సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఏప్రిల్ 2009, సోమవారం

ఈ పుస్తకం నాకు ఉపయోగపడింది!

రచయిత్రి  రంగనాయకమ్మ



నసులో భావాలను అక్షరాల్లోకీ, అందమైన వాక్యాల్లోకీ మార్చి చూసుకుంటే ఎంత బావుంటుందో! బ్లాగర్లకు ఇది నిత్యం అనుభవమే. స్వేచ్ఛగా, హాయిగా, పదునుగా రాయటం గొప్ప నేర్పు.

కవిత్వమే కాదు, వచనం కూడా ఆల్కెమీయే... రసవాదమే.

ఆ రహస్యం శ్రీశ్రీకీ, కొ.కు.కీ తెలుసు.
చలం గారికి తెలుసు,
రంగనాయకమ్మ గారికి తెలుసు. 
ముళ్ళపూడి వెంకట రమణ గారు ... 
ఇంకా చాలామంది ఈ జాబితాలోకి వస్తారనుకోండీ.

ఇక్కడ ప్రస్తుతం నేను చెప్పదల్చుకున్నది- అందంగా రాయటం గురించి కాదు, తప్పుల్లేకుండా సక్రమంగా వాక్యాలు రాయటం గురించి.


రోజూ అక్షరాలతో సహవాసం చేసే పాత్రికేయులే అసూయ పడేలా ‘ఈజ్’తో రాసేవారు కొందరు మన తెలుగు బ్లాగావరణంలో కనిపిస్తారు. అలాగే భాష విషయంలో తప్పటడుగులు వేసేవారు కూడా ఉన్నారనుకోండీ.
చిన్నప్పటినుంచీ కథలూ, నవలలూ ఇష్టంతో చదివేవారూ; లేఖలూ, డైరీలూ అలవాటున్నవారూ తెలుగును కొంత బాగా రాయగలుగుతారు.

ఇలాంటి నేపథ్యం ఉన్న నాకు కూడా ఎంతో ఉపయోగపడిన పుస్తకం - ‘వాడుక భాషే రాస్తున్నామా?’.

పత్రికా రంగంలో తొలి అడుగులు వేస్తున్నపుడు నా కోసమే రంగనాయకమ్మ గారు రాశారా అన్నట్టు ఈ రచన ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా ప్రారంభమైంది.

శ్రద్ధగా వారం వారం చదివేవాణ్ని.

భాషకు సంబంధించి నాలో స్పష్టంగా, అస్పష్టంగా ఉన్న చాలా సందేహాలను తీర్చిందీ రచన. తెలియని విషయాలను నేర్పింది. తర్వాత పుస్తక రూపంలో వచ్చింది.

ఇదేదో అకడమిక్ పుస్తకంగా నీరసంగా ఉంటుందనుకోవద్దు. తిరుగులేని తర్కం, వ్యంగ్యం, హాస్యం ముప్పేటలా అల్లుకుని పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయి.

తెలుగును సక్రమంగా రాయాల్సిన పాత్రికేయులకు నేను రికమెండ్ చేసే పుస్తకాల్లో దీనికి మొదటి స్థానం. ఈ పుస్తకం చదవని బ్లాగర్ మిత్రులూ, బ్లాగ్ వీక్షకులూ కూడా ఓసారి చదవాలని నా సూచన.

దాదాపు 19సంవత్సరాల క్రితం పుస్తకంగా అందుబాటులోకి వచ్చిన ఈ రచనకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. దీనికి రుజువులు ఇప్పటికీ తెలుగు పత్రికల్లో వస్తున్నరకరకాల దోషాలే. (ఆ దోషాలన్నీ ఈ రచనలో ప్రస్తావించినవే).
‘బడు’ వాడకం గురించి భాషావేత్త చేకూరి రామారావు గారి వాదనలూ, రంగనాయకమ్మ గారి ప్రతివాదనలూ ఈ పుస్తక పాఠకులకు బోనస్.

‘‘భాషని ‘రాయడం’ దగ్గిరికి వచ్చేటప్పటికే వస్తుంది గొడవ అంతా. మాట్లాడేటప్పడు ఎన్నడూ జరగని రకరకాల తప్పులు, రాసే భాషలో జరుగుతూ వుంటాయి’’ అంటూ ఈ రచన కొనసాగిస్తారు రంగనాయకమ్మగారు.

దినపత్రికల్లో కొంతకాలం వచ్చిన దోషాలను శ్రద్ధగా సేకరించి, వర్గీకరించి ఓ పరిశోధన లాగా ఈ రచన చేశారు.

2007 ఫిబ్రవరిలో వచ్చిన 3వ ముద్రణ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

డెమ్మీ సైజులో 175 పేజీల ఈ పుస్తకం ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా-

‘అరుణా పబ్లిషింగ్ హౌస్’, విజయవాడ. (ఫోన్ 0866 - 2431181).

విశాలాంధ్ర ప్రచురణాలయాల్లో, ఇతర పుస్తక కేంద్రాల్లో కూడా దొరుకుతుంది.

ధర 30 రూపాయిలు.

కినిగె సైట్  ద్వారా  ఈ -బుక్ గా  కూడా కొనుగోలు చేయవచ్చు. లింకు-  
http://kinige.com/kbook.php?id=1026&name=Vaduka+Bhashe+Rastunnaamaa

10 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఈ వ్యాసాలు పత్రికలో ధారావాహికంగా వస్తున్నప్పుడూ చదివాను. తరవాత పుస్తకమూ చదివాను. నాకు గొప్పగా అనిపించలేదు (మీ స్వానుభావ్న్ని నేను కాదంటల్లేదు.) కాకపోతే రెండు పాయింట్లు. రంగనాయకమ్మ తన కథల్లో నవలల్లో మంచి వచనం రాశారు. రెండోది .. తెలుగులో వచన రచనకి ఒక స్టైల్ బుక్ ఎంతైనా అవసరం ఉంది. లేకపోతే దినపత్రికల భాషే వాడుకభాషగా చలామణి అయిపోతోంది ఇప్పటికే. సృజనాత్మక రచయితలు కూడా అలాంటి భాషే రాస్తున్నారు.

Praveen Mandangi చెప్పారు...

ఈ పుస్తకం నేను ప్రజాశక్తి బుక్ హౌస్ లో కొన్నాను.

వేణు చెప్పారు...

కొత్త పాళీ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
ఈ పుస్తకం గొప్పగా అన్పించలేదన్నారు, యుటిలిటీ విషయంలో కూడా మీ అభిప్రాయం అదేనా?
పత్రికల్లో విరివిగా వస్తున్న దోషాల గురించిన పరిశీలనా వ్యాసం ఈ పుస్తకం. ఆ దోషాలను గమనించి, ‘ఇలా దిద్దుకోవాలి’ అని చెప్పిన పుస్తకం. ఇది గొప్పగా అన్పించనట్టయితే- ఆ దోషాల విషయంలో మెరుగ్గా చెప్పిన మరో పుస్తకం మీకు తెలిసి ఏమైనా ఉందా? తెలుపగలరు.

ఉమాశంకర్ చెప్పారు...

ఈ పుస్తకం ప్రభావం నామీద ఎంత ఉందో మాటల్లో చెప్పలేను. ఎప్పుడో చదవటమూ, ఇప్పుడు చాలా వరకు మర్చిపోవటమూ జరిగింది. చాలా ఏళ్ళ తరువాత నా బ్లాగులో వచ్చీరాని తెలుగులో ఏవో రాతలు రాస్తున్నంతసేపూ ఈ పుస్తకం గుర్తుకొస్తూ ఉంటుంది.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...

పైన నా వ్యాఖ్యలో "హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఉండాలి. వాడుక భాష రాస్తానని చెప్తూనే తప్పు...ప్చ్!:))

Praveen Mandangi చెప్పారు...

మా మామయ్య అంటుండేవాడు "మాట్లాడితే పూర్తిగా ఇంగ్లిష్ లో మాట్లాడు, లేదా తెలుగులో మాట్లాడు కానీ సంకర బాష మాట్లాడకు" అని. కానీ రంగనాయకమ్మ గారి లాగ syntax (వాక్య నిర్మాణం) గురించి ఆలోచించమని చెప్పలేదు.

వేణు చెప్పారు...

@ Praveen's talks: పుస్తకం చదివాక మీకేమన్పించింది? వాక్య నిర్మాణ మర్మాలు ఏవైనా తెలిశాయా?

@ ఉమాశంకర్ గారు : ‘నా బ్లాగులో వచ్చీరాని తెలుగులో ఏవో రాతలు రాస్తున్నంతసేపూ ఈ పుస్తకం గుర్తుకొస్తూ ఉంటుంది’ అన్నారు. భాషను సరిగా రాయటం నేర్చుకోవాలంటే అది పెద్ద కష్టమేమీ కాదండీ.

@ సుజాత గారు : ‘ఆ వ్యాసాల ప్రభావం నా మీద కూడా ఉంది’ అన్నారు. సంతోషమండీ.
రంగనాయకమ్మగారికి తన ఫొటోలపై ఆసక్తి ఉండదు. రచనతో ఫొటో ఇవ్వమంటే ‘రచన సరిపోతుంద’ని అంటారు. అందుకే ఆమె ఫొటోలు పత్రికల్లో గానీ, వెబ్ లో గానీ పెద్దగా కన్పించవు.
ఈ ఫొటో నాలుగున్నర సంవత్సరాల నాటిది. భద్రంగా దాచుకున్నాను అప్పట్నుంచీ. ఇప్పుడిలా తన ఫొటోను అంతర్జాలానికి ఎక్కించానని తెలిస్తే కోప్పడతారేమో. అలా జరిగితే మీ వ్యాఖ్యను కవచంలా అడ్డు పెట్టుకోవచ్చన్నమాట!

Anwar చెప్పారు...

మీ బ్లొగ్ చూస్తున్నప్పుడు 10 ఏండ్ల నాకొడుకు పక్కకి వచ్చి రంగనాయకమ్మ గారి ఫొటొ చూసి "ఎవరబ్బా ఆమె" అన్నాదు, "నీకు తెలియదులేరా ఆవిడ రంగనాయకమ్మగారని" అంటుండగానే వాడు,"నా కెందుకు తెలియదు, అమ్మకి ఆదివారం లెదా? వ్రాసినావిడ కదా అని చురుగ్గా చూసి పడుకొదానికి వెల్లిపొయాడు, ఇందులొ గొప్పకొసం లాంటిదేమి కాదు కాని నా బిడ్డను చూసి నాకెంత సంతొషం కలిగిందొ.

వేణు చెప్పారు...

అన్వర్ గారూ, మీ బాబుకు నా అభినందనలు చెప్పండి. పిల్లలే కదా, ఏమీ తెలీదు అనుకోకూడదు. వాళ్ళ పరిశీలన ఒకోసారి అబ్బురమనిపిస్తుంది.