సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

6, ఏప్రిల్ 2009, సోమవారం

‘విన్నారా అలనాటి వేణుగానం?’

ప్పుడీ రీ- మిక్స్ రోజుల్లో ...
ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కన్నుమూసిన రమేష్ నాయుడు గురించీ, ఆయన సంగీతం గురించీ ఎవరైనా పట్టించుకుంటారా?

ఈ సందేహం కొంత సరైందే.

కానీ, మధురమైన సంగీతానికి మైమరిచిపోయే శ్రోతలు ఎప్పుడూ ఉంటారు. శ్రావ్యమైన  పాట అజరామరం కదా!

అచ్చతెలుగు సినీ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.

తెలుగు శ్రోతలకు రమేష్ నాయుడు  సంగీతం ఏళ్ళ తరబడి  అందిందంటే..  ప్రధానంగా  ముగ్గురు వ్యక్తులు కారకులు.   వారు  దర్శకులైన  దాసరి నారాయణరావు,  విజయనిర్మల,   జంధ్యాల. 

ఈ ముగ్గురూ ఆయన  సంగీతాన్ని  ఎంతో ఇష్టపడి, ఎన్నో సినిమాల్లో  ఆయన ప్రతిభను  ఉపయోగించుకున్నారు.  ఆయన కూడా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని  ఎన్నో మధురమైన పాటలను స్వరపరిచి, అందించారు. 


మామూలు మాటలుగా కన్పించేవి కూడా ఆయన కూర్చిన స్వరాల స్పర్శకు జీవం పోసుకుంటాయి. యాంత్రికంగానో,  పొగడ్తగానో   అంటున్న వ్యాఖ్య కాదిది.

‘చదువు-సంస్కారం’లో ‘దీపానికి కిరణం ఆభరణం’ పాట వినండి.

‘చందన’లో ‘ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి’ వినండి.

నా మాటల్లో నిజమెంతో తెలుస్తుంది.

‘శ్రీవారికి ప్రేమలేఖ’లో ‘మనసా తుళ్ళిపడకే...’ , ‘

శివరంజని’లో ‘ జోరు మీదున్నావు తుమ్మెదా’ పాటల్లో సాహిత్యానికి ప్రాణం పోసిన స్వరకల్పనను ఆస్వాదించండి.

‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము..’ పాటలోని స్వర విన్యాసం,

‘అమ్మ మాట’లో ‘ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్’ పాటలో పలికిన చిలిపితనం ఆహ్లాదించండి.

‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో  ‘విన్నారా అలనాటి వేణుగానం’ పాట .. సింప్లీ సుపర్బ్!

ఈ పాట పల్లవి  వినండి....

 


గాలి పాటలను కూడా ఎంత బాగా స్వరపరిచారో ‘మసక మసక చీకటిలో..’, ‘మాయదారి సిన్నోడు...’ పాటలు చక్కటి ఉదాహరణలు.

రమేష్ నాయుడు గారి గురించి వేటూరి తన ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకంలో  రెండు అధ్యాయాలు కేటాయించి  రాశారు. వాటిని  వీలు చూసుకుని చదవండి.


అంతకంటే ముఖ్యంగా రమేష్ నాయుడు స్వరాభిషేకంలో తడిసి, ముద్దవ్వండి!

పాటలు ఎక్కడ వినాలంటారా? ఓ రెండు సైట్ల లంకెలు ఇస్తున్నా.
http://www.chimatamusic.com/rameshNaidu.php?PHPSESSID=bf4f3e490a1c4360c257166bade813f1

http://www.24by7music.com/SongsByTag.aspx?CategoryID=10

10 కామెంట్‌లు:

నాలోనేను చెప్పారు...

great

krishna rao jallipalli చెప్పారు...

ఒక వారం క్రితం ఒక టి.వి ప్రోగ్రాములో శ్రీ దాసరి నారాయణ రావు గారు . శివ రంజని సినిమాలోని జోరుమీదున్నావు... పాటకి శ్రీ రమేష్ నాయుడు గారు కేవలం మూడంటే మూడు వాయిద్యాలు మాత్రమె వాడారు.. అప్పట్లో దానిని రికార్డు చేయడానికి 550 రూపాయిలు ఖర్చు అయ్యింది ... అని చెపితే ఆశ్చర్యం వేసింది.

వేణు చెప్పారు...

‘జోరు మీదున్నావు తుమ్మెదా’ గురించి వేటూరి తన ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకంలో ఏం రాశారో చూడండి-
‘ఒక్క ఏక్ తార ప్రధాన వాద్యంగా రమేష్ నాయుడు చేసిన ‘జోరు మీదున్నావు’ సంగీతం ఉన్నన్నాళ్లూ ఉంటుంది.’
‘దాసం గోపాలక్రిష్ణ గారు ఆ పల్లవి రాయగానే ఎవరూ ఊహించని విధంగా జానపదానికి శాస్త్ర్త్రీయ సంగీత సౌరభాలు అద్ది మోహన కళ్యాణిలో రమేష్ నాయుడు స్వరపరిచారు. ఆ స్వర రచనా వైదుష్యానికి రసాలూరు రాజేశ్వరుడంతటివాడు ఆశ్చర్యపోయి నాయుడిగారికి అభినందనలు తెలిపి, ఆశీర్వదించారు’

మనసును తాకాలంటే పాటకు అవసరమైన వాద్యాలు కావాలి కానీ, మితిమీరిన వాద్య ఘోష అనవసరం కదా!

సుజాత వేల్పూరి చెప్పారు...

"దీపానికి కిరణం ఆభరణం" "ఇంకా ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి" పాటలు చాలా హాయిగా ఉంటాయి వినడానికి. రమేష్ నాయుడి గారి పాటల్లో చాలా వరకూ ఇలా ప్రశాంతంగా ఒక్కరే కూచుని అనుభవించేలా ఉంటాయి. గుంపుగా విని కేరింతలు కొట్టేవి కాదు.

జోరు మీదున్నావు తుమ్మెదా పాటకి సుశీల గారే కొంచెం కష్టపడ్డారని చదివాను. వినడానికి సింపుల్ గా ఉన్నా, పాడేటపుడు తాళానికి రావడం కష్టం. అది జంపె తాళం. (సంగీతం నేర్చుకునేప్పుడు "జంపె తాళం నను చంపెరా" అని ఒక సామెత అందరూ వింటారు)

శివరంజని వచ్చిన కొత్తల్లో వీధిలో ఏక్ తారా లు అమ్మేవాడికి భలే గిరాకీ ఉండేదట.

విన్నారా అలనాటి వేణుగానం పాట కూడా చాలా చాలా బాగుంటుంది. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో ప్రత్యేకత ఏమిటంటే(నేను గమనించింది) పాట వింటూ సాహిత్యాన్ని నిర్లక్ష్యం చెయ్యలేం. రెంటినీ ఒకేసారి ఆస్వాదించగలుగుతాం! దీపానికి కిరణం, విన్నారా ....పాటలు అలాంటివే!

..అన్నట్టు ఈ పుస్తకం నా దగ్గరుంది. మంచి పాటల్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

సుజాత గారూ,

జోరు మీదున్నావు పాటను పాడటంలో సుశీల గారు కొంచెం కష్టపడ్డారని మీ వ్యాఖ్య ద్వారానే తెలిసింది.

‘ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి’ పాట ఎస్.జానకి గారికి నచ్చిన తన పది పాటల్లో ఒకటి. ఆమె సుశీల గారితో కలిసి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ
సంగతి చెప్పారు.

సుజాత వేల్పూరి చెప్పారు...

వేణు గారు,
జోరుమీదున్నావు ...సంగతి ఎక్కడో చదివానండీ చాలారోజుల క్రితం. లేకపోతే విజయవాడ రేడియోలో విన్నాననుకుంటా !

అజ్ఞాత చెప్పారు...

మేఘసందేశం పాటలు ఎలా మర్చిపోయారంతా?
రావలసినంత పేరు వచ్చినట్టనిపించదు ఆయనకి.

వేణు చెప్పారు...

రమేష్ నాయుడి గారికి రావలసినంత పేరు నిజంగా రాలేదండీ. కానీ ఆ మాధుర్యం తనివి తీరా ఆస్వాదించాలనుకునే అభిమానులు పరిమితంగానైనా ఉన్నట్టే కదా!
ఇక మేఘ సందేశం పాటలను ఎవరు మాత్రం మర్చిపోగలరు? (జేసుదాస్ మొత్తం అన్ని పాటలూ పాడిన తెలుగు సినిమా అది) సందర్భం రాక ప్రస్తావన రాలేదు గానీ!

Kathi Mahesh Kumar చెప్పారు...

70-80వ దశకంలో తెలుగులో అత్యధ్భుతమైన మెలొడీలను అందించిన సత్యం, రాజన్-నాగేంద్ర, రమేష్ నాయుడు లను మరిచిపోయిన సంగీత ప్రియుళ్ళు లేరనుకుంటాను.

M b d syamala చెప్పారు...

నీ వేణువు బ్లాగు ద్వారా అలనాటి వేణుగానం మృదు మధురంగా వినిపించినందుకు ధన్యవాదాలు!జోరుమీదున్నావు తుమ్మెదా నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి !అయితే ఆ పాట రచయిత దాసం గోపాల కృష్ణ గారని నీ పోస్ట్ ద్వారానే తెలిసింది! ఎన్నో సుమధుర రాగాలతో బాణీీలను సమకూర్చిన రమేష్ నాయుడు గారిని స్మరించుకోవడం బాగుంది!