- కొత్తవి ఎక్కడైనా దొరుకుతాయి; పాతవి మళ్ళీ దొరక్కపోవచ్చు.
పాత పుస్తకాల్లో మంచివి కూడా కొన్నిటిని పబ్లిషర్లు ప్రచురించటం లేదు కదా! పుస్తక పఠనానికి ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో ఎన్నో మంచి తెలుగు పుస్తకాలు రీ ప్రింట్లు లేకుండా ఉన్నాయి.
* ఒకే రచయిత పుస్తకం కొత్తదీ, పాతదీ ఎంచుకోవాలంటే నేను పాతదానికే ఓటు వేస్తాను. పాత పుస్తకాలను రీ ప్రింట్ చేసేటప్పుడు పేరాలు పేరాలే కంపోజింగ్ లో మిస్సయ్యే ప్రమాదముంటుంది. రచయితలో, ప్రచురణ కర్తలో పట్టించుకోకపోతే అంతే సంగతులు! ఇది చాలా ముఖ్యమైన పాయింటు.
(రంగనాయకమ్మ గారి పుస్తకాల విషయంలో ఇది వర్తించదు. ఆమె తన పుస్తకాలను పాతవాటికంటే చాలా మెరుగులు దిద్దుతారు... వస్తు పరంగా , కథన పరంగా కూడా! రీ ప్రింటు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.)
* అచ్చుతప్పులు పాతవాటిల్లో తక్కువ. కొత్త వాటిలో ఎక్కువని వేరే చెప్పాలా? - పాత పుస్తకాలు హేండ్ కంపోజింగ్ లో తయారైనవి. ఆ ఫాంట్ల ముందు చాలా సందర్భాల్లో ఇప్పటి ఆధునిక ఫాంట్లు తీసికట్టే.
* కవర్ పేజీలు కొత్త ప్రచురణల్లో మారిపోతున్నాయి. పాత కవర్లను ప్రముఖ చిత్రకారులు వేసేవారు. కొత్త కవర్లను ఫోటోషాప్ బొమ్మలు ఆక్రమిస్తున్నాయి. ఈ కొత్తవి సాధారణంగా... పాతవాటితో పోలిస్తే బొత్తిగా బావుండవు. (కావాలంటే మచ్చుకు గోపీచంద్ ‘మెరుపుల మరకలు’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలల పాత, కొత్త ప్రచురణలు చూడండి). - విశ్వప్రసాద్ నవలల్లో రెండొందల పుస్తకాలకు ఆర్టిస్టు కేతా ముఖచిత్రాలు వేశారు. ‘ఆయన కలం, నా కుంచె సమైక్యతతో, ఉత్సాహంగా పోటీ పడేవి’ అని కేతా అన్నారోసారి. ఇప్పడు ఓ గ్రాఫిక్ తో లాగించేస్తే పోలా అనుకుంటున్నారు.
ఆదివారం పేవ్ మెంట్ల మీద రాశులుగా పోసే పుస్తకాల్లో అమూల్య, అలభ్య, అరుదైన పుస్తకాల కోసం వీలున్నప్పుడల్లా వెతికేవారిలో మీలో కొందరైనా ఉంటారు కదూ!
ఈ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్లో ఉన్న ‘వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల’ గురించి ప్రస్తావించటం నా బాధ్యత. ఈ బుక్ స్టాల్ యజమాని నర్రా జగన్మోహనరావు. సాహిత్యాభిమాని. ముక్కుసూటి మనిషి. పుస్తకాలను బేరం చేస్తే ఆయనకు గిట్టదు. పుస్తకం స్థాయినీ, రేరిటీని బట్టీ ఒక ధర చెపుతారు. ఇక అంతే, దానికిక తిరుగుండదు.
ఈ పాత పుస్తకాల షాపులో చాలా అరుదైన పుస్తకాలు దొరుకుతాయి. ఫోన్ నంబరు 9849632379
5 కామెంట్లు:
రంగనాయకమ్మ గారు తన ‘కృష్ణవేణి’ నవలను ప్రింటులోంచి తీసివేశారు కదా, ఆ పుస్తకం వల్ల పాఠకులకు ప్రయోజనం ఏమీ ఉంఢదని ఆమె ఈ పని చేశారు. కానీ ఆ పుస్తకంలో ఏం ఉందో చదవాలని ఉత్సుకత. ఎలా? పాత పుస్తకాల షాపులే కదా శరణ్యం. మొత్తానికి విజయవాడలో నేను చెప్పిన
పాత పుస్తకాల షాపులోనే నాకా నవల దొరికింది!
నేను విజయవాడకు వెళ్ళినప్పుడల్లా లెనిన్ సెంటర్ విజిట్ తప్పని సరి. ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న చివుకుల పురుషోత్తం నవలలూ, ముదిగొండ శివప్రసాద్ చారిత్రకాలూ కొన్ని ఇక్కడే దొరికాయి.
ముదిగొండ శివప్రసాద్ గారు అగ్నిగీతం అని ఒక నవల రాశారు. నా చిన్నప్పుడు అది విజయ మాసపత్రికలో రెండు భాగాలుగా రెండు నెలల పాటు అనుబంధ నవలగా ఇచ్చారు. అందులో రెండోభాగం నా దగ్గరుంది. మొదటి భాగం ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా చెప్పగలరా? డైరెక్ట్ నవలగా రాలేదు అది.అలాగే విశ్వనాధ పావని శాస్త్రి రాసిన "పులిముగ్గు"నవల కూడా ఎవరికో ఇచ్చి పోగొట్టుకున్నాను. అది కూడా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?
@ సుజాత గారూ,
పాత పుస్తకాల నిరంతర అన్వేషకుల్లో మీరూ ఒకరన్నమాట. సంతోషం.
ఇక రంగనాయకమ్మగారి విషయం. సొంత రచనలను నిర్మోహంగా, నిర్మొహమాటంగా అలా పాఠక ప్రయోజన గీటురాయితో విమర్శించుకునే రచయితల గురించి మరెక్కడా వినలేదు.
విజయ మాసపత్రిక అనుబంధంగా చాలా మంచి నవలలు వచ్చాయి. వాటిలో ‘సుధర్మ’ నవల ఇప్పటికీ గుర్తుంది. రచయిత పేరు తెలియదు. చాలా బాగుంటుంది.
@ కత్తి మహేష్ కుమార్ గారూ, నేనూ అంతేనండీ. విజయవాడ వెళ్తే లెనిన్ సెంటర్లో పాత పుస్తకాలను సందర్శించాల్సిందే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి