సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఇళయనిలా! మనసును... తాకెనిలా!

 
కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది  ఉన్న  వీడియో!

దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను. 

‘ఇళయనిలా  పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో  ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది.  సినిమా పేరు ‘అమర గీతం’ (1982).  వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా అనూహ్యంగా , అప్పటికప్పుడు జరిగిన ఘట్టాలు  నన్ను  ముగ్ధుణ్ణి చేశాయి.

నిజానికిది పాత వీడియో. ఇళయరాజా 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం సమకూర్చిన సందర్భంగా తమిళనాడులో జరిగిన ఉత్సవాల్లో చిన్న భాగం. 

దీన్ని నేను చూడటమే చాలా లేటు.

అప్పటికి ఇళయరాజా- బాలు  సత్సంబంధాలతోనే ఉన్నారు.

 
కమల్ హాసన్, గౌతమి కూడా కలిసేవున్నారు.


ఈ వీడియో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.  ప్రేక్షకులు ఉర్రూతలూగుతూ  కరతాళధ్వనులు చేస్తూ స్పందించారు.  మమైకమై పాట ఆసాంతం ఆస్వాదించారు.

వేదికపై  ఇళయరాజా,  కమల్ హాసన్,   ప్రేక్షకుల్లో ప్రకాష్ రాజ్, గౌతమి, బహుశా ఖుష్బూ కూడా ఉన్నారు. వీళ్ళూ,  చాలామంది ప్రేక్షకులూ  ఉత్సాహం చూపిస్తూ హుషారుగా కనపడతారు. 

ఏముందీ వీడియోలో?

ప్రత్యక్షంగా వేల మంది...  టీవీల్లో చూస్తున్న లక్షల  మంది ప్రేక్షకులు.  సినీ సంగీత ప్రియులు!

పాట హృద్యంగా  సాగుతోంది. తన్మయులై వింటున్నారు జనం.  వాద్యసమ్మేళనంలోని  ఓ కళాకారుడికి  అనుకోకుండా  పొరపాటు దొర్లింది. అంతా రసాభాస అవుతోందనే బాధ.. అవమానంతో చేష్ఠలుడిగి  ఏం చేయాలో పాలుపోని  స్థితి. 

అలాంటి విపత్కర తరుణంలో.. సాధారణంగా ఎవరికైనా ఏం చేయాలో తోచదు. కానీ  పాట పాడుతున్న బాలూ చక్కటి సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.  లోపం బయటపడకుండా తన గానంతో పరిస్థితిని వెంటనే సవరించగలిగాడు. 

ఆపద్బాంధవుడయ్యాడు!

అంతేనా? అంతకంటే మించే చేశాడు.

ఏమిటది? చూడండి.

( కొత్త చేర్పు-  on  29.10.2018 )

ఈ రెండు  వీడియోల్లో కిందది  విజువల్స్  స్పష్టతతోనూ,  ఎక్కువ నిడివితోనూ  ఉన్నది.  కానీ  ఆ వీడియో పెట్టినవాళ్ళు  నిబంధనలు ఉల్లంఘించారంటూ  యూ ట్యూబ్  దాన్ని తీసేసింది.  దాంతో  మరో  వీడియో  (పైన ఉన్నది) పెట్టాను.  దీనిలో  అంత స్పష్టంగా విజువల్స్ లేవు. పైగా  నిడివి తక్కువ.  కానీ  ఏం చేస్తాం...?  దీంతోనే సరిపెట్టుకోవాలి, ప్రస్తుతానికి!   

సరికొత్త చేర్పు  on 30.5.2019

హాట్ స్టార్ లో  పూర్తి వీడియో ఉంది.

ఇదిగో లింకు


***

పాటల విశిష్టతలను  ఆసక్తిగా  వివరించే విషయంలో బాలును మించి మరెవరూ ఉండరేమో.  ‘ఇళయనిలా’ పాట గురించీ , ముఖ్యంగా ఆ పాటలోని గిటార్ ప్రత్యేకత గురించీ , దాని కంపోజిషన్ గురించీ బాలు తమిళంలో వివరించినా... తెలుగు మాత్రమే తెలిసినవారికి కూడా సారాంశం బాగానే అర్థమవుతుంది.

ఈ పాట ఒరిజినల్  గిటారిస్ట్ చంద్రశేఖర్.   ఈ వీడియోలో కనిపించే గిటారిస్ట్  ప్రసన్న.  


 
రెండోసారి  అరుణ్ మొళి (నెపోలియన్) సరైన నంబర్ ఫ్లూట్  ఉపయోగించి,  వేణువాద్య బిట్ ను శ్రావ్యంగా వాయిస్తున్నపుడు ... ఆ కళాకారుడి విజయాన్ని ప్రేక్షకులకు చూపిస్తూ  బాలు  ఆనందపడటం చాలా బాగుంటుంది. అతడి సహృదయతకు  మనసంతా సంతోషభరితం అయిపోతుంది.


పొరపాటుకు బాధపడి కుంగిపోయిన కళాకారుడు కొద్ది సమయంలోనే తన ప్రతిభ చూపిస్తూ తిరిగి కెరటంలా ఎగసినపుడు -  

ఆ విజయానికి  సంతోషిస్తూ .. తమ ఆమోదం తెలుపుతూ ప్రేక్షకులు చేసే  కరతాళ ధ్వనులు సముద్ర కెరటాల్లా ఎగసిపడతాయి!

ఇళయరాజా, ప్రకాష్ రాజ్ ల  హావభావాలు ప్రత్యేకం. ఇదంతా  చూడటం గొప్ప అనుభవం. 


* * *

సక్తి ఉన్నవారు ఈ వీడియో కూడా చూడండి..

గిటార్, వేణువుల ధ్వనులను నోటితో పలుకుతూ, ఇళయరాజా ‘జీనియస్’ను ప్రశంసిస్తూ..  బాలు  ఆ పాట గొప్పదనం ఎలా వివరించాడో గమనించండి.

‘ఇళయనిలా’ పాట  మాధుర్యాన్ని  వివరంగా వర్ణిస్తూ  ఇంగ్లిష్ లో   రాసిన ఓ   బ్లాగ్ పోస్ట్   కూడా చూడండి. ఆ  బ్లాగర్ పేరు సృజన.    


* * *

బాలు ఓ ఇంటర్ వ్యూలో తనను గొప్ప చేసుకుంటూ  చేసిన ఓ వ్యాఖ్యను విమర్శిస్తూ  గతంలో ఓ పోస్టు రాశాను.  ‘మీ గొప్పలు మీరే చెప్పుకోవాలా? ’ అంటూ.

అది అదే;  ఇది ఇదే!

తియ్యటి  గానంలో ఏ కాస్త  అపశ్రుతి వినిపించినా...  మనసు చివుక్కుమంటుంది.  సమంజసం కాని  వ్యాఖ్యను విమర్శిస్తాం.   

అంతమాత్రాన  ఆ వ్యక్తి  చూపిన  సహృదయతను  విస్మరిస్తామా?  దాన్ని  మనస్ఫూర్తిగా  ప్రశంసించకుండా ఎలా ఉంటాం !

1, జులై 2018, ఆదివారం

ఏ పేరులో ఏ పెన్నిధి ?

 

దుటి వ్యక్తి పేరును సంబోధిస్తూ సంభాషిస్తుంటే వాళ్ళను ఇట్టే ఆకట్టుకోవచ్చట. మనస్తత్వశాస్త్రవేత్తలు  చెప్పే మాట ఇది!

కారణం?


ఎవరి పేరు వాళ్ళకు ప్రియాతిప్రియంగా ఉంటుంది కదా? కాబట్టి అలా పిలవటం  నచ్చి, ఆ పిల్చినవాళ్ళమీద ఇష్టం దానికదే వచ్చేస్తుందన్నమాట. 

దీనికి మినహాయింపులూ ఉన్నాయి.

కొంతమందికి వాళ్ళ పేరు ససేమిరా నచ్చదు. (పాత చింతకాయ పచ్చడి పేరైతే నచ్చకపోవటం సరే... కానీ ఆధునికమైన పేరు పెట్టినా..  చాలామంది దాన్నే పెట్టుకున్నారని,  తమ పేరుపై విరక్తి పెంచుకున్నవాళ్ళూ తెలుసు నాకు).

ఇలాంటివాళ్ళ ముందు సైకాలజిస్టులు చెప్పిన పై చిట్కా ఫలించదు.   పైగా అలా పదేపదే  తమ పేరు ఉచ్చరించినందుకు వాళ్ళు కోపాలు తెచ్చుకున్నా  ఆశ్చర్యం లేదు.
‘నా పేరు తాసీల్దారు.. నేను రామలింగాన్ని’

‘అందాల రాముడు’  సినిమా చూశారా? దానిలో తీసేసిన తాసిల్దారు (తీతా) పాత్ర వేసిన అల్లు రామలింగయ్య డైలాగ్ అది. తన పేరే హోదా...  అనుకునేంత తాదాత్మ్యం.

ఆ  తికమకలోని స్వారస్యం  వేగంగా సాగే  సినిమాలో చప్పున  స్ఫురించదు.   ఎమ్వీయల్  ఆ సినిమా వెండితెర రాశారు. తన  నవలీకరణలో ఇలాంటి చమక్కులెన్నో  వెలికితీశారాయన.  


 అలా కొంతమందికి వాళ్ళ  పేరు కంటే ప్రియమైనది వాళ్ళ వృత్తి/ హోదా.  ముఖ్యంగా డాక్టరేట్లు పొందిన కొంతమందికీ,  చాలామంది మెడికల్ డాక్టర్లకూ వాళ్ళ పేరు సరిగా పలక్కపోయినా పట్టించుకోరు కానీ, ముందు డాక్టర్ అనకపోతే ... క్షమించరు.

కొంతమందికి వాళ్ళ పేరు కంటే ఇంటి పేరే ప్రియాతిప్రియం.  ‘ఇదే ఇంటిపేరు ఎంతోమందికి  ఉంటుంది, మీకు పెట్టిన  పేరు కదా మిమ్మల్ని రిప్రజెంట్ చేసేది?’ అని అడిగితే  ఆ లాజిక్కులకు వాళ్ళకు ఒళ్ళు మండుకొస్తుంది.  ‘మరి ఇదే పేరు కూడా చాలామందికి  ఉండదా?’ అని తమ ఇంటిపేరును ఆప్యాయంగా తల్చుకుంటూ.. ఎదురు ప్రశ్న వేయవచ్చువాళ్ళు.

కొన్ని ఇంటిపేర్లు  ఇంపుగా అనిపించవు.  కానీ వాళ్ళ చెవులకవి ఎంతో మధురంగా ధ్వనిస్తాయి.  అందుకే .. శుభలేఖల్లో, కార్ల అద్దాల మీదా తమ ఇంటిపేరును పెద్ద అక్షరాల్లో వేయించుకుని  గర్వపడుతూ, మురిసిపోతుంటారు.

కుల పరిశోధకులు

కొందరుంటారు. వీళ్ళకు ఎదుటి మనిషి కులమేమిటో తెలుసుకోకపోతే  ఊపిరాడదు. ఇంటిపేరు ఉంది కదా? అదే వాళ్ళ బలమైన ఆధారం. దానితో కులాన్ని ఇట్టే కనిపెట్టేసే పరిశోధకులు మనకు ఎక్కడబడితే అక్కడ కనపడుతుంటారు.

రెండు మూడు కులాల్లో ఒకే ఇంటిపేరు ఉంటే..?  అంత తేలిగ్గా ఓటమి ఒప్పుకుని వ్యా‘కుల’పడరు. ఇంకా సూక్ష్మపరిశీలనకు పూనుకుంటారు కానీ,  ఆ ప్రయత్నం మానరు గాక మానరు.  ప్రాంతం, భాష, ఆహారపు అలవాట్లను బట్టి  మరీ  కులాన్ని డిస్కవరీ చేసేస్తారు.  అది తెలిసేదాకా, ఆ కులమేదో తేలేదాకా, తేల్చుకునేదాకా  విశ్రమించరు.

‘బావ గారూ..’

పేర్లు ఉన్నప్పటికీ  బంధుత్వపు పేర్లతో పిలిపించుకోవటం, పిలవటం చాలామందికి ఇష్టంగా ఉంటుంది.   ఓసారి ఒకాయన నన్ను బంధుత్వం ప్రకారమే..  ‘బావ గారూ!’ అని ఫోన్లో పిలవగానే ఉలిక్కిపడ్డాను.  ‘బాబాయి’ అనే పిలుపు బాగా అలవాటు.  ‘అంకుల్’, ‘సర్’ అనే పిలుపులు కూడా  అలవాటయ్యాయి. కానీ ఈ ‘బావ గారూ’ పిలుపు మాత్రం చాలా కొత్తగా , వింతగా అనిపించింది!

ఇలాంటివి మనకిష్టం లేకపోయినా వినటానికి అలవాటుపడాలి కాబోలు. 


 ఈ మధ్య శుభలేఖ సుధాకర్ ని ఆంధ్రజ్యోతి ఆర్కే ఓపెన్ హార్ట్ లో ఇంటర్ వ్యూ చేశారు. ఆ సంభాషణ  చూడండి-

ఆర్కే: మీరు బాలూగారిని బావగారు అని పిలవరా? ‘సార్‌’ అనే సంబోధిస్తారా?

సుధాకర్: నాకు బాలూగారు ఓ సింగర్‌. లెజెండ్‌గా తెలుసు. అప్పటినుంచే ‘సార్‌’ అని అలవాటైపోయింది. శైలజతో పెళ్లయ్యాక ఆయనే ఓ సందర్భంలోనే ‘బావగారూ’ అని పిలవమన్నారు. కానీ నాకు ‘సార్‌’ అనే పిలుపులోనే కంఫర్ట్‌ ఉంటుందనిపించింది. అదే విషయం ఆయనకు చెప్పా.

ఇలా చెప్పటం వల్ల నాకు ఇంకా బాగా నచ్చాడు సుధాకర్. అన్నట్టు.. అతడి నటనా, కంఠస్వరం, ఆ మాడ్యులేషన్ కూడా నాకు బాగా నచ్చుతాయి.

ఇంకా  టైటిల్ దగ్గర పెట్టిన కొటేషన్  రాయలేదు కదూ....  

వస్తున్నా, అక్కడికే!

‘రోమియో అండ్ జూలియట్’ నాటకంలో షేక్ స్పియర్ రాసిన ప్రసిద్ధ వాక్యం..

“What's in a name? that which we call a rose

By any other name would smell as sweet.”


కానీ అమెరికన్ రచయిత్రి గెర్ ట్రూడ్ స్టెయిన్.. దీనికి విరుద్ధంగా చెప్పారు...
‘A Rose Is a Rose Is a Rose' అని.

అన్నట్టు...

‘వాట్స్ ఇన్ ఏ నేమ్’ ని  గిరీశం (పోనీ, ఆయన సృష్టికర్త గురజాడ) తర్జుమా చేస్తాడు,  చక్కగా.

అదేమిటో మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాలా?  (చూడుడు : ‘కన్యాశుల్కము’)

గిరీశం పేరును ‘గిర్రడు’ అని  అదే నాటకంలో  మరో పాత్ర   ఎకసెక్కం చేయటం తెలుసుగా.  

మా సీనియర్ అయిన  తెలుగు జర్నలిస్టు  గౌస్ గారు   షేక్ స్పియర్ కొటేషన్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అనువదించారు.  ఆ వాక్యాన్ని తెలుగింగ్లిష్ ప్రవాళంలా.. ‘ నేములో నేమున్నది ?’  అని. 

ఎంజీ రోడ్డు అంటే?

గాంధీ పేరు మీద రోడ్డు పెట్టాలంటే  గాంధీ రోడ్డు అంటే చాలు.  ఆయన్ని గొప్ప చేద్దామని మహాత్మా గాంధీ  రోడ్డు అని పెడితే... అది  ఎంజీ రోడ్డు అయిపోతుంది.  ముళ్ళపూడి  తన ‘కోతి కొమ్మచ్చి’లో  చెప్పిన సంగతి ఇది.

ఇదండీ  నామ పురాణం!

31, మే 2018, గురువారం

ఎలా ఉండాలి సరైన ముగింపు?
'All is well that ends well'  అంటారు.

దేనికైనా సరే... ముగింపు బాగుంటే ...  అంతకుముందు దొర్లిన పొరపాట్లూ,  లోపాలూ, అసంతృప్తులూ  తగ్గిపోతాయి,  సమసిపోతాయి.  

సినిమాల సంగతి చెప్పాలంటే... సెకండాఫ్  మెరుగ్గా ఉన్న సినిమాలు హిట్ అవుతాయి, సాధారణంగా.  సినిమా ముగిసి బయటికి వచ్చేటపుడు  ఉండే ఫీలింగ్ అంత  శక్తిమంతం!    

కథకైనా, సినిమాకైనా తగిన క్లైమాక్స్ లేకపోతే  అది వెలితిగా ఉంటుంది.  ఒక్కోసారి ఆ లోపం ఆ కథనో, సినిమానో దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది.

‘సాగర సంగమం ’లో చివర్లో  కథానాయకుడి పాత్ర చనిపోకూడదని దర్శకుడు విశ్వనాథ్ భావిస్తే... ఆ పాత్ర చనిపోవాల్సిందేనని కమల్ హాసన్ పట్టుబట్టాడట.

ఇక ‘స్వాతిముత్యం’ క్లైమాక్స్ లో ఆ  పాత్ర చనిపోవాలని దర్శకుడు అంటే... బతికివుండాల్సిందేనని కథానాయకుడు గట్టిగా చెప్పి పంతం నెగ్గించుకున్నాడట.  కమల్ వాదన ఎంత సబబో ఆ సినిమాల ఫలితమే నిరూపించింది కదా!

క్లైమాక్స్ అంటే  ప్రత్యేకంగా ఉండే   ఓ మూడు సినిమాలు నాకు గుర్తొస్తాయి.

చాణక్య (1989)
మహానది (1993)
ద్రోహి (1995)
ఈ మూడూ  కూడా  కమల్ హాసన్ సినిమాలే అవటం విశేషం!‘చాణక్య’ సినిమాలో  తన కుటుంబాన్ని నాశనం చేసిన విలన్ ముఖ్యమంత్రి మీద పగ తీర్చుకోవటం కోసం..  తనను చంపేసేలాగా  ప్రేరేపిస్తాడు, హీరో.  తను మరణించినా అప్పటికే రికార్డు చేసిన  సాక్ష్యాధారాలతో విలన్ కు శిక్షపడుతుంది.

ప్రేక్షకులు ఎవరూ ఊహించలేని అరుదైన విచిత్రమైన  ముగింపు ఇది!

విలన్ ను శిక్షించటానికి  తను చనిపోవటానికైనా సిద్ధమవటం విశేషం కదా!

 పునర్జన్మ పాయింటుపై ఆధారపడి తీసిన   ‘అరుంధతి’  సినిమా ఇలాంటిదే కదా!
‘మహానది’లో విలన్ ఓ డాబా మీద నుంచి జారిపోతూ  తన చేతిని ఉడుం పట్టు పట్టుకున్నపుడు  విలన్  జారిపడిపోయి చచ్చిపోయేలా చేసేందుకు హీరో ఏకంగా  తన చేతినే  నరికేసుకుంటాడు!   చిన్నపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మే దారుణమైన  విలన్ కు ఎలాగైతేనేం.. శిక్ష పడింది కదా అని ( హీరో  దుస్థితి పట్ల బాధ వేసినా)  సంతృప్తి పడతాం.
‘ద్రోహి’లో అయితే...  హీరో తన సహచరుడితో కావాలని షూట్ చేయించుకుని మరణిస్తాడు.  ఆ సహచరుడు ఆ ఉగ్రవాదుల నెట్ వర్కులోకి ప్రవేశించటానికి హీరో చేసిన ఆత్మార్పణ అన్నమాట.

ఈ మూడు సినిమాల ముగింపులూ  సినిమాటిక్ గా ఉండొచ్చుకానీ... విభిన్నంగా  ఉండటం వల్ల బాగా గుర్తున్నాయి.
 
బెంగాలీ నవలల్లోనో, రష్యన్ నవలల్లోనో  కేవలం  న్యుమోనియా వచ్చి ఆ రుగ్మతతో  చనిపోయే పాత్రల గురించి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.    అప్పట్లో ఆరోగ్య పరిస్థితులు అంత ఘోరంగా ఉండేవా అనిపిస్తుంటుంది. 

తడబడిన క్లైమాక్సులు

 ‘అద్భుతంగా తీసిన  క్లైమాక్స్ ’ను మార్చి, వేరేది ఉంచటం వల్ల తన  ‘ఆలాపన’ సినిమా  ఫెయిలయిందని దర్శకుడు వంశీ ఓసారి చెప్పారు.

మహేష్ బాబు సినిమా ‘బాబీ’లో  హీరో హీరోయిన్లు  చనిపోతారు క్లైమాక్స్ లో.   అది ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో   వాళ్ళు బతికినట్టు  మార్చి,  ఆ క్లైమాక్సునే  ఉంచేశారు.  అయినా ఫలితం ఏమీ మారలేదనుకోండీ.ముగింపు ఎలా ఉండాలన్నదానిలో  ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి.  


శ్రీ రమణ ప్రసిద్ధ కథ ‘మిథునం’ ముగింపులో కథానాయకుడు అప్పదాసును చంపేయటం అనవసరం అనేది రచయిత్రి రంగనాయకమ్మ అభిప్రాయం. 

కానీ  ‘శంకరాభరణం’ సినిమాలో శంకరశాస్త్రి చనిపోవటం సహజమనీ, ఆ కథకు అదే సరైన ముగింపు అనీ ఆమె అంటారు!

కానీ.. ఆమె ఓ నవలకు రెండు క్లైమాక్సులు రాశారు మరి.

విషాదాంతాలు  కన్విన్సింగుగా ఉంటే..   పాఠకులూ,  ప్రేక్షకులూ  తప్పకుండా  ఆమోదిస్తారు. 


శరత్  ‘దేవదాసు’  విషాదాంతం కావటం కంటే భిన్నంగా మరే రకంగానూ  ఊహించలేం కదా!


 

30, ఏప్రిల్ 2018, సోమవారం

జంధ్యాల సాహిత్యం... రమేశ్ నాయుడు గానం

 

క వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత  ఆ  వ్యక్తి  బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక   తెలిస్తే... ?

నాకైతే...

ఆ కళాకారుణ్ణి   వ్యక్తిగతంగా  కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.  

అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు. 
 
సినీ సంగీత దర్శకుడు  రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన  పాటలన్నా  నాకు చాలా ఇష్టం. 

ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా ఆయన కళా ప్రతిభ గురించి తెలుసు. కానీ ఆయన చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాతే   ఆయన పాటల్లోని మాధుర్యం  నాకు సంపూర్ణంగా  అవగతమయింది.  అందుకే ఆయన్ను చూడలేకపోయాననీ, మాట్లాడలేకపోయాననీ  బాధ వేస్తుంటుంది.

 ఆయనతో  అత్యధిక చిత్రాలకు పనిచేయించుకున్న ముగ్గురు దర్శకుల్లో ...  జంధ్యాల,  దాసరి నారాయణరావులు ఇప్పుడు సజీవంగా లేరు.

మిగిలిన దర్శకురాలు విజయనిర్మల.  ఆమెను కలిసి,  రమేశ్ నాయుడి గురించీ, ఆయన బాణీల  విశేషాల గురించీ చాలా వివరాలు   తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది.

ఇది సాధ్యం కాని విషయమేమీ కాదు కూడా!


*  *  *

రమేశ్ నాయుడు పాడిన  పాటల్లో  రాధమ్మ పెళ్ళి (1974)  సినిమాలోని  ‘అయ్యింది రాధమ్మ పెళ్లి ’,
 
చిల్లరకొట్టు చిట్టెమ్మ ( 1977) లోని  ‘తల్లి గోదారికి ఆటు పోటుంటే’ ..

ఇవి  శ్రోతలకు బాగా  తెలుసు.

మరో పాట కూడా ఉందని   ఇవాళే  నాకు  తెలిసింది.  
మరి  సినీ అభిమానులైన  పాఠకులకు  ఈ పాట సంగతి  తెలుసో లేదో నాకు తెలియదు.

ఆ పాట -
‘సూర్యచంద్రులు ’ (1978)  సినిమాలోది. ఇదే  సినిమాలోని  ‘ఒకే మనసు... రెండు రూపాలుగా..’  పాట కోసం నెట్ లో   వెతుకుతుంటే  ఈ విశేషం తెలిసింది. 

లిరిక్  ఇది... చూడండి.  (చిత్రభూమి బ్లాగ్  సౌజన్యంతో). 


జంధ్యాల మాటల రచయితగా, దర్శకునిగా అందరికీ తెలుసు.  సినిమా పాట కూడా రాశారనేది కొత్త విషయం. పైగా దాన్ని రమెశ్ నాయుడే  స్వయంగా పాడటం!

జంధ్యాల- రమేశ్ నాయుడి  ద్వయం భవిష్యత్తులో  ఎన్నోమంచి   సినిమాలు కలిసి పనిచేయటానికి  ఈ పాట కూడా  ప్రాతిపదిక అయివుండవచ్చు.  

ఈ పాట బాణీ  ఇంకా దొరకలేదు, వినటానికి .


ఇంతకీ నేను  ఈ బ్లాగులో ప్రస్తావించాలనుకున్న  అసలు పాట ఇది- 


‘అన్నదమ్ములుగా జన్మిస్తే అది చాలదు చాలదు అంటాను
కవలలుగా జన్మించే జన్మ కావాలి
కావాలంటాను’

ఈ పాటలో  ఈ   సెంటిమెంట్  నచ్చిందో... భావం నచ్చిందో చెప్పలేను.  కానీ రమేశ్ నాయుడి  బాణీ మాత్రం  అద్భుతంగా నచ్చింది.

బాలుతో పాటు కలిసి  పాడిన గాయకుడు జి. ఆనంద్ అనుకున్నాను, ఇవాళ్టి వరకూ.  కానీ ఆ గాయకుడి పేరు చిత్తరంజన్.  ఈయన రేడియోలో  ప్రతి ఆదివారం  'ఈ మాసపు పాట'  శీర్షికతో  అస్సామీస్, ఒరియా, తమిళ్, సింధీ లాంటి వివిధ భాషల పాటలు నేర్పించేవారు. 

 *  *  *

రమేశ్ నాయుడు  సంగీతం సమకూర్చిన  పాటల్లో  చాలా ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి.

ఓ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  దీనిలో కూడా  నేను నమ్మని  పునర్జన్మల  సంగతి ఉండటం కాకతాళీయం కావొచ్చు.

జీవితం (1973) అనే సినిమాలోది ఈ పాట.   సినారె రాసిన  ఈ పాటను  సుశీల, రామకృష్ణ పాడారు.

పాట లిరిక్ ఇది-

ఇక్కడే కలుసుకొన్నాము..  ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో..  ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము
 
నీలనీల గగనాల మేఘ తల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా 
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి

ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము

నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఏమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం

ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము మనసుకు దగ్గరైన  వ్యక్తులనూ,  ఆత్మీయులైనవారినీ   ఇక్కడే కాదు,  గతంలోనే  ‘ఎప్పుడో  కలుసుకున్నాము’  అనుకోవటంలో  ఎంతో తృప్తి ఉంటుంది.   అదొక అనిర్వచనీయమైన భావం.

ఈ పాటలో   ‘చరణ దాసి’ లాంటి వ్యక్తీకరణలు నేను ఇష్టపడనివి.   కానీ  దాన్ని పట్టించుకోకుండా,  పదేపదే వినాలనిపించేంత  మాధుర్యం  బాణీలో ఉంది. 

 * *  *


రమేశ్ నాయుడి  పాటల  గురించి   ఇంతేనా?  ఇంకేమీ లేదా రాయటానికి..  అనకండి.

ఇంకో  పోస్టు  రాస్తాను, మరెప్పుడైనా!

కొన్నేళ్ళ క్రితం ఆయన గురించి  ఈ  బ్లాగులో  ‘విన్నారా అలనాటి వేణుగానం’ అనే పోస్టు రాశాను. 

అలాంటి పోస్టులు ఎన్నో రాసి,  ఇష్టంగా  గుర్తు చేసుకోదగ్గ విశేష  ప్రతిభావంతుడాయన!
 

4, మార్చి 2018, ఆదివారం

రీ టెల్లింగ్ కథలా? ఫ్రీ టెల్లింగ్ కథలా?
చయితలు రాసిన  కథల నిడివిని  కుదించి,  వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.  

రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే  ఉండాలనీ,  కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా  ఆశిస్తారు.

దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే?

అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ టెల్లింగ్  అవుతుంది.

స్వకపోల కల్పనలను  యథేచ్ఛగా చేయాలనుకునేంత స్వేచ్ఛా పిపాసులు సొంత కథలను మాత్రమే రాసుకోవాలి.  అంతేగానీ  రీ టెల్లింగ్ పేరిట  ఇతరుల రచనల్లో  వేలు పెట్టకూడదు!   పెట్టి వాటిని కంగాళీ  చేయకూడదు!


* * *
రంగనాయకమ్మ ‘మురళీ వాళ్ళమ్మ’ కథను మొట్టమొదటిసారి 1999 లో  ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచికలో ప్రచురించారు.

ఈ కథ ఈ 2018 మార్చి 1న సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో  రీ టోల్డ్ కథగా వచ్చింది.  (మహిళా దినోత్సవ సందర్భంగా రచయిత్రుల కథలను ఈ సిరీస్ లో ఇస్తున్నారన్నమాట...  ఈ కథ 19వ కథగా వచ్చింది.  ఇంకా రోజుకో కథ వస్తూనే ఉంది.)

ఈ పున:కథకుడు ఖదీర్
ఇక్కడ   చూడండి-రీ టోల్డ్ కథ చూశారు కదా? 

ఇప్పుడు  రంగనాయకమ్మ ఒరిజినల్ కథ చూడాలి.

ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పటి పేజీలను ‘కథా నిలయం’ సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాను.


   murali vallamma by Reader on Scribd


* * *

‘మురళీ వాళ్ళమ్మ ’ నాకు నచ్చిన కథల్లో ఒకటి. 
ఇప్పుడీ  పున: కథనం  చదివాను.

అసలు కథకూ,  ఈ అనుసరణ కథకూ చాలా చోట్ల తేడాలు ఉన్నాయనిపించింది.  ‘అమ్మకి ఆదివారం లేదా’ పుస్తకం తీసి, దానిలో ఉన్న ఆ కథను మళ్ళీ చదివి చూశాను.నా అనుమానం నిజమే!

‘మురళీవాళ్ళమ్మ’ పున: కథనం గతి తప్పింది.
పాత్రల స్వభావం మారింది.
సంభాషణలు  కూడా  కళ తప్పాయి.  
అన్నిటికంటే ఘోరం- ఒరిజినల్ కథలో లేని సంఘటనలు వచ్చి చేరాయి.


ఓ ఇంటర్ వ్యూలో  ‘వాక్యాన్ని మానిప్యులేట్  చేయగలను’  అని  ధీమాగా  ప్రకటించుకున్నారు ఖదీర్.  కానీ  తెలుగుకు అసహజమైన  ‘కలిగి  ఉండే’ వాక్య ప్రయోగంతో,  పేలవమైన సంభాషణలతో, సొంత కల్పనలతో  ఆయన రీ టెల్లింగ్  దుర్భరంగా తయారైంది.

అందుకే...
ఇది  రంగనాయకమ్మ రాసిన  ‘మురళీ వాళ్ళమ్మ’ కాదు... 
ఖదీర్ వండిన  ‘సొరకాయ పాయసం’!

* * *
ల్లికి అన్యాయం  చేసిన తండ్రిపై కోపం తెచ్చుకుని పదమూడేళ్ళ మురళి  తనకు తనే   ‘అమ్మా! ఏం చేద్దాం?’ అని మళ్ళీ మళ్ళీ అడిగి,  మార్గం కూడా తనే చూపిస్తాడు.  ఆ మాటలు గుర్తొస్తే తల్లికి  శరీరం పులకరిస్తుంది. 

రీ టెల్లింగ్ లో  ‘ఏమంటావు నాన్నా’ అని తల్లి అడిగాకే  కొడుకు జవాబు చెప్తాడు. దీంతో   చిన్నప్పటి మురళి పాత్ర  ప్రత్యేకత కాస్తా ఎగిరిపోయింది.
 
తల్లిని ఎదిరించి మాట్లాడలేని మురళి,  తల్లి కోపంతో అన్నమాటలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయని మురళి  ఈ పున: కథనంలో మాత్రం తల్లితో ఏకంగా వాదనే పెట్టుకుంటాడు.  ఆఫీసులో అమ్మాయితో ‘ఇంత క్లోజ్ అయ్యాక తన ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా’ అని లాజిక్ తీస్తాడు.  

ఏమాత్రం రాజీపడకుండా  ఆత్మగౌరవంతో  ప్రవర్తించే  తల్లి రుక్మిణి  పాత్ర స్వభావాన్ని తెలుసుకోవటానికి ఆమె సంభాషణలు ఆయువుపట్టు.   ‘భర్తని ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీపడటానికా?’ అనీ,  ‘నీ దారి నీదీ నా దారి నాదీ’ అని  స్థిరంగా, నిర్మొహమాటంగా  చెప్పే  పాత్రకు  ఇక్కడ- పున: కథనంలో  కళాకాంతులు తగ్గిపోయాయి. 

కొడుకుతో ఆమె - ‘నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను’ అందట.  ‘హూంకరించింది’ అట.  రంగనాయకమ్మ కథనంలో  తల్లి .. కొడుకుని  పేరుతో పిలుస్తుంది గానీ  ఖదీర్ కథనంలో లాగా  ‘రా’ అని సంబోధించదు. దాంతో సంతృప్తిపడలేదేమో.. ఆమెతో కొడుకును ‘రేయ్..’అని కూడా అనిపించారు ఖదీర్.   

కథలో లేనివీ... కొత్తగా  చేర్చినవీ
ఒరిజినల్ కథలో మురళి తన ఆఫీసు అమ్మాయితో పదేపదే  ఫోనులో మాట్లాడుతుంటాడు.  కానీ ఆమెతో  బాత్ రూమ్ లో చాటింగ్ నూ, ముద్దులనూ కూడా అదనంగా చేర్చేశారు ఖదీర్. 

మొదట్లో,  చివర్లో ఖదీర్   చెప్పిన ‘సొరకాయ పాయసం’ (తల్లే స్వయంగా వండిందట అది)  ఒరిజినల్ కథలో లేనే లేదు.  ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆమె ఆ పాయసం అలా చేస్తుందట.  ఈ పాయసమూ,  సింబాలిజమూ ఖదీర్  సొంత కవిత్వం తప్ప  మరోటేమీ కాదు. 

‘జీడిపప్పు  ప్యాకెట్లు ’ మురళి  టూర్ నుంచి ఇంటికి తెస్తాడు.  ఖదీర్ ఆ జీడిపప్పు ప్యాకెట్లను వృథా కానీయకుండా  పాలు, చక్కెర వేసి  వేయించేశారు.  సువాసనలీనుతున్న ‘లేతాకుపచ్చ పాయసం’ తయారుచేసి  ఆ జీడిపప్పులు దానిలో  తేలేలా చేశారు.  ఆ సింబాలిజం అలా ఎదురుగా ఉంచుకుని... ఇక  స్వీయ పున: కథనం అల్లేశారు. 

అదింకా ఆ కథగానే ఉంటుందా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  పాడిన పాటను వేరెవరో తన ఇష్టం వచ్చినట్టు మార్చేసి పాడి, ఆ  రికార్డును బాలు  ఫొటోతో విడుదల చేసినంతమాత్రాన అది బాలు పాట అయిపోతుందా?  

అలాగే  ఒక రచయిత  ఫొటో వేసి  ‘మళ్ళీ చెప్పుకుందాం’ అంటూ కథనంతా ఈ రీటెల్లింగ్ రచయిత  మూడు కాలాల్లోకి కుదించేసి- రచయిత తన కథలో రాయని  సంఘటనలను కొత్తగా జోడించేస్తే అది  పున: కథనం అవుతుందా?  అప్పుడది ఒరిజినల్ రచయిత కథగానే ఇంకా మిగిలివుంటుందా? 

మంచి కథలను పాఠకులకు మళ్ళీ  గుర్తు చేయాలనుకుంటే, కొత్త పాఠకులకు తెలపాలనుకుంటే.. తగిన అనుమతులు తీసుకుని వాటిని యథాతథంగా ప్రచురించాలి.

 ‘నిడివి ఎక్కువ, అలా చేయలేం’ అనుకుంటే... ఆ కథల ప్రత్యేకతల గురించి వివరిస్తూ  సమీక్ష/ పరిచయం/ విశ్లేషణ ఇవ్వటానికి మాత్రమే పరిమితం కావాలి.  


అంతేగానీ..  కథనంతా రీ టోల్డ్ మూసలో పేర్చి,  స్వీయ కల్పనలు చేర్చి రాస్తే...  అది వక్రీకరణకు తక్కువ అవ్వదు. కథా రచయితను ఇది  నిశ్చయంగా అగౌరవపరచటమే! 

ఆ కథను అమితంగా అభిమానించే  పాఠకుల అనుభూతిని ఇది భగ్నం చేయటం కాదా?  వారి మనసుల్లో ముద్రించుకున్న చక్కటి దృశ్యాన్ని మొరటుగా చెరిపేయటం కాదా?నేను ఈ సిరీస్ లో ఒక్క కథనే పరిశీలించాను.  ఇక మిగిలినవి ఎలా ఉన్నాయో ...!  ఈ పున: కథనాల విషయంలో  ఒరిజినల్ రచయిత్రులు సంతృప్తిగా ఉన్నారో, లేదో, ఒకవేళ అసంతృప్తి ఉంటే  దాన్ని  ప్రకటించారో లేదో నాకు తెలియదు!

28, ఫిబ్రవరి 2018, బుధవారం

మృతీ... స్మృతీ.. విస్మృతీ!

త్మీయులో, గాఢంగా అభిమానించేవారో మరణిస్తే... ఎవరికైనా అమితమైన బాధా,  దు:ఖం  సహజం. కాలం  గాయాల్ని మాన్పుతుంది కాబట్టి.... రోజులు గడుస్తున్నకొద్దీ  ఆ  జ్ఞాపకాలు పల్చబడి, వారి తలపోతలు తగ్గిపోవటం కూడా అంతే మామూలు.

అయితే అందరి విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెప్పలేం!.

మా అమ్మకు వాళ్ళ నాన్న (మా తాతయ్య) అంటే ఎంత ఇష్టం అంటే... ఆయన చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ‘మా నాన్న’ అంటూ ఇష్టంగా ఆయన్ను గుర్తు చేసుకోని  రోజు ఆమెకు ఉండేది కాదు.  నేను పుట్టకముందే తాతయ్య  చనిపోయాడు.  ఫొటో చూడటం తప్ప ఆయన్ను నేను చూడలేదు. కానీ మా అమ్మ మాటల్లో, తాను తల్చుకుంటూ చెపుతూవుండే  జ్ఞాపకాల్లో ఆయన నాకు బాగానే తెలుసనిపిస్తుంది.

తండ్రిని  పదేపదే  తల్చుకోవటంలో, ఆయన ఘనతను సందర్భానుసారంగా చుట్టుపక్కలవారికి  గర్వంగా చెప్పటంలో సంతోషం, ఉపశాంతి ఆమెకు దక్కివుండాలి.  మరో కోణంలో చూస్తే... ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే... తండ్రి తర్వాత ఆమెను  అంత ప్రేమగా , అంత అపురూపంగా, అంత గారాబంగా మేం చూసుకోలేదేమో.. అని! 

మా అమ్మ లాంటి వాళ్ళు అరుదేమీ కాదు.  మన చుట్టుపక్కలే చాలామందే ఉంటారు.  ఇదంతా  సామాన్యులకు సంబంధించిన  కోణం. 

శోభన్ బాబు  అంతరంగం
   
సినీ మాయామేయ జగంపై మనలో చాలామందికి అంత మంచి అభిప్రాయం ఉండదు. కానీ మంచి చెడుల సమ్మేళనం కదా ఏ రంగమైనా!

ఓసారి  ఈటీవీలో సినీ నటుడు  శోభన్ బాబు ఇంటర్వ్యూ చూశాను.   తన సినీ కెరియర్ ఎలా మొదలై, ముందుకు వెళ్ళిందీ  చెపుతూ వెళ్ళారు.  తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్  తొలినాళ్ళలో  తననెంతగా ప్రోత్సహించిందీ గుర్తు చేసుకున్నారు.  అప్పటికి ఎన్టీఆర్ మరణించారు.

అలా మాట్లాడుతుంటే  శోభన్ బాబు గొంతు గాద్గదికమైంది. ఎన్టీఆర్ పట్ల మనసులో ఉన్న  కృతజ్ఞతతో,  ఆ  తలపుల భారంతో.. ఆయన కళ్ళ నుంచి నీరు ఉబికి వచ్చింది.  మాటలు  సరిగా  రాలేదు. మౌనం... కానీ  కెమెరా అలా నిశ్శబ్దంగా  పనిచేస్తూనే ఉంది.  యాంకర్  కూడా ఏమీ కలగజేసుకోలేదు.  కొద్దిసేపటికి శోభన్ బాబు  తమాయించుకుని,  ఇంటర్వ్యూను కొనసాగించారు.

నేను చూసిన టీవీ ఇంటర్ వ్యూల్లో ఇది బహుశా అత్యుత్తమం.  అప్పటిదాకా  శోభన్ బాబు అంటే మంచి అభిప్రాయమే ఉంది. అప్పటి నుంచీ ఆయనంటే  చాలా గౌరవం ఏర్పడింది.  ఎన్టీఆర్ చనిపోయిన   చాలా కాలం  తర్వాత  చేసిన ఇంటర్వ్యూ ఇది.  ఒక వ్యక్తి  చేసిన మేలును  ఏళ్ళు గడిచిన  తర్వాత కూడా మర్చిపోకుండావుంటూ  అలా  కన్నీరు మున్నీరయ్యే  హృదయం ఎంత  సున్నితమైనది, ఎంత  స్వచ్ఛమైనది!  ఆ అనుబంధం ఎంత గాఢమైనది!


సామూహిక విషాదం
సినీ  ప్రముఖులో, రాజకీయ నాయకులో మరణిస్తే  మీడియా ఆ వార్త ఇచ్చి ఊరుకోదు. మృతుల ప్రాముఖ్యాన్నీ , ప్రాచుర్యాన్నీ బట్టి  చాలా హడావుడి చేస్తుంది.

మిగిలిన  ఘటనల ప్రాధాన్యం తగ్గించి అయినా సరే,  భిన్న కోణాల్లో అతిశయోక్తులు జోడించి  విషాదాన్ని పెను విషాదంగా, సామూహిక విషాదంగా మార్చేలా కథనాలూ, స్పందనలూ, అభిప్రాయాలూ  ప్రసారం చేస్తుంది.  ప్రచురిస్తుంది.

‘పోటీలో వెనకబడకుండా’,  ‘సృజనాత్మకతకు సానపెట్టి మరీ’  మీడియా సంస్థలు అదే పనిగా కథనాల పరంపరతో  వీక్షకుల్నీ, పాఠకుల్నీ ఆకట్టుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటాయి.

మరో కొత్త సంఘటనో, దుర్ఘటనో సంభవించేవరకూ (మాత్రమే)  ఇది  కొనసాగుతూవుంటుంది. 

మీడియా ముందు జాగ్రత్తలు
ప్రముఖులు  చనిపోతే ... వారి గురించి  అప్పటికప్పుడు  సమాచారం సేకరించి,  కథనాలు  రాసి డెడ్ లైన్ లోపు  ప్రచురించాలంటే   అది  చాలా కష్టం.  అందుకే   పత్రికలు (ఇప్పుడైతే  టీవీ చానళ్ళు కూడా)  ముందు జాగ్రత్త పాటిస్తుంటాయి.  అదేమిటంటే... కాస్త పెద్ద వయసులో ఉండే  ప్రముఖుల  జీవిత విశేషాలతో , ఫొటోలతో, వీడియో క్లిపింగ్ లతో  కొంతమేరకైనా కథనాలు సిద్ధం చేసుకుంటూవుంటాయి....

ఎందుకంటే...
ఒ క వే ళ  ఆ ప్రముఖులు  చనిపోతే ... వెనువెంటనే  పాఠకులకు/ వీక్షకులకు ఆ విశేషాలు  అందించేందుకు!

వినటానికి  ఇది  దారుణంగా  అనిపించవచ్చు.  కానీ  మీడియాకు ఇదేదో కొత్తగా పుట్టిన అలవాటూ కాదు.   ఎప్పటినుంచో ఉన్నదే!


 స్వాతంత్ర్య సమరయోధుడూ, శాసనసభ్యుడూ అయిన  వావిలాల గోపాలకృష్ణయ్య  ఓసారి అనారోగ్యం పాలయ్యారు.  ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా  అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ఉన్నారు.
 
వావిలాల  గోపాలకృష్ణయ్య

నార్ల వెంకటేశ్వరరావు
 పత్రికలో పని చేసే తుర్లపాటి కుటుంబరావును నార్ల  పిల్చి , ‘పెద్దాయన కదా... ఏమో...  ఏమైనా  అనుకోనిది జరగొచ్చు.  వావిలాల జీవిత విశేషాలతో  కథనం  సిద్ధం చేయండి’ అని చెప్పారట.  ఆ ప్రకారమే  తుర్లపాటి కథనం రాసివుంచారు.

కానీ... వావిలాల చక్కగా అనారోగ్యం నుంచి తేరుకున్నారు; బాగా కోలుకున్నారు.
పత్రిక సిద్ధం చేసిన కథనం అప్పటికి వ్యర్థమైంది.

మరోసారి వావిలాల అస్వస్థులయ్యారు.
ఈసారి కూడా  పత్రికల ముందస్తు తయారీ వార్తలకు  పని కల్పించకుండా ఆయన  హాయిగా  కోలుకున్నారు.

కొంతకాలం గడిచింది. వావిలాల  క్షేమంగానే ఉన్నారు కానీ...  ఎడిటర్ గా  పదవీ విరమణ చేసిన  నార్ల వెంకటేశ్వరరావు  కన్నుమూశారు!

తుర్లపాటి కుటుంబరావు
వావిలాలను కలిసినప్పుడు  తుర్లపాటి  తమ పత్రిక చేసిన తమ ముందస్తు ‘నివాళి’  ఏర్పాట్ల సంగతులన్నీ  దాచకుండా  చెప్పేశారు.  పైగా  ‘చిరంజీవి వావిలాల’ అన్న బిరుదును కూడా ఆయనకు ఇచ్చేశారు.

నార్ల   (డిసెంబరు 1908-1985)  మరణించిన తర్వాత మరో  18 సంవత్సరాలు జీవించారు వావిలాల (సెప్టెంబరు 1906- 2003).
  
ఒక్క ఆంధ్రజ్యోతే కాదు,  మిగిలిన  అన్ని పత్రికలూ  వావిలాల... ఆయన లాంటి  పెద్ద వయసు ప్రముఖుల  గురించి ముందస్తు కథనాలు సిద్ధం చేసుకుంటూనేవుంటాయి.  వృత్తి ధర్మం  అలా ఉంటుంది.  

ఈ సందర్భంగా ఓ జోక్ గుర్తొస్తోంది.

ఒక యువకుడు పల్లెటూళ్ళో ఉన్న  తొంబై ఏళ్ళు దాటిన వృద్ధుడిని కలిశాడు. పిచ్చాపాటీ అయ్యాక  పట్నం  వెళ్ళటానికి  సెలవు తీసుకుటూ...  ‘తాత గారూ,  నేను రావటానికి చాలాకాలం పడుతుంది.  మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో..’ అన్నాడట.  తాత గారు తాపీగా  ‘ఏం నాయనా, నీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది కదా.. ఎందుకంత నిరాశ!  ఫర్వాలేదు, నీకేం కాదులే’  అని ధైర్యం చెప్పాడట.  

 

ఎన్నో  వ్యక్తిత్వాలు
ఈ మధ్య గొల్లపూడి మారుతీరావు రాసిన ‘ఎలిజీలు’ అన్న పుస్తకం చదివాను.  రాజకీయ,  సాంస్కృతిక, సేవా  రంగాలకు చెందిన 79 మంది వ్యక్తులను వారి మరణానంతరం  స్మరించుకుంటూ రాసిన ఆత్మీయ రచనలివి.  గొల్లపూడి వ్యక్తిగత కోణంలో  ఆ ప్రముఖుల వ్యక్తిత్వాలు మనకు పరిచయమవుతాయి.

కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి,  జరుక్ శాస్త్రి, చెలం,  ఆత్రేయ, రావిశాస్త్రి, బుచ్చిబాబు, ఉషశ్రీ, ఎమ్వీయల్,  ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆరుద్ర, భానుమతి, ఎస్ వరలక్ష్మి, జగ్గయ్య, అంజలీదేవి, కొమ్మూరి వేణుగోపాలరావు,  మాలతీ చందూర్, రమణ , బాపు,  వేటూరి, బాలచందర్ .. ఇంకా ఎందరో!

గొల్లపూడి  వ్యాసాల్లో నాకు నచ్చని భావాలు కొన్ని ఉంటుంటాయి   కానీ ఇలా నివాళి వ్యాసాలను రాయటంలో ఆయన చూపే  ప్రతిభ,  చక్కని  పోలికలతో  వాక్యాలను  ఆర్ద్రంగా అల్లే  తీరూ  నాకు  నచ్చుతుంది.  

ముందుమాటలో  ఇలా అంటారు- ‘ఇది నాలుగో ముద్రణ.  (2016). ప్రతిసారీ నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల  జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దు:ఖాన్నీ పెంచుకుంటూ ఉంది.  ...  ఈ పుస్తకంలో ప్రతి పేజీ నా  హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ  ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్దం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీనన యోగ్యం చేసిన ఓషధులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు.  చరిత్రగా మిలిగే నిట్టూర్పు. ... మరో ముద్రణ అంటే భయమేస్తుంది. మరెంతమంది ఆప్తులను నష్టపోతానో అని.’

  రావూరి భరద్వాజ స్మతి సాహిత్యం 


తెలుగులో స్మృతి రచనలు చాలా వచ్చాయి కానీ..  దినచర్య రూపంలో మొదట వచ్చింది.. రావూరి భరద్వాజ ‘నాలోని నీవు’  పుస్తకంతోనే.

భార్య కాంతమ్మ వియోగ దు:ఖం  తాను చనిపోయేవరకూ ఆయన్ను  వదల్లేదు.  తన కష్టాల్లో, కన్నీళ్ళలో కలిమి లేముల్లో  భాగస్వామి అయిన అర్ధాంగి కాంతమ్మ జ్ఞాపకాలకు విస్తృతంగా అక్షరరూపమిచ్చారు.  డైరీల్లో తన వేదననూ, దు:ఖోద్వేగాలనూ నిక్షిప్తం చేశారు.

అవి పుస్తకాలుగా వచ్చాయి.  ‘ నాలోని నీవు’ తో పాటు   ‘అంతరంగిణి’, ‘ అయినా ఒక ఏకాంతం’, ‘ఐతరేయం’, ‘ ఒకింత ఏకాంతం’  భరద్వాజ  స్మృతి సాహిత్యమే.ఆయన డైరీల్లోని కొన్ని వాక్యాలు...
‘... కాంతమ్మ స్మృతులు నన్ను కకావికలు చేస్తున్నాయి...పీల్చుకు తింటున్నాయి. కాల్చుకు తింటున్నాయి. ఎన్నోజన్మల పుణ్యం వల్ల గానీ అలాంటి ఉత్తమురాలు భార్యగా దొరకదు.’

‘... నాకింకో జన్మ అంటూ ఉంటే, కాంతమ్మ గర్భవాసాన జన్మించి, ఆమె రుణం తీర్చుకొంటాను.’

 ‘మళ్ళా, మళ్ళా, మళ్ళా- నిన్నెప్పుడైనా చూస్తానా? నా పిలుపు,నా రోదన, నీదాక రావడం లేదా? రావడం లేదా? రావడం లేదా కాంతం? ’


బతికున్నపుడే నివాళి

ప్రాణం పోయాక  ‘అంత మంచి, ఇంత గొప్ప’  అంటూ  ఎన్ని విశేషాలతో,  ఎంత రాసినా  దానివల్ల  ఏమిటి ప్రయోజనం  అనే ప్రశ్న నాకు వస్తుంటుంది.

తనకు  ప్రపంచం అర్పించే  నివాళిని  ఏ వ్యక్తీ  చూడలేడు.  (లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ్,  సాహితీ వేత్త  రోణంకి అప్పలస్వామి లాంటివారు చనిపోకముందే  వారు మరణించారని  పొరపాటు వార్తలు వచ్చాయి. అలాంటి సందర్భంలో  తప్ప...)

 ప్రజా కవి  సుద్దాల హనుమంతు తనపై రాసిన ‘నివాళి’ని తను జీవించివున్నపుడే విన్నారట.


డా.  ద్వా.నా శాస్త్రి  సంకలనం చేసిన ‘మా నాన్న గారు’ అనే పుస్తకం 2009లో వచ్చింది. దానిలో కీర్తిశేషులైన 62 మంది సాహితీ ప్రముఖులను తల్చుకుంటూ వారి కుటుంబ సభ్యులు రాసిన వ్యాసాలున్నాయి.

సినిమా పాటల కవి  సుద్దాల అశోక్ తేజ తన తండ్రి సుద్దాల హనుమంతు గురించి  వ్యాసం రాశారు.  అందులోని ఓ భాగం చూడండి-

సుద్దాల హనుమంతు

సుద్దాల అశోక్ తేజ
 ‘ఆ రోజుల్లోనే నాకో ఆలోచన వచ్చింది- ప్రపంచంలో ఎంత మహానుభావుడికైనా చనిపోయాక కదా స్మృతి గీతం రాస్తారు. మావో, గాంధీ, లెనిన్, శ్రీశ్రీ ఎవరైనా తన స్మృతి గీతం తను వినరు కదా, నాన్న స్మృతి గీతం రాసి నాన్నకే వినిపిస్తే అనిపించింది. తప్పో - ఒప్పో నాకు తెలియదు. నేను మా నాన్న కనుమూయకముందే (క్యాన్సర్ తో బాధపడుతున్న సమయం...)  నాన్న స్మృతి గీతం రాశాను.  నాన్నకి ఏడుస్తూ వినిపించాను. 

పాట వినిపించడం పూర్తయింది. నాన్న తప్ప ఇంట్లో అందరం ఏడుస్తున్నాం. మా నాన్న రెండు చేతులు చాపి నన్ను పిలిచాడు. కౌగిలించుకున్నాడు. తన భుజంపై నా దు:ఖబాష్పాలు... నా భుజంపై నాన్న ఆనంద బాష్పాలు... నా వీపు నిమిరిన నాన్న చేతుల స్పర్శ... భుజంపై నాన్న ఆనంద బాష్పాల తడి ఇప్పటికీ ఆరిపోలేదు... ఎప్పటికీ ఆరిపోదు.’


ఇలా బతికున్నపుడే ఎలిజీ రాయటం ‘తప్పో ఒప్పో నాకు తెలియదు’  అన్నారు కదా అశోక్ తేజ.  నేను కూడా  అది సరైనదనో,  కాదనో   నిర్దిష్టంగా  ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాను!

31, జనవరి 2018, బుధవారం

ఎమ్వీయల్లూ ... కథల ఎన్నీయల్లూ !


బాస్వెల్ తో పోల్చారు  ఆరుద్ర.
కీట్సుతో  సామ్యం తీసుకొచ్చారు  వేటూరి.

ఎవరిని?

ఎమ్వీయల్ గారిని !

* * * 

యన్ను  నూజివీడు మర్చిపోలేదు.

అక్కడ కాలేజీలో ఆయన పాఠాలు విని మనసారా ఇష్టపడ్డ  కాలేజీ విద్యార్థులూ,

ఆయన వాక్చాతుర్యం,  రచనా చమత్కారం చవి చూసిన  తెలుగు పాఠకులూ, సాహిత్యాభిమానులూ ..

ఇంకా ఆయన స్నేహ పరిమళం పంచుకున్న సినీ ప్రముఖులూ...

ఎవరూ
ఆయన్ను
మర్చిపోలేదు.

ఆయన  విద్యార్థులూ, స్నేహితులూ నూజివీడులో ‘ ఎమ్వీయల్ సాహితీ సమాఖ్య’ గా ఏర్పడి, ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావటానికి చొరవ తీసుకున్నారు.

ఆ కృషి ఫలితమే.. డిసెంబరు 24న  విడుదలైన ‘ఎమ్వీయల్ కథలు’ పుస్తకం !
 

ఒక రచయిత  కన్నుమూసిన   32 సంవత్సరాల తర్వాత ఆయన రాసిన కథలన్నీ సేకరించి,  పుస్తకంగా తీసుకురావటం అసాధారణమైన విషయం కదా !
  

ఈ పుస్తకంలో 17 కథలున్నాయి.

వెన్నెల్లాంటి  హాయినిచ్చే  ఈ  కథలన్నిటిలో   ప్రత్యేకంగా గమనించదగ్గ  అంశం- కథనం .  ఎమ్వీయల్ ముద్రను పట్టించే  మెరుపు వాక్యాలు చమక్కుమంటూ  చాలా కథలను పఠనీయం చేశాయి.

వాటిలో కొన్నిటి గురించి  కొంచెం (మాత్రమే) చెప్తాను.

‘రసవద్గీత’
మామిడి రసాలూరే  చక్కటి  కథ.  ఇది 1979లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో  ప్రచురితమయింది.

బుజ్జి  అనే కుర్రాడు  ఇష్టంగా తన పేరు చెక్కుకుని మరీ తినబోయిన  హిమాం పసందు  మామిడికాయ  అనుకోకుండా అతడి  చేజారిపోతుంది.  అది ఊరంతా తిరిగి తిరిగి  చేతులు మారి  అనూహ్యంగా  బుజ్జి చేతుల్లోకి  నాటకీయంగా వచ్చేస్తుంది.

కథా వాతావరణం సూచించినా,  పోలిక చెప్పినా అందులోనూ  మామిడి  గుబాళింపులే !

‘పుల్లమావిడి తిన్నట్టు పులిసిపోయింది భద్రం మనసు. ’


‘మేనేజరు మాటలు చాలా భాగం గాలి దుమ్ముకి రాలిన మామిడి కాయల్లా గేటివతలే పడిపోయాయి.’ 


చెక్కినట్టు కాకుండా  చటుక్కున రాసినట్టుండే  వాక్యాలు  కొన్ని చూడండి-

‘మేనేజరు గారి మొహమాటానికి పడక్కుర్చీ మెలికలు తిరిగింది’

‘భద్రం మెరుపులా వరండాలోకి వెళ్ళి ఉరుములా మారిపోయాడు’ ‘పొద్దుతిరుగుడు పూలు’
 1974లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైన కథ.  ఇది చదువుతుంటే తిలక్  ‘నల్లజర్ల రోడ్డు’ కథ గుర్తొచ్చింది.

‘నిరాశలా చీకటి
చీకటిని చీలుస్తూ మనిషిని బతికించే ఆశలా కారు హెడ్ లైట్’


- ఇలా మొదలవుతుంది.


అడవిలో  అర్ధ రాత్రి కారు చెడిపోయి ఆగిపోయింది.  అప్పుడు దానిలో ప్రయాణించే  వివిధ రకాల వ్యక్తుల్లో  భయం, కంగారు,  ధైర్యం, నిరాశ,  స్వార్థపు ఆలోచనలు ఎలా ఉంటాయి, మారతాయి ?  ఉత్కంఠభరితమైన ఈ  కథ  ఆసక్తికరంగా  దీన్ని  చెప్తుంది.


‘సిరిగలవాడు’
 రచనా కాలం 1985.  2001 వరకూ ఇది అముద్రితంగానే ఉండి, ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది.

ఇది గల్పికో, కథానికో... ప్రక్రియ ఏదైనా కానీ  వాక్యాలు అలవోకగా  జాలువారుతాయి. పదాల విరుపులతో కదం తొక్కే కథన విన్యాసం  కనపడుతుంది.

పార్వతి శివుడితో ఇలా అంటుంది-

‘ఈ వెండి కొండ మీద మీ పలుకే బంగారం. మూడో కంటికి కూడా తెలీకుండా కూడబలుక్కోడం కూడానా?’

వెండికొండ-  బంగారం...  మూడో కంటికి  అన్న సార్థక పదాల్లోని
స్వారస్యం ప్రత్యేకంగా చెప్పాలా?

 కవి శ్రీనాథుడు రాళ్ళసీమలో దాహార్తితో ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’ అని  శివుణ్ణి ఎత్తిపొడుస్తాడు కదా?  అది విని శివుడు కరుణించి  గంగను పంపించాడని  రచయిత ఊహ.

అప్పుడు  శ్రీనాథుడు ఎలా పరవళ్ళు తొక్కాడో  రాసిన ఈ వాక్యాలు చూడండి-

‘జలద రహితమైన నీలాకాశం నుంచి ఉప్పొంగి వస్తున్న గంగను చూసి, శ్రీనాథుడు జలదరించాడు. జల ధరించాడు’.

ఆకాశగంగ కాబట్టి జలదం (మబ్బు )తో  పని లేదు.  ఇక జలదరించడం, జల ధరించడం... అంటూ ఒకే మాటను విడదీసి, చిన్న మార్పుతో కొత్త అర్థాన్ని సాధించటం ఎంత బాగుందో కదా !‘కల’కలం
ఈ పుస్తకంలో  విలక్షణమైన కథ ఇది. నిజానికిది రేడియో ప్రసంగం.

ఎమ్వీయల్ గారి గొంతులోనే  దాన్ని విందామా?* * *
ఇంతకీ ఎమ్వీయల్ ను  బాస్వెల్ తో  ఎందుకని పోల్చారు ఆరుద్ర !

ఎవరా బాస్వెల్?

(ఈ సందేహం కొంతమందికైనా ఉంటుందని భావించి,  దాని గురించి కొంత ఇక్కడ  చెప్తాను. )

ముళ్ళపూడి వెంకట రమణ  సాహిత్యంపై సమగ్రంగా పరిశోధన చేసి  ఆయన రచనా వైశిష్ట్యాన్ని 1973లోనే  ‘కానుక’గా  రాశారు  ఎమ్వీయల్.

27-28 సంవత్సరాల వయసుకే  ఇలాంటి  మౌలిక  కృషి చేశారాయన.


ఆ పుస్తకానికి  ముందుమాట రాస్తూ  ఆరుద్ర -

 ‘ముళ్ళపూడి భాయీ జాన్సన్ కి
ఎమ్వీయల్ సెబాస్వెల్’ 


అని చమత్కరించారు.
శామ్యూల్ జాన్సన్


ఇంగ్లిష్ నిఘంటు కర్త, కవీ,  విమర్శకుడూ అయిన  శామ్యూల్ జాన్సన్ (1709-1784)  జీవిత చరిత్రను  జేమ్స్ బాస్వెల్ (1740-1795) రాశాడు.  ఆ పుస్తకం పేరు ‘Life of Samuel Johnson'.

జీవిత చరిత్రల రచనలోనే అది  కొత్త ఒరవడి సృష్టించింది !


ముళ్ళపూడి రమణ  రచనలపై   ఎమ్వీయల్  చేసిన  పరిశోధన అలాంటిదని ఆరుద్ర ప్రశంసన్నమాట.

*  సెబాస్ + బాస్వెల్ ... సెబాస్వెల్ అయింది.
*  ఎమ్వీయల్ , బాస్వెల్ మాటల సారూప్యత  కూడా ఎంచక్కా సరిపోయింది  కదా !

బాస్వెల్
మరో  విషయం-  

75 ఏళ్ళు జీవించిన జాన్సన్  గురించి రాసిన బాస్వెల్ 54 ఏళ్ళు బతికాడు.

ముళ్ళపూడి వెంకట రమణ (1931-2011)  80 సంవత్సరాలు జీవించారు కానీ..  ఆయన బాస్వెల్... మన ఎమ్వీయల్  42 సంవత్సరాలకే   కనుమరుగయ్యారు.


వేటూరి సుందర రామమూర్తి  వ్యాఖ్య సంగతి కూడా వివరంగా చూద్దామా?
 ‘ఆంగ్ల కవి కీట్సును అన్ని విధాలా పుణికిపుచ్చుకున్న జీవితం అతనిది. స్వగతంలో నేపథ్య కవితాలాపన అతనిది ’  అన్నారు  వేటూరి.

బైరన్, షెల్లీల  సమకాలికుడైన  రొమాంటిక్ కవి జాన్ కీట్స్ (1795-1821).

జాన్ కీట్స్

'Heard melodies are sweet, but those unheard are sweeter'
అనీ,

' A thing of beauty is a joy forever' అనీ చెప్పింది  కీట్సే.

పాతికేళ్ళకే  టీబీ వ్యాధికి బలైన కవి కీట్స్.  చిన్నవయసులోనే కన్నుమూయటం  ఒక్కటే కాకుండా..  కళాప్రతిభ,  కవిత్వారాధనల విషయంలో కూడా కీట్స్ - ఎమ్వీయల్ ల మధ్య సామ్యం  కనపడింది వేటూరికి.


* * *
బాపు రేఖాచిత్రం  ముఖపత్రంగా అలంకరించుకున్న ఈ  ‘ఎమ్వీయల్ కథల’ పుస్తకం వెల 70 రూపాయిలు.

ఎమ్వీయల్ తో తన అనుబంధం గురించి గాయకుడు బాలు స్వదస్తూరితో  రాసిన  ఆత్మీయపు పలుకులు  పుస్తకం మొదట ప్రచురించారు.  వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్నీ,  గాఢతనూ అవి  తెలుపుతాయి.

డా. చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి
  ఈ కథలపై సమీక్ష  చేశారు, ‘పాలపిట్ట’ మాసపత్రిక  సెప్టెంబరు 2017 సంచికలో.

 ‘‘ఎమ్వీయల్ కథలలో బరువైన సమస్యలుండవు. ఏ విధమైన సందేశాలుండవు. మధ్య తరగతి మానవ స్వభావ చిత్రణ ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య ఆత్మీయానురాగాలు ఉంటాయి. సంభాషణా చాతుర్యముంటుంది. .... చక్కగా హాయిగా చదువుకునే కథలు ... తెలుగుదనం ఉట్టిపడే కథలు’ అని ఆమె చక్కగా అంచనా వేశారు.

ఈ సమీక్షను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు. 

విజయవాడ  ‘సాహితి’  ప్రచురణగా వచ్చిన ఈ సంకలనం కాపీలు  కావలసినవారు 2436642/43, 8121098500 నంబర్లను సంప్రదించవచ్చు.  


తాజా చేర్పు :  ఫిబ్రవరి 4న ఈనాడు ఆదివారం లో  ఈ పుస్తకం గురించి నేను రాసిన  చిన్న పరిచయం వచ్చింది.  అది ఇక్కడ ఇస్తున్నాను.