందహీనత’ని మనం ప్రేమిద్దాం!’
ఇది చదివినపుడు తోడికోడళ్ళు (1957) సినిమాలో ఆత్రేయ పాట- ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చాన’ గుర్తొచ్చింది.
‘గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు ’
అయితే ముగింపు పాదాలు ఆశావహంగా, నినాదప్రాయంగా కనిపించినా వాటిలో కవిత్వాంశ లేకపోలేదు.
‘అందరికోసం అద్భుత సౌందర్యాన్ని
సహజసౌందర్య భరిత ప్రపంచాన్నీ సృష్టిద్దాం!’
ముసిముసి ఏడ్పు
ఈ కవిత వెలువడిన 8 ఏళ్ళకు కొండేపూడి నిర్మల గారి ‘మల్టీ నేషనల్ ముద్దు’ ఇదే సబ్జెక్టుతో వచ్చింది. దీన్ని విమల కవితకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు.
విమల కవిత ‘మనం’ అంటూ సాగితే... నిర్మల కవిత ‘నేను’ అని కొనసాగుతుంది.
అందాల పోటీల్లోని క్యాట్ వాక్ ని వర్ణించిన తీరు చూడండి-
‘మరిగే పాలలో మూతిపెట్టి
ముసిముసిగా ఏడ్చుకునే క్యాట్ వాక్ స్ఫూర్తిగా
అందాల గారడీ’
సౌందర్య స్పృహ మితిమీరితే సహజత్వం కరిగిపోయి కృత్రిమత్వంలోకి ఎలా మారిపోతుందో చూడండి-
‘రోజువారీ చిక్ రోజ్ అద్దకాల మధ్య
సిగ్గు ఏ రంగులో ఉండాలో నా బుగ్గలు మర్చిపోయాయి’
అత్యాధునిక సౌందర్య చికిత్సల మాయలేళ్ళ ప్రభావాన్ని కూడా విస్మరించని ఈ కవితలో ఆకట్టుకునే కొన్ని వ్యక్తీకరణలు గమనించండి-
‘కావలసిన కొలతల బెంగ
నాన్ సర్జికల్ గా కుట్టిపోతుంది
సిలికాన్ ఇంప్లాంట్స్ కింద
బిక్క చచ్చిపోయిన గుండెచప్పుడు కంటే హింసగా’
ముగింపుకొచ్చేసరికి భావ తీవ్రత, వ్యక్తీకరణ పదునూ కూడా రెట్టింపయినట్టు అనిపిస్తాయి.
‘పెడిక్యూర్ అనుకుంటూ
పరాయి మార్కెట్ పాదసేవకు
చేతులిచ్చిన దాసిని నేనే
చెక్కిన అవయవాల సమూహంతో
చుక్కల కెగిసిన దేవేరిని నేనే’
అని ప్రకటించాక వచ్చే ఈ పాదం చూడండి-
‘డీకంపోజవకుండా రసాయనాలు దట్టించిన
తలక్రిందుల కల ఈజిప్షియన్ మమ్మీని నేనే’
అందాల పోటీల వెనకున్న మార్కెట్ మాయాజాలాన్ని ప్రతిభావంతంగా అక్షరబద్ధం చేసిన ఈ రెండు కవితలనూ యథాతథంగా ఇక్కడ scribd లో చదువుకోవచ్చు.
ఈ రెండు కవితలూ నిజానికి పేరాల్లేకుండా ఒక్కోటీ ఏక ఖండంగా ఉంటాయి. కానీ భావ స్పష్టత కోసం పేరాలుగా విభజించాను.
విమల కవిత ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ కవితా సంకలనంలో ఉంది.
నిర్మల కవితను ఆమె ఇటీవల విడుదల చేసిన ‘కొండేపూడి నిర్మల కవిత్వం’ సంపుటిలో చూడొచ్చు. ఆన్ లైన్ పుస్తకం కోసం కినిగె లింకు- http://kinige.com/kbook.php?id=1178&name=Kondepudi+Nirmala+Kavitvam
ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా అందంగా కనపడాలనుకోవటంలో దోషం కానీ, అసహజం కానీ ఉండదు. కానీ ‘అతి సర్వత్ర వర్జయేత్’అనేది సౌందర్య పోషణకైనా, అలంకరణకైనా వర్తిస్తుంది.
‘అందంగా లేనా?, అస్సలేం బాలేనా?’ అనే ప్రశ్న ఇప్పుడు మగవాళ్ళను కూడా ఎంతో కొంత వేధిస్తోంది. మరి ‘సౌందర్యాత్మక హింస’ మేల్ వర్షన్ రాబోయే కాలంలో చూస్తామా?
9 కామెంట్లు:
Interesting. ఎంత కాదనుకున్నా నాగరిక జీవితంలో అందానికీ, సౌందర్యపోషణకీ, ఆకర్షణీయంగా ఉండాలనే తపనకీ ఒక స్థానం ఏర్పడిపోయింది.
మంచి పోస్ట్. కవితలను కూడా జోడించి బాగా వివరించారు. ఈ నందితా దాస్ క్యాంపయిన్ గురించి చదివినప్పుడు నాకొక్కటే అనిపించింది...నలుపవ్వనీ, తెలుపవ్వనీ, ఆడది అంటే అందం తప్ప ఇంకేమీ లేదా?! women are worth so much more than their beauty and looks. అసలు అందం అన్నదానిని నిర్వచించగలమా? అందం చూసే కన్నుల్లో ఉంటుంది అంటారే!! అందంగా ఉండడం తప్పూ కాదు ఒప్పూ కాదు. ఆరోగ్యంగా సహజంగా కనిపించేంతవరకూ ఏదైనా అందమే!!
ఈ జాఢ్యం ఇప్పుడు పురుషులకీ వ్యాపిస్తోంది....fair and handsome అంటూ ఎన్నో ఉత్పాదకాలు మొదలయ్యాయి.
చాలా బావుంది. నాకు సౌమ్య కామెంట్ కూడా చాలా నచ్చింది.
I have another take. స్త్రీ పురుషులు అందం, ఆకర్షణల చట్రం లోంచీ బయటపడడం కష్టం. ఈ పోటీ ప్రపంచం లో నువ్వెంత అందంగా ఉన్నావనేది కాకుండా, నువ్వెంత కుదురుగా ఉన్నావో కూడా అంతే ముఖ్యం. అయితే అందం, సౌందర్యోత్పత్తుల వ్యాపారం కూడా వ్యాపారమే. వాళ్ళ వ్యూహాలు, మోడళ్ళ దోపిడీ, ఇవన్నీ కూడా ఓ లోకం అనుకోవాలేమో. ఇది సెక్స్, ట్రాఫికింగ్ బిజినెస్సుల కన్నా ఎన్నో రెట్లు మంచిది. ప్రతీ వృత్తి లోనూ కొన్ని ఇబ్బందులూ, చాలెంజులూ ఉంటాయి. వాటిలో భాగం గానే పై ఇబ్బందులన్నీ వస్తాయి. ఉరి తీసే తలారిది కూడా ఒక వృత్తే. ప్రతి దాన్లో తప్పులు వెతికితే మాత్రం తప్పు. మోడళ్ళూ, సినీ తారలూ స్త్రీలుగా ఎంతో దోపిడీకి, ఒత్తిడి కీ గురవుతారన్నది నిజమే. వాట్ని అధిగమించడం చాలెంజ్ లా స్వీకరించాలి. అంతే. ఇబ్బందులు పడతాం కదా మానేస్తే ఎలా ?Business is business.
Sir, The 'Fairness' Business is not so immoral. It depends on how much u take from it. There are also hundreds of shampoos, hair oils, that promise to stop hairfall..etc. So many soaps etc. Its just like another of such business. Sorry- for disagreeing to agree with u. But its one opinion.
వేణు గారూ
లోకో భిన్న కామెంటః అన్నారు సర్వజ్ఞులు !!
మరేస్మండీ అన్నారు సర్వరజ్ఞులు !!!
" రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే ...
కేశమాలి నీ తోడు లేడులే .."
అని పాడుకోవాలంటే - దానికి బోలెడంత అనుభవం , కాసింత వేటూరి , గోరంత కీరవాణి వగైరా దినుసులు జత పడాలి .
సత్తువుడిగాక కానీ తత్త్వం బోధ పడదని కూడా ఆర్యోక్తి
మరంచాత --
సారం తెలిసేదాకా వ్యాపారం బేఫర్వా !! మీ పోస్ట్ చాలా 'అందంగా' ఉందిస్మండీ :)
చర్చ సీరియస్ గా ఉంది .. అని కొంచెం కామెడి ట్రాక్ పెట్టాను వేణు గారూ. మీ పోస్ట్ చాలా ఆలోచనలు కలిగిస్తోంది . బాగుంది !!
@ Narayanaswamy S.: మీ స్పందనకు థాంక్యూ.
@ ఆ.సౌమ్య : ‘ఆడది అంటే అందం తప్ప ఇంకేమీ లేదా? అనే మీ వ్యాఖ్య ఎంతో అర్థవంతమైనదీ, విలువైనదీ.
@ Sujata : మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థాంక్యూ.
‘ఫెయిర్ నెస్’ బిజినెస్ మరో వ్యాపారం మాత్రమే అయితే దీనిమీద ప్రత్యేక విమర్శ అవసరం లేదు. కానీ అది వాస్తవమేనా? మూడో ప్రపంచదేశాల యువతులకు అందాల కిరీటాల ఎర చూపి, ఆకట్టుకుని, తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి చేసే కుట్ర సాధారణ వ్యాపార స్థాయిని మించినది. ఇది పైకి కనపడదు. అందుకనే ఇది ఖండనార్హం.
@ రామ్ : మీరు పెట్టిన కామెడీ ట్రాక్ ‘అందం’గా ఉంది. ‘సారం తెలిసేదాకా వ్యాపారం బేఫర్వా’ అనే మీ వ్యాఖ్య వాస్తవం.
వేణుగారు! 'ఈజిప్షియన్ మమ్మీ'. it is too good. నలుపు చీకటికి తెలుపు వెలుతురుకి ప్రతీకగా భావించటం మనిషి psyche లోకి ఇంకిపోయిందేమో అనిపిస్తుంది. సౌందర్య బేహారులు 'యేనకేనచిత్ ఉపాయేన' తెల్ల్లబోయే మందులు అమ్ముకోవాలి మరి .
తోలు తెల్లబడాలని అనుకుంటారుకానీ జుట్టు తెల్లబడితే మాత్రం ఒప్పుకోరు. అదంతే.
తెలుగు అభిమాని గారూ, మీ స్పందనకు థాంక్యూ.
>> తోలు తెల్లబడాలని అనుకుంటారుకానీ జుట్టు తెల్లబడితే మాత్రం ఒప్పుకోరు. అదంతే. >>
బాగా చెప్పారు :)
వేణూ!కనబడని హింసపై కవితాస్త్రాలను సంధించిన విమల నిర్మలగార్ల కవితలపై మీ బ్లాగులో విశ్లేషించిన తీరు చాలా బాగుంది!ఏది సౌందర్యమంటే? అనే ప్రశ్న నుంచి ముందుకు కదలడం కష్టం!ఆరోగ్యం ఆత్మవిశ్వాసం ప్రేమ దయ మానవీయ విలువలు సత్యం త్యాగం ఇవన్నీ కనీసం కొన్నీ ఉన్న వాళ్ళు అందమైన వాళ్ళు!మరో కోణంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకు అందమైన వాళ్ళు!తెల్ల తోలు గురించీ 0సైజుగురించి మితిమీరిన ప్రయత్నం వల్ల చనిపోయిన ఒక మోడల్ గురించి అశ్రుజల రమణారెడ్డి అనే కవి చక్కని కవిత రాశాడు నేను మీకు పంపుతాను! విశ్వ సుందరులు ఈ ఫ్యాషన్ షోలు ప్రపంచీకరణ కొనితెచ్చిన ప్ర మాదకర విష సంస్కృతి!చక్కటి బ్లాగు అందిచ్చినందుకు ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి