సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఫిబ్రవరి 2016, శనివారం

‘చందమామలో కుందేలు’ కథ తెలుసా?మధ్య ‘చందమామ’ వ్యవస్థాపకుడు నాగిరెడ్డి గారి జ్ఞాపకాలతో ఆయన కొడుకు విశ్వం రాసిన  - ‘నాన్నతో నేను’ చదివాను.

 

పుస్తకంలోని విశేషాలన్నీ బాగున్నాయి.


కొత్త చేర్పు:   ఈనాడు ఆదివారం మ్యాగజీన్ (7.3.2016) న వచ్చిన  సమీక్ష ఇది. 


ముఖ్యంగా ‘చందమామ’ పత్రిక గురించి ఏం రాసివుంటారా అనే ఆసక్తితో ఈ పుస్తకాన్ని చదివాను.

చివరి పేజీలోని ఒక  విషయం ‘చందమామ’ గురించి నేను పట్టించుకోని, నాకు తెలియని కొత్త విషయం.  

అది ‘చందమామ లోగో’కుందేలుకు సంబంధించిన సంగతి.

ఈ కథ గురించి చందమామ పాత సంచికలు తిరగేస్తుంటే... చందమామనూ, కుందేలునూ రకరకాలుగా చిత్రించిన బొమ్మలు కనిపించాయి.  (దాదాపు అన్నీ ‘చిత్రా’ వేసినవే).

ఇంతకాలం చందమామ లోగో వెనక ఏముండొచ్చు అని  పట్టించుకోకపోవటం నాకే ఆశ్చర్యంగా ఉంది. విశ్వం గారి పుస్తకం చదవకపోతే చందమామ లోగో వెనక ప్రచురణకర్తలు నిర్దేశించుకున్న భావం సంగతి తెలిసేదే కాదు.  

నాగిరెడ్డి గారు విశ్వంగారితో ఇలా చెప్పారట- 

‘‘బౌద్ధ జాతక కథలలో వచ్చే ఒక సంఘటనే ‘చందమామ’ లోగోగా ఎంపిక చేశాము. చంద్రునికి ఆహారంగా తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న కుందేలు త్యాగమే ఆ సంకేతం. ఇతరులకు సాయపడటానికి తమను తాము త్యాగం చేసుకోవడానికి సంసిద్ధులం కావాలి. సంకోచపడకూడదు’’.


ఇంతకీ ఆ కుందేలు  కథ ఏమిటి? తెలుసుకోవాలనిపించింది.

చందమామలో జాతక కథలు వరసగా వచ్చాయి కాబట్టి వాటిలో ఉండొచ్చు కదా?  కానీ జాతక కథల్లో కాకుండా - బ్రహ్మదత్తుడూ, కాశీ రాజ్యమూ, బోధిసత్వుడూ .. ఈ పేర్ల ప్రస్తావన ఏమీ లేకుండా విడిగా ‘చందమామ’పత్రికలోనే కనిపించిందా కథ. 1954 నవంబరు సంచికలో !

చందమామలోని మచ్చను కుందేలు అని భావించే నమ్మకంలోంచి ఈ కథ పుట్టింది.

దాన్ని ఇక్కడ చదవొచ్చు-  ‘చిత్రా’ బొమ్మలను కనువిందుగా చూస్తూ! 
   1954-11చంద్రుడిలో కనపడే మచ్చ గురించి ప్రస్తావించిన కవుల్లో సంస్కృత కవి  కాళిదాసు  ఒకరు. 

‘కుమార సంభవం’లో ఆయన ఒక చోట చెపుతాడు- ‘చంద్రుడిలో మంచి లక్షణాలను చూస్తాం గానీ దానిలో మచ్చను  పట్టించుకోం కదా? అలాగే మంచి గుణాలు ఎన్నో ఉన్నపుడు ఒకే ఒక్క దోషం ఉన్నా అది లేనట్టే’ అని.

చందమామలో కుందేలు కథ సరే,  చందమామకే తన కథను చెప్పుకున్న సందర్భం ఓ తెలుగు సినిమాలో ఉంది.

‘మామా చందమామా’ అని పలకరించి,  ‘విన రావా నా కథ’ అంటూ  మన ‘సంబరాల రాంబాబు’(1970) చలం చంద్రుడితో  మొరపెట్టుకున్న సంగతి గుర్తుందా? 

‘‘ నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు...
    నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
    నువు లేక నువు రాక.. విడలేవు కలువలు...
    జాబిల్లీ .. నీ హాయి పాపలకు జోలలు.... ’’


అంటూ... ఆ పాట మొదటి చరణంలో  చంద్రుణ్ణి భలే వర్ణిస్తాడు.. రాజశ్రీ కలం సాయంతో!