సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ముఖచిత్ర వివాదం - బాపు Vs రంగనాయకమ్మ!


బాపు గీసిన బొమ్మల్లోని అందం, వైవిధ్యం నాకు ఇష్టం. 
ఆయన వేసిన కార్టూన్లలో గిలిగింతలు పెట్టే హాస్యం, క్యాప్షన్ల సహజత్వం నచ్చుతాయి.

బాపు తీసిన కొన్ని సినిమాల్లోని కళాత్మకత ; ఆయన దస్తూరి ఒరిజినాలిటీ, ప్రయోగశీలత- ఇవన్నీ బాగుంటాయి.

బాపు ముఖచిత్రంతో కొత్త పత్రికలు ప్రారంభించటం తెలుగునాట ఓ సంప్రదాయంగా కొనసాగింది.

తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా చక్కని బొమ్మలు వేశారు బాపు. 

‘మహా ప్రస్థానం’లోని ‘ఋక్కులు’ కవితకు కవి శ్రీశ్రీని హంస వాహనుడైన చతుర్ముఖ బ్రహ్మగా వేశారు.

  త్రిపురనేని రామస్వామి  ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడిలా  విషాదయోగంలో కూర్చుని ఉండగా రచయిత  రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు.

 ( పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన గీతోపదేశమే ఈ భగవద్గీత. ‘శకటములందెల్ల ధూమశకటము నేనే.. యెడారులలోన సహారా యెడారిని నేనే..  పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’- ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన).

 .   భాగవతంలోని పోతన  ప్రసిద్ధ పద్యం ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’ చాలామందికి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించి  ఓ  కార్టూన్ వేశారు.  హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ.

వీటిలోని  చమత్కారం బోధపడక  కోపాలు తెచ్చేసుకుని  నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు. కానీ  కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం.  తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు!     

ఎవరినీ నొప్పించని సున్నిత మనస్కుడిగా - వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా అభిమానులు  ఆయన్ను చెపుతుంటారు. కానీ  ఆయన ‘అలా చేసివుండకూడదు’ అని గట్టిగా అనిపించే  సందర్భం ఒకటుంది. అది రంగనాయకమ్మ రచన ‘రామాయణ విషవృక్షం’ పుస్తకానికి బాపు ముఖచిత్రం వేయటానికి నిరాకరించిన తీరు గురించినది. 

* * *

అసలు జరిగిందేమిటి?
నలబై ఏళ్ళ క్రితం... 1974లో రామాయణ విషవృక్షం తొలి భాగం ప్రచురణ జరిగింది. రచయిత్రి నవలలు కొన్నిటికి అప్పటికే బాపు ముఖచిత్రాలు వేసివున్నారు.

దీంతో  బాపును విషవృక్షానికి ముఖచిత్రం వేయమని ఆమె అడిగారు. దానిలో ఏయే అంశాలు ఉండాలని భావిస్తున్నదీ ఉత్తరంలో  వివరించారు.

కానీ  ‘‘అంతంత ఎత్తయిన, గొప్పవయిన, ఆలోచనలు నా బోటివారు అర్థం చేసుకుని బొమ్మ వెయ్యడం సాధ్యం కాని పని’’ అని బాపు జవాబు ఇచ్చారు. ఆమె పంపిన డిమాండ్ డ్రాఫ్టు వెనక పెద్ద అక్షరాలతో  ‘‘రామ- రామ’’ అని రాసి తిప్పి పంపారు. 

దీని గురించి ‘రామాయణ విషవృక్షం’ మొదటి భాగంలో రచయిత్రి  ఇలా రాశారు-
దీనిలో బాపు పేరును ఆమె ప్రస్తావించలేదు.  ‘ఒక చిత్రకారుడు గారు’ అని మాత్రమే అన్నారు.  ఆ చిత్రకారుడు ఎవరో  కొందరు ఊహించినప్పటికీ... చాలామంది పాఠకులకు స్పష్టంగా తెలియదు.

దాదాపు మరో 20 సంవత్సరాల తర్వాత  బాపు రాసిన వ్యాసం ద్వారా ఆ చిత్రకారుడు ఆయనేనని పాఠకులకు అర్థమైంది.  ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రత్యేక సంచికలో రాసిన ఆ వ్యాసంలో ఆయన ఇలా రాశారు-  
   
‘‘... ఇంకో సంఘటన - డబ్బులొచ్చాయి. కానీ సబ్జెక్టు కష్టం! రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా ‘రామాయణ విషవృక్షం’ అన్న పుస్తకం- ముఖచిత్రానికి చెక్కు పంపారు. అంత గొప్ప రైటరు? ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానం వహించిన ఆ గ్రంథాన్ని ఇలా  అర్థం చేసుకున్నారా అని చెక్కు వెనక  రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా. అది ఆ గొప్ప రచయిత రచనా సామర్థ్యం మీద కామెంట్ కాదు. కేవలం జాలి. ’’

‘రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా..’-
రామాయణ కల్పవృక్షానికీ, రామాయణ విషవృక్షానికీ సంబంధమే లేదు. కేవలం పేర్లలో కల్పవృక్షం- విషవృక్షం అనే మాటలను బట్టి బాపు  ఇలా పొరపడ్డారు. ఈయనే కాదు; ఎంతోమంది సాహితీకారులూ , పాఠకులూ కూడా విశ్వనాథ  కల్పవృక్షంపై విమర్శగా రంగనాయకమ్మ విషవృక్షం రాశారని భావిస్తుంటారు. విషవృక్షాన్ని చదవకుండా, దానిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా  ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలివి.

‘చెక్కు వెనక రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా.’-
చెక్కు కాదు; డీడీ! ఇన్ని సంవత్సరాల్లో  చెక్కో, డీడీయో ఆయన మర్చిపోయారన్నమాట. 

ఒక పుస్తకాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు. రామాయణాన్ని మార్క్సిస్టులు ఆ దృష్టికోణంలోనే చూస్తారు. వారు భక్తుల కోణంలో చూడలేదని ఆశ్చర్యపడటంలో, జాలిపడటంలో అర్థం ఏముంటుంది? (రచయిత్రి  పవని నిర్మల ప్రభావతి  రామాయణాన్నీ; రామాయణ విషవృక్షాన్నీకూడా సమానంగా ఇష్టపడతారు. ఇదో మినహాయింపు).  

రామాయణ విషవృక్షానికి బొమ్మ వేయటం తనకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్నేబాపు ... రచయిత్రికి  వ్యంగ్యాలేమీ లేకుండా సూటిగా/ మర్యాదగా/ సున్నితంగా చెప్పివుండాల్సింది. డీడీని కూడా యథాతథంగా వెనక్కిపంపివుండాల్సింది.  ‘తాను స్వీకరించదలచని’ డీడీ మీద ఏ రాతలైనా ఆయన ఎలా రాయగలిగారు?  

 


 బాపు వ్యాసం వచ్చాక...  గుంటూరు నుంచి ఎస్.వి. రాజ్యలక్ష్మి  అనే గుంటూరు  పాఠకురాలు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనే  ఓ లేఖ రాశారు-

 ‘బొమ్మలు వేయించుకున్న పబ్లిషర్లెందరో డబ్బు ఇచ్చేటపుడు ఇబ్బంది పెట్టేవారని ఆయనే చెప్పుకున్నారు. అలాంటి మనుషుల మధ్య , రంగనాయకమ్మ బొమ్మ వెయ్యకముందే చెక్కు పంపించారంటే, అది ఆమె సంస్కారానికి గుర్తుగా కనపడుతోంది.  ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’

ఈ ఉత్తరం బాపు చూశారో లేదో గానీ ఆయన ఆ వివాదంలో తన వైఖరికే చివరివరకూ కట్టుబడివున్నారని అర్థమవుతోంది.  ముఖీ మీడియా వారు  బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక ( 2011)  వేస్తూ దానిలో  ఈ వ్యాసం పున: ప్రచురించటమే దీనికి రుజువు. (ప్రచురణకర్తలు బాపుకు చెప్పివుంటారు కదా... ఆ వ్యాసాన్ని వేస్తున్నామని...)   ‘కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా విషవృక్షం..’ అనే factual error కూడా ఆయన ఇన్నేళ్ళుగా గమనించనేలేదన్నమాట.  ఆయన  సన్నిహితులూ,  సాహితీ మిత్రులూ కూడా దీన్ని ఆయనతో ప్రస్తావించివుండకపోవటం విచిత్రం! 

జరిగింది ఇదీ !

బాపు కన్నుమూశాక ఆయన గురించి ప్రసారం చేసిన/ ప్రచురించిన టీవీలూ, కొన్ని పత్రికలూ, సంస్మరణ సభల్లో  కొందరూ  ఈ సంఘటనను ప్రస్తావించటం గమనించాను.  తనది కాని డీడీ వెనక రాతలు రాసి వెనక్కి పంపించటం సరికాదని వీరెవరికీ అనిపించలేదు. పైగా అలా చేయటంపై  ప్రశంసలు కూడా కురిపించారు .  ‘విలువలకు కట్టుబడటం’!  'ఈ పని నేను చెయ్యను అని చెప్పీ చెప్పకుండా చెప్పటం’! ‘నిజ జీవిత సమయస్ఫూర్తీ’, ‘తరగని రామభక్తీ’!...  ఈ రకంగా!   

కళాకారుడిగా బాపు కృషిని అభిమానించటం వేరు; ఒక ప్రత్యేక సందర్భంలో ఆయన తీరుపై విమర్శగా ఉండటం వేరు! దీనికి ఆయన సజీవంగా ఉన్నారా లేదా అన్నదానితో నిమిత్తం లేదు.   

* * *
కల్పవృక్షం... ఖండనం
సందర్భం వచ్చింది కాబట్టి  ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి కొన్ని విషయాలు...  

విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు. ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య అన్నికాండల ముద్రణా పూర్తయింది.

ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు.  ఈ విమర్శ  ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది.  దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి  జ్ఞానపీఠ బహుమతి వచ్చింది!

మరి ‘రామాయణ విషవృక్షం’ సంగతేమిటి?  ఇది వాల్మీకి రచించిన రామాయణంపై మార్క్సిస్టు దృక్పథంతో చేసిన పరిశీలన, విమర్శ.  ఇది వ్యాసాలుగా కాకుండా.. కథల  రూపంలో ఉంటుంది. అవసరమైనచోట వాల్మీకి మూలగ్రంథంలోని  శ్లోకాలూ, వాటి తెలుగు అర్థ తాత్పర్యాలూ, వివరణలూ ఫుట్ నోట్లుగా ఉంటాయి. ఈ పుస్తకానికి  ముఖచిత్రం అందించిన చిత్రకారుడు త్రిగుణ్!