రుక్మిణీ కల్యాణ ఘట్టానికి చిత్రరూపం |
చాలా ఏళ్ళ క్రితం ...
హైదరాబాద్ లోని ఒక పత్రికా కార్యాలయానికి వచ్చిందో యువతి. ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని ప్రొఫెసర్లు చెప్పారనీ, తన వ్యాసం ప్రచురించమనీ కోరింది.
ఆ సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.
ఆమె అందించిన కాగితాలు చూశారు. వాటిమీద పన్నెండు ప్రశ్నలు రాశారు. వాటికి అదే క్రమంలో స్పష్టంగా సమాధానాలు రాసివ్వమన్నారు. అలా చేస్తే వ్యాసం సరిగా తయారవుతుందనీ, అప్పుడు ప్రచురిస్తాననీ తెలిపారు.
అది తన శక్తికి మించిన పని అంటూ ఆమె వెనుదిరిగివెళ్ళిపోవటం వేరే విషయం!
ఆ పత్రికే ‘మిసిమి’!
దానిలో ప్రచురించే వ్యాసాల స్థాయి అది. ధన సంపాదన కంటే విజ్ఞాన వ్యాప్తి ప్రధానమనే ఉద్దేశంతో కొనసాగుతోందీ మాసపత్రిక.
కొన్ని సంచికల కవర్ పేజీలూ, చిత్రాలూ చూడండి....
ఇది తొలి సంచిక |
బౌద్ధ ప్రాంగణ ద్వారం |
కిరాతార్జునీయం |
ఇది నవంబరు 2014 సంచిక |
కానీ, ఈ పత్రికలో హేతువాదానికీ, తర్కానికీ, శాస్త్రీయ విశ్లేషణకూ కొంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్ర, శిల్పకళలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది. అదీ చెప్పుకోదగ్గ విషయం. ముఖచిత్రం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.
‘మిసిమి’ మాసపత్రిక రజతోత్సవం నవంబరు 4న హైదరాబాద్ లో జరిగింది. ఒక సాహిత్య సభ ప్రేక్షకులతో కిక్కిరిసి హాలంతా నిండుగా ఉండటం నేనదే చూడటం.
ఈ పత్రిక గురించి తెలుగు వెలుగు డిసెంబరు 2014 సంచికలో ఓ వ్యాసం - ‘మిసిమిలమిలలు’ రాశాను.
ఈ లింకు లో ఆ వ్యాసం చూడవచ్చు.
‘తెలుగు వెలుగు’లో వ్యాసం వచ్చాక... పాఠకుల నుంచి వచ్చిన ఫోన్లలో ‘మిసిమి అనే పత్రిక ఒకటి ఉందా? దీని గురించి వినటం ఇదే మొదటిసారి ’ అని చాలామంది చెప్పారు.
ఆశ్చర్యం కలిగింది!
25 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న పత్రిక పరిస్థితి ఇది! సినీ టీవీ రంగాల్లో నిన్న గాక మొన్న ప్రవేశించినవాళ్ళ గురించి (ముఖ్యంగా నటులు ) మాత్రం కోట్ల మందికి ఇట్టే తెలిసిపోతుంటుంది.
పాత సంచికలకు ఇదిగో లింక్..
1990 తొలిసంచిక నుంచి 2010 మే సంచిక వరకూ మొత్తం 245 ‘మిసిమి’ సంచికలు పత్రిక వెబ్ సైట్ లో ఉచితంగా లభ్యమవుతున్నాయి. ఈ లింకు నుంచి PDF ఫైళ్ళను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా!