సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, జులై 2009, శనివారం

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు!
‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున ఏం గుర్తుకొస్తాయి? నాకైతే... శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు.


వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని మే నెల మొదటివారంలో విజయవాడలో కలిశాను. (ఆయన్ను మొదటిసారి 2008అక్టోబర్లో కలిశాను). ఈసారి అభిమాన పాఠకునిగా మాత్రమే కాకుండా జర్నలిస్టుగా కలిశాను. ఎనిమిది దశాబ్దాల కాలం నాటి జ్ఞాపకాల్లోకి ఆయన్ను తీసుకువెళ్ళాను. ఆ అనుభవాలు తలపోసుకునేటప్పుడు ఆయన ముఖంలో ఎంత సంతోషమో! ‘కరుడు కట్టుకుపోయిన ఆ నాటి జ్ఞాపకాలు’ కరిగి, కదిలి అక్షర రూపంలోకి ప్రవహించాయి.

ఆ కథనం ఇవాళ- ‘ఈనాడు ఆదివారం’ 19జులై 2009సంచికలో వచ్చింది.


జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారి పేరు- చందమామ అభిమానుల్లోనే చాలామందికి తెలీదు. దీనికి కారణం- ధారావాహికల రచయిత పేరును ప్రచురించకుండా ‘చందమామ’ అని మాత్రమే ప్రచురించే ఆ పత్రిక సంప్రదాయమే. 1952లో చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా చేరారు సుబ్రహ్మణ్యం. అలా.. 2006వరకూ 54 సుదీర్ఘ సంవత్సరాలు చందమామ పత్రిక సేవలో తన జీవితాన్ని వెచ్చించారు.

పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు ఆయన! తోకచుక్కతో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో భల్లూక మాంత్రికుడు వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది.సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!
తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట - 1958

జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం - 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978


ఈనాడు ఆదివారంసంచికలో ప్రస్తావించని ఇంటర్వ్యూ భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను.


తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, 'I am over stay here!' అని సున్నితంగా జోక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. తన దశాబ్దాల స్మృతులను దశాబ్దాల నేస్తం సిగరెట్ ను వెలిగించి, ఆ పొగ రింగుల్లో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి నెమరువేసుకున్నారు. నా విజిటింగ్ కార్డు తీసుకుని, దాని వెనక ఆ రోజు తేదీని నోట్ చేసుకున్నారు. ‘మీరు ఎప్పుడు వచ్చారో దీన్ని చూస్తే తెలుస్తుంది’ అంటుంటే... ఆ శ్రద్ధకు ఆశ్చర్యమనిపించింది.

12 సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైనది?
 

   ఈ ప్రశ్న కాస్త ‘జటిల’మైనది. చంద   మామలో రాసిన ఆ పన్నెండు సీరియల్స్  24సంవత్సరాలపాటు వరసగా రాసినవి.  వాటిల్లో కొన్నిటి పేర్లు నాకు గుర్తు కూడా  లేవు. కొంచెం ఆలోచించి చూస్తే-  అన్నిటికన్నీ నాకు ఇష్టమైనవే  అనవలసివస్తుంది. చిత్రగుప్త, తెలుగు  స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, అభిసారిక... ఇలా కొన్ని పత్రికల్లో సాంఘిక కథలు రాశాను. అవీ, ఈ చందమామ సీరియల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే. ప్రత్యేకంగా బాగా ఇష్టమైనవంటూ ఏమీ లేవు.

కొ.కు. గారితో మీ అనుబంధం గురించి....

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారిది తెనాలి. శ్రీ చక్రపాణి గారిదీ తెనాలే. కొ.కు. గారితో నా అనుబంధం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇద్దరం అభ్యుదయ వాదులం. అనేక రాజకీయ, సామాజిక సమస్యల గురించి ఏకాభిప్రాయం కలవాళ్లం. ఆయన రాసిన చదువు, కాలభైరవుడు లాంటి రచనలు చదవడమే గాక, ఆయన గురించి లోగడ విన్నవాణ్ణి. కానీ ఆయనతో ముఖాముఖి పరిచయం 1955లో. చందమామ సంపాదకత్వం పనిని అప్పట్లోనే శ్రీ చక్రపాణి గారు కుటుంబరావు గార్కి ఒప్పగించారు. మొదటిసారి ఆఫీసులో ఆయనను కలిసినపుడు , ఆయనతోపాటు నేనున్న ఆఫీసు గదిలోకి ఎవరు వచ్చారో గుర్తులేదు. పరిచయ వాక్యాలు అయాక, కొ.కు. గారు ‘‘స్వతంత్ర, ఇతర పత్రికల్లో మీరు రాసిన కథలు చదివాను. అవి రాసింది తెనాలిలో మా కుటుంబాన్నెరిగిన దాసరి సుబ్రహ్మణ్యం ఏమో అనుకున్నాను. అయితే వ్యక్తిగా ఆయన్ని నేను చూడలేదు. ఏనాడో ఊరొదిలి పోయాడు’’, అన్నారు.

* * *

సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం విజయవాడలో తన అన్నయ్య కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు. ఆయనను సంప్రదించటానికి అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను.
దాసరి సుబ్రహ్మణ్యంc/o శ్రీమతి ఝాన్సీ
G-7వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్
దాసరి లింగయ్య వీధి
మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్- 0866 6536677

* * *


ఇంతకీ... కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన సుబ్రహ్మణ్యం గారు- హేతువాదీ, నాస్తికుడూ!

ఆయన పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు హేతువాదిగా చాలా ప్రసిద్ధుడే. ‘‘మా పెద్దన్నయ్య శ్రీ ఈశ్వరప్రభు దగ్గిర చాలా పురాతన సాహిత్యం ఉండేది. ఆ గ్రంథాలు పనిగట్టుకొని చదివాను. నేను అన్నలూ, అక్కయ్యలూ గల కుటుంబంలో అందరికన్నా చిన్నవాణ్ణి; ఆఖరివాణ్ణి. పది సంవత్సరాల వయసులోపలే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాణ్ణి గనక పెద్దన్నయ్యా, వదినెల దగ్గిర పెరిగాను, వాళ్ళు నాకు చిన్నమెత్తు పని చెప్పకపోగా, చదువుకో, స్కూలుకు పో అని బలవంతపెట్టేవాళ్ళు కాదు. అలా పెరిగాను’’ అని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్యం గారు- తన అన్నగారి గురించీ, బాల్యం గురించీ!


ఈ జానపద ధారావాహికల గురించి చెప్పేటప్పుడు అపురూపమైన ఆ కథల్లోని వాతావరణాన్ని కళ్లముందుంచే అద్భుత వర్ణ ‘చిత్రా’లను తల్చుకోకుంటే అది అన్యాయమే!

ఆ విశేషాలు... మరో టపా రాసేంత ఉన్నాయి మరి!

5, జులై 2009, ఆదివారం

హిమగిరి సొగసులు!


సంస్కృత మహాకవి కాళిదాసు రాసిన ‘కుమార సంభవం’ నాకు బాగా ఇష్టం.

హిమవత్పర్వత అద్భుత వర్ణనతో ఈ కావ్యం ఇలా ఆరంభమవుతుంది.

‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః ...’ అంటూ.

క్రీ.శ. 4-5 శతాబ్దాల్లో జీవించిన కాళిదాసు కవితా సౌందర్యం గురించి ఎందరో ఎన్ని రకాలుగానో చెప్పారు.

అరవిందుడి మాటల్లో- ‘‘కాళిదాసు ఏ విషయం ప్రస్తావించినా, ప్రవచించినా దాన్ని తన మధుర హస్తాలతో రస ప్లావితం చేస్తాడు. సౌందర్య శోభలతో తీర్చిదిద్దుతాడు.’’

కాళిదాసు వర్ణనల ప్రత్యేకత ఏమిటి?

అందమైన పద బంధాలతో, సకారణ తార్కాణాలతో, అనూహ్యమైన ఊహలతో ప్రకృతిని కళ్ళకు కట్టేలా కనికట్టు చేస్తాడు. ఎంత సూక్ష్మాంశం కూడా తన దృష్టిని దాటిపోదనిపిస్తుంది.

పొదలూ, పూలూ, పశువులూ పక్షులూ, గాలీ, ధూళీ ఆ కమనీయ కవితా స్పర్శతో అపురూపమైన ఉపమాలంకారాలతో సరికొత్తగా సాక్షాత్కరిస్తాయి.

హిమగిరి సొగసులన్నిటినీ ‘కుమార సంభవం’ ప్రథమ సర్గంలో పదహారు శ్లోకాల్లో ఇమిడ్చి అక్షరాభిషేకం చేశాడు కాళిదాసు.

ఈ హిమాలయాల వర్ణన యథాతథంగా ఉండే ఫొటోగ్రాఫిక్ చిత్రంలా ఉండదు.

చేయి తిరిగిన చిత్రకారుడు కావ్య కథా వాతావరణానికి తగ్గట్టు తన ఊహల ఉత్ప్రేక్షలతో రంగుల పరిమళం అద్ది తనివితీరా సృజించిన పెయింటింగ్ లా పలకరిస్తుంది.

యథార్థాన్ని కూడా నిరాకరించాలనిపించేలా సమ్మోహితం చేస్తుంది.

తొలి శ్లోకంలో హిమాలయాన్ని ‘దేవతాత్మ’గా సంభావించి నగాధిరాజు గా సంబోధిస్తాడు కాళిదాసు. రత్నాలూ, ఓషధులూ ఎన్ని ఉంటే మాత్రమేం... ఉన్నదంతా నిలువెల్లా మంచు మాత్రమే కదా ? అనే ప్రశ్న వేసుకొని, అయినా... అతడి ఘనత ఏమీ తగ్గదంటూ... అర్థవంతమైన అర్థాంతర న్యాసంతో హిమవంతుణ్ణి అలంకరిస్తాడు.

‘‘అనన్త రత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతమ్’’

ఎన్నోసద్గుణాలున్నవాళ్ళలో ఒక్క దుర్గుణం ఉన్నా ఫర్వాలేదులే అని దృష్టాంతంగా చంద్రుణ్ణి సపోర్టు తీసుకొచ్చేసి గడుసుగా సమర్థించేస్తాడు.

ఆ శ్లోకం రెండో పాదంలో ఇలా- ‘‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’’ చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య కళంకానికి నింద రాలేదు కదా అని అర్థం అన్నమాట.

హిమవత్పర్వతంలో ఏనుగులు తమ చెక్కిళ్ళ దురదలు పోగొట్టుకోవడానికి దేవదారు వృక్షాలకు రాచుకుంటే- ఆ చెట్ల నుంచి పాలు కారి ఆ పరిమళం కొండ చరియలకు వ్యాపిస్తుంటుందని ఓ శ్లోకంలో వర్ణిస్తాడు.

‘‘కపోల కండూః కరి భిర్వి నేతుం విఘట్టితానాం సరళ ద్రుమాణామ్
యత్ర స్రుత క్షీరతయా ప్రసూత స్సానూని గంధస్సుర భీకరోతి ’’
(సరళ ద్రుమాణామ్= దేవదారు చెట్ల)

నెమలి పింఛమంటే ఎవరికిష్టం ఉండదు? కాళిదాసుక్కూడా అంతేనన్పిస్తుంది.

ఆ పర్వతంలో వేట కోసం బోయవాళ్ళు వెళ్తే వారి అలసట తీర్చేలా చల్టని గాలి గంగ మీదుగా దేవదారు వృక్షాల సుగంధాలతో కలిసి వీస్తుందట. ఆ సమయంలో నెమళ్ళు తమ పింఛాలను విప్పటం వల్ల (‘‘భిన్న శిఖండి బర్హః ) గాలి వేగం తగ్గి, మందంగా వీస్తుందట.

హాయిగా సేదతీరటానికి మందానిలం అవసరమే కదా?

సూర్యుడి బారి నుంచి తప్పించుకు వచ్చి శరణు వేడిన చీకటిని హిమ శైలం తన గుహల్లో దాచుకుని రక్షిస్తోందంటూ మరో వర్ణన !

‘‘దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాన్ధకారమ్ ’’

‘‘సప్తర్షి హస్తాపచితావ శేషాణ్యధో వివస్వాన్ పరివర్తమానఃపద్మాని యస్యాగ్ర సరోరుహాణి ప్రబోధయత్యూర్థ్వ ముఖైర్మయూఖైః ’’

హిమవత్పర్వతం ఎంత ఎత్తుగా ఉందో చెప్పటానికి కాళిదాసు సప్తర్షి మండలం తో పోల్చి చెపుతున్నాడు. సప్తర్షి మండలం సూర్య మండలం కంటే ఎత్తు ఉంటుందని సంప్రదాయం.
ఆ రుషులు తమ దగ్గర్లో ఉన్న హిమాలయ శిఖరాల సరోవరాల్లో పూసిన పద్మాలను తమ పూజకు కోసుకుంటుంటారు. ఇక మిగిలిన పద్మాలను సూర్యుడు వికసించేలా చేస్తాడట.

కానీ ... సూర్యుడు ఆ సరోవరాల కిందసంచరిస్తుంటాడు కదా.. మరెలా? అందుకే... తన ఊర్థ్వ కరాలతో... అంటే పైకి వ్యాపించే కిరణాలతో (ఊర్థ్వ ముఖైః మయూఖైః ) పద్మాలను చేరి, విచ్చుకునేలా చేస్తాడట!

ఈ హిమవత్పర్వత షోడశ శ్లోకాల వర్ణనల్లో కిన్నరాంగనల మంద గమనాలూ, విద్యాధర యువతుల ప్రేమ లేఖలూ కనిపిస్తాయి. అప్సపరలూ, కింపురుష స్త్రీలూ కూడా తారస పడతారు.


ఏనుగులను వేటాడే సింహాలూ ... 
వాటిని మంచు గుర్తుల్లో వెంటాడే కిరాతుల పద ఘట్టనలూ ,  
చమరీ మృగాలూ, 
గుహలకు అడ్డంగా విచ్చేసే మేఘాలూ, 
కిన్నరులు పాడే... గాలిలో తేలే గాంధార షడ్జమాలూ ... 

ఇలా ఎన్నో దర్శనమిస్తాయి.

* * *

కాళిదాసు హిమవత్పర్వత వర్ణనలు చూసి, ఆయనది ఉజ్జయిని కాదూ, హిమాలయ పరిసర ప్రాంతమే అంటూ సందేహపడిన చరిత్ర కారులూ ఉన్నారు.

కాళిదాసును మన తెలుగు కవులు ఎన్నో సినిమాల్లో చాలా పాటల్లో స్మరించుకున్నారు.

‘కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి నీవే’

‘కాళిదాసుని దివ్య కావ్య కన్నియవోకణ్వముని కనువెలుగు శకుంతలవో’

‘ఏ శిల్పి కల్పనవోఏ కవి భావనవో కవి కాళిదాసు శకుంతలవో’

తరతరాలుగా హిమాలయాలు ఎందరికో కవులకూ, చిత్రకారులకూ, సామాన్యులకూ ప్రేరణ ఇస్తూనే ఉన్నాయి.

రష్యన్ చిత్రకారుడు నికొలస్ రోరిక్ కూడా హిమాలయాలతో గాఢంగా ప్రేమలో పడిపోతే, వెలిసిపోని వర్ణచిత్రాల ధారావాహికలు వెలిశాయి.  

(ఆయన గీసిన  వర్ణ చిత్రమే ఈ పోస్టు  మొదట్లో పెట్టినది...) 


అన్నట్టు- మన గొప్ప పౌరాణిక చిత్రం ‘పాండవ వనవాసము’ లో భీముడూ ద్రౌపదీ కలిసి, ఘంటసాల సుశీలల యుగళంలో హిమవన్నగ పరిసరాల్లో పాడుకున్న ‘హిమగిరి సొగసులూ’ పాట గుర్తుకు తెచ్చుకోండి.

‘‘హిమగిరి సొగసులూ
మురిపించును మనసులూ
చిగురించునేవొ ఏవో ఊహలూ ...

యోగులైనా మహా భోగులైనా
మనసు పడే మనోజ్ఞ సీమ
సురవరులూ సరాగాల చెలుల
కలసి సొలసే అనురాగ సీమ ’’

పాటకు ముందు హాయిగా తేలివచ్చే ఆలాపన కూడా ... ఎంత అద్భుతంగా ఉంటుంది!

ద్విజావంతి రాగంలో పొదిగిన... ఒదిగిన ఆ మాధుర్యం తలపులోకి వచ్చిందా?

సౌగంధిక పుష్ప సౌరభమెలా ఉంటుందో ఏమో గానీ అలాంటిదేదో అనుభూతిలోకి వస్తుంది కదూ ! 
 
వడ్డాది పాపయ్య చిత్రకల్పన

 

‘‘ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి...
కేళి తేలి లాలించెనేమో’’


అంటూ ‘కుమార సంభవ’ గాధను ద్రౌపదీ భీములు స్ఫురణకు తెచ్చుకోవటం ఈ పాట విశేషం!


హిమాలయాల నిసర్గ సౌందర్యానికి అందమైన నివాళి ఈ పాట! మరి వింటారా ఓసారి?

ఇక్కడున్న లింక్ ను మీ టూల్ బార్ లో కాపీ చేసి, క్లిక్ చేస్తే సరి....
http://www.chimatamusic.com/playcmd.php?plist=578