సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, నవంబర్ 2009, సోమవారం

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.

1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, భీష్ముడి అవక్ర పరాక్రమం, పాండవుల మహాప్రస్థానం; రాముడి అరణ్యవాసం, వాలి సుగ్రీవుల గాధ, వాలి వధ, హనుమంతుడి లంకా నగర సాహసాలు, వారధి నిర్మాణం, రామ రావణ యుద్ధం .. ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.

ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


‘చందమామ’ ఆరంభమైన 8 సంవత్సరాల తర్వాత, 1955 సెప్టెంబరు సంచికలోకి నడిచొచ్చాడు విక్రమార్కుడు! శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే విక్రమార్కుడి బొమ్మను మొదట ‘చిత్రా’ వేశారు. దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్. ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.

బేతాళ కథ చివరిపేజీలో శవంలోంచి మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)   చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  ఈ ఇద్దరు చిత్రకారులదీ   సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’ ;  శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’! (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)
 చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!


శంకర్ లాంటి గొప్ప చిత్రకారుడు గీసిన బొమ్మల్లోంచి ‘కొన్నిటిని’ ఎంచుకుని, టపాలో చూపించటం చాలా కష్టమైన పని. ఆయన ‘వైవిధ్య ప్రతిభను చూపించే బొమ్మల’ వరకే పరిమితమైనా సరే, ... అదీ ఐదారు   బొమ్మల్లో సాధ్యం కాదు.

మరేం చేయటం?

‘కొండను అద్దంలో చూపించటం’ కష్టమే. అలా చేసినా ఒక పక్కే కనపడుతుంది. మరి కనిపించని పార్శ్వం సంగతో?


అందుకే... శంకర్ గీసిన కొన్ని బొమ్మలను ‘మచ్చుకు’ ఇస్తూ సంతృప్తి పడాల్సివస్తోంది. (చందమామ పత్రిక సౌజన్యంతో).హాభారతం లోని చిన్ననాటి శకుంతల బొమ్మ చూడండి. వృక్షాలూ, లతలూ, పూలూ స్వాగతించే అద్భుతమైన ఆ అరణ్యంలోకి వెళ్ళాలనిపించటం లేదూ? కణ్వముని తో పాటు మనకూ ఆ బాల శకుంతలపై ప్రేమ పుట్టుకొచ్చేలా శంకర్ వేశారు.
శ్వేతుడి గదాఘాతానికి భీష్ముడి రథం నుగ్గునుగ్గయ్యే సన్నివేశం ఎంత గగుర్పాటు కలిగిస్తుందో గమనించండి.


క్షి ఆకారంలోని ‘క్రౌంచ వ్యూహం’ చూడముచ్చటగా అనిపిస్తుంది. దీనిలో రథ, గజ, తురగ, పదాతి సైన్యం చూడండి!  ‘విహంగ వీక్షణం’ చేయించారు కదూ, శంకర్!


 పర్వతమ్మీది నుంచి హనుమంతుడు లంకా నగరాన్ని చూడటం...దూరంగా సముద్రం... అద్భుతంగా లేదూ?క్కడ కనిపించే ... ‘రాతి తల’ను వేసింది శంకరే. ‘ప్రపంచపు వింతలు’ అనే సింగిల్ పేజీ ధారావాహిక చందమామలో 1960లలో వచ్చేది. 1969 మార్చి సంచికలోది ఈ బొమ్మ.


శంకర్ గారి జీవిత విశేషాలు చాలా వివరంగా ఇక్కడ లభిస్తాయి. చదవండి...!

6, నవంబర్ 2009, శుక్రవారం

రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం!


వైద్యశాస్త్రం పేరు చెప్పుకుంటూ ఒక డాక్టర్  పిచ్చి వైద్యం చేశాడు. అప్పుడు తప్పు- వైద్యశాస్త్రానిదా? డాక్టర్ దా? 

డాక్టర్ దే కదా తప్పు?

కానీ- ఆ వైద్యం వల్ల తన కుటుంబం పడ్డ యాతనలు చూసిన ఓ యువతి వైద్యశాస్త్రమ్మీదే విముఖురాలైంది.

ఇక్కడ... డాక్టర్ చైనా కమ్యూనిస్టు పార్టీ అయితే,  వైద్యశాస్త్రం కమ్యూనిస్టు సిద్ధాంతం!

ఆ యువతి పేరు యుంగ్ చాంగ్. ఆమె ఇంగ్లిష్ లో  ‘వైల్డ్ స్వాన్స్’ అనే పుస్తకం రాసింది, 1991లో! ఇది కాల్పనిక నవల కాదు.  ఆమె కుటుంబ చరిత్రా  ;  చైనా, కమ్యూనిస్టు పార్టీల చరిత్ర కూడా కలిసిపోయి ఇందులో కనిపిస్తుంది. ఇది మూడు తరాల కథ.

మావో నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, దాని పరిపాలనా మీదా తీవ్ర విమర్శలున్నాయి ఈ పుస్తకంలో.

ఈ పుస్తకాన్ని వెనిగళ్ళ కోమల గారు  ‘అడవి గాచిన వెన్నెల’ గా తెలుగులోకి అనువదించారు.

కమ్యూనిస్టు పార్టీ కోసం చేసిన కృషి అంతా వృథా  అయిపోయిందని చెప్పడానికి అనువాదానికి ఈ పేరు పెట్టినట్టు ఊహించవచ్చు. 

హైదరాబాద్ లోని ‘రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ  630 పేజీల పుస్తకానికి రంగనాయకమ్మ గారు ‘విమర్శనాత్మక పరిచయం’ అందించారు. ఇది 'ఆంధ్రప్రభ'  ఆదివారం సంచికలో ఏడాది పాటు ధారావాహికగా వచ్చింది. 


ఇప్పుడు అది ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ అనే పుస్తకంగా వచ్చింది. 


టైటిల్ చూసి, ‘ఇదేదో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ గోలలా  ఉంది, మనక్కాదేమో ఈ పుస్తకం’  అని కొందరు  పాఠకులైనా  అపోహ పడే  అవకాశముంది. 

 ప్రధానంగా కమ్యూనిజం గురించి ఆసక్తి ఉన్న పాఠకులను లక్ష్యంగా చేసుకుని ఈ పుస్తకం రాసినా ... ఆ  క్రమంలో ప్రస్తావనకు వచ్చే ఎన్నో అంశాలు  సాధారణ పాఠకులు  కూడా  ఆలోచించాల్సినవిగా కనిపిస్తాయి.  

   
రంగనాయకమ్మ గారు ‘అడవి గాచిన వెన్నెల’పై విమర్శ మాత్రమే రాసివుంటే  సందర్భాలేమిటో అర్థం కాక గందరగోళం అయివుండేది. ఆ సందర్భాలను తెలపటం కోసం అనువాద రచనను చాలాసార్లు కోట్ చేయాల్సివచ్చేది.  దీనికంటే ఇలా ‘విమర్శనాత్మక పరిచయం’ చేయటమే బావుంది. 

 పైగా ఇలా చేయటం వల్ల- ఈ పుస్తకం  చదవకముందే ‘అడవి గాచిన వెన్నెల’ను  చదవాల్సిన అవసరం కనిపించదు. తర్వాత కూడా చదవొచ్చు.  ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్నీ, ఇంకా ఇంగ్లిష్ మూలం  ‘వైల్డ్ స్వాన్స్’ నూ కూడా చదవటం మంచిదే!  
 
‘‘దీన్ని తెలుగు పాఠకులకు అందించిన వారిని అభినందించాలి. అనువాదం చాలా సరళంగా, చాలా సృజనాత్మకంగా సాగింది. ఎక్కడ ఏ తెలుగు మాటలు పడాలో అవే పడ్డాయి’’ అంటూ  ‘అడవి గాచిన వెన్నెల’ అనువాదం గురించి రంగనాయకమ్మ గారు ప్రశంసిస్తారు.
‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ కాలక్షేపం పుస్తకం కాదని తెలిసిపోతూనే ఉంది కదా?  రంగనాయకమ్మ గారు రాశారు కాబట్టి తేలిగ్గానే  అర్థమవుతోందనుకోండీ.  కానీ చైనా పేర్లు... యుఫాంగ్, డేహాంగ్, వాంగ్, యుంగ్ చాంగ్... ఇవన్నీ అలవాటయ్యేదాకా  మొదట్లో  కాస్త ఇబ్బంది!

ప్రజలకు సుఖ శాంతులు కావాలంటే కమ్యూనిజం పనికి రాదనీ, అది దుర్మార్గమైనదనీ యుంగ్ చాంగ్ తన పుస్తకంలో తేల్చిచెపుతుంది. అంతే కాదు; పెట్టుబడిదారీ విధానమే సరైనదనీ, అదెంతో గొప్పదనీ కూడా చెప్పేస్తుంది.

ఆమె ఈ అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి  బలమైన కారణాలే కనిపిస్తాయి.

ఆమె తల్లిదండ్రులు నిజాయితీగా, కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారు. కానీ ఆ పార్టీ...  వారిని అవమానాల, కష్టాలపాలు చేస్తుంది. ఇలా నిరపరాధులు  చాలామంది బాధలు పడటం యుంగ్ చాంగ్ చూస్తుంది. దీంతో ఆమె చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, ఆ సిద్ధాంతం మీదా  విముఖత  పెంచుకుంటుంది.

‘‘కమ్యూనిస్టు పార్టీ చేసిన తప్పులకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కారణంగా చేయటమే పొరపాటు’’  అని రంగనాయకమ్మ గారు అభ్యంతరం చెపుతారు. ‘‘మంచి సిద్ధాంతం పేరు చెప్పుకునే వాళ్ళ ఆచరణ చెడ్డగా ఉంటే, అది ఆ సిద్ధాంతం తప్పు అవదు’’ అంటారు.

‘‘పెట్టుబడిదారీ విధానం పట్ల సమర్థనా, కమ్యూనిజం పట్ల వ్యతిరేకతా కూడా ఒక పోరాటమే. పోరాటం అంటే, కత్తులూ, తుపాకులూ పట్టుకోనక్కరలేదు. భావాల్లోనే, ఆలోచనల్లోనే, పోరాటం ఉంటుంది, ఇటు వేపు గానీ, అటు వేపు గానీ’’  అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తారు!రంగనాయకమ్మ గారి విమర్శలూ, వ్యాఖ్యానాలూ, వివరణలూ ఈ విమర్శనాత్మక పరిచయాన్ని ఆసక్తి కరంగా మార్చాయి.  ఇక, ఆమె మార్కు రిమార్కులూ,  వ్యంగ్య హాస్య చమక్కులూ సీరియస్ సందర్భాల్లోనూ నవ్వులు పూయిస్తాయి! 

ఈ  పుస్తకంలో ఒక సందర్భం చూడండి.

‘‘.... పెళ్ళి ఆగిపోయిన రెండు వారాల తర్వాత, డేహాంగ్ తన ఉమెన్స్ ఫెడరేషన్ మీటింగ్ లో వుండగా, ... పార్టీ ఛీఫ్ నుంచి ఒక నోట్ అందింది- వెంటనే మీటింగ్ నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోమని! డేహాంగ్ ఆ నోట్ ని మీటింగ్ లో బాస్ కి అందించింది.

బాస్ కూడా ఆ నోట్ చదివి, ‘సరే వెళ్ళు’ అంది. డేహాంగ్, మీటింగ్ యూనిఫారమ్ లోనే పెళ్ళి కోసం వాంగ్ క్వార్టర్ వేపు పరుగు తీసింది. (అవును, తెలివైన పనే. ఆలస్యం చేస్తే  ‘పెళ్ళి ఆపండి’ అని ఇంకో నోట్ వచ్చినా రావచ్చు కదా? చెప్పలేం.) ’’

బ్రాకెట్లోని ఆ విసురు గమనించారు కదా!

ఈ సందర్భంలో దూసుకొచ్చిన  పదునైన వ్యాఖ్య ....

  ‘‘కమ్యూనిస్టు పార్టీని,  ‘ప్రేమించడానికి అనుమతి’ అడగడం ఏమిటి? దానికి అప్లికేషన్ పెట్టడమూ, అనుమతి దొరికితేనే ప్రేమించడమూనా? .... పురాణ కథల్లో అయినా పెద్దల్ని అనుమతి అడిగి ప్రేమించడం ఉంటుందా? ఫ్యూడల్ సమాజంలో అయినా ఇంత అజ్ఞానం ఉంటుందా? .... ప్రేమించడానికి పర్మిషన్లు అయ్యాక, అప్పుడు పెళ్ళికి మళ్ళీ కొత్త పర్మిషన్లు’’

 పార్టీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళ ప్రహసనం పై  రంగనాయకమ్మ గారు తన అనుభవం ఇలా పంచుకున్నారీ పుస్తకంలో!

‘'....పెళ్ళికి ముందు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, పెళ్ళికి పిలవడానికి కాదు; వేరే పని మీద. ‘నీ పెళ్ళి అట కదా? ఎప్పుడు?’ అని అడిగాను. ‘ఏమో, నాకింకా తెలీదండీ. మీటింగ్ ఎప్పుడు పెట్టారో ! రెండ్రోజులో మూడ్రోజులో ఉందనుకుంటా’’.... అంది. ‘పెళ్ళి కొడుకు ఎవరో అయినా తెలుసా?’ అని నేను అడగలేదు. అప్పటికే స్పృహ తప్పివున్నాను నేను.

తన పెళ్ళెప్పుడో తెలుసుకోవాలని ఆ అమ్మాయికి ఉత్సాహం లేదు, ఆతృత లేదు. ... ఇలాంటి పార్టీ కార్యకర్త, ‘నూతన సమాజం’ అనీ, ‘నూతన సంస్కృతి’ అనీ ఉపన్యాసాలిస్తూ ఉంటుంది.... అన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీల నూతనత్వాలూ ఒక్కలాగే ఉన్నట్టున్నాయి’’

అదండీ సంగతి!

 ‘‘చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, మావో మీదా,  తీవ్రమైన విమర్శలతో సాగిన ఈ పుస్తకాన్ని మన కమ్యూనిస్టులందరూ చదివి, నిశితమైన చర్చలు చేసుకోవాలి’’ అంటారు రంగనాయకమ్మ గారు.

  ఇక సందర్భానుసారంగా-  యువతీ యువకుల ప్రేమ గురించీ; ఆటల పోటీలూ, వస్త్ర ధారణా, ప్రాచీన  సాహిత్యం, వ్యక్తి పూజల గురించీ ఆమె  వ్యక్తీకరించిన అభిప్రాయాలు  చదవాల్సిందే!    

‘‘మనుషులు కోరుకోవలిసింది  తన స్వంత ఆనందం ఒక్కటే కాదు, స్వంత ఆనందం ఎప్పుడూ ఉండవలిసిందే. అది లేకపోతే జీవితం శూన్యం అయిపోతుంది. కానీ, దానితో పాటు, తను కూడా జీవించే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే ‘చిన్న ఆదర్శం’ కూడా ఉండాలి’’ అంటారు  ఈ పుస్తకంలో!

 ఈ  రచన చివర్లో  ఆమె రాసిన  మాటలు ‘కళాత్మక జీవితం’ గురించి  ఆలోచనలు రేపుతాయి.

''హత్యలు అవలీలగా చేసే కిరాతకుడు కూడా చేతిలో కత్తితో పోతూ, దారిలో మొక్కల మీద విప్పారి వున్న పూలు కంటబడ్డ క్షణాల్లో తనకు తెలియకుండానే ఆనందంతో స్పందిస్తాడు. ఆఖరికి జంతువులు కూడా పచ్చికలో సేద దీరి, చల్లగాలినీ, వెన్నెలనీ మోరలెత్తి అనుభవిస్తాయి.

మనుషులైనవాళ్ళు ప్రకృతిని ఆస్వాదించడంలో కొత్త జ్ఞానమూ లేదు, కొత్త సంస్కారమూ లేదు. మనుషులుగా పుట్టి పెరుగుతోన్నవాళ్ళు నేర్చుకోవాలసింది, మనుషుల గురించి. మనుషుల సంబంధాలలోనూ, మనుషుల జీవితాలలోనూ, రహస్యంగా దాగివున్న సత్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సిద్ధాంతం ఒకటి ఉంది. దానిముందు ప్రేమతో మోకరిల్లడం మనుషుల విధి!''

యుంగ్ చాంగ్ వేదనను సానుభూతితో  అర్థం చేసుకుంటూనే; ఆమె ఆలోచనల్లో, ఆచరణలో   లోపాలను  వెల్లడించటం  ఈ విమర్శనాత్మక పరిచయం  విశిష్టత.

''... మానవ జీవితానికి నిజమైన ఆనందం, ప్రేమానురాగాలతో నిండిన మానవ సంబంధాల సౌందర్యంలో దొరికేదే గానీ, ప్రకృతి పరిశీలనల్లో దొరికేది కాదు. ఈ రచయిత్రి (యుంగ్ చాంగ్) మేధావితనం, ఆమెకా విషయం బోధించలేదు’’
 
ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టు రాసేటప్పుడు....  ఆ వాక్యాలు  తన  హృదయంలోంచి సూటిగా వచ్చినట్టు  శక్తిమంతంగా రాస్తారు రంగనాయకమ్మ గారు!


 ‘‘ఆమె (రచయిత్రి యుంగ్ చాంగ్) కోరుకున్న బూర్జువా రుచుల ముందు తల్లిదండ్రుల ఆదర్శాలేవీ పనిచెయ్యలేదు... ఆమె, ఆ  అవగాహన ఏర్పరుచుకునివుంటే, దోపిడీ నీచత్వంలో ఆరితేరిన బూర్జువా విధానాన్ని కీర్తించే, మానవుల వల్ల మానవులకే ద్రోహం జరిగే క్రూర విధానాన్ని ఆలింగనం చేసుకునే పతనావస్థ  ఆమెకి తప్పేది.’’ ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ రాయల్ సైజులో 250 పేజీలున్న పుస్తకం.  ధర 60 రూపాయిలు. విశాలాంధ్ర, నవోదయ లాంటి పెద్ద పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఇవి అందుబాటులో లేనివారు విజయవాడలోని ‘అరుణా పబ్లిషింగ్ హౌస్’ (ఫోన్ : 0866-2431181) ని సంప్రదించవచ్చు. 

కినిగెలో ఈ - బుక్ కావాల్సినవారు చూడాల్సిన లింకు- 
http://kinige.com/kbook.php?id=947&name=Communistu+Party+Ela+Vundakudadu

 ఈ టపాలో నేను రాసినవాటి కంటే రంగనాయకమ్మ గారి పుస్తకంలోని వాక్యాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయా?:) .....  నిజమే!