సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, ఫిబ్రవరి 2017, మంగళవారం

తులసిదళం - నేనూ - గంజాయిదమ్ము విమర్శా!

ఆ  తెలుగు  నవలను  చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది.

ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను.

ఇంతలో... ఆ నవలపై  కఠోర  విమర్శ  కనపడింది.  అయిష్టంతో ...  అసహనంగా చదివాను  దాన్ని.
   
ఘన సమ్మోహనాస్త్రమనుకున్న  నవలను  ఆ విమర్శ గంజాయిదమ్ము  అని ఈసడిస్తుంటే ....  పట్టరాని ఉక్రోషం,  ఆ విమర్శ చేసిన వ్యక్తిపై కోపం కూడా వచ్చేశాయి.

అవి నా టెన్త్  రోజులు... దాదాపు ముప్పయి ఏళ్ళ  క్రితం నాటి ముచ్చట ఇది..  కథలూ, నవలల్ని అమితంగా ఇష్టపడటం అప్పటికే ఉంది మరి. 

అలా   కొద్ది కాలం  గడిచాక..

విచిత్రంగా...
ఆ నచ్చిన నవలపైనా,
ఆ  నచ్చని విమర్శపైనా 
నాకు  ఏర్పడిన  అభిప్రాయాలు  తలకిందులయ్యాయి!

నేనంతగా ఇష్టపడిన  ఆ నవలలోని  లోపాలను చూడగలిగే  ,  దాని  సైడ్ ఎఫెక్టులు గ్రహించగలిగే  చూపును-

నాకు దుర్భరంగా అనిపించిన అదే  ‘ విమర్శ’ నాకు  అందించింది. 

ఆ నవల  మారలేదు,  దానిపై  విమర్శా  మారలేదు.
మారింది  నేనే !


ఇదొక మరిచిపోలేని అపూర్వానుభవం నాకు!

* * *
నవల  ‘తులసిదళం’.
రచయిత- యండమూరి వీరేంద్రనాథ్.


 ఆ విమర్శ-  ‘తులసిదళం కాదు గంజాయి దమ్ము’

వ్యాసకర్త - రంగనాయకమ్మ.* * *
 1980  నాటి నవల ‘తులసిదళం’.  ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో  సీరియల్ గా వచ్చింది. తర్వాత ఆ వారపత్రికలోనే  దాని కొనసాగింపుగా అదే రచయిత  ‘తులసి’ రాస్తున్నపుడు  సీరియల్ భాగాలు కొన్ని  చదివాను.

పల్లెటూళ్ళలో అప్పుడప్పుడూ  జనం నోళ్ళలో  వినబడే  ‘చేతబడి’ని  కథా వస్తువుగా  చేసుకున్న రచనలు ఇవి.

అప్పటికి ఎవరూ వినవుండని ‘కాష్మోరా’ అనే క్షుద్ర దేవతను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన నవలలివి. 

‘తులసిదళం’ సీరియల్  సంచలనాత్మకమై. ఆంధ్రభూమి వారపత్రిక సర్క్యులేషన్ ను అమాంతం పెంచేసింది.

లోకజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిర్ద్వంద్వంగా ఖండించే మూఢ నమ్మకాలకు ‘ సైంటిఫిక్ రీజనింగ్’ ఇస్తూ  వాటి వెనక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిరూపించటానికి ప్రయత్నించింది.  

సీరియళ్ళు ముగిసి, పుస్తకరూపంలో వచ్చాకనే...  ఆ నవలలు పూర్తిగా చదివాను.  ఉత్కంఠగా  ‘భలే ఉన్నాయే’ అనిపించింది. 

ఈ అభిప్రాయం తర్వాత మారటానికి   ‘... గంజాయి దమ్ము’ విమర్శ నాకో ఉపకరణం అయింది.

 ‘‘పాఠకులకు కనీసం కూడా విమర్శ అనే ఆయుధం ఇవ్వకపోతే , ఇటువంటి సాహిత్యం మీద వాళ్ళ నమ్మకం ‘వైద్యం లేని జబ్బులాగా పెరిగిపోతూ ఉంటుంది’’ అంటారామె, ఆ విమర్శలో. ఆ రకంగా ఈ విమర్శ అనే ఆయుధం నాకు ఉపయోగపడింది.

‘దీంట్లో ఒక వెయ్యి మెలికలు ఉండటం వల్ల, దీని నిజ స్వభావాన్ని పాఠకులు గ్రహించలేకపోతున్నారు.. ఇది ఎంత క్షుద్రమైన, ఎంత అభివృద్ధి నిరోధకమైన పుస్తకమో చెప్పడానికే దీని మీద విమర్శ కావాలి. ఇది సైంటిఫిక్ దృష్టితో నడిచిందనే భ్రమల్ని పటాపంచలు చెయ్యడానికే దీని మీద విమర్శలు కావాలి’’ అంటారు రంగనాయకమ్మ తన విమర్శలో.

అలా గ్రహించనివాళ్ళలో నేనూ ఒకణ్ణి.

ఆ విమర్శా వ్యాసంలోని  ధర్మాగ్రహం,  భావ తీవ్రత,  తిరుగులేని తర్కం.. ఇవన్నీ నాకు  ఎంతో నచ్చాయి.

వీటితో పాటు  చెప్పదల్చిన పాయింట్లను యాంత్రికంగా ఏదోలా  పేర్చినట్టు కాకుండా-

ఆలోచనల్ని సానపెట్టేంత పదునుగా... ఆసక్తికరంగా, అనితర సాధ్యమనిపించేంత  శక్తిమంతంగా  రాయటం నాకు అబ్బురంగా అనిపించింది.

* * *

విమర్శ సుతిమెత్తగా, మృదువుగా ఉండాలని డా. ద్వా.నా. శాస్త్రి  ఆంధ్రభూమిలో ఓ వ్యాసం రాశారు.  దాదాపు 20 ఏళ్ళ క్రితం.  అంతటితో ఆగకుండా  విమర్శ అనేది తులసిదళంపై రంగనాయకమ్మ రాసిన  విమర్శలాగా ఉండకూడదని కూడా  చెప్పుకొచ్చారు.

స్పందించకుండా ఉండలేకపోయాను.   ‘దారుణాఖండల శస్త్ర తుల్యమైన రంగనాయకమ్మ విమర్శ వల్లనే ఆ నవల గురించి సరైన దృష్టిని నాలాంటివాళ్ళు  ఏర్పరచుకోగలిగారు’ అంటూ నన్నయ్య పద్యభాగాన్ని తోడుగా చేసుకుని,  ఆవేశంతో  నాలుగు ముక్కలు రాసి పంపాను.  పాఠకుల లేఖల్లో అది  వచ్చింది. 

ద్వా.నా. శాస్త్రి గారితో  తర్వాతి కాలంలో బాగానే పరిచయం పెరిగింది. కానీ ఆయన వ్యాసం గురించీ, దానిపై అప్పట్లో  రాసిన లేఖ గురించీ  చెప్పాలని తోచలేదు....ఇంతవరకూ!


* * *
 తులసిదళాన్ని ‘నవలాథ్రిల్లర్’ అని మెచ్చుకుంటూ  మరో రచయిత డా. కొమ్మూరి వేణుగోపాలరావు ఆ నవలకు  ముందుమాట రాశారు.

ఆ  నవలపై  రంగనాయకమ్మ  విమర్శా వ్యాసం  ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో  1981 డిసెంబరు 6 నుంచి ఏడు వారాలపాటు కొనసాగింది.

   Critique on Tulasidalam by Reader on Scribd


ఈ సుదీర్ఘ  విమర్శ ను పరిచయం చేస్తూ..  వచ్చిన  ఇంట్రో చూడండి-రంగనాయకమ్మ విమర్శలో ఒక ప్రత్యేక లక్షణం .. ఇతరులు సాధారణంగా గమనించని  మౌలికమైన అంశాలను లేవనెత్తటం.

కొన్ని పదునైన  వాక్యాలూ, వాటిలో  తర్కం చూడండి....
‘‘పేషెంట్ కి గుండె ఆపరేషన్ చేయాలని అంతవరకూ ఉద్దేశమే లేకుండా , ఏ ఏర్పాట్లూ లేకుండా ఒక్క నిముషంలో, ఒక్క నిముషం అంటే ఒక్క నిముషమే, ఒక్క  నిముషంలో గుండె ఆపరేషన్ ప్రారంభిస్తారా ప్రపంచంలో ఎక్కడైనా? ’’

‘‘ఇది ఫలానా జబ్బు. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. ఇది 21 రోజులు ఉంటుంది. చివరి రోజున ఆపరేషన్ కూడా అవసరమవుతుంది. పిల్లకి వచ్చిన బాధలన్నీ ఈ జబ్బు వల్లే వచ్చాయి’ అని డాక్టరు ఒక జబ్బు పేరు చెప్పాలి. అలా ఎందుకు చెప్పలేదంటే  అలాంటి జబ్బేదీ ప్రపంచంలో లేదు గనక!’’

‘‘ఈ చెత్త చదవటం వల్ల వచ్చేఫీలింగ్ సస్పెన్స్ కాదు. జుగుప్స! రోత! చీదర! ’’ 

‘‘ఈ పుస్తకం వెకిలిగా, చౌకబారుగా, ఆటవిక కాలం నాటి అజ్ఞానంతో ఉందనే సంగతి నాకే కాదు, పాఠకులకు కూడా అర్థం కావాలి కదా? వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకే వాళ్ళు దీన్ని నెత్తిన పెట్టుకున్నారు..’’


ఇంత సీరియస్  విమర్శలోనూ రంగనాయకమ్మ మార్కు  హాస్యం, వ్యంగ్యం ఈ వ్యాసంలో తళుక్కున మెరుస్తుంటాయి. 

ముందుమాటా.. కేసులూ

చయిత నవల్లో  చేతబడిని సమర్థించడం గురించి  ముందుమాట రాసిన  డాక్టరు రచయిత  చిన్న విమర్శ అయినా చేయలేదనీ,

నవల్లో వైద్యం అనే కోణాన్ని సర్కస్ లో బఫూన్ని లాగా తయారుచేసినా తాను డాక్టరైవుండి కూడా కిమ్మనలేదనీ,

రచయిత శ్రద్ధా, పరిశోధనలు చేశారని  పొగడ్తలు కురిపించారనీ  ఆ ముందుమాటను కూడా రంగనాయకమ్మ ఘాటుగా  విమర్శించారు.

నవలపై వచ్చిన విమర్శపై  రచయిత  వీరేంద్రనాథ్ ఏమీ స్పందించలేదు. 

కానీ ముందుమాట రచయిత  డా.  కొమ్మూరి వేణుగోపాలరావు మాత్రం ఊరుకోలేదు. అలా అని ప్రతివిమర్శ చేయటం ద్వారా తన వైఖరిని సమర్థించుకోవటం కూడా చేయలేదు. 

ఆయన ఈ సాహిత్య వివాదాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవటానికి సిద్ధమయ్యారు.  ఆ విమర్శ వల్ల తన పరువుకు నష్టం జరిగిందనీ,  విమర్శకురాలు తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ లాయరు నోటీసు పంపారు.

ఆయనకు పరువు నష్టం కలిగివుంటే  ఆ పని జరిగింది తన వల్ల కాదనీ, ఆయన ప్రవర్తన వల్లే ఆయనకు పరువునష్టం కలిగిందనీ-

తాను ఆయనకు క్షమాపణ చెప్పుకోవటం కాదు- ఆయనే తెలుగు పాఠకలోకానికి క్షమాపణ చెప్పుకోవాలనీ-
లాయర్ నోటీసుకు రంగనాయకమ్మ బదులిచ్చారు. 

దీంతో...  తర్వాత సివిల్,  క్రిమినల్ కేసులూ ... విచారణలూ... చివరకు  జరిమానా!

ఈ విమర్శతో పాటు ఆ వివరాలన్నీ  పుస్తకంగా వచ్చాయి. (పరువునష్టంగా కోర్టులు భావించిన పదాలూ, వాక్యాలూ  తొలగించి).


ఈ విమర్శా వ్యాసానికి ఇంట్రో ను  ఎడిటర్  ఏబీకే ప్రసాద్ రాసివుంటారు.

‘సాంఘిక విమర్శ దావాలకు అతీతం’  అనే చక్కటి  వ్యాసాన్ని ఆయన ఈ వివాద సందర్భంలో రాశారు. విమర్శ చివరిభాగంతో పాటు దీన్నీ ప్రచురించారు.

అంతే కాదు-

‘న్యాయమూర్తి  సూచన శిరోధార్యం’  అంటూ 1985లో  ఓ సంపాదకీయాన్ని ఆయన ఉదయం దినపత్రికలో  రాశారు.

అందులో ‘తులసిదళం’ నవలను చీదరించుకున్న న్యాయమూర్తి అబిప్రాయాలను కోట్ చేయడంతో పాటు...  కొమ్మూరి వేణుగోపాలరావు ముందుమాట పాఠకులకు ఖండనార్హం ఎందుకయిందో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఏబీకే ప్రసాద్  రెండు వ్యాసాలనూ ఈ విమర్శ ఉన్న పుస్తకంలో చదవొచ్చు.

* * *

ఇందాక  ఈ విమర్శపై వీరేంద్రనాథ్ స్పందించలేదన్నాను కదా? అది కరెక్టు కాదనుకుంటాను.

తులసిదళం నవల వచ్చాక దానికి పేరడీగా ఆంధ్రప్రభ వారపత్రికలో  ‘వేపమండలు’ అనే సీరియల్ వచ్చింది.  శ్రీమతి  సంగీతారెడ్డి అనే పేరుతో..ఈ నవల తులసిదళాన్నీ,  ఆ రచయితనూ  సమర్థించటానికి ప్రయత్నించింది.

 ‘ఎలక్ట్రానిక్స్ నుంచి హిప్నాటిజం వరకూ- రకరకాల పాత్రలూ, వాటి వ్యక్తిత్వమూ- ఘర్షణా- అన్నిటికీ మించి  మంచి క్లైమాక్సూ..’’  అంటూ ఆ నవలకు  కితాబులిచ్చింది.

‘సరదాగా చదివి పక్కనపెట్టెయ్యకుండా  ఒక భూత అద్దం తీసుకుని రామాయణంలా దీన్ని పఠించి, తప్పులెన్ని, దీనిమీద వ్యాసాలు వ్రాసి గ్లామరు పెంచుకునే అవసరం లేదని కూడా అనుకుంటున్నాను’’ అని ఓ పాత్ర తో చెప్పించింది.  అంటే   ఈ నవలపై విమర్శ   ‘గ్లామర్ పెంచుకోవటం కోసం’!

కథలో  పాత్రల మాటల మాటున  స్వీట్ హోమ్,  బలి (ఉరి) పీఠం అంటూ రంగనాయకమ్మ రచనల పేర్ల చెప్పి రచయిత్రిని ఎకసెక్కం చేయటానికి ముసుగులో  ప్రయత్నించింది ఈ  పేరడీ నవల.

విమర్శ ను రుజు మార్గంలో ఎదుర్కోలేని,  నేరుగా ప్రతి విమర్శ చేయలేని  అశక్తత తప్ప మరేమీ కాదిది.

ఇంతకీ  ఈ వేపమండలు రాసినవారు వీరేంద్రనాథ్ అభిమాన రచయిత  అయివుంటారని  అనుకున్నాను. కానీ దీన్ని స్వయంగా వీరేంద్రనాథే రాసినట్టు  2014లో  సాక్షి పత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్ వ్యూ సాక్ష్యమిస్తోంది..

లింకు  చూడండి- 


 ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన.’’  (పెట్టుడు పేరు మర్చిపోయినట్టన్నమాట...)

‘‘ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే.’’  

నిజమా?  నవల రాసిన ఇన్నేళ్ళ తర్వాత అయినా రచయిత  ఈ మాత్రం ఒప్పకున్నందుకు సంతోషించాలేమో.

 * * *
అంతటి వివాదానికి కారణమైన ముందుమాటను 1992లో తులసిదళం నుంచి తీసివేశారు. మళ్ళీ  ఎప్పట్నుంచి  జోడించటం మొదలుపెట్టారో కానీ 2015 ఎడిషన్లో  మాత్రం ఈ ముందుమాట కనపడుతోంది.

ఈ విమర్శా వ్యాసం ప్రభావం నా మీద చాలా ఉంది. .. ఇన్ని సంవత్సరాలుగా.

డా.  కేశవరెడ్డి నవల  ‘మునెమ్మ’ గురించి చాలా కాలం క్రితం  బ్లాగులో రాశాను. ఆ రాతలో  ఈ వ్యాస ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది.

 వ్యాస రచనా విధానం  ..  చెప్పదల్చుకున్న  అంశాలను పకడ్బందీగా, చక్కగా   అమర్చిన  క్రమం నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది.

వ్యాస  నిర్మాణానికి    బ్రీఫ్ నోట్సు/ ప్రణాళిక ఏమైనా ఉందేమో అనిపించి  రంగనాయకమ్మ గారిని  అడిగాను,  కొద్ది రోజుల క్రితం. (16.2.2017 తేదీన).  దానికి ఆమె ఇలా చెప్పారు.

‘‘ మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఒక తర్కంతో మాట్లాడతాం. ఇదీ అంతే. ఆ నవల చదువుతుంటే దానిలో వైరుధ్యాలూ, తప్పులూ తెలిసిపోయాయి. వాటిని తర్కంతో ఖండించే పనే చేసింది. ఏం చెప్పాలి, ఎలా మొదలుపెట్టాలి, ఏది ముందు , ఏది వెనక అనేది ఆలోచించటం తప్ప ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవటమో, ప్లాన్  వేసుకోవటమో ఏమీ లేదు. ’  

రంగనాయకమ్మ వ్యాసం వచ్చిన కొద్ది నెలలకే  1982 ఫిబ్రవరి లో  బాలగోపాల్ ‘కుహనా వైజ్ఞానిక నవలలు’ అనే వ్యాసం రాశారు, ‘అరుణతార’ పత్రికలో!

ఆయన మాటల్లో-

‘మంత్ర తంత్రాలను గురించి,  చేతబడి గురించి మనకున్న జ్ఞానం అసంపూర్ణం కాదు, సంపూర్ణమే. ’’

 ‘‘మంత్ర విద్యను సైన్సుతో సమంగా నిలబెట్టడం శాస్త్రీయం కాదు సరికదా,  సైన్సును క్షుద్రపరచడం అవుతుంది’’

ఆసక్తి ఉన్నవారు ఆ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఈ రెండు నవలలు సరే...  మరి వీరేంద్రనాథ్ రాసిన మిగతా నవలల సంగతేమిటి?   

‘యుగాంతం’,  ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ప్రార్థన’  లాంటివి   నాకు ఇప్పటికీ  నచ్చుతాయి!