ఆలోచిస్తే... మన తెలుగుభాషకు సంబంధించిన చాలా ప్రాథమికమైన సందేహాలకు నాలాగే చాలామందికి సమాధానాలు తెలియవని అన్పిస్తుంది. వీటి గురించి సీరియస్ గా ప్రయత్నించలేదు గానీ అడిగినవారు ఎవరూ నాకు జవాబులు చెప్పలేకపోయారు.
నన్ను వేధించే కొన్ని అనుమానాలు కింద ఇస్తున్నా.
(నిజానికివి సంస్కృతం లోనివి అనుకుంటా) .
* బ్రహ్మ అనే మాటను ఎలా పలకాలి? ‘బ్రమ్హ’ అనేనా? అలా అయితే ఎందుకని?
* చిహ్నం అనే మాటను ‘చిన్హం’ అనాలా? ఎందుకని? ఈ తలకిందుల వ్యవహారం ఎందుకనే, చలం గారు తన రచనల్లో ‘చిన్హం’ అని వాడారు.
* చ ఛ జ ఝ తర్వాత వచ్చే ‘అక్షరం’ ఉచ్చారణ ఏమిటి? ఆ అక్షరంతో వచ్చే పదాలైన జ్ఞానం, ప్రతిజ్ఞ ల్లో ఆ ఉచ్చారణ ఏకీభవిస్తుందా? లేకపోతే ఎందుకని?
* ‘అలు’ ఉచ్చారణతో వచ్చే పదం ‘క్లుప్తం’ కాకుండా ఇంకేమైనా ఉందా? (ఇక్కడ ఈ పద స్వరూపం సరిగా రాయలేకపోతున్నా)
* క ఖ గ ఘ తర్వాత వచ్చే ‘అక్షరం’ తో రాసే పదం ‘వాంగ్మయం’ (ఇదీ రాయటం సరిగా కుదరటం లేదిక్కడ) కాకుండా ఇతర పదాలేమిటి?
ఇవండీ నా సందేహాలు.
నన్ను వేధించే కొన్ని అనుమానాలు కింద ఇస్తున్నా.
(నిజానికివి సంస్కృతం లోనివి అనుకుంటా) .
* బ్రహ్మ అనే మాటను ఎలా పలకాలి? ‘బ్రమ్హ’ అనేనా? అలా అయితే ఎందుకని?
* చిహ్నం అనే మాటను ‘చిన్హం’ అనాలా? ఎందుకని? ఈ తలకిందుల వ్యవహారం ఎందుకనే, చలం గారు తన రచనల్లో ‘చిన్హం’ అని వాడారు.
* చ ఛ జ ఝ తర్వాత వచ్చే ‘అక్షరం’ ఉచ్చారణ ఏమిటి? ఆ అక్షరంతో వచ్చే పదాలైన జ్ఞానం, ప్రతిజ్ఞ ల్లో ఆ ఉచ్చారణ ఏకీభవిస్తుందా? లేకపోతే ఎందుకని?
* ‘అలు’ ఉచ్చారణతో వచ్చే పదం ‘క్లుప్తం’ కాకుండా ఇంకేమైనా ఉందా? (ఇక్కడ ఈ పద స్వరూపం సరిగా రాయలేకపోతున్నా)
* క ఖ గ ఘ తర్వాత వచ్చే ‘అక్షరం’ తో రాసే పదం ‘వాంగ్మయం’ (ఇదీ రాయటం సరిగా కుదరటం లేదిక్కడ) కాకుండా ఇతర పదాలేమిటి?
ఇవండీ నా సందేహాలు.
12 కామెంట్లు:
అన్నింటికి సమాధానాలు నా దగ్గర లేవు కానీ.. చ ఛ జ ఝ ఞ .. ఆఖరి అక్షరాన్ని ఇణి అని నేర్చుకున్నాము. ఇది మాత్రం చెప్ప గలను
చక్రవర్తి గారూ, మీరన్నట్టే ఆ అక్షరాన్ని ‘ఇణి’అని నేర్చుకున్నాం. నా ప్రశ్న ఏమిటంటే... ఆ ఉచ్చారణ, జ్ఞానం లాంటి పదాల్లో ఎందుకు వినపడటం లేదని.
తాడేపల్లి గారిని నా సందేహాలు తీర్చమని కోరితే ఆయన తన బ్లాగు http://www.tadepally.com/ లో ఇలా జవాబిచ్చారు.
వేణుగారూ !
బ్రహ్మని బ్రమ్హ అని పలక్కూడదు. ఎలా రాస్తామో అలాగే పలకాలి. బ్రమ్హ అని పలకడం కొంతమందికి సులభం
కావచ్చు. అందువల్ల వాళ్ళు దాని ఉచ్చారణ గుఱించి ఇతరులకి చెప్పేటప్పుడు అలాగే పలకాలని చెబుతారు. అది
సరి కాదు.
ఒకలా రాసి ఇంకోలా పలకడం ఇంగ్లీషువాళ్ళ సంప్రదాయమే గాని మన సంప్రదాయం కాదు.
ఇందాక చెప్పినదే చిహ్నానికీ వర్తిస్తుంది. చలం గారి విషయానికొస్తే భాషకి సంబంధించి ఆయన ప్రామాణికత్వం
అంగీకరించదగినది కాదు. ఆయనే కాదు, ఆయన లాంటి పరద్వేషులూ, ఇతరుల మీద అకారణంగా
కత్తిగట్టేవాళ్ళూ ....సంస్కర్తలుగా పనికిరారు. ఇహపోతే, ఞ ఉచ్చారణని రాసి చూపించడం కష్టం. అది న్యా కి
దగ్గఱగా ఉంటుంది.
నాలుకని పై దవడకీ కింది దవడకీ మధ్య ఇఱికించి "న" పలకడానికి ప్రయత్నిస్తే ఏ ధ్వని పలుకుతుందో అది ఞ
ఙ విషయానికొస్తే ఇది కవర్గాక్షరాలకు - అంటే కఖగఘలకు ముందు సున్న స్థానంలో వాడ్డం కోసం
సంస్కృతభాషేయులు కల్పించుకున్నది. అంటే "అంకః" అఙ్కః అని సంగమః కి సఙ్గమః అని రాసేవారు.
వాఙ్మయం కాక మనకి ఆ వర్ణసంయోజన గల అక్షరాలు సకృత్తుగా గోచరిస్తాయి. ఉదాహరణకి - శార్ ఙ్గమ్, శార్ ఙ్గీ.
(తాడేపల్లి గారూ, ధన్యవాదాలు).
ముందుగా మీరు ఒకసారి ఇక్కడ కన్నెయ్యండి.
తర్వాత, ఌకార ప్రయోగాలు ౢకప్తము ౢకప్తి కాక నాకూ తెలియవు. సందర్భం వచ్చింది కాబట్టి మరొక మాట. ప్లుతము అన్నది ఒప్పు. ౢపతము అని వ్రాయకూడదు.
ఙకారానికి ప్రయోగాలు లేకనేమండీ! శఙ్ఖము, అఙ్కము, గఙ్గ, అఙ్ఘ్రి, లాఙ్గూలము, లఙ్ఘనము, లఙ్క, తారాశశాఙ్కము, ...
తెలుగు తత్సమ శబ్దాలలో మనం వ్రాసే ంక, ంఖ, ంగ, ంఘ అన్నీ నిజానికి ఙ్క, ఙ్ఖ, ఙ్గ, ఙ్ఘ లు.
శ్రీ వేణుగారికి, నమస్కారములు.
మొదటగా గమనించాల్సింది ఉఛ్ఛారణని మీకు వ్రాతపూర్వకంగా చెప్పటం కష్టం.ఇకపోతే, సంస్కృతములో, తెలుగులో పలకేటప్పుడు ఏ శబ్దం వినిపిస్తుందో, ఆ శబ్దానికి సంబంధించిన అక్షరమే వ్రాస్తాము. ఉదా: బ్రహ్+మ =బ్రహ్మ. ఇదే, హిందీ భాషలో అయితే, "బ్ర" తరువాత,"హ" అక్షరాన్ని సగమే రాసి, "మ" అక్షరాన్ని పూర్తిగా వ్రాస్తారు. అంటే, తెలుగులోని "మ" వత్తుని, హిందిలో పూర్తి అక్షరముగా వ్రాయబడుతున్నది. కాని, హిందిలో, "బ్ర" తరువాత, "హ" అక్షరాన్ని పూర్తిగా వ్రాసి,( తెలుగులో "హ" మొదలు వచ్చిందిగదా అని ) "మ" ని తరువాత వ్రాస్తే, అది "బ్రహం" అవుతుంది. కాబట్టి, "బ్రహ్+మ"=బ్రహ్మ గానే పలకాలి. సంస్కృత భాషకి సంబంధించిన "అమరకోశం" పుస్తకములో, "బ్రహ్మ" పదానికి మూలం ఈ విధముగా వ్రాయబడి వున్నది: "బృంహతి వర్ధయతి ప్రజా ఇతి బ్రహ్మ".
ఇక "చిహ్నం" గురించి: "అమరకోశములో", "చహ్యత ఇతి చిహ్నం" ; చహతీతి చిహ్నం" అని మూలం చెప్పబడి వున్నది. "చహ" అంటే, "ఎఱింగించునది" అని అర్ధం. "చిహ్నం"లో, "చ+హ" వున్నది కాబట్టి, చిహ్+నం=చిహ్నం అనే పలకాలి కాని, "చిన్+హం=చిన్~హం" అని పలుకరాదు.
తరువాత, ఙ్, ఞ్ అక్షరాలతో పలికే శబ్దాలు అనేకముగా వున్నాయి. మీరు, తెలుగు, సంస్కృత నిఘంటువులను చదివితే తెలుస్తుంది.
భవదీయుడు,
మాధవరావ్.
రాఘవ గారూ,
నా బ్లాగు టపా కంటే ముందుగానే ఈ సందేహాల మీద చర్చ జరిగిందని మీరు పంపిన లంకె చూశాక తెలిసింది. మీకు నా నెనర్లు.
క్లుప్తం, క్లుప్తి అనే మాటలు తప్ప వేరేవి లేకపోతే... వాటికోసమే ఌ అనే అక్షరం ఉండటం విచిత్రమే.
@ మాధవరావు గారూ, మీ వ్యాఖ్య ద్వారా మరికొన్ని విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం,
క్ష, క్ ష(క కి ష వత్తు) రెండింటి ఉచ్చారణా ఒకటేనా?
క్ష సంయుక్తాక్షరమా? అయితే హల్లులో ఎందుకుంది?
shanmukhan గారూ,
క్ష కీ ‘క్ ష’ (క కింద ష వత్తు) కీ ఉచ్చారణలో తేడా ఏమీ లేదు. తెలుగులో పత్రికలకు భాషాస్వరూపం నిర్దేశించిన బూదరాజు రాధాకృష్ణ గారి ప్రకారమైతే- ఈ అక్షరాన్ని వాడటంలో స్పష్టమైన తేడా చూపించొచ్చు.
తెలుగు, సంస్కృత పదాలకు క్ష ని వాడటం (పక్షం, వీక్షణం, లక్షణం), తెలుగు లిపిలో రాసే ఇంగ్లిష్ పదాలకు (Rikshaw, Connection) క కింద వత్తు వాడటం ‘ఈనాడు’లో గమనించొచ్చు.
క్ష సంయుక్తాక్షరమే. అది హల్లుల్లో ఉండకూడదు మరి.
అందరికీ నమస్కారం,
ఁ(అరసున్న),న్ ల ఉచ్చారణ ఒకటేనా, రెంటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు..
శ్రీ వేణు గారికి,
మీ బ్లాగును ఈ రోజే చూశాను. విశాలమైన మీ జిజ్ఞాస పరిధికి నిదర్శకంగా, బాగున్నది. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.
1) బ్రహ్మ – బ్రమ్హల ఉచ్చారణను గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతున్నది. ఉదాహరణకు –
http://www.indiadivine.org/audarya/sri-vaishnava-forum/125506-pronounciation-brahma-vahni-jahnu.html
http://www.mail-archive.com/sanskrit@cs.utah.edu/msg00780.html
http://khmer.cc/community/t.c?b=1&t=3255&o=3
మొదలైన చోట్లను చూడండి. ఎక్కడా సరైన సమాధానం ఉన్నట్లు లేదు.
నా అభిప్రాయం ఇది: బ్రహ్మ శబ్దం “బృహి” అనే ధాతువు నుంచి “వర్ధిలజేయు” అనే అర్థంలో (బృంహతి = వర్ధయతి) ఏర్పడింది. “బృంహణము”, “బృంహిత” “బృహతి” “బృహత్తరము” ఇత్యాది శబ్దాలన్నీ ఈ కుదురులోనివే. బృంహ (బృమ్హ) శబ్దసాదృశ్యం వల్ల బ్రమ్హ అని పలికేవారు. “బ్రహ్మ” శబ్దోచ్చారణలోని కాఠిన్యం వల్ల అదే కృతక ప్రామాణికమై, “బ్రమ్హ”, “బ్రామ్హణ” మొదలైనవి ప్రచారంలోకి వచ్చాయి. ఆంధ్రకవులు ప్రాసగతంగానూ ప్రయోగించినందువల్ల ఆ ఉచ్చారణను తప్పని చెప్పలేము.
“బ్రమ్హ” శబ్దప్రాచుర్యం వల్లనే “చిన్హము” మొదలైనవి ఏర్పడ్డాయి. కే = నీటియందు ఉండి, హ్లాదయతి = ఆహ్లాదింపజేయునది అనే అర్థంలో ఏర్పడిన “కహ్లారము” వ్యత్యస్తోచ్చారణ వల్ల “కల్హారము” అయింది. కవులు ప్రాసస్థానంలో సైతం అవిరళంగా ప్రయోగించారు. వ్యుత్పత్తిరీత్యా అంగీకర్తవ్యాలు కానప్పటికీ “వన్హి”, జాన్హవి” మొదలైనవి వాడుకలోకి వచ్చాయి.
2) “జ్ఞానము”,” ప్రతిజ్ఞ” మొదలైన శబ్దాలను పలుకుతున్నపుడు చివరను వినిపించే ధ్వని దాని సరైన ఉచ్చారణ. మీరడిగినట్లు ఏకీభవిస్తుంది. చ – ఛ – జ - ఝ తర్వాత వచ్చే అక్షరాన్ని అలాగే పలకాలి. "సఞ్చితము", "సఞ్జయుడు" ఇత్యాదులలోని ఉచ్చారణమూ అదే. ఇప్పుడు "సంచితము" "సంజయుడు" అని వ్రాస్తున్నారు. అనుమానం ఉంటే Phonetic Chartను చూడండి. చిన్న తరగతులలో ఉపాధ్యాయులు “ఇణి” అని నేర్పేవారు. అది సరికాదు.
ఇక పోతే, సినిమాలలో ఎన్.టి. రామారావు గారు “గ్నానము”, “ప్రతిగ్న” అని పలకటం మీరు వినే ఉంటారు. అది తప్పు కాదు. సరైన ఉచ్చారణే.
3) “ఌ”, “ౡ” అక్షరాలు ప్రధానంగా మంత్రశాస్త్ర పరిభాషలోనివి. “ఌ” కారంతో "క్లప్త", క్లప్తి” పదాలే వినబడుతున్నాయి. తవ + ౡకారము = తవల్కారము. ఏకాక్షరాలుగా ఉన్నప్పుడు “ఌ దేవ్యామ్” (దేవత), “ౡ లతాన్తరే (ఒకానొక లత)” అని మహీప సచివుని ఏకాక్షర కాండ నిఘంటువు. “ఌ ర్దేవసూః (దేవతల తల్లి అదితి)”, “ౡ ర్వారాహీ (ఆడ పంది) భవేత్" అని ధరసేనాచార్యుని నామమాలికా కోశం. ఇంకా అనేకార్థాలున్నాయి.
4) “ఙ్మ” అనే అక్షరంతో వచ్చే పదాలను అడిగారు. వాఙ్మయము, ఋఙ్మండలము, దిఙ్మాత్రము, స్రఙ్మయము మొదలైనవి మన కల్పనానుసారం లెక్కలేనన్ని.
తే. ప్రాఙ్నగసమానధృతి! సుధారుఙ్నిభాస్య!
స్రఙ్నిచయసక్తకంఠ! దావాగ్నిపాయి!
వాఙ్మనోహరనుత! యసదృఙ్మహాత్మ!
దిఙ్మహితకీర్తి! యర్జునయుగ్మభేది!
అని అప్పకవీయం (3 – 328) లోని కృష్ణస్తుతి.
సర్వ శుభాకాంక్షలతో,
భవదీయుడు,
ఏల్చూరి మురళీధరరావు
మురళీధరరావు గారూ!
>> సినిమాలలో ఎన్.టి. రామారావు గారు “గ్నానము”, “ప్రతిగ్న” అని పలకటం మీరు వినే ఉంటారు. అది తప్పు కాదు. సరైన ఉచ్చారణే. >>
నిజంగా నిజమేనా? అయ్యో... ఇన్నాళ్ళూ ఎన్టీఆర్ ఉచ్చారణ ను ముళ్ళపూడి వెంకటరమణ గారితో సహా (చూడండి... (ఇం)కోతికొమ్మచ్చి) అపార్థం చేసుకున్నామా? నమ్మశక్యం కావటం లేదు..
ఈ టపా రాసిన ఇన్నేళ్ళ తర్వాత కూడా దీన్ని మీరు చదివి, సవిస్తరంగా వ్యాఖ్య రాయటం సంతోషంగా ఉంది!
Syamala Madduri ఈ బ్లాగు పోస్టుపై పంపిన అభిప్రాయం:
ఒక మంచి చర్చ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో నీ బ్లాగులు చూసిన వారికి అర్థమౌతుంది. ఇంతమంది విఙ్ఞానవంతుల్ని కదిలించిన నీ ఆసక్తి అభినందనీయం! నీబ్లాగుల్ని చదవడం నేను ఒక education లా భావిస్తాను! మురళిగారు ఎన్ టి ఆర్ గారి గ్నానము సరియైన ఉచ్చారణ అన్నారంటే ఙ్ఞ ని అనవసరమని భావించినట్లే కదా! నిజానికి ఉచ్చారణలో గ్నానానికి ఙ్నానానికి చాలా తేడా ఉంది! వర్ణ వ్యత్యయంవల్ల కహ్లారం కల్హారమైందన్నది నిజమే! నాళికేరం నారికేళంగా, నవ్వులాట నవ్వుటాలగా, బాలసారె బారసాలగా పిలవబడేవి మరికొన్ని ఉదాహరణలు. బ్రహ్మ శబ్దం బృహత్ మూలమని నేను భావించాను! బృంహత్ అని నీ పోస్టులో పెద్దల వల్ల తెలిసింది! ఏదిఏమైనా భాష వో ప్రవాహంగా ఉండాలి! వాడుకలో లేని అటువంటి అక్షరాలు పోయినా నష్టంలేదని నా భావన!
కామెంట్‌ను పోస్ట్ చేయండి