సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

15, జనవరి 2014, బుధవారం

జనం గుండెల్లో మోగిన ‘గుడిగంటలు’!


యాబై సంవత్సరాల  క్రితం సంక్రాంతికి విడుదలైన  ‘గుడి గంటలు’ సినిమాను నేను ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చూశాను.

కొద్ది రోజుల క్రితం మళ్ళీ చూసినపుడు  ఆ రోజుల్లో కలిగినంత ఉత్కంఠ కలగలేదు.

అప్పుడు చూసింది  సినిమాహాల్లో...   కథ ఏమీ తెలియని  ప్రేక్షకుడిగా!

మరి ఇప్పుడో? 
పర్సనల్ కంప్యూటర్ తెరపై  వీసీడీ.  ప్రేక్షక స్థానం నుంచి కొంత పరిశీలక స్థానంలోకి మారానేమో.


కథ, దానిలోని మలుపులూ  ఇప్పటికే తెలుసు.  కాబట్టి ఆ స్థాయి ఆనందం కలగలేదనుకుంటాను.  

అసలు అంతకంటే మించిన మరో ఉత్పాతం...
ఈ సినిమాకు ఆధారమైన తమిళ సినిమాను కూడా ‘యూట్యూబ్ ’లో  చాలావరకూ  చూశాను.  బాణీల సంగతి ఏమిటో చూద్దామని  కొన్ని పాటలూ చూశాను.

‘ఫ్రేమ్ టు ఫ్రేమ్’  అన్నట్టుగా దర్శకుడు ఒరిజినల్ ని తెలుగులోకి  దించేశాడు.  (కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయనుకోండీ...)

కెమెరా యాంగిల్స్ కూడా ఏమీ మారకుండా జాగ్రత్తపడ్డారు.

అక్కడ శివాజీ గణేశన్- ఇక్కడ ఎన్టీఆర్ అచ్చు గుద్దినట్టు...  ఒకే రకంగా ... అవే  భావోద్వేగాలతో  నటించేస్తుంటే ...

ఘంటసాల గొప్ప ట్యూన్లనుకున్నవి-  ఒరిజినల్ లో విశ్వనాథన్, రామ్మూర్తిలవి అని తెలుస్తుంటే...

‘గుడిగంటలు’ సినిమాపై  ఇన్నేళ్ళుగా పెంచుకునివున్న ‘గొప్ప’అభిప్రాయం కొంత తగ్గిపోయింది!  కొంత నీరసమూ వచ్చేసింది.

అయినా శివాజీ గణేశన్ కంటే మన ఎన్టీఆర్ నటనే నాకు నచ్చింది. కొన్ని సీన్లలో ఎన్టీఆరే బాగా చేశాడు!  

* * * 
చిరకాలం మీ హృదయాలలో మారుమ్రోగే...   ( 50 సంవత్సరాల నాటి పోస్టర్ )
 ఏమిటీ సినిమా?

పోతబోసిన మంచితనం; పొందికైన ఆలోచనలూ, వేలెత్తి చూపలేని నడత- ఇదీ సాధారణంగా కథానాయకులను చూపించే తీరు. ఈ మూసకు విరుద్ధంగా స్వార్థం, అసూయ, కరుణ, పశ్చాత్తాపాల మధ్య నలిగిపోయిన సజీవపాత్రలో తీసిన సినిమా ‘గుడిగంటలు.

వి. మధుసూదనరావు దర్శకుడు.

మనోవిశ్లేషణకు పెద్దపీట వేసిన విలక్షణ చిత్రంగా ఇది  ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.


గంట ఆకారంలో రూపొందించిన సినిమా టైటిల్
ఒకనాడు రక్తమిచ్చి కాపాడుకున్న స్నేహితుణ్ణి అపార్థంతో తాను  చంపబోయాడు. 
కానీ-  
తనను హతమార్చబోయిన వ్యక్తిని క్షమించి వదిలేస్తే, అతడే చివరికి తన ప్రాణాలు కాపాడాడు!

కథానాయకుడి జీవితంలోని ఇలాంటి సంఘటనల వైచిత్రి ‘గుడిగంటలు’ సినిమాను ఉత్కంఠభరితం చేసింది.

శివాజీగణేశన్, బి. సరోజాదేవిలతో తమిళంలో తీసిన ‘ఆలయమణి’ (1962) ఆధారంగా రాజలక్ష్మీ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీలు ఈ చిత్రం నిర్మించారు.

‘క్రోధ లోభ మోహాలు పడగలెత్తి- బుసలు కొట్టి- విషం కక్కి’న వైవిధ్యమైన పాత్రను ఎన్. టి. రామారావు గొప్పగా పోషించారు.

దీంతోపాటు ముళ్లపూడి వెంకటరమణ పదునైన సంభాషణలు, ఘంటసాల వీనులవిందైన సంగీతం, సి. నాగేశ్వరరావు ఛాయాగ్రహణం ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా చేశాయి.

* * *
కథ ఇదీ....

కోటీశ్వరుడైన వాసు (ఎన్టీఆర్) తన ఎస్టేటులో పనిచేసే వ్యక్తి కూతురు కస్తూరి (కృష్ణకుమారి)ని ఇష్టపడతాడు. కానీ ఆమె, తన ప్రాణమిత్రుడు హరి (జగ్గయ్య) ప్రేమించుకుంటున్నారని అతడికి తెలియదు.

కస్తూరి, వాసుల నిశ్చితార్థం జరుగుతుంది. ఓ ప్రమాదంలో వాసు కాళ్లు పడిపోతాయి. అలంకరించుకున్న కస్తూరిని వివశుడై కన్నార్పకుండా చూసిన హరిపై అతడికి అనుమానం మొదలవుతుంది. అది పెనుభూతంగా మారి హరిని చంపటానికి ప్రయత్నిస్తాడు.

నిజం తెలుసుకుని వేదనతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.

హరి, కస్తూరిలను పెళ్లిచేసుకుని సుఖంగా ఉండమని చెప్పి తాను కొండశిఖరం నుంచి సముద్రంలో దూకేస్తాడు. కానీ ఎస్టేట్ వర్కర్ మూలంగా బతుకుతాడు. తనలోని దానవశక్తిని మానవత్వంతో క్షాళన చేసుకుని చివరికి కస్తూరిని పెళ్లాడడంతో కథ సుఖాంతమవుతుంది.

- డబ్బున్నా అపేక్షలకూ ఆప్యాయతలకూ దూరమైన ఏకాకిగా,
- తనలోని మృగస్వభావానికి జడిసి అపరాధ భావనతో కుంగిపోయే నిస్సహాయుడిగా,
- ఓటమిని జీర్ణించుకోలేని ఆవేశపరుడిగా,
- పేదలను ఆదరించే మనసున్నవాడిగా...


విభిన్న ఛాయలున్న పాత్ర ఎన్టీఆర్ ది.

చిన్నప్పటి నేరం వయసుతోపాటే మనసులో పెరిగి పెద్దయితే అది మరచిపోలేని అంతర్మధనాన్ని కరుణరసార్ద్ర పూరితంగా అభినయించారు.

ఉద్వేగాలు ఆపుకోలేని టెన్నిస్ క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా భావుకత, సహనం మిళితమైన చిత్రకారునిగా కూడా మలచడం- ఈ పాత్ర రూపకల్పనలో దర్శక రచయితలు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.

ముళ్ళపూడి  మాటల మెరుపులు

*  ‘మనం చేసిన సేవ వల్ల ఒకరు సుఖంగా, సంతోషంగా ఉంటే అప్పుడు కలిగే ఆత్మతృప్తికీ, ఆనందానికీ హద్దులుండవు’.

*  ‘పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికీ, సంతోషానికీ పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది. ఈనాడు మనసారా మీకు సేవ చేయడం వల్ల కలిగే ఆనందం గాఢమైనది. అది హృదయంలో పుడుతుంది. అక్కడే ఉంటుంది. పెదవుల దాకా రాదు’.తొలి కాంస్య నంది దీనికే...

* రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాదే ప్రారంభించిన నంది పురస్కారాల్లో ఈ చిత్రం కాంస్య నందిని గెలుచుకుంది.

* ఎన్టీఆర్ మామూలుగా సిగరెట్లు కాల్చరు. కానీ ‘గుడిగంటలు’ నాయక పాత్ర నిట్టూర్పుకో సిగరెట్ తాగే వ్యక్తి! అందుకే చిత్రీకరణ సందర్భంగా పాత్రధర్మంగా ఆయన ప్రతిరోజూ  రెండు డబ్బాల సిగరెట్లను కాల్చాల్సివచ్చిందట.

* జగ్గయ్యది సెకండ్ హీరో పాత్ర.. అయినా కథానాయికలతో రెండు పాటలను ఆయనపై చిత్రీకరించారు. ఇప్పుడైతే కథానుగుణంగానైనా ఇలా చేయడానికి హీరోలు ఒప్పుకోరేమో!

* వాసు, హరిలు తమ ప్రేమ గురించి భావోద్వేగాలతో చెప్పుకునే సన్నివేశంలో ‘రెండు పులుల మధ్య లేడి’ పెయింటింగ్ గోడ మీద ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. తమిళ మాతృకలో లేని ‘ఇంప్రొవైజేషన్’ ఇది.

* పతాక సన్నివేశాలు  కేరళ పశ్చిమకోస్తాలోని వర్కెలా దగ్గర తీశారు.

‘అక్కడ సముద్రపు గట్టు- కొండపక్కన అయిదు వందల అడుగుల ఎత్తున- షార్ప్ గా కోసినట్టు ఉండేది. అసురసంధ్య వేళ చూస్తే భయం వేసేది’  అని నాటి జ్ఞాపకాలను రాశారు ముళ్లపూడి వెంకటరమణ.

* ఈ సినిమాలో హరిని ప్రేమించిన సుభద్ర పాత్రధారి వాసంతి (పైన పెట్టిన  పోస్టర్లో కృష్ణకుమారి బొమ్మకు కుడివైపున ఉన్నది ఈమే)  అంతకుముందు ‘మంచి మనసులు’ (1962) లో నటించారు.

24 ఏళ్ల తర్వాత ఆమె(వాసంతి)  ‘మంచి మనసులు’ పేరుతోనే  భానుచందర్, భానుప్రియలతో ఆమె ఓ  సినిమా నిర్మించారు.

ఇళయరాజా స్వరపరిచిన  పాటలు దీనిలో బాగా పాపులర్.

 ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే. వేచాను నీ రాకకై..’, ‘డమరుకము మ్రోగ,  హిమశిఖరమూగ నటరాజు నర్తించెనే...’  గుర్తున్నాయా?

* కథానాయిక తండ్రిగా తమిళంలోనూ, తెలుగులోనూ నాగయ్యే నటించారు.

వినసొంపైన పాటలు
* ‘నీలికన్నుల నీడలలోనా’ (సినారె)  ఏకైక యుగళగీతం.  శ్రావ్యంగా ఉంటుంది.

* ‘నీలోన నన్నే నిలిపేవు నేడే - ఏ శిల్పి కల్పనవో ఏ కవి భావనవో’ (దాశరథి) గీతంలో కాళిదాసు శకుంతల, నండూరి ఎంకి, విశ్వనాథ కిన్నెరసాని, బాపిరాజు శశికళలతో నాయికను పోల్చటం హృద్యంగా ఉంటుంది.  చూడండి, ఈ పాటను!
* చక్కటి లాలిపాట లాటి ‘నీ కనుదోయిని నిద్దురనై మనసున పూచే శాంతినై’ (నార్ల చిరంజీవి) నాకు బాగా ఇష్టం.

*  కథానాయిక తుళ్ళుతూ స్వేచ్ఛగా ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో  ఆడుతూ   పాడే ‘దూరానా నీలి మేఘాలూ.. నాలోనా కొత్త భావాలు’ (ఆరుద్ర)  కూడా పాపులరే.

ఈ రెండు పాటల బాణీలనూ ‘ఆలయమణి’ నుంచే స్వీకరించారు.

రీమేక్ చేసినపుడు  రాజలక్ష్మీ వారు బాణీలు మారిస్తే ప్రేక్షకులు కన్ ఫ్యూజ్ అవుతారని డూండీ గారు సరదాగా జోక్ చేసేవారని  ముళ్ళపూడి రమణ  తన కోతికొమ్మచ్చి సిరీస్ లో రాశారు.

* ‘గుడిగంటలు’  అంటేనే గుర్తొచ్చే పాట-
‘జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరంలో పండిపోయితిరా’ (అనిసెట్టి) .

 ఇది  చిత్రీకరణపరంగా కూడా ఆకట్టుకుంటుంది.  ఈ బాణీ కూడా తమిళ మాతృకలోనిదే (సంగీతం: విశ్వనాథన్-  రామ్మూర్తి).

పశ్చాత్తాపాన్నీ, పరివర్తననూ ప్రతిభావంతంగా పొదిగి  రాసిన ఈ పాట ఘంటసాల గంభీర గళమహిమతో క్లాసిక్ గా నిలిచిపోయింది!

8 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
రవి చెప్పారు...

ఈ సినిమా మీద ఇదివరకు ప్లస్సులో నేనేదో రాసినట్టున్నాను. పాతసినిమాలలో ఇది వరైటీగా ఉన్న సినిమా అండి. నాకు నచ్చింది. రెండు సార్లు వదలకుండా చూశాను టీవీలో. శివాజీ, ఎన్టీవోడు నటనలో రెచ్చిపోవడానికి కావలసినంత స్కోప్ ఉంది దీన్లో. తమిళంలో శివాజీని చూసే ఎన్టీయారు ఇలా తయారయ్యాడని విన్నాను.

వేణు చెప్పారు...

@ సుజాత: >> అంత పశ్చాత్తాపమూ అదీ పడిన వాడు హరికే హీరోయిన్ ని ఇచ్చి అక్షింతలు వేస్తే సరిపోయేదిగా అని!>>

మీ పాయింట్ చదివాక ఈ హీరో స్వభావం గురించి కొంత లోతుగా ఆలోచించాల్సింది ఉందని అర్థమైంది.

అక్షింతలు వేయొచ్చు కానీ ఇందులో ఓ చిక్కుంది. ‘ఆమె నన్ను ఎప్పుడో మరిచిపోయింది, నేను ఆమెను మర్చిపోలేకపోయాను. ఆమె మనసులో నువ్వే ఉన్నావు’ అంటాడు హరి. దీని ప్రకారం ఆమె హరిని పెళ్ళిచేసుకోదల్చుకోలేదని తెలుస్తోంది. కాబట్టి తను జీవించివుంటే వాళ్ళిద్దరికీ పెళ్ళి కాదని హీరో ఆలోచించాడా? ఆ రకమైన అతడి ఆలోచనలు ఏవీ ప్రేక్షకులకు తెలిసేలా చిత్రీకరణ జరగలేదు.

మరో విషయం- ఆమెకు ప్రస్తుతం హరిని చేసుకునే ఉద్దేశం లేదని తెలిశాక; హరి కూడా వారి వివాహానికి అంగీకారంతోనే ఉన్నాడని తెలుస్తున్నపుడు హీరో ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. హాయిగా హీరోయిన్ ని పెళ్ళే చేసుకోవచ్చు.

ఈ ఆత్మహత్యకు పాల్పడటం అనేది తన ప్రవర్తనపై తనకు అమితమైన విరక్తి కలగటం, భయంకరమైన పశ్చాత్తాపం పెల్లుబుకటం వల్ల జరిగివుండాలని అర్థం చేసుకోవాలిక!

వేణు చెప్పారు...

@ రవి : మీరన్నట్టు శివాజీ, ఎన్టీఆర్ తరహా నటులు తమ హై ఓల్టేజీ నటన ప్రదర్శించటానికి వీలైన విషయం ఈ చిత్రంలో ఉంది. ముళ్ళపూడి వెంకట రమణ చెప్పినట్టు ఇది ‘సినీ పరిభాషలో హెవీ డ్రామా’. మొదట శివాజీ, ఆపై ఎన్టీఆర్ సంపూర్ణంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు :)

వేణు చెప్పారు...

@ సుజాత: ఈ సినిమా నచ్చిందా లేదా అనడిగారు కదూ? ఎంతో నచ్చబట్టే ఈ విశేషాలన్నీ రాశాను. అయితే ఈ క్రమంలో తమిళ మాతృక చూడటం వల్ల ఈ సినిమాపై ఇన్నేళ్ళుగా ఉన్న అంచనాలు మాత్రం కొంత తగ్గిపోయాయి!

ముఖ్యంగా ఒరిజినల్ ఫిల్మ్ ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దర్శకుడు మధుసూదనరావు అనుసరించగలరని నేనసలు ఊహించలేదు. కొన్ని పాటల బాణీలను యథాతథంగా ఉంచటంలో మాత్రం ఘంటసాలను తప్పు పట్టటానికి ఏమీ లేదనుకుంటాను. ఇది ఆ నిర్మాతల అభిరుచీ, ఆనవాయితీ. ఈ సంస్థే తీసిన ‘రక్త సంబంధం ’ విషయంలో కూడా ఇదే జరిగింది.

రవి చెప్పారు...

సంపూర్ణంగా మాత్రమే కాదు, కావలసిన దానికన్నా ఎక్కువగానే సద్వినియోగం చేశారు.

మీరన్నట్టు తెలుగు సినిమా వరకూ ఓకేనండి. తమిళంలో శివాజీ నటన ఆకాశమే హద్దుగా సాగుతుంది.

ముఖ్యంగా నాకు "జన్మమెత్తితిరా" పాట చాలా ఇష్టం. అందులో రెకార్డింగ్. ఎలా చేశారో తెలీదు కానీ సముద్రం ఒడ్డున ఒక అభాగ్యుడు పశ్చాత్తాపంతో సముద్రానికి ఎలుగెత్తి మొరపెట్టుకున్నట్టుగా ఆ పాట ’టోన్’ లో అ(వి)నిపిస్తుంది. అతని ఆక్రోశానికి సముద్రం అలలతో పొంగుతున్నట్టు చిత్రీకరణ.

శివాజీ "శట్టి సుట్టదడా" లో కాస్త గబ్బులేపాడు. అతని టోన్ లోనూ పాటలోనూ ఆక్రోశం కన్నా ఫిలాసఫీ ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా "మీది మనదిల్ మిరిహం ఇరింది ఆటివైత్తదడా" ...లో ఆటివైత్తదడా అన్నప్పుడు చేతులను ఆడించడం బాగా నవ్వు తెప్పించింది. ఆ పాటను అతని రూపాయ పావలా నటన డైల్యూట్ చేసిందని నాకనిపించింది. ఎన్టీవోడు పర్లేదు. కానీ ఇంకా కొంచెం దర్శకుడు కంట్రోల్ చేసుండచ్చు.

తెలుగు అభిమాని చెప్పారు...

వేణు గారు. పాటలో ముఖ్యంగా అడివి బాపిరాజు శశికళ పోలిక తేవటం నచ్చింది. ఘంటసాల గారికి స్వేచ్చనిచ్చిఉంటే ఇంకా మంచి బాణీలు కట్టి ఉండేవారని నాకు అనిపిస్తుంది. శివాజీ is a great actor but tends to go overboard. కొంచెం విపరీతంగా నటిస్తేకానీ అరవంలో పండదు. ఒక విభిన్నచిత్ర్రాన్ని చక్కగా పునస్సమీక్షించారు

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: ఘంటసాల బాణీలు, శివాజీ గణేశన్ నటన గురించి బాగా చెప్పారు. టపాపై మీ స్పందనకు థాంక్యూ!