సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఆగస్టు 2016, సోమవారం

విన్నారా ఈ చిన్నారి గానం?

నిమిషంనర నిడివి కూడా లేని ఆ పాట...  నాకు అమితంగా నచ్చింది.

నిండా పదేళ్ళు కూడా  లేని ఓ బాలిక...  తన గాన మహిమతో నన్ను సమ్మోహితుణ్ణి  చేస్తోంది!

*  *  * 
సంగీతమంటే  నాకు ఎక్కువ తెలిసినవి సినిమా పాటలే ! 

రేడియోలో  లలిత సంగీతమూ,  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళిల పాటలూ వినలేదని కాదు.

అయినా అవి పరిమిత స్థాయిలోనే!

అప్పుడప్పుడూ  ‘అనుపల్లవి’ బ్లాగులో  ‘తెలుగు అభిమాని’ రాసే  పోస్టుల ద్వారా శాస్త్రీయ సంగీత గుళికలు కాసింత రుచి చూస్తుండటం ... అంతే!

ఈ ఆగస్టు మొదట్లో  రచయిత్రీ,  కళాభిమానీ  శ్రీదేవి మురళీధర్  గారు నాకు కొన్నిపాటల  యూ ట్యూబ్  లింకులు పంపారు.

ఆ విధంగా  సూర్య గాయత్రి  అనే కేరళ చిన్నారి  పాటలు నాకు పరిచయమయ్యాయి.

అవన్నీ‘భక్తి’ పాటలే! 

ఈ  పదేళ్ళ పాప ... గానం చేసేటపుడు చూపే  తాదాత్మ్యత  మొదట నన్ను ఆకట్టుకుంది. 
 


ఆ గొంతులోని  శ్రావ్యత,  మాధుర్యం సరే సరి!

*  *  *

చిన్న వయసులో  పిల్లల వోకల్ కార్డ్స్ పూర్తిగా వికసించవు కాబట్టి  రాగ ప్రస్తారానికీ, పాటకు పూర్తి న్యాయం చేయటానికీ వారికి సహజంగానే  పరిమితులుంటాయి.

కానీ ఈ సూర్య గాయత్రి మాత్రం నిజంగా సు గాత్రి! 

ఆమె గళంలో  ఏ కోశానా  ఆ  పరిమితులు కనిపించటం లేదు.

పరిణత గాయనిలా - తడబడకుండా-  స్వచ్ఛమైన ఉచ్చారణతో  వినసొంపుగా  పాడుతుంది.

కుడి అర చేతి వేళ్ళను కలిపి  కొంచెం ముందుకు వంచి,  పాము పడగలాగా చేసి  
అలవోకగా,
స్వేచ్ఛగా,
హాయిగా ....
ఆస్వాదిస్తూ 
గానం చేస్తుంది. 

*  *  *

సూర్య గాయత్రి  తండ్రి  పీవీ అనిల్ కుమార్ మృదంగ  కళాకారుడు.  తల్లి  దివ్య .. కవయిత్రి.

వీరు ఐదేళ్ళ  వయసు నుంచీ పాపను కర్ణాటక సంగీతం నేర్చుకునేలా చేశారు. ఇప్పటికీ వారానికి నాలుగు రోజులు సంగీతం నేర్చుకుంటుందట.

ఆమెలోని గాన ప్రతిభను డిస్కవరీ చేసి,  ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసినది-  ఆమె గురువుల్లో ఒకరైన కర్ణాటక సంగీత కళాకారుడు కులదీప్ ఎం.పాయ్. ఈయనది తమిళనాడు

కిందటి సంవత్సరం  మే- జూన్ లలో  సూర్య గాయత్రి పాడిన   ‘గణేశ పంచరత్నమ్ ’ వీడియో  ఫేస్ బుక్,  యూ ట్యూబ్ లో  పెట్టారు.

అది నాంది! 

అప్పట్నుంచీ ఆమె,  కులదీప్ లు  పాడిన పాటలు యూట్యూబ్ లో,  ఫేస్ బుక్ లో  విడుదలవుతున్న కొద్దీ  ఆమె గానంలోని ప్రత్యేకత ఎంతోమంది  శ్రోతలకు అంతకంతకూ  తెలుస్తూ వచ్చింది.      

సూర్య గాయత్రి పాటల ద్వారా  డబ్బు సంపాదించే  ఉద్దేశం  లేదనీ, అందుకే  వాణిజ్య పరంగా  ఆల్బమ్ లుగా,  సీడీలుగా చేసి  విక్రయించటం లేదనీ ఆమె గురువు  కుల దీప్ పాయ్  చెపుతున్నారు.

సంగీత కళ నేర్చుకునేలా పిల్లలకు ప్రేరణ కలిగించటం కోసం  యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్ లో  పెట్టి అందరూ  వినేలా చేస్తున్నారు.

ఇది చాలా మంచి విషయం!

*  *  *

మొదట ‘గణేశ పంచరత్నమ్ ’ విన్నాను.  సూర్య గాయత్రీ,  ఆమె గురువుల్లో  ఒకరైన  కుల్ దీప్ కలిసి  హుషారుగా పాడుతుంటే  తమాషాగా,   ఉత్సాహంగా అనిపించింది.

‘నాగేంద్ర హారాయ’ పాటను  ఈ  చిన్నారి అంకితభావంతో  సంలీనమైనట్టు పాడటం ఆకట్టుకుంది.

ఈమె  పాడినవన్నీ బాగున్నాయి.

వాటిలో  ప్రత్యేకంగా  నాకు బాగా నచ్చి,  రోజూ విన్నా తనివి తీరనట్టున్నపాటలు మాత్రం రెండు-

మొదటి పాట...  

‘‘శ్రీరామ చంద్ర కృపాలు భజ మన  హరణ భవ భయ దారుణం
నవ కంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం ...’’


శ్రీరాముడి ఘనతను వర్ణించే పాటన్నమాట.

రాసినవారు  పదహారో శతాబ్దికి చెందిన  సంత్ తులసీదాస్. 

ఇక్కడ  వీడియో  చూస్తూ  వినండి-   ఈ పాట విన్నాక.... యూ ట్యూబ్ లో  లతా మంగేష్కర్ పాడిన ఇదే పాట కూడా విన్నాను.

అయినా సూర్య గాయత్రి  పాటపై ఇష్టం తగ్గలేదు.

ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభావం ఏమైనా ఉండొచ్చు గానీ... చిన్నారి గాయని  ప్రతిభకు ఇది తార్కాణంగా భావిస్తున్నాను.

క నాకు అమితంగా నచ్చిన రెండో పాట (పోస్టులో నేను మొదట ప్రస్తావించింది దీన్ని గురించే) ... చాలా చిన్న బిట్!  

అక్కడున్న  లిరిక్ కూడా ఒకే ఒక వాక్యం!   ( ఒరిజినల్ పాట పెద్దదే గానీ,  ఇక్కడ ఈ పాప పాడింది మాత్రం ఈ  ఒక లైనే..)

‘‘జయ్  రఘునందన జయ్ సియారామ్   మన్ సే...  జప్ లే తూ  సీ తారామ్’’

దీన్ని సూర్య గాయత్రి ఐదు సార్లు  ప్రతిసారీ ఒక్కో రకంగా గానం చేస్తుంది. 

ఆ స్వరకల్పనలోని  సొగసును అద్భుత  గమకాలతో/ సంగతులతో  ఆమె ఎలా ఆవిష్కరించిందో విని ఆస్వాదిస్తేనే బాగుంటుంది.

పక్కన వాద్యసహకారం అందిస్తున్నవారే  కులదీప్ పాయ్. పాడటంలో  ఎంత ఈజ్
ఎంత సాధికారత
పాటలో  ఎంత  తీయదనమో గమనించారా?

ఇక  ఈ పాట నన్ను తన మాధుర్యంతో వెంటాడటం (హాంటింగ్ )  మొదలుపెట్టింది.

దీంతో   దీన్ని ఎవరు రాశారు? ఇంత శ్రావ్యంగా  సంగీతం కూర్చినదెవరు? అనే సందేహాలు మొదలయ్యాయి!
 
ఘరానా (1961) అనే హిందీ సినిమాలో  ఇదే పల్లవితో  ఆశా భోస్లే,  రఫీలు పాడిన ఓ  పాట ఉంది కానీ, అది పూర్తిగా వేరు.

ఒక ఆధారం ఉన్నపుడు వెదకటం  కష్టమేమీ కాదు  కదా?

పూర్తి  పాట దొరికింది, యూ ట్యూబ్ లో.

ఈ పాటను గాయని  దేవకీ పండిట్ ఎంతో బాగా పాడారు.  వేణువు, సితారల సమ్మేళనం హాయి గొలుపుతుంది !

సంగీత దర్శకుడి పేరు హేమంత్ మత్తాని   అని  తెలిసింది.  రచన కూడా  బహుశా ఈయనే.

ఈ పాట విన్నాక  కూడా సూర్య గాయత్రి పాట వినసొంపుగానే అనిపిస్తుండటం  విశేషమే కదా?

స్వరకల్పనలో  జోడించిన  చమక్కులు కూడా దీనికి  కారణం!

*  *  *
సూర్య  గాయత్రి  ఆధ్యాత్మిక గాయనిగా  పేరు తెచ్చుకుంటోంది.  ఇతర రాష్ట్రాల్లో కూడా  కచేరీలు ఇస్తోంది.  హైదరాబాద్, తెనాలి లాంటి చోట్లకు కూడా ఆమెను ఆహ్వానించి పాడిస్తున్నారు.


సెలబ్రిటీ హోదా :  ఇలాంటి  పెద్ద  హోర్డింగులూ  పెడుతున్నారు
ఆమెను  ఎమ్మెస్  సుబ్బులక్ష్మి వారసురాలిగా కీర్తించటం,
‘గాన సరస్వతి’ లాంటి బిరుదులివ్వటం,
సన్మానాలు చేయటం...
ఇవన్నీ అప్పుడప్పుడైనా జరుగుతున్నాయి. 

ఇంకా ఎంతో  నేర్చుకోవలసిన దశలో ఇలాంటి పొగడ్తలూ,  ప్రోత్సాహాలూ  అవసరం లేదు.

పైగా ఇవన్నీ  ఆమె ప్రగతికి ఎంతో కొంత అవరోధాలయ్యే అవకాశముంది.   

అందుకే  వీటిని పరిమితం చేయగలిగితే  ఆ బాల గాయని భవిష్యత్తుకే మేలు!

‘‘సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా ’’ అన్నాడు  త్యాగయ్య.

నిజానికి  సంగీత జ్ఞానం సంపాదించాలంటే  భక్తి (పాటల సాధన)  వినా మార్గం లేదు! 

త్యాగరాజు కీర్తనలైనా,  అన్నమయ్య రచనలైనా, రామదాసు భజనలైనా దేవుడి ఘనతను  కీర్తించేవే కదా!

దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన  పాటలు వింటూ  తన్మయత్వం చెందుతున్నారంటే...

అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి  భావన మూలంగా కాదు,

రస భరితమై అంతరంగాన్ని తాకే  సంగీత కళ వల్లనే!