సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, జూన్ 2010, శుక్రవారం

మాటల మెజీషియన్ మన బాలూ!


‘దస్తూరి గుణాల కస్తూరి’ అనే కదా ముళ్ళపూడి అన్నదీ!
‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకాన్ని అభినందిస్తూ బాలూ  స్వయంగా రాసిన  లేఖ ఇది. దస్తూరి ఎంత చక్కగా ఉందో చూడండి!

‘పాటను ముత్యాల్లాంటి అక్షరాల్లో రాసుకుని బాలూ పాడే విధానం చాలా బావుంటుంది’ అని  దర్శకుడు వంశీ పదిహేనేళ్ళ క్రితం అభిమానంతో  పరవశంగా చెప్పటం నాకింకా బాగా గుర్తు!


గౌను వేసుకుని, బొట్టూ పూలూ కూడా పెట్టేసుకుని, సైకిలు మీద కూర్చుని చారెడేసి కళ్ళతో అమాయకంగా  చూస్తున్న ఈ పాపాయిని చూశారా?           
                                 
ఎవరీ బాల? ‘బాల రసాల సాల అభినవ ఘంటసాల’అనీ, ‘పుంస్కోకిల’ అనీ  వేటూరి ప్రశంసించిన  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానిదే ఈ ఫొటో!
బాల్యంలో అమ్మాయి గా ముస్తాబు చేసి, సరదాగా తీశారు.

పందొమ్మిదేళ్ళ లేత వయసుకే  సినిమాలో ‘ఏమి ఈ వింత మోహం’ అంటూ తొలిపాట పాడేసి , దశాబ్దాలపాటు  శ్రోతలను  సుమధుర  గాన మోహాంబుధిలో   ముంచెత్తిన   అద్భుత  గాయకుడు.. బాలూ  పుట్టింది ఈ రోజే!

పాటల యంత్రంగా పరిశ్రమలో స్వైర విహారం చేస్తున్నపుడు... 29 ఏళ్ళ క్రితం   ఓ రోజున ఏకంగా  21 పాటలు   పాడి   రికార్డులు బద్దలు కొట్టారు బాలూ . కానీ ఏ నాడూ యాంత్రికంగా పాడింది లేదు. అందుకే మ్యూజికాలజిస్టు రాజా ఆయన్ను‘య(మ)స్పీ(డు) బాల సుబ్రహ్మణ్యం’ అని చమత్కరించారు.


గాయకుడిగా కెరియర్ ఆరంభించిన పదేళ్ళకు 1976లో అనుకోకుండా, అయిష్టంగా, సంగీత దర్శకుడు చక్రవర్తి బలవంతమ్మీద డబ్బింగ్ లోకి అడుగుపెట్టారు బాలూ. అది ‘మన్మథ లీల’ సినిమా. కానీ డబ్బింగ్ చెప్పింది కమలహాసన్  పాత్రకు కాదు, ఓ  పెద్ద వయసు పాత్రకు! మూడేళ్ళ తర్వాత ‘కళ్యాణ రాముడు’ తో కమల్ కు బాలూ డబ్బింగ్ చెప్పటం మొదలైంది. బాలూ గొంతు కమల్ కి ఎంత సరిగ్గా సరిపోయిందంటే ... తెలుగులో  కమల్ స్ట్రెయిట్ సినిమాలకు కూడా బాలూయే డబ్బింగ్ చెపుతుంటారని ఇప్పటికీ  భ్రమపడుతుంటారు చాలామంది.

కమల్-బాలూల గొంతుల్లో తేడా కనిపెట్టటం నిజానికంత కష్టమా? కానే కాదు. కానీ ఆ తేడాను చాలా సూక్ష్మ స్థాయికి చేర్చి, గొంతును చక్కగా మార్చి, ప్రేక్షకులను ఏమార్చిన ప్రతిభ బాలూది!

ఆనందభైరవి (1984)లో గిరీష్ కర్నాడ్ కీ, రుద్రవీణ (1988)లో జెమినీ గణేశన్ కీ, అన్నమయ్య (1997), శ్రీ రామదాసు (2006)లో సుమన్ కీ, అతడు (2005)లో నాజర్ కీ తన గొంతు అరువిచ్చి, ఆ పాత్రలు అద్భుతంగా పండటానికి బాలూ ఎంత కారకుడయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శంకరాభరణం (1979)లో జిత్ మోహన్ మిత్ర పాప్ మ్యూజిక్ బృందానికి శంకరశాస్త్రి బుద్ధి చెప్పిన సన్నివేశం ఎంత బావుంటుందీ!  పాశ్చాత్య,  భారతీయ శాస్త్రీయ సంగీత వైవిధ్యాలను అనుపమానంగా, అవలీలగా  తన గొంతులో  పలికించిన  బాలూ ప్రతిభ దానికి ప్రధాన కారణం.  

డబ్బింగ్ కళాకారుడిగా బాలూ చరిత్రలో రెండు మైలు రాళ్సున్నాయని చెప్పొచ్చు. ఒకటి-  భామనే సత్యభామనే (1996). రెండోది- దశావతారం (2007). ‘భామనే సత్యభామనే’లో  సినిమాలో నాలుగైదు పాత్రలకు డబ్బింగ్ చెప్పారట బాలూ. నాకైతే మూడే పాత్రలు గుర్తున్నాయి. హీరో పాత్ర, భామా రుక్మిణి, ఇంటి ఓనరు మణివణ్ణన్ పాత్రలు. భామా రుక్మిణి పాత్రకు బాలూ చెప్పిన డబ్బింగ్ ఓ అద్భుతం!

మామూలుగా పురుషులు స్త్రీ వేషాలు వేసిన సందర్భాల్లో స్త్రీలతోనే డబ్బింగ్ చెప్పించే ఆనవాయితీ ఉంది ( చిత్రం భళారే విచిత్రం (1991)లో నరేష్ పాత్ర గుర్తుందా?) దాన్ని తోసిరాజని తమిళంలో కమల్, తెలుగులో బాలూ తమ గొంతులు మార్చి సంభాషణలు పలికి  ప్రయత్నించి విజయం సాధించారు. (డబ్బింగ్ కళలో పట్టున్న హీరో రాజేంద్రప్రసాద్  మేడమ్ (1993)లో గొంతు మార్చి చెప్పిన ప్రయత్నం అంతగా ఫలించలేదు.)

బాలూ బహుళ గళ బహుముఖ ప్రతిభ ‘దశావతారం’లో పరాకాష్ఠకు చేరింది! దీనిలో ఏడు పాత్రలకు ఆయన  సంభాషణలు పలికారు. (మిగిలిన మూడు పాత్రలు- విలన్ ఫ్లెచర్, జపనీస్ నరహషి, జార్జి బుష్ పాత్రలకు తమిళ్ ఒరిజినల్లో ఉన్న కమల్ గొంతు నే ఉంచేశారు).

ఆ మధ్య ‘ఝుమ్మంది నాదం’ ఈటీవీ ప్రోగ్రాం చూశాను. దశావతారం బామ్మ కృష్ణవేణి పాత్ర ను పున: సృష్టి చేస్తున్నట్టుగా   బాలూ తన గొంతులోంచి అలవోకగా ఆ  సంభాషణలు చెప్తోంటే...  నిబిడాశ్చర్యంతో కళ్ళార్పకుండా,  చెవులు రిక్కించి మరీ విన్నాను.

స్వర ఇంద్రజాలం అంటే ఏమిటో అర్థమైంది!

పొడుగాటి మనిషి కలీఫుల్లాఖాన్ పాత్రకు డబ్బింగ్ చెప్తున్నపుడు గొంతుకు ఇబ్బంది కూడా వచ్చిందని  ఆయన చెపుతూ, ఆ పాత్ర సంభాషణలు కూడా  వినిపించారు.

అద్భుత నైపుణ్యమూ, స్వరపేటిక మీద అత్యంత అధికారమూ ఉంటే గానీ అలా పర్ ఫెక్ట్ గా గొంతును ఎలా పడితే మార్చేసి, మాటలను మంత్ర సదృశంగా  ప్రయోగించటం సాధ్యం కాదనిపించింది.   ఆ సినిమాలో బలరామ్ నాడార్  పాత్రకు చెప్పిన డబ్బింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది!
 
ఏడు పాత్రలకు డబ్బింగ్- అదీ ‘అనుకరించి’ చెప్పటం గొప్పయితే... పది పాత్రలకు ఎంతో వైవిధ్యంగా గొంతులు మార్చి సంభాషణలు  చెప్పిన కమల్ ఇంకా గొప్ప కదా అనే సందేహం వస్తుంది.  కమల్ ఒరిజినల్ మూవీలో సంభాషణలు ఎలా చెప్పాడో్ తెలుసుకోవటానికి హైదరాబాద్ ఐమాక్స్ లో దశావతారం తమిళ వర్షన్ చూశాను. కమల్ పోషించిన విభిన్న పాత్రల సంభాషణల శైలి విషయంలో-  తెలుగుకీ,  తమిళానికీ అసలు తేడాయే కనిపించలేదు. బాలూ ప్రతిభ మరింత బాగా అవగాహన అయింది.  తెలుగులో బాలూ స్థాయిలో  డబ్బింగ్ చెప్పగల మరో వ్యక్తి ఎవరూ లేరని నిస్సంశయంగా చెప్పొచ్చు.

బాలూ ప్రత్యేకత ఏమిటంటే... పాటల్లో కూడా గొంతు మార్చి చరిత్ర సృష్టించటం. ఎన్టీఆర్ కీ, ఏఎన్నార్ కీ, కృష్ణకీ ఆయన ఎంతెంత వైవిధ్యంగా ఏళ్ళ తరబడి పాటలు పాడారు! అల్లు రామలింగయ్య, మాడా లాంటి హాస్యనటులకు కూడా నప్పేలా పాటలు పాడారు. 

టీవీల్లో ‘పాడుతా తీయగా’లాంటి సంగీత కార్యక్రమాల రూపకర్తగా, యాంకర్ గా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పారు. పాట పాడేయటం తప్ప, దాన్ని రాసిందెవరో,  సంగీతం సమకూర్చిందెవరో పట్టించుకోని వర్థమాన  గాయకులు ఆ లోపం  సవరించుకునేలా చేసిన ఘనతను  బాలూకే ఇవ్వాలి!

ఆయన మాట్లాడుతున్నపుడు అలా వినబుద్ధేస్తుంది. సాధికారికంగా పాత సంగతులను  తలపోసుకోవటం, పాటల రచయితలనూ, సంగీతదర్శకులనూ  స్మరించుకోవటంలో వారి మీద గౌరవభావం, తెలుగు భాష మీద మమకారం...   సందర్భానుసారంగా ఛలోక్తులు విసరటం ... ఆయన సంభాషణలకు   పరిమళాన్ని అద్దుతుంటాయి.
                                                  
                                                  
కృతజ్ఞత చూపటం  కంటే గొప్ప మానవ సంస్కారం ఉండదని నా నమ్మకం. తన ఉన్నతికి కారకులైన సంగీత దర్శకుడు  ఎస్పీ  కోదండపాణిని సందర్భం వచ్చినపుడల్లా  తల్చుకుంటూ ఆయన పేరు మీద రికార్డింగ్ లాబ్స్, సినీ నిర్మాణ సంస్థ ను నెలకొల్పటం బాలూ అంటే  ఏమిటో స్పష్టం చేస్తాయి.

‘ఝుమ్మంది నాదం’ ప్రోగ్రాంలో తన అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ గురించి వివరిస్తున్పపుడు  బాలూ ఉద్వేగపు వెల్లువా, ప్రేమానురాగ రసస్పందనా  చూసి తీరాల్సిందే!

అద్భుత కళాకారుడూ, మధుర గాయకుడూ, సంస్కారీ, మంచి మనిషీ ... మన బాలూ!
 
(బాలూ పాడిన ఒక్క పాట కూడా పూర్తిగా తల్చుకోకుండా టపా ముగించటం కష్టంగానే ఉంది. ‘తీయని వెన్నెల రేయి’లో  ‘దివిలో విరిసిన’  పాటల ‘పారిజాతాల’ ను  ఏరుకుని,  ఆ శ్రావ్యతను గుర్తుచేసుకునే ఛాయిస్  మీకే ఇచ్చేస్తున్నాను మరి!) :)