సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

గురజాడ ‘దేశభక్తి’ గేయం... అసలు రూపం ఇదీ!

సెప్టెంబరు 21న  మహాకవి గురజాడ అప్పారావు 150 వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని  పాఠశాలల్లో  ‘దేశభక్తి’ గేయం ఆలపించబోతున్నారు. 

ఇంతకీ...  గురజాడ రాసిన ప్రసిద్ధ ‘దేశభక్తి గేయం’ సరైన వర్షన్ ఏమిటి? 

ఇన్నేళ్ళ తర్వాత ...

ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే...

ఈ గేయం ప్రచురించిన 99 సంవత్సరాల్లో ప్రతిచోటా ఎన్నో మార్పులకు గురైంది. 

క్రియాంతాలు మారాయి. 

పద స్వరూపాలు వేరేవి  వచ్చాయి. 

విరామ చిహ్నాల్లో కూడా తేడాలే!

వి రాసింది రాసినట్టు  పాఠకులకు అందాలి.

అక్షరం కూడా మార్చకూడదు కదా?  

యథాతథంగానే మనం ఆ గేయాన్ని చదువుకోవాలి కదా?  

పాడుకోవాలి కదా?   

అందుకే...  గురజాడ  జీవితకాలంలోనే- తొలిసారిగా- ‘కృష్ణాపత్రిక’లో  ప్రచురితమైన ఈ గేయం ఎలా ఉందో చూడాలి.

తర్వాత ఈ గేయానికి ఆయన చేసిన మార్పులనూ గమనించాలి.

ఈ రెండూ ఇక్కడ చూడండి....

99 సంవత్సరాల క్రితం..

కృష్ణా పత్రికలో  వచ్చిన... 

 దేశభక్తి  గేయం  ఇక్కడ ఇస్తున్నా, చూడండి!


(ఈ ప్రతి కోసం చాలామంది ప్రయత్నించారు కానీ  లభించలేదు.

నాకు ‘శ్యామ్ నారాయణ’ గారి ద్వారా దొరికింది).




స్వదస్తూరితో గురజాడ మొదటి మూడు చరణాలకు  చేసిన మార్పులు...



ఆయన చేతిరాతతో  ఈ గేయంలోని  ప్రసిద్ధ పాదాలు...


యితే గురజాడ రాసిన దేశభక్తి గేయం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులతో  ప్రచురితమవుతూ వచ్చింది. పాఠశాల విద్యార్థులు చదువుకునే  ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే తీరు.   ప్రచురణకర్తల నిర్లక్ష్యమో,  అశ్రద్ధో,  ఉదాసీనతో... ఏదైతేనేం?  ఇన్నేళ్ళుగా  ఇలాగే  జరుగుతూ వచ్చింది.  దీన్ని ఎత్తిచూపుతూ నేను రాసిన వ్యాసమిది... 


ఈ వ్యాసం  ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో నిన్న  ప్రచురితమైంది!

10, సెప్టెంబర్ 2012, సోమవారం

లాయి లాయి లా ఇలా... ఇళయరాజా సుమా!

దో  ప్రేమ కథా చిత్రం.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీశారు.  సినిమా  పేరు - ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’.   త్వరలో విడుదల కాబోతోంది.


హీరో వరుణ్ - గాయకుడు.  హీరోయిన్ పాత్ర పేరు నిత్య (తమిళంలో).   హీరో ఆమెను మూడేళ్ళ తర్వాత కలుస్తాడు.  ఆ సందర్భంలో అతడు  ఇళయరాజా పాట పాడి, ఆయన సంగీత ప్రతిభను  ఆరాధనాపూర్వకంగా తల్చుకునే సన్నివేశం ఉంది.  ఇళయరాజా సంగీతం సమకూర్చిన   Ninaivellam Nithya (1982)  తమిళ సినిమా పాట పాడతాడు. తెలుగు వర్షన్ లో ఈ పాట  గుణ (1991) సినిమాలోని   ‘ప్రియతమా నీ వచట కుశలమా’ గా మారింది. దీనిక్కూడా ఇళయరాజానే సంగీత కర్త.

చూడండి ఈ సినిమాలోని ఓ  చిన్న సన్నివేశం. ..




చూశారు కదా? 

‘అందుకే- నువ్వు పాడటం మొదలుపెట్టగానే...’ అని హీరోయిన్ అన్న తర్వాత ఓ క్షణం నిశ్శబ్దం.. ఆ తర్వాత  వినిపించిన  నేపథ్య సంగీతం ఎంత సమ్మోహనంగా,  హాయిగా ఉందో గమనించారా?. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ని  హంగేరియన్ మ్యూజిషియన్స్ తో చేయించారు ఇళయరాజా.
 
విశేషమేంటంటే... ఈ సినిమా సగం తీసేదాకా సంగీత దర్శకుడు ఎవరనేది దర్శకుడు  గౌతమ్ మీనన్ నిర్ణయించుకోలేదు.  అందుకే  పాటల సన్నివేశాల చిత్రీకరణను  చివరకు  అట్టిపెట్టేశారు. 

ఆ తర్వాత ఆ సినిమాకు స్వరకర్త   ఇళయరాజాయే అయ్యాడు!  తన ప్రస్తావన వచ్చిన సన్నివేశానికి స్వయంగా నేపథ్యసంగీతం సమకూర్చుకున్నారన్నమాట. 

విచిత్రంగా లేదూ?



ఈ సినిమా సంగీతం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమన్నారో చదవండి-

‘‘ నాకు ఏ రకమైన సంగీతం కావాలని  మొదటిరోజు ఆయనతో చెప్పానో, అదంతా ఇళయరాజా సర్  పూర్తిగా  గుర్తుంచుకున్నారు. నా మనసులో ఏదైతే ఉందో అదే ఆయన తన సంగీత బృందానికి చెపుతుండేవారు.  బ్రేక్ బీట్స్, జాజ్/ బ్లూస్ స్టఫ్, ప్రతిదీ... !

ఇదంతా నా ఐఫోన్ లో చిత్రీకరించాను. అక్కడ గడిచిన ప్రతి క్షణాన్నీ ఒడిసిపట్టుకుని రికార్డు  చేయాలనిపించింది.

‘ఎందుకలా చేస్తున్నావ్?’ అని అడిగారు ఇళయరాజా.

‘ఇదంతా నాకోసం చేస్తున్నా’నని చెప్పాను. ’’   (హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో). 

పాటలు విడుదలయ్యాయి...
‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా పాటలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యాయి. వాటిలో ఓ పాట నాకు బాగా నచ్చింది.  ఇళయరాజా అరుదుగానే పాడుతుంటారు కదా? ఈ యుగళగీతాన్ని  ఆయన  బేల శండేతో కలిసి పాడారు.


చిన్న చిన్న పదాలతో చక్కగా రాశారు అనంత శ్రీరామ్.  ( అయితే  ‘వేళలో, ఈ వేళ, ఇవ్వాళ’ అంటూ ఒకే రకమైన పదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుండేది).  ఈ  పాట వినడానికి ముందు సాహిత్యం ఓసారి పరికించండి!

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా


లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

1. ఇంతలో  ఇలా ఎదిగిన  ఆ  తలపులో ఎవరికి ఈ  పిలుపులో
వింత వింతగా తిరిగిన  ఈ మలుపులో తన జతేమొ కలుపుకో

ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళ

జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి  ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి  లేనిపోనివేవో రేపిందా

లాయి లాయి లా ఇలా ఈ హాయి  నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
 
2. మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి  తరగదే ఈ  సందడి

చలాకి కంటి పూల తావేదొ  తాకిందిలాగా హా..
గులాబి లాంటి గుండె పూసేనా 

ఇలాంటి గారడీల జోరింక  చాలించదేలా హో..
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని  ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి  లేని పోనివేవో రేపిందా

 లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా

 లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా

లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే  సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా 


ఈ పాట వినండి ...




ళయరాజా  గొంతులో ముగ్ధత్వం మిళితమైన మార్దవం ఉంటుంది. దీన్ని  ఈ పాటలో కూడా గమనించవచ్చు.  ఇళయరాజా మార్కు ‘కోరస్’తో మొదలయ్యే ఈ పాటలో గానం, నేపథ్యసంగీతం అవిభాజ్యమన్నట్టు పరస్పర ఆధారంగా అల్లుకుపోయి వీనుల విందు చేస్తాయి. 

చరణాల్లో బాణీ తీరు - ఒక వృత్తాన్ని చుట్టుముట్టి తిరుగుతున్న భావన కలిగిస్తుంది.  గాయని పాడిన భాగంలో ‘హాయి నీదే సుమా’ లో ‘నీదే’ అన్నచోట మాధుర్యం  ప్రత్యేకం!  ‘మనదే సరదా సరదా’ అనేమాటలు త్వరత్వరగా తరుముకొచ్చినట్టు  గమ్మత్తుగా వినిపిస్తాయి!