సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, డిసెంబర్ 2010, ఆదివారం

నాస్తిక భర్త ... మరికొన్ని కథలు!



‘‘ఈ నాస్తికులు మంచివాళ్ళు. వాళ్ళు మనల్ని మారమనరు. వాళ్ళే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా ఉంటారు.’’

సునంద అనే పాత్ర తన తన ‘నాస్తిక భర్త’ గురించి స్నేహితురాలికి చెప్పే మాటలివి.  ఈ కథలో సునంద నోము నోచుకుంటూ  పూజ మంత్రాలను తప్పుతప్పుగా చదువుతుంటే   భర్త మోహన్ వాటిని వినలేక,  ఆమె అభ్యర్థనకు కరిగిపోయి మంత్రాలన్నీ  తనే చదివి, పూజ చక్కగా జరిగేలా  సహకరిస్తాడు.

నాస్తిక భర్తలకు సంస్కృతం కూడా కాస్త తెలిసుంటే,  లేకపోతే తెలుగు లిపిలో ఉన్నశ్లోకాలను కచ్చితంగా  చదవటం తెలిసుంటే...  ఇలాగే జరుగుతుంది! 

నా విషయమే చూడండి...  ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మా ఇంట్లో  ‘వ్రతకల్పం’ శ్లోక పఠనంలో అక్కడక్కడా దోషాలు చెవులబడినప్పుడు అవి కర్ణ కఠోరంగా తోస్తుంటాయి.  పక్క గదిలో పుస్తకమో, పేపరో చదువుకుంటూ,  శ్లోకాలకు వచ్చిన పాట్లను గమనించి నవ్వుకొని,  వదిలేస్తుంటాను. కానీ ‘కాస్త ఈ శ్లోకాలు మా కోసం చదువ్’  అనే అభ్యర్థన వచ్చివుంటే నేనేం చేసుండేవాణ్ణి?  బహుశా మోహన్ లాగే చదివిపెట్టేవాణ్ణే అనిపిస్తోంది. :)  

నాస్తిక  భర్తలందరూ ఒకేలా మూసపోసినట్టుండరు.  నిజమే! కానీ  మెజారిటీకి వర్తించేదైనా, మైనారిటీకి వర్తించేదైనా -  ఒక వాస్తవికత  కథలో ప్రతిఫలిస్తే మంచి కథ  అనిపిస్తుంది. ఈ ‘నాస్తిక భర్త’ కథ అలాంటిదే !  (మన తెలుగు భక్తి సినిమాల్లో అయితే నాస్తిక భర్తలు  చెడ్డవాళ్ళే.  ‘చివరికి’  భక్తులుగా  మారి మంచివాళ్ళైపోతారు. :))   

ఈ కథా రచయిత  జె.యు.బి.వి. ప్రసాద్.  ఈ కథతో కలిపి ఆయన రాసిన  20 కథలు ఈ మధ్యనే ‘ఆ కుటుంబంతో ఒక రోజు’  పుస్తకంగా వచ్చాయి.  వీటిలో కొన్ని కథలనైనా కౌముది, ఈ మాట లాంటి  వెబ్ పత్రికల్లో  ఆన్ లైన్  పాఠకులు చదివేవుంటారు.

ఈ సంకలనం గురించిన క్లుప్త సమీక్షను  ఇవాళ్టి  ‘ఈనాడు’ సండే మ్యాగజీన్లో  చూడండి.


‘ఆ కుటుంబంతో ఒక రోజు’  ఈ- బుక్ గా  కినిగెలో లభిస్తోంది. లింకు ఇక్కడ- 
http://kinige.com/kbook.php?id=126&name=aa+kutumbamto+oka+roju

రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళొస్తే..?
ఈ పుస్తకంలో కొన్ని కథలు చదువుతుంటే  వాటిని ‘రంగనాయకమ్మ గారు రాశారా?’ అనే సందేహం వచ్చేస్తుంది.  భావాల్లో సారూప్యతతో పాటు  అదే పదజాలం... అవే వ్యక్తీకరణలు...!  రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళి అక్కడి కుటుంబ వ్యవస్థను స్వయంగా గమనించి ఓ కథ రాస్తే? అది ‘ఆ కుటుంబంతో ఒక రోజు’ కథలాగా ఉంటుందేమో!

ఈ సంకలనంలో కొన్ని కథలు నాకు బాగా నచ్చాయి.  సాదాసీదాగా అనిపించినవీ  లేకపోలేదు.  మూఢ నమ్మకాలనూ,  కృత్రిమ విలువలనూ, అర్థం లేని ఆడంబరాలనూ, ఆచారాలనూ,  హిపోక్రసీనీ  విమర్శించే ధోరణి  కథల్లో కనిపిస్తుంది. ఇంటిపనులూ, వంట పనులూ ఆడవాళ్ళ డ్యూటీ అనుకోకుండా  ఆ పనులు ఇష్టపడి  చేసే  మగవాళ్ళు  కొన్ని కథల్లో తారసపడి, అబ్బురంగా అనిపిస్తుంది.  చిన్నచిన్న మాటలతోనే కథనం సాగే ఈ కథల్లో పదాడంబరం ఎక్కడా కనపడదు.

 ‘‘నీతో చెప్పాలంటే అందరికీ భయమే. ప్రతిదానికీ భయమే. .... అస్తమానూ అమ్మ, ‘ఇంటి యజమానీ’, ‘ఇంటి మగాడూ’ అంటుందేమిటీ నిన్నూ? నువ్వు యజమానివా! మా నాన్నవే కదా? ....  నాన్నంటే భయం ఎందుకుండాలి నాన్నా?...’’ ‘భయం! భయం!’ అనే కథ ముగింపులో కొడుకు తండ్రిని నిలదీసే ఈ  rhetorical questions  ఆలోచింపజేస్తాయి;  కదిలిస్తాయి!

‘ప్రశ్న’ అనే కథలో మధు అనే పిల్లాడు తల్లిపై తండ్రి చేసే దౌర్జన్యం అడ్డుకోవటం కోసం బలం తెచ్చేసుకోవాలని తపనపడతాడు. తల్లి వాడి ప్రేమకు పొంగిపోతుంది.  ‘పెద్దయ్యాక నువ్వూ మగాడివైపోయి పెత్తనం చేస్తావు’ అంటుంది. వెంటనే  ఆ పిల్లాడు   - ‘‘పెద్దయ్యాక మగాడిలా అవకుండా ఉండాలంటే, ఏం చెయ్యాలమ్మా?’’ అనడిగి వాళ్ళమ్మనీ,  ఈ కథ చదివేవారినీ నివ్వెరపోయేలా చేస్తాడు.   

చక్కగా హార్డ్ బైండుతో 1/8 డెమ్మీ సైజులో  చాలా తక్కువ ధరకే  దొరుకుతోంది ఈ కథల పుస్తకం!  

30, నవంబర్ 2010, మంగళవారం

తీయని స్వరాల ‘తెనాలి’ పాట!

  పదేళ్ళక్రితం విడుదలైన ‘తెనాలి’  నాకు చాలా అంశాల్లో నచ్చింది.

    సూర్యాపేటలో  ఉన్నపుడు మా అమ్మాయి నీహారికతో కలిసి  ఈ సినిమా చూశాం.  అప్పుడు మా పాపకు మూడేళ్ళు.

థియేటర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు  ‘ఇప్పుడు మనం చూసిన సినిమా పేరేంటి?’ అని అడిగాను సరదాగా. 

అన్నం  తింటున్నట్టు నోటి దగ్గర వేళ్ళను ముడిచిపెట్టి  ‘తినాలి!’  అని చెప్పింది! :)

  
      సినిమాలోని  ఓ పాట  విశేషాలను మీతో పంచుకునే ప్రయత్నమిది.  ‘ప్రాణమా’ అనే ఈ యుగళగీతం  హాంటింగ్ మెలడీ!  వెన్నెలకంటి రాశారు ఈ పాటను.


ఇక్కడ  వినండి.  (ఇది ఇక్కడున్న జాబితాలో నాలుగో పాట)
 అసలీ పాటను రెహమాన్  స్వరపరిచాడని నేను మొన్నమొన్నటిదాకా గమనించలేదు. పాట బాణీ, నేపథ్య వాద్య సంగీతం  అన్నీ శ్రావ్యంగా మనసుకు హత్తుకుంటాయి.

తమిళంలో బాలుతో పాటు సాధనా సర్గమ్ ;  తెలుగులో బాలుతో పాటు  చిత్ర  పాడారు.
తమిళ గీతం ‘శ్వాసమా..’  ఇక్కడ వినండి.

పల్లవి తర్వాత... ‘ఎదలే ఎదురించవా  ఎదురై మురిపించవా’ కు ముందు  రిదమిక్ గా  వచ్చే బీట్ గమ్మత్తుగా ఉంటుంది. ఇది పాటంతా వినిపిస్తుంటుంది.

‘ప్రాణమా  ప్రాణమా’ అనే మాటలను చిత్ర ఆర్తిగా  పాడిన విధానం ఎంత బాగుంటుందో... అంతే కాదు;  అదే వరసలో బాలూ   ‘ప్రాయమా’ అనే మాటను చాలా సుతారంగా  పలుకుతాడు.

రెండో చరణానికి ముందు వచ్చే వాద్య సంగీతం మనోహరం.


చిత్రీకరణ కూడా కనువిందుగా  ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి. 



పాట పూర్తి పాఠం నెట్ లో ఎక్కడా లేదు. అందుకే దాన్ని ఇస్తున్నాను.

దను దోచి  ఏదో చేసి  కళ్ళ నిండ కలలే దాచి
 ఎదను దోచి ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచి
చెంతకీ  చేరకా  ఊరింతువేలా
ప్రాణమా   ప్రాణమా


ఎదలే ఎదురించవా  ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై పులకించవా 
ఎదలే ఎదురించవా
ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై  పులకించవా 


ప్రాణమా  ప్రాణమా...   ప్రాణమా ప్రాణమా


ఎదను దోచి  ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచీ
 ఎదను దోచి ఏదో చేసి   కళ్ళ నిండ కలలే దాచీ
చెంతకీ  చేరకా  ఊరింతువేలా


 ప్రాయమా ప్రాయమా ....  ప్రాయమా ప్రాయమా
 
నన్ను చూసి నన్నే చూసీ  కళ్ళ తోటి కలలే దోచి
తీయని ఊహల మరిగింతువేలా


ఎదనే నిదురించవా  ఎదురై మురిపించవా
పాటే  పలికించవా  తోడై పులకించవా


1. కలిసిన కళ్ళే   కలలకు ఇళ్ళై
    వయసును గిల్లే మన్మథ విల్లై
    కలిసిన కళ్ళే   కలలకు ఇళ్ళై
   వయసును గిల్లే మన్మథ విల్లై


    హాయిగా ఊగే  ఊయలలూగే  అందం  ఎరవేసీ   సర్వమేదో సాగి
    ఆశల గోదారి ఎగిసినదంటా   తారల పూలని తీసుకుందుమంట
    నిదురించు ప్రేమయె ఉదయించె నేడే   నిదురించు ప్రేమయు ఉదయించె నేడే
     ప్రాణమా  ప్రాణమా


2.  హృదయాన ఊగే ఈ రాగహేల
       మధురం కదా ఇక మన రాసలీల
       రెక్కలు తొడిగీ తలపులు చాలా
        దిక్కులు దాటి ఎద యీ వేళ
        ఎద వీణ దాచీ మౌనగీతం నీది
      పున్నాగ విరుల సన్నాయి నీవే
       జత  నీవని నిన్నే  వలచి వచ్చానే...


     ప్రా...ణమా  ప్రాణమా
     ఎదను దోచి... (నవ్వు ఎదను దోచి ఏదో చేసి...
     కళ్ళ నిండ కలలే దాచి  ...
      ఎదనే నిదురించవా  ఎదురై మురిపించవా
     పాటే  పలికించవా  తోడై పులకించవా 
     ఎదనే నిదురించవా
      ఎదురై మురిపించవా
       పాటే  పలికించవా  తోడై  పులకించవా 


        ప్రాణమా...  ప్రాణమా..

31, అక్టోబర్ 2010, ఆదివారం

అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!


ఎంటీవీ ఆచార్య! ...

ఈ చిత్రకారుడి పేరు 2006 ఆగస్టులో తొలిసారి నాకు  తెలిసింది. (మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడి బొమ్మలు మాత్రం అప్పటికే తెలుసు. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం పాఠశాల పాఠ్యపుస్తకాలకు చక్కటి బొమ్మలు వేశారు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈ మాట’లో  ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసంలో ఆచార్య గారి గురించి చాలా గొప్పగా రాశారు. ఇలా...

‘‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు మేకప్‌ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’


చందమామలో ‘మహా భారతం’ అంటే నాకు శంకర్ బొమ్మలే తెలుసు. ఆచార్య గారు అంతకుముందే మహాభారతానికి ఇంత సుదీర్ఘ కాలం అద్భుతమైన బొమ్మలు వేశారనే సంగతి అప్పుడే తెలిసింది. విపరీతమైన ఆసక్తి ఏర్పడి, ఆయన వివరాల కోసం నెట్ లో అన్వేషించాను. కొన్ని వివరాలే తెలిశాయి. తర్వాత నాగమురళి బ్లాగు ద్వారా www.ulib.org లో పాత చందమామల ఆచూకీ తెలిశాకే ఆచార్య గారి వర్ణచిత్రాలను చూసే అవకాశం కలిగింది.

కానీ ఆయన ఫొటో దొరకనే లేదు!


తాజాగా అక్టోబరు నెల చందమామ ముఖచిత్రంగా ఆచార్య గారి బొమ్మనే ప్రచురించారు. ఈ సందర్భంగా   టపా రాద్దామనుకునేలోపే రాజశేఖరరాజు గారు చందమామ చరిత్ర.లో రాసేశారు.:)


పైన ‘కీచక వధ’ ఘట్టాన్ని ఎంత  బాగా చిత్రించారో చూడండి. అస్పష్టమైన చీకటి నేపథ్యంలో భీమ, కీచకుల పోరాటం, ద్రౌపది హావభావాలు గమనించండి!



అంతకుముందు భీముడితో  మొరపెట్టుకుంటున్నద్రౌపది



ఆచార్య గారి చిత్ర కళా వైభవం ‘చందమామ కలెక్టర్స్ ఎడిషన్లో’ ఇచ్చిన ఈ రెండు బొమ్మల్లో చూడవచ్చు. 



మరికొన్ని బొమ్మలు చూడండి....

ఉత్తర గోగ్రహణం



ఉత్తర కుమారుడి ప్రగల్భాలు



 
ఉత్తరకుమారుడి యుద్ధ భీతి

                కంకుభట్టు రక్తం చిందకుండా సైరంధ్రి ప్రయత్నం

యమధర్మరాజుతో సావిత్రీ సత్యవంతులు

నర్తన శాలలో బృహన్నలా, ఉత్తరా
పార్థుడూ,  సారథీ
‘బావా!  ఎప్పుడు వచ్చితీవు’ కి ముందు
బాలకృష్ణుడి దగ్గరకు వస్తున్న పూతన

అజ్ఞాతవాసంలో ద్రౌపదీ, పాండవులూ

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

బ్లాగులంటే పడని మా అమ్మాయి!


దమూడేళ్ళ క్రితం  పసిపాపగా పారాడుతూ ఉన్న నీహారిక,  మా పాప- తర్వాత కాస్త ఎదిగి నర్సరీలూ, కేజీలూ దాటేసి, స్కూల్లో చేరి ఏదో సాధించేసినట్టు- ఇలా... కాలు మీద కాలేసుక్కూర్చుంది!

ఇంటర్నెట్ ని తను చాలా సులువుగా, తడబాటేమీ లేకుండా ఉపయోగిస్తుంది.  దీంట్లో విశేషమేమీ లేదు గానీ, తనకు బ్లాగింగ్ అంటే ఇష్టముండదట.

‘ఎందుకూ?’ అనడిగాను.
‘ఎందుకో చెప్పటం కూడా ఇష్టం లేనంత అయిష్టం’ అంది!  (‘అనిష్టం’ అనాలంటూ ‘తాడేపల్లి’ గారు క్లాసు తీసుకుంటారు :)).

కారణాలు తెలీనపుడు ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా కష్టమే కదా!
మరేం చేయాలి?  

                                  *  *  *

ఇంతకీ,  నెట్ ను నీహా ఎలా ఉపయోగిస్తుందంటే...

*  ఫొటోషాప్ ని ఉపయోగించి రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది.
    అడవిలో పూల చెట్ల కింద ఉయ్యాల మీద కూర్చున్నట్టూ, ఉద్యానవనంలో వంతెనపై నిలబడినట్టూ,  పచ్చని చెట్ల   కింద ప్రభాతవేళ చిద్విలాసంతో పోజిచ్చినట్టూ...  ఛాయాచిత్రాలను మార్చేస్తుంది. 



గుర్రం బొమ్మను అలంకరించి, దాని మెడలో ‘Hi Niha!' అని టాగ్ ని కట్టేస్తుంది! పొద్దు తిరుగుడు పువ్వు మధ్యలో తన మొహం కనపడేలా క్రియేట్ చేస్తుంది. 


*  హీరోయిన్లు హాసిని, మిత్రవిందలంటే- అదేనండీ... జెనీలియా, కాజల్ లు తనకు బాగా ఇష్టం.  ‘ సినిమా పేజీ’లో వాళ్ళ ఫొటోలు ఉన్నాయా అని రోజూ ‘ఈనాడు’ తిరగేస్తుంది. గూగుల్ సెర్చింజన్లో ఇమేజెస్ ను ఎప్పటికప్పుడు  శోధిస్తూ ఆ హీరోయిన్ల ఫొటోలతో  డెస్కుటాప్ ని నింపేస్తుంటుంది.

(దీంతో నెట్ బిల్లు ఓ నెల మరీ ఎక్కువొచ్చేసింది. తన కారణంగా అంటే అస్సలు ఒప్పుకోదు-
‘నువ్వు చందమామలు డౌన్ లోడ్ చేస్తుంటావు కదా, అందుకనే బిల్లెక్కువొచ్చింద’ని వాదిస్తుంది. చందమామల డౌన్లోడ్ ఎప్పుడోనే పూర్తి చేశానని చెప్పినా వినదు.

సరే, ఏమైతేనేం-  బ్రాడ్ బ్యాండ్ అన్ లిమిటెడ్ ప్యాకేజిలోకి  మారాల్సివచ్చింది. ) 

జీ-మెయిల్ అకౌంట్ తో అప్పుడప్పుడూ స్నేహితురాలితో చాట్ చేస్తుంది.  

మినీ క్లిప్, గేమ్ డాట్ కో డాట్ ఇన్ లాంటి కొన్ని వెబ్ సైట్లకు వెళ్లి ఏవేవో విచిత్రమైన గేమ్స్ ఆడేస్తుంటుంది.

ఓ పాపకు తల దువ్వటం ఓ ఆట.

మరో ఆట- బుల్లి పిట్టను కర్సర్ తో ఎగరేస్తూ తల్లి పిట్ట  దగ్గరకు చేర్చటం.

ఇక పప్పీని ముస్తాబు చేసే ఆట మరొకటుంది.  కుక్కపిల్లకు షాంపూతో తలారా స్నానం చేయించటం, తుడవటం, డ్రైయర్ తో ఆరబెట్టటం, మెడకూ, తలకూ కుచ్చులు కట్టి, బట్టలు తొడగటం... ఇలా అన్నమాట.

ఈ పనులన్నీ తక్కువ సమయంలోనే చకచకా పూర్తిచేసెయ్యాలట!


 సరే, ఇన్ని చేస్తున్నా క్లాసులో సెకండ్ ర్యాంక్ కాబట్టి- కనీసం ఆ కోణంలోనూ- తనను ఏమీ అనడానికి వీల్లేకుండా ఉంది! (ఒకవేళ  ర్యాంకులు  రాకపోతే మాత్రం ఏమైనా అంటానా ఏమిటి?...)  

                                       * * *

నేను  బ్లాగులు చూడటం, టపాలు రాయటం తనకసలు ఇష్టముండదని నీహా అంటుంది కదా?  తనలాంటి వాళ్ళకు తెలుగు బ్లాగులపై మంచి అభిప్రాయం కల్గించటానికి ఏం చేయాలో రకరకాలుగా ఆలోచించాను.

హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో నెలనెలా జరిగే బ్లాగర్ల సమావేశానికి ఇంతవరకూ నేనెప్పుడూ వెళ్ళలేదు కానీ, ఇప్పుడు నీహాను  తీసుకు వెళ్ళటం ఓ మార్గంగా కనిపించింది.  ( ఇంతకీ  ఈ ఐడియా ఫలిస్తుందా? వికటిస్తుందా? :))

ఈలోపు ఏం చేయొచ్చు...?

‘తన గురించే నా బ్లాగులో ఓ టపా రాసేస్తే?’  అనిపించింది.

‘స్వీట్ హోమ్’ నవలా నాయకుడు బుచ్చిబాబు తనను మగవాళ్ళ ప్రతినిధిగా ఊహించుకుని, స్వగతంలో సంకల్పం చెప్పుకుంటూ విమలతో హోరాహోరీగా వాదించాడు కదా? అలాగే నేనూ మన తెలుగు బ్లాగర్ల తరఫున చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు గుర్తించి, హర్షించాలి మరి! :)

 ‘నీ గురించి నా బ్లాగులో టపా రాస్తున్నా’నని చెప్తే... ‘సానుకూలంగా స్పందించింది’.


గాయని సునీత తమ గాన బృందానికి బహుమతినిస్తున్నప్పటి ఫొటోను నా బ్లాగులో పెట్టమని అడిగింది.  పైగా ఆ ఫొటోను నేను లేనప్పుడు నా ఫోల్డర్ లో కూడా పెట్టేసింది!

నా ప్రయత్నం  ఫలిస్తున్నట్టే ఉంది కదూ?

‘అట్నుంచి నరుక్కు రావటం’ అంటే ఇదేగా?! 

24, ఆగస్టు 2010, మంగళవారం

ఏళ్ళు గడిచినా వెంటాడుతున్న ‘చందమామ’ పాట!

బ్లాగులో ‘చందమామ’ అని  ప్రస్తావిస్తే ‘చందమామ పత్రిక’ గురించి రాస్తున్నానని చాలామంది నిర్ధారణకు వచ్చేస్తారని ఓ అనుమానం. అందుకే ఈ పాట   టపా  రాయాలని ఎప్పట్నుంచో అనుకుంటూ కూడా జాప్యం చేసేశాను!

 నా చిన్నప్పుడు ఎప్పుడు మొదటిసారి విన్నానో గానీ, ‘చక్కనయ్యా చందమామా’పాట నా మనసుకు  పట్టేసింది. బాల్యంతో పెనవేసుకున్న పాటలు స్మృతి పథంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి కదా!

‘భార్యాబిడ్డలు’ లోని ఆ పాట సన్నివేశం నాకు చాలా సంవత్సరాల దాకా తెలియదు. కానీ  గాఢమైన వేదన, అపరిమితమైన దు:ఖం నాకు ఆ పాట బాణీలో, పాడిన తీరులో  స్ఫురించాయి.

దీంతో  నాకు తోచిన సందర్భమేదో ఊహించుకున్నాను.


ఆత్మీయులైన వ్యక్తి ఎవరో  దూరమై (చనిపోయారనే నా ఉద్దేశం) తల్లడిల్లుతూ తీరని పరివేదనతో పాడుకున్న పాట అని భావించాను. వాళ్ళ స్థానంలో నన్ను ఊహించుకుని, ఆ శోకాన్ని పంచుకున్నాను. అలా ఆ పాట మీద అనుకోకుండానే  బంధం పెంచుకున్నాను.

అప్పట్లో సినిమా పాటలు వినాలంటే రేడియోనే కదా ఆధారం! వివిధ భారతిలోనో, విజయవాడ  ఆకాశవాణి కేంద్రంలోనో   అనౌన్సర్  ‘.. చిత్రం పేరు ‘భార్యా..’ అని చెప్పగానే ‘భార్యాబిడ్డలు’ ఏమో, నా కిష్టమైన ఈ పాట వస్తుందేమోనని ఆత్రుతగా ఎదురుచూసేవాణ్ణి.

కానీ 90 శాతం ఆ సినిమా ‘భార్యాభర్తలు’  అయ్యేది. ‘జోరుగా హుషారుగా’ అంటూ సరదా పాట మొదలై, విషాదగీతం కోసం ఆత్రంగా ఎదురుచూసే  నాకు తగని నిరుత్సాహం కలిగేది. :) 

టీవీలు వచ్చాక, ఆ పాట సన్నివేశం చూశాను. సినిమాలోని సందర్భమూ, నేను ఊహించుకున్నదీ  వేర్వేరు  అని అర్థమైంది. చిన్నపిల్లలు తండ్రి ఆచూకీ కోసం వెతుకుతూ  చేసే  ఈ గానం హృదయాన్ని కదిలిస్తుంది. ‘ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో ..’ అనే వాక్యం ప్రేక్షకుల కోసం అనిపిస్తుంది. ఆ భావం పిల్లల స్థాయిలో లేదేమో అనుకుంటాను.          

ఈ పాటలో సుశీల గొంతులో కంటే వసంత స్వరంలో నాకు విషాదం చాలా కనపడుతుంది. ఆత్రేయ రాసిన ఈ పాటకు  కె.వి.మహదేవన్ స్వరాలు కూర్చారు.

‘నీవు లేక’ తర్వాత ‘దిక్కులేని’ అని ఉంటుంది కదా! కానీ నేనైతే  ‘దిక్కు లేక’ అని అప్రయత్నంగా పాడేసుకునే వాణ్ని. తర్వాత నా పొరపాటు  గమనించి సరిచేసుకున్నా.


పాట ఇక్కడ వినండి...

     Get this widget |     Track details  |         eSnips Social DNA   



చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీ  ఒడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయామూ.. గొల్లుమన్నాము   /చక్క/

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ                                                      /చక్క/

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో ..                                                        /చక్క/
 

                                  ****

పాట  పల్లవిలోని విషాదం ‘చందమామ పత్రిక’ను తల్చుకున్పపుడు కూడా వర్తిస్తుందనిపిస్తోంది. అలనాటి పత్రికను తల్చుకుంటూ ‘చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ’ అనుకోవాల్సిందే!

‘చందమామ’ పూర్వవైభవం దశాబ్దాల క్రితమే కోల్పోయినప్పటికీ  ఈ మధ్య వస్తున్న  సంచికలు మరీ నిరాశను కల్గిస్తున్నాయి.

అసలు ప్రచురణ కేంద్రమే చెన్నై నుంచి ముంబాయి కి మారిపోయింది... తెలుగు నేల నుంచి మరింత దూరంగా!

ఫొటో వ్యాఖ్యల పోటీ పేజీని తీసెయ్యటంతో అసందర్భంగా, హఠాత్తుగా సంచికకు  ముగింపు వచ్చేసినట్టు అనిపిస్తోంది. అసలు బేతాళ కథ చివర (కల్పితం) అని లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి? ఆ మాట తీసేశారు.

వ.పా. ముఖచిత్రంతో తాజా సంచిక

చిత్రా, శంకర్ ల పేజీ నిడివి  బొమ్మలు ఇవే ( ‘చందమామ’ సౌజన్యంతో)
తాజా సంచికలో వ.పా. ముఖచిత్రం, లోపల చిత్రా, శంకర్ ల బొమ్మలు చూసి తృప్తిపడాల్సివస్తోంది.

అయితే- నాకు నచ్చిన ఒకే మార్పు.. పేజీ నిడివి పెద్ద బొమ్మలను పునరుద్ధరించటం. వాటిని చూస్తుంటే ఎంతో  సంతోషంగా ఉంటుంది!


                                   ****



నేటి ‘ఈనాడు’ పత్రిక చూశారా?  ఈ వార్త చదవండి!




పౌర్ణమి అయినప్పటికీ  ‘చిన్నబోయి’ కనపడబోతున్నాడట...  చంద్రుడు ఈ రాత్రి!

కాకతాళీయమైనప్పటికీ ఈ టపాలో అంశానికీ,  దీనికీ సారూప్యం కనపడింది! :)

5, ఆగస్టు 2010, గురువారం

రంగనాయకమ్మ గారు మాట తప్పారు!

శ్చర్యంగా ఉంది కదూ? నిజమే!

ఎందరో పాఠకులు ఏళ్ళ తరబడి ఎంక్వయిరీలు చేస్తూ చదవాలని ఎదురుచూస్తున్న నవల.. ‘కృష్ణవేణి’  కొత్త ముద్రణ 38 ఏళ్ళ తర్వాత   ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది!

మాట తప్పటం ఏమిటంటారా?

ఈ నవల ప్రచురణ నిలిపివేసి, ‘కృష్ణవేణి ఇక రాదు’ అని గతంలో ఆమె  ప్రకటించిన సంగతి చాలామందికి తెలుసు!

‘‘కృప్ణవేణి నవల మళ్ళీ చదివితే, దాన్ని మళ్ళీ, మళ్ళీ ప్రచురించవలసిన  అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చాను. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ- ఇదే అందులో కథా వస్తువు అయినా, ఆ వస్తువును చిత్రించడంలో, అందులో చాలా పొరపాట్లు జరిగాయి. చాలా తప్పు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

.. పాఠకులకు ఉపయోగకరంగా లేని రచనని ప్రచురించకుండా ఉండటమే చాలా న్యాయం. ఈసారి ‘కృష్ణవేణి’ చదివి, దాని ప్రచురణ ఆపాలనే అభిప్రాయానికి వచ్చాను.’’
‘కృష్ణవేణి’ రచనా కాలం నాటి రచయిత్రి ఫొటో

ఇలా ఆమె 1982లో ‘స్వీట్ హోమ్’ నవల ముందుమాటలో రాసిన దగ్గర్నుంచీ పాఠకుల అసంతృప్తులు మొదలయ్యాయి. ‘ఇదేం పని’ అంటూ పాఠకులు వాళ్ళ కోణంలో ఇన్నేళ్ళుగా ఆమెను అడుగుతూనే ఉన్నారు.  

‘ప్రభ’లో సీరియల్ వచ్చిన కాలంలో నేను పుట్టనే లేదు. 16 ఏళ్ళు వచ్చేవరకూ  ఆమె పుస్తకాలతో పరిచయం లేదు. ఈలోగా  ‘కృష్ణవేణి’ ప్రచురణ ఆపేశారు. అలా ఆ పుస్తకం మిస్సయ్యాను. కానీ, ఆ పుస్తకంలో ఏం ఉందో చదవాలని ఉత్సుకత. ఎలా?  మొత్తానికి విజయవాడ లెనిన్ సెంటర్లోని పాత పుస్తకాల షాపులోనే ఈ నవల సంపాదించి, చదివేశాను.

కానీ, ఎక్కడెక్కడో  ఉన్న  మిగతా పాఠకుల సంగతి?  ‘కొత్త ముందుమాటలు’ రాసి అయినా సరే, ఆ పుస్తకం రీ ప్రింట్ చేయమని వాళ్ళు తరచూ అడగటం మానలేదు.  ఇక పుస్తకాల ఎగ్జిబిషన్లలో అయితే, ప్రతి సంవత్సరం కొందరు పాఠకులైనా ‘కృష్ణవేణి’ నవల గురించి ఎంక్వయిరీ చేయకుండా  ఉండరు.

అయినా సరే, రంగనాయకమ్మ గారు  తన చెప్పిన మాట మీదే నిలబడ్డారు...ఇన్నేళ్ళూ!

చివరికి-  38 సంవత్సరాల  తర్వాత.. పాఠకుల వాదనే, వారి  అభీష్టమే నెగ్గింది! ‘కృష్ణవేణి’ పునర్ముద్రణకు సమ్మతించారామె.

అందుకే ... ‘మాట తప్పాను’  అని తాజా పుస్తకం కవర్ పేజీ పైనే ప్రకటించారు.

‘‘.. కానీ  ఇప్పుడు  ఇందులో (తాజా ముద్రణలో ) అనేక విమర్శలు చేర్చాను కాబట్టి, దీనివల్ల పాఠకులకు మేలే గానీ హాని లేదు. ఈ కథలో, పరిశీలించి నేర్చుకోవలసిన విషయాలు, చాలా ఉన్నాయి. ఆ అవసరం కోసమే నా మాట తప్పాను’’  అని ముందుమాటలో వివరించారామె.


1964లో వచ్చిన ఎడిషన్  ముఖచిత్రం


తొలి నవల ఇదే!

రంగనాయకమ్మ గారు రాసిన తొలి నవల ‘కృష్ణవేణి’. పందొమ్మిది ఏళ్ళ వయసులో 1959లో ఆమె ఈ నవల   రాశారు. 1960లో  ఆంధ్రప్రభ వారపత్రికలో ఇది సీరియల్ గా వచ్చినపుడు ఎంతో ఆదరణ పొందింది. వారం వారం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసి మరీ  చదివారు.







ఇది 1974 నాటి ముఖచిత్రం


1979లో వచ్చిన ఎడిషన్   ముఖచిత్రం

  
  ‘కృష్ణవేణి నవల ప్రచురితమవుతున్న రోజుల్లో యూనివర్సిటీ విద్యార్థులు పత్రిక కాపీల కోసం వాల్తేరు స్టేషన్ కి పరుగెత్తేవార’ని  పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఓచోట రాశారు.

1961లో ఈ నవల తొలిసారి  పుస్తకంగా వచ్చింది. తర్వాత ఆపేసేవరకూ రెండు మూడేళ్ళ కోసారి పునర్ముద్రణ అవుతూ వచ్చింది.

‘‘ఈ కథ అంటే నాకు మొదటి నించీ ఇష్టమూ, భయమూ కూడా’’ అన్న రంగనాయకమ్మ గారే  ‘‘.. ఈ పుస్తకం అంటే ఇప్పుడు భయం తగ్గింది’’  అని కూడా  అంటున్నారు.

ఎందుకంటే...

నేనెందుకులెండి  చెప్పటం! పుస్తకం చదివేటప్పుడు మీకెటూ  తెలుస్తుందిగా!:)

ఈ  నవలను ఈ-బుక్ గా కినిగెలో చదవాలంటే...  లింకు-
 http://kinige.com/kbook.php?id=933&name=Krishnaveni

తాజా కలం: (30.8.10) 
ఈ నవల గురించి నిన్నటి ఈనాడు ఆదివారం మ్యాగజీన్లో సమీక్ష వచ్చింది. చూడండి...

26, జులై 2010, సోమవారం

నా హీరోలు.. వాలీ, కర్ణుడూ!

విజేతలంటే  ఎవరికైనా ఇష్టమే! కానీ  పరాజితుల్లోనూ  కొందరు తమ  ప్రత్యేక లక్షణాలతో ఆకట్టుకుంటారు. పురాణేతిహాసాల విషయానికొస్తే... రామాయణంలో వాలీ, భారతంలో కర్ణుడూ  అలా నాకు ఇష్టంగా అనిపిస్తారు. ఇద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.

చెట్టు చాటు నుంచి దూసుకొచ్చిన  రామబాణానికి వాలీ; 
రథం కుంగి నిస్సహాయంగా ఉన్నపుడు  అర్జున బాణానికి కర్ణుడూ!

భీష్ముడు  అర్థరథుడిగా చేసి అవమానించినా తర్వాత కౌరవ సేనకు సర్వసైన్యాధిపత్యం వహించిన కర్ణుడి పేర ఏకంగా ఓ పర్వమే ఉంది; ‘కర్ణుడు లేని భారతం’ అని మాట పుట్టింది. ఈ స్థాయిలో వాలికి,  రామాయణంలో ప్రాధాన్యం లేకపోయినా ఆ పాత్రలో ఆకర్షణ ఉంది.

ఎదుటివ్యక్తిలోని శక్తిని లాగేసుకునే ప్రత్యేకత వాలిది. సహజ కవచ కుండలాలు కర్ణుడి విశిష్టత. వీటివల్ల నాకు ప్రాథమికంగా ఆ పాత్రలపై ఆసక్తి పెరిగి వుండొచ్చు.  

వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, చిన్నప్పట్నుంచీ. ‘చందమామ’లో ‘వీర హనుమాన్’ధారావాహిక వస్తున్నపుడు కూడా ఈ ఘట్టాన్ని ఆసక్తిగా చదివాను.
తారతో వాలి సంభాషణ (చందమామలో చిత్రకారుడు శంకర్ వేసిన చిత్రం)

కొడవటిగంటి కుటుంబరావు గారు రాశారో, మరెవరు రాశారో గానీ.. సుగ్రీవుడు అన్నను నిందిస్తూ  యుద్ధానికి రమ్మని సవాలు విసురుతుండగా కిష్కింధ అంత:పురంలో  వాలీ, తారల మధ్య నడిచే సంభాషణ ఎంతో భావగర్భితంగా ఉంటుంది.

రామాయణాన్నిఒక కవి రాసిన సాహిత్యంగా కాకుండా... వాస్తవంగా జరిగిన గాథగా, ఆ రచనను పవిత్ర గ్రంథంగా భావించే భక్తుల్లో కూడా వాలి వధ విషయంలో భిన్నాభిప్రాయాలుండటం  నాకు తెలుసు. దీనిపై అనుకూల ప్రతికూల వాదనలూ, చర్చోపచర్చలూ తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయనుకోండీ.

శ్రీరాముడి వల్ల వాలికి అన్యాయం జరిగిపోయిందనే నా ఆలోచనలకు తర్కబద్ధమైన సమర్థన రంగనాయకమ్మగారి ‘రామాయణ విషవృక్షం’లో దొరికింది. ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు  లేకపోవటం వల్ల  ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను. ఒకవేళ  అప్పటికి నాస్తికుణ్ణి కాకపోయినప్పటికీ ‘వాలి వధ’ఘట్టంలో రంగనాయకమ్మగారి వాదన నాకు  నచ్చివుండేదే!

కన్నతల్లితో కర్ణుడు  (చందమామలో శంకర్ వేసిన బొమ్మ)


కర్ణుడి విషయానికొస్తే.. తనను ఆదరించిన కౌరవుల పక్షాన చివరిదాకా ఉండటం, చెప్పిన మాటకు కట్టుబడటం కర్ణుడి పాత్రను ఉన్నతంగా నిలిపాయి. కుంతి వచ్చి తన జన్మ రహస్యం చెప్పి పాండవపక్షానికి రమ్మని  బతిమిలాడినప్పుడు నిరాకరించటం, తల్లిని నిరాశపరచకుండా  ఒక్క అర్జునుణ్ణి మినహా మిగతా పాండవులను చంపనని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటం కర్ణుడంటే ఏమిటో నిరూపిస్తాయి.

తార మాట వినకుండా సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళిన వాలీ, 
కుంతి మాటను తిరస్కరించి పాండవ పక్షానికి వెళ్ళని  కర్ణుడూ 
ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ; తారకూ, కుంతికీ వారు తమ కోణంలో చెప్పిన సమాధానాలు వారిమీద గౌరవం పెంచుతాయి.  

జాషువా అద్భుత పద్యాలు
నా స్కూలు రోజుల్లో గుర్రం జాషువా గారి ‘భారత వీరుడు’ (రచనా కాలం:1927)  పద్యాలు చదివాను. వాటిలో కర్ణుడి ఔన్నత్యాన్నీ, నిజాయతీనీ సమర్థిస్తూ జాషువా గారు అద్భుతంగా రాశారు. అర్జునుడి మీద ప్రయోగించిన నాగాస్త్రం కొద్దిలో గురి తప్పి, వెనుదిరిగి వచ్చి మళ్ళీ ప్రయోగించమని కోరినపుడు ‘ఛీ..ఎంగిలి బాణం వాడను’ అనటం.. ఇలాంటి ఘట్టాలను ప్రస్తావిస్తూ నేరుగా కర్ణుడినే ఉద్దేశిస్తూ  పద్యాలు సాగుతాయి. కర్ణుడే నిజమైన ‘భారత వీరుడ’ని అభివర్ణిస్తారు.

అంతర్జాలంలో ఆ పద్యాలు దొరుకుతాయేమోనని వెదికాను కానీ, ప్చ్... ఫలితం కనిపించలేదు!

కర్ణుడి మరణానికి కారకులెవరు?
‘కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్టు’ అనీ,  ‘కర్ణుడి చావుకు వెయ్యి కారణాలున్నట్టు’ అనీ  అంటుంటారు. కానీ శ్రీమదాంధ్ర మహాభారతంలో తిక్కన పద్యం ప్రకారం చూస్తే.. కర్ణుడి మరణానికి ఆరుగురు కారణమని అర్జునుడికి  స్వయంగా కృష్ణుడే చెప్పినట్టు ఉంది.

ఆ పద్యం చూడండి-
‘నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్’


1.అర్జునుడు   2.కృష్ణుడు   3.కుంతి   4.ఇంద్రుడు   5.భూదేవి   6.పరశురాముడు.

అయితే - యుద్ధ సమయంలో కర్ణుణ్ణి  అన్ని విధాలుగా నిరుత్సాహపరిచిన శల్య సారథ్యం సంగతేమిటి? ప్రత్యర్థిని హంసగా వర్ణించి, పొగడ్తలతో ముంచెత్తి, కర్ణుడిని కాకితో పోల్చి అతడి మనసును వికలం చేయటం... మానసికంగా బలహీనుణ్ణి చేయటం చిన్న విషయమేమీ కాదు  కదా!

అందుకని ఏడో కారకుడిగా శల్యుణ్ణి   పై జాబితాలో కలుపుకోవచ్చనిపిస్తుంది!

16, జులై 2010, శుక్రవారం

అద్భుతమైన తెలుగు సినిమా లోగోలు!

గంగాధర్
తెలుగు సినిమాల పేర్లు కొన్నిటిని గుర్తు చేసుకోగానే ఆకట్టుకునే వాటి ‘లోగో’లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. అలనాటి పబ్లిసిటీ ఆర్టిస్టుల గొప్పతనమది! (లోగో అంటే  అక్షరాలంకరణ అని అర్థం చెప్పుకోవచ్చు).

తెలుగు సినిమా పబ్లిసిటీని ఒక కళగా తీర్చిదిద్ది,  ప్రాచుర్యం కల్పించి, ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రకారుల్లో గంగాధర్, ఈశ్వర్ అగ్రశ్రేణిలో నిలుస్తారు.

 గంగాధర్ ఆరేళ్ళ క్రితం చనిపోయారు.


ఆయన సంతకమే విలక్షణం.  హిందీ అక్షరాల మల్లే అడ్డంగా ఓ గీత... దాన్ని తాకుతూ అందమైన, ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలు!  ‘గ’ తర్వాత మొదటి సున్నా.. పై గీతను తాకదు గానీ,   తర్వాత సున్నా ‘గా’ అక్షరాన్ని స్ఫురింపజేస్తూ గీతను తాకుతూ అర్థవంతంగా ఉంటుంది. చివర్లో మరో సున్నా... ఆ సున్నా తాకే  గీత పై మరో  గీత  స్టైల్ గా.. ‘ర్’ని తలపిస్తూ!

ఈ గంగాధర్ సంతకాన్ని ప్రాక్టీస్ చేయటం భలే సరదాగా ఉండేది, చిన్నప్పటి రోజుల్లో!

యన రూపొందించిన సినిమా లోగోలంటే నాకు ప్రత్యేకాభిమానం.

దానవీరశూర కర్ణ, అమరదీపం, బొట్టు కాటుక, శంకరాభరణం, ఏకలవ్య, విప్లవశంఖం.. ఈ సినిమాల  లోగోల  రూపకర్త గంగాధరే.  కోడెనాగు సినిమా లోగో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 

సినిమా సారాన్నీ, స్వభావాన్నీ సాధ్యమైనంతవరకూ  లోగోలోకి తీసుకురావటమే ఈ లోగోల ప్రత్యేకత.

అన్ని లోగోల గురించీ వివరించను కానీ, ఎంతో  ప్రత్యేకత  ఉన్న ఒక సినిమా లోగో గురించి మాత్రం చెప్తాను.  గంగాధర్ అనితర సాధ్యంగా దీన్ని రూపొందించారు.


1979లో తీసిన ‘బొట్టు కాటుక’ సినిమా అది. మురళీమోహన్, మాధవి నాయికా నాయకులు. నిర్మాణ సంస్థ శ్యామ్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సంస్థ నిర్దేశకుడు విజయబాపినీడు . ఆయనకు పత్రికా రంగంలో అప్పటికే  పేరుంది. అభిరుచితో ఆయన ఓకే చేసిన లోగో ఇది.

లోగోను ఇక్కడ చూపించి, దాని గురించి చెప్పటమే సరైంది. కానీ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో! 

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో.
 మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

ఈ లోగో కథ అప్పట్లో సినీ వార పత్రిక ‘జ్యోతి చిత్ర’లో పూర్తి పేజీలో ప్రచురించారు. మొదట ఈ సినిమా కోసం ఏ లోగోలను గంగాధర్ వేశారో వాటిని కూడా ఇచ్చారు. కళాత్మకమైన లోగో  తొలి రూపం, దాన్ని ఇంప్రూవ్ చేసి, ఎలా రూపుదిద్దుకుందీ .. చివరికి ఏ లోగో ఖరారు చేసిందీ... ఆ పరిణామ క్రమమంతా  చక్కగా అందించారు.

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!

ఇప్పడొస్తున్న సినిమా లోగోల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాదాపు అన్నీ  మూసలోనే ఉంటున్నాయి.  ఏ లోగో అయినా ఒకే రకంగా, ఎడమవైపు కిందభాగం నుంచి మొదలై కుడివైపు పైభాగానికి ఏటవాలుగా వెళ్తుంది. సినిమాను  తల్చుకుంటే లోగో పొరపాటున కూడా గుర్తుకురాదు.

అసలు తెలుగు సినిమా పబ్లిసిటీ లో ‘కళ’ ఏనాడో అంతరించిపోయిందని నిరాశ కలుగుతోంది!

4, జూన్ 2010, శుక్రవారం

మాటల మెజీషియన్ మన బాలూ!


‘దస్తూరి గుణాల కస్తూరి’ అనే కదా ముళ్ళపూడి అన్నదీ!
‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకాన్ని అభినందిస్తూ బాలూ  స్వయంగా రాసిన  లేఖ ఇది. దస్తూరి ఎంత చక్కగా ఉందో చూడండి!

‘పాటను ముత్యాల్లాంటి అక్షరాల్లో రాసుకుని బాలూ పాడే విధానం చాలా బావుంటుంది’ అని  దర్శకుడు వంశీ పదిహేనేళ్ళ క్రితం అభిమానంతో  పరవశంగా చెప్పటం నాకింకా బాగా గుర్తు!


గౌను వేసుకుని, బొట్టూ పూలూ కూడా పెట్టేసుకుని, సైకిలు మీద కూర్చుని చారెడేసి కళ్ళతో అమాయకంగా  చూస్తున్న ఈ పాపాయిని చూశారా?           
                                 
ఎవరీ బాల? ‘బాల రసాల సాల అభినవ ఘంటసాల’అనీ, ‘పుంస్కోకిల’ అనీ  వేటూరి ప్రశంసించిన  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానిదే ఈ ఫొటో!
బాల్యంలో అమ్మాయి గా ముస్తాబు చేసి, సరదాగా తీశారు.

పందొమ్మిదేళ్ళ లేత వయసుకే  సినిమాలో ‘ఏమి ఈ వింత మోహం’ అంటూ తొలిపాట పాడేసి , దశాబ్దాలపాటు  శ్రోతలను  సుమధుర  గాన మోహాంబుధిలో   ముంచెత్తిన   అద్భుత  గాయకుడు.. బాలూ  పుట్టింది ఈ రోజే!

పాటల యంత్రంగా పరిశ్రమలో స్వైర విహారం చేస్తున్నపుడు... 29 ఏళ్ళ క్రితం   ఓ రోజున ఏకంగా  21 పాటలు   పాడి   రికార్డులు బద్దలు కొట్టారు బాలూ . కానీ ఏ నాడూ యాంత్రికంగా పాడింది లేదు. అందుకే మ్యూజికాలజిస్టు రాజా ఆయన్ను‘య(మ)స్పీ(డు) బాల సుబ్రహ్మణ్యం’ అని చమత్కరించారు.


గాయకుడిగా కెరియర్ ఆరంభించిన పదేళ్ళకు 1976లో అనుకోకుండా, అయిష్టంగా, సంగీత దర్శకుడు చక్రవర్తి బలవంతమ్మీద డబ్బింగ్ లోకి అడుగుపెట్టారు బాలూ. అది ‘మన్మథ లీల’ సినిమా. కానీ డబ్బింగ్ చెప్పింది కమలహాసన్  పాత్రకు కాదు, ఓ  పెద్ద వయసు పాత్రకు! మూడేళ్ళ తర్వాత ‘కళ్యాణ రాముడు’ తో కమల్ కు బాలూ డబ్బింగ్ చెప్పటం మొదలైంది. బాలూ గొంతు కమల్ కి ఎంత సరిగ్గా సరిపోయిందంటే ... తెలుగులో  కమల్ స్ట్రెయిట్ సినిమాలకు కూడా బాలూయే డబ్బింగ్ చెపుతుంటారని ఇప్పటికీ  భ్రమపడుతుంటారు చాలామంది.

కమల్-బాలూల గొంతుల్లో తేడా కనిపెట్టటం నిజానికంత కష్టమా? కానే కాదు. కానీ ఆ తేడాను చాలా సూక్ష్మ స్థాయికి చేర్చి, గొంతును చక్కగా మార్చి, ప్రేక్షకులను ఏమార్చిన ప్రతిభ బాలూది!

ఆనందభైరవి (1984)లో గిరీష్ కర్నాడ్ కీ, రుద్రవీణ (1988)లో జెమినీ గణేశన్ కీ, అన్నమయ్య (1997), శ్రీ రామదాసు (2006)లో సుమన్ కీ, అతడు (2005)లో నాజర్ కీ తన గొంతు అరువిచ్చి, ఆ పాత్రలు అద్భుతంగా పండటానికి బాలూ ఎంత కారకుడయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శంకరాభరణం (1979)లో జిత్ మోహన్ మిత్ర పాప్ మ్యూజిక్ బృందానికి శంకరశాస్త్రి బుద్ధి చెప్పిన సన్నివేశం ఎంత బావుంటుందీ!  పాశ్చాత్య,  భారతీయ శాస్త్రీయ సంగీత వైవిధ్యాలను అనుపమానంగా, అవలీలగా  తన గొంతులో  పలికించిన  బాలూ ప్రతిభ దానికి ప్రధాన కారణం.  

డబ్బింగ్ కళాకారుడిగా బాలూ చరిత్రలో రెండు మైలు రాళ్సున్నాయని చెప్పొచ్చు. ఒకటి-  భామనే సత్యభామనే (1996). రెండోది- దశావతారం (2007). ‘భామనే సత్యభామనే’లో  సినిమాలో నాలుగైదు పాత్రలకు డబ్బింగ్ చెప్పారట బాలూ. నాకైతే మూడే పాత్రలు గుర్తున్నాయి. హీరో పాత్ర, భామా రుక్మిణి, ఇంటి ఓనరు మణివణ్ణన్ పాత్రలు. భామా రుక్మిణి పాత్రకు బాలూ చెప్పిన డబ్బింగ్ ఓ అద్భుతం!

మామూలుగా పురుషులు స్త్రీ వేషాలు వేసిన సందర్భాల్లో స్త్రీలతోనే డబ్బింగ్ చెప్పించే ఆనవాయితీ ఉంది ( చిత్రం భళారే విచిత్రం (1991)లో నరేష్ పాత్ర గుర్తుందా?) దాన్ని తోసిరాజని తమిళంలో కమల్, తెలుగులో బాలూ తమ గొంతులు మార్చి సంభాషణలు పలికి  ప్రయత్నించి విజయం సాధించారు. (డబ్బింగ్ కళలో పట్టున్న హీరో రాజేంద్రప్రసాద్  మేడమ్ (1993)లో గొంతు మార్చి చెప్పిన ప్రయత్నం అంతగా ఫలించలేదు.)

బాలూ బహుళ గళ బహుముఖ ప్రతిభ ‘దశావతారం’లో పరాకాష్ఠకు చేరింది! దీనిలో ఏడు పాత్రలకు ఆయన  సంభాషణలు పలికారు. (మిగిలిన మూడు పాత్రలు- విలన్ ఫ్లెచర్, జపనీస్ నరహషి, జార్జి బుష్ పాత్రలకు తమిళ్ ఒరిజినల్లో ఉన్న కమల్ గొంతు నే ఉంచేశారు).

ఆ మధ్య ‘ఝుమ్మంది నాదం’ ఈటీవీ ప్రోగ్రాం చూశాను. దశావతారం బామ్మ కృష్ణవేణి పాత్ర ను పున: సృష్టి చేస్తున్నట్టుగా   బాలూ తన గొంతులోంచి అలవోకగా ఆ  సంభాషణలు చెప్తోంటే...  నిబిడాశ్చర్యంతో కళ్ళార్పకుండా,  చెవులు రిక్కించి మరీ విన్నాను.

స్వర ఇంద్రజాలం అంటే ఏమిటో అర్థమైంది!

పొడుగాటి మనిషి కలీఫుల్లాఖాన్ పాత్రకు డబ్బింగ్ చెప్తున్నపుడు గొంతుకు ఇబ్బంది కూడా వచ్చిందని  ఆయన చెపుతూ, ఆ పాత్ర సంభాషణలు కూడా  వినిపించారు.

అద్భుత నైపుణ్యమూ, స్వరపేటిక మీద అత్యంత అధికారమూ ఉంటే గానీ అలా పర్ ఫెక్ట్ గా గొంతును ఎలా పడితే మార్చేసి, మాటలను మంత్ర సదృశంగా  ప్రయోగించటం సాధ్యం కాదనిపించింది.   ఆ సినిమాలో బలరామ్ నాడార్  పాత్రకు చెప్పిన డబ్బింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది!
 
ఏడు పాత్రలకు డబ్బింగ్- అదీ ‘అనుకరించి’ చెప్పటం గొప్పయితే... పది పాత్రలకు ఎంతో వైవిధ్యంగా గొంతులు మార్చి సంభాషణలు  చెప్పిన కమల్ ఇంకా గొప్ప కదా అనే సందేహం వస్తుంది.  కమల్ ఒరిజినల్ మూవీలో సంభాషణలు ఎలా చెప్పాడో్ తెలుసుకోవటానికి హైదరాబాద్ ఐమాక్స్ లో దశావతారం తమిళ వర్షన్ చూశాను. కమల్ పోషించిన విభిన్న పాత్రల సంభాషణల శైలి విషయంలో-  తెలుగుకీ,  తమిళానికీ అసలు తేడాయే కనిపించలేదు. బాలూ ప్రతిభ మరింత బాగా అవగాహన అయింది.  తెలుగులో బాలూ స్థాయిలో  డబ్బింగ్ చెప్పగల మరో వ్యక్తి ఎవరూ లేరని నిస్సంశయంగా చెప్పొచ్చు.

బాలూ ప్రత్యేకత ఏమిటంటే... పాటల్లో కూడా గొంతు మార్చి చరిత్ర సృష్టించటం. ఎన్టీఆర్ కీ, ఏఎన్నార్ కీ, కృష్ణకీ ఆయన ఎంతెంత వైవిధ్యంగా ఏళ్ళ తరబడి పాటలు పాడారు! అల్లు రామలింగయ్య, మాడా లాంటి హాస్యనటులకు కూడా నప్పేలా పాటలు పాడారు. 

టీవీల్లో ‘పాడుతా తీయగా’లాంటి సంగీత కార్యక్రమాల రూపకర్తగా, యాంకర్ గా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పారు. పాట పాడేయటం తప్ప, దాన్ని రాసిందెవరో,  సంగీతం సమకూర్చిందెవరో పట్టించుకోని వర్థమాన  గాయకులు ఆ లోపం  సవరించుకునేలా చేసిన ఘనతను  బాలూకే ఇవ్వాలి!

ఆయన మాట్లాడుతున్నపుడు అలా వినబుద్ధేస్తుంది. సాధికారికంగా పాత సంగతులను  తలపోసుకోవటం, పాటల రచయితలనూ, సంగీతదర్శకులనూ  స్మరించుకోవటంలో వారి మీద గౌరవభావం, తెలుగు భాష మీద మమకారం...   సందర్భానుసారంగా ఛలోక్తులు విసరటం ... ఆయన సంభాషణలకు   పరిమళాన్ని అద్దుతుంటాయి.
                                                  
                                                  
కృతజ్ఞత చూపటం  కంటే గొప్ప మానవ సంస్కారం ఉండదని నా నమ్మకం. తన ఉన్నతికి కారకులైన సంగీత దర్శకుడు  ఎస్పీ  కోదండపాణిని సందర్భం వచ్చినపుడల్లా  తల్చుకుంటూ ఆయన పేరు మీద రికార్డింగ్ లాబ్స్, సినీ నిర్మాణ సంస్థ ను నెలకొల్పటం బాలూ అంటే  ఏమిటో స్పష్టం చేస్తాయి.

‘ఝుమ్మంది నాదం’ ప్రోగ్రాంలో తన అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ గురించి వివరిస్తున్పపుడు  బాలూ ఉద్వేగపు వెల్లువా, ప్రేమానురాగ రసస్పందనా  చూసి తీరాల్సిందే!

అద్భుత కళాకారుడూ, మధుర గాయకుడూ, సంస్కారీ, మంచి మనిషీ ... మన బాలూ!
 
(బాలూ పాడిన ఒక్క పాట కూడా పూర్తిగా తల్చుకోకుండా టపా ముగించటం కష్టంగానే ఉంది. ‘తీయని వెన్నెల రేయి’లో  ‘దివిలో విరిసిన’  పాటల ‘పారిజాతాల’ ను  ఏరుకుని,  ఆ శ్రావ్యతను గుర్తుచేసుకునే ఛాయిస్  మీకే ఇచ్చేస్తున్నాను మరి!) :)

24, మే 2010, సోమవారం

వేటూరి చేతిరాతా, చేవ్రాలూ !


 పుస్తకం తెరవగానే ‘వేటూరి సుందర రామమూర్తి’  అనే సంతకం  కనిపించింది. 


ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్ళాను. అక్కడితో అది ఆగలేదు. పేజీల్లోకి , అక్షరాల్లోకి దృష్టి సారిస్తే  ఆ   జ్ఞాపకాల ప్రయాణం ఇంకా వెనక్కి... దశాబ్దాల వెనక్కి సాగిపోయింది.

 వేటూరి పాటల సంగతులు  ముందుకు సాగి, రాద్దామనుకున్న  టపా సంగతి  వెనకబడిపోయింది! :)

 సినీ కవిగా అందరికీ తెలిసిన వేటూరి  వచనంలోనూ చక్కని ప్రతిభ ప్రదర్శించారు. జర్నలిజంలో పదిహేనేళ్ళపాటు కొనసాగటం వల్లనా? సహజమైన ప్రతిభా వ్యుత్పత్తుల వల్లనా?  ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే... ‘ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాయితం వరకూ , దేన్ని గురించైనా అపారమైన పరిజ్ఞానం ’ వేటూరిది .

 శ్రీశ్రీ మరణించినపుడు  1983లో జూన్ 17న ‘ఈనాడు’ లో వచ్చిన ప్రసిద్ధ  సంపాదకీయం రాసింది వేటూరే. ‘శ్రీశ్రీ  మొదలంటా మానవుడు- చివరంటా మహర్షి- మధ్యలో మాత్రమే కవి- ఎప్పటికీ ప్రవక్త’  అని ఎంతో  క్లుప్తంగా , అనల్పార్థం స్ఫురించేలా శ్రీశ్రీని  అక్షరాలతో sum up చేశారాయన. 


 ‘కవిగా అతను తన జీవిత కాలంలోనే ‘లెజెండ్’ అయినాడు’ అని శ్రీశ్రీని ఉద్దేశించి  వేటూరి రాసిన వ్యాఖ్య ఆయనకూ  వర్తిస్తుంది.


వేటూరి గారు రాసిన ‘ఆర్ద్ర స్మృతుల అక్షరాకృతుల’ వ్యాసాలు ఆరేళ్ళ క్రితం   ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకంగా విడుదలయ్యాయి. ఆ పుస్తకం ఈనాడు ఆదివారం లో  సమీక్షించే అవకాశం నాకు వచ్చింది. 2004 సెప్టెంబరు 25 తేదీన వేటూరి గారు సంతకం చేసి పంపిన పుస్తకం అలా  నా చేతికొచ్చింది. ‘సినీ మహనీయులకు నీరాజనం’ అనే శీర్షికతో  2004 సంవత్సరం అక్టోబరు 31న ఆ రివ్యూ  ప్రచురితమైంది!

వేటూరి  చక్కని కథా రచయిత కూడానట. ‘కవితా పరమైన శైలిలో మల్లాది రామకృష్ణశాస్త్రి గార్ని తలపించే తీపి తీపి తెలుగులో అలనాడే అద్భుతమైన కథలు రాశారని కొందరికే తెలుసు’ అని ఈ పుస్తకం ముందు మాటలో పైడిపాల అంటారు.

ఆ కథలు ఎక్కడున్నాయో... ఇప్పుడైనా అవి వెలుగులోకి వస్తాయా?

 ఎదుటివారి ప్రతిభను మనస్ఫూర్తిగా  ప్రశంసించే  సంస్కారం  వేటూరిది.
బాలూను  - ‘బాల రసాల సాల అభినవ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఒక పుంస్కోకిల’ అని అభివర్ణించారు. ‘‘నైమిశారణ్యాలలో, గంధ మాదన పర్వతాలలో, చిరపుంజి చినుకులలో, సుందర వన సాగర తీరాలలో , మలయానిలాలలో వీచే పవన పరిమళాలు రాజన్ నాగేంద్రల  సుస్వరాలు’ అంటారు.

శబ్ద చిత్రాలూ, ప్రాస క్రీడలతో తన వచనాన్ని ఆకర్షణీయంగా మలుస్తారు వేటూరి. ‘స్వరమేశ్వరుడు’, ‘పాటలీ కుసుమాలు’, ‘రాగతాళీయం’,  ‘స్వరాయురస్తు’ అనే పద ప్రయోగాలే కాదు- ‘ఆదినారాయణరావుకు అంజలి’, ‘జంధ్యావందనం’ లాంటి అర్థవంతమైన  శీర్షికల్లో ఆయన మార్కు మెరుపులు  తళుక్కుమంటాయి!

 ****   *****

సినిమా నటుడవుదామని  ఆశించి, అవకాశం వచ్చినా  తర్వాత భయంతో  ఆ ఆలోచన  విరమించుకున్నారు వేటూరి. సినీ రంగంలో ప్రసిద్ధుడయ్యాక  అది  నెరవేరింది.
‘మల్లెపందిరి’ సినిమాలో వేటూరితో  కకుంభంజకం స్వాములవారి పాత్ర   వేయించారు జంధ్యాల. మరో రెండు సినిమాల్లో కూడా వేటూరి  సరదా పాత్రలు వేశారు.

వేటూరి వి   ప్రైవేటు క్యాసెట్లు  ‘గీతాంజలి’ పేరుతో వచ్చాయి. ఇవన్నీ భక్తి గీతాలే. సినీ ప్రముఖులే స్వరకల్పన చేశారు.

* శ్రీ వేంకటేశ్వర పదములు        -  కె.వి. మహదేవన్.
* భద్రాచల శ్రీరామ పట్టాభిషేకం    - చక్రవర్తి
* కబీర్ వాణి                            -  చక్రవర్తి
* క్రీస్తు గానసుధ                       - బాలు.
* స్వామియే శరణం అయ్యప్ప    - రాజ్ కోటి.

 ****   *****

తెలుగు సినిమా పాటకు పర్యాయపదంగా మారిపోయిన వేటూరి అంటే ... నాకైతే ‘శంకరాభరణం’పాటలే  చప్పున  గుర్తొస్తాయి.
సినీ రంగంలో అడుగిడిన తొలి సంవత్సరాల్లో  ‘ఝుమ్మంది నాదం’, ‘శివశివ శంకర భక్త వశంకర’ అంటూ  తాపీగా, సాఫీగా   సాగిన ఆయన కలం క్రమంగా  విశృంఖలమైంది.
కమర్షియల్ అడవి బాటలో  చెలరేగి ‘చిలకకొట్టుడు’తో  యమగోల గోలగా ‘తిక్కరేగి’న   వేటూరి పాళీకి ఉన్న పదునునూ, ఘనతనూ  తెలిసేలా చేసి... కవిగా  వేటూరిని కూడా రక్షించిన  సినిమా ‘శంకరాభరణం’.       

ఈ అజరామర చిత్రం  విజయ సిద్ధికి  ‘గానమె సోపానం’గా  అమర్చిపెట్టిన   మహదేవన్, పుహళేంది  కనుమరుగైపోగా..  ఇప్పుడు  ఇలా...  వేటూరి!

వేటూరి గారిని   కలుసుకున్నాను,  కొన్నేళ్ల క్రితం....  సహ జర్నలిస్టు   ఆయన్ను ఇంటర్ వ్యూ చేస్తున్నపుడు తనతో కలిసి  వెళ్ళి ....   హైదరాబాద్ లో ఆయన ఇంటి దగ్గర !

నాది ఆ సందర్భంలో దాదాపు ప్రేక్షక పాత్రే.. ఏవో ఒకటి రెండు మాటలూ, వాక్యాలూ మాట్లాడానంతే.   కాకపోతే ఆయన్ను సన్నిహితంగా అభిమానంగా, అపురూపంగా  చూస్తూ,  ఆయన మాటలు వినగలిగాను. 


ప్పుడో స్కూల్ రోజుల్లో  ‘ఝుమ్మంది నాదం’  సిరిసిరి మువ్వ సవ్వడిగా   చెవులకింపుగా రేడియో తరంగాల్లో తేలివచ్చినపుడు ఆ పాట రాసిందెవరో పట్టించుకోలేదు.  తర్వాతి కాలంలో తెలుగు సినీ పాటలకోటను త్రివిక్రముడిలా ఆక్రమిస్తూ వచ్చిన  వేటూరిని  పట్టించుకోకుండా ఉండటం ఎలా సాధ్యం?


ఆ  పాటల  మధురిమను ఆహ్లాదిస్తూ, ఆస్వాదిస్తూ, ఆ అక్షరజాలాన్నీ, చిలిపిదనాల ప్రయోగశీలతనూ  గమనించటం అప్రయత్నంగానే అలవాటయింది.

‘పంతులమ్మ’ సినిమాలో  రాజన్ నాగేంద్ర స్వరపరిచిన ‘మానసవీణా మధు గీతం’ పాట అలాంటిదే! ఎమ్వీఎల్ లాంటివారు ఈ పాటను ఆరాధిస్తూ  దాని గురించి పత్రికల్లో కూడా రాశారట.


‘కురేసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ,  తడిసేదాకా అనుకోలేదు తీరని దాహమనీ..’ అనే చరణ భాగం ఎంత బావుంటుందో!  తర్వాత  ‘కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ..’- ఇది వినగానే అద్భుత భావన మనసును  ఆవరించేస్తుంది!

నాలుగు స్తంభాలాట లో   ప్రేమ భావనను వేటూరి  హృద్యమైన గీతంగా ఎలా మలిచారో కదా!   ‘హిమములా రాలి, సుమములై పూసి రుతువులై నవ్వి మధువులా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’.

అంతేనా? ‘మౌనమై మెరిసి, గానమై పిలిచి, కలలతో అలిసి, గగనమై ఎగసె’  అంటారు.

తెలుగునాటి అందాలనీ, రుచులనీ, రాగాలనీ, పెదవి విరుపులనీ అందించే  తెలుగు కవుల సంప్రదాయం, సరసం  సినిమా పాటలోకి తేవాలనేది వేటూరి  తాపత్రయం. అది జంధ్యాల సినిమాల ద్వారా  కొంత తీరిందనుకోండీ.

‘రెండు జెళ్ళ సీత’ పాట గుర్తొచ్చిందా?

‘కొబ్బరి నీళ్ళా జలకాలాడ’ పాటలో వచ్చే  ఊరగాయ స్తోత్రం చూడండి.
‘మాగాయే మహా పచ్చడి
 పెరుగేస్తే మహత్తరి
అది వేస్తే అడ్డ విస్తరి
మానిన్యాం మహా సుందరి’.


ఇక ‘ప్రేమించు పెళ్లాడు’లో  ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద’ ఎంత రుచిగా ఉంటుందీ!  ముద్దుముద్దుగా తెలుగు అక్షరమాలలోని   అలూ, అరూ, ఇణీ  వరసగా  చెంగుమని  పాటలోకి  గెంతుకుంటూ వచ్చేయవూ! వేటూరి మాటల్లో చెప్పాలంటే-  ‘అదొక సరసం, అదో చిలిపితనపు మోజువీడు చిన్న రసం’.

వేటూరి సినీ గీతాల  సుందరోద్యాన వనంలోకి   పూర్తిగా  అడుగుపెడితే  ఆ సుమ సుగంధాల నుంచి బయటపడటమూ, బయటికి రావటమూ చాలా  కష్టం. ‘ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల’ తిరుగుతూ ఉండాల్సిందే. అందుకనే  ‘ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై’న  వేటూరి ప్రతిభను  సంస్మరిస్తూ   ఇలా  అర్థోక్తి లో ఆపెయ్యటం అర్థవంతమే అనుకుంటాను!

1, మే 2010, శనివారం

విశేష రచనల ‘రచన’ తాజా సంచిక!

‘రచన’ ఇంటింటి పత్రిక  మే నెల సంచిక  నిన్న మార్కెట్లో విడుదలైంది.
‘చందమామ’లో చిరస్మరణీయమైన జానపద ధారావాహికలను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారి స్మృతి సంచిక ఇది.

సంపాదకుడు శాయి గారి మాటల్లో- 

‘.... అభిమానుల  ఆలోచనలన్నీ అక్షరరూపంలో వరదగోదారిలా కట్టలు తెంచుకుని ప్రవహించసాగేయి. వాటన్నింటినీ ఒక ‘మాయా సరోవరం’లోకి చేర్చే ప్రయత్నమే ఈ స‘చిత్ర’ ప్రత్యేక సంచిక’.  


ఈ  విశేషాలు  విహంగ వీక్షణంగా ఓసారి...

ముఖచిత్రమే పాఠకుల్ని  విహంగ వీక్షణం చేయించే ‘చిత్రా ’ గీసిన అద్భుత  వర్ణ చిత్రం! దానికి  ‘అవతార్’ బొమ్మను జోడించి ఆర్టిస్టు  అన్వర్ రూపుదిద్దిన  ‘దాసరి సుబ్రహ్మణ్యం గారి జ్వాలాద్వీపంలో హాలీవుడ్’!

దాసరి గారు రాసిన  12 జానపద ధారావాహికల పరిచయాలూ, విశ్లేషణా; మంత్రనగరి సరిహద్దులను దాటించి, అపూర్వ కథా వీధుల్లోకి ఉత్కంఠభరితంగా  ప్రవేశపెట్టే  చిత్రా బొమ్మలూ అన్నీ ఒకే చోటే కనిపిస్తాయి.  

ఇవే కాదు...

* దాసరి గారి వ్యక్తిత్వంపై, ఆయన రచనలపై   ప్రత్యేక వ్యాసాలూ, స్మృతులూ.
* డిసెంబరు 1964లో ‘యువ’లో దాసరి గారు రాసిన ‘అంతా కనికట్టు’ కథ.
* దాసరి సుబ్రహ్మణ్యం కథా సంపుటి ‘ఇంద్రాణి’కి 1955 ఏప్రిల్ లో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన పీఠిక.

* చందమామ ప్రేరణతో శాయి-చంద్ర గార్లు 42 ఏళ్ళ క్రితం  రాసి, గీసిన ‘రాతి కత్తి’ బొమ్మల కామిక్ కథ!
* దాసరి గారు మిత్రులకు రాసిన ఐదు లేఖల ఫొటో కాపీలు యథాతథంగా‘ప్రముఖుల ఉత్తరాలు’ శీర్షికలో!
* ‘చిత్రా’ కాంతులూ, శంకర్ జ్ఞాపకాలూ.

* గళ్ళ నుడికట్టు ని ఇష్టపడే వారికి రెట్టింపు సంతోషం కలిగించే అదనపు  ప్రత్యేక పజిలింగ్ పజిల్-‘మంత్ర తంత్ర   వీరోచిత మాయా మర్కట దాగుడుమూతలు’!
   పూర్తి చేసి పంపినవారికి ఓ అద్భుత జానపద నవల బహుమతి !

 ఇంకా... మరెన్నో!

సాహితీ అభిమానులూ, చందమామ ప్రియులూ  తమ మిత్రులకు  కానుకగా ఇవ్వదగ్గ  ఈ ప్రత్యేక సంచిక
వెల-  రూ.50.

చిరునామా-  
RACHANA Telugu Monthly  1-9-286/2/P Vidyanagar
Hyderabad – 500 044
ఈ -మెయిల్ : rachanapatrika@gmail.com
ఫోన్ : 040 – 2707 1500
మొబైల్  : + 99485 77517
వెబ్ సైట్ : www.rachana.net

చందమామ రాజు గారి ఈ బ్లాగు పోస్టు  కూడా చూడండి!

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

కథలే ప్రాణంగా తపించిన బాల్యమిత్రులు!

ద్దరు  స్నేహితులు. వాళ్ళకి రైళ్ళంటే ఎంతో  ఇష్టం. పార్వతీపురం రైల్వే స్టేషన్లో  తురాయి చెట్టును ఆనుకునివున్న సిమెంట్ బెంచీమీద  కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు.

అంతేనా? ఆ ఇద్దరికీ తెలుగు కథలంటే బాగా ఇష్టం.

అందుకే ‘ఒక్క కథ! ఒక్కటంటే ఒక్కటి  అచ్చయితే బాగుణ్ణు’ అని తపించేవారు!

ఇదంతా 35 ఏళ్ళ కిందటి ముచ్చట. కాలం గిర్రున తిరిగింది. కథకులవ్వాలని  అంతగా కోరుకున్న ఆ మిత్రుల ఆశలు ఫలించాయా?

 ఆ ఇద్దరిలో ఒకరు వంశీ!
 

వెండితెర దర్శకుడిగా వెలిగినా  సాహిత్యం లోనే ఉంది ఆయన ఆత్మ. అనుభవాలనూ జ్ఞాపకాలనూ అతి సూక్ష్మ వివరాలు  కూడా వదిలిపెట్టకుండా అందమైన కథలుగా చెక్కటంలో ఆరితేరారు. యాభై కథలకు పైగా రాశారు.



మరొకరు  ఎ.ఎన్. జగన్నాథశర్మ. పాత్రికేయునిగా, సినీ టీవీ రచయితగా ప్రసిద్ధులయ్యారు. ఐదు వందల కథలు రాశారు.

ఈ మధ్యనే ఆయన తొలి కథా సంకలనం ‘పేగు కాలిన వాసన’ విడుదలైంది.  పేదరికం, దిగువ మధ్యతరగతి ప్రజల వ్యథలను ఇతివృత్తాలుగా తీసుకుని, చక్కటి  కథలుగా మలిచారు. వాటిలో చాలా కథలు నాకు నచ్చాయి.  

నిప్పుబొమ్మ, గాజుపెంకులు, ఎర్రనీళ్ళ వాన, చేతులు తెగిన హృదయం, తెగిపడిన పావురం రెక్క-  ఇలా.. శీర్షికలూ  విలక్షణమే!

‘గోదావరి మీద ఎండ తీక్షణంగా ఉంది. గాజుకెరటాలతో ఎండ మెరుస్తోంది’.. ఇలాంటి వర్ణనలు సంకలనం నిండా బోలెడు. కథలను పఠనీయం చేయటంలో వాటి పాత్ర కూడా ఉంది!

కథా సంకలనానికి  ఏ పేరు పెట్టాలనేది  రచయిత  ఇష్టానికి సంబంధించింది. ‘పేగు కాలిన వాసన’ అనేది కథకు శీర్షికగా సముచితమే. కానీ పుస్తకానికి ఈ పేరు కాకుండా  మరే కథ పేరైనా పేరు పెట్టివుంటే బావుండేదనిపించింది. (అసలు కథా సంకలనాలకు పుస్తకంలో ఉన్న ఏదో ఒక కథ పేరు పెట్టెయ్యటం మాత్రం ఏం సమంజసం?)

ఈ పుస్తకం గురించి  ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్ లో రాసిన క్లుప్త సమీక్షను ఇక్కడ ఇస్తున్నాను.

11, మార్చి 2010, గురువారం

నాకిష్టమైన ఇళయరాజా పాట!

 మంచి తెలుగు సినిమా పాటలంటే నాకు ఎక్కువగా గుర్తొచ్చేవి  ఇళయరాజా సంగీతం సమకూర్చినవే. అందులోనూ 80ల్లో  ఆయన స్వరపరిచినవి  చాలా మధురంగా అనిపిస్తాయి.

సాధారణంగా ఇళయరాజా  పాటలంటే  కేవలం ట్యూన్   మాత్రమే విని ఊరుకునేలా ఉండవు. నేపథ్య సంగీతంలోని సూక్ష్మమైన మెరుపులు ఒకోసారి  పల్లవీ, చరణాల అందాలను మించిపోతుంటాయి. కోరస్ ను పాటల్లో అంత అద్భుతంగా ఉపయోగించిన సంగీత దర్శకులు (తెలుగులో)   మరెవరూ లేరు!

భారతీరాజా మూడు దశాబ్దాల క్రితం  తీసిన ‘కొత్త జీవితాలు’ నేనింతవరకూ చూళ్ళేదు. కానీ ఆ సినిమాలోని పాటలంటే  ఇష్టం.

సుశీలా, జానకీ  కలిసి పాడిన  ‘తం తననం’పాట దీనిలోదే.
 (అన్నట్టు- ఈ ఇద్దరు గాయనులూ  కలిసి పాడిన తెలుగు పాటలు ఎన్నో,  అవేమిటో ఎవరైనా  చెప్పుకోండి చూద్దాం!) 

కొత్త జీవితాలు సినిమాలో  నాకు బాగా ఇష్టం-‘పొంగిపొరలే ..అందాలన్నీ పొంగిపొరలే’ పాట.  నేను ఇష్టపడే   వందల పాటల జాబితా రాస్తే...  ఇది తప్పనిసరిగా  ఉంటుంది!

వందలసార్లు విన్నా ప్రతిసారీ  తాజాగానే అనిపిస్తుంటుంది. సినారె రాసిన ఈ గీతాన్ని బాలూ, జానకీ ఎంతో  శ్రావ్యంగా పాడారు.  మీరు ఈ పాట ఎన్నోసార్లు వినివుంటారు. అయినా ఇక్కడ చూడండి... ఆస్వాదించండి... ఇళయరాజా స్వర ఇంద్రజాలాన్ని!








‘కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కన్నె మదిలో ..అందాలన్నీ పొంగిపొరలే
కోనల్లోనా.. లోయల్లోనా నేలపైనా నింగి కదలే.. వన్నెకాడు నన్ను కలిసే!’
అంటూ జానకి తన గళంలో ముగ్ధ సౌందర్యం ఒలికిస్తారు, పలికిస్తారు.

మొదటి చరణం బాలూ గొంతులో ఇలా మొదలవుతుంది.
‘పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా..
పవనాలే జిల్లనగా .. హృదయాలే ఝల్లనగా  ... ’ ...


మళ్ళీ పల్లవిలోకి దారితీస్తుంది. ఆ తర్వాత..

‘కుకుకుక్కూ...’ అంటూ స్థాయీ భేదాలతో  జానకి స్వర విన్యాసం, బహుళ గళాల ప్రతిధ్వని  తోడై  పరశింపజేస్తుంది.

వేణువూ, వీణా అద్భుత గానామృతంలో   సమ్మిళితమవుతాయి. కోయిల కూతలూ, కోవెల గంటలూ  తీయని నేపథ్య సంగీతంలో భాగమై పాటలో ఒదిగిపోతాయి.  

చరణం ముగింపులో మొదలై పల్లవిలోకి అందమైన ప్రయాణం చేసే  గాయనీ గాయకుల ఆలాపనలు ఈ పాట ప్రత్యేకత.

రెండో చరణంలో..
‘కన్నుల్లో మౌనం.. కన్నుల్లో మౌనం..  నవ్వుల్లో గానం... అది నా కోసం’  అనే వ్యక్తీకరణ చాలా బావుంటుంది.

 ఇళయరాజా ప్రతిభా విశేషాలు బహుముఖ వికాసం పొందుతున్న  తరుణంలో రూపొందిన  పాట ఇది!

17, ఫిబ్రవరి 2010, బుధవారం

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!


నకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత...
 జానపద కథల మాంత్రికుడు..
 దాసరి సుబ్రహ్మణ్యం గారు!

దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.

1954లో  ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన   ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం  1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ  విజయవంతంగా  కొనసాగింది.
చందమామ  అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి. 

ఆయన  అక్షరాలను మంత్రిస్తే..అవి  అవధుల్లేని   కథాకల్పనలయ్యాయి. వీర, బీభత్స, రౌద్ర, అద్భుత రసావిష్కరణలతో  అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై  పరుగులు పెడితే అసంఖ్యాక  పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో  ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.

ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని  తలపోసుకుంటూనే ఉన్నారు.

 ఊహల  విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ   వింత  వింత లోకాల్లో   విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.

కానీ...ఆయన  మాత్రం  పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో  ఆ   పాఠకులకు కూడా తనెవరో  తెలియని అజ్ఞాత రచయితగానే  ఉండిపోయారు!


ఉద్యోగ విరమణ చేసి, చెన్నై నుంచి విజయవాడ చేరుకుని, అన్నగారి కుమార్తె ఇంట్లో  విశ్రాంత జీవితం గడిపేటప్పుడు  మాత్రమే  ఆయన గురించి కొద్దిమంది పాఠకులకైనా తెలిసింది.

చివరిదాకా తాను నమ్మిన హేతువాదం నుంచి పక్కకు పోని, స్థిర సంకల్పం ఆయనది.



 న్మానాల ,సత్కారాల, బిరుదు ప్రదానోత్సవాల్లో, పొగడ్తల దండల శాలువాల హడావుడిలో బడా  సాహిత్య సంస్థలు  ఎప్పుడూ బిజీనే. నాలుగు కాలాల పాటు నిలిచే నిజమైన సాహితీ  కృషి చేసిన వారిని తల్చుకోవటానికి

వాటికి తీరికెక్కడిదీ? పైగా దాసరి సుబ్రహ్మణ్యంగారు  ఏ నాటి రచయిత? ఇలాంటివారిని   పట్టించుకునే తీరిక వారికేం  ఉంటుంది చెప్పండి!

ఇలాంటి పరిస్థితుల్లో -

జనవరి 27న కన్నుమూపిన  దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోవటానికి హైదరాబాద్ లో ఎవరైనా  చిన్న సభ పెట్టటం సంతోషకరమే కదా?



 దాసరి వెంకటరమణ, అట్లూరి అనిల్, వాసిరెడ్డి నారాయణరావు, రామవరపు గణేశ్వరరావు, చొక్కాపు వెంకటరమణ గార్లు.

ఆ పని ‘బాలసాహిత్య పరిషత్’ వారు చేశారు.
 
నిన్న  (ఫిబ్రవరి 16) సాయంత్రం  హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో  ఈ ప్రోగ్రాం జరిగింది.


 సమావేశ మందిరంలో అడుగు పెట్టగానే  సభ బ్యానర్ కనపడింది.గుమ్మం దగ్గరే టేబుల్ మీద దాసరి గారి రచనల పుస్తకాలు,చందమామ కథలు, ఆయన  దస్తూరితో ఉన్న కథల రాత ప్రతులు కనిపించాయి.

వీటన్నిటికంటే ముందు 1947 జులై చందమామ తొలిసంచిక దగ్గర్నుంచి కొన్ని నెలల సంచికల  బైండు  కనిపించింది. ఈ సంచికలన్నీ ఇంతకుముందు  పీడీఎఫ్ లుగా చూశాను గానీ, పుస్తకాలుగా ప్రత్యక్షంగా చూడటం ఇదే

మొదటిసారి. ఆ అనుభూతితో చందమామ   పేజీలను ఆత్మీయంగా స్పర్శించి, తిరగేస్తుంటే చాలా సంతోషమనిపించింది. సుబ్రహ్మణ్యం గారి గురించి పత్రికల్లో వచ్చిన రచనలు అక్కడున్న  గోడ మీద డిస్ ప్లే చేశారు.

వీటిని ఏర్పాటు చేయటం వెనక నిర్వాహకుల శ్రద్ధ అభినందనీయం.

పుస్తకాలను  ఫోటో తీస్తుంటే అక్కడే ఉన్న దాసరి వెంకటరమణ గారు పలకరించారు.(ఆయన సేకరణే ఈ పుస్తకాలన్నీ).


 సభలో రామవరపు గణేశ్వరరావు గారు, వాసిరెడ్డి నారాయణరావు గారు, అట్లూరి అనిల్ గారు  దాసరి గారితో  వ్యక్తిగతంగా తమ చిరకాల  అనుబంధాన్నీ,జ్ఞాపకాలనూ గుర్తుచేసుకున్నారు. దాసరి వెంకట రమణ , చొక్కాపు వెంకట రమణ, మరికొందరు మాట్లాడారు.

 జనాలతో ఎవరితోనూ కలవని అంతర్ముఖుడైన దాసరి గారి ఆత్మగౌరవం గురించీ, సాహితీ సభలకు వెళ్ళటంపై ఆయన అనాసక్తి గురించీ ప్రస్తావించుకున్నారు. గట్టివాడూ, మొండివాడుగా కనిపించే ఆయన సున్నిత స్వభావం గుర్తు చేసుకున్నారు.


చిన్నపిల్లల రచనలే కాకుండా దాసరి గారు రాసినవి  ‘ఇంద్రాణి’ అనే కథాసంపుటి, పులిగోరు, భూతాల రాయుడు అనే పుస్తకాలున్నాయి. చందమామలోనే శంభుదాసు అనే పేరుతో కొన్ని కథలు రాశారు. ఇంకా  దాసు, సుజాత, భవానీ ప్రసాద్ అనే కలం పేర్లతో కూడా రచనలు చేశారు.

తెలుగులో రచయితలు తమ జీవితకాలంలో  స్వయంగా పట్టించుకోకపోతే వారి రచనల సేకరణ ఎప్పటికీ అసమగ్రంగానే ఉండిపోతుంది. కొ.కు. రచనల సంగతి అలాగే అయింది. ఎంతో క్రమశిక్షణతో రచయితలకు వారి రచనల గురించి  శ్రద్ధగా లేఖలు రాసే సుబ్రహ్మణ్యం గారి రచనల విషయమూ అలాగే అవటం విచిత్రం! సుబ్రహ్మణ్యంగారు సొంతపేరుతో, కలం పేర్లతో రాసినవీ,అజ్ఞాతంగా  ఇతర పత్రికల్లో చేసిన రచనలూ ఇంకా సేకరించాల్సేవుంది. 

ఈ సంస్మరణ సభ మూలంగా  కొన్ని  విశేషాలు తెలిశాయి.

 రచన శాయి గారు దాసరి గారి సాహిత్యాన్ని సేకరించటానికి చేసిన ప్రయత్నంలో శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. మరికొన్ని సేకరించాల్సినవి ఉన్నాయి.

ఇక శాయి గారు దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వేయాలనే సంకల్పాన్ని  వ్యక్తపరిచారు. చందమామ చిత్రకారులు వేసినట్టే  ఆ కథకు బొమ్మలు వేయించాలనుకుంటున్నానని చెప్పారు. ‘రచన’ ఏప్రిల్ సంచికను దాసరి గారి ప్రత్యేక సంచికగా తీసుకురాబోతున్నారు.  

ఇక వ్యక్తిగతంగా నాకు సంతోషం కలిగించిన మరో విషయం- ‘బొమ్మరిల్లు’లో నా అభిమాన ధారావాహిక ‘మృత్యులోయ’ రచయిత ఎవరో ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను; ఈ సభ కారణంగా!
 

కొసమెరుపు: ఆత్మల ఉనికినే నమ్మని నాస్తికుడైన  దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘ఆత్మశాంతి’కోసం సభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. కొందరు వక్తలైతే- అలవాటుగానేమో,ఆయన ‘స్వర్గస్థు’లయ్యారంటూ
మాట్లాడేశారు!

సభలో వక్తల ప్రసంగాలను ఇక్కడ చూడొచ్చు.



విజయవాడలో మరో్ సభ!

దాసరి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ ను విజయవాడలో్ ఫిబ్రవరి 21న (ఆదివారం)
సాయంత్రం 6 గం.లకు నిర్వహిస్తున్నారు.

వేదిక- చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయం, శిఖామణి సెంటర్, విజయవాడ.


చందమామ అభిమానులు,  దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ఆయన మిత్రులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఎరిగినవారు ఈ సభకు హాజరై తమ మనోభావాలను పంచుకోవచ్చు.

వివరాలకు -  కొత్తపల్లి రవిబాబు -+919490196890 e mail: ravibabu@yahoo.co.in


దివికుమార్ -+919440167891, 0866-2417890: divikumar1949@yahoo.com