సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

25, మే 2009, సోమవారం

వెన్నెలా... వేణువూ !


 ల్లని వెన్నెల్లో వేణు గాన మధురిమలు విన్నారా ఎపుడైనా?

వేణువుకు మరో పేరు ...హరిప్రసాద్ చౌరాసియా. 

ఆ పేరు వినగానే తెలుగువాళ్ళకు ‘సిరివెన్నెల’ స్ఫురిస్తుంది.

ఈ సినిమా విజయవాడలో నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో 1986 లో వచ్చింది. ఆ సినిమా చూడ్డానికి ‘దుర్గా కళామందిర్’కు వెళ్ళినపుడు అప్పుడే గాయని పి. సుశీల గారు ఆ సినిమా చూసి, బయటకు వచ్చారు.

చూడగానే గుర్తుపట్టాను.  కానీ ప్రేక్షక దేవుళ్ళెవరూ ఆమెను గుర్తించినట్టు లేదు.

అయినా పలకరించటానికీ, పరిచయం చేసుకోవటానికీ అది సమయమూ, సందర్భమూ కాదు కదా? మౌనంగా   చూస్తూ ఉండిపోయాను.

‘సిరివెన్నెల’ పాటలు చాలా బావుంటాయని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సుశీల గారు పాడిన వాటికొస్తే...
‘చందమామ రావే...’, 
‘విధాత తలపున ప్రభవించినదీ... విరించినై విరచించితినీ ఈ కవనం..’ 

వీటితో పాటు -

‘ఈ గాలీ... ఈ నేలా..’ పాటలు చెప్పుకోవాలి.

ఈ పాటల్లో ఆమె గొంతు చాలా బాగుంటుంది కూడా.


‘ఈ గాలీ... ఈ నేలా..’ పాట ఎత్తుగడే వేణువుతో... మంద్రం నుంచి అంతలోనే ఉచ్ఛస్థాయికి హఠాత్తుగా మారిపోతూ,  అద్భుతంగా మొదలవుతుంది కదా?

బాలూ పాడిన చరణాలు పూర్తవుతూ, ‘ఈ రాళ్లే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను...’ తర్వాత....

వేణువు నుంచి జాలువారే రస ఝరులు ఏకధాటిగా పొంగిపొరలి,  శ్రోతల మనసులను రసప్లావితం చేస్తాయి.

తర్వాత ‘కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై...’ అంటూ సుశీల గళం నుంచి అమృత వర్షిణి కురుస్తుంది. ‘ఈ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే’ అంటూ వీనులవిందు చేస్తుంది.

మాటలకందని అనుభూతికి పరాకాష్ఠగా ఆ పాట చిత్రీకరణను అభివర్ణించవచ్చు.


సంగీత సాహిత్యాల సమ్మోహన సమ్మేళనంతో పరవశింపజేసే ఆ పాటలు సహజంగానే మనసుకు పట్టేశాయి. అవి టేప్ రికార్డర్, కాసెట్ల రోజులు కదా?

పాటలన్నీ కంఠతా వచ్చేసినా పదే పదే వినటానికని క్యాసెట్ కొన్నాను.

‘రూము’కి వెళ్ళి ప్లే చేశాను. ‘ఈ గాలీ.. ఈ నేలా..’ మొదలైంది. బాలూ పాడిన చరణాలు పూర్తయ్యాయి.
ఇక వేణు గాన వాహిని మొదలవ్వాలి కదా, ఎదురుచూస్తున్నాను.

అలా జరగలేదు.

వేరే పాట ఆరంభమైపోయింది!

ఇక ఊహించుకోండి, నా అవస్థ. ఎంత నిరాశపడిపోయానో చెప్పలేను.


‘లిరిక్ లేదు కదా, ఎందుకూ ఈ ఫ్లూటు గోల... స్పేస్ వేస్ట్..’ అనుకుని, వేణు గానాన్ని నిర్దయగా తొలగించివుంటారేమో క్యాసెట్ తయారుచేసినవాళ్ళు !

(వాళ్ళు కొంచెం ఓపికపట్టి వినుంటే... సుశీల గారు పాడిన లిరిక్ వినపడివుండేది. అప్పుడైనా వేణుగానం వరకూ కట్ చేసుండేవాళ్లంటారా? ... అదీ నిజమే).

సినిమాలోనే ‘ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో... పదము కదిపితే ఎన్నెన్ని లయలో...’ అనే పాట నాకు బాగా ఇష్టం.

ఎందుకో చాలామంది ఈ పాటను అంతగా పట్టించుకున్నట్టు కన్పించదు.

ఆ పాటలో...
‘అలల పెదవులతో
శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడువేళ
పుడమి హృదయంలో ’  అనే చరణం నాకెంతో ఇష్టం.

కాలేజీ స్నేహితులతో కలిసి విశాఖపట్నం సాగరతీరం వెళ్ళినపుడు అక్కడి రాళ్ళపై విరిగిపడే సముద్ర కెరటాలను వీక్షిస్తూ నేను ఈ చరణాలనే తలపోశాను; మిత్రులకు చెపుతూ ఆహ్లాదించాను.

కొన్నేళ్ళ తర్వాత హరిప్రసాద్ చౌరాసియా విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రోగ్రాం ఇచ్చారు.

వెళ్ళకుండా ఎలా ఉండగలను?  చౌరాసియా గారిని చూసి చాలా సంతోషించాను.

పిల్లనగ్రోవి ఆయన దగ్గర ఎన్ని విన్యాసాలు చేసిందనీ...! 

ప్రశాంతంగా నె...మ్మదిగా ప్రారంభమై సెలయేటిలా సాగిపోయిన ఆ వంశీ రవం-
 అంతకంతకూ మధురమై, 
మధుర తరమై, 
మధుర తమమై 
చివరకు జలపాత సదృశమై 
...  అమిత వేగాన్ని సంతరించుకుంది.

చౌరాసియా గారు ‘తానే వేణువై...’ శ్రోతలను మంత్రముగ్ధులను చేశారంటూ మా సీనియర్ జర్నలిస్టు పేపర్లో ఎంతో చక్కగా రాశారు.


‘సిరివెన్నెల’ సినిమాలో...
 అంధబాలిక (మీనా) కు వెన్నెల దర్శనమవుతుంది- 
వేణుగాన మాధుర్యంతో.

విద్యుద్దీపాలు చీకటితో పాటే వెన్నెలనూ తరిమేసే ఈ రోజుల్లో ... ఆ కౌముదిని చూస్తూ ఆనందించాలంటే .. ఆ అవకాశముండాలంటే డాబా ఇల్లుండాలి మనకు.

ఇరుకిరుకు అపార్ట్ మెంట్లలో ఆకాశమే కనిపించని చోట నివసించేవారికి చందమామే కనిపించదు.

ఇక ఆ అందని చందమామ వెన్నెలను మాత్రం ఎలా అందిస్తుంది?

కొంత ఉపశమనంగా ‘సిరివెన్నెల’ పాటలు వింటూ శరత్ జ్యోత్స్నను... ఊహించుకోవచ్చు! 

ఇళయరాజా - చౌరాసియాల ఇన్ స్ట్ర్రుమెంటల్ ఆల్బమ్ ‘నథింగ్ బట్ విండ్’ కూడా...
అలాంటి అనుభూతినే ఇస్తుంది!

12 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

బాగా చెప్పారు ..నాకు అయితే మీ పోస్ట్ చదువుతున్న సేపు హమ్ చేస్తున్నే వున్నా ఈ గాలి..బాగా ప్రెసెంట్ చేసారు..గొప్ప సినిమా యొక్క గొప్పతనాన్ని గుర్తుచేసినందుకు మీకుఅభినందనలు

పరిమళం చెప్పారు...

వేణు గారూ !మంచి సినిమా గుర్తుకు తెచ్చారు . నాకు" ఆదిభిక్షువు వాడినేదిఅడిగేదీ "కూడా ఇష్టమే ...పాటలన్నీ చాలాబావుంటాయి . ఇంత మంచి సినిమాలు అరుదుగా వస్తాయి ఎన్నేళ్ళు గడిచినా మరిచిపోలేం .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

సిరివెన్నెల,ఇళయరాజా,హరిప్రసాద్ చౌరాసియా,విశ్వనాథ్ గార్ల అపూర్వ కలయిక ఈ సినిమా నాక్కూడా చాలా బాగా నచ్చిన చిత్రం. హరిప్రసాద్ గారి వేణువులోకి ఆ వేణుగోపాలుడే ప్రవేశించాడా !

వేణు చెప్పారు...

విజయమోహన్ గారూ, ‘సిరివెన్నెల’ సంగీత నిర్దేశకుడు కె.వి.మహదేవన్ గారు. ఇళయరాజా కాదు. ఈ సినిమాలో కథానాయకునిగా నటించింది- సర్వదమన్ బెనర్జీ. సినిమాలో ఆయన పాత్ర పేరు హరిప్రసాద్. బహుశా హరిప్రసాద్ చౌరాసియా గారి పేరే అలా పెట్టుండాలి.

‘సిరివెన్నెల’ గురించి నేను ఇంత చెప్పి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పేరును నేను ప్రస్తావించలేదు. ఆయన పేరేమిటిలెండి, కె.విశ్వనాథ్ గారి పేరూ, మహదేవన్ గారి పేరూ కూడా స్మరించలేదు కదా? ‘సిరివెన్నెల’ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేర్లు కదా అని అలా చేశాను.

@ సుజాత గారు : ‘కన్నె మూగ మనసు’ చరణంలో కాగితం మీది అక్షరాలు తడిసి వేణువులోకి జాలువారి పాటగా రూపొందటం అనేది ఒక అద్భుతంగా తోస్తుంది!- అంటూ మీరు నేను చెప్పని అంశాన్ని చక్కగా వివరించారు. మీ అభినందనకు ధన్యవాదాలు.

@ హరే కృష్ణ గారు, పరిమళం గారు : మీ స్పందనకు కృతజ్ఞతలు.

వేణు చెప్పారు...

విశ్వనాథ్ గారు ‘సిరివెన్నెల’ కోసం ఎంతో తపన పడ్డారని చాలామందికి తెలుసు. ఫిబ్రవరిలో ఆయన ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘మనసుకు దగ్గరైన’ ఈ సినిమా గురించి చెప్పారు.. ఆ వివరాలు కొన్ని...
‘... పిక్చరైజ్ చేయడానికీ, బయటకు తేవడానికీ నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్ కీ కష్టపడ్డాను.
.... మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి.. సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దాని నుంచి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాన నేత్రంగా ... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు. అతనేమో చూడలేడు. సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి....’

భావన చెప్పారు...

వెన్నెల వేణువు ఆ హెడ్డింగే ఎంతో బాగుంది... సినిమా గురించి హరి ప్రసాద్ చౌరాసియా గారి వేణు గానం గురించిన వివరాలు ఇంకా బాగా వివరించారు... విశ్వనాథ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక వరం..

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగు టైటిల్ కి తగ్గ టపా వ్రాసారు. మంచి సినిమాని, మంచి పాటలని గుర్తు చేసినందుకు అభినందనలు.

సీతారామశాస్త్రి తొలిచిత్రంలోనే విశ్వరూపం ప్రదర్శించారు.

మహదేవన్ ఎప్పటిలానే విశ్వనాథ్ గారికి అద్భుతమైన సంగీతం హరిప్రసాద్ చౌరాసియతొ కలిసి ఇచ్చారు.

సాధారణంగా సుశీల గారు విశ్వనాథ్ గారికి పాడడం తక్కువ. ఎక్కువగా జానకిగారే పాడతారు.

అయితే ఈ సినిమాని నేను అలంకార్ లో చూసినట్లు గుర్తు.

వేణు చెప్పారు...

bonagiri గారూ ! సుశీల గారు విశ్వనాథ్ సినిమాలకు తక్కువగా పాడటం శంకరాభరణం తర్వాత అంటేనే కొంతవరకూ కరెక్టు. సిరిసిరి మువ్వ, శారద, చెల్లెలి కాపురం, జీవనజ్యోతి... ఇలా ఎన్నో సుశీల గారు పాడారు కదా? శంకరాభరణం తర్వాత కూడా శుభోదయం, శ్రుతిలయలు, స్వాతి ముత్యం, శుభలేఖ లాంటి సినిమాల్లో సుశీల గారి పాటలున్నాయి.

ఇక మీరు అలంకార్ లో సిరివెన్నెల చూసేవుంటారు. ఎందుకంటే దుర్గా కళామందిర్ లో కొన్ని రోజులు ప్రదర్శించాక అలంకార్ కు మార్చి ఈ సినిమాను మార్నింగ్ షోలు మాత్రమే వేశారు. సిరివెన్నెల ఎంత మంచి సినిమా అయినా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

తృష్ణ చెప్పారు...

బాగుందండి టపా..."nothing but wind", "how to name it" మా ఇంట్లో అందరికీ కంఠోపాఠం..!!ఆ తరువాత మూడోది కూడా వచ్చిందని విన్నాము.
మీది విజయవాడా?మాదీ బెజవాడే.నా బ్లాగ్ చూసారా?విజయవాడ కబుర్లు చాలానే ఉంటాయి..ఇవాళే మీ బ్లాగంతా చదువుతున్నానండి....ఇన్నాళ్ళూ చూడలేదు...చాలా బాగున్నాయి టపాలు...వీలుచూసుకుని మరిన్ని రాస్తూండంది మరి..

తృష్ణ చెప్పారు...

నాక్కూడా "ప్రకృతి కాంతకూ.." పాట ఇష్టమండి...
మీరు రాసిన వాక్యాలు.."అలల పెదవులతో శిలల చెక్కిలిపై..కడలి ముద్దిడువేళా పుడమి హృదయంలో..." ఆహా...ఏమి రచన...అద్భుతం !!

వేణు చెప్పారు...

@ తృష్ణ: థాంక్యూ! "ప్రకృతి కాంతకూ.." పాట ముఖ్యంగా సాహిత్యం గురించే చెప్పుకోవల్సినది. మీ బ్లాగు చూస్తాను. ఇక విజయవాడ... ఒక రకంగా నాకు సొంత వూరు లాంటిదే!

M b d syamala చెప్పారు...

వేణు! వెన్నెల వేణువు అన్న శీర్షికేఅందమైన అనుభూతిని కలిగించింది ఇక పోస్ట్ అంతా సిరివెన్నెల గురించి!హరిప్రసాద్ చౌరాసియాగారి వేణునాదం గురించి! వ్రాసింది నువ్వు! అందుకే నీ అక్షరాలు తిలక్ చెప్పినట్లు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్లా ఉన్నాయి!అంతకంతకూ మధురతరమై మధురతమమైన వేణుగానాన్నిమీ బ్లాగు ద్వారా హృదయ శ్రావ్యం చేసినందుకు ధన్యవాదాలు!నాకు ఆది భిక్షువు పాట ఎక్కువ ఇష్టం !అలాగే ఎవరిరాకతో పాట కూడా!ప్రకృతికాంతకు పాట సాహిత్యం ఇప్పుడు మీరు చెప్తుంటే అద్భుతం అనిపిస్తోంది!చందమామ కనిపించని వెన్నెల నందించని ఇరుకు బతుకుల నగర వసుల రసఙ్ఞ హృదయాలపై మీ టపాతో వెన్నెల కురిపించినందుకు ధన్యవాదాలు!!