సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, మార్చి 2009, సోమవారం

ఇళయరాజా ఇంద్రజాలం !


రీ-రికార్డింగ్ తో సినిమాలకు ప్రాణం పోసే కళలో ఇళయరాజా నిష్ణాతుడని ఆయన వీరాభిమానుల్లో చాలామందికి తెలుసు.

ఇళయరాజా అంటే కేవలం శ్రావ్యమైన పాటల స్వరకర్త అనుకుంటే ఆయన్ను పరిమితంగానే అర్థం చేసుకున్నట్టు. కొందరికి మాత్రమే తెలిసిన అలనాటి సంఘటన మీతో పంచుకుంటా.
‘సితార’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక తొలి కాపీ చూసి, అందరూ ముఖాలు వేలాడేసుకున్నారట. (వంశీకి అది రెండో చిత్రం). అప్పుడు ఇళయరాజా వచ్చి , సినిమాకు నేపథ్యసంగీతం కూర్చారు.

అప్పటివరకూ డల్ అనుకున్న సినిమా ఆసక్తికరంగా, కళాత్మకంగా తయారైంది!

అదీ ఇళయరాజా అంటే.

వంశీ- ఇళయరాజాల సమ్మోహన సమ్మేళనానికి అది నాంది.

నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ) ని బీజీఎం అని పొడి అక్షరాలతో వ్యవహరిస్తుంటారు. ఇది సంభాషణల వెనక, సన్నివేశాల మధ్య వచ్చే వాద్యసంగీతం. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా అత్యంత ప్రభావశీలంగా ఉపయోగపడుతుంది.

ఇళయరాజా బీజీఎంలు ఎంత బాగుంటాయంటే అవి తర్వాత వచ్చిన ఆయన సినిమాల్లో పల్లవులుగా రూపాంతరం చెందాయి.

‘గీతాంజలి’లో బీజీఎంలు ఎంతోమందికి ఇష్టం. నాయకుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శ్రీ కనకమాలక్ష్మీ రికార్డింగ్ డ్రాన్స్ ట్రూప్, అన్వేషణ ... ఇలా ఎన్నో సినిమాలను ఉదాహరించొచ్చు.

ఇన్ని చెప్పి ఇళయరాజా బీజీఎంలు వినగలిగే సైటు గురించి చెప్పకపోతే చాలా అన్యాయమవుతుంది।ఇదిగో...ఆ వెబ్ సైట్.

వినండిక మధురమైన నేపథ్యసంగీతం!

(ఈ సైటులో సినిమా-ఇతర వాద్య సంగీత ఆల్బమ్ లు ‘నథింగ్ బట్ విండ్’ , హౌ టూ నేమ్ ఇట్’ కూడా ఉన్నాయి).

27, మార్చి 2009, శుక్రవారం

మన భాషలో నా సందేహాలు

ఆలోచిస్తే... మన తెలుగుభాషకు సంబంధించిన చాలా ప్రాథమికమైన సందేహాలకు నాలాగే చాలామందికి సమాధానాలు తెలియవని అన్పిస్తుంది. వీటి గురించి సీరియస్ గా ప్రయత్నించలేదు గానీ అడిగినవారు ఎవరూ నాకు జవాబులు చెప్పలేకపోయారు.

నన్ను వేధించే కొన్ని అనుమానాలు కింద ఇస్తున్నా. 
(నిజానికివి సంస్కృతం లోనివి అనుకుంటా) .

*  బ్రహ్మ అనే మాటను ఎలా పలకాలి? ‘బ్రమ్హ’ అనేనా? అలా అయితే ఎందుకని?

*  చిహ్నం అనే మాటను ‘చిన్హం’ అనాలా? ఎందుకని? ఈ తలకిందుల వ్యవహారం ఎందుకనే, చలం గారు తన రచనల్లో ‘చిన్హం’ అని వాడారు.

*  చ ఛ జ ఝ తర్వాత వచ్చే ‘అక్షరం’ ఉచ్చారణ ఏమిటి? ఆ అక్షరంతో వచ్చే పదాలైన జ్ఞానం, ప్రతిజ్ఞ ల్లో ఆ ఉచ్చారణ ఏకీభవిస్తుందా? లేకపోతే ఎందుకని?

*  ‘అలు’ ఉచ్చారణతో వచ్చే పదం ‘క్లుప్తం’ కాకుండా ఇంకేమైనా ఉందా? (ఇక్కడ ఈ పద స్వరూపం సరిగా రాయలేకపోతున్నా)

*  క ఖ గ ఘ తర్వాత వచ్చే ‘అక్షరం’ తో రాసే పదం ‘వాంగ్మయం’ (ఇదీ రాయటం సరిగా కుదరటం లేదిక్కడ) కాకుండా ఇతర పదాలేమిటి?

ఇవండీ నా సందేహాలు.

26, మార్చి 2009, గురువారం

బేతాళ కథల కమామీషు‘పట్టు వదలని విక్రమార్కుడు....’ అంటూ 54 ఏళ్ళుగా తెలుగు ప్రజలను ఆనందపరుస్తున్న బేతాళకథలు ‘చందమామ’లో ప్రత్యేక ఆకర్షణ. కొన్నిసార్లు ‘విసుగు చెందని విక్రమార్కుడు...’ అంటూ ఆరంభమయ్యేది కానీ కథ ఎత్తుగడ మారేది కాదు.

ఈ కథలకు మొదట బొమ్మ వేసింది  చిత్రా.
ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే. 

కొన్ని నెలల తర్వాత ఆ బొమ్మను మెరుగుపరిచింది శంకర్. తర్వాత ఆయనే బేతాళ కథలకు పేటెంట్ చిత్రకారుడై ఇప్పటివరకూ వేస్తూ వస్తున్నారు.

(మధ్యలో రాజీ,  శక్తిదాస్లు  కూడా కొన్ని బొమ్మలు వేశారు).

చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో.... ఆ వైవిధ్యం అబ్బురమన్పిస్తుంది.

బేతాళ కథల బొమ్మ డిజైన్ ను  ‘ఆధునికం’గా మార్చటం నచ్చనివాళ్ళలో నేను మొదటివరసలో ఉంటాను. 

చందమామ పున: ప్రారంభమయ్యాక అర్థచంద్రాకార డిజైన్ వచ్చింది. వణికే రాతలో ఉండే ‘బేతాళ కథ’ అక్షరాలను ప్రింటులోకి మార్చారు.   చిత్రకారుడు ఉత్తమ్ ద్వారా  ఈ పని జరిగింది.

ఇవేమీ నాకు నచ్చలేదు. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో గానీ.

పాత చందమామల్లో శీర్షికలు చక్కగా ఆర్టిస్టు రాసేవారు. ..ఒక్కొక్కటీ ఒక్కో తీరులో . ఇప్పుడు అన్నీ ఒకే ఫాంటులో ప్రింటు టైపులో వస్తున్నాయి.

బేతాళ కథలపై ఓ బ్లాగు కూడా తెలుగులో మొదలయింది.

చందమామ ఆగిపోతోందని రాస్తూ ఓ దినపత్రిక పెట్టిన శీర్షిక  ‘పట్టు వదిలిన విక్రమార్కుడు’.  అంటే చందమామకు బేతాళ కథలు పర్యాయపదంగా మారాయన్నమాట. ఇవన్నీ ఈ కథల ప్రాచుర్యాన్ని చెబుతున్నాయి.

మొదటి బేతాళ కథ చదివారా? అది 1955సెప్టెంబర్ సంచికలో వచ్చింది. 1972జులైలో పునర్ముద్రించారు.

బేతాళ కథల బొమ్మలు  ఎలా పరిణామం  చెందుతూ వచ్చాయో   ... పైన చూడండి.

మొదటి రెండూ చిత్రా వేసినవి.
మూడోది  శంకర్ చిత్రణ.  ఇదే  దశాబ్దాలుగా కొనసాగింది.
నాలుగో బొమ్మ వేసినవారు  వడ్డాది పాపయ్య. (వ.పా.)  ఇది   1972 జులైలో  చందమామ స్వర్ణోత్సవ సందర్భంగా .. మొదటి బేతాళకథను  పున: ప్రచురించినపుడు వేసిన బొమ్మ.
 ఇక చివరిదైన  ఐదోది-   ఉత్తమ్  ‘మెరుగులు’ దిద్దిన  చిత్రం!

16, మార్చి 2009, సోమవారం

కొడవటిగంటి రచనా ప్రపంచం


మీరు కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలు ఏమైనా చదివారా?

నేను ఆయన పుస్తకాలను కాస్త ఆలస్యంగానే చదవటం మొదలుపెట్టా. చదివినకొద్దీ ఎంతగానో నచ్చటం మొదలయింది... అలా ఏకబిగిన చాలా రచనలు చదివేశా. విషయంలో కొత్త చూపు, అద్భుతమైన పఠనీయత కొ.కు. రచనల విశిష్టత.

తన రచనల్లో శైలి గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదనే విమర్శ ఉంది కానీ నాకు అలా అన్పించదు. 75, 80 ఏళ్ళక్రితం రాసిన కథలు చూడండి... ఎంత ఆధునిక భాషాశైలి ఉంటుందో.

కొన్నేళ్ళక్రితం విశాలాంధ్ర వారు కుటుంబరావు సాహిత్యం పేరుతో ఆరు పెద్ద సంపుటాలు తెచ్చారు. మరో నాలుగు కథల సంపుటాలు, రెండు నవలా సంపుటాలు, ‘చదువు’ నవల... ఇవి కూడా.

ఇప్పుడివన్నీ దొరకటం లేదు.

తాజాగా విరసం వారు కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో 16 సంపుటాలు తెచ్చే పెద్ద ప్రయత్నం ఆరంభించారు. ఇప్పటికే 2 కథల సంపుటాలు వచ్చేశాయి.

మొత్తం 16 పుస్తకాల వెల రూ.3,000.

అయితే ఇప్పుడు రూ. 2,000 చెల్లించినవారికి పుస్తకాలన్నీ పంపిస్తారు.

ఆసక్తి ఉన్నవారు గుంటూరులో ఉండే సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని 98854 46750 నంబర్లో సంప్రదించవచ్చు.
..........ఇప్పటికీ అవకాశం ఉంది!   కొత్త చేర్పు (6.11.09) 

ది కొ.కు. శత జయంతి సంవత్సరం.  ఈ కారణంతో... దాదాపు ప్రతి సాహిత్య పత్రికా కొ.కు. రచనల గురించి ప్రత్యేక సంచికలూ, ప్రత్యేక వ్యాసాలూ ప్రచురిస్తోంది. టీవీల్లో,  దినపత్రికల సాహిత్య పేజీల్లో  కొ.కు.  ప్రస్తావన కనిపిస్తోంది.

(శత జయంతి,  ఒకవేళ  వచ్చే సంవత్సరమైతే, ఈ ఏడాది ఆయన్ని పట్టించుకునేవాళ్ళు  కాదు) :)

విషయమేంటంటే... కొ.కు. 16  సంపుటాలనూ 2 వేల రూపాయిలకే ఇచ్చే పథకం,  వాస్తవానికి   డిసెంబరు -08 కే  పూర్తయింది. ఇప్పటికే నాలుగు సంపుటాలు విడుదలయ్యాయి.
 
ఈ సంవత్సరం జనవరిలో తొలి సంపుటం, మార్చి లో రెండోదీ,  ఏప్రిల్- మే నెలల్లో మూడో సంపుటం, సెప్టెంబరు లో నాలుగోదీ వచ్చేశాయి.

5, 6  భాగాలు   ప్రింటింగులో ఉన్నాయి.

కానీ  రెండు వేల రూపాయిల రాయితీ పథకాన్ని ఇప్పటికీ పరిమిత సంఖ్యలో చందాదారులకు వర్తింపజేస్తారు. 

ఈ సంపుటాల  ప్రచురణ బాధ్యతలు చూస్తున్న ఎన్. వేణుగోపాల్  గారు  ఈ సంగతి చెప్పారు.  కొ.కు. సంపుటాలన్నీ కావాలనుకునే పాఠకులు,  హైదరాబాద్ పరిసరాల్లోని వారైతే ఆయనకు ఫోన్ చేసి ( 98485 77028 )  వివరాలు తెలుసుకోవచ్చు.

చిరునామా
మైత్రి రెసిడెన్సీ, 3-6-394,
వీధి నెంబరు 3, హిమాయత్ నగర్,
హైదరాబాద్ – 500 029.


మిగిలిన ఊళ్ళలోని పాఠకులు,   గుంటూరులో ఉన్న  సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని సంప్రదించవచ్చు.

13, మార్చి 2009, శుక్రవారం

'రఘువంశ సుధాంబుధి'పై కుతూహలం!


సం
ప్రదాయ
కృతుల్లో  'రఘువంశ సుధాంబుధి చంద్ర...' వినటానికి చాలా బాగుంటుంది.
అది గాత్రమయినా, వాద్యమయినా!

ముఖ్యంగా మంద్ర స్థాయిలో వీణ పైనో, వేణువు లోనో ఈ పాట ను ఆలకిస్తే... చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

శ్రీరాముడి ఘనతను కీర్తించే పాట ఇది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు రాశారీ కృతిని. ఈ పాటను త్యాగయ్య రాశారని పొరబడే వాళ్ళు కూడా ఉన్నారు.

ఈ పాట ఏ రాగంలో ఉందో చాలామందికి తెలిసిందే- కదన కుతూహలం.

వేగంగా సాగే ఈ కృతి... రాజులను యుద్ధానికి ప్రేరేపించటానికి ఉద్దేశించిందని అంటారు.


పాటను వినాలంటే అంతర్జాలంలో చక్కగా సాధ్యమే.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో విని తీరవలసిందే. ఇక్కడ వినండి.

వేణువు లో ఈ పాట వినటం చాలా మధురానుభూతినిస్తుంది. వినండి ఇక్కడ. 

ఈ కృతి సాహిత్యం కోసం ఈ లింకు చూడొచ్చు.

రఘువంశ సుధాంబుధి పాటను రాజేష్ వైద్య  ఫ్యూజన్ వీణ వాదనలో వినటం మంచి అనుభవం.
మొదట్లో తమాషాగా ఉంటుంది రాజేష్ వైద్య ఆహార్యం చూసినప్పడు. కానీ తర్వాత తర్వాత మరీ మరీ చూసేలా, వినేలా ఉంటుంది ఆయన వీణావాదన. నేను ఇప్పటికి చాలాసార్లు చూశాను.

ఆ వీడియో చూడండి.


'కదన కుతూహలం' పేరు వినగానే  ‘రఘువంశ సుధాంబుధి’ గుర్తొస్తుంది.
ఈ బాణీ లో తెలుగులో కొన్ని సినిమా పాటలొచ్చాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో ఓ పేరడీ పాట ఉంది. రమేష్ నాయుడు సంగీతకర్త.

ఇక చిరంజీవి సినిమా ‘చూడాలని ఉంది’ లో  ‘యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలి హౌరా వారధి’  పాట బాగా ప్రాచుర్యం పొందిందే. ఇది కూడా ఈ ట్యూన్ ఆధారంగా స్వరపరిచిందే ! ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ .


కదన కుతూహల రాగంలో ‘రఘువంశ సుధాంబుధి’ కాకుండా ఇంకా ఏమేం కృతులూ, కీర్తనలూ ఉన్నాయో తెలుసుకోవాలని నా కుతూహలం!

12, మార్చి 2009, గురువారం

ఏది...ఎప్పుడు?

ఇది చందమామ తొలిసంచిక ముఖచిత్రం (వేసింది- చిత్రా)

* చందమామ తొలి సంచిక: 1947 జులై
* ఇంగ్లిష్ తొలి సంచిక: 1955 జులై
* బేతాళ కథల ఆరంభం: 1955 సెప్టెంబరు
* మొదటి బేతాళ కథ పునర్ముద్రణ: 1972 జులై


* చందమామ ఆగిపోయిన కాలం: 1998 అక్టోబరు- 1999 నవంబరు
  • * తిరిగి ఆరంభం: 1999 డిసెంబరు

చందమామ సంగతులు

మీలో చాలామందికిలాగే నాకు కూడా 'చందమామ' పుస్తకం చాలా ఇష్టం. బాల్యంతో లంకె ఉన్నది ఏదయినా నచ్చుతుంది కదా!

'చందమామ' అంటే కథలే కాదు, అద్భుతమయిన బొమ్మలు కూడా. చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్ ల చిత్రకళా విన్యాసాలు ఎన్నని!

చందమామ అంటే చక్రపాణి- నాగిరెడ్డిల స్వప్నఫలం మాత్రమే కాదు, అది కొడవటిగంటి చెక్కిన వెన్నెల శిల్పం కూడా.

నా దగ్గర 1947 జులై చందమామ తొలి సంచిక నుంచి 1960 వరకూ అన్ని సంచికలూ ఉన్నాయి... పి డి ఎఫ్ రూపంలో.

1961 నుంచి 2004 వరకూ అక్కడక్కడా కొన్ని సంచికలు మిస్ అయ్యాయి.

అసలు ఇవన్నీ సేకరించానంటే ఇద్దరి హెల్ప్ గురించి చెప్పాలి.
నాగమురళి, ఫణి.

నాగమురళి డిజిటల్ లైబ్రరీ లోని చందమామల నిధి కనిపెట్టారు. ఇక్కడ.

ఫణి(బ్లాగాగ్ని) ఆ నిధిని తేలిగ్గా తీసుకునే ప్రోగ్రాం రాసి అందరికీ అందించారు. ఇక్కడ.

చందమామ విశేషాలు కొన్ని మరోసారి!

11, మార్చి 2009, బుధవారం

తొలి అడుగు

తెలుగు బ్లాగర్లకూ, అశేష పాఠక మిత్రులకూ నా నమస్కారాలు!

భ్లాగు లోకంలోకి రావాలనే కోరిక ఇన్నాళ్ళకు తీరుతోంది.

పేరుని బట్టి ఇదేదో సంగీతపు బ్లాగు అనుకోనక్కరలేదు.

అయితే సాహిత్యం, ఇతర (లలిత) కళలు నా అభిమాన విషయాలు. వాటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది కదా!