సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, మార్చి 2015, శుక్రవారం

బొమ్మరిల్లు సృష్టించిన ‘కరాళ కథలు’ తెలుసా?
‘చందమామ’వర్ణచిత్రాల, రసవత్తర కథల ధగధగల్లో   ‘బొమ్మరిల్లు’ను నేనంతగా పట్టించుకోలేదు.  ఒక్క ‘మృత్యులోయ’ సీరియల్ ను  తప్ప. 

తర్వాత  బొమ్మరిల్లులో బాగా గుర్తున్నవి  ‘కరాళ కథలే’ !

ప్రతి సంచికలోనూ ఈ సీరియల్ తో పాటు ప్రచురించే ఆకట్టుకునే చిత్రం- విల్లు చేత పట్టుక్కూర్చున్న అందమైన  యువకుడూ,  ఎదురుగా కూర్చున్న సుందరీమణులూ.  మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. 

 జ్ఞాపకాల పొరల్లో మాత్రమే ఉన్న ఆ కథల గురించి ఇన్నేళ్ళ తర్వాత  మరోసారి ఆలోచించాల్సివచ్చింది!

విశాలాంధ్ర ప్రచురించిన  ‘కరాళ కథలు’ అన్న టైటిల్ తో ఉన్న పుస్తకం కొద్ది రోజుల క్రితం చూశాను. ఇవి  ‘ఆ కరాళ కథలేనా?’ అనే సందేహంతో చూశాను.  ఈ కథలన్నీ  బొమ్మరిల్లులో వచ్చిన కరాళ కథలే.

రచయిత - డి.కె. చదువులబాబు.  

 ఈ పుస్తకంలో 20 కథలున్నాయి.

ఇవన్నీ ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా ఉన్నాయి.

***

చం
దమామలో  బేతాళ కథలను వివిధ  రచయితలు రాసినట్టే... బొమ్మరిల్లులో కూడా కరాళ కథలను  ఎందరో రచయితలు రాశారు.

ఈ కథల విశేషాలను ఇంకా  తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.

‘బాలసాహిత్య పరిషత్’ దాసరి వెంకట రమణ గారిని సంప్రదించాను. తొలి కరాళ కథనూ,  తాను రాసిన ఒక కరాళ కథనూ ఆయన బొమ్మరిల్లు సంచికల నుంచి తీసి పంపించి  సంతోషపెట్టారు. అంతే కాదు;  నెట్ లో ఎక్కడా  ఒక్క ముఖచిత్రమూ దొరకని ‘బొమ్మరిల్లు ’ కవర్ పేజీలు కొన్ని పంపించారు.

చాలాకాలం తర్వాత  మళ్ళీ  కరాళ కథల చిత్రాన్ని చూడటం ఉల్లాసంగా అనిపించింది.  

***

రాళ కథల ధారావాహికలో మొదటి కథను ఎవరు రాశారనే సందేహం మొదలైంది.

తొలి కథ రాయటమంటే  ఈ  ధారావాహిక  ఇతివృత్తానికి రూపకల్పన చేయటమే కదా!  అనూహ్యమైన, ఆసక్తికరమైన సంవిధానంతో నడిచిన ఈ కథల తొలి రూపకర్త ఎవరు?

1988 నుంచి  బొమ్మరిల్లు సంపాదక బాధ్యతలు చూసిన  ప్రముఖ రచయిత(లు)  ‘వసుంధర’ (జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు) తో మాట్లాడాను.

తొలి కరాళ కథను బొమ్మరిల్లు సంపాదకుడైన ‘విజయ బాపినీడు’ రాశారని ఆయన చెప్పారు!

***

బేతాళ కథలంటే  గుర్తొచ్చేది - శవాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న విక్రమార్కుడి బొమ్మ.


 కరాళ కథలంటే కూడా చెట్టు నీడలో ఎదురెదురుగా కూర్చున్న యువకుడూ, యువతుల బొమ్మ గుర్తొస్తుంది.


ఈ బొమ్మను చిత్రకారులు   MKB లేదా Jaya వేసివుండాలి. నా ఉద్దేశం  MKB అనే. 


ఈ బొమ్మను చూడండి. దీన్ని KESY అనే ఆర్టిస్టు వేశారు.

మొదటి కథకు వేసిన బొమ్మ  వెడల్పును  తగ్గించి,  ఒక పేజీకి  కుదించినప్పటికీ,  దాన్ని చాలా రకాలుగా  ఎలా మెరుగుపరిచారో  చూడండి.  ఒరిజినల్ చిత్రకారుని గొప్పతనాన్ని  ఒప్పుకుంటూనే ఈ మార్పుల వల్ల  వచ్చిన అందాన్ని గమనించాలి.

ఆర్టిస్టు  కేశి  బొమ్మలు చాలా అందంగా ఉంటాయి. జానపద చిత్రాలకు ఆయన వేసిన బొమ్మలు  విశిష్టంగా అనిపిస్తాయి. ఈ పోస్టులో మొదట ఇచ్చిన బొమ్మరిల్లు ముఖచిత్రం ఆయన చిత్రించిందే.
 
సవిత్వుకుడి తూణీరం బయట వేసిన డిజైన్ ని  కేశి  ముద్ర అని  చెప్పుకోవచ్చు. ఆభరణాలకు వేసే డిజైన్లు కూడా చూడముచ్చటగా ఉంటాయి. మోచేతి కింద తొడుగు నగిషీలు బాగా వేస్తారాయన.

క్లోజప్ లో ఉన్న యువతి కంఠాభరణాల డిజైన్ కూడా ఈ ఆర్టిస్టు  ప్రత్యేకత.  సవిత్వుకుడు పట్టుకున్న విల్లును కేశి తన ముద్రతో ఎలా  ఆకర్షణీయంగా మలిచారో చూడండి.


  ***
విశాలాంధ్ర వారు ప్రచురించిన కరాళ కథల పుస్తకంలో  ఈ బొమ్మ లేకపోవటం నన్ను చాలా నిరాశపరిచింది.

ఈ బొమ్మ  లేకుండా కరాళ కథలు వేయటమంటే ... విక్రమార్కుడి బొమ్మ లేకుండా  బేతాళ కథలను ప్రచురించినట్టే !.

ముఖచిత్రంగా వేయదగ్గ  కరాళ కథల  బొమ్మను లోపల పేజీల్లో  కూడా ఎక్కడా వేయలేదు. 

‘చందమామ’లో  1955 సెప్టెంబర్ సంచికలో  మొదటి బేతాళ కథ వచ్చింది. అప్పట్నుంచీ 60 సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా ప్రచురితమైన బేతాళ కథలు  ఆ పత్రికకు ట్రేడ్ మార్క్ అయ్యాయి. మొత్తం  700కు పైగా బేతాళ కథలు వచ్చివుండొచ్చు.

ఈ కథల పాఠకాదరణ చూశాకే  ... అదే తరహాలో   ‘బొమ్మరిల్లు’ కరాళ కథలను ప్రారంభించింది. 

తొలి కరాళ కథ 1974 ఏప్రిల్ లో  ప్రచురితమైంది.  బొమ్మరిల్లు మూతపడేలోపు దాదాపు  300 కరాళ కథలు వచ్చివుండాలి.

***

‘కరాళ ’అనే మాట తెలుగు పాఠకులకు పరిచితమే. దినపత్రికల్లో ‘కరవు కరాళ నృత్యం’ అనే శీర్షికలు తరచూ చూస్తూనే ఉంటాం కదా? 

‘కరాళ’ అనే పదానికి  అర్థం- దుర్గాదేవి మహోగ్ర రూపం. ‘భయం పుట్టించే’ అనే విశేషణార్థం కూడా ఉంది.

సరే... ఈ కరాళ కథల్లో మాత్రం కరాళుడు ఓ మాంత్రికుడు.  అడవిలో క్రూర మృగాలను అందమైన యువతులుగా మార్చివేసి,  వేటకు వచ్చిన యువకులను వారి మోహంలో పడేట్టు చేసేవాడు. ఈ సంగతి తెలిసి ఆ అడవి పక్కనున్న పుష్పార్ణ రాజు  సైన్యంతో అడవికి వెళ్ళి వీరుల చేతిలో ఓడిపోతాడు. రాజ్యానికి తిరిగివెళ్ళి సవిత్వుకుడు అనే  మహర్షిని కలిసి విషయం చెప్పుకుంటాడు. సవిత్వుకుడికి కరాళుడి చేష్టలన్నీ తెలుసు.

వీరులను రాజ్యానికి తిరిగి తెచ్చే పనిలో భాగంగా  సవిత్వుకుడు  ఓ సుందరాకారుడిగా మారతాడు. విల్లంబులు ధరించి అడవికి వెళ్తాడు. యువతులకు లోబడినట్టు నటించి, వారితో - మీలో ఎవరు నన్ను జయిస్తే వారికి బానిసనవుతాను- అంటాడు. అదృశ్యంగా ఉన్న కరాళుడు సవిత్వుకుడిని ఓడించటానికి మంచి అవకాశమని భావిస్తాడు. యువతుల్లో ఓ స్త్రీని ఆవహించి కథ చెపుతాడు. కథలో చిక్కుముడిని విప్పితే తనను గెలిచినట్టనీ, లేకపోతే తనకు బానిస కావాలనీ అంటాడు.

ప్రతి కథలోనూ  సవిత్వుకుడు సరైన సమాధానం చెపుతాడు. దాంతో యువతిలోని కరాళుడు వేరొక యువతిలోకి ప్రవేశించటం., కరాళుడి ప్రభావం నశించిన యువతి తన నిజరూపమైన జంతువుగా మారి అడవులోకి పరుగుతీయటం... ఇదీ కరాళ కథాసారం.

బేతాళ- కరాళ అనే పదాల సారూప్యం,  ప్రతిసారీ పునరావృతమయ్యే కథన రూపం... వీటి  వల్ల కూడా ఇవి అనుకరణ కథలనే తక్కువ అభిప్రాయం కొంత స్థిరపడివుంటుంది.

బేతాళ కథలంతటి  ప్రాచుర్యం ఈ కరాళ కథలకు లేకపోవచ్చు గానీ... వీటి ప్రత్యేకత వీటికి ఉంది. బేతాళ కథలు సంప్రదాయ సాహిత్యంలోనివి. కానీ ఇవి అలా కాదు.  

ముఖ్యంగా ముగింపులో యువతి జంతువుగా మారి అడవులోకి  పారిపోవటం చదివేవారికి థ్రిల్ కలగజేస్తుంది. 

***

తొలి కరాళ కథను ఇక్కడ  చదవండి... ఇది 1974 ఏప్రిల్ నెల బొమ్మరిల్లులో  ప్రచురితమైంది. 1976 సెప్టెంబరులో దీన్ని రెండోసారి ప్రచురించారు. 1990 ప్రాంతాల్లో బొమ్మరిల్లులో  ప్రచురించిన  మరో  కరాళ కథను  ఇక్కడ చదవొచ్చు .  రచయిత  దాసరి వెంకట రమణ.***

మొదటి కథలో సవిత్వుకుడు మహర్షి.  పుష్పార్ణ రాజుకు సహాయం చేయటం కోసం సుందరాకారుడై  అడవిలోకి వస్తాడు.

కానీ  ఎప్పుడు మారిందో కానీ-  తర్వాతి కథల్లో సవిత్వుకుడినే రాజుగా సంబోధిస్తూ కరాళుడు కథ చెపుతున్నట్టు  కరాళ కథలు నడిచాయి.

ఇది స్వల్పమైన  పొరపాటే. కానీ  సంవత్సరాల తరబడి ఇలాగే  కొనసాగినా దీన్నెవరూ గమనించకపోవటం  ఆశ్చర్యకరం!   

‘తెలిసి కూడా జవాబు చెప్పకపోతే’ అనే వ్యక్తీకరణా,  ‘నీ తల వెయ్యి వక్కలవుతుంది జాగ్రత్త’ అనే వ్యక్తీకరణా  కూడా ఈ కథల్లోకి వచ్చేయటం బేతాళ కథల ప్రభావమే!

క్రూర మృగాలను కరాళుడు  యువతులుగా మార్చాడని మొదటి కథ లో ఉంది.  తర్వాతి కథలు రాసినవారు ఈ పాయింటును మర్చిపోయినట్టున్నారు.  యువతులు జింక, కోతి, గుర్రం, నెమలి మొదలైన సాధు జంతువుల/ పక్షుల రూపాల్లోకి కూడా మారిపోయినట్టు కరాళ కథలను ముగించారు. 

కరాళ కథలు చదివితే  ప్రయోజనం ఏమిటి?  

మానసికోల్లాసం, పఠనానందం కలిగించటంతో  పాటు  పాఠకుల్లో ఇవి  విచక్షణ జ్ఞానాన్నీ, సూక్ష్మ పరిశీలననూ,  ఆలోచనాశక్తినీ  ఎంతో కొంత  మెరుగుపరిచే  అవకాశముంది.

అందుకే...  బేతాళ కథలతో పాటు వీటికి  తెలుగు బాలసాహిత్యంలో  విశిష్ట స్థానం ఉంది!కొత్త చేర్పు (1. 4. 2015)

ఈ కథలకు  MKB అనే చిత్రకారుడితో  కొంత సంబంధం ఉంది కదా? ఆయనా,  Razi ఒకరే  అని వారి గీతల తీరుతో నాకు అనిపించేది.

దానికి ఆధారం ఇవాళ అనుకోకుండా దొరికింది! 

చందమామ 60 సంవత్సరాల సందర్భంగా ప్రచురించిన ART GALLERY లో  చిత్రకారుల వర్ణచిత్రాలను ఇచ్చారు.  దానిలో  MK Basha (Razi)  అని స్పష్టంగా రాశారు.

చూడండి- ఆ బొమ్మను ఇస్తున్నా!


చిత్రా, శంకర్ ల తర్వాత  చందమామలో ఆకట్టుకునే చిత్రాలను అత్యధికంగా వేసినవారు  Jaya,  Razi. 


బొమ్మరిల్లులో MKB పేరుతోనూ (ఆ సంతకం ఎంత బాగుందో చూడండి, తొలి కరాళ కథలో) , ఆపై చందమామలో Razi పేరుతోనూ చక్కటి చిత్రాలు అందించారు ఎంకే బాషా!


16 కామెంట్‌లు:

karthik చెప్పారు...

మంచి విషయాలు గుర్తు చేశారు..

On another note,
బాలమిత్రలో "ఆశ్వాలదీవిలో అందాలసుందరి" అని ఒక సీరియల్ వచ్చేది.. మీ దగ్గర దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా? నాకు లీలగా కథ గుర్తుంది కానీ ఏ టైంలో వచ్చింది అన్న గుర్తు కూడా లేదు.

anu చెప్పారు...

బాగుంది.. పూర్తిగా తెలియని కథలు.. రెండు కథలను జోడించడం ఇంకా ఆసక్తికరం!

GKK చెప్పారు...

కరాళ కథలు తొలి బొమ్మ బాగుంది. మలి బొమ్మ మరీ బాగుంది. ఆ కథలు ఆ బొమ్మలు అది ఒక అద్భుత ప్రపంచం. ఎంతో ఆసక్తితో మీరు అప్పటి బొమ్మలను సేకరించి అందిచారు. చందమామ కథలలో 'వసుంధర' గార్ల రచనా శైలి కొంచెం విపరీత ధోరణిలో ఉండేది అని నా అభిప్రాయం. వారి రచనలు complicated గా ఉండి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఉండేవి కావు. దానితో నాకు ఆసక్తి పోయింది. మాచిరాజు కామేశ్వరరావు కథలు వాటికి 'జయ ' బొమ్మలు ఆకట్టుకునేవి.

Unknown చెప్పారు...

As far as my memory serves, the first story in the series was penned by dasari subrahmanyam who looked after the magazine till oct 1980, keeping his work under lid as he was an editorial asst. In chandamama. When he became full fledged editor of chandamama he stopped working for bommarillu.

వేణు చెప్పారు...

@ karthik: థాంక్యూ. బాలమిత్ర సీరియల్ గురించి వినలేదు. ఇప్పుడా పేరు చెప్పారు కాబట్టి వివరాల కోసం ప్రయత్నిస్తాను.

@ anu: కొత్త తరానికి తెలియని కథలే ఇవి. తెలుగు పీరియాడికల్స్ లో బాలసాహిత్యానికి సంబంధించి స్వర్ణయుగం అనదగ్గ కాలంలో వచ్చిన చక్కని జానపద కథలు.

@ తెలుగు అభిమాని: బొమ్మలు మీకూ నచ్చినందుకు సంతోషంగా ఉంది. కేశి గారి చిత్రాలు బొమ్మరిల్లులో తప్ప మరెక్కడా చూడలేదు నేను. చందమామ చిత్రకారుల తర్వాత తమ శైలీ ముద్ర కనబరిచిన కొద్దిమంది చిత్రకారుల్లో ఈయన ఒకరు.

వేణు చెప్పారు...

@ Ramavarapu Sgrao : థాంక్యూ సర్, ఈ కరాళ కథల రూపకల్పనకు సంబంధించి నాలాటి వారిలో ఇదే సందేహం ఉంది. దాసరి సుబ్రహ్మణ్యం గారి హస్తం ఈ కథల వెనక ఉందా అని! మీ అభిప్రాయం ‘వసుంధర’ గారి అభిప్రాయాన్ని పూర్వ పక్షం చేస్తోంది.

దాసరి సుబ్రహ్మణ్యం గారు చనిపోయాక గానీ నా అభిమాన సీరియల్ బొమ్మరిల్లులోని ‘మృత్యులోయ’ను ఆయనే రాశారని నాకు తెలియలేదు. ఏదేమైనా కరాళ కథల రూపకర్త ఎవరనేది భాషా శైలీతోనో, మరే ఇతర ఆధారాలతోనో నిర్ద్వంద్వంగా తేలితే బాగుణ్ణు.

అజ్ఞాత చెప్పారు...

పాత జ్ఞాపకాలని తాజా చేసారు. ధన్యవాదాలు. నేనూ కరాళ కథలు చదివే వాడిని. కరాల కథల మొదటి బొమ్మను వేసింది నాకు తెలిసి జయ గారే . బొమ్మలో వారు తన పేరు వ్రాసే పద్ధతి ఇప్పటికీ గుర్తే. - రామకృష్ణ

వేణు చెప్పారు...

@ mhsgreamspet రామకృష్ణ గారూ, థాంక్యూ. కరాళ కథ మొదటి బొమ్మ Jaya వేయలేదనే నా నమ్మకం. ఆయన బొమ్మలు వేసే పంథా వేరేగా ఉంటుంది.

ఈ కథకు వేసిన బొమ్మల్లో ఒక విచిత్రం గమనించారా? 42వ పేజీలో బొమ్మను మాత్రమే Jaya వేశారు. మిగిలిన అన్నిబొమ్మలనూ MKB వేశారు. ఇలా ఒక కథకు ఇద్దరు బొమ్మలు వేయటం చాలా అరుదు. ఎందుకలా జరిగిందో !

అజ్ఞాత చెప్పారు...

వేణు గారు ... మీ జ్ఞాపకాలు చదివి చాల సంతోషంగా అనిపించింది.అప్పట్లో, చిత్రకారుల గురించి నాకు చాలా కుతూహలం ఉండేది వారి చిత్రణా శైలి పట్ల. రాజి గారు ఎక్కువగా ఇంగ్లీషు చందమామలో చిత్రాలు గీసే వారు. వారు ఎం కె బాష వోకరని ఒకరని ఇప్పటివరకూ తెలియదు. నా బ్లాగులో రాసిన ఓ వ్యాసం మీ కోసం .
https://mhsgreamspet.wordpress.com/2010/10/24/%E0%B0%86-%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF/

వేణు చెప్పారు...

@ mhsgreamspet: థాంక్యూ. మీ పోోస్టును గతంలోనే చదివాను; నా వ్యాఖ్యలు కూడా అక్కడ ఉన్నాయి, చూడండి.

M b d syamala చెప్పారు...

వేణు!నాకు చాలా యిష్టమైన కరాళ కథలగురించిన నీ విశ్లేషణ ఎంతో ఆనందాన్నిచ్చింది ముఖ్యంగా కరాళకథల బొమ్మనాకో పెద్ద అట్రాక్షన్!నేను నా బాల్య స్నేహితురాలు రాధ ఆ సవిత్వకుడిిని చుట్టూవున్న రాకుమార్తెల బొమ్మల్ని వెయ్యడానికి ప్రయత్నించేవాళ్ళం అదో బంగారు సమయం!
మీరన్నట్లు కథలలో

M b d syamala చెప్పారు...

వేణు!బొమ్మరిల్లులోని కరాళ కథల మీద మీ పోస్ట్ బాగుంది!నాకు కూడా ఆకథా ముఖచిత్రం అత్యంత యిష్ట మైనది!నిజానికి బేతాళకథలకన్నా కరాళకథలు నాకెంతో యిష్టం!పిల్లల్లో ఊహాపోహలు పెంపొంచడానికి ఈ కథలెంతో ఉపయోగపడేవి ఇప్పటి బాలసాహిత్యాన్ని అప్పటి చందమామ బాలమిత్ర కథల్ని పోల్చడానికి కూడా వీలుపడదు!ఆవిషయమై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!నేను చదివినప్పుడే ఓసవిత్వక మహారాజా!అని సంబోధించినట్లు గుర్తు ఈవిషయాన్ని ఇంత కీన్ అబ్జర్వేషన్ చేయడం మీ నిశిత పరిశీలనకు గుర్తు!mkbగారు రజీ గారుఒక్కరేనని చిత్ర సారూప్యతను బట్టి గమనించడమేగాక నిజమేనని తెలుసుకోవడం చాలాబాగుంది!కృతఙ్ఞతలు

వేణు చెప్పారు...

Thank your very much. Happy that this post made you to recollect your childhood memories.

Unknown చెప్పారు...

మృత్యులోయ , శిదిలనగరం ,కథలు availability ఎవరి దగ్గరైనా ఉంటే please share the address.

Unknown చెప్పారు...

వేణు గారు మీ వద్ద మృత్యులోయ ,శిదిలనగరం లాంట దాసరి గారి రచనలు ఉన్నాయా. Please let me know

ganti svss ramagopal చెప్పారు...

కేశి గారు వారి భార్య సుగుణ గారుకలసి తొలుత జానపద నవలలు పుస్తకాలు ను జాబిల్లి హరివిల్లు పెరుతొ ప్రచురించెవారు అందులొ మెప్ వెసెవారు అనగ మాంత్రుకుని గుహ కి మార్గము మెదలైనవి తరువాత జాబిల్లి కదల పుస్తకం పెట్టారు 1981-82 తరువాత ఆదాయం లెక మానెసి తిరిగి బొమ్మరిల్లు బాలమిత్రిల కి చిత్రికారుడు గ పని చెసెరు2010 సంవత్సరిం బాలమిత్ర ముఖ చిత్రం కెశి గారె వెసారు