సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, మార్చి 2018, ఆదివారం

రీ టెల్లింగ్ కథలా? ఫ్రీ టెల్లింగ్ కథలా?




చయితలు రాసిన  కథల నిడివిని  కుదించి,  వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.  

రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే  ఉండాలనీ,  కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా  ఆశిస్తారు.

దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే?

అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ టెల్లింగ్  అవుతుంది.

స్వకపోల కల్పనలను  యథేచ్ఛగా చేయాలనుకునేంత స్వేచ్ఛా పిపాసులు సొంత కథలను మాత్రమే రాసుకోవాలి.  అంతేగానీ  రీ టెల్లింగ్ పేరిట  ఇతరుల రచనల్లో  వేలు పెట్టకూడదు!   పెట్టి వాటిని కంగాళీ  చేయకూడదు!


* * *
రంగనాయకమ్మ ‘మురళీ వాళ్ళమ్మ’ కథను మొట్టమొదటిసారి 1999 లో  ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచికలో ప్రచురించారు.

ఈ కథ ఈ 2018 మార్చి 1న సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో  రీ టోల్డ్ కథగా వచ్చింది.  (మహిళా దినోత్సవ సందర్భంగా రచయిత్రుల కథలను ఈ సిరీస్ లో ఇస్తున్నారన్నమాట...  ఈ కథ 19వ కథగా వచ్చింది.  ఇంకా రోజుకో కథ వస్తూనే ఉంది.)

ఈ పున:కథకుడు ఖదీర్
ఇక్కడ   చూడండి-



రీ టోల్డ్ కథ చూశారు కదా? 

ఇప్పుడు  రంగనాయకమ్మ ఒరిజినల్ కథ చూడాలి.

ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పటి పేజీలను ‘కథా నిలయం’ సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాను.


   murali vallamma by Reader on Scribd


* * *

‘మురళీ వాళ్ళమ్మ ’ నాకు నచ్చిన కథల్లో ఒకటి. 
ఇప్పుడీ  పున: కథనం  చదివాను.

అసలు కథకూ,  ఈ అనుసరణ కథకూ చాలా చోట్ల తేడాలు ఉన్నాయనిపించింది.  ‘అమ్మకి ఆదివారం లేదా’ పుస్తకం తీసి, దానిలో ఉన్న ఆ కథను మళ్ళీ చదివి చూశాను.



నా అనుమానం నిజమే!

‘మురళీవాళ్ళమ్మ’ పున: కథనం గతి తప్పింది.
పాత్రల స్వభావం మారింది.
సంభాషణలు  కూడా  కళ తప్పాయి.  
అన్నిటికంటే ఘోరం- ఒరిజినల్ కథలో లేని సంఘటనలు వచ్చి చేరాయి.


ఓ ఇంటర్ వ్యూలో  ‘వాక్యాన్ని మానిప్యులేట్  చేయగలను’  అని  ధీమాగా  ప్రకటించుకున్నారు ఖదీర్.  కానీ  తెలుగుకు అసహజమైన  ‘కలిగి  ఉండే’ వాక్య ప్రయోగంతో,  పేలవమైన సంభాషణలతో, సొంత కల్పనలతో  ఆయన రీ టెల్లింగ్  దుర్భరంగా తయారైంది.

అందుకే...
ఇది  రంగనాయకమ్మ రాసిన  ‘మురళీ వాళ్ళమ్మ’ కాదు... 
ఖదీర్ వండిన  ‘సొరకాయ పాయసం’!

* * *
ల్లికి అన్యాయం  చేసిన తండ్రిపై కోపం తెచ్చుకుని పదమూడేళ్ళ మురళి  తనకు తనే   ‘అమ్మా! ఏం చేద్దాం?’ అని మళ్ళీ మళ్ళీ అడిగి,  మార్గం కూడా తనే చూపిస్తాడు.  ఆ మాటలు గుర్తొస్తే తల్లికి  శరీరం పులకరిస్తుంది. 

రీ టెల్లింగ్ లో  ‘ఏమంటావు నాన్నా’ అని తల్లి అడిగాకే  కొడుకు జవాబు చెప్తాడు. దీంతో   చిన్నప్పటి మురళి పాత్ర  ప్రత్యేకత కాస్తా ఎగిరిపోయింది.
 
తల్లిని ఎదిరించి మాట్లాడలేని మురళి,  తల్లి కోపంతో అన్నమాటలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయని మురళి  ఈ పున: కథనంలో మాత్రం తల్లితో ఏకంగా వాదనే పెట్టుకుంటాడు.  ఆఫీసులో అమ్మాయితో ‘ఇంత క్లోజ్ అయ్యాక తన ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా’ అని లాజిక్ తీస్తాడు.  

ఏమాత్రం రాజీపడకుండా  ఆత్మగౌరవంతో  ప్రవర్తించే  తల్లి రుక్మిణి  పాత్ర స్వభావాన్ని తెలుసుకోవటానికి ఆమె సంభాషణలు ఆయువుపట్టు.   ‘భర్తని ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీపడటానికా?’ అనీ,  ‘నీ దారి నీదీ నా దారి నాదీ’ అని  స్థిరంగా, నిర్మొహమాటంగా  చెప్పే  పాత్రకు  ఇక్కడ- పున: కథనంలో  కళాకాంతులు తగ్గిపోయాయి. 

కొడుకుతో ఆమె - ‘నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను’ అందట.  ‘హూంకరించింది’ అట.  రంగనాయకమ్మ కథనంలో  తల్లి .. కొడుకుని  పేరుతో పిలుస్తుంది గానీ  ఖదీర్ కథనంలో లాగా  ‘రా’ అని సంబోధించదు. దాంతో సంతృప్తిపడలేదేమో.. ఆమెతో కొడుకును ‘రేయ్..’అని కూడా అనిపించారు ఖదీర్.   

కథలో లేనివీ... కొత్తగా  చేర్చినవీ
ఒరిజినల్ కథలో మురళి తన ఆఫీసు అమ్మాయితో పదేపదే  ఫోనులో మాట్లాడుతుంటాడు.  కానీ ఆమెతో  బాత్ రూమ్ లో చాటింగ్ నూ, ముద్దులనూ కూడా అదనంగా చేర్చేశారు ఖదీర్. 

మొదట్లో,  చివర్లో ఖదీర్   చెప్పిన ‘సొరకాయ పాయసం’ (తల్లే స్వయంగా వండిందట అది)  ఒరిజినల్ కథలో లేనే లేదు.  ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆమె ఆ పాయసం అలా చేస్తుందట.  ఈ పాయసమూ,  సింబాలిజమూ ఖదీర్  సొంత కవిత్వం తప్ప  మరోటేమీ కాదు. 

‘జీడిపప్పు  ప్యాకెట్లు ’ మురళి  టూర్ నుంచి ఇంటికి తెస్తాడు.  ఖదీర్ ఆ జీడిపప్పు ప్యాకెట్లను వృథా కానీయకుండా  పాలు, చక్కెర వేసి  వేయించేశారు.  సువాసనలీనుతున్న ‘లేతాకుపచ్చ పాయసం’ తయారుచేసి  ఆ జీడిపప్పులు దానిలో  తేలేలా చేశారు.  ఆ సింబాలిజం అలా ఎదురుగా ఉంచుకుని... ఇక  స్వీయ పున: కథనం అల్లేశారు. 

అదింకా ఆ కథగానే ఉంటుందా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  పాడిన పాటను వేరెవరో తన ఇష్టం వచ్చినట్టు మార్చేసి పాడి, ఆ  రికార్డును బాలు  ఫొటోతో విడుదల చేసినంతమాత్రాన అది బాలు పాట అయిపోతుందా?  

అలాగే  ఒక రచయిత  ఫొటో వేసి  ‘మళ్ళీ చెప్పుకుందాం’ అంటూ కథనంతా ఈ రీటెల్లింగ్ రచయిత  మూడు కాలాల్లోకి కుదించేసి- రచయిత తన కథలో రాయని  సంఘటనలను కొత్తగా జోడించేస్తే అది  పున: కథనం అవుతుందా?  అప్పుడది ఒరిజినల్ రచయిత కథగానే ఇంకా మిగిలివుంటుందా? 

మంచి కథలను పాఠకులకు మళ్ళీ  గుర్తు చేయాలనుకుంటే, కొత్త పాఠకులకు తెలపాలనుకుంటే.. తగిన అనుమతులు తీసుకుని వాటిని యథాతథంగా ప్రచురించాలి.

 ‘నిడివి ఎక్కువ, అలా చేయలేం’ అనుకుంటే... ఆ కథల ప్రత్యేకతల గురించి వివరిస్తూ  సమీక్ష/ పరిచయం/ విశ్లేషణ ఇవ్వటానికి మాత్రమే పరిమితం కావాలి.  


అంతేగానీ..  కథనంతా రీ టోల్డ్ మూసలో పేర్చి,  స్వీయ కల్పనలు చేర్చి రాస్తే...  అది వక్రీకరణకు తక్కువ అవ్వదు. కథా రచయితను ఇది  నిశ్చయంగా అగౌరవపరచటమే! 

ఆ కథను అమితంగా అభిమానించే  పాఠకుల అనుభూతిని ఇది భగ్నం చేయటం కాదా?  వారి మనసుల్లో ముద్రించుకున్న చక్కటి దృశ్యాన్ని మొరటుగా చెరిపేయటం కాదా?



నేను ఈ సిరీస్ లో ఒక్క కథనే పరిశీలించాను.  ఇక మిగిలినవి ఎలా ఉన్నాయో ...!  ఈ పున: కథనాల విషయంలో  ఒరిజినల్ రచయిత్రులు సంతృప్తిగా ఉన్నారో, లేదో, ఒకవేళ అసంతృప్తి ఉంటే  దాన్ని  ప్రకటించారో లేదో నాకు తెలియదు!