సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

1, ఫిబ్రవరి 2014, శనివారం

మూగమనసులూ ... మూడు కన్నీటి పాటలూ

‘మూగమనసులు’  స్టిల్.   కళ్ళతోనే భావాలు పలికిన  సావిత్రి

‘మూగమనసులు’  సినిమా విడుదలై  50 సంవత్సరాలైన  సందర్భంగా నిన్న  ‘ఈనాడు  సినిమా పేజీ’లో ఓ  ఆర్టికల్ రాశాను.

దాన్నిక్కడ  చూడొచ్చు...    
 
  
కన్నీటి  గీతాలు 
ఈ సినిమాను ఇన్నేళ్ళుగా జనం గుర్తుంచుకోవటానికి  ప్రధాన  కారణం -  వీనులవిందైన సంగీతం, ఆలోచింపజేసే భావాలున్న  సాహిత్యం...

ఆచార్య  ఆత్రేయ దీనిలో  ఏడు పాటలు రాశారు. 

‘నా పాట నీ నోట పలకాల సిలకా’  పాటలో  ‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి  రాసి;   మరో మూడు  పాటలను మాత్రం  కన్నీటితో తడిపారు.
 
ఈ మూడు పాటల్లోని భావాలూ,  వ్యాఖ్యానాలూ   సినిమా  పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి.   అందరికీ అన్వయించే  స్థాయిలో   తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం  కోట్ చేసే పంక్తులుగా మారాయి.    

‘ముద్దబంతి పూవులో  మూగకళ్ళ వూసులో ’ పాటలో  -

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా

మనసును   పైపైన కాకుండా లోతుగా  అర్థం చేసుకోవాలనే సూచన..

‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో-

కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి

కలల కనటం , అనుకున్నది జరగకపోతే  కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం.   

ఇక  ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో -

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు

ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ  ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని  కూడా చెప్పటం .

* * *
పూర్వజన్మా... పునర్జన్మా 
పునర్జన్మలుంటాయనే అశాస్త్రీయమైన నమ్మకం మీద ఆధారపడి తీసిన చిత్రం  ‘మూగమనసులు’.    

పూర్వజన్మ జ్ఞాపకాలతో  గత జన్మలోని వారిని గుర్తుపట్టారంటూ దశాబ్దాల క్రితం  పత్రికల్లో  వార్తలు విరివిగా వచ్చేవి.  ఇలాంటి సంఘటనలు పేపర్లలో చదివినపుడు ‘నిజమే సుమా’ అనిపించేట్టుగా ఆ కథనాల అల్లిక ఉండేది.

‘మూగమనసులు’ పాటల పుస్తకంలో  మొదటి పేజీ  చూడండి-


ఇలాంటివి  పొక్కినపుడు ఆ సంఘటనలు  జరిగిన ప్రదేశాలకు  నాస్తిక ప్రముఖుడూ, శాస్త్రవేత్తా డా. అబ్రహాం కోవూర్ స్వయంగా వెళ్ళి,  వారిని పరిశీలించి  అవి కల్పనలనీ/  మానసిక భ్రాంతులనీ శాస్త్రీయంగా రుజువు చేశారు.

ఆయన వ్యాసం  ‘పునర్జన్మ ఉన్నదా?’ అనేది  ప్రసిద్ధం.

సంచలనాత్మకమైన వదంతులను వ్యాప్తి చేయటంలో  ఆసక్తి చూపే పత్రికలు-  అవి అబద్ధాలని తెలిశాక నిజాలను ప్రజలకు తెలియజెప్పాలనే బాధ్యతా,  పట్టింపుతో  సాధారణంగా ఉండవు కదా!

యాబై సంవత్సరాల క్రితం ఇలాంటి  వార్తలే చదివి ,  వాటి ప్రభావంతో దర్శకుడు ఆదుర్తి  తయారుచేసుకున్న పాయింటు ‘మూగమనసులు’ సినిమాగా మారింది.

పునర్జన్మలున్నాయని రుజువు చేయటం కోసం కాకుండా, అలాంటిది జరిగితే ఏమవుతుందనే  ఊహతో  తీయటం వల్ల ‘మూగమనసులు’  మూఢనమ్మకాలకు పెద్దగా ఊతమివ్వలేదని అనిపిస్తుంది. 

కానీ మధురమైన  సంగీతంతో,  ఆకట్టుకునే సహజ సన్నివేశాలతో  అభిరుచి గల దర్శకుడు  దీన్ని  తీశారు.  

సబ్జెక్టు మూఢనమ్మకాలపై ఆధారపడినదీ-  
దాని  కథన పద్ధతి  కళాత్మక విలువలున్నదీ  అన్నమాట.  

ఈ సినిమా ‘బాగుంద’ని మెచ్చుకోవటమంటే  స్పష్టంగా రెండో అంశం గురించి మాత్రమే!   

‘మూగమనసులు’ (1964)  వచ్చిన 12 సంవత్సరాలకు  ‘దేవుడు చేసిన బొమ్మలు’ (1976) అనే చిత్రం వచ్చింది.  మురళీమోహన్, జయసుధలు నటించారు. సత్యం సంగీతంలో  ‘నిను వినా నాకెవ్వరూ’ అనే శ్రావ్యమైన పాట ఈ సినిమాలోదే!

ఇది కూడా పునర్జన్మల ఆధారంగా  తీసిందే!  

* * *
మరపురాని దృశ్యం
మళ్ళీ ‘మూగమనసుల’ దగ్గరకు  వద్దాం.

‘పాడుతా తీయగా..’ పాట చిత్రీకరణలో ఓ  దృశ్యం  ఉంది. 

భర్తను కోల్పోయి, పుట్టింటికి చేరి  మంచమ్మీద పడుకుని  కుమిలిపోయే సావిత్రి.  ఆ ఇంటి బయట గుమ్మం ముందు కూర్చుని ఆమెను పాటతో ఊరడిస్తూ విషాదభరితంగా నాగేశ్వరరావు.

 బయటున్న నాగేశ్వరరావూ,  ఇంట్లో  మంచమ్మీదున్న  సావిత్రీ  ఒకేసారి  కనిపించే  కోణం చూడండి-  అబ్బురంగా అనిపించటం లేదూ?!

చీఫ్ కామెరామన్ పి.ఎల్. రాయ్ ప్రతిభావంతంగా  తీసిన ఈ  దృశ్యం  ప్రేక్షకుల మదిలో ముద్రపడిపోయేలా ఉంటుంది.  పాట ముగిసిపోయినా  వెంటాడుతుంది.


ఈ కోణం చిత్రకారుడు  ‘బాపు’ను కూడా ఆకట్టుకుంది. 

 ‘కోతికొమ్మచ్చి’ సిరీస్ లో  ఈ పాట గురించి ముళ్ళపూడి వెంకట రమణ ప్రస్తావించినపుడు -

బాపు  ఫ్రీ హ్యాండుతో  అలా గీశారు.


‘కొస’ మెరుపు
ఈ సినిమాలో  కొసరాజు -  ‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’  పాట రాశారు.

నూజివీడు లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో  ఈ పాటలో చివరిలో ఉండే ఓ విశేషాన్ని ఎమ్వీయల్ గారు క్లాసులో చెప్పుకొచ్చారు.

‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే
పళ్ళు పదారు రాలునులే
పళ్ళు పదారు రాలునులే’


పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? పదారు (పదహారు) అని ఎందుకు రాశారు?  ‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా?

కొసరాజు  అలా అర్థమేమీ లేకుండా  రాస్తారా?!

మరి దీనిలో అంతరార్థమేంటి?

పురాణాల్లో  శివుడు అర్ధ నారీశ్వరుడు కదా?  నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే.  కాబట్టి  మిగిలిన  పదహారు  పళ్ళ సంగతే  ప్రస్తావించి,  అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట! 

ఎమ్వీయల్ గారు  వివరించేవరకూ ఈ విశేషం మాకు అర్థం కాలేదు. 

విశేషం సంగతి  తర్వాత- ‘ పళ్ళు పదారు’ అని యాంత్రికంగా పాడుకోవటమే కానీ,    ‘అందరికీ ఉండేవి ముప్పై రెండు  పళ్ళు  కదా?  పదహారని రాశారేమిటీ?’ అనే సందేహమే  రాలేదు, అప్పటివరకూ! 

11 కామెంట్‌లు:

anu చెప్పారు...

పత్రికలోని స్థల కొరతను ఇక్కడ భర్తీ చేసినట్టున్నారు..!

అజ్ఞాత చెప్పారు...


1. "పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా? నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి, అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!" అని రాశారు మీరు.

హేవిటీ? జమున రాలగొడ్తానని పాడింది శివుడి పళ్ళా? నాగేశ్వర్రావు పళ్ళు కాదూ? "నెత్తి మీద వున్న గంగ కూడా శివుడి పెళ్ళామని" అన్నది నాగేశ్వర్రావు కదా? మరి ఆ పదారు పళ్ళూ, నాగేశ్వర్రావువని అనుకున్నాను. కావా? జమున వెళ్ళి శివుడి సగం పళ్ళు రాల గొడుతుందా? అర్థం, పర్థం లేకుండా వుందీ ఈ వివరణ. సాధారణంగా, ఎవరన్నా మూతి మీద కొట్టినప్పుడు, పైవీ, కిందవీ కలిపి ముందర పదహారు పళ్ళే (ఎవరు కూర్చుని ప్రయోగాలు చేసి, కనిపెట్టేరో గానీ), రాలతాయనుకుంటాను. అందుకే ఆ పదం అనుకుంటాను. శివుడూ, పార్వతీ పళ్ళని పంచుకుంటారన్న వివరణ ఎక్కడా వినలేదు ఇంత వరకూ.

2. సుశీల గొంతులోని మాధుర్యం ఎంత బాగున్నా, ఆవిడ సంగీత జ్ఞానం ఎంత అద్భుతంగా వున్నా, ఆవిడ గొంతులో కొన్ని ఎమోషన్లు బాగా పలకవు, బాలసుబ్రమణ్యం గొంతులో పలికినట్టు. అదీ గాక, పల్లె యాస కూడా అన్ని చోట్లా పలకలేదు ఆవిడకి పాటల్లో.

3. నాకు ఈ సినిమా మీద ఎన్నో విమర్శలున్నాయి.

ప్రసాద్

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అనూ గారన్నట్లు పత్రికలోని స్థలాభావాన్ని ఇక్కడ భర్తీ చేసినట్లున్నారు.. చాలా బాగుందండీ :-) చివరిలో కొసమెరుపు సూపర్బ్.

కాంత్ చెప్పారు...

ప్రసాద్‌గారు

మీ వ్యాఖ్య సగం మాత్రమే కరెక్ట్. ఇక్కడ పాట పాడేది జమున కాదు - "గౌరి" పాత్ర. అందుచేత గౌరి, నాగేశ్వర్రావు అన్న మాటకి కోపగించుకుని, పళ్ళు రాలగొడతానన్నది నాగేశ్వర్రావువైన అవొచ్చు, శివుడివైనా అవొచ్చు, లేదా గంగ పళ్ళైనా అవొచ్చు.

ఆ.సౌమ్య చెప్పారు...

బాగుంది వ్యాసం. పాటల్లోని ముఖ్యమైన పాదాలు - సినిమా పరిథి దాటి అర్థవంతమైనవి- బాగా వివరించారు. చివరిలో పదారుపళ్ల చమక్కు అదిరింది.

అజ్ఞాత చెప్పారు...

కేకే గారూ,

నటీనటుల పేర్లు ఆ పాత్రలకు సంబంధించే వాడానండీ. "జమున" అంటే, "గౌరి" అనీ, నాగేశ్వర్రావు అంటే, "గోపీ" అనీ నా ఉద్దేశ్యం.

ఇక్కడ గౌరి పాత్ర, తనను తాను "గౌరీ దేవి"గా ("పార్వతీ దేవి"గా) ఊహించుకుంటూ, శివుడి గురించి గొప్పగా ఇష్టపడుతూ, పొగుడుతూ, చాలా భక్తిగా పాడుతుంది. "నెత్తిన ఎవరినొ పెట్టుకునీ, నిత్యం దానినె కొలుచునటా, అదియే ఆతని ఆలి అటా, కోతలు ఎందుకు కోస్తావే?" అని గోపీ పాత్ర పాడుతాడు.

(ఇక్కడ, శివుడిని "అతను" అనీ, గంగని "అది" అనీ అన్నాడు కవి. ఘోరం కదా?)

దానికి సమాధానంగా, గౌరి పాత్ర (తనను పార్వతిగా వూహించుకునే పాత్ర), "సగం దేహమై నేనుంటే, అది పెళ్ళామంటే చెల్లదులే, పళ్ళు పదారూ రాలునులే" అని గరి పాత్ర పాడుతుంది. శివుడంటే ఎంతో భక్తీ, అభిమానమూ కాబట్టి, తనను తాను గౌరీ దేవితో పోల్చులునే గౌరి పాత్ర, ఏ పరిస్థితుల్లోనూ, శివుడి పళ్ళు రాలగొడతానని అనదు. అది ముఖ్యంగా గోపీ పాత్రకే వర్తిస్తుంది. అయితే, గియితే, మీరన్నట్టు, గంగకి కూడా వర్తిస్తుంది. పురాణాల్లో, సవతుల మీదే వ్యతిరేకత పెంచుకున్నారు గానీ, ఆ సవతులను తెచ్చిన భర్తల మీద వ్యతిరేకత పెంచుకోలేదు ఆ స్త్రీ పాత్రలు. ఈ కాలంలో కూడా కొంత మంది స్త్రీలు అలాగే వున్నారు లెండి.

చెప్పొచ్చేదేమంటే, ఆ మాటలు శివుడిని ఉద్దేశించినవి కాదని నా అభిప్రాయం. ఆ పళ్ళు నాగేశ్వర్రావువి (గోపీవి) అయినా కావాలి, లేదా గంగవి అయినా కావాలి.

మీ ఆలోచనా విధానం బాగుంది. కొన్ని రోజుల కిందట, ఈ సినిమా గురించి, వేణూ గారికి కొన్ని అభిప్రాయాలు రాశాను. అవి ఇక్కడ కాపీ చేస్తున్నారు. మీరేమనుకుంటారో చెప్పండి, వీలైతే.

"మూగ ప్రేమని వ్యక్తం చెయ్యలేక, సావిత్రి, పద్మనాభాన్ని పెళ్ళి చేసుకుంటుంది. కొన్నాళ్ళకి ఆ పద్మనాభం కాస్తా మరణిస్తాడు. పుట్టింటికి చేరుతుంది. నాగేశ్వర్రావు వచ్చి, "పాడుతా చల్లగా" పాట పాడుతాడు. అప్పుడు, సావిత్రి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. పద్మనాభం మీద వున్నది సర్దుబాటుతనమేగా? మరి అతను మరణించాడని అంత కుళ్ళి కుళ్ళి ఏడవడం ఎందుకూ? సరే, ఏదో భర్త పోయాడనీ, నాగేశ్వర్రావు మీద ఏదో మూగ ప్రేమ వుందనీ, ఒకటే అయోమయంతో బాగా ఏడిచిందనుకుందాం. అది జరిగిన కొన్ని రోజులకే, వాళ్ళిద్దరూ పడవలో పారిపోతారు, సుడిగుండంలో చిక్కుకుని మరణించి, మళ్ళీ పుట్టడానికి. అంటే, భర్త పోయాక కూడా ఆ వ్యక్తం చెయ్యలేని ప్రేమ, ఆ మనిషితో పారిపోవడానికి ధైర్యం ఇచ్చేంత వుందనే కదా? అప్పుడు భర్త పోయాడని ఏడ్చిన ఆ గొప్ప ఏడుపుకి అర్థం ఏముంది? దీనర్థం, సావిత్రిని, భర్త పోయాడని సంతోషించమని కాదు. అంత కుళ్ళి కుళ్ళి ఏడవక్కర్లేదని అర్థం.

"వెలుగు నీడలు" సినిమాలో, నాగేశ్వర్రావు క్షయ రోగంతో చనిపోతాడని, బలవంతంగా జగ్గయ్యని పెళ్ళి చేసుకుంటుంది. ఆ నాగేశ్వర్రావు కాస్తా శుభ్రంగా బతుకుతాడు. (సావిత్రిని వదిలించుకోవాలని నాగేశ్వర్రావు అలా నాటకం ఆడాడేమో! "ప్రతీ సినిమాలోనూ సావిత్రినే పెళ్ళి చేసుకోవాలా, ఒక్క సినిమాలో కూడా గిరిజ నయినా పెళ్ళి చూసుకోకూడదా?" అని నాగేశ్వర్రావుకి పంతం కాబోలు! :-) ). ఆ తర్వాత కధ ప్రకారం జగ్గయ్య (ఇతను డాక్టరనుకుంటా) కాస్తా మరణిస్తాడు, కాల్‌షీట్లు అయిపోయాయంటూ. అప్పుట్నించీ, సావిత్రి మరీ అంత కుళ్ళి, కుళ్ళి ఏడవదు. తొందరగానే తేరుకుంటుంది, నాగేశ్వర్రావు మీద పవిత్ర ప్రేమతో.

"మూగ మనసులు" సినిమాలో, జమున, నాగభూషణానికి లొంగి పోవడానికి నిశ్చయించుకుంటుంది. ఎందుకూ? నాగేశ్వర్రావునీ, సావిత్రినీ (పడవలో పారిపోతున్న వాళ్ళని) తుపాకీతో కాల్చకుండా వుండటానికి. అప్పుడు కేట్లబారు బురదలోకి తొక్కేస్తుంది. నాగభూషణం దగ్గరకి లాక్కుంటాడు. అప్పుడే పెద్ద సుడిగుండంలో చిక్కుకుని, నాగేశ్వర్రావూ, సావిత్రీ మరణిస్తారు. ఒడ్డు నించీ వీళ్ళకి కనబడుతుంది కదా? ఆ తర్వాత కూడా, జమున ఎందుకు లొంగి పోయిందీ నాగభూషణానికీ? ఈవిడేమన్నా సత్య హరిశ్చంద్రుడి చెల్లెలా? "గోదావరి ఒడ్డున మాటిచ్చాను కదా, నాగేశ్వర్రావూ, సావిత్రీ చనిపోయినా సరే, లొంగి తీరాలీ" అని అనుకోవడానికీ? "పోరా వెధవా!" అని వాణ్ణి వదిలించుకోవాలి కదా? వాళ్ళేదో పడవలో పారిపోయి, ఎక్కడో బతికుంటే, కనీసం కొంచెం అన్నా అర్థం వుండేది, ఏదో చేశాడని. ఆ వెధవని కాల్చకుండా ఆపడానికి అబద్ధం ఆడి, పడవ దూరం అయిపోయాక, "చీ" అనొచ్చుగా? అప్పుడు జమున పాత్ర, జనానికి ఇష్టం లేనిది అయిపోతుందా? "అదేంటమ్మా? మాట ఇచ్చాక, కేట్లబారు బురదలో తొక్కాక, జమున నాగభూషణనికి లొంగక పోతే ఎలాగమ్మా?" అని ప్రజలు అనుకుని, సినిమా చూడరనా? దుర్మార్గుడికి ఇచ్చిన మాట మీద నిలబడ్డం! ఇలాగే చెత్త విషయాలు నేర్చుకుంటారు ప్రజలు. అసలు, నాగభూషణం ఆ రోజుకి, జమునని లొంగ దీసుకుని, ఆ మర్నాడు, సావిత్రీ వాళ్ళ ఊరెళ్ళి, అప్పుడు వాళ్ళిద్దర్నీ కాలిస్తే, ఈ జమున ఏంచేసేదో! "ఇదేం మర్యాదగా లేదు" అని ఓ సుశీల పాట పాడుకునేదా? "

ప్రసాద్

వేణు చెప్పారు...

@ anu
@ Prasad Jonnalagadda
@ వేణూ శ్రీకాంత్
@ కేకే
@ ఆ. సౌమ్య
ఈ పోస్టుపై స్పందించిన మీ అందరికీ థాంక్స్ !

వేణు చెప్పారు...

పల్లెటూరిలో పాడుకునే- గౌరమ్మను ఆట పట్టించే ఈ జానపద గీతంలోని గౌరికీ, జమున పోషించిన ‘గౌరికీ ఏమైనా పోలిక ఉందా? ‘మూగ మనసులు’లో యథాలాపంగానే ఈ పాట పెట్టారా?

శివుడి భార్యగా గంగను గౌరి సహించలేదు. అలాగే ఈ మూగమనసులు కథలో రాధతో గోపీ మానసిక సాన్నిహిత్యాన్ని గౌరి సహించలేదు. అందుకే వదంతులకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తుంది. ఈ పోలిక ఒక్కటి మాత్రమే ఉందనుకోవాలి.

* * *

గౌరి పగలగొడతానన్న పళ్ళు ఎవరివి? అని కదా చర్చ!

‘నెత్తిన ఎవరినొ ఎత్తుకొనీ నిత్తెం దానినె కొలుసునట
అదియే ఆతని ఆలియట, కోతలు ఎందుకు కోస్తావే’

దీనికి గౌరి చెప్పిన సమాధానంలో పళ్ళు రాలటం ఎవరికన్నది స్పష్టంగా లేదు.

దాన్ని మామయ్యకూ, గంగకూ మాత్రమే కాదు. శివుడికి కూడా అన్వయించుకోవచ్చని నా ఉద్దేశం.

నిత్యం కొలుస్తాడట, ఆలియట అనే ‘అట’లను బట్టి అది జనాభిప్రాయమే కానీ, ‘మామయ్య’ స్వీయాభిప్రాయం కాదనీ తెలుస్తూనే ఉంది. ఇలాంటపుడు ఆ మాటలను మోసుకొచ్చి, ఆటపట్టించిన మాత్రానికే మామయ్యని పళ్ళు రాలగొడతానని అనక్కర్లేదు.

అయితే గియితే గంగ పళ్ళు రాలగొడతాననొచ్చు.
గంగా గౌరీ సంవాదంలో కూడా ఈ పళ్ళు రాలగొట్టే వ్యవహారం ఉంది మరి!

‘‘శివునికి చిన్నాలె
నీకు చెల్లెలను
కొట్టరా నా సవతి
పళ్ళన్ని రాల
అక్కరో నీ హస్తమున
కొట్టిన్న పళ్లు
కూర్చుండి యేరిస్తు’’

‘గంగే నా పెళ్ళాం’ అని అంటే శివుడికీ ఆ సత్కారం ఉంటుందనే ధ్వని లేకపోలేదు. ఇది గమనించదగ్గ విశేషం.

ఆ రకంగా ఆలోచిస్తే అర్థనారీశ్వర- పదారు పళ్ళ అన్వయం ఒక చమక్కుగా ఊహించటానికి వీలైందనుకుంటాను.

శివుడూ, పార్వతీ పళ్ళని పంచుకుంటారని ప్రత్యేకంగా ఎక్కడా రాయకపోయినా సగం దేహం గురించిన వర్ణనలు మనుచరిత్ర లాంటి కావ్యాల్లో ఉన్నాయి కదా! మొహం సగం కాబట్టి పళ్ళనూ పంచుకున్నట్టు అవ్వదా?

నిత్యం గంగను కొలుస్తుంటే సగం దేహమైన గౌరికి తెలియకుండా ఎలా ఉంటుందీ?

ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి. కానీ అర్థనారీశ్వరం అనేదే కల్పన (myth). దానిలో వాస్తవాలను చర్చించటం సరైనది కాదు. కాబట్టి ఇదో ఊహగా, చమత్కారంగా మాత్రమే తీసుకోవాలి.

రామ్ చెప్పారు...

వేణు గారూ
మూగ మనసులు పైన మీ పోస్ట్ బాగుంది . నాకు బాగా నచ్చింది :

" బయటున్న నాగేశ్వరరావూ, ఇంట్లో మంచమ్మీదున్న సావిత్రీ ఒకేసారి కనిపించే కోణం చూడండి- అబ్బురంగా అనిపించటం లేదూ?!

ఈ కోణం చిత్రకారుడు ‘బాపు’ను కూడా ఆకట్టుకుంది.
‘కోతికొమ్మచ్చి’ సిరీస్ లో ఈ పాట గురించి ముళ్ళపూడి వెంకట రమణ ప్రస్తావించినపుడు - బాపు ఫ్రీ హ్యాండుతో అలా గీశారు."


ఏ పోస్ట్ రాసినా , మీలోని పరిశోధకుడు - మన చట్టం లాగా - తన పని తాను చేసుకుంటూ పోతాడు :)

గంగా గౌరీ సంవాదం గురించీ మీరు ఇచ్చిన వివరణ కూడా బాగుంది

ామ్

GKK చెప్పారు...

వేణు గారు! post చాలా బాగుంది.

"ఏ పోస్ట్ రాసినా , మీలోని పరిశోధకుడు - మన చట్టం లాగా - తన పని తాను చేసుకుంటూ పోతాడు " totally agree with రాము గారు.

నాగేశ్వరరావు సావిత్రి ఒకే frame లో ఉన్న దృశ్యం చాలా బాగుంది. the contrast in lighting is very appealing.
కొస మెరుపు is too good.

"ఆత్రేయ పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి." absolutely true.

వేణు చెప్పారు...

రామ్ గారూ,
మీ స్పందనకూ, అభినందనకూ థాంక్యూ.

తెలుగు అభిమాని గారూ,
‘పాడుతా తీయగా..’ పాటలోని నాగేశ్వరరావు, సావిత్రి కనపడే ఫ్రేమ్లో లైటింగ్ గురించి మీ పరిశీలన బాగుంది.

టపాపై మీ స్పందనకు థాంక్యూ.