సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జులై 2014, మంగళవారం

ఇరవై ఏళ్ళ తర్వాత కలిసిన ‘మంచి మిత్రులు’!



చిన్నప్పుడు ఒక  తెలుగు నవల చదివాను.  చివరి పేజీలు చినిగిపోయిన ఆ  పుస్తకం  పేరు గుర్తులేదు.  రచయిత పేరు తెలియదు.  అక్క చెల్లెళ్ళు  ప్రధాన పాత్రలు. ధనికురాలైన అక్క  పేద చెల్లెలి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తుంటుంది. చెల్లెలి భర్త  ఏదో వ్యాధితో బాధపడుతుంటాడు. పేరు విభూది బాబు అని గుర్తు.  (ఈ పేరుబట్టే అది బెంగాలీ అనువాద నవల అని ఊహిస్తున్నాను. )  ఈ కథలోని విషాదం వల్లనేమో..... ఇన్నేళ్ళుగా  ఆ నవల గురించి మర్చిపోలేదు. పాత పుస్తకాల షాపులకూ , లైబ్రరీలకూ వెళ్ళినపుడు అప్రయత్నంగానే  దీని  కోసం  వెతుకుతుంటాను!

అది గొప్ప పుస్తకం అని కాదు. కానీ  దొరికితే  మళ్ళీ చదవాలని ఎందుకంత ఆసక్తి?  కథ మొత్తం తెలుస్తుందనే కాదు; ఇన్నేళ్ళ తర్వాత  చదివితే ... పాత జ్ఞాపకాలను తడిమి చూసుకోవచ్చనే కోరిక కూడా కారణమనుకుంటాను.

ప్రాణం లేని పుస్తకాలకే ఇంత శక్తి ఉంటే మరి సజీవమైన మనుషుల సంగతి?

బాగా తెలిసిన వ్యక్తులను ఈ జీవన ప్రయాణంలో పెద్ద విరామం తర్వాత మళ్ళీ చూడటం థ్రిల్ కలుగజేస్తుంది.  

ఓ హెన్రీ  ఓ కథ
ఈ ‘పునర్దర్శనం’లో  మానవాసక్తికరమైన ఎలిమెంట్ ఉంది  కాబట్టే  కొసమెరుపు రచయిత ఓ హెన్రీ  After twenty years  అనే కథానిక రాశాడు.

స్కూలు రోజుల్లో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలో చదివాను. కథ నచ్చింది కానీ,  అప్పుడు రచయిత ఎవరో పట్టించుకోవాలని తెలియదు.  తర్వాతి కాలంలోనే  దీన్ని రాసింది సాక్షాత్తూ ఓ హెన్రీ అని తెలిసింది.

ఇద్దరు స్నేహితులు బతుకు తెరువు కోసం వేర్వేరు చోట్ల బతకాలని  నిశ్చయించుకుని మళ్ళీ  ఇరవై సంవత్సరాల తర్వాత అదే సమయానికి అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ కలుసుకుంటారా? అప్పుడేమవుతుంది?  ఇదీ కథాంశం.

ఊహించని మలుపు ప్రవేశపెట్టి పాఠకులను ఆకట్టుకునే నేర్పును రచయిత దీనిలో ప్రదర్శించాడు.

ముఖ్యంగా నాటకీయతతో పాటు రిటార్టుతో పదునుగా ఉండి, కథ ముగిసినా వెంటాడే సంభాషణలు- 

"Twenty years is a long time, but not long enough to change a man's nose from a Roman to a pug."

"It sometimes changes a good man into a bad one"

ఈ కథ ను ఈ లింకు లో చదవొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆడియో (7.5 నిమిషాలు) కూడా వినొచ్చు.

నూటెనిమిది ఏళ్ళ క్రితం...
1906 లో రాసిన ఈ కథకు అనుసరణలుగా  ఎన్నో భాషల్లో ఎన్నో కథలు వచ్చాయి.

ఓ హెన్రీ కథలు తెలుగులో ఎప్పుడో అనువాదాలుగా వచ్చాయి. శ్రీరాగి అనువాదం చేసిన ఈ  After twenty years తెలుగు అనువాదం ఇక్కడ చదవొచ్చు.


ఎందుకు నచ్చింది?
ఇద్దరు స్నేహితులు ఇరవై సంవత్సరాల తర్వాత... తాము అనుకున్న మాటను సిన్సియర్ గా గుర్తుంచుకుని కలుసుకోవాలనుకోవటం-  బాగా నచ్చిన పాయింట్.  స్నేహం కంటే విధినిర్వహణకే  ప్రాముఖ్యం ఇవ్వటం చిన్నప్పుడు ఎంతో నచ్చేవుంటుంది.

కానీ దీన్నిప్పుడు చదివితే జిమ్మీ ప్రవర్తనలో కొంత లోపం కనిపించి, అతడి వైఖరి అంత గొప్పగా అనిపించటం లేదు!

కథ ప్రకారం- వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి తనను కలుసుకోవటానికి వచ్చిన ‘బాబ్’తో  ‘జిమ్మీ’ ప్లెయిన్ గా వ్యవహరించలేదు. బాబ్ మొహం లైటర్ వెలుగులో చూడకముందే  జిమ్మీకి అతడెవరో అర్థమైవుండాలి.  "I'm just waiting for a friend. It's an appointment made twenty years ago...’  అని స్పష్టంగానే చెప్తాడు బాబ్.  వెంటనే జిమ్మీ సంతోషాన్ని గానీ, ఎక్సైట్ మెంటును గానీ ఏమీ ప్రదర్శించలేదు.

అలా గంభీరంగా ప్రవర్తించటం అతడికి ‘డ్యూటీ’నేర్పిన కిటుకో, సహజంగా వచ్చిన అలవాటో తెలియదు కానీ అది అసహజంగానే ఉందనిపిస్తోంది. 

కథలో చెప్పనంతమాత్రాన  జిమ్మీ మానసిక సంఘర్షణ పడలేదని చెప్పలేం. నోట్ రాసి, వేరే వ్యక్తిని పంపించడంలో అది సూచనప్రాయంగా కనపడుతుంది. తను సకాలానికే ‘సంకేత స్థలానికి’ వచ్చానని మిత్రుడికి తెలియజెప్పిన సిన్సియారిటీని  కూడా అతడు ప్రదర్శించాడు. ‘నోట్ ’ చదివిన బాబ్ చేతులు వణకటం దేనికి సూచన? అరెస్టు భయానికా? మిత్రుడి నిబద్ధతను  తెలుసుకున్నందుకా?  ప్రియమిత్రుడి  ప్రమేయంతో  చిక్కుల్లో పడ్డానే అన్న బాధతోనా?  దేనికైనా కావొచ్చు.

ఇంత చిన్న కథలో  పేజీల కొద్దీ విశ్లేషణ చేయదగ్గ అంశాలున్నాయి. ఏమైనా దీని గురించి ప్రస్తావించే  సందర్భాల్లో  ‘జిమ్మీ ప్రవర్తన సవ్యమైనదా? కాదా? ’ అనే చర్చ జరుగుతూనే ఉంది.

కామిక్ రూపంలో....
ఈ కథను  కామిక్ బొమ్మల రూపంలో కూడా చదవటం ఆసక్తికరంగా ఉంటుంది. మన ఊహల్లో ఉన్నవ్యక్తులూ, పరిసరాలూ కళ్ళముందుకు వస్తారు.

పైకో క్లాసిక్స్ సంస్థ ప్రచురించిన ‘The best of O henry ’ పుస్తకంలో ఈ కథ ఉంది.

దీన్ని  సచిత్రంగా ఇక్కడ చదవొచ్చు.

ఇలస్ట్రేషన్లు వేసినవారు- యాంటన్ కారవానా.



రెండు విరుద్ధ మార్గాలు పట్టిన ఈ స్నేహితుల కథ  చదివాక-  ‘మంచి మిత్రులు’ (1969)  సినిమాలోని ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ పాట గుర్తొస్తుంది!

13 కామెంట్‌లు:

anu చెప్పారు...

మా ఇంటర్ ఇంగ్లిష్ లో చదివిన కథ. అపుడు రచయిత పేరు గుర్తే ఉండుంటుంది. కానీ, ఇప్పుడు లేదు. మీ శీర్షిక చదవగానే కథ గుర్తొచ్చింది.

చిన్నప్పుడే ఈ కథపై నాకొచ్చిన సందేహాలే మీరూ ప్రస్తావించారు. పైగా ఇదే విషయాన్ని నేను మా సర్ ను అడిగినపుడు నీ బుర్రలో ఎందుకమ్మా ఇన్ని అనుమానాలు?! అని అడిగారు. అప్పుడు కథలంటే ఇంతేనేమో బహుశా అని సరిపుచ్చుకున్నాను.

ఏదేమైనా మళ్లీ కథను ఇక్కడ చూడడం చాలా బాగా అనిపించింది. మంచి పోస్టును అందించారు.

అజ్ఞాత చెప్పారు...

Thanks for reminding a great story from a master story teller!

దాదాపు ఇలాటిదే ఇంకొక గొప్ప కథ చెహోవ్ రాసాడు. అందులో ఇద్దరు స్నేహితులు (తమ తమ భార్యలతో సహా) ఒక రైల్వే ప్లాట్ ఫారం మీద అనుకోకుండా ఎదురుపడతారు.
ఒకరినొకరు గుర్తు పట్టుకుని సంతోషంతో కెవ్వు మంటారు. కౌగలించుకొని నవ్వుకుంటారు. వారిద్దరి సంతోషాన్నీ ఎక్సైట్ మెంటునీ చూసి భార్యలిద్దరూ నవ్వుకుంటారు. కొంత సేపు బాల్య ఙ్ఞాపకాల తర్వాత, ఇహ మనం క్రమం తప్పకుండా కలుసుకోవాలని ప్రతిఙ్ఞ చేసుకుంటారు. ఇంతలో వాళ్ళ ఉద్యోగాల ప్రస్తావన వొస్తుంది. అందులో ఒకరు పెద్ద ఆఫీసరనీ, ఇంకొక అతను అదే ఆఫీసులో గుమాస్తా అనీ తెలుసుకుంటారు. అంతే రెండు క్షణాల మౌనం తర్వాత కర చాలనం చేసుకోని, ముక్తసరిగా "మళ్ళీ కలుద్దాం" అని చెప్పుకొని విడిపోతారు.ఇద్దరు భార్యలూ అయోమయంగా చూస్తూండగా, "వాళ్ళిద్దరూ అడ్రసులు మార్చుకోనేలేదు" అన్న వ్యాఖ్యతో ముగుస్తుంది.
శారద

అజ్ఞాత చెప్పారు...

ఇదేం మాయదారి స్నేహం? ఏదో, సినిమాల స్నేహం లాగా, మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల స్నేహం లాగా వుంది. ఇలాంటి దానికి స్నేహం అని మళ్ళీ ఒక ఉదాత్తమమైన పేరు!

ప్రతీ రోజూ, ప్రతీ నెలా, ప్రతీ సంవత్సరం కలుసుకోలేక పోయినా, స్నేహంలో ఆ వ్యక్తుల మధ్య ఒక కనెక్షను సాగుతూ వుండాలి. లేకపోతే, అది ఒకప్పటి స్నేహమే అవుతుంది. రెండు, మూడేళ్ళకి ఒక సారి కూడా కలుసుకోలేక పోవడానికి ఒక బలమైన కారణం వుండాలి, సరైన స్నేహంలో. అదేమీ లేకుండా, పద్ధెనిమిదేళ్ళ తర్వాత, (మొదటి రెండు సంవత్సరాల వరకూ కనెక్షను వుందని చెప్పుకున్నారు), గొప్ప స్నేహంతో తపించి పోతున్నారనడం, నమ్మ దగ్గ విషయం కాదు.

ఇక జిమ్మీ గురించి నా అభిప్రాయం. మంచి మనుషులతో స్నేహమూ, చెడ్డ మనుషులతో స్నేహమూ ఒకే లాగా వుండవు. అసలు, ఒక మనిషి చెడ్డ మనిషి అని తెలిస్తే, ఆ మనిషితో మనకి స్నేహమే వుండదు. "స్నేహం మంచి చెడ్డలు చూడదు. అన్నిటినీ అధిగమించినదే స్నేహం" అని అనడం, పిచ్చి మాటల్లాగా వుంటాయి నాకు. జిమ్మీ స్నేహితుడిని కలవడానికి వచ్చాడు. ఆ స్నేహితుడు, ప్రజలని దోచుకునే మనిషని అర్థం అయింది. అంతే! అనుకున్న స్నేహానికి అర్థం లేకుండా పోయింది. చాలా చక్కగా వుంది నాకు. ఈ జిమ్మీకి ఒక చిన్న సెంటిమెంటు. తన చేతుల్తో తన స్నేహితుడిని అరెస్టు చెయ్యలేక పోయాడు. ఎవరినో పంపాడు. పోనీలెండి. ఈ జిమ్మీ ఒక చెడ్డ మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో, అలా ప్రవర్తించాడు. బాగుంది.

ఇక బాబ్! ప్రతీ చెడ్డ మనిషీ, తన చెడ్డ తనానికి కారణాలు వెతుక్కుని, అది తన తప్పు కాదని నమ్ముతూ వుంటాడు. తను మంచి వాడిననే నమ్ముతూ వుంటాడు. ఇతను కూడా అంతే. కాబట్టే, ప్రజలని దోచుకునే చెడ్డ వాడు అయినా (ఏవో పరిస్థితుల ప్రభావం వల్ల), తనకి స్నేహం అంటే విలువ వుందనీ, అందుకే ఇరవై యేళ్ళ తర్వాత స్నేహితుడిని కలుసుకోవడానికి వచ్చాననీ అనుకుంటాడు. ఇతరులు కూడా అలాగే అనుకోవాలని అనుకుంటాడు. చాలా మంది ఇతరులు కూడా అలాగే అనుకుంటున్నారు. చివర్లో ఇతని చేతులు వణకడం, పెద్ద విషయమేమీ కాదు. ఆ ఒక్క విషయం ఇతని కేరక్టరుని ఏమీ మార్చదు. చేతుకు వణక పోయినా, ఇతని పాత్ర చిత్రణలో మార్పు ఏమీ వుండదు. ఇతను ఇతనే. చిరకాల స్నేహితుడి చివరి ఉత్తరానికి వణికి వుండొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. ముఖ్యమైన విషయం కాదు. అరెస్టు తలుచుకుని కూడా వణికి వుండొచ్చు.

నిజానికి, ఈ కధ ఒక పిచ్చి బేస్ మీద ఆధారపడి వుంది - అదే ఆ సినిమా స్నేహం అనే దాని మీద. ఆ తర్వాత షరా మామూలే.

ఎటొచ్చీ కధ రాసిన విధానం బాగుంది. చక చకా నడిచింది.

ప్రసాద్

రమాసుందరి చెప్పారు...

ఈ కధను కాళిపట్నం రామారావు గారు 'కధ ముగింపు ' అనే వ్యాసంలొ పేర్కొన్నారు. డబల్ ట్విస్ట్ కధగా.

అజ్ఞాత చెప్పారు...

అవునూ, నాకో సందేహం. జిమ్‌కి బాబ్ గురించి కలుసుకునే దాకా తెలియదు కదా? మరి ఇరవై యేళ్ళ తర్వాత స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్ళే జిమ్‌ డ్యూటీలో వున్నాడేమిటీ? ఒక పూట సెలవు పెట్టలేడూ? అసంబద్ధంగా లేదూ? కధలో ఉత్కంఠ నిలపడానికి, జిమ్‌ పోలీసు డ్రస్సులో వుండటమూ, డ్యూటీ చేస్తూనే స్నేహితుడిని కలవడానికి వెళ్ళడమూ ఉన్నాయన్న మాట. ఇంకో సందేహం. బాబ్ ప్రజలని దోచుకునే వాడు కదా? మరి పోలీసులంటే భయపడడా, తనని గుర్తిస్తారని? "చీకట్లో నన్నెవరు గుర్తిస్తారులే" అనుకుని, పోలీసుతో కబుర్లేసుకున్నాడా? ఏమిటో, బాబూ! ఇలాంటివి చదివితే, "పిచ్చి కధలూ, పిచ్చి రచయితలూ" అనిపిస్తుంది. ఆ తర్వాత, "నా లాంటి పిచ్చి పాఠకులూ" అని కూడా అనిపిస్తుంది.

ప్రసాద్

వేణు చెప్పారు...

@ anu: ఇంటర్ పుస్తకంలో ఉందా ఈ కథ? (అంతకుముందు ఎన్నో ఏళ్ళ క్రితం మేం హైస్కూల్లోనే చదివాం మరి !)
కథ గురించిన సందేహాలు ఆ వయసులోనే రావటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే.

@ sbumurali2007: మీరు చెప్పిన చెహోవ్ కథ చదివినట్టే గుర్తు. దీన్ని ఈ సందర్భంగా గుర్తు చేసినందుకు థాంక్యూ.

వేణు చెప్పారు...


@ Prasad Jonnalagadda: ఈ కథ గురించి వివరంగా మీ అభిప్రాయాలు తెలుసుకోవటం సంతోషంగా ఉంది. జిమ్ ఆ రోజు డ్యూటీ చేస్తున్నాడామిటి? సెలవు పెట్టివుండొచ్చు కదా అని నాకూ అనిపించింది.

బాబ్ ఇప్పుడున్నది షికాగోలో కాదు కాబట్టి ఇక్కడి పోలీసులంటే భయపడలేదనుకుంటాను.
ఇక వీళ్ళిద్దరూ అంతకాలం కలుసుకోకపోవటం. బతుకుతెరువు పోరాటంలో మునిగిపోయి సంవత్సరాల తరబడి స్నేహితులు కలుసుకోలేకపోవటం, కాంటాక్టులో లేకపోవటం అసహజమేమీ కాదు.

షికాగోలో తన గురించి పోలీసుల వేట మొదలవటం వల్ల కూడా బాబ్ అక్కణ్ణుంచి ప్రయాణమై ఉండొచ్చు. స్నేహితుణ్ణి కూడా కలుసుకోవచ్చని వచ్చి పోలీసులకు చిక్కిపోయాడన్నమాట.

కథ ప్రకారం బాబ్ చేసే పని ఏమిటో గానీ పోలీసులు వెతుకుతున్నారంటే స్మగ్లర్ గానీ, క్రిమినల్ గానీ అయుండొచ్చు. ప్రజలను దోచుకునే వాడు అయుండొచ్చు కానీ అది చట్టవ్యతిరేకంగా చేస్తుండొచ్చు. (చట్టబద్ధంగా దోచుకోవటం తెలియని అమాయకుడని బాబ్ మీద సానుభూతికీ అవకాశం ఉంది.)

ఇంతకూ ఇతడిని పట్టిచ్చే పని జిమ్మీ సమాజ శ్రేయస్సు కోసమని చేశాడో, ఉద్యోగ ధర్మంగా చేశాడో!

వేణు చెప్పారు...

@ రమాసుందరి: కారా గారు చెప్పిన డబుల్ ట్విస్ట్ గురించి మీ ద్వారానే తెలిసింది. ఆ వ్యాసం చదవాలయితే!

వేణు చెప్పారు...

ఈ కథ గురించి కాళీపట్నం రామారావు గారు రాసిన వ్యాసం చదివాను. ‘‘ బ్రతుకు తెరువుకి వక్రమార్గాలు పట్టినా మానవత్వం దగ్గరకొస్తే స్నేహం, ప్రేమా వంటి స్పందనలు అతనిలో క్షీణించలేదు. ఎప్పటివి అప్పట్లానే ఉన్నాయి’’ అని బాబ్ గురించి ఆయన వ్యాఖ్యానించారు.

-----------------------
కారా గారు కథ గురించి రాసిన వ్యాస పరంపరలో ‘ఆరంభం- ముగింపు’ అనే వ్యాసంలో ఈ ఓ హెన్రీ కథను చర్చించారు. దాన్ని కుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.

‘‘పడమట దేశాల్లో ఓ హెన్రీ గారని ఓ ప్రసిద్ధ రచయిత ఉండేవారు. ఆయన తమ కథల్ని ఓ ‘ట్విస్ట్’ తోన ‘డబల్ ట్విస్ట్’తోనో ముగించేవారు.

కట్టు కథలు రాసేవారంతా చాలా వరకూ ఆయన తరహా ముగింపులు అవలంబిస్తారు.

తెలుగులో వీటిని కొస మలుపలనీ, కొస మెరుపులనీ వ్యవహరిస్తుంటారు.కొందరైతే వీటిని సమానార్థకాలనుకుంటారు.

నిజానికి కొస మలుపు వేరు. కొస మెరుపు వేరు.

‘ఇరవై ఏళ్ళ తర్వాత’ అని ఓ హెన్రీ గారిదే ఒక కథ ఉంది.

....

ఎంతో దూరం నుంచి అత్యంత ప్రేమపాత్రుడైన మిత్రుణ్ని కలుసుకోడానికి వస్తే - క్షణకాలం మిత్రుణ్ని కలిసిన ఆనందం కూడా పొందాక- ఆ మిత్రుడు మిత్రుడు కాడనీ మిత్రుని ముసుగులో ఉన్న శత్రువనీ తేలడం మలుపు.

కథ అక్కడితో ఆపవచ్చు. ఆపితే ఆ కథ ఎలా అర్థమవుతుందో ఆలోచించండి.

కానీ, ఓ హెన్రీ గారు ఆ కథని అక్కడితో ఆపలేదు.
...

చీటీ ద్వారా వ్యక్తమైన యీ రెండో మలుపు - మలుపుగా ఉంటూనే కథలో మొత్తం చీకటి కోణాలన్నింటిమీదా వెలుగు ప్రసరిస్తుంది.

రెండో మిత్రుడేమయ్యాడు? న్యూయార్క్ పోలీసులకి అతనతనే అని ఎలా తెలిసింది? మొదటివాడు బ్రతుకు తెరువుకి వక్రమార్గాలు పట్టినా మానవత్వం దగ్గరకొస్తే స్నేహం, ప్రేమా వంటి స్పందనలు అతనిలో క్షీణించలేదు. ఎప్పటివి అప్పట్లానే ఉన్నాయి. మరి- రెండోవాడు పోలీస్. అతనిలో మానవాంశ ఏ స్థితిలో ఉంది? కథకి ‘ఒప్పందం’, ‘స్నేహం’ వంటి పేర్లేవీ తీసుకోకుండా ‘ఇరవై ఏళ్ళ తర్వాత’ అనడమే ఎందుకు?

ఇలా అనేక చీకటి కోణాల మీద యీ మలుపుతో వెలుగు పడుతుంది.

అందుకనే అది కొస మెరుపవుతుంది.

మలుపు అద్భుతపరుస్తుంది. మెరుపు కథని సుస్పష్టం చేస్తుంది. ’’

అజ్ఞాత చెప్పారు...

చర్చ లోకీ, వాదన లోకీ వెళ్ళడం ఇష్టం లేదు గానీ, ఒకే ఒక వాక్యంతో నా అభిప్రాయం చెబుతాను. కాళీపట్నం రామారావు అభిప్రాయంతో ఏ మాత్రమూ, ఏ కోశానా అంగీకరించడం లేదు ఈ కధ విషయంలో.

ప్రసాద్

రమాసుందరి చెప్పారు...

ఈ కధ మాకు పాఠ్యాంశంగా ఉండేది. ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి. ఏ క్లాసో గుర్తుకు రావటం లేదు.

GKK చెప్పారు...

"బాగా తెలిసిన వ్యక్తులను ఈ జీవన ప్రయాణంలో పెద్ద విరామం తర్వాత మళ్ళీ చూడటం థ్రిల్ కలుగజేస్తుంది."
నిండు నిజం.

కథలను కథలవెనుక కథలను వెతికి పట్టుకుని ఎంతమేరకు ఆసక్తికరమో అంతవరకే అందించటంలో you are a past master వేణుగారు.

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: ఈ ప్రశంసకు అర్హుణ్ణో కాదో కానీ, దానివెనకున్న మీ అభిమానానికి థాంక్ యూ!