సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2016, శనివారం

స్ఫూర్తినిచ్చే చరిత్ర...‘సంత్ గాడ్గే బాబా’!


కాల్పనిక రచనలు ఇష్టమా? స్వీయ చరిత్రలూ, జీవిత గాథలూ చదవటం ఇష్టమా అని అడిగితే  చప్పున జవాబు చెప్పలేను.

అయితే  నిజమైన వ్యక్తులూ, వారితో సంబంధమున్న వాస్తవిక సంఘటనలుండే బతుకు పుస్తకాలకో  వింత ఆకర్షణ ఉంటుంది. కల్పనకు పరిమితులూ, సత్యంతో ముడిపడివుండటమూ వాటి ప్రధాన బలం. జీవిత చరిత్ర  రాయటమంటే ఆ కాలాన్నీ, పరిసరాలనూ  పున: సృష్టించి మళ్ళీ  కళ్ళముందుకు తీసుకురావటమే కదా!

నా మిత్రుడూ, టీవీ 9  జర్నలిస్టూ మల్లంపల్లి సాంబశివరావు  ‘సంత్ గాడ్గే బాబా’ జీవిత చరిత్ర రాసి, ఈ మధ్యే పుస్తకంగా ప్రచురించాడు.

గాడ్గే  గురించి నాకు పుస్తకం రావటానికంటే ముందే తెలుసు. దానికి కారణం కూడా సాంబూనే. తన మాటల ద్వారానే కాకుండా  అంతకుముందు ‘ఆంధ్రజ్యోతి’లో తనే రాసిన ఓ వ్యాసం ద్వారా కూడా గాడ్గే  నాకు పరిచితుడు.

ఈ జీవిత చరిత్ర చదివాక గాడ్గే బాబా బాగా అర్థమయ్యాడు నాకు.

పుస్తకం చదివిన ఉత్సాహం గాడ్గే మాటా, పాటా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది.

ఆయన కీర్తనలూ,  ప్రసంగం యూ ట్యూబ్ లో చూశాను; విన్నాను. ( ఆయన ప్రసంగం మరాఠీలో ఉన్నప్పటికీ  దాని తెలుగు అనువాదం ఈ పుస్తకంలోనే ఓ అధ్యాయంలో ఉండటం వల్ల సారాంశం అర్థమైంది.)  శ్రావ్యమైన  కీర్తనలూ, భజనలతో ఆయన ప్రజలను ఎలా ప్రభావితం చేసిందీ గమనించగలిగాను.

గాడ్గేపై తీసిన చిన్న డాక్యుమెంటరీ కూడా యూ ట్యూబ్ లో దొరుకుతోంది,  దాన్నీ చూశాను.

* * * 
బాబాలంటే ఏమో గానీ... సాధువులూ, సంతుల్లో ఎక్కువమంది నిరాడంబరంగానే ఉంటారు. కీర్తనలూ అవీ పాడుతూ  తమ భగవద్భక్తిని  చాటుకుంటుంటారు.  తాము నమ్మిన విషయాలపై ప్రజలకు ప్రబోధాలు  చేస్తుంటారు.

ఇంతవరకూ మాత్రమే అయితే  గాడ్గే  పెద్దగా పట్టించుకోదగ్గ వ్యక్తి అయ్యేవాడు కాడు.

కానీ ఈయనలో చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి.


మిగతా సాధువుల్లా ఈయన దేవుడి మీద ఆధారపడమని చెప్పలేదు.  అన్నీ మానవ ప్రయత్నం వల్లే మారతాయని చెప్పాడు.  హేతువాద దృష్టిని ప్రదర్శించాడు.

ఈయన సంస్కర్త, వాగ్గేయకారుడు, పర్యావరణ వాది. మూఢత్వాలను నిరసించి,  జీవితాన్ని సమాజానికి అర్పించిన వ్యక్తి.

నూరుశాతం ఆచరణ శీలి.  పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి స్వయంగా చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేసేవాడు. అది ఏదో మొక్కుబడిగా  ఫొటోల కోసం పోజిచ్చే  ఇప్పటి శ్రమదానం టైపు కానే కాదు. పరిశుభ్రతే దైవం అని నమ్మి జీవితాంతం దానికోసం పాటుపడ్డాడు.

 

కుష్ఠు రోగులంటే సమాజం ఎంత అసహ్యించుకునేదో  ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. దశాబ్దాల క్రితం సినిమా థియేటర్ల గేట్ల మీద ‘కుష్ఠు రోగులకు ప్రవేశము లేదు’ అని రాసివుండేది. అలా సమాజం దూరంగా పెట్టే కుష్ఠురోగులకు గాడ్గే  సేవలు చేశాడు.

పాటగా... సూటిగా 

‘గోపాలా గోపాలా దేవకి నందన గోపాలా’  అనే మకుటంతో భజన చేస్తూ, చేయిస్తూనే మధ్యమధ్యలో  తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పటం, జనంతో చెప్పించటం ఈయన ప్రత్యేకత!

‘‘తుకారాం మహరాజ్ ఏం చెప్పాడు! భగవంతుడిని చూడటానికి ఎంతో ప్రయత్నించి కూడా చూడలేకపోయానని... ఎప్పుడు కలుస్తాను,  ఎప్పుడు చూస్తాను అని ఎంతో ఆవేదన పడ్డాడు. ... అసలు ఉంటేగా చూడ్డానికి. ఇప్పటివరకూ ఎవరూ చూడలేకపోయారు... గుడిలో, నదిలో, రామేశ్వరంలో, బదరీనాథ్ లో... ఏ పేరుతోనైనా ఈశ్వరుడూ పరమేశ్వరుడూ అంతా మిథ్య...’’

(మన తెలుగు సినిమా  ‘భక్త తుకారాం’ పాట గుర్తొస్తోందా? - ‘ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ’)

గాడ్గే బాబా ‘వాణి ముత్యాలు’  మరికొన్ని చూడండి-
‘‘తీర్థయాత్రల పేరుతో డబ్బు వృథా చేసుకోవటం తప్ప మరేమీ లేదు’’

‘‘దేవుడు గుడిలో లేడు, మసీదులో లేడు, చర్చిలో లేడు’’

‘‘దేవాలయంలో దేవుడు లేడు, మరెక్కడున్నాడు? ఈ భూమండలమంతా ఉన్నాడు. మనుషులకి సేవ చేసే నిమిత్తమున్నాడు.’’

‘‘దేవుడెక్కడున్నాడు... ఇక్కడే ఈ భూమ్మీదే ఉన్నాడు. బహుజనులకి సేవ చేయండి. పేదల విషయంలో కరుణతో ఉండండి!’’

అలా అని ఆయన నాస్తికుడేమీ కాదు. 
‘భగవంతుడి పేరుతో భజన చేయండి... కీర్తన పాడండి... పువ్వులను సమర్పించండి’ అని చెప్తాడు.

గాడ్గే  నిరక్షరాస్యుడైనా  చదువొక్కటే సర్వరోగ నివారిణి అని గాఢంగా నమ్మాడు.
‘‘విద్య అనేది ఒక రక్ష, ధనం కూడా’’

‘‘మీ ఇంటి కప్పు ఊడిపోతున్నా పట్టించుకోకండి... కానీ పిల్లల్ని స్కూలుకి పంపించండి’’

 కుల వ్యవస్థను  తీవ్రంగా  నిరసించాడు.  అంటరానివారికి  తొలి ధర్మశాల కట్టించాడు.
‘‘కులం గురించి అడిగేవాడు నీచ నికృష్ట జంతువు, వాడు మానవేతరుడు, వాడి దాష్టీకం చూడు, కులం కావాలంట’’ అంటాడాయన.

‘నీ తండ్రి సారా తాగటం నీ కంట పడితే అతడితో నీ బంధాన్ని తెగతెంపులు చేసుకో. అతడు నీకు తండ్రి కాదు, శత్రువు’’  అని చెపుతూ మద్యం వ్యసనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.

29 ఏళ్ళ వయసులో  నాటి సిద్ధార్థుడి లాగే... సమాజం కోసం ..  ఇద్దరు పిల్లల్నీ, గర్భవతిగా ఉన్న భార్యనూ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాతికాలంలో కుటుంబ సభ్యులు తనను కలిసినప్పటికీ ఆ ఎడం అలాగే పాటించాడు. బంధుప్రీతికి ఏమాత్రం తావివ్వని ఆ  వ్యక్తిత్వం  ఎంత  శ్లాఘనీయమైనప్పటికీ  కుటుంబం పట్ల ఆయన నిర్మోహత్వం... వారి పట్ల కొన్ని సందర్భాల్లో  కాఠిన్యంగా మారింది.. అది నిర్లక్ష్యం అనదగ్గ స్థాయిలో ఉందని నాకు అనిపించింది.

అసంఖ్యాకమైన పేదల పట్ల చూపించిన అపారమైన కరుణను .. నిరుపేద స్థితిలో ఉన్న సొంత కుటుంబానికి  మాత్రం పంచలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది.   

రచయిత పరిశోధన
సాంబశివరావు
‘‘రంగు రంగుల గుడ్డ పీలికలను ఏరుకుని బాబా తన దుస్తులు కుట్టుకున్నట్టే, అనేక రకాలుగా , ముక్కలు ముక్కలుగా సేకరించిన సమాచారాన్ని ఓ పద్ధతిలో కూర్చాను’’ ఈ పుస్తక రచయిత చెప్పుకున్నాడు.

గాడ్గే గురించి మహారాష్ట్రలో  తెలుసేమో గానీ, ఇతర ప్రాంతాలవారికి ఏమీ తెలియదు. ఎప్పుడో 1956లో కన్నుమూసి, చరిత్రలో విస్మరణకు గురైన వ్యక్తి జీవిత చరిత్రను పునర్నిర్మించటం అంత సులువు కాదు.

అందుకే  ఈ పుస్తకం రాయటానికి  ఆసక్తితో పరిశ్రమించాడు.  పరిశోధనే చేశాడు.

మహారాష్ట్ర చాలాసార్లు వెళ్ళాడు. గాడ్గే జీవితంతో సంబంధమున్న ఊళ్ళను తిరిగాడు. ముంబైలో గాడ్గే కట్టించిన ధర్మశాలలను చూశాడు. గాడ్గే గురించి ఇప్పటికే ఉన్న మరాఠీ, హిందీ పుస్తకాలను ఆ భాషలు తెలిసిన మిత్రుల సాయంతో చదివాడు.

ఇంత చేసి  కూడా  ‘‘ ఇప్పటివరకూ అరకొరగా ఉన్న సమాచారానికి , మరికొంత జోడించటమే నేను చేసింది’’ అంటూ  వినమ్రత ప్రదర్శించాడు.

* * * 
వార్తలకు శీర్షికలు ఎంతో  బాగా పెడతాడని  సాంబు/సాంబకు ఇప్పటికే  చాలా పేరుంది,  జర్నలిస్టు సర్కిల్స్ లో! 

చమక్కుల ‘పన్’లను అలవోకగా  పన్నటంలో  పెన్ నిధి!
*   బహుజన పక్షపాతి  బీఎస్ రాములుకు ‘బీఎస్పీ రాములు’ అని పేరు పెట్టాడు.
*   ఆయిల్ పుల్లింగ్ లో పుక్కిలించటం ఉంటుంది కాబట్టి... దాన్ని ‘ఆయిల్ పుక్కిలింగ్’ అంటాడు.
* కేశినేని వాళ్ళు అంతరిక్షానికి (స్పేస్) కూడా రవాణా సర్వీసులు నడపగలరని  ‘స్పేసినేని ట్రావెల్స్’ అనే పదబంధాన్ని సృష్టించాడు.
* కొందరి క్రియేటివిటీపై  అతడి వ్యంగ్య వ్యాఖ్యానం.. క్రిమేషన్  స్ఫురించే  ‘క్రిమేటివిటీ’.

ఇలాంటి  విరుపుల మెరుపులను  మోహన్ కార్టూన్లతో మిళాయించి గతంలో ఆంధ్రజ్యోతిలో వారం వారం ఓ శీర్షిక కూడా నడిపాడు.

ఇంతటి  సహజ చమత్కారి కూడా ఈ పుస్తకంలోని  గంభీరమైన విషయాలకు అనుగుణమైన రచనా శైలిని పాటించాడు.  సమాంతర చరిత్ర గురించి రాసిన తొలి అధ్యాయం- ‘ప్రత్యామ్నాయ పరంపర’ ఈ పుస్తకానికి చక్కటి భూమికను ఏర్పరిచింది.

చిన్న చిన్న అధ్యాయాలుగా విభజించటం, రచన ఆసాంతం ఆసక్తికరంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవటం గమనించవచ్చు.

ఈ పుస్తకంలోని కొన్ని అధ్యాయాలకు పెట్టిన  శీర్షికలు చూడండి-
పాల బుగ్గల జీతగాడు- జనం మెచ్చిన పాటగాడు

మరో సిద్ధార్థుడు ఇల్లు వదిలాడు

మూఢ నమ్మకాలపై చీపురు తిరగేసిన బాబా

కుటుంబానికి మిగిలింది కష్టం... కాయకష్టం

రుచిని జయించిన రుషి

వైరాగ్యమే మహాభాగ్యం

బాగున్నాయి కదూ?

పుస్తకంలో  అవసరమైన చోట స్పష్టత కోసం ఫుట్ నోట్సూ,  సందర్భోచితమైన ఫొటోలూ, చిత్రాలూ  ఇవ్వటం బాగుంది.

వందేళ్ళ క్రితమే పారిశుద్ధ్యం ఆవశ్యకతను గుర్తించిన గాడ్గేను ‘స్వచ్ఛభారత్’ సందర్భంగా కూడా  కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా గుర్తింపులకు  అతీతమైన అసమాన వ్యక్తిత్వం  ఆయనది.  విలక్షణమైన ఆయన జీవితగాథను తెలుగులోనే  తెలుసుకోవటం మంచి అనుభవం!

‘విశాఖ బుక్స్’ ప్రచురించిన ఈ పుస్తకం... ప్రముఖ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.

040-27090197, 9948299940 నంబర్లకు ఫోన్ చేసి పుస్తకం వివరాలు తెలుసుకోవచ్చు. 150 రూపాయిల వెల ఉన్న ఈ పుస్తకాన్ని 10 కాపీలు , అంతకంటే మించి తీసుకునేవారికి  తగ్గింపు ధరకు ఇస్తారు.

కొత్త చేర్పు (22.1.2017):  ఈ పుస్తకం గురించి రాసిన చిన్న రివ్యూ ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది. అది- 

  

28, నవంబర్ 2016, సోమవారం

ఆ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి: రంగనాయకమ్మ

రంగనాయకమ్మ
కరు సహజ సుందరంగా, తీయగా  పాడే  గాయని.
మరొకరు  మౌలిక భావాలతో  పదునుగా  రాసే రచయిత్రి.

వాళ్ళు... 
బాల సరస్వతీ,  రంగనాయకమ్మా!

ఆపాత మధురమూ, ఆలోచనామృతమూ  అయిన  ఆ ఇద్దరికీ  పరస్పరం...  స్నేహం, గౌరవం, ఇష్టం.

వారిద్దరూ ఈ మధ్య  కలుసుకున్నారు.
 
ఆ గాయని తమ ఇంటికి వచ్చినప్పటి ఘట్టాన్నీ , తన జ్ఞాపకాలూ,  అనుభూతులను  రంగనాయకమ్మ  ఓ వ్యాసంగా రాశారు.  అది ఏ పత్రికలోనూ  రాలేదు.

కొత్తగా  విడుదలైన ఆమె వ్యాసాల పుస్తకం ... ‘మార్క్సే నా టీచరు!’ లో  ఉందీ వ్యాసం.

 ఈ పుస్తకంలో సామాజిక, రాజకీయ అంశాల పై, భాషా సాహిత్య  అంశాలపై వ్యాసాలు ఉన్నాయి. 

బాల సరస్వతి గురించి రాసిన వ్యాసం విభిన్నంగా... ఆత్మీయ స్పర్శతో  ఉండటం వల్ల... నాకు ప్రత్యేకంగా  నచ్చింది.  

దీనిలో  ప్రస్తావనకు వచ్చిన  బాల సరస్వతి పాటలు నాకింతవరకూ తెలియనివే. ( నేనంతగా ఇప్పటివరకూ  పట్టించుకోనివి అన్నమాట...)

ఆమె సినిమా పాటలు -  అవి కూడా కొన్ని  మాత్రమే వినివున్నాను.

అందుకే ఆ లలిత గీతాలను  వినాలనే ఉద్దేశం కలిగింది. 

కొన్నేళ్ళ క్రితం నుంచీ హార్డ్ డిస్కులో భద్రంగా ఉన్న బాల సరస్వతి  పాటల్లో  కొన్నిటిని  ఇప్పుడు  విన్నాను.


రంగనాయకమ్మ వ్యాసాన్ని ఇక్కడ...ఈ  బ్లాగులో  ఇస్తున్నాను. 

బ్లాగులో  ఏ పోస్టు అయినా  నిడివి ఎక్కువ ఉంటే పాఠకులకు ఆసక్తిగా ఉండదు. అందుకే  దాన్ని మొత్తంగా కాకుండా... కొన్ని భాగాలను మాత్రమే  ఇక్కడ ఇస్తున్నాను.  

బ్లాగులో  పాటలు కూడా వినిపించే సౌలభ్యం ఉంది కదా?  అందుకని వ్యాసంలో ప్రస్తావించిన  బాల సరస్వతి పాటలు మూడిటినీ, ఒక  లతా మంగేష్కర్ పాటనూ  ఇస్తున్నాను.

సంగీతాభిమానులు వాటిని ఆస్వాదించవచ్చు.  

               * * *

రంగనాయకమ్మ గారి వ్యాసం ఇదిగో...

-----------------------------------------------------                 -----------------------------------------------------

నా చిన్నప్పుడు మా ఇంట్లో గ్రామ ఫోను వుండేది. మా నాన్నకి పాటలు ఇష్టం. ఎప్పుడూ రికార్డులు కొనేవాడు. ఆ రోజుల్లో, ఒక గ్రామఫోను రికార్డు, 3 రూపాయల పావలా అని గుర్తు.

 ఒకసారి ఏదో వూళ్ళో ఒక జమీందారు ఇంటికి వెళ్ళాననీ, అక్కడ ఎవరో తనకి ఒక గ్రామ ఫోన్ రికార్డు ఇచ్చారనీ, తీసుకొచ్చాడు. అది, కొన్నది కాదు, ఆ రికార్డుని గ్రామ్ ఫోన్ లో వేస్తే, ‘‘ఆ తోటలో నొకటీ’’ పాట వచ్చింది. అది బాల సరస్వతి  పాట అని రికార్డు మీద వుంది. రెండో పక్క కూడా ఆవిడిదో, రాజేశ్వర్రావుదో వుంది. గుర్తులేదు.

అప్పటి నించీ  ‘‘ఆ  తోటలో నొకటీ’ పాటా,  ఆ కంఠమూ, అలవాటయ్యాయి ఇష్టంగా. తర్వాత కాలంలో బాల సరస్వతీ, రాజేశ్వర్రావూ కలిసి పాడిన ‘‘రావే రావే కోకిలా! రాగము పాడవే కోకిలా !’’ పాటా; ‘‘తుమ్మెదా ఒక సారీ, మోమెత్తి చూడమనీ’’ పాటా-  అలాంటివి రేడియోలో వినడం వుండేది.




వినేసి వదిలెయ్యడం కాదు; మరుపు వుండేది కాదు. ఇప్పుడైతే, ఆ పాటలన్నీ టేపుల్లో నా దగ్గిర పెట్టుకున్నాను. ఆ పాటలు, ఆ కాలపు రికార్డుల నించి టేపుల్లోకి ఎక్కించి అమ్మినవి. ఆ టేపులు కొని, ఆ పాటల్ని ఒక వరసలో నేను మళ్ళీ కొత్త టేపుల్లోకి ఎక్కించుకుంటే, సౌండ్ ఎంతో తగ్గిపోయాయి. 



బాల సరస్వతి  మైసూర్ లో వున్న రోజుల్లో ఆవిడితో ఉత్తరాల పరిచయం వుండేది. ఆవిడ ఒకసారి హైదరాబాదు వచ్చి ఏదో హోటల్లో దిగి వున్నారు. ఆ సంగతి తెలిసి, వెంటనే వెళ్ళి, ‘‘మా ఇల్లు వుండగా, మీరు హోటల్లో వుండడం ఏమిటి? ఎన్నాళ్ళయినా మా ఇంట్లో వుండండి!’’ అని పిలిచి తీసుకొచ్చాం.

అప్పుడు ఒక వారం రోజులు వున్నట్టున్నారు, మా దగ్గిర. ఆ రోజుల్లో మాకు వాషింగ్ మిషన్ లేదు. బట్టల పనిని ఇంటి కార్మికురాలి మీద ఎప్పుడూ పెట్టలేదు. మేమే ఉతుక్కునేవాళ్లం. బాలమ్మ గారి బట్టలు నేనే ఉతికేదాన్ని. ఆవిడ ‘‘అయ్యో, అయ్యో’’ అనేవారు.

‘‘అయ్యో, అయ్యోలు కావు. మీరు కోకిలలాగా పాడుతూ వుండండి, నేను పనులు చేస్తూ వుంటాను’’ అని నేను అనేదాన్ని.

‘‘నాది, ‘కోకిల కంఠం’ కాదు; నేను బేస్ లోనే పాడతాను’’ అన్నారు ఆవిడ ఒకసారి.

నాకు కోపం వచ్చింది. ‘‘మీరు, మీ పెళ్లి మీద చెప్పుకోండి, ‘మీ కంఠం’ మీద చెప్పకండి! మీ కంఠం అందం మీకు తెలిస్తే, మీ జీవితం ఇంకో రకంగా వుండేది’’ అన్నాను.
ఆవిడ నవ్వి వూరుకున్నారు.

‘‘ఉందువో మధురానగరిలో; కృష్ణా! బృందావనిలో ఎందును లేవే’ పాట బాలమ్మ కంఠంతో ఎంత మధురం!



ఆ మధురానగరీ, ఆ బృందావనం, ఆ కృష్ణుడూ, అవేవీ నాకు పట్టవు. ఆ రాగం, ఆ కంఠం, ఆ సంగీతం, కావాలి నాకు! బాలమ్మకి అది ‘‘భక్తే’’! నాకు అది సంగీతం! ఆ పాటని తయారు చేయించిన సినిమా వాళ్లకి అది, డబ్బు మార్గం బహుశా! ఎవళ్ళకి ఏది కావాలో అదీ!
                


‘‘రావే రావే కోకిలా!’’ పాడిన ఆ బాల గాయని, తన కంఠ మాధుర్యం ఏ మాత్రమూ తెలియని, పెద్ద వయసు మూర్ఖుణ్ణి, అప్పటికే ఇద్దరు భార్యలు బ్రతికి వున్నవాణ్ణి, ఆ భార్యలకు సంతానం లేదని మూడో భార్య కావాలనుకున్నవాణ్ణి,  మన చిట్టి గాయని తన 17 ఏళ్ళ బాల్యంలో, అతి సంతోషంగా పెళ్ళి చేసుకుంది! అతను ఒక  చిన్న జమీందారు. అంటే, భూమి కౌళ్ళు తింటూ, గుర్రాల మీద పోలో ఆటలు ఆడుతూ, వేశ్యల అందాలు భార్యలకు వినిపిస్తూ తిరిగే జులాయి ధనికుడు!  ఆ ధనికుడి దగ్గిరికి కూడా మా నాన్న, పత్రిక చందా కోసం వెళ్ళినప్పుడే, ‘‘ఆ తోటలో నొకటి’’ పాట రికార్డు మాకు దొరికింది!

17 ఏళ్ళప్పుడు పెళ్ళంటే, అది అతి చిన్న వయసు! సంగీతం తప్ప కొత్త భావాలు లేవు, ఆ బాల గాయనికి. సినిమా పాటల మనిషి. పాటలే కాదు; చిన్నప్పుడు సినిమాల్లో వేసింది కూడా. తల్లిదండ్రులు కూడా, జమీందారీ సంబంధానికి ముగ్ధులైపోయారు. ఈ పిల్ల, గుర్రప్పందాలకు పోయినప్పుడు, ఆ ధనికుడు ఈ పిల్లను చూసి, వీళ్ళ కుటుంబం వెంటపడ్డాడు. గుర్రప్పందాలకు తిరిగే సినిమాల పిల్లకి, ఎలాంటి భావాలు వుంటాయి? మూడో భార్యగా మారడానికే ముచ్చట పడిపోయింది!

బాలమ్మతో యుగళ గీతాలు పాడే రాజేశ్వర్రావు గారు అడిగాడట, బాలమ్మ తండ్రిని. ‘‘అమ్మాయిగార్ని నేను పెళ్ళి చేసుకుంటాను’’ అని! కానీ, అడిగిన వాడికి అప్పటికే భార్య వుంది! అయినా, రెండో పెళ్ళి చేసుకుంటానన్నాడు! బాలమ్మ తండ్రి ఒప్పుకోలేదు, ‘‘రెండో పెళ్ళి ఏమిట’’ని! కానీ, కూతుర్ని మూడో పెళ్ళికి నిర్ణయించాడు.

బాలమ్మకి, రాజేశ్వర్రావు మీద ఆసక్తి లేదు. నేను అడిగితే, ఆవిడ ఆ మాట గట్టిగా చెప్పింది. అతనితో, కలిసి పాడడం వరకే గానీ, అది ‘‘ప్రేమ’’వేపు పోలేదు. రాజేశ్వర్రావు మీద తనకి అలాంటి ఆసక్తి లేదని చాలా గట్టిగా చెప్పారు ఆవిడ. జమీందారు గారికి మూడో భార్య అవడానికే ఇష్టపడింది!

ఆ 45 ఏళ్ళ జమీందారు సరసన, ఈ 17 ఏళ్ళ బాల వధువు, నిలబడి వున్న ఫొటో వుంటుంది! ఈ వధువు, ఎంతో అణకువతో, ఎంతో వినయ విధేయతలతో, నిలబడి వున్న బొమ్మలాగ కనపడుతుంది ఆ ఫొటోలో!

ఆ పెళ్ళి తర్వాత ఆ భర్త, ఆమె కంఠాన్ని ఆపేశాడు! ఆమె పాడాలంటే, అతని పర్మిషన్ కావాలి! సినిమాల వాళ్ళు అలాగే చేసేవారు. అతన్ని బ్రతిమాలుకుని, ‘‘మా సినిమాలో అమ్మగారి పాట తప్పకండా వుండాలండీ’’ అని అతనికి చెప్పుకుని, అతని అనుమతి కోసం అడిగేవారు. ‘‘సరే, వెళ్ళి పాడి వచ్చెయ్యి!’’ అనేవాడు. అలాంటి మాటలన్నీ చెప్పేవారు ఆవిడ నాతో. ఇంకా చాలా చెప్పారు.

నేను బాధపడి పోయేదాన్ని. ‘‘మీరు చాలా తప్పు చేశారు!! చాలా తప్పు చేశారు! మూడో భార్యగా పెళ్ళేమిటి? అయ్యో! ఎంత తప్పు చేశారు!’’ అనేదాన్ని.

‘‘అవును, చిన్నదాన్ని. తెలీదు అప్పుడు నాకు’’ అంటారు ఆవిడ.

బాల సరస్వతి
    
బాలమ్మగారి కుటుంబం, మైసూర్ నించి హైదరాబాదు వచ్చేశారు. వచ్చి, వాళ్ళు దిగిన ఇల్లు, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీలో మేము (నేను) కన్నీళ్ళతో వదిలి వచ్చిన అద్దె ఇల్లు! ఆ ఇంటి ప్లాను, మా జీవితాల్లో ఒక భాగం అనుకుంటూ, అదే ప్లానుని  ఇంకా మెరుగు చేసుకుని, ఆ ప్లానుని వదలకుండా వుంచుకున్నాము.

కానీ, ఆ ప్లాను ఇల్లు, బాలమ్మ గారికి నచ్చలేదు. నేలకి సాదా సిమ్మెంటు వుండడం, ఆమెకి నచ్చలేదు. ఆమెని కలవడానికి వెళ్ళి, ఆ ఇంట్లో మళ్ళీ కాలుపెట్టి, ‘‘ఇదేం ఇల్లు? మార్చెయ్యాలి’’ అని ఆవిడ అనడం విన్నాను. షోకైన ఇళ్ళల్లో బతికిన మనిషి ఆవిడ.

ఆవిడ ఈ వూరు వచ్చేశాక, అప్పుడప్పుడూ మేము వెళ్ళడం, ఆవిడ రావడం, జరుగుతూనే వుంది.

మొన్న ఒకసారి ఆవిడ, ‘‘మీ దగ్గిరికి ఒకసారి రావాలనిపిస్తోంది’’ అన్నారు.

అప్పుడు నేను ‘‘వేదాల’’ పుస్తకం పనిలో బిజీగా వున్నాను. అయినా, ఆవిడికి 87 ఏళ్ళు. నాకు 77. ఇద్దరికీ పెద్ద వయసులే. అప్పుడప్పుడూ కలవడం మంచిదే కదా? రేపేం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఆ మర్నాడే ఆవిడ వచ్చేలాగ, టాక్సీ రెడీ చేశాం.

ఆవిణ్ణి చూడాలని ఒక స్నేహితురాలు ఉష కూడా వొచ్చి వుంది. టాక్సీ దిగిన బాలమ్మగార్ని తీసుకురమ్మని ఉషని పంపించాను గానీ, కాళ్ళ నొప్పుల వల్ల నేను వెళ్ళలేదు. టాక్సీ రాగానే ఉషే వెళ్ళి ఆవిణ్ణి పట్టి తీసుకురాబోయింది.

‘‘అక్కరలేదు’’ అంటూ ఆవిడ చిన్న పిల్ల లాగ చక చకా వరండా మెట్లెక్కి గబగబా నడుచుకుంటూ వచ్చేశారు! ఆవిడ నడక మీద, అందరికన్నా నేనే ఎక్కువ ఆశ్చర్యపోయాను, నెప్పుల కాళ్ళదాన్ని!

బాలమ్మగారికి స్వీట్లు అంటే పిచ్చి ఇష్టం! షుగర్ జబ్బు లేదు.

టేప్ రికార్డర్ లో, ఆమె పాడిన ‘‘తన పంతమె’ పాట వినపడుతూ వుండగా ఆవిడ గది లోపలికి వచ్చారు.

ఆవిడ రాక ముందే, ‘‘రావే రావే కోకిలా’’ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి నాకు. ఎప్పుడూ అలా జరగలేదు. ఆమె ఎంతో చిన్నప్పుడు పాడిన పాట అది.



పెద్ద వారై పోతున్నారు. మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని నాకూ అనిపించింది. పాటలు వినపడుతూనే వున్నాయి. ఆవిణ్ణి కావిలించుకోవాలనిపించింది.

వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషిని ఎలా కావిలించుకుంటాను? ఆవిడ దగ్గిరికి పోయి, పక్కనే కూర్చోవాలని నేల మీద కూర్చోబోతోంటే, ఆవిడ నా చేతులు గట్టిగా పట్టుకుని ‘‘వొద్దు, వొద్దు’’ అని చాలా వారించారు.

‘‘కాదు, కొంచెం సేపు కూర్చుంటాను. నా కలా అనిపిస్తోంది’’ అంటూ, ఆవిడికి దగ్గిరిగా నేల మీద కూర్చుని ఆవిడి ఒడిలో మొహం పెట్టి, ఆవిడి పాటలు వస్తోంటే వింటూ కూర్చున్నాను. కొంతసేపు కూర్చుని లేచాను.

ఆవిడి పెళ్ళి గురించి ఆవిడికి బాధ వుండదు గానీ, నాకు చాలా బాధగా వుంటుంది. ఆ పెళ్లి జరగకపోతే, అసలు లతకి లాగ ఏ పెళ్ళీ జరగకపోతే, ఆవిడి పాటలు ఇంకా చాలా వినగలిగే వాళ్ళం.

అప్పటికి సినిమాలు ఇంకా భ్రష్టు పట్టలేదు. సంగీతాలు చచ్చిపోలేదు. తప్పకుండా కొన్ని మంచి పాటలే వచ్చేవి బాలమ్మ కంఠంతో.

చందమామకి భర్త వుంటే, ఆ భర్త, చందమామతో, ‘‘నువ్వు వెన్నెల కాయొద్దు! అందరూ చూస్తున్నారు. అంతా దాచు!’’ అంటాడు.

అప్పుడు, చందమామ ఏం చేస్తుంది? భర్త ఆగ్న్య కదా? భూమికి వెన్నెల రాదు!


బాల సరస్వతికి, భర్త వుండడం వల్ల, ఆమె కంఠానికి సంకెళ్ళుపడ్డాయి! అతని  దయతోనే అవి తెరుచుకునేవి. బాలమ్మ కంఠస్వరం ఇచ్చే వెన్నెల, మసక బారిపోయింది. భర్తలూ భార్యలూ కూడా సంగీతకారులైనప్పుడు, వాళ్ళ వివాహాల తర్వాత, ఆ భర్తలు, భార్యల సంగీతాల్ని ఆపి వేస్తారని, పేరున్న సంగీతకారులైన భర్తల గురించే విన్నాం. ఇటువంటి వార్త, రవి శంకర్ గురించి ఒకప్పుడు ఏదో పత్రికలో చదివాను.

కళానిధులైన భార్యలకు భర్తలు, అడ్డుకట్టలు! ప్రమాదకారులు!

గాయనీమణుల గానాలలో, అతి మాధుర్యాలు- బాలమ్మా, లతమ్మా! ఈ ఇద్దరూ  ఇతరుల కన్నా వేరు అనిపిస్తారు నాకు. ఎందరో  పాడతారు. అందరూ సంగీతాల నిధులే. అందరూ రమ్యంగానే పాడతారు. అందర్నీ వింటాం. ఎవరికి వారు, వేరు వేరు! కానీ, బాలమ్మా, లతా, మరీ వేరు!

లతని కూడా కావిలించుకోవాలనే వుంటుంది నాకు. కానీ, ఆమె కంఠానికే దాసోహం అవుతాను గానీ, ఆమె భావాలూ, ఆమె ప్రకటనలూ, చాలా అధమ స్థాయిలో వుంటాయి.

‘‘ఏమిటి లతా? అప్పుడప్పుడూ మతి లేకుండా మాట్లాడతావు? ఎవరికో ‘భారత రత్న’  రావడానికి ఉపవాసం చేస్తానంటావు! ఎవరో ‘ప్రధాన మంత్రి’ అవడానికి ఏదో చేస్తానంటావు! మతి పోతుందా? అంత ఆలోచించవేం?’’ అని అడిగేసి, తర్వాత ఆమె చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటాను. కానీ, బాలమ్మ లాగ లత, మా ఇంటికి రాదు కదా? ‘‘నిన్ను చూడాలని వుంది’’ అనదు కదా? ఒక సారి మా ఇంటికి వచ్చి, బాలమ్మ లాగ నాకు కబుర్లు చెప్పదు కదా?

లత చాలా తెలివైనది! ‘‘లతా! నువ్వు పెళ్ళి చేసుకోలేదు. నీకు భర్త వుంటే, మాకు నీ కంఠంతో దొరకకుండా ఎన్ని పాటలు పోయేవో! నీకు చిన్నప్పుడే భర్త వుంటే, ‘‘ఆయెగా, ఆనే వాలా’’ దొరికేది కాదు కదా? ఇక, ఏ పాటలు దొరికేవి?



 ఎంత తెలివైన దానివి! నువ్వు తెలివితో చేశావో, ఎలా చేశావో గానీ, నీ గానానికి ‘‘భర్త’’ అనే అసూయాపరుడు లేకుండా, నిన్ను అడ్డుకునే పెత్తందారుడు లేకుండా, చేసుకున్నావు.

నువ్వు మా కోసం పాడావు! ఎంత మంచిదానివి లతా! బాలమ్మ అమాయకురాలు గానీ, మధుర గాయని, నీ లాగే! మీ ఇద్దరి గానాలకీ, నా ముద్దులు!

-----------------------------------------------------                 -----------------------------------------------------

29, అక్టోబర్ 2016, శనివారం

వేదాలూ... హేతువాదాలూ!

 
రామాయణ, మహాభారత, మహా భాగవతాల్లో  ఏముందో  నా చిన్నవయసులోనే  ‘చందమామ’, ఇతర పుస్తకాల ద్వారా  తెలుసు. వాటి మూల గ్రంథాలను (తెలుగు వచన అనువాదాలే) తర్వాతి కాలంలో చదివాను. 

అయితే  వీటన్నిటికంటే ప్రాచీనమైన వేదాల గురించి ఇన్నేళ్ళుగా వింటూ ఉండటమే గానీ,  పెద్దగా తెలుసుకున్నదేమీ లేదు. 

అవి  కథా రూపంలో  ఉండకపోవటం  దీనికో కారణం కావొచ్చు!

‘భారతదేశ చరిత్ర’ పుస్తకాల్లో ఆర్యుల గురించీ, వేద కాలపు సమాజం గురించీ కొంత చదివినప్పటికీ అది వేదాలను చదవటమైతే  అవ్వదు కదా!

‘నాస్తికో వేద నిందక:’  అంటారు కదా? వేదాలను నాస్తికులు ఎందుకని నిందించారు? అసలు వాటిలో ఏముంది? ( అసలు వేదాల్లోనూ నాస్తికుల ప్రస్తావన కనిపిస్తుంది).  

ఈ సందేహాలను నివృత్తి చేసుకోవటం ఇన్నేళ్ళ తర్వాత కుదిరింది! 

దానికి కారణం... రంగనాయకమ్మ ఈ మధ్య రాసిన  వేదాల పరిచయ పుస్తకం- ‘ఏం చెప్పాయి వేదాలు?’

పవిత్రం... ప్రామాణ్యం..!

రుగ్వేదంలో  మొదటి శ్లోకం..
వేదాలను ప్రస్తావించి  మాట్లాడేవారు అవి పవిత్రమైనవనే చెపుతుంటారు.  శుభకార్యాలకు నాందిగా,  కొనసాగింపుగా నేపథ్యంలో  వేద మంత్రోచ్చారణలూ,  వేదఘోషలూ..!

వేదోక్తమంటే అది అనుల్లంఘనీయమో, అనుసరణీయమో అనే స్థాయిలో గౌరవాదరాలు కనపడుతుంటాయి.

ఫలానా దురాచారం వేదాల్లో లేదని చెప్పటానికీ, వాదాల్లో నెగ్గటానికి  ‘వేద ప్రామాణ్యాన్ని’ తురుపు ముక్కలా ఉదాహరించటానికీ  పండితులూ, సంస్కర్తలూ  ప్రయత్నించటం ఇటీవలి చరిత్రే..

వేదాల్లో  కుల (వర్ణ) వ్యవస్థ లేదనీ, అవి  స్త్రీల పట్ల ఎంతో గౌరవం చూపాయనీ నమ్మకంగా వాదించే వ్యాసాలు నెట్ లో ఇప్పటికీ చూడొచ్చు.

‘దయ్యాలు వేదాలు వల్లించినట్టు’ లాంటి సామెతలు  వేదాల పట్ల ఎంతో అనుకూల భావాలను కలగజేస్తుంటాయి.

అయితే... వేమన పద్యాలు కొంత మినహాయింపు అనుకోండీ...

‘‘వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమల పెట్టి తేటపడగనియవు
గుప్త విద్య యొకటి కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమ’’


వేదాలపై  అపరిమితమైన  భక్తి విశ్వాసాలు ప్రకటించేవారిలో  కూడా  ఎంతమంది వాటిని చదివివుంటారు?

చదివినవారిలో,  ‘కంఠస్థం’కూడా చేసి వాటిని భక్తిగా వల్లించేవారిలో కూడా... అర్థాలను తెలుసుకున్నవారు ఎందరు?

‘‘మంత్రమును దలుతురు మంత్రార్థ మెరుగరు
అర్థమెరుగలేక అంధులైరి’’
అన్నాడు వేమన!


శ్లోకాల భావం యథాతథంగా...

వేదాలను  పరిచయం చేయటమంటే .. కేవలం వ్యాఖ్యానం చేయటం కాకుండా ... నాలుగు వేదాల్లోని  శ్లోకాలకు పండితులు చేసిన అనువాదాలను కూడా రంగనాయకమ్మ ఈ పుస్తకంలో  ఇచ్చారు.  అలా  యథాతథంగా ఇవ్వటం ఎందుకు చేశారో...  ఆమె ఇలా చెప్పారు... .


 ఈ  ‘ఏం చెప్పాయి వేదాలు?’ పుస్తకం చదివాను.

దీనిలోని పది అధ్యాయాల్లో మొదటి నాలుగిటినీ నాలుగు వేదాల శ్లోకాల భావాలకు  కేటాయించారు. ఆరో అధ్యాయం పెద్దది. దీనిలో  15  అంశాలున్నాయి. మరో నాలుగు అధ్యయాల్లో వేద భక్తుల వాద భేదాలు మొదలైనవి చర్చించారు,
 
పుస్తకమంతా వేదాల్లోని  అంశాలను విశ్లేషించటం,  ప్రశ్నించటం, తర్కించటం  కనపడుతుంది. 

తన భావాలనూ, దృక్కోణాన్నీ నిక్కచ్చిగా... కుండబద్దలు కొట్టినట్టు  చెప్పటం ఆమెకు అలవాటే కదా!

ఈ పుస్తకంపై  ఈనాడు ఆదివారం పుస్తకంలో చిన్న రివ్యూ ఇలా  రాశాను...


ఒక వేపు జంతు బలుల గురించీ; ఇంకో వేపు మానవుల్లో భేదాల గురించీ బోధిస్తాయి వేదాలు. 

ఆ కాలంలో కూడా  హింసాయుత యజ్ఞాల్ని వ్యతిరేకించేవాళ్ళూ,  ఇంద్రుణ్ణి వ్యతిరేకించే మాయావాదులూ (నాస్తికులు)  ఉన్నారని వేదాల ద్వారానే తెలుస్తుంది.

‘‘వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం’’ అని ‘బాటసారి’ సినిమాలో ఓ పాట ఉంది.

వేదశాస్త్రాలు చదివినవారికే కాదు, సాక్షాత్తూ  రుగ్వేదంలోని ‘నాసదీయ సూక్తం’... సృష్టి గురించి సృష్టికర్తక్కూడా తెలియదేమో అంటూ సందేహాలను ప్రకటిస్తుంది.  దీనికి నాస్తిక వాదాల ప్రభావం కారణం కావొచ్చు.
 

టెలివిజన్లో చర్చ..

ఈ  పుస్తకం విడుదలయ్యాక...  టీవీ 9 వాళ్ళు  ఒక చర్చా  కార్యక్రమం ప్రసారం చేశారు. టీవీ చర్చలంటేనే అరకొరగా,  అసమగ్రంగా ఉంటాయనేది నా అభిప్రాయం.  దాన్నిరుజువు చేస్తూ ఆ కార్యక్రమం సాగింది.

యాంకర్ గానీ,  చర్చకు వచ్చిన  వేద పండితులు గానీ ‘ఏం చెప్పాయి వేదాలు?’ పుస్తకం చదవనే లేదు. (అది స్పష్టంగా తెలుస్తోంది...)  రచయిత్రి మాట్లాడిన మాటల్లో రెండు మూడు  ముక్కలు చూపించి వాటి ఆధారంగా చర్చ జరిపారు. ఇదంతా అర్థరహితంగా అనిపించింది. ..

ఈ  ‘చర్చ’ సాగుతుండగా టీవీలో యాంకర్  మాట్లాడిన మాటలు... ‘స్క్రోలింగ్’లోనూ  చూపించారు.  ఇవి  మరీ ఘోరం.

‘సోషల్ మీడియాలో రంగనాయకమ్మపై నెటిజన్ల ఎదురుదాడి’  అట.

నెటిజన్లందరూ  ఒకే రకమైన  ఆలోచనా  దృక్పథం ఉన్నవాళ్ళు అయినట్టు! 

ఈ పుస్తకం లోని విషయాలను గురించి ఏమీ ప్రస్తావించకుండా... చర్చించకుండా  ఫేస్ బుక్ లో  ఇద్దరు ముగ్గురు  అశ్లీల పదజాలంతో  రచయిత్రిపై పోస్టులు రాశారు.

ఆ  అసహనమేనా  ‘ఎదురు దాడి’  అంటే!

చర్చించే సత్తా లేని, సంస్కారంలేని వాళ్ళు  ఉక్రోషంతో ఆశ్రయించేది దూషణనే కదా?

స్క్రోలింగ్ లో మరో వాక్యం-

‘‘వేదం గురించి తెలియని రంగనాయకమ్మ విశ్లేషించడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’

వేదాల గురించి తెలియకుండానే, వాటిని  చదవకుండానే  ఆమె విశ్లేషించారా?

ఎవరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు? ఆ నెటిజన్లలో  ‘వేదం’ చదివినవారు ఎంతమంది? 
   .
కుల వ్యవస్థకు పునాది
‘వేదాలకు సకల ప్రాణిజాలం మీద అనంతమైన ప్రేమానురాగాల’ని వాటిని తెలుగులో అనువదించిన దాశరథి రంగాచార్య అంటారు.  కానీ ఆయనే ‘అశ్వమును వధించిన మాట వాస్తవము. ఆ వధ ఎవరి కొరకు జరిగినది?  సంకుచిత స్వార్థమునకు కాదు. సమస్త మానవాళి కల్యాణమునకు!’ అంటూ దానికి మళ్ళీ   సమర్థన!

అమానుషమైన వర్ణవ్యవస్థకు పునాది వేదాల్లోనే  ఉంది. 

రుగ్వేదం చివరిలో - పురుష సూక్తమ్ లో... వర్ణాల్ని దేవుడే  సృష్టించాడు అని చెప్పారు...


బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||


దీని  అర్థం -

‘‘ఆ విరాట్ పురుషుడి నుండియే బ్రహ్మాండము ఏర్పడినది... అతని ముఖము నుండి బ్రాహ్మణులూ; బాహువుల నుంచి  క్షత్రియులూ , తొడల నుంచి వైశ్యులూ, పాదముల నుండి శూద్రులూ జన్మించినారు’’


దీనిపై  రచయిత్రి వ్యాఖ్యలు-

‘‘విరాట్ పురుషుడి నుంచి బ్రహ్మాండం ఏర్పడింది. అసలు, విరాట్ పురుషుడు ఎవరి నుంచి ఏర్పడ్డాడు? ... ఈ సమాజంలో  ఆ 4 రకాల వర్ణాలూ కనపడుతున్నాయి. ఆ విరాట్ పురుషుడు కనపడటం లేదు.’’ 

‘‘దేవతల పేర్లతో జంతువుల బలులు ఎంత క్రూరమో, మానవుల్ని ఎక్కువ తక్కువలుగా భావించే విభజన, ఇంకో రకం క్రూరం!’’  


రుగ్వేదంలో-  స్త్రీల గురించి ఏం చెప్పారు?

రుషులు రుక్కుల్లో  కీర్తించే ఇంద్రుడి మాటల్లో - ‘‘స్త్రీ మనసును శాసించుట అసంభవము. స్త్రీ బుద్ధి కొంచెముది.’’

ఇక  ఊర్వశి మాటల్లో- ‘‘ స్త్రీల ప్రేమ నిలుచునది కాదు. స్త్రీ హృదయము తోడేలు హృదయము వంటిది ...’’  ( స్త్రీ ఎంతో చెడ్డదని స్త్రీతోనే చెప్పించారన్నమాట) 

‘మాకు ఆత్మజ్ఞానమును, కీర్తి ప్రతిష్ఠలను, ఆరోగ్యమగు దేహమును, భోగభాగ్యములను ప్రసాదించు’ అనే  ప్రార్థనపై రంగనాయకమ్మ వ్యాఖ్య...

‘‘కీర్తి ప్రతిష్ఠల ఆశకీ, ఆత్మజ్ఞానానికీ  ఎక్కడ పొసుగుతుంది? భోగభాగ్యాలకీ, ఆరోగ్యమగు దేహానికీ ఎక్కడ పొసుగుతుంది? సోమరసం పేరుతో , పిచ్చెక్కినట్టు మద్యాలు తాగుతూ, పొట్టల్ని గుట్టలుగా ఉబ్బించుకుంటూ వుంటే, ఇక ఆరోగ్యమా? భోగభాగ్యాలే పరిపూర్ణ ఆరోగ్యానికి శత్రువులు! ’’


జుర్వేదంలో  అశ్వమేధ వర్ణన... జుగుప్సాకరంగా ఉంటుంది.


‘అశ్వమా! లోకము దృష్టికి నీవు చంపబడినదానవు అగుచున్నావు. వాస్తవముగా నీకు మరణము లేదు. నీవు హింసింపబడుట లేదు. నీవు చక్కని మార్గమున దేవతలకు చేరుచున్నావు. అప్పుడు నీ కొరకు హర్యశ్వములు రథమునకు కూర్చబడును. అశ్వ సుందరాంగులు అందు ఉందురు. గాడిద బరువు మోసిన నీకు దివ్యాశ్వప్రాప్తి కలుగును’ 
(6-9-10) 


గుర్రం పేగుల్లో సగం అరిగిన గడ్డి గురించీ, పచ్చి మాంసం వాసన గురించీ, అశ్వ మాంసం నిప్పు మీద బాణలిలో ఉడికేటపుడు వచ్చే ‘పరిమళం ’ గురించీ  వర్ణనలు! 

దాన్ని కోసేవారు ‘పుణ్యాత్ములు’అట. ‘‘అశ్వమా!  ఎవడు నిన్ను నరుకును? ఎవడు నీ తోలు వలుచును? ఎవడు నీ అవయవములను కోయును? విద్వాంసుడే వీనినన్నిటిని చేయును. మరొకడు కాడు’’

పుత్ర సంతానం గురించి  ‘అధర్వ వేదం’ చెప్పిన మాటలు-
  
‘ఓ నారీ నీవు మగబిడ్డను  కను! ఆ తరువాతా పుత్రుడే కలుగు గాక! ఆ పుత్రులకు నీవు తల్లివి కమ్ము! ఆ తరువాత కలిగే పుత్రులకు కూడా తల్లివి కా!’’

ఆ వీర పుత్రులకు మళ్ళీ అతి వీర పుత్రులు కలగాలంటే , ఆ అతి వీర పుత్రులకు తల్లులు అయ్యేది ఎవరు? అని ప్రశ్నిస్తారు రంగనాయకమ్మ.



పుస్తకంలో ఆలోచింపజేసే  కొన్ని  వ్యాఖ్యలు:

*  వేద కాలాన్ని , క్రీస్తు కన్నా వెనక, 3 వేల నాడు కాకపోతే, 6 వేల నాడు కాకపోతే,  10 వేల నాడు అనుకుందాం. ఆ 10 వేల కన్నా వెనక, వేదం లేనట్టేగా? దాన్ని ‘నిత్యం, నిత్యం, నిత్యం’ అని ఎలా అనగలరు?  ‘వేద కాలం ఇదీ అని ఏదో ఒక కాలాన్ని  కనిపెట్టిన తర్వాత, అప్పుడు వేదం ఒక కాలంలో లేనిదే అవుతుంది గానీ, ‘నిత్య సత్యమైనది’ఎలా అవుతుంది?

* ‘వేదం నిత్యమే’ అని, వేదంలోనే ఒక మంత్రం వుంది! అయితే వేదం తనకి తనే గొప్పగా చెప్పుకుంటే, అది సత్యం ఎలా అవుతుంది? ఒక మనిషి  ‘నేను చాలా ఉత్తముణ్ణి! గొప్పవాణ్ణి ! ’ అని చెప్పుకుంటే, అది సరియైన వాదం అవుతుందా?  అవదు. ఆ  తప్పుకి , ‘ఆత్మాశ్రయ దోషం’ అనే పేరు కూడా వుంది.


*   వేదాలు ‘చాతుర్వర్ణాల్ని చెప్పాయ’ని దాన్నీ గొప్పగా చెప్పడమే! వేద కవుల్నే ‘సేవక వర్ణం’లో వుంచి, మిగతా వర్ణాలకు సేవలు చెయ్యమంటే, అప్పుడు తెలుస్తుంది చాతుర్వర్ణాల నీతి!  



 ... అన్నీ  వేదాల్లోనే ఉన్నాయిష!

ప్రాచీన కాలపు సాహిత్యాలన్నీ, అన్ని దేశాల్లోనూ కట్టు కథలుగా (మైతాలజీ), కల్పనలుగా, ఊహలుగా ఉంటాయి.  అవన్నీ ఆ నాటి మానవుల ఆశలనీ, కోరికలనీ అర్థం చేసుకోకుండా, వాటిని వాస్తవాలుగా నమ్ముతున్నారు.  వేదాల్లో  ప్రస్తావించిన కొన్ని ఊహలను  అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంగా భావించి ప్రచారం చేయటం ఇలాంటిదే. 

‘మనకు తెలియని ఏ సాహిత్యం గురించి అయినా , ‘‘ఇది చాలా గొప్ప గ్రంథం! పవిత్ర గ్రంథం!’’అంటూ దానికి మూర్ఖపు భజనలు చెయ్యడం కాదు. ఆ సాహిత్యం ఎలా వుందో, అందులో ఏం వుందో, చదివి చూడాలి ! అప్పుడే ఒక న్యాయమైన అభిప్రాయానికి రావాలి’’  అంటారు రంగనాయకమ్మ. 

నిజమే కదా? 

చతుర్వేదాలపై  ఆరుగురి అనువాదాలతో  కలిపి 18  పుస్తకాలూ,  వికీపీడియా వ్యాసాలూ  చదివాకే  ఈ  పుస్తకం రాశారామె.

కథగా లేకుండా,  కేవలం స్తోత్రాలూ,  ప్రార్థనలతో సాగే  వేదాలను చదవటమే ఎంతో విసుగుపుట్టే వ్యవహారం. అయినప్పటికీ దాన్ని భరించి వాటిని పరిచయం చేయటం  అంటే.. ఎంతో శ్రద్ధ, ఓపిక,  నిబద్ధత... ఉంటే తప్ప సాధ్యం కాదు.

ఒక పుస్తకాన్ని (అది వేదాలు  కావొచ్చు;  వేదాలపై చేసిన ఇలాంటి పరిచయం/ విమర్శ కావొచ్చు)  ఇష్టపడటానికైనా,  దానిపై వ్యతిరేకత చూపడానికైనా  దాన్ని చదవటం,  తెలుసుకోవటం కనీసమైన  షరతు.

అదేమీ చేయకుండా  వెలిబుచ్చే  అభిప్రాయాలకూ,  చేేసే వ్యాఖ్యానాలకూ  విలువ ఉంటుందా? 

21, సెప్టెంబర్ 2016, బుధవారం

వేగుచుక్కా... తోకచుక్కా!

గురజాడ  చూసి  వర్ణించిన ‘హేలీ’ ఇదే   ( 1910  నాటి ఛాయాచిత్రం)

 నింగిలో వెలిగే  హేలీ తోకచుక్కను ‘చన్నకాలపు చిన్నబుద్ధులు’  కీడుగా భావించి బెదిరిపోతే...

ఆ మూఢ విశ్వాసాన్ని ఖండించి-

దాన్ని భూమికి దూరబంధువుగా,
నరుల కన్నుల పండువగా భావించిన,
సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా సంభావించిన
మహాకవి గురజాడ అప్పారావు...

వ్యావహారిక భాషకు కావ్యగౌరవం కల్పించిన నాటకకర్త.

భాషలో, భావంలో.. తన కాలం రచయితలకంటే కంటే ఎంతో ముందుచూపున్న ఆయన రచనా స్వరూపం అందరికీ తెలిసిందే.

మరి ఆయన భౌతిక రూపం ఎలా ఉంటుంది? 



మనం చూసే ఇలాంటి  ఒకటి రెండు ఫొటోల కంటే మించి-
ఆయన ‘ఫీచర్స్’ను గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది కదా!

అందుకని... గురజాడను ప్రత్యక్షంగా చూసిన, ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళనుంచే ఆ సంగతులు విందాం...

సుబ్రహ్మణ్యం  సాన్నిహిత్యం

ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం  గారు .. కన్యాశుల్కం ప్రచురణ అవుతున్నకాలంలో దాని విశేషాలను గురజాడ నుంచి  లేఖలుగా అందుకున్న అరుదైన వ్యక్తి.  ఆయన ఇలా చెప్పుకొచ్చారు-
  
 ‘‘ఆ రోజుల్లో నేను అప్పారావు గారి వెంట ఎప్పుడూ వుండేవాణ్ణి. సాహితీవేత్త అంటే ఇలాగ వుండాలని నేనాయన్నొక ఆదర్శమూర్తిగా భావించుకునేవాణ్ణి. ఆయన నాకొక ఆరాధ్య దేవతా పురుషునివలె కనిపించేవారు. నాతోటి విద్యార్థులు , మా యిరువురి సన్నిహితత్వాన్ని జాన్సన్ -బాస్వెల్ ల సన్నిహితత్వంతో సరిపోల్చుతూ వుండేవారు.

రూపంలో జాన్సన్ వలె అప్పారావు గారు విలక్షణంగా కనిపించే వారన్నమాట నిజమే కాని, ఇద్దరికీ పోలిక లేదు. జాన్సన్ ఎంత లావుగా వుండేవాడో ఈయన అంత సన్నంగా వుండేవారు.
...


1936  ఫిబ్రవరి 27వ తేదీన ‘ది హిందూ’ దినపత్రికలో ఆయన్ని గురించి నేను వ్రాసిన ఈ దిగువ వాక్యాలలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ‘‘అతి బక్కపల్చటి మనిషి. తరుచు రెండు మూడు చొక్కాలు, ఒకటి రెండు కోటులు తొడుక్కునేవారు. ’’

తనకు ముప్ఫయి అంగుళాల చుట్టుకొలత గల  బెల్టు కావలసివుందని ఆయన తన డైరీలలో వొక చోట వ్రాసుకున్న పంక్తులను గమనిస్తే  అప్పారావు గారెంత సన్నని మనిషో పాఠకులు యిట్టే ఊహించుకోగలుగుతారు. పంతులు గారు సదా హాస్యప్రసన్నులుగా వుంటూ వుండేవారు’


(1958లో విశాలాంధ్ర ప్రచురణ ‘మాటా మంతీ  అవీ: ఇవీ’కి రాసిన పీఠిక నుంచి) 

శ్రీపాద  చూసిన వేళ..

గురజాడ అప్పారావు గారిని ప్రత్యక్షంగా ఒకసారి  ఆంధ్రసాహిత్య పరిషత్తు సభలో.  చూశారట కథక చక్రవర్తి  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.  కాకినాడలో  1914లో- గురజాడ అస్తమయానికి ముందు ఏడాది.

డిసెంబరు 1946లో  ఆయన రాసిన  ‘మార్గదర్శి గురజాడ అప్పారావు గారు’ అనే వ్యాసం లో ఆ సందర్భాన్ని ఇలా వర్ణించారు- 

‘‘... ఈ మిత్రులిద్దరూ (ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావులు) ఆ మహాకవిని ప్రత్యక్షంగా చూసి ఎరగరు.

నాకు మాత్రం ఆ మహా భాగ్యం పట్టింది.

ఒక్క మాటే పట్టింది.
...


తెల్లటి పంచే, నల్లని పొడుగు కోటు,  ఆ కోటు మీద పరిణత వయస్కతకు సూచకంగా తిలతండుల న్యాయంగా వుండిన గుప్పెడేసి మీసాలు, పట్టి పల్లారుస్తున్న దీర్ఘవ్యాధికి గుర్తుగా. కానీ దూసుకుపోయే చురుకైన చూపులు.

ఇదీ , ఆ ఒక్కమాటే నేను చూసిన ఆ మహాకవి మూర్తిమంతం. 


అప్పటి సమావేశం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి ఆకృతే విలక్షణంగా ఉండింది. అందుకు తగ్గట్టు ఇప్పటి ఆంధ్రసాహిత్యం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి రచనలే విలక్షణంగా వున్నాయి.’’

అదే వ్యాసంలో  ‘ముత్యాల సరములు ’లో అన్వయించగల ఓ విశేషం గురించి ఇలా రాశారు శ్రీపాద. 


‘‘తూర్పు బలబల తెల్లవారెనుః
తోకచుక్కయు వేగుచుక్కయు
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
వెడలి మెరసిరి మిన్ను వీధిని’’

అన్నారు వారు.

తోకచుక్క విచ్ఛిత్తికి సూచకం. వేగుచుక్క మహోదయానికి సూచకం. నిజమే కాని ఈ తోక చుక్క ఏమిటి? ఇది చేసిన వినాశం ఏమిటి? ఈ వేగుచుక్క ఏమిటి? దీని తరువాత జరిగిన మహోదయం ఏమిటి? అంటే  వశ్యవాక్కులు శ్రీ భమిడిపాటి కామేశ్వర్రావు..  గిడుగు రామ్మూర్తి పంతులు గారే  తోకచుక్క యని,  గురజాడ అప్పారావు గారే వేగుచుక్క అనీ వ్యాఖ్యానం చేశారు..

రామమూర్తి గారు చేసింది  కృతక భాషా విధ్వంసనమేగా?  అప్పారావు గారు చేసింది కవికుమార కళ్ళకు వెలుగు కలిగించడమేగా?’’
 

* * * 

కొత్తపాతల మేలుకలయిక   క్రొమ్మెరుంగులు జిమ్మగా

‘గుత్తునా ముత్యాల సరములు’ అంటూ మొదలయ్యే ఈ పద్యాలు మొత్తం 29.

1929 నాటి ప్రచురణలో ఈ పద్యాలను ఇక్కడ చదువుకోవచ్చు.




ఇంటర్మీడియట్ తెలుగులో...
ఈ ముత్యాల సరములు - ఆంధ్రప్రదేశ్ లోని  ఇంటర్ మొదటి సంవత్సరం  తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యభాగంలో ఓ పాఠంగా  ఉన్నాయి.

పాఠ్యాంశంగా పెట్టటం అభినందనీయమే. అయితే  ఈ పద్యాలను  అక్షర దోషాలేమీ లేకుండా ప్రచురించే శ్రద్ధ తీసుకోవాలి కదా?

కానీ అది జరగలేదు. 

*  గురజాడ ‘ముత్యాల సరములు’ అని ప్రయోగిస్తే దాన్ని ‘ముత్యాలసరాలు’ గా మార్చారు. కానీ ఇది పెద్ద విషయమేమీ కాదు.

*   రెండో పద్యం -
 ‘మెచ్చనంటా వీవు; నీవిక
మెచ్చకుంటే మించిపాయెను;
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా’


పాఠ్యపుస్తకంలో ‘మెచ్చనంటా నీవు’  అని  తప్పుగా  ప్రచురించారు. ఈ సంధిని ఎలా విభజించి అర్థం, అన్వయం ఎలా చెపుతారో పాపం, పాఠం బోధించే తెలుగు అధ్యాపకులు! 

*  27వ పద్యం  ఇలా ఉంటుంది -

‘కలిసి మెసగిన యంత మాత్రనె
కలుగుబోదీ యైకమత్యము;
మాల మాదిగ కన్నెనెవతెనొ
మరులు కొనరాదో?’


‘మాల మాదిగ’ అన్న మాటలు  పాఠ్యపుస్తక రూపకర్తలకు అభ్యంతరకరంగా తోచివుంటాయి. దీంతో ఆ పదాన్ని ‘యేదొవొక కన్నెనెవతెనొ’ అని మార్చేసి, ప్రచురించారు.

 
ఆ మాటలు విశాల దృక్పథం అలవర్చుకోని ఓ పాత్ర మాటలు.
కవి నేరుగా పలికినవి  కావు.   

అయినప్పటికీ విద్యార్థులు చదివే పాఠంలో కులాల ప్రసక్తి ఎందుకూ అనుకునివుంటారు.
సరే!  అలాంటప్పుడు మొత్తం పద్యాన్నే తొలగించివుండాల్సింది.

అంతే కానీ-
కవి రాసిన పద్యంలో పదాలను ‘మాత్రా ఛందోబద్ధంగా’ మార్చివేయటం అనుచితం కాదా?

ఇప్పడీ మార్పు చేసిన పద్యాన్ని అధికారిక- ఆధునిక ప్రక్షిప్తం అనాల్సివుంటుందేమో!  

‘‘మంచి చెడ్డలు మనుజులందున,
యెంచి చూడగ,  రెండె కులములు
మంచి యన్నది, మాలయైతే,
మాలనే, అగుదున్!’’  


...  అని ఎలుగెత్తి చాటిన గురజాడ రాసిన పద్యాన్ని...స్వల్పంగానైనా ‘సవరించి’  ప్రచురించటం ఆయనకు గౌరవం  ఇచ్చినట్లవుతుందా? 

కుల మత ఛాందసత్వాలను నిరసిస్తూ గురజాడ రాసిన కింది  పద్యాలు చూడండి-

 ‘‘యెల్ల లోకము వొక్క యిల్లై,
వర్ణ భేదము లెల్ల కల్లై,
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ’’

 

‘‘మతములన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్’’


ఇవి  వెలకట్టలేని ‘ముత్యాల సరములే’ కదా!

22, ఆగస్టు 2016, సోమవారం

విన్నారా ఈ చిన్నారి గానం?

నిమిషంనర నిడివి కూడా లేని ఆ పాట...  నాకు అమితంగా నచ్చింది.

నిండా పదేళ్ళు కూడా  లేని ఓ బాలిక...  తన గాన మహిమతో నన్ను సమ్మోహితుణ్ణి  చేస్తోంది!

*  *  * 
సంగీతమంటే  నాకు ఎక్కువ తెలిసినవి సినిమా పాటలే ! 

రేడియోలో  లలిత సంగీతమూ,  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళిల పాటలూ వినలేదని కాదు.

అయినా అవి పరిమిత స్థాయిలోనే!

అప్పుడప్పుడూ  ‘అనుపల్లవి’ బ్లాగులో  ‘తెలుగు అభిమాని’ రాసే  పోస్టుల ద్వారా శాస్త్రీయ సంగీత గుళికలు కాసింత రుచి చూస్తుండటం ... అంతే!

ఈ ఆగస్టు మొదట్లో  రచయిత్రీ,  కళాభిమానీ  శ్రీదేవి మురళీధర్  గారు నాకు కొన్నిపాటల  యూ ట్యూబ్  లింకులు పంపారు.

ఆ విధంగా  సూర్య గాయత్రి  అనే కేరళ చిన్నారి  పాటలు నాకు పరిచయమయ్యాయి.

అవన్నీ‘భక్తి’ పాటలే! 

ఈ  పదేళ్ళ పాప ... గానం చేసేటపుడు చూపే  తాదాత్మ్యత  మొదట నన్ను ఆకట్టుకుంది. 
 


ఆ గొంతులోని  శ్రావ్యత,  మాధుర్యం సరే సరి!

*  *  *

చిన్న వయసులో  పిల్లల వోకల్ కార్డ్స్ పూర్తిగా వికసించవు కాబట్టి  రాగ ప్రస్తారానికీ, పాటకు పూర్తి న్యాయం చేయటానికీ వారికి సహజంగానే  పరిమితులుంటాయి.

కానీ ఈ సూర్య గాయత్రి మాత్రం నిజంగా సు గాత్రి! 

ఆమె గళంలో  ఏ కోశానా  ఆ  పరిమితులు కనిపించటం లేదు.

పరిణత గాయనిలా - తడబడకుండా-  స్వచ్ఛమైన ఉచ్చారణతో  వినసొంపుగా  పాడుతుంది.

కుడి అర చేతి వేళ్ళను కలిపి  కొంచెం ముందుకు వంచి,  పాము పడగలాగా చేసి  
అలవోకగా,
స్వేచ్ఛగా,
హాయిగా ....
ఆస్వాదిస్తూ 
గానం చేస్తుంది. 

*  *  *

సూర్య గాయత్రి  తండ్రి  పీవీ అనిల్ కుమార్ మృదంగ  కళాకారుడు.  తల్లి  దివ్య .. కవయిత్రి.

వీరు ఐదేళ్ళ  వయసు నుంచీ పాపను కర్ణాటక సంగీతం నేర్చుకునేలా చేశారు. ఇప్పటికీ వారానికి నాలుగు రోజులు సంగీతం నేర్చుకుంటుందట.

ఆమెలోని గాన ప్రతిభను డిస్కవరీ చేసి,  ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసినది-  ఆమె గురువుల్లో ఒకరైన కర్ణాటక సంగీత కళాకారుడు కులదీప్ ఎం.పాయ్. ఈయనది తమిళనాడు

కిందటి సంవత్సరం  మే- జూన్ లలో  సూర్య గాయత్రి పాడిన   ‘గణేశ పంచరత్నమ్ ’ వీడియో  ఫేస్ బుక్,  యూ ట్యూబ్ లో  పెట్టారు.

అది నాంది! 

అప్పట్నుంచీ ఆమె,  కులదీప్ లు  పాడిన పాటలు యూట్యూబ్ లో,  ఫేస్ బుక్ లో  విడుదలవుతున్న కొద్దీ  ఆమె గానంలోని ప్రత్యేకత ఎంతోమంది  శ్రోతలకు అంతకంతకూ  తెలుస్తూ వచ్చింది.      

సూర్య గాయత్రి పాటల ద్వారా  డబ్బు సంపాదించే  ఉద్దేశం  లేదనీ, అందుకే  వాణిజ్య పరంగా  ఆల్బమ్ లుగా,  సీడీలుగా చేసి  విక్రయించటం లేదనీ ఆమె గురువు  కుల దీప్ పాయ్  చెపుతున్నారు.

సంగీత కళ నేర్చుకునేలా పిల్లలకు ప్రేరణ కలిగించటం కోసం  యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్ లో  పెట్టి అందరూ  వినేలా చేస్తున్నారు.

ఇది చాలా మంచి విషయం!

*  *  *

మొదట ‘గణేశ పంచరత్నమ్ ’ విన్నాను.  సూర్య గాయత్రీ,  ఆమె గురువుల్లో  ఒకరైన  కుల్ దీప్ కలిసి  హుషారుగా పాడుతుంటే  తమాషాగా,   ఉత్సాహంగా అనిపించింది.

‘నాగేంద్ర హారాయ’ పాటను  ఈ  చిన్నారి అంకితభావంతో  సంలీనమైనట్టు పాడటం ఆకట్టుకుంది.

ఈమె  పాడినవన్నీ బాగున్నాయి.

వాటిలో  ప్రత్యేకంగా  నాకు బాగా నచ్చి,  రోజూ విన్నా తనివి తీరనట్టున్నపాటలు మాత్రం రెండు-

మొదటి పాట...  

‘‘శ్రీరామ చంద్ర కృపాలు భజ మన  హరణ భవ భయ దారుణం
నవ కంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం ...’’


శ్రీరాముడి ఘనతను వర్ణించే పాటన్నమాట.

రాసినవారు  పదహారో శతాబ్దికి చెందిన  సంత్ తులసీదాస్. 

ఇక్కడ  వీడియో  చూస్తూ  వినండి-   



ఈ పాట విన్నాక.... యూ ట్యూబ్ లో  లతా మంగేష్కర్ పాడిన ఇదే పాట కూడా విన్నాను.

అయినా సూర్య గాయత్రి  పాటపై ఇష్టం తగ్గలేదు.

ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభావం ఏమైనా ఉండొచ్చు గానీ... చిన్నారి గాయని  ప్రతిభకు ఇది తార్కాణంగా భావిస్తున్నాను.

క నాకు అమితంగా నచ్చిన రెండో పాట (పోస్టులో నేను మొదట ప్రస్తావించింది దీన్ని గురించే) ... చాలా చిన్న బిట్!  

అక్కడున్న  లిరిక్ కూడా ఒకే ఒక వాక్యం!   ( ఒరిజినల్ పాట పెద్దదే గానీ,  ఇక్కడ ఈ పాప పాడింది మాత్రం ఈ  ఒక లైనే..)

‘‘జయ్  రఘునందన జయ్ సియారామ్   మన్ సే...  జప్ లే తూ  సీ తారామ్’’

దీన్ని సూర్య గాయత్రి ఐదు సార్లు  ప్రతిసారీ ఒక్కో రకంగా గానం చేస్తుంది. 

ఆ స్వరకల్పనలోని  సొగసును అద్భుత  గమకాలతో/ సంగతులతో  ఆమె ఎలా ఆవిష్కరించిందో విని ఆస్వాదిస్తేనే బాగుంటుంది.

పక్కన వాద్యసహకారం అందిస్తున్నవారే  కులదీప్ పాయ్. 



పాడటంలో  ఎంత ఈజ్
ఎంత సాధికారత
పాటలో  ఎంత  తీయదనమో గమనించారా?

ఇక  ఈ పాట నన్ను తన మాధుర్యంతో వెంటాడటం (హాంటింగ్ )  మొదలుపెట్టింది.

దీంతో   దీన్ని ఎవరు రాశారు? ఇంత శ్రావ్యంగా  సంగీతం కూర్చినదెవరు? అనే సందేహాలు మొదలయ్యాయి!
 
ఘరానా (1961) అనే హిందీ సినిమాలో  ఇదే పల్లవితో  ఆశా భోస్లే,  రఫీలు పాడిన ఓ  పాట ఉంది కానీ, అది పూర్తిగా వేరు.

ఒక ఆధారం ఉన్నపుడు వెదకటం  కష్టమేమీ కాదు  కదా?

పూర్తి  పాట దొరికింది, యూ ట్యూబ్ లో.

ఈ పాటను గాయని  దేవకీ పండిట్ ఎంతో బాగా పాడారు.  వేణువు, సితారల సమ్మేళనం హాయి గొలుపుతుంది !

సంగీత దర్శకుడి పేరు హేమంత్ మత్తాని   అని  తెలిసింది.  రచన కూడా  బహుశా ఈయనే.

ఈ పాట విన్నాక  కూడా సూర్య గాయత్రి పాట వినసొంపుగానే అనిపిస్తుండటం  విశేషమే కదా?

స్వరకల్పనలో  జోడించిన  చమక్కులు కూడా దీనికి  కారణం!

*  *  *
సూర్య  గాయత్రి  ఆధ్యాత్మిక గాయనిగా  పేరు తెచ్చుకుంటోంది.  ఇతర రాష్ట్రాల్లో కూడా  కచేరీలు ఇస్తోంది.  హైదరాబాద్, తెనాలి లాంటి చోట్లకు కూడా ఆమెను ఆహ్వానించి పాడిస్తున్నారు.


సెలబ్రిటీ హోదా :  ఇలాంటి  పెద్ద  హోర్డింగులూ  పెడుతున్నారు
ఆమెను  ఎమ్మెస్  సుబ్బులక్ష్మి వారసురాలిగా కీర్తించటం,
‘గాన సరస్వతి’ లాంటి బిరుదులివ్వటం,
సన్మానాలు చేయటం...
ఇవన్నీ అప్పుడప్పుడైనా జరుగుతున్నాయి. 

ఇంకా ఎంతో  నేర్చుకోవలసిన దశలో ఇలాంటి పొగడ్తలూ,  ప్రోత్సాహాలూ  అవసరం లేదు.

పైగా ఇవన్నీ  ఆమె ప్రగతికి ఎంతో కొంత అవరోధాలయ్యే అవకాశముంది.   

అందుకే  వీటిని పరిమితం చేయగలిగితే  ఆ బాల గాయని భవిష్యత్తుకే మేలు!

‘‘సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా ’’ అన్నాడు  త్యాగయ్య.

నిజానికి  సంగీత జ్ఞానం సంపాదించాలంటే  భక్తి (పాటల సాధన)  వినా మార్గం లేదు! 

త్యాగరాజు కీర్తనలైనా,  అన్నమయ్య రచనలైనా, రామదాసు భజనలైనా దేవుడి ఘనతను  కీర్తించేవే కదా!

దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన  పాటలు వింటూ  తన్మయత్వం చెందుతున్నారంటే...

అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి  భావన మూలంగా కాదు,

రస భరితమై అంతరంగాన్ని తాకే  సంగీత కళ వల్లనే! 

31, జులై 2016, ఆదివారం

‘స్వ’రూపాలు దిద్దుకునే అక్షరాలు!



జంతువు పేరునో, పక్షి  పేరునో అక్షరాల్లో రాస్తే  ఆ భాష చదవటం వచ్చినవాళ్ళకే  అది ఫలానాఅని అర్థమవుతుంది. 

 మరి ఆ లిపి రానివాళ్ళకూ, నిరక్షరాస్యులకూ అవి అర్థం కావు కదా?

మరి వాటిని  అర్థం చేయాలంటే?  

టైపోగ్రఫీ డిజైన్ ద్వారా దాన్ని చాలావరకూ సాధించవచ్చు. 

ఆస్ట్రేలియన్  చిత్రకారుడు డాన్ ఫ్లెమింగ్ ఈ విషయంలో చాలా పేరుపొందాడు.  
 
జంతువుల, పక్షుల ఆకారాలు వాటి ఇంగ్లిష్ స్పెలింగ్ ల్లోనే ఒదిగిపోయేలా
ప్రతిభావంతంగా చిత్రించాడీ గ్రాఫిక్ ఆర్టిస్ట్. 

లిపి చదవటం వచ్చినవాళ్ళను కూడా ముగ్ధులను చేసేలా ఈ చిత్రకారుడు జంతు-పక్షి  ప్రపంచాన్ని అక్షరాలతో గొప్పగా నిర్మించాడు. 
 
అతడు  చిత్రించిన ఒక్కో  బొమ్మనూ  పరిశీలించి చూడండి- 

BUNNY  (కుందేలుకు వాడుక పదం)
CAMEL
CHICKEN

CROCODILE

ELEPHANT

FLAMINGO

GIRAFFE
KANGAROO

KITTEN  (పిల్లి పిల్ల)

MONKEY

OWL

PARROT

PENGUIN

PIG

RHINO  (ఖడ్గ మృగం)

SNAIL

WHALE

DINOSAUR

వీటిలో నాకు బాగా నచ్చినవి- Owl,  Parrot, Pig, Snail, Whale.

ఈ తరహాలో ఇతర ఆర్టిస్టులు కూడా వేసినా  డాన్ వేసినంత సహజంగా అవి కనపడవు.

ఇతర  ఆర్టిస్టులు వేసిన కొన్ని టైపోగ్రఫీ ప్రాణులను చూడండి.
CHAMELEON  (ఊసరవెల్లి)
BISON  (దున్న)

MOSQUITO

SHARK

DINOSAUR

ANT
  * * *
క్షర స్వరూపం చూడగానే అదేమిటో సూచించగలిగేలా, సహజంగా  చెక్కటం అన్నివేళలా సాధ్యం కాదు.

అందుకే అది సృజనాత్మకమైన కళ.

ఇక్కడ చూడండి-
High
Low
అనే అక్షరాలు వాటి అర్థాన్ని వాటికవే  తెలిపేలా,  చూసేవాళ్ళకు తేలిగ్గా తెలిసేలా... ఆర్టిస్టు ఎంత గొప్పగా చిత్రించాడో!  


ఇవే అక్షరాలను మరో రకంగా చిత్రించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.

మరో రెండు ఇలాంటి అక్షరాల బొమ్మలు -


ZIP లోని  ‘I అక్షరాన్ని జిప్  ఆకారంగా వేయటం బాగుంది కదూ..
 

ఇక... ఈ బొమ్మలో-

coffee అనే అక్షరాలు  పొగలు కక్కటంలో కనపడ్డాయా? అది మాత్రమే కాదు... మరో విశేషం ఉంది.  

CUP అనే అక్షరాలు కప్పు ఆకారంలో  కనపడుతున్నాయా?

  * * * 
తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు చేశారు మన చిత్రకారులు.  పత్రికల్లో, సినిమా టైటిల్స్ లో... !

1969 నుంచీ ప్రచురితమవుతున్న మాసపత్రిక  అన్నదాత

దీని పేరు చూడండి-  వరి గడ్డి పరక అక్షరాలుగా మారింది. న ఒత్తు వరి కంకి అయింది.

1975 నాటి సినిమా  పాడిపంటలు . మోదుకూరి జాన్సన్ రాసిన..  నాగలితో నమస్కరించి, పారలతో  ప్రణమిల్లి అంటూ సాగే  మన జన్మభూమి.. బంగారు భూమిపాట దీనిలోదే. 

ఈ సినిమా లోగో్ లో పాడిలో ఆవునూ, పంటలోని ప తలకట్టును వరికంకిగా  చిత్రించటం గమనించవచ్చు.

అంతకు ముందు ఏడాది 1974లో  కోడెనాగువచ్చింది.  గొలుసుకట్టు ఏటవాలు అక్షరాల్లో నాగుపాము తలా తోకా -దాని పొడుగాటి తాడులాంటి శరీరం స్ఫురించేలా  చిత్రించాడు ఆర్టిస్టు.   


ఈ లోగోను చూశాక, దాని గురించి ఆలోచించకుండా,  దాని ప్రత్యేకత గురించి  పట్టించుకోకుండా ఉండటం కష్టం!

ఇంతకంటే ప్రత్యేకంగా,  విశిష్టంగా ఉన్నసినిమా లోగో  బొట్టు కాటుక (1979).  


ఈ అక్షరాలంకరణలోని సృజనాత్మకత, దీని ఘనత గురించి  ఇంతకు ముందు  ఏకంగా రెండు పోస్టులే రాశాను.   

ఆసక్తి ఉన్నవారి కోసం  ఒక పోస్టు లింకు... 

జ్యోతి సినిమా లోగో  నిజానికి  అదే పేరుతో వెలువడిన మాసపత్రిక లోగోనే.  

 దీన్ని రూపుదిద్దిన చిత్రకారుడు ఆ పత్రిక సంపాదకవర్గంలో ఉన్న బాపు.
ఆ మాసపత్రిక లోగో...  తొలి రూపాలు అనదగ్గ టైటిల్స్ ఎలా ఉండేవంటే.... 


అర్థ గర్భితమైన  సినిమా లోగోలు 
 ఈ కింద తెలుగు  సినిమాల పేర్ల  లోగోలు చూడండి. వీటి ప్రత్యేకతలేమిటో ఇట్టే తెలిసేలాగానే ఉంటాయివి. 
 






బాగున్నాయి కదూ !

చివరిగా-  ఈ మధ్య విడుదలైన సినిమా కబాలిగురించి!

ఇంగ్లిష్ అక్షరాలు KABALI అనే అక్షరాలతో  ఆ సినిమాలోని హీరో రజనీకాంత్ గెటప్  వచ్చేలా భలే  చిత్రించాడు ఆర్టిస్టు.  

ఈ పోస్టు  మొదట్లో పెట్టిన బొమ్మ అదే!

 అసలు  ఈ బొమ్మను  చూశాకనే  ఇలాంటి పోస్టు రాయాలనే ఉద్దేశం ఏర్పడింది!  

దీంతో అప్పుడెప్పుడో చూసి ఆనందించి వదిలేసిన డాన్ ఫ్లెమింగ్  గీసిన ఇంగ్లిష్ అక్షరాల జంతువుల టైపోగ్రఫీకీ... 

నిలో పనిగా నా అభిమానాంశమైన -  తెలుగు అక్షరాలంకరణలకూ ..
వీటన్నిటికీ ఇలా హలో చెప్పానన్నమాట!