సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

15, మార్చి 2012, గురువారం

షేక్ స్పియర్... సీజర్.. జ్యోతిషం!

వాళ మార్చి 15.
అంటే  The ides of March! 

క్రీ.పూ. 44లో రోమన్ జనరల్  జూలియస్ సీజర్ రాజకీయ కుట్రకు బలై  నేలకొరిగింది ఈ రోజే. 

అయితే ఏమిటట... అంటారా?

డిగ్రీ చదివే రోజుల్లో   షేక్ స్పియర్ నాటకం ‘జూలియస్ సీజర్’ మాకు  పాఠ్యాంశంగా ఉండేది.

ఆ నాటకంలో చాలా ఘట్టాలు ఆసక్తికరం!

వ్యాసుడి భారతంలోని శకుంతలా దుష్యంతుల ఘట్టాన్ని కాళిదాసు మార్పులు చేసి అభిజ్ఞాన శాకుంతలంగా తీర్చిదిద్దాడు కదా?

 అలాగే ప్లుటార్క్ రాసిన  Parallel Lives లోని సీజర్ గాథను షేక్ స్పియర్ నాటకంగా మలిచి,  అద్భుతమైన నాటకీయతను రంగరించాడు.

మన గతం, వర్తమానం,  భవిష్యత్తు అంతా ముందుగానే  రికార్డు చేసివుంటుందనీ, ఆ ప్రోగ్రాం ప్రకారమే సంఘటనలు జరుగుతాయని అంటే  హేతువాదులెవరూ నమ్మరు; నేనూ నమ్మను. 

జ్యోతిషం అంటే  షేక్ స్పియర్ కి  నమ్మకం ఉందో లేదో గానీ  నాటకీయతను సృష్టించటంలో అది ఎంతో బాగా ఉపకరిస్తుందని ఆ మహా రచయితకు బాగానే తెలుసు. 

అందుకే ...

చాలా సన్నివేశాల్లో శకునాలనీ, కలలనూ, సంకేతాలనూ  ప్రవేశపెడతాడు. కాల్పనిక సన్నివేశారణ్యంలో ‘ఉత్కంఠీరవు’డై  వీర విహారం చేస్తాడు!

 
జూలియస్ సీజర్ సంగతికొద్దాం..
 
మార్చి 15న  సీజర్ కి ఆపద రాబోతోందని sooth sayer  (జ్యోతిషవేత్త)  సీజర్ ని  హెచ్చరిస్తాడు.

ఆ  భవిష్య పురాణాన్ని  ఏమాత్రం ఖాతరు చేయకుండా ‘ఆ జోస్యుడు కలలు కంటున్నా’డంటూ  కొట్టి పారేసిన  ధీరుడు సీజర్.

జూలియస్ సీజర్  నాటకం మొదటి అంకం, రెండో సన్నివేశంలోని  ఈ సంభాషణలు చూడండి...

      Soothsayer: (రెండోసారి)  Beware the ides of March.

     CAESAR : He is a dreamer; let us leave him  


అపశకునాల  దుస్స్వప్నాలు వచ్చాయంటూ  కలవరపడుతున్న భార్య Calpurnia తో సీజర్ చెప్పిన మాటలు  ఎంతో ధీరోదాత్తంగా ఉంటాయి.

     Caesar:  "Cowards die many times before their deaths,  The valiant never taste of death but once."
 
పిరికివాళ్ళు  చావుకు ముందే  ఎన్నోసార్లు చనిపోతారు. కానీ ధైర్యశాలి ఒకే ఒక్కసారే మరణిస్తాడనే ఈ మాటలు శతాబ్దాలుగా  కోటబుల్ కోట్ గా  ప్రచారంలో ఉన్నాయి.

విషాదాన్ని ఊహిస్తూ, దానికి భయపడుతూ విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే సందేశం సీజర్ మాటల్లో ఉంది.

ఈ ఘట్టం చదువుతుంటే  దానమివ్వొద్దంటూ శుక్రాచార్యుడు అభ్యంతరపెట్టినపుడు మరణానికి భయపడకుండా
బలిచక్రవర్తి చెప్పిన పలుకులు... (భాగవతంలోని పోతన పద్యం) గుర్తొస్తాయి. 

“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? 
వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై 
పేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములై
ఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!”

రే, కథ ప్రకారం జ్యోతిషం  నిజమవుతుంది.  ‘ఐడ్స్ ఆఫ్ మార్చి’  సీజర్ కు  మరణశాసనం రాస్తుంది.

ఈ సన్నివేశంలో షేక్ స్పియర్ రాసిన సంభాషణలు నాటకీయతతో ఆకట్టుకుంటాయి.

జోస్యుడు మార్చి 15న తనకెదురైనపుడు సీజర్ హేళనా స్వరంతో ఇలా  అంటాడు...

        CAESAR : [To the Soothsayer] The ides of March are come.

ప్రమాదం తొలిగిపోలేదనీ, ఇంకా పొంచే ఉందంటూ జోస్యుడు ధీమాగా చెప్పిన మాటలు...

        Soothsayer: Ay, Caesar; but not gone.
చివరకు కత్తిపోట్లతో సీజర్ చనిపోయేటప్పుడు సీజర్ బ్రూటస్ తో ‘నువ్వు కూడానా?’ అంటూ బాధాతప్తంగా పలికిన చివరి మాట-     

Et tu, Brute! Then fall, Caesar  ...

అత్యంత ప్రాచుర్యం పొందింది!