సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, జూన్ 2016, గురువారం

నీడల ‘వెలుగులు’


వాల్ట్ డిస్నీ సంస్థ ఓసారి చిత్రీకరణ పూర్తయిన తమ యానిమేషన్ సినిమాను  రీషూట్ చేయించింది.

ఎందుకంటే...

సన్నివేశాల్లోని మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ లాంటి పాత్రలకు ‘నీడలు’ లేవని!

పొరపాటున నీడలు లేకుండా చిత్రించి,  చిత్రీకరించారన్నమాట.

నీడలు లేకపోతే ఏమైందీ... ఆ మాత్రం దానికి  రీషూట్ చేయించాలా,  మరీ చాదస్తం కాకపోతే.. అనిపిస్తోందా?

నీడ... అంటే సహజత్వం! 

ప్రకృతిలో నీడలు లేని రూపాలు నిర్జీవంగా ఉంటాయి.
నిర్జీవ వస్తువులయినా సజీవంగా కనిపించాలంటే నీడలు ఉండాల్సిందే.

అందుకే పెయింటింగ్ తరగతుల్లో  ‘స్టిల్ లైఫ్’ చిత్రాల ద్వారా నీడలను సహజంగా చిత్రించటం  నేర్పుతారు.  (ఈ పోస్టు మొదట్లో పెట్టిన  వర్ణచిత్రం చూడండి..)


కొన్ని ఆసక్తికరమైన  విశేషాలను ‘ఛాయామాత్రం’గానైనా  గుర్తుచేసుకుందామని ఈ పోస్టు! 


నను తాను  ఇష్టపడే లక్షణం మనుషుల్లో ఎవరికైనా ఉంటుంది.  ఆ  ‘స్వానురాగం’ మితిమీరితే మనస్తత్వశాస్త్రంలో  ‘నార్సిసిజమ్’ అంటారు. 

గ్రీకు పురాణకథల్లో  నార్సిసస్  అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడికి తన ‘అందమైన’ రూపం అంటే అవధుల్లేనంత ప్రేమ.  నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయి... దాన్ని  ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు.


కానీ ఆ ప్రయత్నంలో నీళ్ళలో పడి.. మునిగిపోయి  చనిపోతాడు. 

అతడి పేరు మీదే ‘నార్సిసిజమ్’వచ్చిందన్నమాట! 

 ప్రతిబింబం అంటే ఒకరకంగా  నీడే కదా?  స్వానురాగం మరీ ఎక్కువైతే  నీడలు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తాయన్నమాట..

*  *  *

కొన్ని దశాబ్దాల క్రితం మాట...

పశువులను మేత కోసం  ఊరి బయట పొలాల్లోకి తోలుకువెళ్ళే  ‘గొడ్ల కాడ బుడ్డోళ్ళ’కు మధ్యాహ్నం.. సాయంత్రం సమయాల్లో  ‘టైం’ఎంతయిదో అంతుబట్టేది కాదు.  తెచ్చుకున్న అన్నం తినేసేయాలన్నా,  గొడ్లకు నీళ్ళు తాగించాలన్నా, మళ్ళీ ఇళ్ళకు  తిరుగుముఖం పట్టాలన్నా!

వాచీలూ అవీ వాళ్ళ దగ్గర ఉండేవి కాదు మరి.

 అందుకని ఏం చేసేవారంటే ... తెచ్చుకున్న వెదురు ములుగర్రను ఎండకు ఎదురుగా  నేలమీద పాతేసి,  ఆ కర్ర  నీడ పొడుగును కొల్చేవారు. దాన్నిబట్టి ఏదో లెక్కవేసి,   మొత్తానికి సమయం దాదాపు సరిగ్గానే అంచనా వేసేవాళ్ళు. 

పల్లెటూరి జీవితంతో సంబంధమున్న.. . వ్యవసాయ కుటుంబంలో పుట్టినవారికి  ఇదో చిర పరిచిత అనుభవం.

*  *  *

‘మూగ మనసులు’ సినిమాలో   ‘నా పాట నీ నోట పలకాల..’ పాట అందరికీ తెలిసిందే.

‘‘నీటిలో నేను నీ-  నీడనే సూడాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల’’ 
అంటూ  నాయికా నాయకుల సరాగాలను అందంగా  రాశారు ఆత్రేయ. 

‘ఆత్మబలం’  సినిమాలో  ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ ఎంతో ప్రాచుర్యం పొందిన పాట కదా?  ఈ పాటలో ఆత్రేయ   ‘... చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి’  అని రాశారు. 

‘వానలో ఏ చెట్టుకైనా  నీడ ఉంటుందా?’ అనే సందేహం రాకూడదు ఇక్కడ.

నీడను  ‘లిటరల్’ గా తీసుకోకూడదు మరి!

*  *  *

షాపుల ముందు ప్రదర్శించే సైన్ బోర్డుల్లో అక్షరాలకు షేడ్ (నీడ) ఉండటం అందరికీ తెలిసిందే.  దానివల్ల ఆ అక్షరాలకు  ఓ  కళ వస్తుంది.

సినిమా లోగోల్లో  షేడ్స్ అన్నీ  సాధారణంగా కుడివైపు తిరిగివుంటాయి. 

తెలుగు దినపత్రిక ‘ఈనాడు ’ లోగోలో  షేడ్  మాత్రం విభిన్నంగా ఎడమవైపు తిరిగివుంటుంది.  


ఈ లోగో-  నాకు తెలిసి-  కళాత్మకమైన ఒరిజినల్  డిజైన్.

గుండ్రని తెలుగు అక్షరాలను  పలకలుగా రాయటం ఓ వైవిధ్యమైతే  షేడ్ బయట మాత్రమే కాకుండా... లోపలివైపు కూడా ఉండటం మరో విశేషం. 

అక్షరాలకు లోపల తొలిచినట్టు బోలుగా (లోతుగా)  ఉన్న ప్రాంతంలో  ఏటవాలు గీతలూ,  లోపలి షేడూ  చాలా ప్రత్యేకంగా ఉంటాయి.


‘ఈనాడు’ 1974లో ప్రారంభమైంది.  మరో ఆరేళ్ళకు...  1980లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో  వచ్చిన   ‘సర్దార్ పాపారాయుడు ’ సినిమా లోగోను  ‘ఈనాడు’ దినపత్రిక లోగో ను అనుకరించి డిజైన్ చేశారు ... ‘పాపారాయుడు ’ అనే అక్షరాలను!
తర్వాత  ఇదే చిత్ర నిర్మాత క్రాంతికుమార్  తీసిన ‘కిరాయి రౌడీలు’ సినిమా డిజైన్ కూడా ఇలాగే ఉంటుంది.


దాసరి నారాయణరావు 1979లో  ఓ ప్రయోగాత్మక చిత్రం  ‘నీడ’ తీశారు.  హీరో కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు  టీనేజ్ నటుడిగా పరిచయం అయింది ఈ సినిమా ద్వారానే. ( మహేశ్ కూడా చిన్నపాత్ర వేశాడట, ఈ సినిమాలో..) 

ఇంతకీ ఈ సినిమా లోగో  అర్థవంతంగా,  ప్రత్యేకంగా ఉంటుంది. 


 దే సంవత్సరం బాలచందర్ ఓ సినిమా తీశారు.  అది  ‘గుప్పెడు మనసు’.

ఆ సినిమా పబ్లిసిటీ డిజైనర్ గా గంగాధర్ పనిచేశారు. (సినిమా టైటిల్స్ లో మాత్రం వేరే పేరు ఉంటుంది).ఈ సినిమా విడుదలైన కొత్తలో  విడుదల చేసిన వాణిజ్య ప్రకటనల్లో  ‘ముఖ్యంగా టైటిల్స్ మిస్ కాకండి’ అని ఉండేది... !

ఆ ప్రకటనను  దినపత్రికల్లో ప్రతిరోజూ   ఆసక్తితో చూసేవాణ్ణి.

చేతి వేళ్ళ నీడలతో రకరకాల జంతువుల ఆకారాలు వచ్చే  డిజైన్లతో రోజుకోరకంగా  ఆ ప్రకటనలు ఉండేవి.  సినిమా గురించి ఆసక్తీ, ఉత్సుకతా ప్రేక్షకులకు కలిగేలా ఉండేది ఆ పబ్లిసిటీ. 

ఆ సినిమాను నేను  అంత త్వరగా చూడలేకపోయాను కానీ...  చూసినపుడు మాత్రం  టైటిల్స్ ను  మిస్ కాలేదు!
 
కథానాయిక  సరిత చేసే హ్యాండ్ షాడో పప్పెట్రీ తో సినిమా మొదలవుతుంది.

రకరకాల  జంతువుల, పక్షుల ఆకారాలూ,  ఓ జంట  ప్రేమ సన్నివేశం,  రాజకీయ నాయకుల ఆకారాలతో ఆ ఛాయా విన్యాసం ఆకట్టుకుంటుంది.

దాన్ని ఇక్కడ చూడవచ్చు. (టైటిల్స్ వరకూ చూడండి.. ఓ నాలుగు నిమిషాలుంటుంది, అంతే..) 

 
 
ఆ  సినిమా పబ్లిసిటీ  ప్రభావంతో...  లైటు వెలుగులో గోడల మీద చేతి వేళ్ళతో  ఒకటి రెండు జంతువుల,  పక్షుల ఆకారాలను తెప్పించటానికి  నేనూ ప్రయత్నించేవాణ్ణి. 

కుక్కలాంటి  ఆకారాలు తెప్పించటం చాలా సులువే కానీ...  కుందేలు లాంటి  జంతువుల ఆకారాలు తెప్పించటం కొంచెం కష్టమే.. 
చేతివేళ్ళ అమరికల ద్వారా  రకరకాల రూపాలుగా మారిపోయిన నీడలు-   ఇక్కడ చూడండి.  
నీడ  అంటే  దాని ఒరిజినల్ ఆకారాన్నే  ప్రతిఫలించాలి కదా?. కానీ  నీడ పడే స్థలాన్ని బట్టి వేరే ఆకారం... అనూహ్యమైన ఆకారం కూడా రావొచ్చు.

అలా ఒరిజినల్ రూపానికి భిన్నంగా, గమ్మత్తుగా  ఉండే కొన్ని నీడలు...


‘‘చూడు, చూడు , నీడలు !
సూర్యునితో క్రీడలు !
సూర్యునిలో సూదులతో
క్రీడలాడు నీడలు !’’ 
  అన్నారు  శ్రీశ్రీ. 

కిరణాలను సూదులతో పోల్చి,   సూర్యుడితో  నీడలు  క్రీడలాడతాయని  వర్ణించటం...  బాగుంది కదూ?