సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

25, మే 2009, సోమవారం

వెన్నెలా... వేణువూ !


 ల్లని వెన్నెల్లో వేణు గాన మధురిమలు విన్నారా ఎపుడైనా?

వేణువుకు మరో పేరు ...హరిప్రసాద్ చౌరాసియా. 

ఆ పేరు వినగానే తెలుగువాళ్ళకు ‘సిరివెన్నెల’ స్ఫురిస్తుంది.

ఈ సినిమా విజయవాడలో నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో 1986 లో వచ్చింది. ఆ సినిమా చూడ్డానికి ‘దుర్గా కళామందిర్’కు వెళ్ళినపుడు అప్పుడే గాయని పి. సుశీల గారు ఆ సినిమా చూసి, బయటకు వచ్చారు.

చూడగానే గుర్తుపట్టాను.  కానీ ప్రేక్షక దేవుళ్ళెవరూ ఆమెను గుర్తించినట్టు లేదు.

అయినా పలకరించటానికీ, పరిచయం చేసుకోవటానికీ అది సమయమూ, సందర్భమూ కాదు కదా? మౌనంగా   చూస్తూ ఉండిపోయాను.

‘సిరివెన్నెల’ పాటలు చాలా బావుంటాయని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సుశీల గారు పాడిన వాటికొస్తే...
‘చందమామ రావే...’, 
‘విధాత తలపున ప్రభవించినదీ... విరించినై విరచించితినీ ఈ కవనం..’ 

వీటితో పాటు -

‘ఈ గాలీ... ఈ నేలా..’ పాటలు చెప్పుకోవాలి.

ఈ పాటల్లో ఆమె గొంతు చాలా బాగుంటుంది కూడా.


‘ఈ గాలీ... ఈ నేలా..’ పాట ఎత్తుగడే వేణువుతో... మంద్రం నుంచి అంతలోనే ఉచ్ఛస్థాయికి హఠాత్తుగా మారిపోతూ,  అద్భుతంగా మొదలవుతుంది కదా?

బాలూ పాడిన చరణాలు పూర్తవుతూ, ‘ఈ రాళ్లే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను...’ తర్వాత....

వేణువు నుంచి జాలువారే రస ఝరులు ఏకధాటిగా పొంగిపొరలి,  శ్రోతల మనసులను రసప్లావితం చేస్తాయి.

తర్వాత ‘కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై...’ అంటూ సుశీల గళం నుంచి అమృత వర్షిణి కురుస్తుంది. ‘ఈ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే’ అంటూ వీనులవిందు చేస్తుంది.

మాటలకందని అనుభూతికి పరాకాష్ఠగా ఆ పాట చిత్రీకరణను అభివర్ణించవచ్చు.


సంగీత సాహిత్యాల సమ్మోహన సమ్మేళనంతో పరవశింపజేసే ఆ పాటలు సహజంగానే మనసుకు పట్టేశాయి. అవి టేప్ రికార్డర్, కాసెట్ల రోజులు కదా?

పాటలన్నీ కంఠతా వచ్చేసినా పదే పదే వినటానికని క్యాసెట్ కొన్నాను.

‘రూము’కి వెళ్ళి ప్లే చేశాను. ‘ఈ గాలీ.. ఈ నేలా..’ మొదలైంది. బాలూ పాడిన చరణాలు పూర్తయ్యాయి.
ఇక వేణు గాన వాహిని మొదలవ్వాలి కదా, ఎదురుచూస్తున్నాను.

అలా జరగలేదు.

వేరే పాట ఆరంభమైపోయింది!

ఇక ఊహించుకోండి, నా అవస్థ. ఎంత నిరాశపడిపోయానో చెప్పలేను.


‘లిరిక్ లేదు కదా, ఎందుకూ ఈ ఫ్లూటు గోల... స్పేస్ వేస్ట్..’ అనుకుని, వేణు గానాన్ని నిర్దయగా తొలగించివుంటారేమో క్యాసెట్ తయారుచేసినవాళ్ళు !

(వాళ్ళు కొంచెం ఓపికపట్టి వినుంటే... సుశీల గారు పాడిన లిరిక్ వినపడివుండేది. అప్పుడైనా వేణుగానం వరకూ కట్ చేసుండేవాళ్లంటారా? ... అదీ నిజమే).

సినిమాలోనే ‘ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో... పదము కదిపితే ఎన్నెన్ని లయలో...’ అనే పాట నాకు బాగా ఇష్టం.

ఎందుకో చాలామంది ఈ పాటను అంతగా పట్టించుకున్నట్టు కన్పించదు.

ఆ పాటలో...
‘అలల పెదవులతో
శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడువేళ
పుడమి హృదయంలో ’  అనే చరణం నాకెంతో ఇష్టం.

కాలేజీ స్నేహితులతో కలిసి విశాఖపట్నం సాగరతీరం వెళ్ళినపుడు అక్కడి రాళ్ళపై విరిగిపడే సముద్ర కెరటాలను వీక్షిస్తూ నేను ఈ చరణాలనే తలపోశాను; మిత్రులకు చెపుతూ ఆహ్లాదించాను.

కొన్నేళ్ళ తర్వాత హరిప్రసాద్ చౌరాసియా విజయవాడలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రోగ్రాం ఇచ్చారు.

వెళ్ళకుండా ఎలా ఉండగలను?  చౌరాసియా గారిని చూసి చాలా సంతోషించాను.

పిల్లనగ్రోవి ఆయన దగ్గర ఎన్ని విన్యాసాలు చేసిందనీ...! 

ప్రశాంతంగా నె...మ్మదిగా ప్రారంభమై సెలయేటిలా సాగిపోయిన ఆ వంశీ రవం-
 అంతకంతకూ మధురమై, 
మధుర తరమై, 
మధుర తమమై 
చివరకు జలపాత సదృశమై 
...  అమిత వేగాన్ని సంతరించుకుంది.

చౌరాసియా గారు ‘తానే వేణువై...’ శ్రోతలను మంత్రముగ్ధులను చేశారంటూ మా సీనియర్ జర్నలిస్టు పేపర్లో ఎంతో చక్కగా రాశారు.


‘సిరివెన్నెల’ సినిమాలో...
 అంధబాలిక (మీనా) కు వెన్నెల దర్శనమవుతుంది- 
వేణుగాన మాధుర్యంతో.

విద్యుద్దీపాలు చీకటితో పాటే వెన్నెలనూ తరిమేసే ఈ రోజుల్లో ... ఆ కౌముదిని చూస్తూ ఆనందించాలంటే .. ఆ అవకాశముండాలంటే డాబా ఇల్లుండాలి మనకు.

ఇరుకిరుకు అపార్ట్ మెంట్లలో ఆకాశమే కనిపించని చోట నివసించేవారికి చందమామే కనిపించదు.

ఇక ఆ అందని చందమామ వెన్నెలను మాత్రం ఎలా అందిస్తుంది?

కొంత ఉపశమనంగా ‘సిరివెన్నెల’ పాటలు వింటూ శరత్ జ్యోత్స్నను... ఊహించుకోవచ్చు! 

ఇళయరాజా - చౌరాసియాల ఇన్ స్ట్ర్రుమెంటల్ ఆల్బమ్ ‘నథింగ్ బట్ విండ్’ కూడా...
అలాంటి అనుభూతినే ఇస్తుంది!

22, మే 2009, శుక్రవారం

పరిమళించిన జ్ఞాపకాలు
మీ గతంతో సంబంధమున్న ఏ ప్రదేశానికైనా ఏళ్ల విరామం తర్వాత మీరెప్పుడైనా వెళ్లారా?

నేను వెళ్ళాను...
కరిగిపోయిన బాల్యాన్ని వెతుక్కుంటూ , కొద్ది రోజుల క్రితం!

కాల యంత్రంలో వెనక్కి... 29ఏళ్ళ వెనక్కి వెళ్ళిన అనుభూతి ....

చిన్నతనపు అమాయకపు రోజులతో అనుబంధమున్న ఆ పరిసరాలు మౌనంగా పలకరిస్తూంటే ఓ క్షణం కళ్ళు చెమర్చినట్టనిపించింది.

రేపటి కోసం ఎక్కువ తాపత్రయపడటం, పాత విషయాల తలపుల్లో మునిగిపోవటం... ఈ రెండూ మంచి లక్షణాలు కాదంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

వర్తమానంలో... ఈ క్షణంలో జీవించాలని హితవు చెప్తారు.


కానీ... గతమెప్పుడూ మధురమే. 

చేదు అనుభవాల జాడలను ‘కాలపు కడలి’ కెరటాలు తుడిచిపెట్టేస్తాయి. ఒకవేళ వాటి ఛాయలున్నా వాటిలో ఒకప్పటి సాంద్రత ఉండదు కదా?

అందుకే... ఒక్కసారి గతంలోకి తొంగిచూసి, జ్ఞాపకాలు తడిమిచూసుకోవటం ఎవరైనా ఇష్టపడే విషయమే !

మాతృశ్రీ సంస్కృత పాఠశాల నేను చదివిన స్కూలు పేరు. 
అది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గరున్న జిల్లెళ్ళమూడి అనే ఓ పల్లెటూరిలో ఉంది.

మా స్కూలు సంస్కృత కళాశాలకు అనుబంధం. స్కూలు పిల్లలూ, కాలేజీ విద్యార్థులూ కలిసే ఉండేవారు.

ఆ కళాశాల లెక్చరర్ ఝాన్సీ గారు. చాలా బాగా పాడతారు. ‘శంకరాభరణం’ సంగీత ఝరి రాష్ట్రాన్నీ, దేశాన్నీ ముంచెత్తుతున్న కాలంలో సంగీత కళకు పునర్వైభవం వచ్చింది కదా?

ఆ తరుణంలో...

‘సరళీ స్వరాల’ ఊసు కూడా తెలీని నాకు శాస్త్రీయ సంగీతం నేర్పించాలని ఝాన్సీ గారు ప్రయత్నించారు. నా గాత్రం బావుందనీ, ట్యూనింగ్ సెన్స్ ఉందనీ  ప్రోత్సహించారు.

కారణాంతరాల వల్ల ఆ అవకాశం వినియోగించుకోలేకపోయానప్పుడు.

ఇన్నేళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి, బాల్య మిత్రులను కలుసుకోవటంతో పాటు ఆమెకు కృతజ్ఞత తెలుపుకోవటం కూడా నా ఎజెండాలో భాగంగా నిర్దేశించుకున్నాను.

ఇప్పుడా ఊరికి వెళ్ళాను హైదరాబాద్ నుంచి!


ఝాన్సీ గారిని కలిసి, పూర్వ విద్యార్థిగా పరిచయం చేసుకున్నాను. పాత సంగతులు చెప్పాను.

ఆ ఊళ్ళోనే  సెలవుల్లో జరిగిన  ఓ సరదా ఫంక్షన్లో  ఆమె  ‘జోరు మీదున్నావు తుమ్మెదా’  పాటను పాడిన ఘట్టాన్ని నేను గుర్తు చేశాను.

మరపున- మరుగున పడిపోయిన  ఈ  జ్ఞాపకాన్ని అనూహ్యంగా  వెలికితీసేసరికి  ఆమె  షాకయ్యారు!

ఎందుకంటే అది జరిగి, దాదాపు మూడు దశాబ్దాలవుతోంది.

గాయని సుశీల గారు కూడా పాడటానికి ఇబ్బంది పడిన ఆ ‘శివరంజని’ పాటను ఆమె శ్రావ్యంగా, అలవోకగా పాడిన ఘటనను చెపితే, స్ఫురణకు తెచ్చుకున్నారు.

నాకు సంగీతం నేర్పటానికి ఆమె ప్రోత్సహించిన సంగతి గుర్తు చేశాను.

ఆసక్తిగా విన్నారు.


ఝాన్సీ గారు సంస్కృత సాహిత్యంలో, వ్యాకరణాల్లో అభినివేశమున్నవారు. అధ్యాత్మ - వాల్మీకి రామాయణాలను సంస్కృతంలో తులనాత్మకంగా అధ్యయనం చేసి, డాక్టరేట్ సాధించిన పరిశోధకురాలు. అంతటి వ్యక్తి నా చిన్ననాటి చిన్న జ్ఞాపకాన్ని, ఆమె ప్రమేయమున్న సంఘటనలను గుర్తు చేయగానే కదిలిపోయారు. 

‘మధుర జ్ఞాపకాలను’ గుర్తు చేశానని ఎంతో సంతోషపడ్డారు. నా వివరాలన్నీ అడిగారు. ‘ఇంత ఆసక్తి ఉంది కదా, సంగీతం ఇప్పుడైనా నేర్చుకోవచ్చ’ని సాంత్వన వచనాలు పలికారు.

నా కోరిక ప్రకారం ఆమె ఓ లలిత గీతం ఆలపించారు. 

ఆమె పాడుతుంటే 29ఏళ్ళ క్రితం ఒద్దికగా నేలమీద కూర్చుని ఎలా విన్నానో, అలా కూర్చుని ఆలకించాను. కామెరాతో ఝాన్సీ గారి  ఫొటో తీసుకున్నాను. ‘సాయం చేయబోయిన వ్యక్తికే ఇంత విలువ ఇచ్చినపుడు నిజంగానే సాయం చేసిన వ్యక్తికి మరింత విలువ ఇవ్వాలి కదా?’ అని మీరు అనవచ్చు.

ఇక్కడ సాయం చేయటానికీ, చేయటానికి ప్రయత్నించటానికీ (స్వీకరించే వ్యక్తుల కోణంలోంచి చూస్తే ) పెద్ద భేదం ఉందనుకోను.

సాటి మనిషికి మేలుచేయాలనే సంకల్పం, స్పందన, కన్సర్న్... ఇవే ముఖ్యం.

స్కూలు రోజుల్లోనే, అదే ఊళ్ళోనే నేను పంట కాలవలో ఈత నేర్చుకుందామని వెళ్లి, మునిగిపోతుంటే నా ప్రాణాలు కాపాడాడో మిత్రుడు. ప్రాణదానం చేసిన అతనికి నేనెంత విలువనివ్వాలి?

జీవితంలో అతన్ని ఏ  క్షణమైనా విస్మరిస్తే అది ఎంతో అపరాధమవుతుంది కదా?


బాల్యపు జాడలను అన్వేషిస్తూ సాగించిన 
నా ఈ పర్యటనలో
అతడు...
ఆదినారాయణ
నా పక్కనే, తోడుగానే ఉన్నాడు !

18, మే 2009, సోమవారం

వెండితెర నవలలు ఎందుకిష్టం?


‘అందాల రాముడు’ సినిమా చూడకముందు దాని వెండితెర నవల చదివాను.
ఈ సినిమాకు మాటలు రాసింది ముళ్ళపూడి అయినా నవలీకరణ మాత్రం ఎమ్వీయల్. (ఆయన నూజివీడులోని ‘మా’ డీఏఆర్ కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆయన పాఠాలు మిస్సవకూడదనే ఇంటర్లో నేను సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం బదులు తెలుగు తీసుకున్నాను. అంతకుముందు మూడు సంవత్సరాలు సంస్కృతం నేర్చుకునివుండి కూడా!). ఎమ్వీయల్ గారు ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘యువజ్యోతి’ కాలమ్ నిర్వహించిన సంగతి చాలామందికి తెలుసు. పాఠకుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఎంత ‘సటిల్’ గా ఉండేవో.
‘అందాల రాముడు’ సంగతికొస్తున్నా....
ఇక ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తానా అని అవకాశం కోసం ఎదురుచూశాను. తీరా ఆ సినిమా చూశాక అసంతృప్తి కలిగింది చాలా చోట్ల. చదివేటప్పుడు నేను ఎంజాయ్ చేసిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరణలో పేలవంగా తోచాయి.
ఇక్కడ దర్శకుడి ప్రతిభను తక్కువ చేయటం కాదు. అక్షర రూపంలోని ఘట్టాలను పాఠకులు తమ తమ ఊహా ప్రపంచాల్లో అందంగా, రసవంతంగా అనువదించుకుంటారు. ఉన్నతీకరించుకుంటారు. వాటికి దీటుగా చిత్రీకరణ చేయటం ఎవరికైనా కత్తి మీద సామే. (పాఠకుల ఊహలకంటే మించి చిత్రీకరణ చేయగలిగినవారు ఉండరని కాదు; కానీ అది చాలా అరుదు).

వెండితెర నవలలు నాకు చాలా ఇష్టం. మీరు ఒకే సినిమావి డీవీడీ, నవలా చూపించి, ‘ఏది కావాలో కోరుకో’ అంటే ముందు నవలే తీసుకుంటాను. అది నచ్చితేనే డీవీడీ కావాలంటాను.

‘శంకరాభరణం’ సినిమా సంచలనం సృష్టించిన తొలినాళ్లలోనే ఆ సినిమా వెండితెర నవల విడుదలైంది. రాసింది వంశీ. ఆయన ఆ సినిమాకు అసోసియేట్ దర్శకుడు. నిర్మాతలైన పూర్ణోదయా వారే ఈ నవలను ప్రచురించారు. చాలా అందంగా ఉంటుందా పుస్తకం. చక్కని వర్ణచిత్రాలూ, అందమైన ముద్రణా. ఆ పుస్తకాన్ని అక్కడక్కడా చూడటమే కానీ చదవటానికి వీల్లేకపోయిందప్పుడు. (అప్పుడు స్కూలు విద్యార్థినే కదా.. నచ్చిన పుస్తకం కొనుక్కునేంత అవకాశమెక్కడా?) తర్వాత కాలంలో ‘శంకరాభరణం’ నవల చదివాను. కానీ అది రెండో ముద్రణ. బయటివారు ప్రచురించారు. వర్ణచిత్రాలు లేవు. అందమైన గెటప్ కూడా లేదు. అయినా వంశీ కథనం చాలా నచ్చేసింది.
చిత్రరూపకల్పనలో పాత్ర ఉన్న వ్యక్తి వెండితెర నవల రాస్తే ఎంత బాగుంటుందో చెప్పటానికి ఈ నవల ఓ చక్కని ఉదాహరణ. ఇది చదివి, వంశీ
అభిమానినైపోయాను. (ఇప్పటికి దాదాపు ౩౦ సంవత్సరాలు గడిచినా ఆనాటి ‘శంకరాభరణం’ నవల ఇంకా నాకు దొరకనే లేదు.)

తర్వాత తర్వాత ‘మంచుపల్లకీ’తో మెగాఫోన్ పట్టుకున్న వంశీ పూర్ణోదయాలోనే ‘సితార’ మీటిన సంగతి వేరే గుర్తు చేయనక్కర్లేదు కదా? కొన్నేళ్ళ తర్వాత విజయవాడలో వంశీని కలిశాను, జర్నలిస్టు అవతారమెత్తి.
మిమ్మల్ని కలుసుకోవటానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ సాకు గానీ అదంత ముఖ్యం కాదని చెప్పా. వంశీ అభిమాని తప్ప వేరే ఎవరూ అడగలేని నా ప్రశ్నలకు చాలా సంతోషపడ్డారాయన. ( ఇంటర్వ్యూ లు ఇవ్వటం వంశీకి అసలు ఇష్టం ఉండదు).

ఇంతకీ విషయం వెండితెర నవల్లు కదా? దానికే పరిమితమవుతా. వంశీ వీటిని రాయటానికి స్ఫూర్తి ముళ్ళపూడి వెంకటరమణ గారి వెండితెర నవలలు. వంశీ రాసిన మిగతా వెండితెర నవలలు తాయారమ్మ-బంగారయ్య, శుభోదయం. మొదటిది పుస్తక రూపంలో రాలేదట. రెండోది చదివే అవకాశం నాకు రాలేదు.

‘గుండమ్మ కథ’, ‘గోరంత దీపం’ నేను చదివిన మరికొన్ని నవలలు.

వెండితెర నవలల గురించి ఆంధ్రజ్యోతి వీక్లీ 2005అక్టోబరు 9న ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. రచన- వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, పులగం చిన్నారాయణ. ఆ వ్యాసం చదివితే చాలా వివరాలు తెలుస్తాయి. అంత పాత వీక్లీ ఇప్పడు దొరకటం కష్టమే. కానీ మీది హైదరాబాద్ అయితే... ఆబిడ్స్, కోఠీ పేవ్ మెంట్ల మీదా; విజయవాడ అయితే లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ పాత పుస్తకాల షాపుల దగ్గరా వెతికితే దొరక్కపోదు.
ఈ వీక్లీ దొరక్కపోయినా అలనాటి ‘శంకరాభరణం’ రంగుల నవల దొరకొచ్చు. అది దొరికితే మాత్రం నాకు వెంటనే చెప్పేయండి! సరేనా?

PS: ‘వంశీ వెండితెర నవలలు’ నవలా సంపుటి ముఖచిత్రాన్ని తాజాగా జత చేస్తున్నా. ( వ్యాఖ్యలో ఈ పుస్తకాన్ని ప్రస్తావించిన సుజాత గారికి ధన్యవాదాలు. )