సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, ఏప్రిల్ 2012, గురువారం

‘రేడియో హీరోయిన్’ ఆడియో సీడీ విన్నారా?

 తెలుగులో నేరుగా శ్రవ్య (ఆడియో) పుస్తకాలు వచ్చినట్టు లేదు.  ఏదైనా పుస్తకం విడుదలయ్యాక దాని ఆడియో రూపం రావటం కూడా తక్కువే.

సి. నరసింహారావు గారి  ‘వ్యక్తిత్వ వికాసం’ పుస్తకం ఆడియోగా  వచ్చినట్టుంది.

ముళ్ళపూడి వెంకట రమణగారి ‘కోతికొమ్మచ్చి’ పుస్తకం ఆడియో అమెరికాలాంటి దేశాల్లో  బాగా ఆదరణ పొందిందని విన్నాం.  ఆ పుస్తకంలోని పద విన్యాసాలూ, విరుపులూ, అక్షర చమక్కులూ  వేరెవరో చదువుతూవుంటే .. వింటే ఆ స్వారస్యం అనుభవంలోకి వస్తుందా? అది పఠనానుభవం దరిదాపుల్లోకైనా వస్తుందా? అనుమానమే !

 క్యాసెట్ల రోజుల్లో  యద్దనపూడి సులోచనారాణిగారు శ్రవ్య పత్రికను కొద్దికాలం తీసుకువచ్చారు కానీ, ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు.

నాకైతే పుస్తకాన్ని ‘చదువుకోవటమే’ ఇష్టంగా ఉంటుంది. దాన్ని ‘విని’ తెలుసుకోవాలనిపించదు-  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినా సరే...!

చలం పురూరవలో ఊర్వశికీ,  తిలక్ సుప్తశిలలో అహల్యకూ తన వాగమృతంతో ప్రాణం పోసిన ‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ .

 ఆమె  ‘నా రేడియో అనుభవాలు- జ్ఞాపకాలు’ పుస్తకం రాసిన సంగతి చాలామందికి తెలుసు.  తన ఘనత ప్రసక్తి వచ్చినపుడు కూడా నమ్రతగా,  ఒద్దికగా  చెపుతూ రేడియో మహామహుల ప్రతిభా విశేషాలను గుర్తు చేసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు శారద. ఆకాశవాణి  వైభవ చరిత్రకు వైయక్తిక కోణంలో  ఘన నివాళి పట్టారు.

ఆమె ‘మనసులో  మాట’ గురించి సుజాత గారు ఓ  టపా రాశారు.  అది ఇక్కడ చూడొచ్చు.

ఈ పుస్తకం ఈ -బుక్ గా చదవాలనుకుంటే ఈ లింక్  చూడండి.  ( http://kinige.com/kbook.php?id=373&name=Naa+Radio+Anubhavalu+Gnapakalu )

2011 జులైలో విడుదలైన ఈ పుస్తకాన్ని అప్పుడే ఆసక్తికరంగా చదివాను.  ఇక ఈ పుస్తకం సీడీగా వస్తోందని తెలిసినా ..  దానిపై  అంతగా ఆసక్తి చూపించలేదు. పుస్తకం ఎంత బాగా ఉన్నా.. అదే కంటెంట్ మళ్ళీ ‘వినటం’అవసరం లేదు కదా అనేది నా ఆలోచన.


కొద్ది రోజుల క్రితం ఈ ఆడియో సీడీ నా దగ్గరకొచ్చింది. ఎలా ఉంటుందో చూద్దామని (విందామని) శారద గారి  పుస్తకాన్ని చూస్తూ ఆమె గళం వినటం మొదలుపెట్టిన కొద్ది సేపటికే నా అంచనా తప్పని చక్కగా రుజువైపోయింది!

అసలు ఈ పుస్తకమే మాట్లాడుతున్న ధోరణిలో ఉంటుంది. దాన్ని చదివేటప్పుడు శారద గారు అవసరమైనచోట చక్కని ఇంప్రవైజేషన్స్ చేస్తూ... పెద్ద పదాలను విడదీస్తూ, సందర్భం వచ్చినపుడు సంభాషణ శైలిలోకి మారుతూ, చిరుహాసాలను రువ్వుతూ సాగిపోయారు. ఎప్పటెప్పటి జ్ఞాపకాలనో తడుముకుంటూ, అనుభూతులను స్మరించుకుంటూ  ముచ్చటగా, అందంగా అలనాటి అనుభవాలను  మననం చేసుకుంటూ తాపీగా, సాఫీగా చదివారామె. 

దీంతో  ఆమె మన ఎదురుగా కూర్చుని ఆత్మీయంగా, సహజంగా  కబుర్లు చెప్పిన అనుభూతి  ఏర్పడింది. ఇక పుస్తకం పక్కనపెట్టేశాను. కళ్ళు మూసుసుకుని ఆ శ్రవణానందంలో మునినిగిపోయాను.

వందకు పైగా  లలిత, జానపద, దేశభక్తి, ప్రబోధ గేయాలనూ, పాటలనూ గుర్తు చేసుకున్నారీ  పుస్తకంలో.  పల్లవులు చూస్తే వాటి ట్యూన్ ఎలా ఉండేదో తెలీదు కదా?  ఆ బాణీలేమిటో తెలియకుండానే వాటి సాహిత్యం గమనిస్తూ చదువుతూ పోయానప్పుడు. ఇప్పుడీ సీడీలో ఆ బాణీలను శారద గారే  మధురంగా గానం చేస్తూంటే వినసొంపుగా అనిపించింది. ఇన్ స్ట్రుమెంట్ల సాయం ఏదీ లేకుండా- ఇంట్లో మనం పాడుకుంటున్నట్టుగా హాయిగా పాడేశారు.

మాటల నుంచి పాటకు ఎంత అలవో్కగా మారిపోతారో, పాట తర్వాత మాటల్లోకి అంతే సహజంగా మరలిరావటం .. అబ్బురంగా తోస్తుంది.

ఈ పుస్తకంలో/సీడీలో శారద గారు ఇలా అంటారు- ‘సంగీతానికే కాదు, మాటలకీ ఉంటాయి శ్రుతి లయలు. అది పట్టుకునేందుకు ప్రయత్నించాలి.’ ఆ శ్రుతి లయల పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న శారద గారు ఈ సీడీలో తన స్మృతుల పరిమళాన్ని పాఠక శ్రోతలకు హృద్యంగా, మనోహరంగా పంచిపెట్టారు.

శారద గారి గళం వినిపించకపోతే ఈ టపా అసంపూర్ణమే అని నా నమ్మకం. అందుకే  ఈ సీడీ రూపకర్తల సౌజన్యంతో ఓ మూడు శ్రవ్య శకలాలను  ఇక్కడ ఇస్తున్నాను.  

(సీడీని పంపిణీ చేస్తున్నవారు SR Communications, Vidya nagar, Hyderabad. ఫోన్ నంబర్. 040- 65153327. ఈ -మెయిల్ : srmaiah@yahoo.com)

1. రేడియో నాటకం ప్రాశస్థ్యం గురించి శారద గారు ఎంత బాగా రాశారో.. అంత బాగా చదివారు...

2. శారద గారు తొలిసారిగా ప్రొడ్యూస్ చేసిన సీరియల్ నాటకం - రంగనాయకమ్మ గారి బలిపీఠం. దీని నాటకీకరణ గొల్లపూడి మారుతిరావు గారైతే, తార పాత్రను యద్దనపూడి సులోచనారాణి గారు పోషించటం విశేషం. ఈ నాటకం గురించి....

  3. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ‘బావొస్తే’ సంగీత రూపకం గురించి..
 ఇంత రాశాక   పురూరవ లో  తెరతెరలుగా సాగే ఊర్వశి నవ్వును వినిపించకపోతే పెద్ద లోటే కదా? ఆ పాత్ర సృష్టికర్త  చలాన్నే సమ్మోహనపరిచిన ఆ ఊర్వశి హాసం కొద్ది క్షణాలు ఆస్వాదించండి...
12 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
తృష్ణ చెప్పారు...

పుస్తకం చదివేసాం, సీడి వినేసాం..:) శారద గారి వాయిస్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సీడీ రిలీజయినప్పుడు బ్లాగ్లో రాసాను నేను.
నిన్నను శారద గారికీ, నాన్నగారికీ మార్కొనీ జయంతి సందర్భంగా సన్మానాలు జరిగాయి. సభలో శారద గారు మాట్లాడుతుంటే విన్న నా ఆశ్చర్యానుభూతిని చెప్పలేను...డభ్భైకి పైగా వయసున్న ఆవిడ గాత్ర మాధుర్యం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. నెమ్మదిగా, మధురంగా, తియ్యగా ఇంకా ఇంకా వినాలనిపించేలా ఎంత బావుందో శారదత్త గొంతు. నిన్నటి సభ వివరాలు నా బ్లాగ్లో రాసాను చూడండి.

వేణు చెప్పారు...

@ సుజాత: శారద గారి వాయిస్ గురించి నేనేమని ఫీలయ్యానో అదే మీ వ్యాఖ్యలో బాగా చెప్పారు. ఎక్కడా వయసు ప్రభావం నాకు కనపడలేదు.

@ తృష్ణ: ఆమె గాత్ర మాధుర్యం గురించి మీరు చెప్పింది నిజం. ఈ సీడీ విడుదలయిన సమాచారం చెపుతూ మీరు రాసిన బ్లాగ్ పోస్టు కూడా చదివాను.

జ్యోతిర్మయి చెప్పారు...

వేణు గారూ శారద గారి స్వరం వినిపించి మంచిపని చేశారు. ఆ సిడి ఎక్కడ దొరుకు౦తు౦దో వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు మీకు.

వేణు చెప్పారు...

@ జ్యోతిర్మయి: ఆడియో గురించి రాస్తూ ఆమె స్వరం వినిపించకపోతే ఎలా మరి? మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ!

ఉష చెప్పారు...

శారదా శ్రీనివాసన్ గార్ని గూర్చి గురుశుక్రవారాల్లో ఈ వార్తా చదివాను, లింక్ మర్చిపోయాను అనుకున్నాను (అనుకోని పని వత్తిడి కారణంగా). సత్యవతి గారి బ్లాగులో మీ వ్యాఖ్య ద్వారాగా రాగలిగాను, థాంక్స్ వేణు గారూ. మీ బ్లాగులో చక్కని వార్త చదవకండా వెళ్ళటం అపుడూ అరుదే.

వనజవనమాలి చెప్పారు...

వేణు గారు చాలా శ్రద్ద తీసుకుని మంచి పని చేసారు. ధన్యవాదములు. సి.డి లభ్యత మొదలగు వివరాలు చాలా ఉపయుక్తం.
అన్నట్టు మీరు చాట్రాయి వారా!? మాకు దగ్గరే.. మైలవరం దగ్గర కుంటముక్కల..మావూరు. విద్యాభ్యాసం ఆంతా మైలవరం లోనే!

వేణు చెప్పారు...

ఉష గారూ, రెండు రోజులు లేటుగానైనా చూశారు కదా, థాంక్యూ !

వనజ వనమాలి గారూ, మీ ఊరు మైలవరం దగ్గరేనని మీ వ్యాఖ్య ద్వారానే తెలుసుకున్నాను. మీ స్పందనకు థాంక్యూ!

రామ్ చెప్పారు...

వేణు గారూ
మీ ఆనందాన్ని పంచుకున్నందుకు నమోన్నమః !!
శారద గారి స్వరం వింటుంటే - మన టీవీ కొత్త యాంకరీమణులు ఇలా మాట్లాడాలని ఎందుకు అనుకోరూ ... !!! అని అనిపించింది . శారద శ్రీనివాయిస్ గారి CD విని కొత్త తరం స్పందించి - తెలుగు గొంతు అందించాలని ఆశిద్దాం !! నాది మరీ గొంతెమ్మ కోరిక అంటారా !!!!

వేణు చెప్పారు...

రామ్ గారూ! థాంక్యూ.
గొంతుకు సంబంధించిన సంగతి కూడా కాబట్టి తప్పనిసరిగా మీది ‘గొంతెమ్మ కోరికే’అనిపిస్తోంది.:)

శారదా శ్రీని’వాయిస్’అనే ప్రయోగం బాగుంది!

రామ్ చెప్పారు...

'శ్రీనివాయిస్' ప్రయోగం ముళ్ళపూడి వారి సొమ్ము (పిబి 'శ్రీనివాయిస్' గారి గురించి ) - సమయం సం'దర్పం' కుదిరాయి కదాని - ఆయన్ని ' హలో ఓ coin ఉందా ' అని అప్పడిగాను !!'

వేణు చెప్పారు...

రామ్ గారూ! అప్పారావు సృష్టికర్త నుంచే COIN అప్పు చేశారంటే మీరు సామాన్యులు కారు!:) ఏ AGEకైనా నిలిచే COINAGE రమణ గారిది.