సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, మే 2011, గురువారం

తిలక్ కవిత ‘తపాలా బంట్రోతు’

  తిలక్


జాజిమల్లి గారు నిన్న రాసిన  టపా  లో,  తర్వాత సుజాత గారి బజ్ లో ఉత్తరాల గురించీ, పోస్ట్ మాన్ గురించీ చర్చ నడిచింది. ఈ సందర్భంలో సహజంగానే  తిలక్ రాసిన  ‘తపాలా బంట్రోతు’  ప్రస్తావన వచ్చింది.

సతీష్, మరికొందరు  దీనికోసం ఆన్ లైన్లో వెతికారు.  ఆన్ లైన్లో చదువుకోడానికి పూర్తి కవిత  అందుబాటులో లేదు.

అదే బజ్ లో ‘అమృతం కురిసిన రాత్రి’లోని కొన్ని కవితల లింక్ ను  జ్యోతి గారిచ్చారు. కానీ  దానిలోనూ  ఈ ‘తపాలా బంట్రోతు’ లేదు.

అందుకే...  తిలక్ రాసిన ఆ కవితను అందరూ చదువుకోడానికి వీలుగా ఇక్కడ టపాలో ఇస్తున్నాను. (ప్రచురణ కర్తలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సౌజన్యంతో...) 

కవితల పుస్తకం ఈ - బుక్ గా  కినిగె సైట్ లో ఈ లింకులో  లభిస్తుంది.   http://kinige.com/kbrowse.php?via=author&name=Devarakonda+Balagangadhara+Thilak&id=216
--------------------------------------------------------------------
తపాలా బంట్రోతు 

మైడియర్‌ సుబ్బారావ్‌
కనిపించడం మానేశావ్
(విటీ... పోస్టుమాన్‌ మీద గేయం వ్రాయాలా!

అందమైన అమ్మాయి మీద కాని
చందమామ మీద కాని
వంద్యుడైన భగవంతుడి మీద కాని అ
వంద్యుడైన ధీరనాయకుడు మీద  కాని
పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే
ఎక్కడి పోస్ట్‌మానో యీ  గోల
 ఈ సాయంత్రం వేళ

ధనవంతుణ్ణి స్తుతి చేస్తే
పది డబ్బులు రాలుతాయి
సచివోత్తముణ్ణి స్మరిస్తే
పదికళ్ళు మనమీద వాలుతాయి
ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావ్
ఉత్త పోస్టుమేన్ మీద ఊహలు రానేరావు

మూడవ పంచవర్ష ప్రణాళిక
ఏడవ వన మహోత్సవ దినం

బిర్లా దాల్మియా
సినీమా దలైలామా
యుద్ధం పరమార్థం
రాజులూ, రాజ్యాలూ, తారుమార్లూ
ఇటువంటివి చెప్పు
మరి చూడు నా తడాఖా

మృదు మాధ్వీ పదలహరీ
తరంగ మృదంగ విలసద్భంగీ
మనోహరాలౌ కావ్యాల్ గేయాల్
కొల్లలుగా వ్రాస్తాను

కానీ, తపాలా బంట్రోతు మీదా
హవ్వ!
ఎండలో వానలో
ఎండిన చివికిన
ఒక చిన్నసైజు జీతగాడు
చెవిలో పెన్సిల్
చేతిలో సంచీ
కాకీ దుస్తులు
అరిగిన చెప్పులు
ఒక సాదాసీదా పేదవాడు
ఇంటింటికీ
వీధివీధికీ
ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమ్మినిస్టరా ఏం

అయితే చూడు
ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు
ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు
ఆ కళ్ళలో ఆతృత
ఆ గుండెల్లో గడచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం
 అమ్మాయీ !
 పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి
 పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడి  కందించాలనే
 నీ ఆశ నాకు అర్ధమయింది.

 అందుకే
చూపులు తుమ్మెద బారులు కట్టి
 నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి
 వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి
 వీధి వీధినంతా కలయజూస్తున్నాయి
 అడుగో పోస్ట్ మాన్!
 ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు
 అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు
 వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక
 విచ్చిన రెండు కల్హార సరస్సులు

గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడిగట్టిన ప్రాణపు దీపంతో
తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం
కోసం నిరీక్షణ
క్షణ క్షణ ప్రతీక్షణ
ఒక కార్డు ముక్క వ్రాశాడా
బంట్రోతూ వెళ్ళు వెళ్ళు త్వరగా
ముసలిదానికి  మంచివార్త నందించు
ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు
దూరభారాన ఉన్న కుమారుని కోసం
 వగచే తల్లికి
చేరువ చేరువౌతూన్న నువ్వొక ఊరట
దగ్గర దగ్గరౌతున్న మిత్రుని లేఖ కోసం
 నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట
 వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి
 ఉద్యోగశప్తుడైన నవీన యక్షునికి
 మనిషికి రాక్షసునికి
  నువ్వు
 దూరాల దారాల్ని విచిత్రంగా
 ఒకే నిముషము
 అనే కంచె చుట్టూ త్రిప్పగల నేర్పరవి .. కూర్పరివి...
 అదృష్టాధ్వం మీద నీ గమనం
శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మాజిక్ సంచిలో
నిట్టూర్పులు  నవ్వులు  పువ్వులు
ఆనందాలు అభినందనలు  ఏడుపులు
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!

కొందరికి పరిచయమైన నవ్వు
కొందరికి తలపంకించిన నవ్వు
కొన్నివైపులకి చూడనే చూడవు
అందరికీ నువు ఆప్త బంధువుని
అందరికీ నువు వార్త నందిస్తావు
కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మథనం
అవుతూంటుంది

                
 ఇన్ని యిళ్ళు తిరిగినా
 నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
 ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదలి సముద్రంలోకి  పోతూన్న ఏకాకి నౌక చప్పుడు
                                                                  
                                                          - 1959

   --------------------------------------------------------------

  *  సుబ్బారావు అనే మిత్రుడు జిల్లా తపాలా శాఖ జరుపుకొనే  వార్షికోత్సవానికి పోస్టుమాన్ మీద వ్రాయమని కోరినప్పుడు  వ్రాసి  యిచ్చిన గేయం.

  4, మే 2011, బుధవారం

  సాగింది సాగింది గంగ... సాగి చెలరేగింది గంగ!

  కర్ణాటక లోని  ఓ శిల్పం


  న ‘మైథాలజీ’లో ‘గంగావతరణం’ ఓ రసవద్ఘట్టం.

  తరతరాలుగా ఎందరో కవిత్వంలో, శిల్పంలో, చిత్రలేఖనంలో, సంగీతంలో  పొదిగి దీన్ని కళాత్మకంగా మలిచారు.  వర్ణనలతో, వర్ణాలతో, రేఖలతో, రాగాలతో రమణీయం చేశారు. ఊహలతో పెంచి, ఉపమానాలతో, ఉత్ప్రేక్షలతో అలంకరించి చిరస్మరణీయం చేశారు. 

  భగీరథ ప్రయత్నంతో  ఆకాశగంగ నేలమీదకు ఎలా వచ్చిందో... ఆ గాధ  తెలిసిందే కదా!

  ‘కదిలింది కదిలింది గంగ
  కదిలి ఉప్పొంగింది గంగ
  పరమ రాజసభావ పరిజృంభిత నిజాంగ
  కదిలింది కదిలింది గంగ
  కదిలి ఉప్పొంగింది గంగ

  ఆకాశమే అదరగా
  ఐరావతం బెదరగా
  నందనవనం ప్రిదులగా
  బృందారకులు చెదరగా


  సాగింది సాగింది గంగ
  సాగి చెలరేగింది గంగ
  దూకింది దూకింది గంగ
  ఉద్రేకాతిరేకాంతరంగ...’
  (సినారె, ‘సీతాకల్యాణం’-1976)  ‘శివుడప్పుడు ఎదురుగ జగ
  జెట్టి వోలె నిలుచుండెను
  మెడను జాచి జడల బార్చి
  మింటివంక కనుచుండెను

  ... ఆకాశము నుండి భువికి
  ఉరుములతో మెరపులతో
  ఉరవడించి తరలివచ్చె’ 
  (ఉత్పల, చందమామ- ‘గంగావతరణము’- 1960)  

  సురగంగ గరువమ్ము విరువంగ నెంచి 
  సంకీర్ణ పటు జటాచ్ఛటలనుప్పొంగించి
  దుర్గమ్ముగా మలచినాడు
  గంగ నద్భుతముగా బంధించినాడు

  మహా వేగంతో శివుడి జటాజూటంలో ఇరుక్కుపోయి సుళ్ళు తిరగడం మొదలుపెట్టింది గంగ.

  జడయను అడవిని వడివడి అడుగిడి 
  జాడ ఎరుంగనిదై
  తడబడి నడచుచు
  గడగడ వడకుచు
  సుడివడి పోయినదై
  ఒక పరి అటు చని
  ఒక పరి ఇటు చని 
  మొగమే చెల్లనిదై

   ఎన్ని సంవత్సరాలైనా కిందపడలేకపోయింది.  భగీరథుడు గంగ కనిపించక  మళ్ళీ తపస్సు చేశాడు. శివుడు సంతోషించి గంగను విడిచిపెట్టాడు.

  ‘పరవశాన శిరసూగంగ
  ధరకు జారెనా శివగంగ...’
  (వేటూరి,  ‘శంకరాభరణం’-1979)

  గంగ భూమ్మీద పడి ప్రవహించడంలో ఏడు పాయలుగా చీలింది.  ఒక పాయ భగీరథుడి వెనకాలే, రథం ఎటు తిరిగితే అటుపోయింది.

  ‘ఉరికింది ఉరికింది గంగ
  ఉన్ముక్త మానస  విహంగ

  ....

  జలజలా పారుతూ
  గలగలా సాగుతూ
  చెంగుమని దూకుతూ
  చెలరేగి ఆడుతూ
  తుళ్ళుతూ తూలుతూ
  నిక్కుతూ నీల్గుతూ
  ముంచివేసెను
  జహ్నుముని ఆశ్రమమును’
  (సినారె)

  జహ్ను మహర్షికి  కోపం వచ్చేసింది.  గంగను పూర్తిగా తాగేశాడు. దేవతలంతా గంగను విడిచిపెట్టమంటూ మహర్షిని పూజించారు. ఆయన సంతోషించి గంగను చెవుల్లోంచి విడిచిపెట్టాడు. ఆ రకంగా గంగ, జహ్ను మహర్షి కూతురు ‘జాహ్నవి’ అయింది.


  మునుముందుగా భగీరథుడు నడువంగ
  తన మేన సరికొత్త తరగలుప్పొంగ-
  తరలింది తరలింది గంగ
  సాగరుల పాపములు కడుగంగ
  భువికి పుణ్యమొసగె నదిగా....  రవివర్మ వర్ణచిత్రం

     రవి వర్మ (1848- 1906)  గంగావతరణాన్ని చూడముచ్చటగా చిత్రించాడు. శివుడు నడుం మీద చేతులుంచి  తలపైకెత్తే భంగిమా,  కిందికి చూస్తూ పైనుంచి స్త్రీ రూపంలో దిగే గంగ... మొత్తంగా ఈ దృశ్యానికి ఒక ప్రామాణికతను సృష్టించేశాడు. ఏ చిత్రకారుడైనా, శిల్పి అయినా ఇదే తరహాలో తప్ప వేరే రకంగా రూపకల్పన చేయటానికి వీల్లేనంతగా!

  శంకర్ గీసిన చిత్రం - చందమామలో.


  గంగావతరణం అంటే వెంటనే బాపు ‘సీతా కల్యాణం’ సినిమా గుర్తొస్తుంది. బాపు ఈ ఘట్టాన్ని తీయడానికి ముందు  బొమ్మలుగా వేస్తే...  వాటిని చూసిన ప్రేరణ పాటగా పొంగిందని సినారె చెప్పారోసారి.

  గంగానది గమనాన్ని ఆయన  తెలుగు నుడికారంతో చక్కగా అక్షరబద్ధం చేస్తే... దానికి దీటుగా బాపు కనువిందుగా చిత్రీకరించాడు.

  బాపు సీతాకల్యాణం సినిమాలోని గంగావతరణ దృశ్యం

  మహదేవన్ సంగీతం, రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణాలను ఇక్కడ ప్రస్తావించితీరాలి.

  అయితే బాపు అప్పటికి 16 సంవత్సరాల ముందే  చందమామలో  ఉత్పల సత్యనారాయణాచార్య ‘గంగావతరణము’ గేయ కథకు చక్కని బొమ్మలు వేశాడు.  ‘రచన’ మాసపత్రిక ఎడిటోరియల్ పేజీ పై భాగంలో కూడా బాపు వేసిన గంగావతరణం బొమ్మ కనిపిస్తుంది!

  ‘సీతా కల్యాణం’లో గంగావతరణం పాట ఇక్కడ వినొచ్చు.  ఈ గాథ వెనక వాస్తవమేంటి?
  జీవానికీ,  జలానికీ ఉన్న సంబంధం విడదీయరానిది.  గంగ కావొచ్చు; మరే నది అయినా కావొచ్చు. ప్రాణికోటి జీవనం... ముఖ్యంగా మనిషి బతుకు నీటితోనే ముడిపడివుంది.

  అసలు స్వర్గమూ,  సుర గంగా ఏమిటి?  ఆ నది భగీరథుడి వెంట, రథం ఎటు తిరిగితే అటు ప్రవహిస్తూ వెళ్ళటమేమిటి?

  ఇవన్నీ అసహజాలే కదా?

  గంగానది స్వర్గం నుంచి భూమ్మీదకు దిగిరావటం అనేది అందమైన కల్పన.  నీటి కోసం అలమటిస్తూ నరకప్రాయంగా జీవించేవారికి గలగల పారే  జీవధార... స్వర్గం నుంచి వచ్చినట్టు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?

  నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి చేరే ఒకనాటి మానవులు , నదీ తీర ప్రాంతాల కోసం యుద్ధాలు చేసిన కాలం ఒకటుంది. ఆ కాలంలో నదులను మానవులు తమకు ఇష్టమైన చోటుకు  తీసుకుపోవడం- ఒక అద్భుతమైన ఊహ!

  నీటిని భూమి అంతటా పరిగెత్తించాలనే తీవ్రమైన కోరికతో ఊహించుకున్న కథ అది. 

  ఎందుకంటే  మైథాలజీ మానవుల ఆశల్నీ, ఆకాంక్షల్నీ- అతిశయంగానే - ప్రతిబింబిస్తుంది!