సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

21, సెప్టెంబర్ 2016, బుధవారం

వేగుచుక్కా... తోకచుక్కా!

గురజాడ  చూసి  వర్ణించిన ‘హేలీ’ ఇదే   ( 1910  నాటి ఛాయాచిత్రం)

 నింగిలో వెలిగే  హేలీ తోకచుక్కను ‘చన్నకాలపు చిన్నబుద్ధులు’  కీడుగా భావించి బెదిరిపోతే...

ఆ మూఢ విశ్వాసాన్ని ఖండించి-

దాన్ని భూమికి దూరబంధువుగా,
నరుల కన్నుల పండువగా భావించిన,
సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా సంభావించిన
మహాకవి గురజాడ అప్పారావు...

వ్యావహారిక భాషకు కావ్యగౌరవం కల్పించిన నాటకకర్త.

భాషలో, భావంలో.. తన కాలం రచయితలకంటే కంటే ఎంతో ముందుచూపున్న ఆయన రచనా స్వరూపం అందరికీ తెలిసిందే.

మరి ఆయన భౌతిక రూపం ఎలా ఉంటుంది? మనం చూసే ఇలాంటి  ఒకటి రెండు ఫొటోల కంటే మించి-
ఆయన ‘ఫీచర్స్’ను గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది కదా!

అందుకని... గురజాడను ప్రత్యక్షంగా చూసిన, ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళనుంచే ఆ సంగతులు విందాం...

సుబ్రహ్మణ్యం  సాన్నిహిత్యం

ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం  గారు .. కన్యాశుల్కం ప్రచురణ అవుతున్నకాలంలో దాని విశేషాలను గురజాడ నుంచి  లేఖలుగా అందుకున్న అరుదైన వ్యక్తి.  ఆయన ఇలా చెప్పుకొచ్చారు-
  
 ‘‘ఆ రోజుల్లో నేను అప్పారావు గారి వెంట ఎప్పుడూ వుండేవాణ్ణి. సాహితీవేత్త అంటే ఇలాగ వుండాలని నేనాయన్నొక ఆదర్శమూర్తిగా భావించుకునేవాణ్ణి. ఆయన నాకొక ఆరాధ్య దేవతా పురుషునివలె కనిపించేవారు. నాతోటి విద్యార్థులు , మా యిరువురి సన్నిహితత్వాన్ని జాన్సన్ -బాస్వెల్ ల సన్నిహితత్వంతో సరిపోల్చుతూ వుండేవారు.

రూపంలో జాన్సన్ వలె అప్పారావు గారు విలక్షణంగా కనిపించే వారన్నమాట నిజమే కాని, ఇద్దరికీ పోలిక లేదు. జాన్సన్ ఎంత లావుగా వుండేవాడో ఈయన అంత సన్నంగా వుండేవారు.
...


1936  ఫిబ్రవరి 27వ తేదీన ‘ది హిందూ’ దినపత్రికలో ఆయన్ని గురించి నేను వ్రాసిన ఈ దిగువ వాక్యాలలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ‘‘అతి బక్కపల్చటి మనిషి. తరుచు రెండు మూడు చొక్కాలు, ఒకటి రెండు కోటులు తొడుక్కునేవారు. ’’

తనకు ముప్ఫయి అంగుళాల చుట్టుకొలత గల  బెల్టు కావలసివుందని ఆయన తన డైరీలలో వొక చోట వ్రాసుకున్న పంక్తులను గమనిస్తే  అప్పారావు గారెంత సన్నని మనిషో పాఠకులు యిట్టే ఊహించుకోగలుగుతారు. పంతులు గారు సదా హాస్యప్రసన్నులుగా వుంటూ వుండేవారు’


(1958లో విశాలాంధ్ర ప్రచురణ ‘మాటా మంతీ  అవీ: ఇవీ’కి రాసిన పీఠిక నుంచి) 

శ్రీపాద  చూసిన వేళ..

గురజాడ అప్పారావు గారిని ప్రత్యక్షంగా ఒకసారి  ఆంధ్రసాహిత్య పరిషత్తు సభలో.  చూశారట కథక చక్రవర్తి  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.  కాకినాడలో  1914లో- గురజాడ అస్తమయానికి ముందు ఏడాది.

డిసెంబరు 1946లో  ఆయన రాసిన  ‘మార్గదర్శి గురజాడ అప్పారావు గారు’ అనే వ్యాసం లో ఆ సందర్భాన్ని ఇలా వర్ణించారు- 

‘‘... ఈ మిత్రులిద్దరూ (ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావులు) ఆ మహాకవిని ప్రత్యక్షంగా చూసి ఎరగరు.

నాకు మాత్రం ఆ మహా భాగ్యం పట్టింది.

ఒక్క మాటే పట్టింది.
...


తెల్లటి పంచే, నల్లని పొడుగు కోటు,  ఆ కోటు మీద పరిణత వయస్కతకు సూచకంగా తిలతండుల న్యాయంగా వుండిన గుప్పెడేసి మీసాలు, పట్టి పల్లారుస్తున్న దీర్ఘవ్యాధికి గుర్తుగా. కానీ దూసుకుపోయే చురుకైన చూపులు.

ఇదీ , ఆ ఒక్కమాటే నేను చూసిన ఆ మహాకవి మూర్తిమంతం. 


అప్పటి సమావేశం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి ఆకృతే విలక్షణంగా ఉండింది. అందుకు తగ్గట్టు ఇప్పటి ఆంధ్రసాహిత్యం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి రచనలే విలక్షణంగా వున్నాయి.’’

అదే వ్యాసంలో  ‘ముత్యాల సరములు ’లో అన్వయించగల ఓ విశేషం గురించి ఇలా రాశారు శ్రీపాద. 


‘‘తూర్పు బలబల తెల్లవారెనుః
తోకచుక్కయు వేగుచుక్కయు
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
వెడలి మెరసిరి మిన్ను వీధిని’’

అన్నారు వారు.

తోకచుక్క విచ్ఛిత్తికి సూచకం. వేగుచుక్క మహోదయానికి సూచకం. నిజమే కాని ఈ తోక చుక్క ఏమిటి? ఇది చేసిన వినాశం ఏమిటి? ఈ వేగుచుక్క ఏమిటి? దీని తరువాత జరిగిన మహోదయం ఏమిటి? అంటే  వశ్యవాక్కులు శ్రీ భమిడిపాటి కామేశ్వర్రావు..  గిడుగు రామ్మూర్తి పంతులు గారే  తోకచుక్క యని,  గురజాడ అప్పారావు గారే వేగుచుక్క అనీ వ్యాఖ్యానం చేశారు..

రామమూర్తి గారు చేసింది  కృతక భాషా విధ్వంసనమేగా?  అప్పారావు గారు చేసింది కవికుమార కళ్ళకు వెలుగు కలిగించడమేగా?’’
 

* * * 

కొత్తపాతల మేలుకలయిక   క్రొమ్మెరుంగులు జిమ్మగా

‘గుత్తునా ముత్యాల సరములు’ అంటూ మొదలయ్యే ఈ పద్యాలు మొత్తం 29.

1929 నాటి ప్రచురణలో ఈ పద్యాలను ఇక్కడ చదువుకోవచ్చు.
ఇంటర్మీడియట్ తెలుగులో...
ఈ ముత్యాల సరములు - ఆంధ్రప్రదేశ్ లోని  ఇంటర్ మొదటి సంవత్సరం  తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యభాగంలో ఓ పాఠంగా  ఉన్నాయి.

పాఠ్యాంశంగా పెట్టటం అభినందనీయమే. అయితే  ఈ పద్యాలను  అక్షర దోషాలేమీ లేకుండా ప్రచురించే శ్రద్ధ తీసుకోవాలి కదా?

కానీ అది జరగలేదు. 

*  గురజాడ ‘ముత్యాల సరములు’ అని ప్రయోగిస్తే దాన్ని ‘ముత్యాలసరాలు’ గా మార్చారు. కానీ ఇది పెద్ద విషయమేమీ కాదు.

*   రెండో పద్యం -
 ‘మెచ్చనంటా వీవు; నీవిక
మెచ్చకుంటే మించిపాయెను;
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా’


పాఠ్యపుస్తకంలో ‘మెచ్చనంటా నీవు’  అని  తప్పుగా  ప్రచురించారు. ఈ సంధిని ఎలా విభజించి అర్థం, అన్వయం ఎలా చెపుతారో పాపం, పాఠం బోధించే తెలుగు అధ్యాపకులు! 

*  27వ పద్యం  ఇలా ఉంటుంది -

‘కలిసి మెసగిన యంత మాత్రనె
కలుగుబోదీ యైకమత్యము;
మాల మాదిగ కన్నెనెవతెనొ
మరులు కొనరాదో?’


‘మాల మాదిగ’ అన్న మాటలు  పాఠ్యపుస్తక రూపకర్తలకు అభ్యంతరకరంగా తోచివుంటాయి. దీంతో ఆ పదాన్ని ‘యేదొవొక కన్నెనెవతెనొ’ అని మార్చేసి, ప్రచురించారు.

 
ఆ మాటలు విశాల దృక్పథం అలవర్చుకోని ఓ పాత్ర మాటలు.
కవి నేరుగా పలికినవి  కావు.   

అయినప్పటికీ విద్యార్థులు చదివే పాఠంలో కులాల ప్రసక్తి ఎందుకూ అనుకునివుంటారు.
సరే!  అలాంటప్పుడు మొత్తం పద్యాన్నే తొలగించివుండాల్సింది.

అంతే కానీ-
కవి రాసిన పద్యంలో పదాలను ‘మాత్రా ఛందోబద్ధంగా’ మార్చివేయటం అనుచితం కాదా?

ఇప్పడీ మార్పు చేసిన పద్యాన్ని అధికారిక- ఆధునిక ప్రక్షిప్తం అనాల్సివుంటుందేమో!  

‘‘మంచి చెడ్డలు మనుజులందున,
యెంచి చూడగ,  రెండె కులములు
మంచి యన్నది, మాలయైతే,
మాలనే, అగుదున్!’’  


...  అని ఎలుగెత్తి చాటిన గురజాడ రాసిన పద్యాన్ని...స్వల్పంగానైనా ‘సవరించి’  ప్రచురించటం ఆయనకు గౌరవం  ఇచ్చినట్లవుతుందా? 

కుల మత ఛాందసత్వాలను నిరసిస్తూ గురజాడ రాసిన కింది  పద్యాలు చూడండి-

 ‘‘యెల్ల లోకము వొక్క యిల్లై,
వర్ణ భేదము లెల్ల కల్లై,
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ’’

 

‘‘మతములన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్’’


ఇవి  వెలకట్టలేని ‘ముత్యాల సరములే’ కదా!