రంగనాయకమ్మ గారు రాసిన కొత్త పుస్తకం ఇది! తాజాగా విడుదలైంది.
విశేష ప్రాచుర్యం పొందిన ఈ ‘భరత ఖండంబు...’ పద్యం ఎవరు రాశారనే దానిపై ఈ మధ్య వివాదం రేగిందని చాలామందికి తెలుసు.
దీని గురించి వెలువడిన రెండు పక్షాల వాదనలనూ పరిశీలించి, రంగనాయకమ్మ గారు ఈ చిన్న పుస్తకం రాశారు!
ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారని మనమందరం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. కానీ నిజానికి ఆయన రాయలేదనీ, చెన్నాప్రగడ భానుమూర్తి గారు ఈ పద్యం రాశారనే వాదన- వివాదానికి కేంద్రం.
విశేషమేంటంటే....చిలకమర్తి గారూ, భానుమూర్తి గారూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఊళ్ళో, ఒకే బళ్ళో కలిసి చదువుకున్నారు కూడా. చిలకమర్తి గారు రాసిన ఒక నవలను భానుమూర్తి గారు నాటకంగా మార్చారు. భానుమూర్తి గారు చిన్నప్పట్నుంచీ పద్యాలు రాసేవారనీ, ఆయన్ను చూసే తను కవిత్వం రాయడం మొదలుపెట్టాననీ చిలకమర్తి గారు స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.
అసలు ఈ పద్యం ఎవరిదనే విషయం గురించిన వివాదం ఈ ఇద్దరి జీవించి ఉన్నపుడు రాలేదు. కాబట్టి ఈ వివాదంతో వారిద్దరికీ సంబంధం లేదు. భానుమూర్తి గారు 1947లో చనిపోతే; చిలకమర్తి గారు అంతకంటే ఏడాది ముందే కన్నుమూశారు.
1959లో ఈ వివాదానికి బీజం వేసింది పోతుకూచి సూర్య నారాయణ గారు. అప్పట్లో ఆయన ‘సాహితీ కౌముది’ అనే పత్రికకు రాసిన ఉత్తరంలో దీన్ని ప్రస్తావించారు. కానీ ‘ఉపపత్తులు’ (ఆధారాలు) చూపమని ఆ పత్రిక వారు అడిగితే... ఇప్పటిదాకా మౌనం వహించి, ఉండిపోయారు.
ఈ సంవత్సరం మార్చిలో కరణం సుబ్బారావు గారి ‘ఈ పద్యాన్ని వ్రాసిందెవరు?’ పుస్తకం తో ఈ వివాదం ఇన్నేళ్ళ తర్వాత మొదలయింది.
‘‘వంద సంవత్సరాల నాటి పద్యం నా కంట పడింది. అంతే. దాని వెంట పడ్డాను. నా పంట పండింది.’’ అన్నారాయన.
ఆయన వాదనను ఖండిస్తూ ఈ పద్యం చిలకమర్తిదే అని వాదించేవారి ప్రతినిధిగా దివాన్ చెరువు శర్మ గారు నిలబడ్డారు.
ఈ సంవత్సరం మే, జూన్ నెలల్లో రాజమండ్రిలో రెండు వర్గాల వారూ పోటాపోటీగా సభలు జరిపారు. తర్వాత ఈ రెండురకాల వాదనలను చెపుతూ పుస్తక రూపంలో రాని అచ్చు, రాత ప్రతులు కూడా విడుదలయ్యాయి.
ఈ వివాదం మీద ఆసక్తితో రంగనాయకమ్మ గారు ఆ సమాచారాన్నంతా సంపాదించి పరిశీలించారు. చిలకమర్తి, భానుమూర్తి గార్ల రచనలు కూడా ఈ సందర్భం కోసం చదివారు.
‘‘ప్రారంభంలో నేను, ఇటూ అటూ ఎటూ కాదు. కానీ, చివరికి నేను కూడా ఒక అభిప్రాయానికి వచ్చాను’’ అంటూ రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో చెపుతారు. వివాదానికి కేంద్రమైన పద్యానికి ఉన్న దీర్ఘ చరిత్రను ఐదారు ఘట్టాలుగా చెపుతూ పరిశీలన సాగించారు.
కూలంకషంగా ఈ వివాదాన్ని చర్చించారు... ఒక్కొక్కరి వాదనలోని వైరుధ్యాలనూ, లోపాలనూ బట్టబయలు చేస్తూ!
‘‘ఏ ఆధారాలూ లేని మార్పుల్ని చూసి సందేహాలు పడి మౌనాలు వహిస్తే, ఆ మౌనాలే ఆధారాలా?’’
‘‘నాలుగు రాళ్ళు విసిరితే, ఏదో ఒక రాయి తగలకపోతుందా- అనే ఆశ ఇది! కానీ ఇక్కడ డజను పైగా రాళ్ళు విసిరినా, ఏదీ లక్ష్యాన్ని తాకకుండానే కిందపడ్డాయి’’.
సీరియస్ వాదనకు కూడా అక్కడక్కడా హాస్య గుళికలను జత చేయటం రంగనాయకమ్మ గారి ముద్ర. పుస్తకంలో రెండు మూడు చోట్ల ఇది కనిపిస్తుంది.
చర్చ కొనసాగిస్తూనే... దానిలో భాగంగా చిలకమర్తి, భానుమూర్తి గార్ల ఊహాత్మక సంభాషణలు రాశారు. వాటిని చదువుతుంటే తెగ నవ్వొచ్చేస్తుంది!
ఇలాంటి పరిశీలనా వ్యాసాన్ని శ్రద్ధగా రాయటం ఒక ఎత్తయితే, స్పష్టంగా ఆసక్తిగా కూడా మలచటం మరో ఎత్తు. రంగనాయకమ్మ గారు ఇదంతా అలవోకగా సాధించగలరని మరోసారి నిరూపిస్తుందీ పుస్తకం.
ఇంతకీ- రంగనాయకమ్మ గారు ఆ పద్యం ఎవరిదని అభిప్రాయపడ్డారు చివరకు ? ఇదే కదా మీ సందేహం?
అది తేల్చుకోవాలంటే... చదవాల్సిందే ఈ పుస్తకం!
20 రూపాయిల వెల ఉండే ఈ పుస్తకం కాపీలు విశాలాంధ్ర లాంటి పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. అక్షరాల ఫాంట్ రెగ్యులర్ సైజులో కాకుండా కాస్త పెద్దగా ఉండటం వల్ల చదవటం తేలిగ్గా అనిపిస్తుంది.
ఈ పుస్తకం షాపుల్లో దొరకనివాళ్ళు - అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ- 520 002 (ఫోన్: 0866-2431181) వారిని సంప్రదించొచ్చు!
తాజా కలం: ఇది చిన్న పుస్తకం కదా? అందుకే దీన్ని ‘అసమానత్వంలో నించి అసమానత్వంలోకే’ పుస్తకంలో కలిపేశారు.
కినిగెలో ఈ-బుక్ కొనుగోలు చేయాలంటే ఈ లింకు చూడండి-
http://kinige.com/kbook.php?