సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

16, ఏప్రిల్ 2009, గురువారం

‘చందమామ’ రచయితను కలిసినవేళ....

 

‘చందమామ’ జానపద సీరియళ్ళను అమితంగా ఇష్టపడేవారిలో ఎక్కువమందికి వాటి రచయిత ఎవరో తెలియదు. ప్రచురణ కర్తలు కూడా రచయిత పేరుకు బదులు ‘చందమామ’ అని ప్రచురిస్తూ వచ్చారు. 

దీంతో ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దినది ఎవరో పాఠకలోకానికి తెలియకుండా పోయింది. 

కొద్దిమంది రచయితలకు మాత్రమే ఆయనెవరో తెలుసు. 

ఆ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారు. 

చందమామలో యాబై నాలుగేళ్ళు , 2006వరకూ పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు.  

ఆయనను కిందటి సంవత్సరం దసరా రోజున కలిసి, మాట్లాడాను! 

అసలు సుబ్రహ్మణ్యం గారి పేరు తొలిసారిగా విన్నది- కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి ‘చందమామ జ్ఞాపకాలు ’ వ్యాసంలో. ‘ఈ మాట’లో వచ్చిందీ వ్యాసం. తర్వాత రోహిణీప్రసాద్ గారు అమెరికా నుంచి మన రాష్ట్రానికి వచ్చినపుడు విజయవాడ వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలిసి, ఆ విషయం ఓ టపాలో రాశారు. అప్పుడే నిర్ణయించుకున్నా విజయవాడ వెళ్లినపుడు సుబ్రహ్మణ్యం గారిని తప్పకుండా కలవాలని! రోహిణీ ప్రసాద్ గారికి వేగు (మెయిల్) పంపి, అడ్రస్ సంపాదించాను. 

విజయవాడకు త్వరలోనే ప్రయాణం కుదిరింది. మొగల్రాజపురం మధు కళామండపం పక్కనున్న వైశ్యాబ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్మెంట్స్. అక్కడే సుబ్రహ్మణ్యంగారు ఉంటున్న ఫ్లాటు చేరుకుని ఉత్కంఠతో ఎదురుచూశాను. 

కొద్ది సేపట్లోనే ఓ వృద్ధమూర్తి ఆగమనం. 

‘ఈయనేనా మూడుతరాల పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట ’ అనే భావం మనసులో మెదిలింది. నా బాల్యపు హీరోలు ఖడ్గవర్మ, జీవదత్తులు (శిథిలాలయం, యక్ష పర్వతం, రాతిరథం) గుర్తొచ్చారు. అరగంటకు పైగా మాట్లాడాను. ఆప్యాయంగా సంభాషించారు. వయసు మీదపడటం వల్ల ఆయనలో కొంత వినికిడి లోపం. ‘చిత్రా’ బొమ్మల గురించీ, ఇంకా ఎన్నో విషయాల గురించీ అడగాలనుకున్నా గానీ అనుకున్నంత వివరంగా మాట్లాడలేకపోయా. 

 చందమామలో తాను రాసిన సీరియళ్ళను తిరిగి ప్రచురించేటప్పడు ఎనిమిది పేజీల మ్యాటర్ ను ఆరు పేజీలకు కుదిస్తున్న సంగతి ప్రస్తావించారు. తన రచనలను పరిశీలించేవారు తొలి ప్రచురణలనే ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు. 

  గొప్ప రచయితను కలిశాననే సంతోషంతో సెలవు తీసుకున్నాను. 

ఈ నెల కౌముది పత్రికలో సుబ్రహ్మణ్యంగారి గురించి వసుంధర రాసిన ప్రత్యేక వ్యాసం ‘చందమామకి వెన్నెముక- సుబ్రహ్మణ్య సృష్టి’ చదవండి.  

దానితో పాటే ప్రస్థానంలో గత సంవత్సరం సెప్టెంబరులో వచ్చిన ఆర్టికల్ కూడా జోడించారు. తప్పనిసరిగా చదవండి. http://koumudi.net/Monthly/2009/april/index.html

18 కామెంట్‌లు:

Uyyaala చెప్పారు...

అద్బుతమైన సమాచారం.
అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.
బాల్య స్మృతులన్నీ ఒక్కసారిగా కాళ్ళ ముందు గిర్రున తిరిగాయి.
పూజ్యులు దాసరి సుబ్రహ్మణ్యం గారి ఫోటో ప్రచురిస్తే మరింత నిండుగా వుండేది.
మీకు కృతజ్ఞతాభినందనలు

Sky చెప్పారు...

నమస్కారం వేణు గారు,

చాలా బాగుంది. ఒక్క సారి నా చిన్నతనంలోకి తీసుకుని వెళ్ళారు. బాగు బాగు. వారి అడ్రెస్ చూస్తుంటే విజయవాడలో మా ఇంటి దగ్గరలోనే అని తెలుస్తోంది. వీలయితే ఆ సరస్వతీ పుత్రుడిని కలవాలి ఒకసారి. మీ బ్లాగ్ లోని మిగిలిన టపాలను కూడా చదివి మరో సారి వ్యాఖ్య రాస్తాను.

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Anwartheartist చెప్పారు...

ఆయన గురించి తెలుసుకొవడం చాలా సంతొషంగా వుంది. ఆయన గురించి ఇలా నెట్ లొ మాత్రమె కాకుండా దినపత్రికల్లొని సాహిత్య పేజీల్లొ కూడ వస్తే తెలుగు పాఠకుల అద్రుష్టమే.
ఆట్లాగే సుజాత గారు చిత్ర, శంకర్ గార్ల పేర్లు తలుచుకుని చిత్రకారులకు కూడా పాఠకుల మనస్సుల్లొ చొటువుందని గుర్తు చేశారు. చిత్ర గారు 1970 ల్లొనే మరణించారు , శంకర్ గారు ఇప్పుదు 80 వ పడి దగ్గర్లొ ఆరొగ్యంగానే వున్నరట ,
పతంజలి గారు ఇంకా వుండివుంటే మదరాస్ నుంచి శంకర్ గారు, గొపులు గార్ల వి, కలకత్తా నుంది అనూప్ రాయ్ , తెలుగువారు మరిచి పొయిన శుక్తి అనబడిన నరసింహ రెడ్ది గార్ల లాంటి మహ చిత్రకారుల interviews ఎన్నొ సాక్షి లొ వచ్చి వుండేవి.

కొత్త పాళీ చెప్పారు...

చాలా సంతోషం.

రవి చెప్పారు...

చాలా గొప్ప అదృష్టం దక్కింది మీకు. అసూయ, ఆనందం రెండూ కలుగుతున్నాయి.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

చాలా బాగుంది. అభినందనలు.

నాగన్న చెప్పారు...

ఎవరైనా ఆయన ఫోటోను తీసి ప్రచురించగలరు.

వేణు చెప్పారు...

టపాకు స్పందించిన అందరికీ నెనర్లు.

@ ప్రభాకర్ మందార గారు, నాగన్న గారు : సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వెళ్లిన సమయంలో నా దగ్గర డిజిటల్ కామెరా లేదు. కనీసం ఆయన దగ్గర అయినా ఫొటో అడిగి తీసుకోవాల్సింది. తోచలేదు. వచ్చేనెల్లో విజయవాడ వెళ్ళే పని ఉంది. ఆయన్ను కలిసి, ఫొటో తీసుకుంటాను. అలాగే దాన్ని బ్లాగులో పెడతాను.

@ సతీష్ కుమార్ గారు: ఆ ‘కథల మాంత్రికుణ్ని’తప్పకుండా కలవండి.

@ సుజాత గారు: నిజంగా మీరన్నట్టు అదృష్టవంతుణ్నే. సుబ్రహ్మణ్యం గారిని కలవటం కోసం మెయిళ్ళూ, ఫోన్లూ చేసి, అన్వేషించి వెళ్ళాను కదా, మరింత తృప్తి.
మాయాసరోవరం, భల్లూక మాంత్రికుడు సీరియళ్ళకు బొమ్మలు వేసింది చిత్రానే. శంకర్ పౌరాణిక స్పెషలిస్టయితే, చిత్రాది జానపద ముద్ర. ఇద్దరిదీ సూక్ష్మ వివరాలతో బొమ్మలు వేసే స్కూలు.

@ Indianinker గారు : సుబ్రహ్మణ్యం గారి గురించి మీరన్నట్టు దిన పత్రికల్లో వస్తేనే ఎక్కువమంది పాఠకులకు తెలుస్తుంది. త్వరలోనే అలా
జరుగుతుందని ఆశిద్దాం.
కిందటి సంవత్సరం ఓ దినపత్రికకు చెందిన ఆర్టిస్టు చెన్నై వెళ్ళి శంకర్ గారిని కలిశారు. నిరాడంబరంగా నిగర్వంగా కన్పించారని ఆయన చెప్పారు. అంతటి మహా ఆర్టిస్టు జీతం నిన్న మొన్న కుంచెపట్టిన కుర్ర చిత్రకారుడి కంటే పెద్దగా ఎక్కువగా లేదట. కానీ శంకర్ గారికి ఆ విషయంలో అసంతృప్తి లేకపోవటం విశేషం.

@ కొత్తపాళీ గారు, రవి గారు, ఆత్రేయ గారు : మీ స్పందనకు ధన్యవాదాలండీ.

వేణు చెప్పారు...

@ Indianinker (అన్వర్) గారూ, శంకర్ గారి లాంటివారు దశాబ్దాలుగా చందమామలో విశ్వాసపాత్రంగా పనిచేయటానికి అక్కడి కుటుంబ వాతావరణం, రిటైర్ మెంట్లు లేకపోవటం ముఖ్య కారణాలని చెప్పవచ్చు. విశిష్ట శైలిలో బొమ్మలు వేస్తూ ఎందరో చిత్రకారులకు నమూనాగా నిలిచిన చిత్రా, శంకర్ ల గురించి పత్రికల్లో ఇంటర్వూలు రాకపోవటం వల్ల వారి కంట్రిబ్యూషన్ ఎక్కువమందికి తెలియకుండా పోయింది. (చందమామ 60 సంవత్సరాల సందర్భంగా ఈనాడు ఆదివారం పుస్తకంలో మాత్రం శంకర్ ఇంటర్వ్యూ వచ్చింది.)
మీరు ప్రస్తావించిన గొప్ప చిత్రకారుల గురించి మీ బ్లాగులో రాయవచ్చు కదా ! మీరు సాధికారికంగా రాయగలుగుతారు, ఆర్టిస్టు కాబట్టి. ఏమంటారు?

Raju చెప్పారు...

చందమామ రచయితలు...
ఈయనేనా మూడుతరాల పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట.... దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి, చిత్ర, శంకర్ గార్ల గురించి మీరూ, మిత్రులూ ఈ బ్లాగులో రాసింది చదువుతూంటే చందమామనే కాక చందమామ కథకులను, చిత్రకారులను కూడా తెలుగు జాతి మర్చిపోలేదనే వాస్తవం కళ్లకు కట్టినట్లనిపించింది. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది.

చందమామకు మార్క్సిజానికి సంబంధం ఉండకపోవచ్చు. కాని చందమామలో ప్రత్యేకించి తెలుగు చందమామలో పనిచేసిన, ఇప్పుడూ కొనసాగుతున్న వారిలో చాలా మంది మార్క్సిస్టులే అనే విషయం తెలిస్తే చందమామపై ఇప్పటికీ అభిమానం చూపుతున్న వారిలో చాలామంది బహుశా షాక్‌కు గురికావచ్చు. అందులోనూ కొ.కు గారి తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు వీర కమ్యూనిస్టు అంటే బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు.

చందమామలో పనిచేయకముందు, చేస్తున్నకాలంలో, బహుశా జీవిత చరమాంకంలో ఉన్న ప్రస్తుత కాలంలో కూడా ఆయన కరడు గట్టిన కమ్యూనిస్టు గానే ఉంటున్నారని గత 30 ఏళ్లుగా చందమామలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే మరో ఉద్యోగి చెబుతున్నారు.

(ప్రస్తుతం చందమామ ప్రింట్ విభాగం అసోసియేట్ ఎడిటర్‌గా ఉంటున్నారు. కొడవటిగంటి కుటుంబరావు, దాసరి సుబ్రహ్మణ్యం, వడ్డాది పాపయ్య. చిత్ర, శంకర్, గాంధీ అయ్యా, విశ్వనాధ రెడ్డి వంటి దిగ్ధంతుల సమకాలికుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం చందమామ తెలుగు పత్రిక ఎడిటింగ్ బాధ్యతలను మొత్తంగా తానే చూస్తున్నారు. 2006లో దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఈ మధ్యే విశ్వంగారు చందమామ బాధ్యతలనుంచి తప్పుకోగా -చందమామపై తెలుగువారి యాజమాన్యం ఈయనతోటే ముగిసిపోయింది- శంకర్, గాంధీ అయ్యా, సుబ్రహ్మణ్యం గార్లు మాత్రమే ప్రస్తుతం చందమామలో సీనియర్ మోస్ట్ ఉద్యోగులుగా మిగిలి ఉన్నారు. ఈ మార్చినెల్లోనే రామకృష్ణన్ అనే మళయాళీ రచయిత ఆంగ్ల చందమామ అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తూ 85 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి కేరళ వెళ్లి అక్కడా విశ్రాంతిగా ఉండకుండా మళయాళీ మనోరమ వంటి పత్రికలకు కథలు రాస్తున్నారు. తరాలుగా చందమామకు దాని బాలసాహిత్యానికి ఒరవడి దిద్దిన సీనియర్ రచయితలు, చిత్రకారులు క్రమంగా తప్పుకుంటున్నారు. దీంతో అనివార్యంగా కొత్త తరాలు ముందుకు రావడం, పత్రికలో సమూల మార్పులు మొదలు కావడం జరుగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే ఆందోళనలో సీనియర్లు, మార్పు తప్పదనేందుకు సంకేతంగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటుండటం... ఇది నిజంగా చందమామకు సంధి దశే..)

చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వచ్చినా పత్రికలో పనిచేసిన వారు ముఖ్యంగా రచయితలు ఎక్కువమంది వ్యక్తిగతంగా మార్క్సిస్టులు కావడంతో తొలినుంచి చందమామ తన లౌకిక స్వభావాన్ని కాపాడుకుంటూ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే.

ఓ 60 సంవత్సరాల కాలంలో మన సమాజం ఎన్ని వక్రగతులకు లోనైనా, బాబ్రీ మసీదులు నేలమట్టమైనా చందమామ కాని, దాంట్లో రచనలు కాని మొదటినుంచీ మత సంకుచితత్వానికి, మతతత్వానికి లోను కాలేదన్నది జగమెరిగిన సత్యం. దీనికి కొడవటిగంటి కుటుంబరావు గారి ఒరవడి ప్రధాన కారణమైతే చందమామ లోని ఆయన సమకాలీనులకు, ప్రస్తుతం కొనసాగుతున్నవారికి ఉంటున్న లౌకిక స్వభావం కూడా దీనికి చందమామను చాలావరకు సెక్యులర్‌గానే ఉంచింది.

దీనికి మొదటి నుంచి ఇటీవలిదాకా కొనసాగిన యాజమాన్యం వైఖరి కూడా తోడయింది. చందమామలో వారానికి అయిదు పనిదినాలు అమలవుతున్న ఈ రోజుల్లో ప్రతి శుక్రవారం సాయంత్రం చందమామ ఆఫీసులో పూజ జరుగుతుండటం నాకు తెలిసి కొత్త సంప్రదాయం కావచ్చునేమో కాని మత విద్వేషం, రెచ్చగొట్టే ధోరణులకు ఇప్పటికీ చందమామ దూరంగానే ఉంది.

ఇదంతా చందమామకు చరిత్రకు సంబందించింది కాగా, రచయితల పేర్లకు బదులు చందమామ అని ప్రచురిస్తూ వచ్చిన సంప్రదాయం యాజమాన్యందే అయినప్పటికీ దీంట్లో కూడా మార్కిజం సంప్రదాయాలు దూరాయేమో మరి. ఈనాటికీ జననాట్యమండలి గాయకులలో, పాటల రచయితల్లో ఒక గద్దర్ మినహా మరెవరి వివరాలు, పేర్లు బయటకు రాలేదు. ప్రజా ఉద్యమం సామూహికమైనప్పుడు వ్యక్తికి ప్రాధాన్యత ఎందుకు అనేది అజ్ఞాత ఉద్యమాల స్వభావం.

చందమామలో దశాబ్దాలుగా ఇదే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా బయటివారు రాసిన కథలు, రచనలకు ఆయా రచయితల పేర్లు జోడిస్తున్నారు తప్పితే చందమామ ఉద్యోగుల రచనలకు ఏ పేర్లూ ఉండవు. దీనికి తోడు మొదటినుంచి మడిగట్టుకున్నట్లు పత్రిక రచన, ముద్రణ మొత్తంగా మద్రాసులోనే ఉండిపోవడం వల్ల కూడా చందమామ రచయితలు, కథకులు ఎవరు అనేది మరుగున పడుతూనే వచ్చింది కాబోలు.

నాలుగు కవితలు రాస్తేనో, రెండు మూడు కథలు రాస్తేనో అచ్చులో పుస్తకాలుగా మారి బహుముఖ ప్రచారాలకు పరుగులెత్తుతున్న కాలం మనది. అలాంటిది దశాబ్దాలుగా బాలసాహిత్యానికి నిబద్ధంగా, అంకితభావంతో పనిచేసిన, రాస్తున్న చందమామ రచయితలు, కథకులు, చిత్రకారులు సాహిత్య ప్రపంచానికి దూరంగానే ఉండిపోవడం విషాదమో, చారిత్రక వాస్తవమో నాకయితే అర్థం కాదు. కుటుంబరావు గారిలాగా బహుముఖ రచనా వ్యాసంగం లేమితో బాలసాహిత్యానికే, పిల్లల కథలకే, ధారావాహికలకే పరిమితం కావడం కూడా దాసరి సుబ్రహ్మణ్యం గారిలాంటి వారికి తగిన ప్రాచుర్యం లభించలేదేమో.

అమెరికాలకు, ఖండఖండాంతరాలకు జీవితం వలస పోయినా చందమామపై తెలుగుజాతి మమకారం ఇంకా చావలేదు కాబట్టి ఇలా మనం బ్లాగుల్లో, తెలుగు వెబ్‌సైట్లలో కూడా 'చందమామ రచయితను కలిసిన వేళ' అంటూ జ్ఞాపకాలను, మాన్య రచయితలను తలుచుకుంటూ ఉండవచ్చు కాని చందమామలో పనిచేస్తున్న, పని మాని చరమాంకంలో ఉన్న వారికి ఇవి ఏవీ తెలియడం లేదన్నదే అన్నిటికంటే మించిన విషాదం. అప్పుడూ, ఇప్పుడూ కూడా వారు మౌనంగా, నిరాడంబరంగా, నిరామయంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అంతకు మించి వారు మరేమీ కోరుకోవడం కూడా లేదేమో మరి.

చందమామ మందకొడితనం ఆన్‌లైన్‌లో కూడా కనిపిస్తుంది. గత దశాబ్దం పొడవునా స్థానిక భాషల్లో ఆన్‌లైన్ ఒరవడి శరవేగంగా మొదలైనప్పటికీ 2008లో కాని చందమామ ఆన్‌లైన్ కోడి కూయలేదు. ఈ రోజుకు కూడా అది ఆన్‌లైన్‌కు సంబంధించిన కొన్ని సాంకేతికతలను అమర్చుకోలేదు. ఎడిటర్ లేకుండా చందమామ కథలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం. ప్రింట్‌లో శ్రీలిపి వెర్షన్‌లో ఉన్న కథలను యూనికోడ్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేయడంలో వస్తున్న బండెడు అచ్చుతప్పులను పరిహరించలేకపోవడం, చందమామ బ్రాండ్ విలువనే తగ్గించేలా ఆన్‌లైన్ పాత కథల్లో ముద్రా రాక్షసాలు దొర్లుతూ పోవడం.. అందుకే వీటన్నింటికీ టోకున మేం చందమామ పాఠకులకు క్షమాపణ చెప్పాలి.

అయినా చందమామ తెలుగు వారిని మరిపిస్తోందంటే అరవై యేళ్ల చరిత్ర క్రమంలో అది పలు తరాలమీద వేసిన ప్రభావమే కారణమని చెప్పాలి. అందుకే చందమామ ఆన్‌లైన్‌లో ఎంత నాసిరకంగా ఆర్కైవ్స్ రూపంలో పాత సంచికలను 1947 నుంచి 1990ల వరకు పాఠకులకు అందుబాటులో ఉంచినప్పటికీ తెలుగు జాతి వాటిని కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటోంది. చూస్తోంది. చదువుతోంది. తమ పిల్లలకు పరిచయం చేస్తోంది.

ఓ ఆరు తరాలు పోయాక చందమామలో చోటు చేసుకుంటున్న నూతన మార్పుల్లో భాగంగా నేనూ ఈ మధ్యనే చందమామ ఆన్‌లైన్ -telugu.chandama.com - లో అడుగుపెట్టాను. 1947లో చందమామ పత్రిక మాదిరే, ఆన్‌లైన్ చందమామ కూడా ఇప్పుడు పురిటి నొప్పులు పడుతోంది. మార్కెట్ అమ్మకాల వలయంలో చిక్కుకుని చందమామ మళ్లీ మునిగిపోతుందా, లేక దాని మాయాజాలాన్ని తట్టుకుని ఈ మాంద్యంలోనూ చందమామ తన బ్రాండ్ విలువను క్యాష్‌గా మార్చుకుని నిలబడుతుందా చరిత్రే చెప్పాలి.

ఏదేమైనా చందమామ ఆఫీసులో ఓ నానుడి కొనసాగుతోంది. "చందమామ బ్రాండ్ విలువ వెయ్యికోట్లకు పైగానే.. కాని దాని మార్కెట్ విలువ -అమ్మకాలు- దాంట్లో 5 శాతం కూడా లేదు." ప్రస్తుతానికయితే మేం పట్టువదలని విక్రమార్కుడిలాగే మౌనంగా, నిరామయంగా చందమామలో పనిచేసుకుపోతున్నాం.

చందమామ ప్రింట్, ఆన్‌లైన్ ఎడిషన్లను తెలుగు జాతి నిలుపుకోగలిగితే... ఆనాటి మన తరాలు చందమామ కథల కోసం పడిన, పడుతున్న ఆరాటం మళ్లీ నేటి పిల్లలకూ కలిగితే.. బండెడు పుస్తకాలు, కొండల లెక్కన పరీక్షలు, మార్కులు, అలివిమాలిన టార్గెట్లు, ఇంజనీరింగ్, డాక్టర్, సాప్ట్‌వేర్ కలల భారంలో బాల్యానికి బాల్యమే హరించుకుపోతున్న నేటి పిల్లల తరం మళ్లీ చందమామను మనలాగా హత్తుకోగలిగితే...

కొన్ని కలలు అందంగానే ఉంటాయి. చందమామ లాగే..

ఇది కామెంట్‌గా కాక పెద్ద వ్యాసం లాగా అయిపోయింది. స్పేస్ లిమిట్ లేకుండా పొరపాటున ఇది మీ సైట్లో కామెంట్‌లాగా జోడించబడినట్లయితే మీకు చేంతాడంత వ్యాఖ్యను పంపి విసుగు కల్పించినందుకు క్షమించగలరని ఆశిస్తూ...

K. Raja Sekhara Raju
Associate Editor
telugu.chandamama.com
Chennai

mobile: 9884612596
Email: krajasekhara@gmail.com

వేణు చెప్పారు...

రాజశేఖర్ గారూ,
మీ వ్యాఖ్యను ఈ మధ్యనే త్రివిక్రమ్ గారి బ్లాగులో చూశాను. చందమామపై ఇంత passion ఉన్న మీరు ఆన్ లైన్ చందమామ బాధ్యతలు చూడటం చాలా సంతోషకరం.
మొత్తానికి మీరు ‘అంతర్జాల సాగర మథనం’ చేస్తూ చందమామ గురించి ఎక్కడెక్కడ రాసివుందో చాలా చక్కగా కనిపెడుతున్నారు. ఆ ప్రస్థానంలో నా బ్లాగులోకి విచ్చేసిన మీకు స్వాగతం.
కొంతకాలం కిందట నేను సరిగ్గా ఇదే పనిచేశాను, ఆసక్తి కొద్దీ. తెలుగు లిపి సాధనంగా అన్వేషణ మొదలు పెట్టేవరకూ నాకు త్రివిక్రమ్, నాగమురళి, బ్లాగాగ్ని గార్ల చందమామ నిధులు దొరకలేదు. నా బ్లాగులో చందమామ టపాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా రాస్తాననుకోండీ.
‘కుటుంబరావు గారిలాగా బహుముఖ రచనా వ్యాసంగం లేమితో బాలసాహిత్యానికే, పిల్లల కథలకే, ధారావాహికలకే పరిమితం కావడం కూడా దాసరి సుబ్రహ్మణ్యం గారిలాంటి వారికి తగిన ప్రాచుర్యం లభించలేదేమో’అనే మీ వ్యాఖ్య అర్థవంతం.
‘చేంతాడంత వ్యాఖ్యను పంపి విసుగు కల్పించినందుకు...’ లేదు, లేదు. మీ వ్యాఖ్య చందమామ అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తుందండీ.
(అన్నట్టు దాసరి సుబ్రహ్మణ్యం గారిని ఈ మధ్యే మళ్లీ విజయవాడలో కలిశాను. ఆయన ఫొటో కూడా తీసుకున్నాను. దాన్ని వేరే టపాగా రాస్తా, త్వరలోనే).

రాజశేఖర్ చెప్పారు...

వేణు గారూ.. నా ఈమెయిల్ ఐడికి త్రివిక్రమ్ గారు పంపిన సమాధానం ఇప్పుడే చూశాను. ఇప్పుడు మీ సత్వర తిరుగు టపాను కూడా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది చందమామ పిచ్చోళ్లతో 47 ఏళ్ల వయసులో కాని నెట్ సంబంధం పెట్టుకోలేకపోయినందుకు బాధగా కూడా ఉంది.

ఇంతకు ముందు telugu.webdunia.com లో నాలుగేళ్లుగా పనిచేసినా, raju123.mywebdunia.com పేరిట బ్లాగ్‌లో సంవత్సర కాలంలో వందకు పైగా కథనాలు పోస్ట్ చేసినా, వెబ్‌దునియా యాజమాన్యం వారు ఇతర బ్లాగర్లతో సంబందాలు లేకుండా కట్ చేయడంతో మీలాంటి ఏ ఇతర తెలుగు బ్లాగర్లతోనూ ప్రత్యక్ష సంబంధాలను పెట్టుకోలేకపోయాను. అందుకే నాలుగేళ్లుగా చాలా కోల్పోయామనిపిస్తోంది. బయట జరుగుతున్నదేదీ మన దృష్టికి రాకపోవడమంటే వ్యక్తిగతంగా కూడా నష్టమే కదా..

నేను ఈమధ్యే చందమామలో చేరాక... తన చరిత్రపై తనకే మక్కువ లేని దాని నిర్మమకారాన్ని చూసి ఓ రకంగా వణికిపోయిన నేపధ్యంలో చందమామ గత చరిత్ర అంతు చూడాలనే ఓ ఉన్మాదావస్థలో దొరికిన సమాచారాన్ని దొరికినట్లుగా ఆబగా అంది పుచ్చుకుంటున్నాననుకోండి. ఇప్పటికే చందమామ చరిత్రపై, మీలాంటి నిజమైన అభిమానులు రాస్తున్న కథనాలను 20 పైగానే సేకరించాను. ఇలా సేకరిస్తున్న చరిత్రను అందరికీ అందుబాటులో ఉంచాలంటే కాపీ రైట్ వంటి సంకుచిత పరిధులను దాటి మనం చాలా దూరమే ప్రయాణించవలసి వస్తుందేమో..

వీలైతే చందమామ ప్రస్తుత యాజమాన్యం అనుమతితో telugu.chandmama.com లోనే చందమామ చరిత్ర పేరిట ప్రత్యేకంగా ఓ కేటగిరీని రూపొందించుకుని వికీపీడియా, ఈమాట.కామ్, మీరూ, త్రివిక్రమ్ గారూ, ఇంకా ఎందరో రాస్తున్న రచనలు, జ్ఞాపకాలను ఒకే చోట ఉంచి చరిత్రను పదిలంగా ఉంచాలని ఎంతో ఆశగా ఉంది. దీనికి రెండు రోజుల క్రితమే చందమామ యాజమాన్యం అంగీకారం తెలిపింది. అయితే ఈ బృహత్కార్యంలో మీ వంటి వారి సహకారం ఎంతైనా అవసరం అవుతుందనుకుంటాను.

చందమామ గురించి, దాని రచయితల గురించి మీలాంటి వారు రాస్తున్న కథనాలు, చేస్తున్న చర్చలు వంటి వాటిని చందమామ వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక కేటగిరీ కింద మీ పేర్లతో సహా పోస్ట్ చేయడానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటాయా? అసలే లీగాలిటీ, కాపీరైట్ సమస్యల పట్ల నాకెంత బద్ధ వ్యతిరేకతో.. మరోవైపు వాటిగురించి పెద్దగా తెలీదు కూడా.

నా chandamamatho.blogspot.com లో వికీపీడియా చందమామ బృహత్ వ్యాసం, ఈమాట.కామ్‌లో రోహిణీ ప్రసాద్ గారు రాసిన చందమామ జ్ఞాపకాలు వంటి రచనలు తిరిగి పోస్ట్ చేసి వారి సౌజన్యంతో అనే ముక్క తగిలించి ఆయా వెబ్‌సైట్ల లింకులు ఇస్తేనే చందమామ ఆన్‌లైన్ భాషల కంటెంట్ హెడ్ భయపడ్డారు. ఇతర వెబ్‌సైట్లకు ప్రచారం ఇస్తే యాజమాన్యం ఎలా ఫీలవుతుందో అనే ఆందోళన ఓ వైపు.. ఇతరుల రచనలను మన సైట్‌లో, బ్లాగుల్లో పోస్ట్ చేస్తే తర్వాత లీగల్ సమస్యలు వస్తే ఎలా అనేది మరొకవైపు.

చందమామ చరిత్ర గురించి చందమామలో పోస్ట్ చేయడానికి కూడా ఎన్ని తిప్పలో, ఎన్నెన్ని భయాలో చూడండి.

దాసరి సుబ్రహ్మణ్యం గారిని మళ్లీ కలిసి ఫోటో తీసుకున్నానన్నారు. ఆయన జ్ఞాపకాలతో మళ్లీ వివరంగానే రాయండి. ఈ లోగా 13 రాత్రి నెట్‌లో సెర్చ్ చేస్తుంటే కౌముది.నెట్‌ ఏప్రిల్ 2009 సంచికలో ఈ కథల మాంత్రికుడి గురించి వసుంధర గారు పలవరిస్తూ రాసిన మంచి పరిచయం పిడిఎఫ్ రూపంలో కనబడింది. కింది లింకు చూడండి.

http://koumudi.net/Monthly/2009/april/index.html

if you con't see the text properly... pls download it as a pdf file from above url.

మళ్లీ ఇంకో చాంతాడు పెరిగిపోయినట్లుంది. ఇంతటితో ముగిస్తాను.

వీలైతే, మీకు తీరిక ఉంటే నా కొత్త, పాత బ్లాగులను కాస్సేపు తడిమి చూడగలరు. నా వెబ్‌దునియా బ్లాగుల్లో అన్నీ కమిటెడ్ రచనలుగా ఉండవని మనవి. వెబ్‌దునియాలో పనిచేసేటప్పుడు సంస్థ అవసరాల ఒత్తిళ్ల మధ్య కొన్ని సాధారణ విషయాలపై కూడా రాయవలసి వచ్చింది.

my new blogs
----------------------
chandamamatho.blogspot.com (on chandamama history)
chandamama-raju.blogspot.com (on chandamama history)

my Old blogs
--------------------
raju123.mywebdunia.com
blaagu.com/mohana

ఓ మంచి లక్ష్యసాధనలో భాగంగా అనుకోకుండా ఇలా కలుసుకున్నాం. మన ఈ స్నేహ బంధం కొనసాగుతుందని ఆశిస్తూ

మీ
రాజశేఖర

వేణు చెప్పారు...

రాజశేఖర గారూ,

కౌముదిలో వసుంధర గారి ఆర్టికల్ లింక్ ను నేను ఈ పోస్టు చివరలో ఇచ్చాను కదండీ, చూళ్ళేదా?

‘చందమామ చరిత్ర పేరిట రచనలు, జ్ఞాపకాలను ఒకే చోట ఉంచి పదిలంగా ఉంచాలని ఎంతో ఆశగా ఉంది. దీనికి రెండు రోజుల క్రితమే చందమామ యాజమాన్యం అంగీకారం తెలిపింది’ చాలా సంతోషకరమైన విషయం.
చందమామ గురించి, దాని రచయితల గురించి రాస్తున్న కథనాలు, చేస్తున్న చర్చల వంటి వాటిని చందమామ వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక కేటగిరీ కింద ఆయా రచయితల పేర్లతో సహా పోస్ట్ చేయడానికి బ్లాగర్ల నుంచి అభ్యంతరాలు ఉండవు.

కానీ ఈ-మాట, కౌముది లాంటి వెబ్ మ్యాగజీన్ల యాజమాన్యాల నుంచి మాత్రం అనుమతి అవసరమవుతుంది. వారు కూడా లింక్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు కానీ పూర్తి పాఠం ఇవ్వటానికి అనుమతించకపోవచ్చు. లింక్ ఇవ్వగలిగినా మంచిదేగా.
‘చందమామ చరిత్ర గురించి చందమామలో పోస్ట్ చేయడానికి కూడా ఎన్ని తిప్పలో, ఎన్నెన్ని భయాలో చూడండి’ మీ ఆవేదన ఎంతో అర్థవంతం.
మీ బ్లాగులను చూస్తాను.
మీ లక్ష్యసాధనలో బ్లాగర్ల సహకారాలు మీకు నిశ్చయంగా లభిస్తాయి.

త్రివిక్రమ్ Trivikram చెప్పారు...

ఈ మధ్య చాలారోజులుగా బ్లాగులు చదవడం, రాయడం కుదరలేదు. రాజశేఖర రాజు గారు చెప్పగా ఈ టపా ఇప్పుడే చూస్తున్నాను. నేను ఒక కథ రాసి చందమామకు పంపినప్పుడు సమాధానంగా సుబ్రహ్మణ్యం పేరుతో సమాధానం వచ్చింది. దాసరి సుబ్రహ్మణ్యం గారేనా అని ఒక నిమిషం ఉద్విగ్నతకు లోనయాను. కానీ ఆయన రిటైరైన తర్వాత తెలుగు చందమామ బాధ్యతలు చూస్తున్నాయన పేరు కూడా సుబ్రహ్మణ్యమేనని కౌముదిలో వసుంధర గారి వ్యాసం ద్వారా తెలిసింది. ఇక్కడ రాజశేఖర గారు కూడా ఆ విషయాన్ని ధ్రువపరిచారు. నా చిన్నప్పుడు చందమామలో వపా (ముఖచిత్రాలు), శంకర్, చిత్రా లే కాకుండా జయ, వీరా, సీతారామ్, రాజి లు కూడా బొమ్మలు వేసేవారు. బొమ్మను చూసి సంతకం చూడకుండా ఆ బొమ్మ వేసిందెవరో ఊహించడం అప్పట్లో నాకదో సరదా.

"చందమామ గురించి, దాని రచయితల గురించి మీలాంటి వారు రాస్తున్న కథనాలు, చేస్తున్న చర్చలు వంటి వాటిని చందమామ వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక కేటగిరీ కింద మీ పేర్లతో సహా పోస్ట్ చేయడానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటాయా?"
అభ్యంతరమా!! చందమామ గురించి నేను రాసుకున్న రాతలు చందమామ వెబ్సైట్లో చేరితే అంతకంటే కావలసిందేముంటుంది? చందమామ గురించి రాసిన బ్లాగరులందరూ నాలాగే అంటారని భావిస్తున్నాను.
"ఈ-మాట, కౌముది లాంటి వెబ్ మ్యాగజీన్ల పూర్తి పాఠం ఇవ్వటానికి అనుమతించకపోవచ్చు"
విషయం తెలిపి ఆయా పత్రికలవాళ్ళను అడిగినట్లైతే వారు అంగీకరించవచ్చనే అనుకుంటున్నాను.

వేణు చెప్పారు...

త్రివిక్రమ్ గారూ, వ్యాఖ్య రూపంలో మీరు పలకరించినందుకు సంతోషంగా ఉంది.
చందమామకు అంతర్జాలంలో పర్యాయపదం త్రివిక్రమ్. తర్వాత నాగమురళి, బ్లాగాగ్ని (ఫణి). ఆ తర్వాత బహుశా... నేను! (కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారిది ప్రత్యేక స్థానం అనుకోండీ).

‘బొమ్మను చూసి సంతకం చూడకుండా ఆ బొమ్మ వేసిందెవరో ఊహించడం అప్పట్లో నాకదో సరదా.’...

భలేగా ఉందండీ. ఇలాంటి సరదా నాకూ ఉండేది. నా విషయంలో అయితే చిత్రకారులను ఊహించటం కాదండీ, కచ్చితంగా చెప్పగలిగేవాణ్ణి.
‘విషయం తెలిపి ఆయా పత్రికలవాళ్ళను అడిగినట్లైతే వారు అంగీకరించవచ్చనే అనుకుంటున్నాను’...
ఇదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది?

kanthisena చెప్పారు...

వేణుగారూ..

20 రోజులు ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను. మన్నించాలి. కౌముదిలో వసుందరగారి ఆర్టికల్ లింక్ విషయంలో మీరే కరెక్టు కావచ్చు. మే 14,15 రోజుల్లో రెండు రాత్రులు పూర్తిగా మేలుకుని నెట్‌లో చందమామ లింకులను శోదిస్తున్న క్రమంలో వసుంధర గారి ఆర్టికల్ లింక్‌ కూడా నేనే వెతికినట్లు భ్రమించి ఉంటాను. ఆ సమయంలో మీరిప్లైలో దాని లింకు ఉందనే విషయం నిద్రాలేమిలో మర్చిపోయి ఉండటం కూడా కారణం కావచ్చు. ఏదేమైనా చాలా మంచి ఆర్టికల్ లింక్ పంపారు. కౌముది లింక్‌లో దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి వసుంధర గారి రచనను చందమామ ప్రింట్ ఎడిషన్ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రింట్ తీసి చూపిస్తే చదివి చాలా సంతోషించారు. దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ఇంత బ్యాలెన్సెడ్‌గా వసుంధరగారు రాయడాన్ని ఆయన మెచ్చుకున్నారు. నెట్‌లో మీవంటి ప్రముఖ బ్లాగర్లు చందమామపై రాస్తున్న అభిమానపు దొంతరల గురించి ఆయనకు చెబితే బాగా స్పందించారు. వీలయితే చందమామపై మీవంటి వారి రచనలు, జ్ఞాపకాలను ప్రింట్ తీసి ఆయనకు ఓ కాపీ ఇద్దామనుకుంటున్నాను.

ఈలోగా చందమామలో నెట్‌లో మీవంటివారి రచనల లింకులను దాదాపుగా సేకరించాను. ఒకటి రెండు రోజుల్లో మీకూ, త్రివిక్రమ్ గారికీ వాటిని పంపుతాను. అవి కాక మీ దృష్టిలో ఇంకా చందమామ లింకులు అదనంగా ఉన్నట్లయితే వాటిని జోడించి నాకు పంపగలరు. అన్నీ సమకూరిన తర్వాత వాటిని ఒక్కటొక్కటిగా చందమామ ఆన్‌లైన్ ఎడిషన్‌లో పోస్ట్ చేస్తాము.

"చందమామ గురించి, దాని రచయితల గురించి రాస్తున్న కథనాలు, చేస్తున్న చర్చల వంటి వాటిని చందమామ వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక కేటగిరీ కింద ఆయా రచయితల పేర్లతో సహా పోస్ట్ చేయడానికి బ్లాగర్ల నుంచి అభ్యంతరాలు ఉండవు" మనఃపూర్వక కృతజ్ఞతలు.

త్రివిక్రమ్ గారికి, మీకూ, మీవంటి చందమామ పిచ్చోళ్లకు చందమామ తరపున ఇదే మా ఆహ్వానం. మీ అమూల్యమైన సమయంలో కొంత కేటాయించి ఆన్‌లైన్ చందమామకు చందమామతో మీ అనుబంధం గురించి, మీకు ఆసక్తి ఉన్న అంశాలపైనా చిన్ని చిన్ని రచనలు అయినా సరే రాసి పంపడానికి మీకు వీలవుతుందా? సైన్స్, టెక్నాలజీ, హాస్యం, మీకు తెలుసా, లోకజ్ఞానం, బారత దర్శిని, సాహిత్యం, శ్రావ్యమైన సంగీతం మీ ఇతర అభిరుచులు, ఆసక్తులకు సంబంధించి ఏ విషయంపైన అయినా సరే మీరు రచనలు పంపగలిగితే చందమామ గౌరవనీయ రచయితలు (హానరరీ రైటర్స్) విభాగంలో మీ రచనలను ప్రచురించగలం.

ప్రతి చందమామ పిచ్చోడికి, పిచ్చోళ్లకి చందమామ ఆన్‌లైన్ తమదిగా ఫీలయ్యే వేదికగా ఉండాలని మా ప్రగాడ కాంక్ష, విశ్వాసం కూడా. హృదయం నిండా చందమామ తలపులను దివ్యంగా పొదవుకున్న మీ వంటి అభిమానులకు ఆన్‌లైన్ చందమామ సాదర నిలయంగా మారాలని వ్యక్తిగతంగా కూడా నాకు ఆశగా ఉంది. మీరు పంపే ఏ రచనను అయినా సరే మీ పేరుతోనే చందమామలో పోస్ట్ చేస్తాము.

ఈ లోపల మీనుంచి మీ వంటి చందమామ అబిమానుల నుంచి మాకు నిజమైన సహకారం ఒకటి కావాలి. ఆశిస్తున్నాం కూడా. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఆన్‌లైన్ చందమామ రచన, డిజైన్, హోమ్ పేజీతో సహా ప్రతి ఒక్క అంశంపై మాకు మీ సలహాలు, సూచనలు, విమర్శలు, నిర్మోహమాటమైన అభిప్రాయాలు కావాలి. చందమామ మరింత మెరుగుపడాలని, వన్నెలద్దుకోవాలని భావిస్తున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే ఈ కింది లింకులకు మీరు మీ సూచనలు, సలహాలు, ప్రతిపాదనలు దయచేసి పంపగలరు. మీకు తెలిసిన చందమామ అభిమానులకు, 'చంపి'లకు కూడా ఈ సమాచారం వీలయితే పంపగలరు.

abhiprayam@chandamama.com
Online@Chandamama.com

1947 నుంచి చందమామ పాత కాపీలను తిరిగి అచ్చురూపంలో కావాలనుకునే అభిమానులకు మంచి వార్త. ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రాతిపదికన కోరిన వారికి ఒక్కో సంవత్సరం చందమామలను ఒక బంచ్‌గా ప్రింట్ చేసి ఇవ్వడానికి చందమామ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. అతి త్వరలోనే దీనిపై చందమామ ప్రింట్, ఆన్‌లైన్ ఎడిషన్లలో ప్రకటన రావచ్చు. అలనాటి చందమామలను తిరిగి ప్రింట్ రూపంలో చూడాలని, కావాలని కోరుకునేవారికి మీ పరిధిలో మీరూ సమాచారం పంపగలరు. దీని ధరవరలు మాత్రం ఇప్పటికైతే తెలీవు.

కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారి మానాన్న జ్ఞాపకాలు, చందమామ జ్ఞాపకాలు చదివే ఉంటారు. ఒకవేళ మిస్సయి ఉంటే ఈ కింది లింకులు చూడగలరు.

http://www.pranahita.org/2008/11/maa_naanna_gnapakalu/

http://www.eemaata.com/issue41/chandamama.html

జూన్ నెల చివరిలోగా వీలైతే విజయవాడలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని కలిసి రావాలని మేము (బాలసుబ్రహ్మణ్యంగారు, నేను) అనుకుంటున్నాము. అన్నీ కుదిరితే వచ్చే శనివారం లేదా అటుపై శనివారం ఆయనను కలవాలని అనుకుంటున్నాం. ఆయన గురించి మీరు మరో రచన ఫోటోతో సహా వేస్తానని చెప్పారు. ఎదురు చూస్తున్నాం.


కె.రాజశేఖర రాజు

telugu.chandamama.com

M b d syamala చెప్పారు...

వేణూూ!చందమామ రచయిత శ్రీ సుబ్రహ్మణ్యం గార్ని నువ్వు కలుసుకున్నట్లు నీ బ్లాగు ద్వారా తెలుసుకుని ఎంతో సంతోషించాను!నేను చందమామని చదివి చూసి సంతోషిస్తే నువ్వా చందమామను అందుకున్నట్లుంది!ఎంత స్పందన!ఈ బ్లాగుకి!ఎందరు విశిష్టులైన అభిమానులు!నా బాల్య స్నేహితునికి అభినందనలు!